మంచి చెడులను ప్రజలు చూస్తున్న విధానం ఇదే..

  అదొక పెద్ద అంతర్జాతీయ కంపెనీ. ఆ కంపెనీలో బట్టలు ఉతికే సబ్బుపౌడర్(డిటర్జెంట్) తయారు చేస్తారు. వారు సబ్బుపొడికి 'అంతర్జాతీయ మార్కెట్' సొంతం చేసుకోవడానికి ఎలాంటి ప్రకటనలు(ఎడ్వర్టైజ్మెంట్) చేస్తే వినియోగదారులు పెరుగుతారో బాగా ఆలోచించి, వారి ప్రకటనలలో బొమ్మలకు ప్రాధాన్యతనిచ్చి, అతి తక్కువ పదాలను ఉపయో గించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార ప్రకటనలో మూడు బొమ్మల క్రింద వరుసగా ఇలా వ్రాయించారు : *మురికి బట్టలు* * సబ్బునీళ్ళలో బట్టలు* * శుభ్రమైన బట్టలు*  ఇంకేముంది! కంపెనీకి విపరీతమైన లాభాలు. కొన్నాళ్ళ తరువాత వారి 'సర్వే'లో ఒక కొత్త విషయం బయట పడింది. కొన్ని దేశాలలో వారి సబ్బుపొడికి 'మార్కెట్' లేకపోవడమే కాకుండా, ప్రజలలో ఆ సబ్బుపొడి మీద ఒక విధమైన ద్వేషం ఏర్పడింది. అందుకు కారణాలను తెలుసుకోవడానికి, ఆ దేశాలకు కంపెనీవారు 'మేధావి' బృందాన్ని పంపించారు. చివరికి 'సర్వే'లో తేలిన విషయం ఏమిటంటే, ఆ దేశ ప్రజలు కంపెనీ వారి ప్రకటనలను 'కుడి నుండి ఎడమ' వైపుకు చదవడమే! ఇదీ మన సమస్య. మంచీ, చెడులు నాణానికి ఇరువైపులున్న బొమ్మ, బొరుసుల్లాంటివి. ఇరు ప్రక్కలలో ఎటువైపు మనం చూస్తామో, దానిపైనే వస్తువు యొక్క మంచి చెడు ఆధారపడి ఉంటుంది. కుడి ఎడమయినా, ఎడమ కుడి అయినా పొరపాటే! మనం ద్వంద్వాలలో జీవిస్తున్నాం. ఈ ద్వంద్వ బుద్ధితో భగవంతుణ్ణి కొలుస్తున్నాం. మనకు చెడు సంభవిస్తే సహించం. ఎందుకీ చెడుని సృష్టించావని భగవంతుణ్ణి ప్రశ్నిస్తాం, రోదిస్తాం. కానీ భగవంతుడు మంచి, చెడులనే ద్వంద్వాలకు అతీతుడన్న విషయం మరచిపోతున్నాం. జీవితమనే నాణానికి మంచి, చెడులు ఇరుప్రక్కలా ఉన్న బొమ్మా బొరుసుల్లాంటివి అన్న భావన కలిగినప్పుడు, మనలో మరొక సమస్య తలెత్తుతుంది. అదే 'విచ్చలవిడితనం'. మంచి, చెడులనే ద్వంద్వాలు జీవితంలో సహజమనే మెట్ట వేదాంత ధోరణి విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో పరిణతి లేనప్పుడు ఇలాంటి మెట్ట వేదాంతం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. పైగా ప్రమాదం కూడా! కాబట్టి సాధకుడు మంచీ, చెడుల మధ్య తారతమ్యం తెలుసుకొని 'చెడు'ని వదలిపెట్టి, 'మంచి'ని పెంచుకొనే ప్రయత్నం చేయాలి. స్వామి వివేకానంద మాటల్లో “నాకు మేలైనది నీకు కీడు కావచ్చు. అన్ని విషయాల మాదిరే మంచి చెడ్డలకు కూడా క్రమవికాసం వుందనేదే దీని పర్యవసానం.  అది క్రమవికాసం చెందుతూన్నప్పుడు ఒక దశలో మంచి అని మరొక దశలో చెడు అని అంటుంటాం. నా మిత్రుడి ప్రాణం తీసిన తుపాను చెడ్డదని నేనంటాను. కానీ ఆ తుపాను గాలిలోని సూక్ష్మ విషక్రిములను నాశనం చేసి అసంఖ్యాక  జనాన్ని కాపాడి ఉండవచ్చును. దాన్ని గుర్తించినవారు మంచిదంటారు.   కాబట్టి మంచి చెడ్డలు సాపేక్ష ప్రపంచానికి సంబంధించినవే.  నిర్గుణదేవుడు సాపేక్షదేవుడు కాడు. కాబట్టి అతడు మంచివాడని గాని, చెడ్డవాడని గాని నిర్వచించలేం. అతడు మంచి చెడులకు అతీతుడు. అతడు మంచివాడూ కాడు, చెడ్డవాడు కాడు. కానీ, చెడుకంటే మంచే తనకు ఎక్కువ సన్నిహితమనే మాట నిజం.                                            *నిశ్శబ్ద.  

యుద్దాలకు, ఘర్షణలకు ముగింపు పలకాలంటే ఇదే మార్గం..

ఇద్దరు వ్యక్తులు, రెండుకుటుంబాలు, ఇరుగు పొరుగు, గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు ఇలా ఏ రెండింటిని గమనించినా ఖచ్చితంగా ఏదో ఒక అభిప్రాయ భేదం, లేదా ఏదో ఒక అపార్థం ఉండనే ఉంటుంది. ఈ అపార్థాలు సహజంగా సమసిపోతే సమస్యే లేదు. కానీ అవి కాస్తా క్రమంగా పెద్ద సమస్యలుగా మారితే అన్ని రకాల నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇద్దరు మనుషుల మధ్య సంఘర్షణ మితిమీరితే అది ఘర్షణకు దారితీసినట్టు, రెండు ప్రాంతాలు, దేశాలు మధ్య సంఘర్షణ పెరిగితే అది యుద్దాలకు దారితీస్తుంది.  మొన్నటిదాకా జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్దమైనా, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దమైనా దీనికి ప్రధాన కారణం సంఘర్షణే. సమస్యలను ఆరోగ్యకరమైన రీతిలో పరిష్కరించుకుంటే  అవి నష్టాలకు దారితీయకుండా సమసిపోతాయి. ఆరోగ్యకరమైన పరిష్కారాలకు ఎప్పుడూ శాంతి అవసరం అవుతుంది. శాంతి ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన సంఘర్షణ పరిష్కార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రాముఖ్యత, దీని చరిత్ర, దీని వెనుక కృషి మొదలైన విషయాలు తెలుసుకుంటే.. చరిత్రలో ఏముంది? సంఘర్షణ పరిష్కార దినోత్సవం అనేది శాంతి మార్గంలో సంఘర్షణలను పరిష్కరించే దిశగా అవగాహన పెంపొందించడం. దీన్ని ప్రపంచం యావత్తు జరుపుకుంటారు. అసోసియేషన్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్  రిజల్యూషన్ దీన్ని 2005లో స్థాపించింది. దీని ప్రధానఉద్దేశం  సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా అహింసా మార్గంలో పరిష్కరించడం. ఈ పద్దతుల మీద అవగాహన పెంచడం. పాఠశాలలు, కార్యాలయాలు, న్యాయవ్యవస్థ, కుటుంబం మొదలైన సాధారాణ జీవనశైలిలో కూడా దీన్ని భాగం చేయడం. కూర్చుని, మెల్లగా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయనే మాట చాలామంది వినే ఉంటారు. అదే దీనికి అన్వయించవచ్చు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతియుతంగా సమస్యలను పరిష్కరిస్తే ఈ ప్రపంచంలో ఎన్నో పెనుముప్పులను ఆపవచ్చు. ఈ ఆలోచనతోనే మహాత్మాగాంధీ, మేరీ క్యూరీ, హోరేస్ మాన్, డోలోరెస్ హూర్టా వంటి మహోన్నత వ్యక్తులు  అహింసా మార్గంలో సమస్యల పరిష్కారానికై  తమ జీవితాన్ని వెచ్చించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఈ తరహా మార్గం వైపు ప్రజలను ప్రోత్సహించడం, తాము ఆ మార్గంలో ప్రయాణిస్తూ ప్రజలను నడిపించడం ఎంతో అవసరం. ఏం చేయొచ్చు.. సమస్య దేశాల మధ్యా, లేదా మనుషుల మధ్య అనే విషయం కాదు. తమకు దగ్గరలో ఎవరైనా హింసా పద్దతిలో వెళుతుంటే వీలైనవరకు వారి సమస్యను పరిష్కరించడం ద్వారా పెద్దగొడవనే అపవచ్చు. మా సమస్య మాది నీకెందుకు అని చెప్పేవారు కొందరు ఉంటారు. అలాంటి వారికి తమ కుటుంబ సభ్యుల నుండి తమ పిల్లల వరకు ఆయా గొడవల వల్ల కలిగే నష్టం, మానసికంగా ఏర్పడే అభిప్రాయాలు ఎలాంటివో తెలియజెప్పాలి. సామాజిక విషయాలను ఎప్పుడూ వ్యక్తిగత అంశాలలోకి తీసుకుని అర్థం చేసుకోకూడదు. వ్యక్తిగత కోపాలు,  గొడవలు ఏమున్నా వాటిని సమాజం మీద రుద్దకూడదు. దీనివల్ల సమాజం మీద ప్రభావం పడుతుంది. ఎంతో కొంత సమాజంలో నివసించే పౌరులకు కూడా నష్టం కలుగుతుంది. అహింస అనేది నాలుగు వ్యాసాలు, రెండు పుస్తకాలు, పది స్పీచ్ లు వింటే అలవాటు అయ్యేది కాదు. ఆలోచిస్తే వచ్చేది. శాంతి ద్వారానే అహింస స్వభావం మనిషిలో అలవడుతుంది. కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రేమ, జాలి, దయ వంటి గుణాలు శాంత స్వభావాన్ని పెంచుతాయి. కోపం, ద్వేషం, అహంకారం, అసూయ వంటి గుణాలకు దూరంగా ఉండాలి.                                                       నిశ్శబ్ద.

