భవిష్యత్ కార్యాచరణపై పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్ష

  తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047' సన్నాహాలపై రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌  బి. శివధర్‌ రెడ్డి  అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు కీలక వ్యూహాత్మక దిశానిర్దేశం చేశారు.  'గ్లోబల్ సమ్మిట్ 2047' కార్యక్రమాన్ని కేవలం నిర్దేశిత సమయంలోనే కాకుండా, అత్యంత చురుకైన ప్రణాళికతో అమలు చేయాలని, వాస్తవంగా నిర్దేశించిన సమయం కంటే దశాబ్దం ముందుగానే అనేక లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందని డిజిపి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్‌ను ప్రవేశపెట్టడంపై ఒక ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అలాగే, పంచాయతీ ఎన్నికల అనంతరం సీనియర్‌, యువ అధికారుల బృందం సెక్యూరిటీ ఆపరేటింగ్‌ సెంటర్‌ (ఎస్‌ఓసీ)ను సందర్శించడానికి సంబంధించిన షెడ్యూల్‌ను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు.  అదనపు డిజిపి (సాంకేతిక సేవలు) సహకారంతో ప్రత్యేక సాంకేతిక అభివృద్ధి విభాగాన్ని (టెక్నాలజీ డెవలప్‌మెంట్ యూనిట్) ఏర్పాటు చేయాలని, ఇన్నోవేషన్‌ ఇంక్యుబేటర్ల కోసం టీ-హబ్‌లో ఓ హ్యాకథాన్‌ను కూడా నిర్వహించాలని డిజిపి అభిప్రాయపడ్డారు.తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్నట్లు డిజిపి వెల్లడించారు. ఈ సదస్సుకు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు, ప్రణాళికా నిపుణులు హాజరుకానున్నారు.  అనంతరం, డిసెంబర్ 11 నుంచి 13 వరకు ప్రజల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీజీఎస్పీఎఫ్‌ డైరెక్టర్‌ స్వాతి లక్రా, ఏడీజీపీ (సీఐడీ)  చారు సిన్హా, ఐజీపీ (మల్టీ జోన్-I)  ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి,  ఐజీపీ (రైల్వేలు & రోడ్డు భద్రత)  కె. రమేష్‌ నాయుడుతో పాటు ఏడీజీపీలు, ఐజీపీలు, డీఐజీలు, ఎస్పీలు, డీసీపీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమ అభిప్రాయాలను డిజిపి తెలియజేశారు.  

కేరళ ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు

  కేరళ సీఎం పినరయి విజయన్‌కు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్  షోకాజ్ నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, కూడా ఈ నోటీసు లు అందాయి.. ఈడీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..  జారీ చేసిన ఈ నోటీసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిబంధనలను ఉల్లంఘిం చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్‌బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎమ్ అబ్రహాం కూడా ఈ నోటీసులు అందుకున్నారు.  ఈడీ గత మూడేళ్లుగా ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిం చి.. సెప్టెంబర్‌లో తన నివేదికను అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు సమర్పించింది. మసాలా బాండ్ల ద్వారా సేకరించిన నిధులను.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ భూమి కొను గోలుకు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.  కేరళ మౌలిక సదుపాయాల నిధి బోర్డు (కేఐఐఎఫ్‌బీ) 2019 ఏప్రిల్‌లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయడం ద్వారా మసాలా బాండ్ల రూపంలో రూ. 2,150 కోట్లు నిధులను సేకరించింది. ఈ బాండ్ల జారీపై ఈడీ 2021లో దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈడీ నోటీసు అందినట్లు మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా ధృవీకరించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. "ఇదంతా అనవసరం. మేము భూమి కొనుగోలు కోసం ఆ నిధులను ఎప్పుడూ ఉపయోగించలేదు. కేఐఐఎఫ్‌బీ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిబంధనల ప్రకారమే జరిగింది.  ఈ ఈడీ నోటీసు ఎన్నికల స్టంట్‌లో భాగమే" అని ఐజాక్ అన్నారు. కేఐఐ ఎఫ్‌బీ సీఈఓ అబ్రహాం ఈ నోటీసుపై స్పందించడానికి నిరాకరించగా.. ముఖ్యమంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి రవీంద్రన్ తనకు నోటీసు గురించి తెలియదని తెలిపారు.

