నేటికాలంలో అధికారుల తీరు ఎలా ఉంది?

మనిషి ఎంతటి నీచుడైనా, పిరికిపంద అయినా, రాజసేవకుడైతే అతడిని ఎవరూ అవమానించలేరు. ఇది లోకరీతి, "నువ్వు గొప్ప పని సాధించకున్నా పరవాలేదు, గొప్పవాడి పక్కన నిలబడితే చాలు వాడి గొప్ప కొంత నీకూ అంటుకుంటుంది" అని ఓ సామెత ఉంది. అందుకే బలహీనులు, చేత కానివారు, స్వయంగా ఏమీ సాధించలేనివారు శక్తిమంతుడి చుట్టూ చేరాలని ప్రయత్నిస్తారు. శక్తిమంతుడి పంచన చేరి, అతడి శక్తి ద్వారా తమ పనులు సాధించుకోవాలని చూస్తారు. తమకు లేని గొప్పను ఆపాదించుకోవాలని చూస్తారు. అధికారి అహాన్ని సంతృప్తి పరచి, అతడి నమ్మకాన్ని పొందుతారు. ఆపై, అధికారి దగ్గర తమకున్న ప్రాబల్యాన్ని ప్రకటిస్తూ, ఇతరులను భయపెట్టి తమ ఆహాన్ని సంతృప్తి పరచుకుంటారు. ఇటువంటివారిని గుర్తించటం కష్టం. కానీ ఇటువంటి వారిని చేరదీయటం వల్ల అధికారి ఎంత మంచివాడైనా చెడ్డ పేరు సంపాదిస్తాడు. పాలను గలసిన జలమును బాల విధంబుననే యుండు, బరికింపంగా,  బాల చవి జెరుచు, గావున  బాలసుడగువాని పొందు వలదుర సుమతీ! పాలతో కలిసిన నీరు పాలలాగే ఉంటుంది. కానీ పాల రుచిని పోగొడుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం వల్ల మంచి గుణాలు పోతాయి. కాబట్టి అంతరంగికులను ఎన్నుకునే విషయంలో అధికారి ఎంతో జాగరూకత వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆఫీసుల్లో పనివారిని రెండు రకాలుగా విభజించవచ్చు. పని చేయనివారు ఒక రకం. వీరితో పని చేయించటం బ్రహ్మతరం కూడా కాదు. పని చేసేవారు రెండో రకం. వీరిని పని చేయకుండా ఉంచటం బ్రహ్మతరం కాదు. అయితే పని చేయనివారిని మరి కొన్ని రకాలుగా విభజించవచ్చు. పనిచేయగలిగి చేయనివారు ఒకరకం. పని చేయలేక చేయనివారు ఇంకో రకం. అలాగే పనిచేసే వారిలో, ఎదుటివాడి గురించి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయేవారో రకం, తాము పనిచేస్తూ ఎదుటివాడు పని చేయటం లేదని ఏడుస్తూ పని చేసేవారు ఒక రకం, తమపనికి గుర్తింపు లభించటం లేదని బాధపడుతూ పనిచేసేవారు ఇంకో రకం. ఇటువంటి వారందరినీ వారివారి మనస్తత్వాలను అనుసరించి వ్యవహరిస్తూ నియంత్రించవచ్చు. కానీ.. ప్రమాదకరమైన ఇంకో రెండు రకాల పనివారున్నారు ఉంటారు.  వీరు పని చేస్తున్నట్టు నటిస్తారు, నమ్మిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. ఆఫీసర్ విశ్వాసం సంపాదించిన తరువాత ఎదుటివారిమీద పితూరీలు చెప్తారు. ఎదుటివారిని తక్కువ చేయటం వల్ల తమ ఆధిక్యాన్ని చాటుకుంటారు. మరో ప్రమాదకరమైనవారు, పనిచేస్తారు. కానీ పనిచేస్తూ వక్రకార్యాలకు పాల్పడుతారు. వక్రమార్గంలో ప్రయాణిస్తారు. తమ అక్రమచర్యల నుండి రక్షణ పొందేందుకు ఆఫీసర్ను