వైఎస్సాసుర రక్తచరిత్ర.. ఫ్యాక్షన్ మీ బ్లడ్ గ్రూప్..
posted on Aug 13, 2021 @ 4:59PM
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ఇంకా తేలలేదు. సీబీఐ అదే పని మీద ఉంది. విచారణ జరుగుతున్న క్రమం చూస్తుంటే.. అంతా అనుమానించినట్టుగానే వివేక సన్నిహితులే హత్యకు తెగించారనే విషయంపై కాస్త క్లారిటీ వచ్చేస్తోంది. హత్య వెనుక ఉన్న అసలు పెద్దలు తప్పించుకున్నా.. పాత్రదారులు మాత్రం దొరికిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మర్డర్ అని సుస్పష్టంగా కనిపించినా.. గుండెపోటంటూ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు చెప్పడంతో అప్పట్లో అంతా ముక్కున వేలేసుకున్నారు. మరింత బరితెగించి వివేక హత్యకు చంద్రబాబే కారణమంటూ ప్రచారం కూడా చేసేశారు. ఎంత విడ్డూరం.. ఎక్కడో కడప జిల్లా పులివెందులలోని వైఎస్ వివేకా ఇంట్లోకి చొరబడి చంపేంత సాహసం వేరే వారికి ఉంటుందా? ఇదంతా ఇంటిదొంగల పనేనని అందరికీ తెలిసిందేనని ఆనాడే టీడీపీ విమర్శించింది. ఆ ఇంటిదొంగలే ఇప్పుడు సీబీఐ విచారణకు క్యూ కడుతుండటంతో నిజాలు నిలకడ మీద తెలుస్తున్నాయని అంటున్నారు.
వైఎస్ వివేక హత్య, సీబీఐ విచారణ మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. కోట్ల కోసం సొంత బాబాయ్ పైనే గొడ్డలి వేటు వేయించి.. ఆ నెత్తురుని చంద్రబాబు గారికి అంటించాలని చూశారని లోకేశ్ మండిపడ్డారు.
నారాసుర రక్తచరిత్ర అంటూ విష పుత్రిక సాక్షిలో అదే గొడ్డలి చంద్రబాబు గారి చేతికి గ్రాఫిక్స్‌లో పెట్టి మరీ అచ్చేయించారన్నారు. వారి తరతరాల వైఎస్సాసుర రక్తచరిత్ర అంతా నేరాలమయమని మరోసారి సీబీఐ దర్యాప్తుతో తేటతెల్లమైందని మండిపడ్డారు. ఫ్యాక్షన్ మీ బ్లడ్ గ్రూప్ అని.. అరాచకాలకు వైఎస్ ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్ అంటూ ఓ రేంజ్‌లో ఘాటుగా ట్వీట్లు చేశారు నారా లోకేశ్.
సొంతింటి వేటకొడవలే వివేకాని వేటాడిందని స్పష్టం అవుతోంది. డబ్బు, ఆధిపత్యం, గనులు, అక్రమాల కోసం సొంత బాబాయ్‌నే చంపుకున్న వైఎస్సాసుర కుటుంబ రక్తచరిత్రని నీ దొంగ పేపర్ సాక్షిలో ఎలా అచ్చేస్తావో చూస్తాను జగన్‌రెడ్డీ! అంటూ సవాల్ విసిరారు లోకేశ్.