నీలోఫర్ హాస్పిటల్‌లో బొద్దింకల బెడద...రోగుల తిప్పలు

  నేను రాను బిడ్డో సర్కారు దావఖానకి అనే పాట అందరికీ సుపరిచితం... పాత రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లడానికి జనాలు భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు నీలోఫర్ లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అక్కడి పరిస్థితి చూసి రోగుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ... వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు... హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలోని నిలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో రోగుల భద్రత, పరిశుభ్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి.  ముఖ్యంగా RICU వార్డులో బొద్దింకల సంఖ్య అధికంగా పెరిగిపోయిందని చిన్నారుల పేరెంట్స్ అసహనం వ్యక్తం చేస్తు న్నారు. తమ పిల్లల చికిత్స కోసం హాస్పిటల్‌కి వస్తే... హాస్పీటల్లో ఉన్న అత్యంత కీలకమైన వార్డులో బొద్దింకలు యథేచ్ఛగా సంచరిస్తు న్నాయని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. ఈ బొద్దింకల కారణంగా పిల్లల ఆరోగ్య ప్రమాదంలో పడేటట్టుగా ఉందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  హాస్పిటల్ పరిపాలనా విభాగం ఈ అంశాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటోందని తల్లిదండ్రులు వాపోయారు. పరిశుభ్రతా చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం, శానిటేషన్ సిబ్బంది పర్యవేక్షణలో లోపాలు కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నదని వారు విమర్శించారు.ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకొని, రోగులకు శుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణం కల్పించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

  పాతబస్తీ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం రూ.125 కోట్లుకు  పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ' పథకం కింద ఈ నిధులకు పర్మిషన్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓల్డ్ సిటీ మెట్రోను మరింత వేగం నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్‌లో 20 మంది ట్రాన్స్‌జెండర్లను భద్రతా సిబ్బందిగా నియమించింది.ప్రత్యేక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరంతా సోమవారం నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లు, రైళ్లలో తమ విధులను ప్రారంభించారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో వీరు ప్రముఖ పాత్ర వహించన్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.  

సీఎం చంద్రబాబుపై లిక్కర్ కేసు కొట్టివేత

  సీఎం చంద్రబాబుపై వైసీపీ హయాంలో పెట్టిన లిక్కర్ కేసును కోర్టు కొట్టివేసింది.  అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.   అధికార దుర్వినియోగం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చారంటూ  చంద్రబాబు, కొల్లు రవీంద్రపై అప్పటి బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు గతంలో కేసు నమోదు చేసిన విషయం విదితమే

పరకామణి కేసులో సూత్రధారి...పాత్రధారి భూమాననే : మంత్రి అనగాని

  తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న పరకామణి కేసులో సూత్రధారి, పాత్రధారి వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డినేనని తిరుపతి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పరకామణి కేసులో అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందుతులెవరో తెలిసిపోతుందని అన్నారు.  దేవుడి సోమ్మును దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీ చేయడం చరిత్రలో వినని, చూడని విషయమని అన్నారు. పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ఉండబట్టే ఆ కేసు విచారణపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. దేవుడి అంటే ఎటువంటి నమ్మకం లేని కరుణాకరెడ్డి పింక్ డైమండ్, గోశాలతోపాటు ఇతర అంశాలపై అబద్దాలు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పరకామణిలో చోరి చేసిన  దొంగ నుండి ఆస్తుల బదలాయింపు కరుణాకరెడ్డికే జరిగిందన్నారు.  కల్తీ నెయ్యి కేసులోనూ తప్పు జరిగినట్లు విచారణలో అందరూ అంగీకరించారని, కానీ తప్పు మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని అన్నారు. కానీ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు.  రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో స్థానిక డీఐజీది ఏమైనా తప్పుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.  

ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్పేట్

  దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.  ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు.  