ఆశ్రయిస్తారు. అతడికి సేవలు చేస్తారు. అవసరమైనవి అడగకుండానే అందిస్తారు. ఆఫీసరు అడుగులకు మడుగులొత్తుతారు. విశ్వాసం సంపాదిస్తారు. తద్వారా తమ పనులు సాధించుకుంటారు. ఈ రెండు రకాల మనుషుల వల్లా అధికారికి చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇటువంటివారే అధికారులకు దగ్గరవటం జరుగుతుంది. ఎందుకంటే, పని చేసేవాడికి స్వతహాగా ఉండే ఆత్మవిశ్వాసం వల్ల వాడు ఎవరి ప్రాపు సంపాదించటానికీ ఇష్టపడడు. తనను ప్రజలు గుర్తించాలని ఆరాటపడకుండా రత్నం ఎలా భూమిలోనే ఉండిపోతుందో, అలా వీరు కూడా ఆఫీసర్ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇందుకు భిన్నంగా, ఆఫీసరు దృష్టిని ఆకర్షించాలని, దగ్గరవ్వాలని ప్రయత్నించే వారికి స్వలాభాలుంటాయి, ఉద్దేశ్యాలుంటాయి.  కానీ అధికారిలో ఉన్న అహం, తన ప్రాపు కోసం తాపత్రయపడేవారిని చూసి సంతృప్తి చెందుతుంది, వారే ఇష్టులవుతారు. తమని లెక్క చేయని పనివారంటే ఆఫీసర్లో కోపం కలుగుతుంది. అతడి అహం దెబ్బ తింటుంది. తన చుట్టూ చేరినవారి ప్రభావంతో, తప్పు అని తెలిసి కూడా, పని చేసేవారిని బాధించాల్సి వస్తుంది. చెడ్డ పేరు మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది నేటికాలంలో అధికారుల తీరు.                                      ◆నిశ్శబ్ద.

ఆలోచన గురించి జిడ్డు కృష్ణమూర్తి మాటలు!

మన జీవితాలలో ఆలోచన ఎందుకంత ప్రముఖపాత్ర వహిస్తుంది? ఆలోచన అంటే భావనలు, మెదడు కణాలలో పేరుకొని పోయిన జ్ఞాపకాల ప్రతిస్పందనలు. బహుశ  చాలమంది ఇంతవరకు ఇటువంటి ప్రశ్న వేసుకోకొకపోయి ఉండవచ్చు. ఒకవేళ వేసుకున్నా. ఇదంతా ముఖ్యమయినది కాదు. ముఖ్యమయినది భావోద్వేగం! అనుకుని వుంటారు. అయితే, యీ రెంటినీ వేరు చేయడం ఎలాగో ఆలోచన, రాగభావానికి కొనసాగింపు ఇవ్వకపోయినట్లయితే, ఆ భావన త్వరలోనే క్షీణించి పోతుంది. కాబట్టి - మన నిత్య జీవితాలలో, తిరుగుడు రాళ్ల మధ్య నలిగిపోతూ, భయ విహ్వలమయిన జీవితాలలో ఆలోచన ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుంది? ఎవరికి వారు ప్రశ్నించుకుని చూడాలి. మనిషి ఆలోచనకు ఎందుకు బానిస అయిపోయాడు? మోసకారి, తెలివి అయినది, అన్నిటినీ అమర్చేది, ప్రారంభంచేసేది, అన్వేషించి పెట్టేది, యుద్ధాలను తీసుకువచ్చింది, భయోత్పాతాన్ని సృష్టించినది, ఎంతో ఆదుర్దాను క్షణక్షణమూ రూపకల్పనలు చేస్తున్నది, తన తోకను తానే మింగుతున్నది,  నిన్నటి సుఖాలలో ఓలలాడుతూ ఆ సుఖాలను నేడు రేపు కూడా కొనసాగించేది,  ఆలోచన ఎప్పుడూ చురుకయినది, కబురు చెబుతుంది, కదులుతుంది, నిర్మాణం చేస్తుంది. తీసుకుపోతుంది, అదనంగా కలుపుతుంది, ఏవేవో అనుకుంటుంది! భావనలు మనకు