ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వీసీ సజ్జనార్

 

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున  సజ్జనర్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న సంగతి తెలిసిందే.

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక కొత్త మార్పు శకం ప్రారంభమైంది. ఆర్టీసీ బ్రాండ్‌ను మళ్లీ ప్రజల్లో స్థాపించేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆయన అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ‘మన ఆర్టీసీ’ అనే నినాదం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంతో పాటు, సంస్థను లాభాల దిశగా నడిపే ప్రయత్నం చేశారు.

ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసి, ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపరిచారు. ఆదాయ వనరులను పెంచే దిశగా సరుకు రవాణా సేవలను విస్తరించి, ప్రత్యేకంగా కార్గో సేవలను ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించారు.

అమ్మాయిల ఫోటోలతో డాక్టర్‌కి....14 కోట్లు కుచ్చుటోపి

  సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.14 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఘటన కలకలం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు.. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ని టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు ముందుగా అందమైన యువతి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి  కంబోడియా నుంచి ఈ మోసానికి పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో ముందుగా ఓ మహిళ పేరుతో నకిలీ ఖాతా ద్వారా డాక్టర్‌కు మెసేజ్ పంపించారు. అందమైన అమ్మాయి దీంతో డాక్టర్ ఆమెతో స్నేహం చేయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. తాను ఒంటరి మహిళనని, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్న ఆ మహిళ, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో తమ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. ఆ మహిళ మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టగా, లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మరింత డబ్బు పెట్టేలా ప్రోత్సహించారు. చివరకు ఆమె చెప్పిన మాటలను పూర్తిగా నమ్మిన డాక్టర్ తన ఇల్లును కూడా అమ్మి మొత్తం రూ.14 కోట్లు పెట్టుబడిగా జమ చేశారు. అయితే ఆ తర్వాత అకౌంట్లలో నుంచి డబ్బు మాయమవ్వడంతో మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ మోసానికి కంబోడియాలో తిష్ట వేసిన చైనీస్ సైబర్ నేరగాళ్లే ప్రధాన కారణమని గుర్తించారు. కంబోడియా నుంచే ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు ఉపయోగించి డాక్టర్‌ను ట్రాప్ చేసినట్లు తేల్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాలుగు మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అకౌంట్లలోకి డాక్టర్ పంపిన డబ్బును జమ చేసి, వివిధ మార్గాల ద్వారా కంబోడియాకు తరలించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.... “చైనీస్ సైబర్ గ్యాంగ్‌లు కంబోడియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, భారత్ నుంచి యువకులను ఉద్యోగాల పేరుతో అక్కడికి తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. మన దేశానికి చెందిన వారినే ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడుతు న్నారని ఏసీపీ ప్రసాద్  తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులు సూచించే యాప్‌లు, లింక్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టవద్దని సైబర్ అధికారులు ప్రజలను హెచ్చరించారు. మోసపో యిన లేదంటే ఎటువంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రుషికొండకు బోడిగుండు కొట్టి... యోగా దినోత్సవంపై విమర్శలా? : సీఎం చంద్రబాబు

  రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు...ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్, రంగు రాళ్లపై బొమ్మల కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారే కానీ ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించి ఆ తర్వాత కంపోస్ట్ తయారీ యార్డును సందర్శించారు.  అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగించారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ప్రజల జీవన విధానంలో మార్పు తేవాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాము. 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ తయారు కావాలి.  గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు...ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.  ఈసారి పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం థీమ్‌గా తీసుకున్నాం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది. సమగ్ర ఆర్ధిక వృద్ధికి దోహద పడుతుంది. వ్యర్థాలు-మురుగు నీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్టింగ్, పారిశుధ్య సేవలు, హరిత ఉత్పత్తులు, సర్క్యులర్ ఎకానమీ కార్యకలాపాలు...ఇవన్నీ స్థానికంగా ఉపాధి కల్పించేవే.  ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్ పాలసీ 2025ను తీసుకువచ్చాం. పొడి, తడి చెత్తను వేరు చేయడంపై చాలామందిలో అవగాహన వచ్చిందని పలువురు పారిశుధ్య కార్మికులు స్వయంగా నాకు చెప్పారు.  వ్యర్థాలను వనరుగా, సంపదగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అసలైన అర్థాన్నిచ్చాం. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పారిశుధ్య కార్మికులే నిజమైన సైనికులు. అందుకే వారి  గౌరవం పెరిగేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది.  ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1,257జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.  ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ  ‘గత పాలకులు చెత్తపై పన్ను వేయడమే కాకుండా 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త మొత్తం తొలగించాం. 2026, జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత ఏపీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, రీసైక్లింగ్ యూనిట్లు, కంపోస్ట్ తయారీతో ఏ రోజు చెత్తను ఆరోజు ప్రాసెస్ చేస్తున్నాం. జనవరి 26 నాటికి రాష్ట్రంలో రోడ్డుపై చెత్త అనేది కనపడకూడదు. ఫ్రిబ్రవరి 15 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో   ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరించేలా ఏర్పాట్లు చేస్తాం. అక్టోబర్ 26 నాటికి పొడి,తడి చెత్త వేరు చేయడం 100 శాతం పూర్తి కావాలి. గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  ఇంటి వ్యర్థాలను కంపోస్ట్ గా తయారు చేసుకొని కూరగాయలు పండించుకోవచ్చు. వీలైనంత వరకూ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  వచ్చే ఏడాది అక్టోబర్ 2 తర్వాత ఎక్కడా ప్లాస్టిక్ కనపడకూడదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. త్వరలో మరో 100 ప్రారంభిస్తాం. ప్రతీ ఉమ్మడి జిల్లాకు 6 నుంచి 8 చొప్పున స్వచ్ఛ రథాలు కేటాయిస్తాం.  స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేశాక గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇంట్లో చెత్త తీసి రోడ్డుపై వేసే అలవాట్లు మానుకోవాలి. అందరిలో సామాజిక స్పృహ రావాలి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.  పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆర్థికంగా దెబ్బతీశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేశాం. ప్రధాని మోదీ, మిత్రులు పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నాతో సహా నేతలు, కలెక్టర్లు, ఎస్పీలు సహా గ్రామస్థాయి అధికారి వరకు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. అనకాపల్లి జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రపంచమంతా విశాఖ వైపే చూస్తోంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారబోతున్నాయి.  ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 610 ఎంవోయూలు కుదిరాయి. SIPB ద్వారా మరో రూ.8.29 లక్షల కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా మొత్తం 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. భాగస్వామ్య సదస్సులో అనకాపల్లి జిల్లాకు సంబంధించి 11 ఎంఓయూలు కుదిరాయి. విశాఖకు గూగుల్ వస్తోంది.  ఇప్పటికే కాగ్నిజెంట్ వచ్చింది. టిసిఎస్ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థ జిల్లాలో పెట్టుబడి పెడుతోంది. రూ.1.85 లక్షల కోట్లతో NTPC గ్రీన్ ఎనర్జీ సంస్థ ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తోంది. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కు విశాఖ కేంద్రం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. 

నవ దంపతుల మృతి ఘటనలో కొత్త ట్విస్ట్!

  కొత్తగా పెళ్లయిన ఈజంట... ట్రైన్లో సరసాలు ఆడుతూ సరదాగా గడిపారు. సంతోషంగా కనిపిస్తున్న ఈ నవ దంపతుల సంతోషం కొద్దిసేపట్లో ముగిసిపోతుందని ఎవరైనా ఊహించగలరా.... కొన్ని  క్షణాల్లోనే ఆ ఇద్దరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతారా ఎవరైనా ఊహిస్తారా... కానీ ఎవ్వరూ ఊహించలేనిది ఆ ట్రైన్ లో ఒక్కసారిగా జరిగేసరికి ట్రైన్ లో ప్రయాణిస్తున్న వారందరూ ఉలిక్కిపడ్డారు... ట్రైన్ లో నవవరుడు భార్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ సరదాగా గడుపు తున్న సమయంలో ఈ నవజంట ఒక్కసారిగా అదుపు తప్పి ట్రైన్ నుండి కింద పడిపోయి మృత్యువాత పడ్డారు.  ఇది చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.  ఆ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి–ఆలేరు రైలుమార్గం లో చోటుచేసుకున్న విషాదకరమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి సమయంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందారు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది .మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా రైల్వే పోలీసులు గుర్తించారు.  ట్రైన్లో ఈ నవ దంపతులు సంతోషంగా ఉన్నా సమయంలో కొందరు వీడియో తీశారు... ఈ నవజంట మృత్యువాత పడిన అనంతరం ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి... ఈ వీడియోలను చూసిన ఇరు కుటుంబ సభ్యులు బోరున వినిపించ సాగారు. ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్న ఈ యువ దంపతులు క్షణాల్లోనే మృత్యువాత పడడంతో రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి.

టీ20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియా జట్టు ఇదే.. శుభమన్ గిల్ కు ఉద్వాసన

టి20 వరల్డ్ కప్ కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించింది. వరల్డ్ కప్ కు ప్రకటించిన జట్టే న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు ఎంపికయ్యింది.  విశేషమేంటంటే.. టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన శుభమన్ గిల్ కు ఈ జట్టులో స్థానం దక్క లేదు.   ఇలా ఉండగా దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ లో విఫలమైనా కూడా సూర్యకుమార్ యాదవ్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అంతే కా కుండా అతడినే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక వైస్ కెప్టెన్ గాఅక్షర్ పటేల్ ను నియమించారు.   ఇషాన్ కిషన్‌ రింకూ సింగ్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. వరల్డ్ కప్ కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ వర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, బూమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా,  సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్.

కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా... పవన్ సంచలన వ్యాఖ్యలు

  తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో జరిగిన అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని నన్ను విమర్శించారు. ప్రజల కోసమే తాను సీట్లు తగ్గించుకున్నా అధికారమున్నా లేకున్నా నేను నాలాగే ఉంటా..బెదిరించే నాయకులకు భయపడను. యూపీ సీఎం యోగి తరహాలో ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారు. కాలుకు కాలు, కీలు తీస్తే ఆకు రౌడీలు దారికొస్తారు అని పవన్  తెలిపారు. అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములుని సదా  స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశామని పవన్ తెలిపారు.  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం అని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం... మీకు  యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్.    ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయిందని పవన్ తెలిపారు. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని తెలిపారు.   కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పిఠాపురంలో చిన్న పిల్లల మధ్య సామాజికవర్గాల పేరిట చిచ్చు పెట్టారు. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? రాజకీయం చేయడానికి వేరే దారులే లేవా? ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న పెద్దలతో చర్చించామని జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు ఒప్పించామని ఈ రోజు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు తీసుకువస్తున్నామంటే దానికి కారణం ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ. ఆయన సంపూర్ణ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు  అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని తెలిపారు.   

విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా

  విశాఖపట్నంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా  అటల్ బీహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని బండి సంజయ్  ఆవిష్కరించారు. వైజాగ్ అందాలు, ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఈ నెల అందాలకు మాత్రమే కాదు.. పోరాటలకు ప్రసిద్ది. స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి పోరాటల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరువలేము. అవసరమైతే సముద్రంలా ఉప్పొంగుతారు.  అవకాశలు రావటం ఆలస్యం అయినా ప్రజల ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశలో కాకుండా నమ్మకంతో జీవిస్తారు అని బండి సంజయ్ అన్నారు. అందుకే విశాఖ దేశానికి గర్వకారణమైందన్నారు. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.‘‘అందుకే నేను గర్వంగా చెబుతున్నాను. వైజాగ్ సముద్రం కాదు. భావోద్వేగాల అల. ఉత్తరాంధ్ర ప్రజలు. మధ్య నిలబడి మాట్లాడే అవకాశం నాకు దక్కిన అదృష్టం. మీ ప్రేమకు… మీ ఆప్యాయతకు… మీ పోరాట పటిమకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

టీ20 వరల్డ్‌కప్‌ భారత జట్టు ప్రకటన

  వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరిగే  టీ20 వరల్డ్‌కప్‌ 2026కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు జట్టులో చోటు దక్కలేదు. జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌ (వైస్‌కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, తిలక్‌వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దుబే, రింకూ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌. జనవరిలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లోనూ ఇదే జట్టు ఆడుతుందని బీసీసీఐ ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది.

రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీ కొని ఎనిమిది ఏనుగులు మృతి.. అసోంలో విషాదం

 రైలు ఢీకోని ఎనిమిది ఏనుగులు మృత్యువాతపడిన విషాద ఘటన అసోంలో శుక్రవారం (డిసెంబర్ 20) తెల్లవారు జామున జరిగింది. సైరంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదు  బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో రైలు ప్రయాణీకులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాగా ఈ ఘోర ప్రమాదం నుంచి ఒక గున్న ఏనుగు సురక్షితంగా తప్పించుకుంది. ఆ గున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అదలా ఉంటే  ఈ ప్రమాదం గువాహ‌టికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో  జరిగింది. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  

ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు

దేశ రాజధాని నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ముఖ్యంగా చిన్న పిల్లలు కాలుష్యం కారణంగా అనారోగ్యం పాలౌతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను కాలుష్యం బారి నుంచి కాపాడే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని మొత్తం స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న దాదాపు 38 వేల స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వీటికి అయ్యే వ్యయం పర్యావరణ సెస్ నిధుల నుంచి  ఉపయోగించనున్నట్లు తెలిపింది.  తమ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కాలుష్యం బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకే స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ఢిల్లీలో కాలుష్య సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన అవన్నీ త్వరలో ఫలితాన్నిస్తాయన్నారు.  

ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి నవదంపతులు దుర్మరణం

కొత్తగా పెళ్లైన దంపతులు రైలు నుంచి జారి పడి దుర్మరణం పాలైన ఘటన   యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి  రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం (డిసెంబర్ 18) అర్ధరాత్రి సమయంలో జరిగింది. మృతు లను ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా   గుర్తించారు. ఇటీవలే వీరికి వివాహమైంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.  హైదరాబాద్ నుంచి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో  డోర్ వద్ద నిలబడిన ఈ జంట ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.