పాలమూరును పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్‌

  నారాయణపేట జిల్లా మక్తల్‌లో ప్రజాపాలన విజయోత్సవాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు.‘‘ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుంది. రెండేళ్ల విజయోత్సవ సభను మక్తల్‌లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డను ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టార అని తెలిపారు.  మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అందించి నిండు మనసుతో ఆశీర్వదించారని.. మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మీ ముందు నిలబడ్డాలని రేవంత్ అన్నారు. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను  ఈ గడ్డ ఆదరించిందని కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ. 12 కోట్లు కూడా ఇవ్వలేదని సీఎం అన్నారు.  పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదు..  పదేళ్లలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచన చేయలేదని రేవంత్ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారని తెలిపారు. పాలమూరు అభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. జిల్లాలో ఐఐటీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.  2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఏకానమీగా తీర్చి దిద్దుతామని సీఎం అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి… కాళ్లల్లో కట్టెలు పెట్టే వాళ్ళను కాదు.. అభివృద్ధిని కోరుకునేవారిని ఎన్నుకోండని రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశానికి పాలమూరు జిల్లా ఆదర్శంగా ఉండాలనేదే మా ఆకాంక్ష అని అన్నారు.  మీరు చేతికి ఓటు వేసి గెలిపిస్తే అభయహస్తమై మీ జీవితాల్లో వెలుగులు నింపుతోందని రేవంత్ అన్నారు. 

పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాం : సీఎం చంద్రబాబు

  కూటమి ప్రభుత్వం 18 నెలల  పాలనలో పెన్షన్ల కోసమే రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ  ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని గోపీనాథపట్నంలో గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మికి పెన్షన్ అందించారు. అనంతరం ఉంగుటూరులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ప్రజా వేదిక సభలో సీఎం పాల్గొన్నారు.  ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని ఒక మార్పు రావాలని అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కంటే ధనిక రాష్ట్రాలు కూడా పెన్షన్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదని ముఖ్యమంత్రి అన్నారు.  రాబోయే ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల పెన్షన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రతి వంద మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ప్రజల ఆహారపు అలవాట్ల అనుగుణంగా రైతులు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలన్నారు. ఏపీ అభివృద్ధి జరిగితేనే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయింది కాబట్టే అక్కడి భూముల ధరలు పెరిగాయని వెల్లడించారు.  ఒకప్పుడు కోకాపేటలో రూ.10 వేలకు ఎకరం భూమి వచ్చేదని, ఇప్పుడు ఎకరం రూ.170 కోట్లకు పైనే పలుకుతోందని అన్నారు. ఏపీకి భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని చంద్రబాబు అన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తుమని.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుమని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు.  ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని సీఎం తెలిపారు. 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14 వేలు జమ చేశామని ఆయన అన్నారు. పంచసూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఇండియాలో మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు!?

స్పేస్‌ఎక్స్, టెస్లా కార్ల  అధినేత ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు.  తక్కువ ఖర్చుతో, నమ్మకమైన ఇంటర్నెట్ సేవలను  భారత గ్రామీణ ప్రాంతాలకు అందిస్తానంటున్నారు. తన స్టార్ లింక్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న టెలికాం సంస్థలకు ఎటువంటి పోటీ కాదని చెబుతున్నారు.  ప్రముఖ ఇన్వెస్టర్ నిఖిల్ కామత్‌తో 'పీపుల్ ఆఫ్ డబ్ల్యూటీఎఫ్' పాడ్‌కాస్ట్‌లో  మాట్లాడిన మస్క్ ప్రపంచ వ్యాప్తంగా  150 దేశాల్లో తన సేవలను అందిస్తోందనీ, ఇక ఇప్పుడు ఇండియాలో కూడా అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు.  భూమికి దగ్గరగా తిరిగే వేలాది ఉపగ్రహాల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని మస్క్ చెబుతున్నారు. భూమిపై ఫైబర్ కేబుల్స్ దెబ్బతిన్నా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగని టెక్నాలజీతో తమ సంస్థ సేవలందిస్తుందని మస్క్ చెప్పారు.   ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాలలో  కూడా  స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు అంత రాయం కలగదని మస్క్ వివరించారు.  ఇటీవల రెడ్ సీ కేబుల్స్ తెగిపోయినప్పుడు కూడా స్టార్‌ లింక్ సేవలు నిరంతరాయంగా కొనసాగాయని ఈ సందర్భంగా మస్క్ గుర్తుచేశారు.