ఆచరణకంటే ముఖ్యమయిపోయినాయి, అనేక క్షేత్రాలలో పాండిత్యం సంపాదించిన మహా విజ్ఞానులు వ్రాసిన పుస్తకాలలో చాతుర్యంతో వెలిబుచ్చిన అభిప్రాయాలు చాల మోసకారి, సూక్ష్మమయిన ఈ భావనలను మనం ఆరాధిస్తున్నాం. పుస్తకాలను పూజిస్తున్నాం. మనమే ఆ పుస్తకాలం. మనమే ఆ అభిప్రాయాలు. వాటితో చిక్కగా నిబద్దులమయి పోయాం. భావాలను ఆదర్శాలను ఎప్పుడూ చర్చించుకుంటూ తార్కికంగా ఉద్దేశ్యాలు వెలిబుచ్చుతున్నాం. ప్రతి మతానికి తనదే అయిన విశ్వాసము, సూత్రము, భగవంతుళ్లను చేరుకునే మూసకట్టు వున్నాయి. ఆలోచన ప్రారంభాన్ని గురించి చూస్తున్నప్పుడు యీ భావనల కట్టడాన్నే ప్రశ్నిస్తున్నాం. భావాలను చర్యలనుంచి వేరు చేశాం. ఎందుకంటే, భావనలు ఎప్పుడూ గతానికి చెందినవి. ఆచరణ వర్తమానానికి సంబంధించినది. అంటే, జీవితం ఎప్పుడూ వర్తమానంలోనే వుంటుంది. మనకు జీవించడం భయం కాబట్టి గతం భావనల రూపంలో మనకు అత్యంత ముఖ్యమయినది అయిపోయింది. మన ఆలోచన విధానాన్ని గమనించడం ఆసక్తిదాయకంగా వుంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఆలోచన అనుకుంటున్న ప్రతి చర్య ఎక్కడనుంచి బయలుదేరుతోంది? తప్పనిసరిగా జ్ఞాపకం నుంచే కదూ! ఆలోచించటానికి ప్రారంభం అంటూ ఉందా? ఉంటే, దానికి మనం పట్టుకోగలమా అంటే, జ్ఞాపకం యొక్క ప్రారంభం ఎందుకంటే మనకు జ్ఞాపకశక్తి అంటూ లేకపోతే ఆలోచనలే వుండవు. ఆలోచన ఏ రకంగా నిన్నటి ఒక సుఖానికి బలం చేకూర్చి కొనసాగింపు ఇస్తుందో సుఖానికి వ్యతిరేకమయిన దుఃఖం, భయాలను సైతం కొనసాగించడం కూడా కల్పిస్తుంది.  అనుభవించేవాడు వాడే ఆలోచించేవాడు. తానే ఆ సుఖము, దుఃఖము అయి, వాటిని పెంచి పోషించేవాడు అవడము కూడా చూపెడుతుంది.  ఆలోచన చేస్తున్నవాడు సుఖాన్ని బాధనుండి వేరు చేస్తాడు. సుఖాపేక్షలోనే దుఃఖము, బాధ, భయాలకు ఆహ్వానం ఇమిడి వున్నదని గమనించడు. మానవ సంబంధాలలో ఆలోచన ఎప్పుడూ సుఖాన్ని కోరుతోంది. దీనికి అనేక పేర్లు ఇస్తుంది. విశ్వాసం, సహాయం, దానం పోషణ, సేవ ఇలా.  మనం ఎందుకు సేవించాలనుకుంటున్నామో! పెట్రోల్ స్టేషన్ మంచి సేవలను అందిస్తుంది. ఈ మాటల అర్థం యేమిటి,  సహాయం, ఇవ్వడం, సేవలు చేయడం? ఇదంతా యేమిటి? సౌందర్యంతో, తేజస్సుతో, సౌకుమార్యంతో నిండిన కుసుమం నేను ఇస్తున్నాను, సహాయ పడుతున్నాను, సేవిస్తున్నాను' అని ప్రకటిస్తుందా? అది వుంటుంది, అంతే. అది యేమీ చేయటానికి ప్రయత్నం చేయదు గనుక భూమి అంతా ప్రసరిస్తుంది. ఆలోచన చాల మోసకారి, తెలివయినది. తన సౌకర్యం కోసం దేన్నయినా వికృత పరచగలదు. సుభాపేక్షతో విర్రవీగే ఆలోచన తన దాస్యాన్ని తానే తెచ్చుకుంటుంది. ఆలోచన ద్వంద్వ ప్రకృతిని తీసుకు వస్తుంది. మన సంబంధ బాంధవ్యాలలో, మనలో సుఖాన్ని