Read more!

మంచి నిద్రకు అద్భుతమైన మందు!!


ఈ కాలంలో హాయిగా నిద్రపోవడం కూడా అదృష్టమే. ఎంతో మంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. నిద్ర పట్టాలని ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఏవీ చక్కని పలితాన్ని ఇవ్వవు. కొందరు ధ్యానం అంటారు అయిదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. మరికొందరు ఒత్తిడి అంటారు దానివల్ల నిద్రలేమి అంటారు దాని కోసం డాక్టర్లను సంప్రదిస్తారు. మందులు వాడుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అలా మందుల వల్ల నిద్రకు అలవాటు పడి తరువాత వాటిని వాడటం ఒక్కరోజు ఆయన ఇక నిద్ర ఖరాబ్. మళ్లీ నిద్ర రాదు, పట్టదు. ఇంకొందరికి ఆలోచనలు.  జీవితం గూర్చి, భవిష్యత్తు గూర్చి.మరికొందరికి ఓర్వలేనితనం వల్ల నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఆస్చశ్రయంగా అనిపించినా ఇది నిజం. ఒకరు ఎదుగుతున్నారంటే భరించలేని వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇదే కోవకు చెందినవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొందరు అయితే చాటింగ్ లు, బ్రౌజింగ్ లు, అనవసరపు పనులు చేస్తూ చేతులారా నిద్రను దూరం చేసుకుంటారు. ఇట్లా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు. నిద్ర పట్టకపోవడానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అయితే నిద్రకు ఒక చక్కని మందు ఉంది. అదేంటో తెలియాలి అంటే కింద విషయం చదవాలి.

అనగనగా ఒకరాజు. ఆయన గొప్పవాడు. రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు లేనిది ఒకటే నిద్ర. నిద్ర పట్టదు. పరుపు మీద పడుకుని దొర్లి దొర్లి పెడతాడు. కానీ నిద్ర రాదు. ఒకరోజు రాత్రిపూట నిద్రపట్టక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటకు ఆనుకుని అడవి ఉంది. ఆ అడవి నుండి ఆ వేళ ఏదో శబ్దం వస్తోంది. ఈ సమయంలో ఎవరో చూడాలి అనుకుని తోట నుండి అడవిలోకి వెళ్ళాడు రాజు. ఆ అడవిలో ఒక వ్యక్తి చెట్టు నరుకుతూ కనిపించాడు. వెన్నెల వెలుగు ఉండటంతో పని జరుగుతోంది. 

"నువ్వు రాత్రిపూట నిద్రపోకుండా చెట్టు నరుకుతున్నావు. నీకు నిద్ర పట్టదా" అని అడిగాడు రాజు.

రాజు సాధారణ బట్టలు వేసుకుని ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని రాజు అనుకోలేదు. "ఎందుకు రాదు అలా పడుకుంటే కొన్ని సెకండ్లలోనే .శవం మాదిరి నిద్రపోతాను. కానీ పని జరిగితేనే డబ్బులొస్తాయి. కాబట్టి తప్పదు పని చేయాలి" అన్నాడు ఆ వ్యక్తి.

"ఏంటి సెకండ్లలోనే నిద్ర వచ్చేస్తుందా నేను నమ్మను" అన్నాడు రాజు.

"నమ్మకపోతే నేను ఏమి చేయలేను" అన్నాడు ఆ వ్యక్తి.

"ఒకపని చేద్దాం. నేను నీ బదులు చెట్టు నరుకుతాను. నువ్వు సెకండ్లలోనే నిద్రపోతా అన్నావుగా నిద్రపో చూద్దాం" అన్నాడు రాజు.

ఆ వ్యక్తి సరేనని గొడ్డలి రాజుకు ఇచ్చి చెట్టుకింద అలా పడుకుని నిమిషంలోపలే గురక పెట్టి నిద్రపోయాడు.

"పట్టు పరుపులు, మెత్తని దుప్పట్లు అన్ని ఉన్నా నాకు నిద్ర రాదు. వీడు చెట్టు కిందనే ఇట్లా ఎలా నిద్రపోయాడు" అనుకున్నాడు రాజు. ఆ తరువాత వాడికి మాట ఇచ్చాను కాబట్టి చెట్టు నరకాలి అనుకుని చెట్టు నరికేసాడు. అలవాటు లేని పని అవ్వడం వల్ల చేతులు బొబ్బలెక్కాయి. చెమటతో శరీరం తడిసి ముద్దయ్యింది.అలసట కలిగింది. కాళ్ళు, చేతులు లాగేసాయి. మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడి పక్కనే అలా నడుము వాల్చాడు. నిమిషంలోపలే హాయిగా నిద్రపోయాడు.

ఉదయాన్నే రాజుకు మెలకువ రాగానే అనుకున్నాడు. మనిషికి శారీరక కష్టమే మంచి నిద్రను ప్రసాదిస్తుంది అని. 

కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నిద్ర కావాలి అంటే కష్టపడి పనిచేయాలి. దురదృష్టం కొద్దీ ఈ కాలంలోప్రతి ఇంట్లో పని దొంగలు ఎక్కువ ఉంటున్నారు. పని మనుషులను పెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. మనిషి శరీర ఆరోగ్యానికి, మంచి నిద్రకు ఏ వైద్యుడు ఇవ్వలేని గొప్ప ఔషధం కష్టం. అందుకే కష్టపడాలి. నష్టం ఏమి ఉండదు.

◆ వెంకటేష్ పువ్వాడ