ఏఐకి మాటల మాయ.. కంపెనీల డేటాకు ప్రాంప్ట్ గండం!

ఏఐ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలకు సరికొత్త ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్  సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ఇటీవలి కాలంలో  ఏఐ ఎవినియోగం చాలా ఎక్కువైంది. ప్రతి చిన్న  విషయానికి దానిని ఉపయోగిస్తున్నారు. అయితే.. ఏఐ విస్తృతి పెరిగాక.. చిన్న స్టార్టప్‌ల నుంచి బడా మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా ఇప్పుడు  ఏఐ చాట్‌బోట్ ల జపం చేస్తున్నాయి. కస్టమర్ల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పని వేగం పెంచడం, ఖర్చు తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉండటంతో సంస్థలు వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, ఈ సాంకేతికత వెనుక ఓ సరికొత్త ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు.  ఆ ముప్పు పేరే  ప్రాంప్ట్ ఇంజెక్షన్‌  అని  సజ్జనార్ తెలిపారు. అసలింతకీ ఈ ప్రాంప్ట్ ఇంజెక్షన్ ఏమిటి?.. అంటే.. ఏఐ పని చేయడానికి   ఇచ్చే ఆదేశాలను ప్రాంప్ట్ అంటారు. సైబర్ నేరగాళ్లు ఈ ప్రాంప్ట్ నే తమ ఆయుధంగా మలచుకుంటున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.  ఏఐ మోడల్‌ను తప్పుదోవ పట్టించేలా, ట్రిక్ చేసేలా మిలీషియస్ ప్రాంప్ట్స్ ఇస్తున్నారని తెలిపారు.  క్లుప్తంగా చెప్పాలంటే..  ఏఐని మాటలతో మాయ చేస్తున్నారు. ఇలా ఏఐని కన్ఫ్యూజ్ చేసి, సాధారణంగా బయటపెట్టకూడని సంస్థల అంతర్గత పత్రాలు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబట్టడమే ఈ  'ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్ అని వివరించారు. ఇది డేటా భద్రతకు పెనుముప్పు అని హెచ్చరించారు.  ప్రస్తుతం చాలా సంస్థలు తమ ఏఐ మోడల్స్, చాట్‌బోట్‌లను సంస్థలోని కీలకమైన డేటా సిస్టమ్‌లకు  అనుసంధానిస్తున్నాయి. ఎండ్ యూజర్‌కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు. కానీ, హ్యాకర్లు వేసే ఒకే ఒక్క 'ట్రిక్కీ ప్రాంప్ట్' వల్ల ఈ గోప్య సమాచారమంతా బయటపడే ప్రమాదం ఉంది.  ఈ ముప్పును పసిగట్టి, నివారించడానికి సంస్థలు తక్షణమే 'ప్రాంప్ట్ గార్డ్‌రెయిల్స్' (రక్షణ కవచాలు) ఏర్పాటు చేసుకో వాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక అంచె భద్రత సరిపోదు, మల్టీ-లేయర్ డిఫెన్స్ విధానాన్ని పాటించాలని సజ్జనార్ సూచించారు.  ఏఐకి సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం, కఠినమైన నిబంధనలు  విధించడం ద్వారా అనవసర సమాచారాన్ని ఇవ్వకుండా నియంత్రించాలి. అలాగే.. హానికరమైన  ప్రాంప్ట్‌లను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా,  ఏఐకి యాక్సెస్ ఇచ్చే డేటా, ఏపీఐ లపై కఠిన నియంత్రణలు ఉండాలి. ఇక   ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్స్ నిర్వహిస్తూ,  డేటా యాక్సెస్‌ను పరిమితం చేయాలి. ఇలా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోతే సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోవడంతో పాటు, విలువైన డేటా నేరగాళ్ల చేతికి చిక్కి కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉందని  సిపి సజ్జనర్ తన పోస్ట్ లో హెచ్చరించారు. 