తీసుకు వచ్చే హింస ఉంది, దయగా ఉదారంగా వుండాలనే కోరిక వున్నది. మన జీవితాలలో యెప్పుడూ జరుగుతున్నది యిదే. ఆలోచన యీ ద్వైతభావాలను తీసుకురావడం, వైరుధ్యాన్ని ప్రవేశపెట్టటమే కాక, అసంఖ్యాకంగా జ్ఞాపకాలను పోగు చేసుకుంటుంది. సుఖమూ బాధలతో కూడిన ఈ జ్ఞాపకాలద్వారా అది పునరుజ్జీవనం పొందుతుంది. కనుక ఆలోచన గతానికి చెందినది. పాతది.                                      ◆నిశ్శబ్ద.

దుఃఖాన్ని అంతమొందించే తాళం చెవి ఎక్కడుంది??

మనిషిని కదిలించేవి భావోద్వేగాలు. ప్రేమ, బాధ, దుఃఖం, అసూయ, ద్వేషం ఇవన్నీ విభిన్నమైన భావోద్వేగాలు. అయితే వీటిలో మనిషి ఎక్కువగా ప్రేమకు, దుఃఖానికి, కోపానికి తొందరగా చలించిపోతూ ఉంటాడు. దుఃఖం మనివాహిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. రోజు మొత్తం సంతోషం ఉన్నా ఒక్క దుఃఖభరితమైన సంఘటన జరిగిందంటే చాలు మనిషి ఇక తనకు సంతోషమే లేదన్నంత బాధపడిపోతూ ఉంటాడు.  మీకు ప్రియమైన వారు ఎవరయినా పోయినప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే  ఆ కన్నీళ్లు మీ కోసమా లేక చనిపోయిన వారి కోసమా? మీ కోసమే మీరు ఏడుస్తున్నారా? ఇతరుల కోసమా? నిజానికి ఇతరుల కోసం ఎప్పుడయినా ఏడ్చారా? యుద్ధక్షేత్రంలో చనిపోయిన  ఎవరికోసం అయినా ఎప్పుడైనా ఏడ్చారా? ఈ ఏడుపు అంతా మీరు ఏదో కోల్పోయారన్న భావంతోనా లేక ఒక మనిషి చనిపోయినాడే అనే చింతవల్లనా? మీ కోసం మీరు ఏడ్చినట్లయితే దానిలో అర్థం లేదు. మీరు ఆప్యాయత కురిపిస్తున్న ఒక మనిషి పోయినాడు గనుక మీరూ ఏడుస్తున్నారూ అంటే - నిజంగా అలాంటి ఆప్యాయత లేనేలేదు అన్నమాట! చనిపోయిన మీ తమ్ముని కోసం - అతని కోసమే - ఏడవండి. అతను పోయాడు గనుక మీ కోసం మీరు ఏడవడం చాల తేలిక. మీ హృదయం స్పందించింది గనుక మీరు ఏడుస్తున్నారు. కాని, అతని కోసం కాదు ఈ స్పందన. ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ… మీ మీద మీకు జాలి, అనుకంప. దీనితో మీరు కరుడు కట్టుకుపోతున్నారు, మూసుకొని పోతున్నారు. దీనివల్లనే మొద్దుబారి మూర్ఖులయిపోతున్నారు. మీ కోసం మీరు విలపిస్తూ వున్నట్లయితే అది ప్రేమ అవుతుందా? మీరు వంటరివారు అయినారు గనుక, అశక్తులయిపోయారు కనుక, మీ పరిస్థితి విచారకరం అయిపోయింది గనుక ఈ విలాపం కొనసాగుతూ వున్నదా? మీకు యీ విషయం అయితే తెలిసివస్తే  ఒక చెట్టునో స్తంభాన్నో ప్రత్యక్షంగా తట్టిచూసినంత స్ఫుటంగా అప్పుడు యీ విచారమంతా స్వయంకృతమయినదే అని అనిపిస్తుంది.  