చాణక్యుడు చెప్పిన ఈ నీతి పాటిస్తే డబ్బుకు లోటుండదు..

తినడానికి తిండి.. కట్టుకోవడానికి బట్ట.. విద్య నుంచి వైద్యం వరకు.. చివరికి మంచినీళ్లు కూడా కొనుక్కొని తాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ డబ్బు విలువను చెప్పకనే చెబుతున్నాయి. పొద్దున్న లేచింది  మొదలు రాత్రి నిద్రించే వరకు మనిషి జీవితంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడివుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే ఈ భూమిపై జీవిస్తున్న మనుషుల్లో అతికొద్ది మినహా మిగతావారంతా ధనార్జనలో తలమునకలవుతున్నారు. పేద, ధనిక అనే భేదం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం పరితపిస్తున్నారు. కానీ కొంతమంది ఎంత శ్రమించినా కష్టానికి తగ్గ డబ్బు మిగలదు. చేతిలో డబ్బు ఆగక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారి ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతి శాస్త్రంలో కొన్ని సూచనలు చేశాడు. అవేంటో తెలుసుకుని పాటిస్తే ఎంత చిన్న మొత్తం సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం ఖాయం.. అహంకారం ఉంటే ధనం నిలవదు.. అవసరాల కోసం డబ్బు సంపాదన అందరికీ అనివార్యమే. కానీ ఏ మనిషీ డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదు. డబ్బు సంపాదనతో అహంకారం ఆవహిస్తుందని, అహంకారం ఉన్నచోట డబ్బు నిలవదని చాణక్యుడు చెప్పాడు. అందుకే చేతిలో డబ్బు ఉన్నప్పుడు మురిసిపోకుండా..  లేనప్పుడు కుంగిపోకుండా ఎప్పుడూ నిరాడంబరంగా ఉండాలి. అందరినీ సమదృష్టితో చూడాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. అప్పుడు మాత్రమే అహంకారం దూరమై చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇంట్లో ధాన్యం ఎప్పుడు ఖాళీ అవ్వకూడదు.. ఇంట్లో నిండుగా ధాన్యాగారం ఉండటం చాలా శుభప్రదమని చాలామంది చెబుతున్నారు. ఇది సత్యమేనని చాణక్యనీతి కూడా చెబుతోంది. ధాన్యం ఇంట్లోవారి ఆకలి తీర్చడమే కాకుండా ఆ గృహంలో సంపదను శాశ్వతం చేస్తుందని చాణక్యనీతి వివరిస్తోంది.  ఇంట్లో ధాన్యం అయిపోకముందే మరింత ధాన్యాన్ని తెచ్చిపెడితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇంటిపై ఉండేలా చూసుకోవచ్చు. అలాగే ఆహారాన్ని ఎప్పుడూ అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు. ఇంట్లో చింతలుంటే ధనం నిలవదు.. కొంతమంది ఇళ్లలో ఎప్పుడుచూసినా చింతలు, కష్టాలు, కన్నీళ పరిస్థితులు కనిపిస్తుంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ పరిస్థితులు ఇంట్లో రణరంగాన్ని తలపిస్తుంటాయి. అయితే అలాంటి ఇళ్లలో ధనలక్ష్మి ఉండదని చాణక్య నీతిశాస్త్రం చెబుతోంది. అన్నివేళలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి లక్ష్మీదేవి నిలవాలనుకునేవారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక అంశాలు రహస్యంగా ఉండాలి.. వ్యక్తిగత ఆర్థిక విషయాలను గోప్యంగా ఉంచుకోవాలని చాణక్యనీతి సూచిస్తోంది. ఆర్ఠిక లక్ష్యాలు ఎవరితోనూ పంచుకోకూడదని చెబుతోంది. ఎందుకంటే ఎవరైనా కించపరిస్తే లక్ష్యం నుంచి దృష్టి మరలే అవకాశం ఉంటుంది. అందుకే తెలివైన వ్యక్తులు ఆర్థిక అంశాల్లో గోప్యతను పాటిస్తుంటారు. ఖర్చు పెట్టడం తెలియాలి.. డబ్బు సంపాదించడమే కాదు.. దాన్ని  ఖర్చుపెట్టే విషయంలో నేర్పు ఉండాలి. కష్టకాలంలో డబ్బు ఏవిధంగా అక్కరకొస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చుపెట్టాలి. సాయాలకు, పెట్టుబడులకు, ఆత్మరక్షణ కోసం వెనుకాడకుండా ఖర్చుచేయవచ్చు. అలాగని కేవలం ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యంగా ఖర్చు ఉండకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సంపదను జల్సాలకు ఉపయోగించడం ఏమాత్రం మంచిదికాదు. నీళ్లలా వృథా చేస్తే లక్ష్మీదేవి నిలవదు. వివేచనతో సమయానుగుణంగా ఖర్చుచేయడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. అక్రమ సంపాదన నిలవదు డబ్బు సంపాదన కోసం కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటుంటారు. కాలం కలిసొస్తే గట్టిగానే పోగేసుకుంటారు. కానీ అలాంటివారి వద్ద ఎల్లకాలం సంపద నిలవదు. డబ్బుని ఆర్జించే విషయంలో ఎల్లప్పుడూ న్యాయం, నిజాయితీగా మెలగాలి. అనైతిక మార్గాల ద్వారా వచ్చిన డబ్బు ఎల్లకాలం నిలవదు. అందుకే డబ్బును ఎప్పుడూ ధర్మబద్ధంగానే సంపాదించాలి.                                        *నిశ్శబ్ద.

పేదరిక నిర్మూలనే మెరుగైన జీవితాలకు నాంది!!