శునకంతో పార్లమెంట్‌కు వచ్చిన ఎంపీ రేణుకా చౌదరి

  పార్లమెంట్ శీతకాల సమావేశాలు సందర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కని తీసుకుని  రాజ్యసభకు వెళ్లారు. అనుమతి లేకపోవడంతో  పార్లమెంట్ సిబ్బంది వెనక్కి పంపారు. దీంతో అది కరిచే కుక్క కాదు, కరిచే వాళ్లంతా లోపల ఉన్నారంటూ రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పెంపుడు కుక్కను తీసుకురావడంపై  బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.   "మూగ జీవిని మేము రక్షించాం. అది పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వేరే పని లేదా?" అని ఆమె నిలదీశారు. అంతేకాకుండా, "అసలైన కరిచే వాళ్లు పార్లమెంట్‌లోనే కూర్చున్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రతిరోజూ పార్లమెంట్‌లో కూర్చుని మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మనం మాట్లాడం," అంటూ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి రేణుకా చౌదరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు  

హిల్ట్ పాలసీపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

  హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్-హెచ్ఐఎల్‌టీ పాలసీపై గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు  నేతృత్వంలో గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. హిల్ట్ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని ఆరోపించారు. 9,292.53  ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకు అప్పగిస్తోందని దీని వెనుక రూ.5 లక్షల కోట్ల స్కామ్ ఉందని ఆరోపించింది.  గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని  భూములను పరిరక్షించాలని హిల్ట్ రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని రామచందర్ గవర్నర్‌ను కోరారు.రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల విలీనం ద్వారా జీహెచ్ఎంసీని విస్తరించాలనుకుంటోందని, ఇందులోనూ ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయని బీజేపీ చీఫ్ తెలిపారు.  భూముల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత పలుకుతున్నాయి, గతంలో ఎంత ఉన్నాయో పరిశీలిస్తే అక్రమాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఇప్పటికే కోకాపేటలో భూములు ఎన్ని కోట్లు పలికాయో చూశామని అన్నారు.హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమలులోకి తెచ్చింది.  గవర్నర్‌ను కలిసిన వారిలో రామచందర్ రావుతో పాటు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.

మ‌స్క్ మ‌స్త్ చెప్పారుగా!

