రేవంత్-సంజయ్.. కేసీఆర్‌తో సంగ్రామంలో గెలిచేదెవరు?
posted on Aug 13, 2021 @ 8:55PM
తెలంగాణలో కేసీఆరే అందరికీ రాజకీయ విలన్. మరి, హీరో ఎవరు? విలన్‌తో పోరాడి గెలిచేదెవరు? ఈ మల్టీస్టారర్ పొలిటికల్ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? హీరోలు, విలన్ ఉన్న ఈ నాటకంలో ఎవరి పాత్ర ఏంటి? చాలా ఆసక్తిగా సాగుతోంది తెలంగాణ సంగ్రామం. కేసీఆర్, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఇలా అందరూ కీలక పాత్రదారులే. పోరుకు అనేక మంది ఉన్నా.. పోరాడి నిలిచేదెవరనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.
పీసీసీ చీఫ్ పదవితో రేవంత్‌రెడ్డి రెచ్చిపోతున్నారు. ధర్నాలతో దడదడలాడిస్తున్నారు. దళిత-గిరిజన దండోరాతో కేసీఆర్ దళిత బంధు ఎత్తుగడకు విరుగుడు మంత్రం పారిస్తున్నారు. వరుసబెట్టి భారీ బహిరంగ సభలతో బలప్రదర్శనకు దిగుతున్నారు రేవంత్‌రెడ్డి. చేష్టలుడిగి, స్తబ్దుగా మారిన కాంగ్రెస్‌లో పునరుత్తేజం నింపుతున్నారు. రెండు నెలలుగా తెలంగాణలో రేవంత్‌రెడ్డి పేరు డైనమైట్లా పేలుతోంది.
రేవంత్ దూకుడుతో వేటాడే పులిలా కాస్త వెనక్కితగ్గిన బీజేపీ.. ఇప్పుడు పంజా విసిరి దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ రథసారధి బండి టాప్ గేర్‌లో దూసుకొస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణను చుట్టేయనున్నారు. బీజేపీ బండికి ఫస్ట్ టార్గెట్ హుజురాబాద్.. మెయిన్ టార్గెట్ ప్రగతి భవన్.
ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. ఇన్నాళ్లూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేననే ధీమాగా ఉన్న కమలనాథులకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూపంలో గట్టి సవాల్ ఎదురైంది. స్మూత్‌గా సాగుతుందనుకున్న బండికి.. గట్టి హార్డిల్ అడ్డు వచ్చింది. అందుకే, కాషాయదళం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించుకొని.. తెలంగాణలో కేసీఆర్‌ను దెబ్బ కొట్టగల మొనగాళ్లం తామేననే మెసేజ్ పంపేలా పావులు కదుపుతోంది. అందుకే, హుజురాబాద్ ఎన్నికల నాటికి బీజేపీ హవా బలంగా వీచేలా.. పాదయాత్రగా బయలిదేరి వస్తున్నారు కమల దళపతి. బ్రేకులు లేని బీజేపీ బండి.. ప్రజా సంగ్రామ యాత్రగా ప్రజల ముందుకు వస్తోంది.
ఇటు రేవంత్‌రెడ్డి దూకుడు.. అటు బండి జోరు.. ఇద్దరు పోటుగాళ్ల సంగ్రామం.. కేసీఆర్‌ను దెబ్బ కొడుతుందా? లేక, ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోయి దొరకే కలిసొస్తుందా? ఏమో...