ఆకలితో అలమటించడం.. తలదాచుకోవడానికి గూడులేకపోవడం.. చదువుకోవాల్సిన వయసులో పనికెళ్లడం.. ఇవన్ని పేదరికానికి  గుర్తులు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సవాళ్లలో ఒకటైన పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పేదరిక నిర్మూలనపై విశ్వవ్యాప్తంగా అవగాహన పెంచడం, అంతర్జాతీయంగా తీసుకోవాల్సిన చర్యల ఆవశ్యకతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మెరుగైన సమాజం కోసం పారదోలాల్సిన ప్రధాన సవాళ్లలో పేదరికం ప్రధానమైనది. సమాజంలో అణగారిన వర్గాలవారు రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, అవసరమైన చర్యలతో పేదవర్గాలకు చేయూతనివ్వాలన్న స్పృహను  అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం గుర్తుచేస్తుంది.  పేదరికంలో మగ్గుతున్న ప్రజలకు సాధారణ జీవితం కూడా నరకయాతనే. విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులకు వారు ఆమడ దూరంలో ఉంటున్నారు. అందుకే అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా సమానత్వపు ఔనత్యాన్ని చాటిచెప్పడం, పేదలు ఆత్మగౌరవం, హూందాగా జీవించాల్సిన ఆవశ్యకతను అంతర్జాతీయ పేదరిక నిర్మూలనం దినోత్సవం లక్ష్యంగా చేసుకుంది. ఆర్థిక స్థిరత్వం, సామాజిక సమ్మిళితం ప్రాముఖ్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది.  చరిత్ర ఏం చెబుతోంది.. 1987లో ఏం జరిగింది? అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం చరిత్ర 1987లో మొదలైంది. తీవ్రమైన పేదరికం, హింస, ఆకలి బాధితులకు మద్ధతుగా అక్టోబర్ 17న వందలాది మంది ప్యారిస్‌లోని ట్రొకెడెరోలో సమావేశమయ్యారు. 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌పై సంతకం చేసిన ప్రదేశంలో వీరంతా సమావేశమయ్యారు. ఈ సందర్భానికి గౌరవ సూచకంగా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించాలని 1992 డిసెంబర్ 22న ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. పేదరికం నిర్మూలన ఆవశ్యతను చాటిచెప్పడం దీని ముఖ్యొద్దేశమని పేర్కొంది. 2023 థీమ్ ఇదే.. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు. ‘‘ ఆత్మగౌరమైన పని, సామాజిక సంరక్షణ: ఆచరణలోకి అందరికీ గౌరవం’’ అనేది ఈ ఏడాది థీమ్. పేదలైనప్పటికీ పనిలో ఆత్మగౌరవం, సమాజంలో అణగారిన వర్గాల రక్షణను ఈ థీమ్ చాటిచెబుతోంది. మరోవైపు అందరికీ గౌరవాన్ని మాటల్లో చెప్పి వదిలేయకుండా ఆచరణాత్మకం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది.  ప్రాముఖ్యత.. అంతర్జాతీయంగా అవగాహన, సహకారం, విద్య వంటి చర్యల ద్వారా పేదరిక నిర్మూలన ప్రాముఖ్యత అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం చాటిచెబుతోంది. నిరుద్యోగం, వనరులలేమి, విద్యలేమి, అసమానత వంటి అంశాలు పేదరికానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం రోజున ఈ సమస్యలను అధిగమించడంపై అవగాహన చాలా ముఖ్యం. పేదరికం పర్యవసనాలు నేరాలు, హింస, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి మరిన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతోంది. ఇతరులకు ఉపాధి కల్పించడం, ఆర్థిక భరోసా ఇవ్వడం, మెరుగైన జీవితాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి.                                              *నిశ్శబ్ద.  

ప్రాణాధారమైన ఆహారాన్ని పొదుపు చెయ్యాల్సింది ఇప్పుడే..

ఈ భూమండలంపై ప్రతి జీవికి ఆహారమే ప్రాణాధారం. మనుషులైనా, జంతువులైనా, జలచరాలైనా వాటి ఆయువు ఆహారంతోనే ముడిపడి ఉంటుంది. ఇక భూమిపై అత్యంత తెలివైన ప్రాణిగా మనుగడ సాగిస్తున్న మనిషి జీవితంలో ఆహారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం పాకులాడుతున్నవారు ఎందరో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తూ చాలామంది సరైన ఆహారానికి నోచుకోలేకపోతున్నారు. పసిబిడ్డల నుంచి పెద్దవాళ్ల దాకా కడుపులు కాల్చుకుంటున్నారు. కోట్లాదిమంది పౌష్టికాహారం, తాగునీటికి ఆమడదూరంలో నిలుస్తున్నారు. ఈ దుర్భరపరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ దినోత్సవం అసలెప్పుడు మొదలైంది?, ఈ ఏడాది ఏ థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తున్నారు? వంటి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకంటే.. ఈ భూమిపై ప్రతి వ్యక్తికి సరైన పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీటికి భరోసా, అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని మొదలుపెట్టారు. ఆహార రక్షణ, ఆహార భద్రత, ప్రపంచవ్యాప్తంగా  ఆకలి సమస్యలను పారదోలడం ఈ మూడు  ఆహార దినోత్సవ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. గమ్యానికి అనుగుణంగా ప్రతి ఏడాది వినూత్న కార్యక్రమాల రూపొందిస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. తొలిసారి ఎప్పుడు ప్రారంభమైంది? ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 16న నిర్వహిస్తున్నారు. 1945లో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ ఏర్పాటైన అక్టోబర్ 16న  ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ మొదలుపెట్టారు. నిజానికి ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ 1945లోనే ఏర్పాటైనప్పటికీ 34 ఏళ్ల తర్వాత అంటే 1979లో జరిగిన ఎఫ్ఏవో కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాలు ఆహార దినోత్సవం నిర్వహణకు అంగీకారం తెలిపాయి. ఆకలి సమస్యలు, ఆహార భద్రతతో సంబంధమున్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్‌తోపాటు అనేక సంస్థలు ఈ దినోత్సవంలో పాల్గొంటాయి. నీరు జీవితం, నీరే ఆహారం.. ఈ ఏడాది థీమ్ ఇదే.. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు. ‘‘నీరు జీవితం, నీరే ఆహారం. ఏ ఒక్కరినీ వెనుకబడనివ్వొద్దు’’ అనేది 2023 థీమ్‌గా ఉంది. ఈ భూమిపై జీవించడానికి నీరు చాలా ఆవశ్యకమని ఈ థీమ్ చాటి చెబుతోంది. భూమిపై మూడొంతులకుపైగా ఉండే నీరు మానవ శరీరాల్లో 50 శాతానికిపైగా ఉంటుందని, ఆహారోత్పత్తి, జీవనోపాధికి నీళ్లు ఎంతో ముఖ్యమని ఈ థీమ్ అవగాహన కల్పిస్తోంది. అత్యంత విలువైన ఈ సహజ వనరు అనంతమైనది కాదని, వృథాను మానుకోవాలనే ఉద్దేశ్యాన్ని చాటిచెప్పడం ఐక్యరాజ్యసమితి ప్రధానుద్దేశ్యంగా ఉంది. ఈ థీమ్‌కు తగ్గట్టు ప్రతి ఒక్కరికీ ఆహారం, నీరు సమాన ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు, సంస్థలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. భారత్‌లో కూడా అధికారికంగా ప్రపంచ ఆహార దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.                                           *నిశ్శబ్ద.

మెరుగైన ప్రపంచానికి మెరుగైన ప్రమాణాలు !

లీటర్ ఆయిల్.. కేజీ బియ్యం..  గంట సమయం.. స్వచ్ఛమైన బంగారం.. ఇలా ఒకటా! రెండా! రోజువారి జీవితంలో  పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు ప్రతిదానికి నిర్ధిష్ట పరిమాణం ఉంటుంది. అది పనైనా.. పదార్థమైనా.. నాణ్యతైనా ఒక గణన ఉంటుంది. ఆ నిర్ధిష్ట పరిమాణం లేదా గణనను ‘ప్రామాణికం’ అంటారు. ఈ ప్రామాణికాలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి తీసుకురావడానికి వేలాదిమంది శాస్త్రవేత్తలు స్వచ్ఛంధంగా కృషి చేశారు. ఇందుకోసం ఎన్నో ఒప్పందాలు కుదిరేలా కృషి చేశారు. వారందరి సేవలను గౌరవిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 14న అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.  శాస్త్రవేత్తల నిర్విరామ కృషి కారణంగా ఆవిర్బవించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్, ఇంటర్నేషనల్ ఎథిక్స్ స్టాండర్డ్ బోర్డ్ ఫర్ అకౌంటెంట్స్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ వంటి సంస్థలన్నీ అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవంలో పాల్గొంటాయి. ఈ దినోత్సవం ఆవశ్యకతను చాటి చెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. ప్రాముఖ్యత ఏంటంటే... ప్రతి దినోత్సవాన్ని నిర్వహించడానికి ఒక లక్ష్యం ఉన్నట్టే అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించడానికి ఒక కారణం ఉంది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ప్రామాణికీకరణ అవశ్యకత గురించి నియంత్రణ సంస్థలు, పరిశ్రమల రంగం, వినియోగదారుల్లో అవగాహన పెంపొందించడం కోసం ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అక్టోబర్ 14నే ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారటే.. ప్రామాణికీకరణకు ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని 25 దేశాలకు చెందిన ప్రతినిధులు అక్టోబర్ 14, 1946లో నిర్ణయించారు. కీలకమైన ఈ సమావేశం లండన్‌లో జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి అత్యంత కీలకమైన ఈ రోజున అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి లండన్ సమావేశం జరిగిన మరుసటి ఏడాది ఐఎస్‌వో (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) ఏర్పాటైంది. అయితే తొలి అంతర్జాతీయ ప్రామాణిక దినోత్సవం 1970లోనే నిర్వహించారు. ప్రపంచదేశాలు తమతమ దేశాల్లో ప్రమాణాలను కూడా నిర్ణయించడంతో అక్టోబర్ 14న ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. కాగా ఐఎస్‌వోలో మొత్తం 125 సభ్యదేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ తమతమ దేశాల్లో ప్రమాణాల ఆవశ్యకత గురించి అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తుంటాయి. ఈ ఏడాది థీమ్ ఏంటంటే.... ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తారు.“మెరుగైన ప్రపంచం కోసం భాగస్వామ్య దృష్టి: ఎస్‌డీజీ3 సమ్మిళితం” అనేది 2023 థీమ్‌. కాగా ఎస్‌డీజీ3 అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్3 అని అర్థం. ఆరోగ్యకరమైన జీవితాలకు భరోసా, అందరికీ శ్రేయస్సును ప్రోత్సహించడం ఈ థీమ్ ప్రధాన ఉద్దేశ్యం. అంతర్జాతీయ ఆహార ప్రమాణాల నిర్దేశక సంస్థగా కోడెక్స్ అలిమెంటారియస్ ఈ ఏడాది ‘‘అందరి శ్రేయస్సు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ మెరుగైన, ఉత్తమమైన, మరింత సుస్థిరమైన ప్రపంచం’’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో డబ్ల్యూహెచ్‌వో/ఎఫ్ఏవో దీనిని ఈ ఏడాది థీమ్‌గా పరిగణించాయి. కాగా కొన్ని దేశాల్లో వేర్వేరు రోజులు అంతర్జాతీయ ప్రమాణాలు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక ఇండియా విషయానికి వస్తే 1947లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ చట్టాన్ని ఆమోదించి దానిని శాసనపరమైన సంస్థగా మార్చి ఐ.ఎస్‌.ఐ ముద్రను ప్రకటించిన విషయం తెలిసిందే.                                        *నిశ్శబ్ద.

ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు..!!

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.     

మేలుకోవోయి.. కంటిచూపు కాపాడుకోవోయి...

‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు. అంటే శరీరంలోని జ్ఞానేంద్రియాలలో కళ్లు ప్రధానమైనవని అర్థం. కంటిచూపు ఉంటే ప్రపంచాన్ని వీక్షించగలుగుతాము. లేకపోతే జీవితమంతా అంధకారమే మరి. జీవితమంతా చీకటిలోనే గడిచిపోతుంది. ఏ వ్యక్తి జీవితమైనా సాఫీగా, అందంగా  సాగాలంటే అత్యంత కీలకమైన ఈ కంటిచూపు గురించి, సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘అంతర్జాతీయ కంటిచూపు దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. దీనిని ప్రపంచ కంటి దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెల రెండో గురువారం నాడు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 12నా ప్రపంచ కంటిచూపు దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దినోత్సవం ప్రాధాన్యత, చరిత్రను గమనిస్తే.. 1984లోనే మొదలు.. కంటిచూపుపై సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా 1984 అక్టోబర్ నుంచి ప్రపంచ కంటిచూపు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు లయన్స్ క్లబ్ ఫౌండేషన్ రిపోర్ట్ పేర్కొంది. మొదట్లో ‘ విజన్ 2020’ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఐఏపీబీ (ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్) నిర్వహిస్తుండేది. . అయితే 2000 నుంచి ఐఏపీబీ అధికారిక కార్యక్రమంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచదేశాలు వేర్వేరు  కార్యక్రమాలతో ప్రపంచ కంటిచూపు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది థీమ్ ఏంటంటే.. పని వద్ద కళ్లను ప్రేమించడం..   ఈ ఏడాది థీమ్ ఇదే…   ‘పని వద్ద మీ కళ్లను ప్రేమించండి’ అనే థీమ్ ఆధారంగా  ఈ ఏడాది ప్రపంచ కంటి దినోత్సవం సాగుతుంది.  పని చేసేచోట కంటిచూపు కోసం జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ థీమ్ చాటిచెబుతోంది. ప్రతి పని ప్రదేశంలో కంటి భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీల యజమానులు, వ్యాపారవేత్తలకు పిలుపునివ్వడం దీని ఉద్దేశ్యం. ఇక ప్రపంచ కంటిచూపు దినోత్సవాన్ని నిర్వహించేందుకు వేర్వేరు మార్గాలున్నాయి. కంటి పరీక్ష నిర్వహించుకోవడం ప్రధానమైనది. కంటి ఆరోగ్యం గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించడం రెండవ ప్రధానమైనది. ఇక కంటి ఆరోగ్యం బావుండాలని కోరుకునేవారు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవడం, ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కంటిని రక్షించుకునేందుకు సన్‌గ్లాసెస్ వాడడం చాలా ముఖ్యం.  పౌష్టికాహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం తప్పనిసరి.  ధూమపానం, పొగాకు తీసుకోవడం, మత్తుపదార్థాల వాడకం వంటి అలవట్లు ఉంటే వెంటనే మానేయాలి. జీవనశైలికి తగ్గట్టు కంటి రక్షణ ముఖ్యం.. రోజు రోజుకూ వేగంగా మారిపోతున్న జీవన శైలి కళ్లకు ముప్పుగా మారింది. ఆధునిక యుగంలో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, టీవీలు చూడనిదే పొద్దుగడవని పరిస్థితిని యువత ఎదుర్కొంటుంది. నిద్రలేచిన దగ్గరనుంచి రాత్రి నిద్రించే వరకు కంటిమీద ఒత్తిడి పడుతూనే ఉంటుంది. అయితే కంటిచూపుని మెరుగుపరచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కనులకు అందాల్సిన పోషకాలు, విటమిన్-ఎ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కంటిచూపు సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చు. ఇందులో క్యారెట్, పాలకూర, నట్స్ బాదాం, వాల్ నట్, అవకాడో, చేపలు, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కంటిచూపు మెరుగుదలకు గొప్ప మేలు చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా మీ రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోండి.                                             *నిశ్శబ్ద.

బాలికల హక్కులే వారి భవితకు చుక్కాని!!

‘ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆశీర్వాదాన్ని పొందినట్టే’, ‘ఆడబిడ్డ పుడితే అదృష్టం’అనే మాటలు ఊరకనే రాలేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళ, సందడి, సంతోషం వెలకట్టలేనివి. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆడపిల్లలు ఉన్నవారికే అర్థమవుతుంది. ఇక ఆడపిల్లను సరైన విలువలు, విద్యతో పెంచే తల్లిదండ్రులు మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నట్టేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, నాణేనికి మరోవైపు అన్నట్టుగా.. ఈ సమాజం ఆడపిల్లలకు  ఒక సమస్యల సుడిగుండమే అని చెప్పాలి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి లోపలికి వెళ్లే  అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు బాలికలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఏర్పాటు చేశారు. ఈ హక్కులను గుర్తించడం, సవాళ్లను అధిగమించడంపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. ఈ మేరకు డిసెంబర్ 19, 2011న జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటన చేసింది. ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల దినోత్సవం చరిత్ర, విశేషాలను గమనిద్దాం... చరిత్ర ఏం చెబుతోంది... బాలికలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలను నియంత్రించి, వారి హక్కులపై అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళల ఆత్మగౌరవం రక్షణ కోసం పోరాడిన ఉద్యమకారుడు, అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్‌వెల్డ్ పుట్టిన రోజయిన అక్టోబర్ 11న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది. ఈ మేరకు 19 డిసెంబర్ 2011న జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో తీర్మానం జరిగింది. అక్టోబర్ 11, 2012న తొలి అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించాలని ఆమోదించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా సభ్యదేశాలు పెద్ద సంఖ్యలో ఓటు వేశాయి. విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహాలు వంటి విషయాల్లో బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లింగ అసమానతలపై అవగాహన కల్పించడమే ముఖ్యొద్దేశ్యంగా ఇది సాగుతుంది. ఇక బాలికలు, యువతులు వారివారి రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను చేపడతారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వివిధ కార్యక్రమాల ద్వారా బాలిక అభ్యున్నతికి తోడ్పాటునందించే ప్రయత్నం చేస్తాయి. భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటాయి. నారీశక్తి అని, మహిళా రిజర్వేషన్లు అని ఎన్ని అడుగులు ముందుకు వేసినా కొందరు మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 2023 థీమ్ ఏంటంటే... అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తుంటారు. ‘‘బాలికల హక్కుల్లో పెట్టుబడి: మన నాయకత్వం, మన సంక్షేమం’’ 2023 థీమ్‌‌గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాలికలకు రక్షణ, విద్య, ఆరోగ్యంగా జీవించే హక్కులపై అవగాహన కల్పించడమే ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం. బాలికల హక్కులు కేవలం చిన్నవయసులోనే కాదు.. మహిళగా రూపాంతరం చెందే వరకు సంరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది థీమ్ చాటి చెబుతోంది. బాలికల సాధికారతకు మరిన్ని అడుగులు వేయాలని చెబుతోంది. బాలికలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, కేవలం జెండర్ ఆధారంగా బాలికలు చవిచూస్తున్న లింగ అసమానత్వంపై అవగాహనను పెంపొందించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఆడపిల్లల సాధికారత పట్ల అవగాహన పొందడం, కల్పించడం, వీలైనంత మేర తోడ్పాటునందిస్తే అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి గొప్ప గౌరవమిచ్చినట్టవుతుంది. మీ చుట్టుపక్కల బాలికల పరిస్థితి గమనించి సానుకూలంగా స్పందిస్తే మీ వంతు బాధ్యత నిర్వహించినట్టే!                                       *నిశ్శబ్ద.  

సంతోషమైన జీవితానికి తొలిమెట్టు మానసిక ఆరోగ్యమే..

మానసిక ఆరోగ్యం సరిగాలేని వ్యక్తులను పిచ్చివాళ్లంటూ హేళన చేస్తుంది ఈ సమాజం. అందరిలో కలిసేందుకు అనర్హులన్నట్టుగా వెలివేస్తుంది. ఇక మానసిక ఆరోగ్యం బావుంటే ఆత్మవిశ్వాసం వెన్నెంటే ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ఆత్మస్థైర్యం తొణికిసలాడుతుంది. అంతేనా ఒత్తిడి ఆమడ దూరం పారిపోతుంది. మనిషి సాధారణ జీవితానికి ఎంతో ముఖ్యమైన మానసిక ఆరోగ్యాన్ని ఒక సాధారణ అంశంగా పరిగణించడం, మానసిక రుగ్మతలపై అవగాహన పెంపొందించడమే ముఖ్యొద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 10న ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని’ నిర్వహించాలని 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రకటించింది. దీని వెనుక చరిత్ర ఏంటి? మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చెయ్యాలి? తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యంతో జీవించడం పట్ల సరైన విజ్ఞానం, సంబంధిత సమస్యలపై అవగాహన కోసం ఉద్దేశించిన ‘ప్రపంచ మానసిక దినోత్సవాన్ని’ తొలుత ప్రత్యేక థీమ్ ఏమీ లేకుండానే నిర్వహించేవారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో వస్తున్న విశేష స్పందనను పరిగణలోకి తీసుకొని 1994 నుంచి ప్రత్యేక థీమ్‌తో వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారు. ‘ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచుకుందాం’ అనే తొలి థీమ్‌తో 1994లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి ఏడాదీ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. అవగాహన పొందడం చాలా ముఖ్యం.. ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ చాలామంది ఒత్తిడిలో కూరుకుపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చాలానే వెలుగుచూశాయి. ఈ విధంగా ఎందరో ప్రముఖులు సైతం తమ జీవితాలను కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాన్ని మానసిక అనారోగ్యం నాశనం చేస్తోంది. మ‌హిళ‌లు, పురుషులు, చిన్నా-పెద్దా అనే భేదం లేకుండా ఎంతోమందిని కుంగుబాటుకు గురిచేస్తోంది. అయితే.. వారిలో ఎంతమందికి వైద్యం అందుతోందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా, వైద్యం అందాలన్నా అవగాహన కలిగివుండడం చాలా ముఖ్యం. ఈ ఉద్దేశ్యంతోనే ప్రతి ఏడాది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  నిజానికి బాధ‌, కోపం, నిరాశ, ఆందోళ‌న లాంటి భావోద్వేగాలు అందరికీ ఉంటాయి. అయితే డిప్రెష‌న్ బాధితుల్లో ఇవి దీర్ఘ‌కాలం కనిపిస్తాయి. వీటిని గుర్తించి జీవితాన్ని ప్ర‌భావితం చేయకముందే వైద్యులను సంప్రదిస్తే మేలు జరుగుతుంది. లేదంటే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారు మన చుట్టూ మనతోపాటే ఉండొచ్చు. అలాంటి వారికి సరైన అవగాహన కల్పించడం ద్వారా వారి జీవితాన్ని కాపాడవచ్చు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే. దీనికి అనుగుణంగా ఈ ప్రత్యేకమైన రోజున మానసిక ఆరోగ్యంపై అవగాహన పొందాలి, నలుగురికి అవగాహన కల్పించాలి. ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే వారికి మానసిక ధైర్యం, సమస్యను ఎదుర్కొనే మార్గం సూచించాలి. మీతో మేమున్నామనే నమ్మకం వారికి కల్పించాలి. ఇలా చేస్తే ఈ ప్రపంచ మానసిక దినోత్సవానికి సార్థకత చేకూర్చినట్టు అవుతుంది. .  మానసిక ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకోవడానికి  ఈ కింది నాలుగు అంశాలు రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. తద్వారా హార్మోన్లను నియంత్రిస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మానసిక శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  సరైన నిద్రకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే నిద్ర గొప్ప ఔషధం. ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది.  సానుకూల దృక్పథంతో ఆలోచించడం వల్ల డిప్రెషన్ ను జయించవచ్చు. ఏ విషయాన్ని అయినా అన్ని కోణాల నుండి ఆలోచించాలి. నెగిటివ్ గా మాట్లాడేవారికి కూడా దూరంగా ఉండాలి. *నిశ్శబ్ద.  

సమాజసేవ ఎందుకు చేయాలి? దానికి అవసరమైనది ఏంటి?

ధైర్యానికి బలం అవసరం లేదు. ధైర్యం శారీరక బలం మీద ఆధారపడి లేదు. అది మనస్సుకు సంబంధించినది. ధైర్యానికి ఆలంబన శారీరక బలమే అయితే పులి, సింహం, ఏనుగు లాంటి అడవి జంతువులు ఈ ప్రపంచాన్ని ఏలి ఉండేవి. కానీ వాటి ముందు సోదిలోకి కూడా రాని మనిషి చిన్న కర్రపుల్లతో వాటిని ఆడిస్తున్నాడంటే బలం అనేది శారీరక పరిమాణంలోగానీ, దేహ దారుఢ్యంలోగానీ లేదని అర్ధమవుతోంది. పిరికితనాన్ని దరి చేరనివ్వకపోవడమే ధైర్యం. నిస్సహాయ స్థితిలో కూడా నీరుగారిపోకుండా ఉండడమే ధైర్యం. ధనవంతుడు ధైర్యవంతుడు కాదు. ధైర్యవంతుడే ధనవంతుడు. ధైర్యవంతులంటే క్రూరమృగాలను చంపినవారో, ఖూనీలు చేసినవారో కాదు. ఒక మంచిపని కోసం ముందు నిలిచిన వారు. పరిస్థితులు ఏవైనప్పటికీ, సహకరించేవారూ, అనుసరించే వారూ లేకపోయినప్పటికీ అనుకున్న కార్యం కోసం కార్యరంగం లోకి దూకినవారు. ఉత్తమ లక్ష్య సముపార్జనలో పూర్వాపర విపరిణామాలను లక్ష్యం చేయనివారు. కొల్లాయి ధరించిన గాంధీజీ ధనికుడు కాదు. బలాఢ్యుడసలే కాదు. భవిష్యత్తులో ఇంతమంది తనను అనుసరిస్తారనే భరోసా కూడా లేదు. ఆయన ధ్యేయం స్వాతంత్ర్య సముపార్జన. అంతే! మదర్ థెరెసా ఓ సామాన్య స్త్రీ. భారతదేశంలోని నిరుపేదలకూ, నిర్భాగ్యులకూ సేవ చేయాలనే ఆమె అంకితభావం ముందు ఏ అననుకూల పరిస్థితి నిలబడలేదు. స్వామి వివేకానంద ఘన చరిత్ర జగమెరిగినదే. విజయాలన్నిటా ఆయన ఆయుధం ధైర్యమే. ఆయన ప్రపంచానికిచ్చిన సందేశం కూడా అదే! మన దేశంలోని స్త్రీలు ఎంతో ధైర్యవంతులు. శారీరక దుర్భలత్వం వారి దృష్టిలోకే రాదు. బిడ్డలను పెంచే అత్యంత సుకుమారమైన లాలనల నుండి దేశాన్నేలే కఠినతరమైన కార్యాల వరకూ నిర్వహించే సామర్థ్యమున్న ధీశాలురు. కష్టనష్టాల కారణంగా కుటుంబం మొత్తం క్రుంగిపోయి ఉన్న సమయాలలో ఆ ఇంటి ఇల్లాలే ధైర్యంగా నిలబడి కుటుంబానికి ధైర్యం  నూరిపోస్తుంది. ఆ సంకట స్థితిని ఎదుర్కొనే స్ఫూర్తి కలిగిస్తుంది. కొత్త ఊపిరిలూదుతుంది. బిడ్డను కబళించడానికి వచ్చిన పులిని అచ్చు ఆడపులి లాగే ఎదుర్కొంటుంది స్త్రీ. నిజమైన పురుషత్వం ధైర్యమే! ధీరత్వమే! రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి స్త్రీ రత్నాలు శత్రువులకు సింహస్వప్నం అయ్యారంటే దానికి కారణం వారి కత్తులకున్న పదును కాదు, గుండెల్లోని ధైర్యం! అన్ని రకాలుగా అన్ని  కోణాల్లో ఈ సమాజానికి మనమెంతో సేవ చేయవలసి ఉంది. ఈ బాధ్యత మనం కొత్తగా తెచ్చిపెట్టుకోవలసినది కాదు. బరువుగా నెత్తికెత్తుకోవలసినది కాదు. జన్మతః వచ్చిన వారసత్వం. గౌరవంగా స్వీకరించ వలసిన కర్తవ్యం. ఈ కర్తవ్యం నెరవేర్చడానికి మనం పురుషులమా, స్త్రీలమా అనేది ప్రశ్నే కాదు. ధనికులమా, పేదలమా? బలాఢ్యులమా, బలహీనులమా? అన్న ప్రసక్తే లేదు. మనం మనుషులం, ఈ దేశ పౌరులం. అంతే! ఈ దేశం మన కుటుంబం అనుకుని ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందడుగేయాలి .                                             *నిశ్శబ్ద.

సమాచార వ్యవస్థలో బహుదూరపు బాటసారి.. పోస్టల్ సేవలు!

సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇప్పుడంటే రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్‌ని క్షణాల్లో సులువుగా గమ్యస్థానానికి చేరవేయగల వ్యవస్థలు ఎన్నో రూపుదిద్దుకున్నాయి. సామాన్యులు సైతం స్మార్ట్‌ఫోన్లు, టెలిఫోన్లు,  వందల సంఖ్యలో యాప్స్ ఇలా ఎన్నో సాధనాలు సమాచార వ్యవస్థ రూపురేఖల్నే మార్చేశాయి. కానీ ఇవేమీ లేని పూర్వ ప్రపంచానికి కొన్ని తరాలపాటు లేఖల ద్వారా విశిష్ట సేవలు అందించిన ఏకైక సాధనమే ‘పోస్టల్ వ్యవస్థ’. కుటుంబ సభ్యులు, ప్రియుమైన వ్యక్తులు, ప్రభుత్వప్రైవేటు వ్యవస్థల నుంచి శుభవార్తలైనా, చేదు సమాచారమైనా ఇంటి వద్దకే ఉత్తరాలు మోసుకొచ్చిన ఘనమైన చరిత్ర కలిగిన పోస్టల్ వ్యవస్థ దినోత్సవం నేడు. ‘వరల్డ్ పోస్టల్ డే’ అని కూడా అంటారు. గ్లోబల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు నాంది పలికిన పోస్టల్ వ్యవస్థ గొప్పదనం, ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు?. ఇందుకు కారణాలు ఏంటి? అంత ప్రాధాన్యత ఎందుకు? వంటి విశేషాలను తెలుసుకుందాం.. పోస్టల్ డే ఎందుకు?.. 1874లో ఏం జరిగింది? ప్రపంచదేశాల మధ్య కమ్యూనికేషన్ కోసం స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్ వేదికగా 1874 అక్టోబర్ 9న యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) ఏర్పాటైంది. UPU ప్రపంచంలోనే రెండవ పురాతన అంతర్జాతీయ సంస్థ కావడం విశేషం. ఇది ఏర్పాటైన తర్వాత ప్రపంచ దేశాల మధ్య పోస్టల్ రంగంలో విశిష్టమైన సహకారం పెరిగింది. ఆధునిక వస్తు,సేవలకు యూపీయూ ఏర్పాటు బాటలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా లేఖలు, సమాచార మార్పడి వృద్ధి చెందింది. గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవానికి నాంది పలికిన యూపీయూ ఏర్పాటైన అక్టోబర్ 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా 1969లో జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా జరిగిన యూపీయూ కాంగ్రెస్ నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు ప్రతి ఏడాది వేడుకల్లో పాల్గొంటాయి. ప్రాముఖ్యత ఏంటి? పోస్టల్ రంగంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడంతోపాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తపాలా రంగం అందిస్తున్న భాగస్వామ్యాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుచేయడమే లక్ష్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 9న అంతర్జాతీయ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ గతిలో పోస్టల్ వ్యవస్థ పాత్రను చాటి చెప్పేలా వేడుకలు నిర్వహిస్తారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యువకుల కోసం అంతర్జాతీయ లెటర్ రైటింగ్ పోటీ నిర్వహిస్తుంటుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక థీమ్‌తో వరల్డ్ పోస్టల్ డే వేడుకలకు నిర్వహిస్తోంది.  ‘‘ విశ్వాసం కోసం ఉమ్మడిగా: సురక్షితమైన, అనుసంధాన భవిష్యత్తు కోసం సహకారం’’ అనే థీమ్‌తో ఈ ఏడాది పోస్టల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఐరాస ప్రకటించింది. కాగా గతేడాది ‘ప్లానెట్ కోసం పోస్ట్’అనే థీమ్‌తో వేడుకలు నిర్వహించారు.  తపాలా దినోత్సవాన్ని అనేక మార్గాల్లో నిర్వహించవచ్చు. అనేక దేశాలు తపాలా కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాంపు సేకరణ, ప్రదర్శనలను చేపట్టనున్నాయి. పోస్టల్ చరిత్రపై వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నాయి. ఇక వ్యక్తిగతం కూడా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించవచ్చు.  ప్రియమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులకు లేఖలు రాసి పంపవచ్చు.. ఇలా చేస్తే సాంప్రదాయ పోస్టల్ వ్యవస్థ మీద అభిమానాన్ని చాటినట్టవుతుంది. అంతే కాదు.. ఏన్ని మాటలు ఫోన్లో అయినా, ఎదురుగా అయినా మాట్లాడినా అవన్నీ కొద్దిసేపటికే మరచిపోతారు. ఎంత గుర్తుంచుకున్నా కొన్నింరోజులు మాత్రమే వి గుర్తుంటాయి. కానీ ఉత్తరాల ద్వారా సాగే సంభాషణ ఆ కాగితాల్లో ఏళ్ల తరబడి అపురూపమైన జ్ఞాపకంగా ఉండిపోతాయి. అందుకే ఉత్తరాలకు గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. ఉత్తరాల కోసం  స్థానిక పోస్టాఫీసు సందర్శించాలి. అక్కడి సిబ్బందిని అడిగి పోస్టల్ చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు పోస్టల్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. తద్వారా ఉద్యోగులకు మద్దతు తెలిపినట్టవుతుంది. ఇలా చేయడం వల్ల వారిలో ఉత్సాహాన్ని నింపినట్టువుంది. ఇవీ పోస్టల్ డే విశేషాలు. మీ ప్రియమైన వారికి లేఖ రాయడం మరచిపోకండి మరి..!                                       *నిశ్శబ్ద.

భారత వాయుసేన గగన గర్జన.. యుద్ధమైనా, విపత్తయినా హీరోలా ఎంట్రీ..

శత్రు మూకలతో యుద్ధమైనా, ప్రకృతి విపత్తులతో పోరాటమైనా.. సాయం అడగకుండానే గగనం నుంచి ఆపన్నహస్తాన్ని చాచే మన హీరో ఎవరంటే ‘భారతీయ వాయుసేన’ (Indian Airforce). కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది సిపాయిలతో ప్రస్థానం ప్రారంభించి నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వాయుసేనగా భారతదేశానికి భరోసా, శత్రుదేశాలకు దడ పుట్టించగల సత్తావున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేడు 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది అక్టోబర్ 8న నిర్వహించే ఈ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే విశిష్టత, చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం. ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి.. భారత వైమానిక దళాన్ని స్థాపించిన తేదీ 8 అక్టోబర్ 1932ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే నిర్వహిస్తారు. నిజానికి భారత వైమానిక దళాన్ని బ్రిటీష్ పాలనాకాలం 1932లోనే స్థాపించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు సహాయక దళంగా భారత వాయుసేనను ఏర్పాటుచేశారు. మొదటి కార్యచరణ స్క్వాడ్రన్ ఏప్రిల్ 1933లో రూపుదిద్దుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పేరుకు ముందు రాయల్ అనే ట్యాగ్‌ను జోడించారు. అప్పటి నుంచి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా పిలిచేవారు. అయితే 1950లో భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తిరిగి ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ పేరును స్వీకరించారు. 1933లో కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది హవాయ్ సిపాయిలతో ఏర్పాటైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ క్రమక్రమంగా తన శక్తిసామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద క్రియాశీల వైమానిక దళంగా రూపుదిద్దుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  అనేక సేవలు అందించింది. అనేక యుద్ధాలలో పాలుపంచుకుంది. పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధాలు, చైనాతో జరిగిన ఒక యుద్ధం ఎంతో ముఖ్యమైనవి. ఒక్క యుద్ధాలే కాకుండా భారత భూభాగానికి అన్ని వేళలా పహారాకాయడం, గగనతలాన్ని సదా సంరక్షించడం, దేశ ప్రయోజనాలను కాపాడటంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో దేశానికి విశిష్టమైన సేవలు అందిస్తోంది. నిరంతరాయంగా నిస్వార్థ సేవలను దేశానికి అందిస్తోంది. వాయుసేన సేవలను గౌరవిస్తూ ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే ఘనంగా నిర్వహిస్తుంటారు. ఎంతో ముఖ్యమైన ఈ రోజున వైమానిక దళ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక వైమానిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. మరింత దృఢంగా, పటిష్టంగా.. భారత సాయుధ దళాలలో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి యుద్ధ, విపత్కర పరిస్థితులనైనా అలవోకగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా పటిష్టతపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా వాయుసేనలో అధునాతన టెక్నాలజీతో కూడిన విమానాలను ప్రవేశపెడుతోంది. విమానాల తయారీలో దేశీయ టెక్నాలజీ వినియోగించడంతోపాటు కొత్త సాంకేతికతతో కూడిన విమానాలను పలు దేశాల నుంచి సేకరిస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. మరోవైపు నియామకాలపై కూడా శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా వాయుసేన మహిళలకు కూడా విశిష్ట ప్రాధాన్యతను కల్పిస్తుండడం మనమంతా గర్వించదగిన అంశం. మొత్తంగా..  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దినోత్సవాన మన వాయుసేన మరింత పటిష్టంగా,  శత్రువులకు వణుకు పుట్టించేలా రూపాంతరం చెందాలని ఆకాంక్షిస్తూ ఎయిర్‌ఫోర్స్ హీరోలకు ఒక సెల్యూట్ చేద్దాం..                                           *నిశ్శబ్ద.

ప్రపంచం మీద తెల్లబంగారం మెరుపులు!!

ప్రపంచవ్యప్తంగా కోట్లాది మందికి జీవనోపాధి.. మానవాళి శరీరాన్ని సదా రక్షిస్తున్న దుస్తుల తయారీలో ముఖ్య ముడిపదార్థం..  ఫైబర్‌గా మాత్రమే కాకుండా ఆహారంగానూ అక్కరకొస్తున్న ఏకైక పదార్థం  ఒకటుంది. అదే ‘మనం తెల్ల బంగారం’గా పిలుచుకునే పత్తి. ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం అనేక విధాలుగా అందరికీ ఉపయోగపడుతూ మరింత అన్వేషణలకు మార్గం చూపుతున్న పత్తి  దినోత్సవం నేడు (అక్టోబర్ 7). రోజువారి జీవితంలో విడదీయరాని ప్రాధాన్యత ఉన్న పత్తిని కేవలం ఒక ముఖ్యమైన వస్తువుగా మాత్రమే పరిమితం చేయలేం. గ్రామీణ జనాభాకు జీవనోపాధి కల్పించడంలో పత్తి ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు, ముఖ్యంగా వెనుకబడిన ప్రదేశాల్లో పత్తి ఒక ముఖ్యమైన ఆదాయ, ఆర్థిక, ఉపాధి వనరుగా విశిష్ట గుర్తింపు పొందింది. మనవాళి జీవితాల్లో అంత ప్రముఖమైన పత్తి ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి సమాజంలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవత్సరం ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7న నిర్వహించే ఈ ప్రత్యేక రోజు ప్రాధాన్యతను ఏమిటో చూస్తే.. అసలు ఎలా మొదలైంది.. పత్తి దినోత్సవాన్ని నిర్వహించడం 2019లో ప్రారంభమైంది. సబ్-సహారా ఆఫ్రికాలోని బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలీ అనే నలుగురు ప్రధాన పత్తిసాగుదారులు ఇందుకు తోడ్పడ్డారు. వీరు నలుగురు 2012లో ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు ప్రతిపాదన చేశారు. 2019లో బెనిన్, బుర్కినా ఫాసో,చాడ్, మాలీల ప్రతిపాదనను ప్రపంచ వాణిజ్య సంస్థ స్వీకరించి మొదటి ప్రపంచ పత్తి దినోత్సవ వేడుకలను నిర్వహించింది. తొలిసారి జరిగిన ఆ వేడుకల్లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఆ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. దీంతో అప్పటి నుంచి పత్తి దినోత్సవం వేడుక కొనసాగుతోంది. పత్తి దినోత్సవం గమ్యం ఇదే.. ‘మేకింగ్ కాటన్ ఫెయిర్ అండ్ సస్టైనబుల్’ అనే థీమ్‌ను మూడవ అధికారిక పత్తి దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది. వ్యవసాయం నుంచి ఫ్యాషన్ వరకు ఆర్థికాభివృద్ధిలో పత్తి పోషిస్తున్న పాత్రపై అవగాహన కల్పించాలని ఐరాస ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యం, పేదరిక నిర్మూలన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ఉత్పాదక ఉపాధిని కల్పిస్తున్న పత్తి గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఐరాస లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఐక్యరాజ్యసమితి అధికారిక వెబ్‌సైట్‌ చెబుతోంది. మెరుగైన ఉత్పత్తి, పౌషకాహారం, మెరుగైన పర్యావరణం, మెరుగైన జీవితం కోసం పత్తిరంగం పునరుద్ధరణను పత్తి దినోత్సవం గుర్తుచేస్తుంది. పత్తి దినోత్సవం లక్ష్యం సాకారం కావాలని సగటు పౌరులుగా అందరూ ఆశించాలి. ఇక  పత్తికి సంబంధించిన   రెండు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటే.. 1. ఒక టన్ను పత్తి సగటున 5 మందికి ఏడాది పొడవునా ఉపాధిని అందిస్తుందని అంచనాగా ఉంది. 2. వస్త్రాలు, దుస్తులలో ఉపయోగించే ఫైబర్‌తో పాటు ఆహార ఉత్పత్తులను పత్తి నుండి సేకరించవచ్చు. పత్తి విత్తనాల నుంచి తినదగిన నూనె, పశుగ్రాసం సేకరించవచ్చు.                                           *నిశ్శబ్ద.  

చిన్న చిరునవ్వు చాలు మనిషి జీవితాన్ని పాజిటివ్ గా మార్చడానికి..

‘ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు. ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు’ అన్నాడు ఓ సినీగేయ రచయిత. ‘‘చిరునవ్వుతో శాంతి మొదలవుతుంది’’ అని చాలా గొప్ప మాట చెప్పారు మదర్ థెరిసా. నవ్వుకు ఉన్న శక్తి అలాంటిది మరి. చిన్న చిరునవ్వు స్నేహ బంధాలకు అంకురార్పణ చేస్తుంది. దూరమైనవారు దగ్గరవుతారు. నవ్వితే నవరత్నాలు అనే మాట ఏమో కానీ హాయిగా నవ్వితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వడం మనిషికి నూతనోత్తేజాన్ని ఇవ్వడమే కాదు రోజంతా ఆహ్లాదకరంగా ఉండేందుకు బాటలు వేస్తుంది. చుట్టుపక్కల ఉన్నవారిలో కూడా పాజిటివ్ శక్తిని నింపే శక్తి నవ్వుకుంది. నవ్వడం మొదలెడితే ఆందోళనలు ఆమడ దూరం పారిపోతాయి. అంతెందుకు ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చే సులభమైన ఆయుధమే నవ్వు. అసలు నవ్వు గురించి ఇంతలా ఇప్పుడెందుకు చర్చించాల్సి వచ్చిందో  తెలుసా?  ఎందుకంటే నేడు (శుక్రవారం) ప్రపంచ నవ్వు దినోత్సవం ( World smile day). ప్రతి వ్యక్తి ఆనంద క్షణాల్లో తనతోపాటే ఉండే నవ్వు గురించి,  అక్టోబర్ 6నే ప్రపంచ నవ్వు దినోత్సవంగా ఎందుకు నిర్వహించుకుంటారు? అనే అంశాలను గురించి ఎంతమందికి తెలుసు??  ఆనందాన్ని, దయను వ్యాపింపజేసే సామర్థ్యమున్న నవ్వు గురించి, ప్రపంచమంతా జరుపుకునే నవ్వు దినోత్సవం గురించి  వివరాలు తెలుసుకుంటే.. అసలు ఎలా మొదలైందంటే.. నవ్వు దినోత్సవం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.  మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌కు చెందిన హార్వే బాల్ అనే కమర్షియల్ ఆర్టిస్ట్ 1963లో స్మైలీ ఫేస్ సింబల్‌ని రూపొందించారు. నవ్వుతూనే దీనిని తయారు చేయడం విశేషం. ప్రజలు ఎల్లప్పుడూ నవ్వుతూ దయ, సంతోషాన్ని మరింత వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో 1999లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అక్టోబర్ నెలలో మొదటి శుక్రవారాన్ని నవ్వు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.  వ్యక్తుల నేపథ్యంతో సంబంధం లేకుండా ఇతరులకు చిరునవ్వు పంచాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా దీనిని నిర్వహిస్తారు. ప్రాముఖ్యత ఇదే.. ప్రపంచ చిరునవ్వు  దినోత్సవం నిర్వహించుకోవడానికి ఆ నవ్వులో దాగివున్న శక్తే కారణం. చుట్టుపక్కలవారిని చూసి నవ్వడం, నవ్వించడం, దయాగుణంతో కూడిన  చర్యలు. స్నేహపూర్వక, సహకార,  సానుకూలతను ప్రోత్సహించవచ్చు. అంతేకాదు ఎవరి రోజునైనా నవ్వు ప్రకాశవంతం చేయడానికి తోడ్పడుతుందని గమనించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సాధారణ చిరునవ్వు ఎంతోకొంత శక్తినిస్తుందని గమనించాలి. అందుకే ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన మీకు తెలిసినవారిని నవ్వించండి. నవ్వమని చెప్పండి. ఎవరి మీద అయినా కోపాలు, అలకలు ఉంటే వారి ముందు మనస్పూర్తిగా నవ్వి చూడండి. నిజంగా మనుషుల మధ్య అపార్థాలు, అపోహలు, గొడవలు అన్ని మంత్రమేసినట్టు మాయమైపోతాయి.  పసిపిల్లల నవ్వును కల్మషం లేనిది అంటారు. మనసులో ఏమీ పెట్టుకోకుండా నవ్వడం పిల్లలలో ఉన్న గొప్ప గుణం. ప్రతి మనిషి ఇలా నవ్వగలిగితే ఆ వ్యక్తి ఉన్నతవ్యక్తిత్వం కలిగిన వాడిగా రూపాంతరం చెందుతాడు.  స్నేహితులను, కుటుంబ సభ్యులను హాయిగా  నవ్వించే ప్రయత్నం కుటుంబాన్ని, బంధాలను దృఢంగా మారుస్తుంది. కేవలం కుటుంబంతో ఆగిపోకుండా సామాజిక మాధ్యమాల ద్వారా  నలుగురిని నవ్వించే ప్రయత్నం చేయవచ్చు. లాఫింగ్ క్లబ్బులు తరహాలో సన్నిహితులు, మిత్రులు అందరూ కలసి సరదాగా నవ్వు దినోత్సవానికి కితకితలు పెట్టొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నవ్వు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులను నొప్పించే పద్దతిలో నవ్వు సృష్టించడం వల్ల పెద్ద అనర్థాలే జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యంగా నవ్వాలి, ఆరోగ్యంగా నవ్వించాలి. ఓ కవి  చెప్పినట్టు "నవ్వడం  భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం". గుర్తుపెట్టుకోండి మరీ..                                               *నిశ్శబ్ద.

మూగజీవాల మనుగడ కోసం మానవుడి స్వరం..

ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.

ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటారు చాణక్యుడు..!!

చాణక్య నీతిలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రస్తావించారు. జీవితంలో  ఏది సరైనది...ఏది తప్పు అని నిర్ణయించుకోవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కానీ కొన్ని పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్య చెప్పారు. అవేంటో చూద్దాం.  ఆచార్య చాణక్యుడు మానవ ప్రవర్తనను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతను తన చాణక్య నీతిలో అనేక సూత్రాలను వ్రాసాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి  అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తన నీతి శాస్త్రంలో, ఒక వ్యక్తి ఎవరికీ సమాధానం ఇవ్వకూడదు..వాగ్దానం చేయకూడదు లేదా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మూడు పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. లేకుంటే ఆ వ్యక్తి దాని చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు వాగ్దానం చేయకూడదు? ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకంటే  సంతోషంగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలను ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ పరిస్థితిలో ఎవరికీ సమాధానం చెప్పవద్దు: మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల, మీకు కోపం వచ్చినప్పుడు ఓపికపట్టండి.  నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు, దాని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి, చాణక్య నీతి ప్రకారం, దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  

పేదరికం ఉంటే జీవితంలో ఎదగలేమనే నిరాశతో ఉన్నారా..

అంగవైకల్యం ఉన్నా అనుకున్నది సాధించగలమేమో   కానీ, ఆలోచనలకు వైకల్యం వస్తే దేన్నీ సాధించలేం. కాబట్టి పేదరికం ఒక శాపమని ఊహించుకొని శిలలా మారిపోవడం కన్నా, అదీ ఒక వరమేనని భావించి చైతన్యవంతంగా మారడం ధీరుని లక్షణం. నిజానికి పేదరికం శాపం కాదు. అది  కార్యసిద్ధికి సహకరించే ఒక సాధనం. జీవితంలో మహోన్నత స్థితికి ఎదిగిన మహాత్ముల్లో ఎంతోమంది పేదరికపు కడలిని దాటినవారేనన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఉదాహరణకు గణిత శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలు చేసి విదేశీయుల్ని సైతం అబ్బురపరిచిన యువకుడు శ్రీనివాస రామానుజం; బాల్యంలో వార్తాపత్రికల్నీ, కిరాణా సామాగ్రినీ అమ్ముతూ చదువు కొనసాగించి గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచిన 'భారతరత్న' అబ్దుల్ కలామ్ - ఆ పేదరికపు కొలనులో వికసించిన కుసుమాలే. అలాగే అబ్రహామ్ లింకన్, టంగుటూరి ప్రకాశం, కందుకూరి వీరేశలింగం, డాక్టర్ అంబేద్కర్ మొదలైన వారు కూడా పేదరికాన్ని ప్రగతికి సోపానంగా మలచుకొని విజయాలను సాధించినవారే. success, not as a reason for failure. The full scope of our ability and ingenuity is usually only called forth by problems. - R.J. Heathorn 'కష్టాలు మనలోని అంతర్గత శక్తిని వ్యక్తపరిచేందుకు తోడ్పడేవే కానీ అపజయాలకు గురిచేసేవి కావు' అని సానుకూల దృక్పథంతో ధైర్యంగా ముందుకు సాగిపోవడమే సరైన మార్గం.  మనస్సుంటే మార్గాలెన్నో! కాబట్టి ముందు మన మనస్సుకు నిరాశ అనే అంటువ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి.  స్వామి వివేకానంద ఇచ్చిన ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే ధైర్యంగా ముందుకు సాగడానికి తగినంత ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. Fire and enthusiasm must be in our blood... Think not that you are poor, that you have no friends. Ay. who ever saw money make the man? It is man that always makes money. - Swami Vivekananda పేదరికం వల్ల పస్తులుంటున్న  కుటుంబాలకు  ఆర్థికంగా సహాయపడడం  కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరి  ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఏ చిన్న పనైనా చేస్తూ డబ్బు సంపాదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చు. అలా పనిచేస్తూనే యువత చదువు కూడా కొనసాగించవచ్చు. చదివే పిల్లలు డబ్బు సంపాదించకూడదు అనే నియమం ఎక్కడా లేదు. పైన చెప్పుకున్న గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని శ్రమిస్తే అప్పుడు శారీరక లోపం అయినా,  పేదరికం అయినా  శాపం కాదనీ, అది మీలో ఉన్న నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ నిరూపించడానికి ఒక అవకాశమనీ అర్థమవుతుంది.  అలాంటివారు జీవితంలో తప్పకుండా విజేతలు అవుతారు.                                          *నిశ్శబ్ద.

శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.                                                 *నిశ్శబ్ద.