ఎలాన్ మ‌స్క్    మ‌న భార‌తీయ మేథ‌, ప్ర‌తిభ‌కు మంచి స‌ర్టిఫికేట్లే ఇచ్చారు.  జెరోధా స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నిఖిల్ కామ‌త్ త‌న పాడ్కాస్ట్- పీపుల్ బై డ‌బ్ల్యూటీఎఫ్ లో పాల్గొన్న మ‌స్క్ ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు. అందులో భాగంగా ఆయ‌న చేసిన కీల‌క‌మైన కామెంట్ భార‌తీయ మేథ‌తో అమెరికా లాభపడిందనీ, అది నూటికి నూరుపాళ్లూ వాస్తవమేననీ తెల్చి చెప్పారు.  ఇదే విష‌యాన్ని ట్రంప్ కూడా కోట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ప్ర‌తిభ త‌క్కువ‌. ప్ర‌తిభ ఉన్నా కూడా దానికి శ్రమ జోడించ‌డంలో అమెరిక‌న్ల‌కు బ‌ద్ద‌కం  కాస్త ఎక్కువేన‌ని ఏకంగా అగ్రదేశాధినేతే అంగీకరించేసినప్పుడు.. మస్క్ చెప్పడంలో గొప్పేంటి అన్న ప్రశ్నను పక్కన పెడితే..  అసలిప్పుడు విషయం ఏంటంటే  ప్ర‌తిభావంతుల‌ను నియ‌మించుకునేందుకు తీస్కొచ్చిన హెచ్1 బీ వీసా దుర్వినియోగం ఇటీవ‌ల బాగా పెరుగుతోంది. దీంతో వ‌ల‌స వ్య‌తిరేక భావ‌న‌కు ఆస్కార‌మేర్ప‌డింద‌నింటారు మ‌స్క్. గ‌త ప్ర‌భుత్వ త‌ప్పిదాలు కూడా ఇందులో పుష్క‌లంగా ఉన్నాయంటున్నారు.   గ‌త పాల‌కుడు బైడ‌న్ పాల‌న‌లో.. స‌రిహ‌ద్దుల్లో ఎలాంటి నియంత్ర‌ణ ఉండేది కాద‌నీ.. దీంతో అక్ర‌మ వ‌ల‌స‌లు పెరిగాయన్నది మస్క్ మాటల వెనుక అర్ధం.  అక్రమంగా వలస వచ్చిన వారికి.. ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా చూడాలన్నది మస్క్ సూచన.  వలసల కట్టడికి సరిహద్దుల వద్ద నియంత్రణ కచ్చితంగా పాటించ కుంటే..  పలు సమస్యలు ఉత్పన్నమౌతాయని హెచ్చరిస్తున్నారు కూడా.   టాలెంటెడ్స్ కొర‌త ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటుంద‌ని చెప్పే ఈ ట్రిలియనీర్ మస్క్.. చాలా కంపెనీలు టాలెంటెడ్స్ ను కాకుండా..  ఒక అమెరిక‌న్ ఎంప్లాయికి చెల్లించాల్సిన జీతంతో పోలిస్తే, విదేశీ ఉద్యోగికి స‌గం  ఇచ్చినా చాల‌న్న కోణంలో ఆలోచించి విదేశీయులను రిక్రూట్ చేసుకుంటున్నారనీ.. ఇదే వలస వ్యతిరేకతకు బలం చేకూర్చిందనీ చెబుతున్నారు.   త‌న కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థ‌లు ప్ర‌తిభామంతుల‌ను తీసుకుంటాయనీ,  వారికి స‌గ‌టు కంటే ఎక్కువ జీతాలు ఇస్తాయనీ చెబుతున్నారు.  అయితే  ఔట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్ 1 బి వీసాల వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేసి దెబ్బ తీశాయన్న మస్క్.. ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలే కానీ, మొత్తంగా ఈ వ్యవస్థనే రద్దు చేయాలనడం సమంజసం కాదన్నారు. అదే సమయంలో ఆయన  హెచ్ వ‌న్ బీ వీసాల కోసం ఎదురు చూస్తోన్న భార‌తీయ యువ‌తకు తీసుకుంటున్న వేతనం కంటే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడాలని సూచించారు. అలా ఉపయోగపడే వారినే తాను గౌరవిస్తానన్నరు. తానే కాదు ఏ యజమానైనా అలాగే ఆలోచిస్తాడని మస్త్ ముక్తాయించారు. ఫైనల్ గా మస్క్ చెప్పిందేమిటంటే.. దోచుకోవడానికి అమెరికా వస్తున్నామన్న భావన సరికాదనీ, వెయ్యి డాలర్ల జీతం తీసుకునే ఉద్యోగి కంపెనీకి లక్ష డాలర్ల లాభాన్ని చేకూర్చేలా ఉండాలని. అదీ సంగతి.  

నెల్లూరు, తిరుపతికి భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీన పడింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరీ తీరాలకు సమాంతరంగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం ఈ సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొం ది. వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పలు చోట్ల బారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  ఇక ఈ వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లడం నిషేధమని పేర్కొంది. ఇలా ఉండగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు పంట నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారలు సూచించింది.    

మళ్లీ పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి?

ఐ బొమ్మ రవిని పోలీసులు మళ్లీ కస్టడీకి తీసుకోనున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. తీవ్ర సంచలనం సృష్టించిన పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ  కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ పై సోమవారం (డిసెంబర్ 1)నాంపల్లి కోర్టులో విచారణ జరగుతుంది. సరిగ్గా అదే సమయంలో మరో మూడు కేసులలో పోలీసులు రవిని ఇదే కోర్టులో హాజరు పరచనున్నారు. ఐప్పటికే ఐబొమ్మ రవిని ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తాజాగా మరో మూడు కేసులలో రవిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసలు, ఆ మూడు కేసులలోనూ విచారణకు మరోమారు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. అందుకు కోర్టు అనుమతి ఇస్తే మరో మారు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటున్నారు న్యాయనిపుణులు.  

ఐదేళ్ల చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడి!

అభంశుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిపై ఓ ఆయా పైశాచికంగా దాడి చేసింది. నిష్కారణంగా ఆమెను చితకబాదడమే కాకుండా మెడపట్టుకుని కుదిపేసింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా పోలీసు స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లోని ఒ ప్రైవేట్ స్కూలులో జరిగింది. ఆ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై ఆ స్కూల్ ఆయా అమానుషంగా దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది.  స్కూల్లో పనిచేస్తున్న ఆయా,  అదే స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై జరిపిన దాడిలో ఆ చిన్నారి గాయపడటమే కాకుండా, భయంతో తీవ్ర జ్వరానికి గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  స్కూల్  ఆయా ఆ చిన్నారిని కొడుతున్న దృశ్యాలను ఆ పాఠశాల పక్కనే ఉన్న ఓ ఇంటి పై అంతస్తు నుంచి ఓ యువకుడు తన ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ వీడియోను అతడు పోలీసులకు అందజేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న  పోలీసులు, చిన్నారిపై దాడిచేసిన ఆయాను విచారిస్తున్నారు. 

ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి!

తనను ప్రేమించి పెళ్లాడడానికి సిద్ధపడిన తన ప్రియుడు పరువుహత్యకు గురికావంతో ఓ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. మరణించినా సరే తన ప్రియుడితోనే తన వివాహమని తెగేసి చెప్పింది. అలాగే చేసింది. ఇక తన జీవితమంతా తన ప్రియుడి కుటుంబంతోనే కలిసి జీవిస్తానని స్పష్టం చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.   వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో  ఆ యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిని   హత్య చేశారు. దీంతో ఆ యువతి అతడినే పెళ్లాడతానని పట్టుబట్టి, మరణించిన తన ప్రియుడి అంత్యక్రియల సమయంలో అతడి మృతదేహంతోనే వివాహం చేసుకుంది.   నాందేడ్‌‌‌‌‌‌‌‌ కు చెందిన అంచల్   సక్షం టేట్ లు గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో అంచల్ తండ్రి వీరి వివాహానికి అడ్డు చెప్పడమే కాకుండా.. తన మాట వినకుండా ఇంకా అంచల్ తో ప్రేమ కొనసాగిస్తున్నాడన్న ఆగ్రహంతో సక్షం టేట్ ను అంచల్ సోదరులతో కలిసి  హత్య చేశారు. విషయం తెలిసి అంచల్​  సక్షం అంత్యక్రియలు జరుగుతుండగా అతడి ఇంటికి చేరుకుని అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. సక్షం టేట్ భార్యగా జీవితాంతం అతడి ఇంట్లోనే నివసిస్తానని కుండబద్దలు కొట్టింది. తన ప్రేమ గెలిచిందనీ, సక్షం టేట్ ను దారుణంగా హత్య చేసిన తన తండ్రి, సోదరులు ఓడిపోయారనీ అంచల్ అంటోంది.  

రేవంత్ ఫుట్ బాల్ ప్రాక్టీస్

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్  నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సమ్మిట్ కు  ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు.   ఒక వైపు ఆ సదస్సు ఏర్పాట్లు, తన పట్టణ బాట, వరుస సమీక్షలతో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుల్ బాల్ దిగ్జజంతో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు కూడా సమాయత్తమౌతున్నారు.    ‘గోట్ ఇండియా టూర్‌‌‌‌’‌‌‌‌లో భాగంగా ఈ నెల 13న ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌‌‌‌లో మెస్సీతో  సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడనున్న సంగతి తెలిసిందే.   ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌‌‌‌లో లియోనల్ మెస్సీ (ఎల్‌‌‌‌ఎం10) టీమ్‌‌‌‌తో తలపడే జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ స్కిప్పర్ గా వ్యవహరిస్తారు.  ప్రపంచ సాకర్ దిగ్గజం మెస్సీతో తలపడే ఈ మ్యాచ్‌‌‌‌లో  ఆడటం కోసం సీఎం రేవంత్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ గేమ్ అంటే ఎంతో మక్కువ ఉన్న రేవంత్ రెడ్డి.. తన బిజీ షెడ్యూల్ లో కూడా ప్రాక్టీస్ కు సమయం కేటాయిస్తున్నారు.  అందులో భాగంగానే ఆదివారం (నవంబర్ 30) రాత్రి  ఎంసీహెచ్ఆర్డీ ఫుట్ బాల్ గ్రౌండ్లొ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి.