Read more!

పుత్రులు ఉదయించే సూర్యులు కావాలంటే...

పుత్రోత్సాహము తండ్రికి 

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు. జనులా

పుత్రుని గనుగొని పొగడగ 

బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతీ!!

అంటాడు సుమతీ శతకకర్త. 

ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును. అని వె పద్య భావం. 

సమాజంలో ముఖ్యంగా భారతీయులలో మగపిల్లాడు అంటే వంశాకురమని, వారసత్వం ఉండాలంటే మగపిల్లలే మూలమని భావిస్తారు. దానికి అనుగుణంగా భారతీయ మనస్తత్వాలు కూడా ఉంటాయి. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు అనేది భారతీయులు విశ్వసించే మాట. అయితే మగపిల్లాడు పుట్టగానే ఏ తండ్రి సంతోషపడడు. ఆ కొడుకు ప్రయోజకుడై సమాజం ఆ కొడుకును పొగిడినప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఇప్పుడు కొడుకుల గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అనిపిస్తుంది. 

ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీన ఇంటర్నేషనల్ సన్స్ డే జరుపుకుంటారు. ఈ international sons day ని మార్చ్ 4వ తేదీన మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 28వ తేదీ కూడా జరుపుకుంటారు. 

పుత్రుల దినోత్సవం ఎందుకు?? 

ఇప్పటి కాలంలో మగపిల్లలను కలిగున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది?? మగపిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్న సంఘటనలు చాలా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సమాజంలో తల్లిదండ్రులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న మగపిల్లలు వారి తల్లిదండ్రుల బాధకు, కష్టాలకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకోలేని నిర్లక్ష్యంలో ఎంతోమంది సుపుత్రులు ఉన్నారు. 

మగపిల్లల ప్రవర్తన ఏదైనా సరే అది తల్లిదండ్రుల ఆలోచనలు, వారి పెంపకం, వారు మగపిల్లలకు ఇస్తున్న స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలోనూ, కుర్రాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొడుకులకు ఇచ్చే స్వేచ్చనే వారిని పెద్దయ్యాక నిర్లక్ష్య వ్యక్తిత్వం కలవారిగా మారుస్తుంది. 

మగాడికేంటి పుట్టగోచి పెట్టుకుని బయటకు వెళ్లగలడు నువ్వు అలాగ వెళ్తావా అనేది చాలామంది ఆడ, మగపిల్లలు ఉన్న ఇళ్లలో ఆడపిల్లలను ఉద్దేశించి తల్లులు చెప్పే మాట. కొడుకుల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో అంతకు మించి బాధ్యత కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతను వదిలిపెట్టి మగజాతి అంటేనే ఏదో బాధ్యతలు మోసుకుతిరిగే వర్గమని, వారికి ఏ విషయం చెప్పక్కర్లేదులే అని అనుకుంటే బాధ్యత లేని కొడుకులను తయారుచేసినట్టే..

ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎంత ఖర్చు చేశావ్, దేనికోసం ఖర్చు చేశావ్?? ఎందుకింత లేటుగా వచ్చావ్?? మగపిల్లలతో మాటలేంటి?? పద్దతిగా, బుద్దిగా ఉండు. వంటి మాటలు మీ కూతుళ్లకు చెప్పేముందు కొడుకులకు కూడా ఇంకొంచెం గట్టిగా, అంతకు మించి బాధ్యతగా చెప్పండి. అడిగిందల్లా చేతిలో పెడుతూ ఆడపిల్లలకు ఎందుకులే డబ్బు వంటి మాటలు కట్టి పెట్టి మగపిల్లలకు కూడా డబ్బు విషయంలో కట్టడి చేయండి. ఇలా చేస్తే డబ్బు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం వారికి కూడా అర్థమైతుంది. సులువుగా చేతిలోకి డబ్బు వస్తుంటే ఎవరికి అయితే విలువ అర్థం కాదు.విలువ అర్థం కానప్పుడు మనుషుల కష్టం, మనుషుల విలువ కూడా వారికి తెలియదు. 

ప్రస్తుత కాలంలో కొడుకులు ఉండీ వృద్ధాశ్రమాలలో బ్రతుకు వెళ్లదీస్తున్న పెద్దలను గుర్తు చేసుకొని అయినా మగపిల్లలకు విలువలు, బాధ్యతల గురించి చెప్పండి. మీ కొడుకులు పెడదోవ పడితే వారిని అందరూ నిందిస్తుంటే బాధపడేది మీరే.. కాబట్టి అబ్బాయిలకూ మంచి నడవడిక నేర్పించండి. అప్పుడే వారు ఉదయించే సూర్యుడిలా తల్లిదండ్రుల కళ్ళకు వెలుగు పంచగలడు.

                                   ◆నిశ్శబ్ద.