ప్రతి మనిషికి జీవితంలో కలిగే ఎన్నో భావోద్వేగాలకు ఆలోచనలే మూలం. ఈ  ఆలోచన వల్లనే విచారం ఏర్పడుతోంది. దుఃఖం కాలానికి ఫలితం. ఒకరికి కొంత కాలం క్రితం ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు ఏదో ప్రమాదంలో చనిపోయాడు. అతను చనిపోయిన తరువాత ఇతడు ఒంటరి వాడు అయిపోయాడు. ఆ తమ్ముడు ఉన్నపుడు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి, గొడవ పడటానికి బాగుండేది. కానీ అతడు పోయాక ఒంటరితనం అవరిస్తుంది. ఆ ఒంటరితనం నుండి బాధ పుడుతుంది. ఆ బాధ నుండి ఊరట కలగడం కోసం ఏడుస్తారు.    మీరు గమనించగలిగితే, ఇలాంటివి ఏవైనా మీ హీవితంలో జరిగినప్పుడు ఇదంతా మీ అంతరంగంలో కదలాడడం చూడగలుగుతారు. పూర్తిగా సంపూర్ణంగా చూడగలరు. ఒక్క వీక్షణంలోనే. దానికోసం సమయం విశ్లేషణ వెచ్చించకండి. 'నేను, నా కన్నీళ్లు, నా కుటుంబం, నా జాతి, నా నమ్మకాలు, నా మతం' ఇలాంటి అస్తవ్యస్తమయిన సమాచారం అంతా దాని స్వరూప స్వభావాలు దాని క్షుద్రత్వం.  అన్నీ ఒక్క క్షణంలో, మీ అంతరంగంలో దర్శించుకోగలుగుతారు. మీమనసుతో కాక, హృదయంతో దానిని చూడగలిగినప్పుడు  హృదయపు లోతులలో నుంచి చూడగలిగితే  అప్పుడు మీకు దుఃఖాన్ని, విచారాన్ని  అంతమొందించగల తాళపుచెవి ఖచ్చితంగా దొరుకుతుంది. దుఃఖానికి మూలం అంతరంగంలోనే ఉందనే విషయమూ అర్థమవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

స్ట్రీట్ షాపింగ్.. అదిరిపోయే కలెక్షన్స్

షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు? అందులో లేడీస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అలా ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడో లేదా అవసరానికి కొందామని వెళ్ళినపుడు ఏదైనా అట్రాక్టివ్ గా కనిపిస్తే ఇంకా టెంప్ట్ కాకుండా ఉండగలమా చెప్పండి. సాధారణంగా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి లేదా మ్యాచ్ అవ్వలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు  కొందామని ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు అనుకోకుండా కూడా షాపింగ్ చేస్తాం. అయితే మనం సాధారణంగా చేసే షాపింగ్ ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సరదాగా టైం పాస్ కి షాపింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ లేదా స్ట్రీట్ షాపింగ్ ని ప్రిఫర్ చేసుకుంటాము. ఎందుకంటే ఇందులో వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి. అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అంతే కాకుండా వెస్ట్రన్ వేర్, ఇండో వెస్ట్రన్, అందమైన ట్యాంక్ టాప్స్, ఫ్రాక్స్, నీ లెన్త్ ఫ్రాక్స్, ఈవెనింగ్ గౌన్స్, జాకెట్స్ ఇలా రకరకాల వెరైటీస్ తో రకరకాల కలర్స్ లో దొరుకుతాయి. మన పర్సనాలిటీని, మన స్కిన్ టోన్ ని బట్టి మనకి నప్పే దుస్తులను మనం ఎంపిక చేసుకుంటాం. టాప్స్.. స్కర్ట్స్ లేదా జీన్స్ మీద  మ్యాచ్ చూసుకొని వేసుకోవచ్చు అదిరిపోతుంది. చిన్న బర్త్ డే పార్టీలకు లేదా వీకెండ్ ఔటింగ్స్ కి ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఒక్కోసారి టాప్ బ్రాండెడ్ వి కాపీ వెర్షన్స్ కూడా దొరుకుతాయి. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోవు అంటే నమ్మండి. కాకపోతే కాపీ వెర్షన్స్ కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోవాలి. లేదు అంటే దొరికిపోతాం(కాపీ అని తెలిసిపోతుంది). బట్టలతో పాటుగా మ్యాచ్ అయ్యే చెప్పులు, బ్యాగ్స్, జ్యువలరీ, హెయిర్ యాక్ససరీస్ ఇలా చాలా వెరైటీస్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. మన హైదరబాద్ లో చాలా ప్లేసెస్ లో స్ట్రీట్ షాపింగ్ చేసుకోటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అమీర్ పేట్, కోఠి, ఓల్డ్ సిటీ, బేగం బజార్, సికింద్రాబాద్-జనరల్ బజార్… ఒక్కో ఏరియాలో ఒక్కో వెరైటీ అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేసేయండి.

దేశ జ్ఞానాన్ని వెలిగించే జాతీయ విద్యాదినోత్సవం!

విధ్యా వినయేన శోభతేః... అన్నారు పెద్దలు. అంటే వినయాన్ని చేకూర్చే విద్యనే ఉత్తమమైనది అని అర్థం. విధ్య లేని వాడు వింత పశువు అని కూడా అన్నారు.. విద్య వల్ల మనిషిలో మేధాపరంగా గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత గొప్ప జ్ఞానం వ్యక్తి సొంతం అవుతుందని చెప్పేవారు. అయితే కేవలం డిగ్రీ పట్టాలకు మాత్రమే పరిమితమయ్యే జ్ఞానం మనిషి మాససిక వికాసానికి దోహదం చెయ్యదు. అక్షరము అంటే నాశనం లేనిది అని అర్థం.అందుకే కాలం ఎంత మారినా చదువుకున్న చదువు మనిషికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. చరిత్రలోకి చూస్తే ఎంతో మంది గొప్పగా ఎదిగిన వారు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగినవారే... వారందరికీ చదువు విలువ ఎంతో స్పష్టంగా తెలుసు కాబట్టే వారు ఎంత గొప్పవారు అయినా చివరికంటూ నిత్యవిద్యార్థులుగా కొనసాగారు.  భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.  ఎప్పుడు ఏర్పడింది.. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ గా పిలువబడుతున్న విద్యాశాఖ  2008 సంవత్సరం నవంబర్ 11 న భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి, ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ విద్యా దినోత్సవ వేడుక సాగుతోంది.  థీమ్ ఏంటో తెలుసా... ఈ విషయం మీద అవగాహన పెంపొందించే దిశగా ప్రతి సంపత్సరం ఒక కొత్త థీమ్ ను ప్రకటించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది భారత ప్రభుత్వం. అదే విధంగా 2022 సంవత్సరానికి సంబంధించిన థీమ్ "Changing the course and transforming education". పై థీమ్ తో భారత ప్రభుత్వం ప్రజల్లో విద్యమీద అవగాహన పెంచే కార్యక్రమాలను ఈ ఏడాది చేపట్టబోతోంది. జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్న మౌలానా అబుల్ కలామ్ గురించి తెలుసుకుంటే….. నవంబర్ 18, 1888న జన్మించిన మౌలానా అబుల్ కలాం  పూర్తి పేరు "అబుల్ కలాం గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్-హుస్సేనీ ఆజాద్". ఈయన  భారత స్వాతంత్ర్య కార్యకర్త,  రచయిత మరియు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఈయన భారత ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రి అయ్యాడు.   ఆగస్టు 15, 1947 నుండి ఫిబ్రవరి 2, 1958 వరకు ఈయన భారత విద్యా మంత్రిగా పనిచేశాడు.  ఫిబ్రవరి 22, 1958న ఢిల్లీలో మరణించాడు. అంటే ఈయన తన పదవి నుండి  తాను మరణించడానికి 20 రోజుల ముందు తప్పుకున్నాడు.  జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏమి చేయవచ్చు?? జాతీయ విద్యాదినోత్సవ సందర్భంగానే కాకుండా సాధారణ రోజుల్లో కూడా  కృషి చేయవచ్చు కదా అని కొందరు ఎద్దేవా చేస్తూ ఉంటారు. అయితే జాతీయ విద్యాదినోత్సవం నాడు ఈ అవగాహనా కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయి. అవగాహన!! జాతీయ విద్యాదినోత్సవం రోజు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నిరక్షరాస్యత కలిగిన ప్రాంతాలలో ఈ కార్యక్రమాల ఏర్పాటు ఉండేలా చూసుకోవాలి. పిల్లలను పనికి పంపే పెద్దవారి విద్య విలువ అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలను పని నుండి బడికి పంపే దిశగా వారి ఆలోచనలు మళ్లించాలి. విద్య వల్ల ఉద్యోగావకాశాలు ఎలా చేజిక్కించుకోవచ్చో, ఉద్యోగం చేసే వారికి ఈ సమాజంలో ఎంతటి సముచిత స్థానం లభిస్తోందో వివరించి చెప్పాలి.  సహాయం!! చదువు కోవడానికి ఇబ్బంది పడే పిల్లలు ఈ కాలంలో చాలామందే ఉన్నారు. చదువు ఖరీదు అయిపోయిన ఈ కాలంలో ఆర్థిక సమస్యలు కారణంగా విద్యకు ఉద్వాసన పలికే పేద మాణిక్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిని చదువులో ప్రోత్సహించాలి. నేరుగా సహాయం కావచ్చు, లేదా స్వచ్చంధ సంస్థల తరపున కావచ్చు లేదా విరాళాలు సేకరించి కావచ్చు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదువులో రాణించేలా చేస్తే దేశానికి విద్యా వంతులను అందించినట్టు అవుతుంది.   ఇలా ప్రతి ఒక్కరూ ఈ జాతీయ విద్యాదినోత్సవం రోజున తమకు చేతనైన విధంగా చేయూతను అందించవచ్చు.                                       ◆నిశ్శబ్ద.

స్వీయ క్రమశిక్షణ ఎందుకు అవసరం?

ప్రతి మనిషి జీవితం ఓ సరళ రేఖ లాగా అలా సాగిపోవాలి అంటే ఎన్నో విషయాలు సక్రమంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఉద్యమ లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి విషయం ఎగుడుదిగుడు దారిలాగా సాగుతూ ఉంటుంది చాలా మందికి. ఇలాంటి సమస్య లేకుండా హాయిగా సాగిపోవాలంటే ప్రతి వ్యక్తి నైతికంగా దృఢంగా ఉండాలి. నైతిక విలువలు, నైతికత అనేవి మనిషిని ప్రతి పనిలో సమర్థవంతుడిగా నిలబడతాయి.  నిజజీవితంలో నైతిక ప్రవర్తన ప్రభావవంతంగా ఉండాలంటే స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ప్రతి వ్యక్తి తనకు తాను కొన్ని ఉద్దేశ్యాలు, కొన్ని పరిధులు, కొన్ని అలవాట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల తన పరిధిలో తాను ఉండటం కుదురుతుంది. ఇలా ఆత్మవిశ్వాసంతో తమపై తాము విధించుకొని అమలుపరచేదే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో విజయం సాధించాలంటే మనంతట మనం నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవనాన్ని గడపాలి.  చాలామంది జీవితంలో ఓటమి పాలవ్వడానికి ముఖ్యమైన కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే. ఇది చాలామందికి అర్థం కాదు. తాము బానే కష్టపడుతున్నాం, బానే చదజేవుతున్నాం అనుకుంటారు. కానీ జరుగుతున్న తప్పేమిటంటే స్వీయ క్రమశిక్షణ లేకపోవడం. ఎవరో చెబితే తప్ప తాను చేయాల్సిన పనులు చేయలేకపోవడం. ఈ తరహా తీరు మనిషిని తప్పకుండా బద్ధకిష్టుల జాబితాలోకి సులువుగా చేరిపోయేందుకు సహకరిస్తుంది. చాలామంది నియమబద్ధమైన జీవనశైలి లేని కారణంగా విజయాన్ని సాధించలేకపోతారు. స్వీయ మూడు రకాలుగా ఉంటుంది. భౌతిక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ,  ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే మూడు విధాలుగా ఉంటుంది.  భౌతిక క్రమశిక్షణ:-  నిర్దిష్టమైన దైనందిన కార్యకలాపాలు, నియమిత ఆహారం, విశ్రాంతి, వినోదాలు, నిద్ర, నిర్దిష్టమైనపని, అన్నిచోట్ల క్రమశిక్షణతో మెలగడం వంటివి భౌతిక విధానానికి చెందిన స్వీయ క్రమశిక్షణలోకి వస్తాయి. మానసిక క్రమశిక్షణ:- అనవసరమైన వాటిపైకి దృష్టిని మరల్చి, మానసిక శక్తిని వృథాచేసే అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండటమే మానసిక క్రమశిక్షణ. అతిగా దిగులు చెందడం, కృంగుపాటుకు గురవ్వడం, నిరాశ చెందడం, పగటి కలలు కంటూ ఉండటం వలన కూడా మానసిక శక్తి వృథా అవుతూ ఉంటుంది. ఏ విధమైన చంచలత్వానికి లోను కాకుండా నిర్దేశిత లక్ష్యంపై మనస్సును లగ్నం చేయాలి. అలాగే క్రమబద్ధమైన, తర్కబద్ధమైన ఆలోచనా విధానాలపై మనస్సుకి శిక్షణనివ్వాలి.  ఆధ్యాత్మిక క్రమశిక్షణ:- మనస్సుని ఏకాగ్రం చేయడంపై ఇచ్చే శిక్షణ కూడా మానసిక శిక్షణలోనిదే. "నేను యథార్థ సత్యాలను అభ్యసించను. నేను ఏకాగ్రతా శక్తిని, విషయ పరిత్యాగ శక్తిని సాధన చేస్తాను. అలా పరిణతి చెందిన మనస్సుతో విషయ గ్రహణానికి పూనుకొంటాను" అని స్వామి వివేకానంద వక్కాణించారు. స్వీయ క్రమశిక్షణను అలవరచుకొన్నవారికి అంతర్గత స్వేచ్ఛ, శక్తులు లభిస్తాయి. ఎంచుకొన్న ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించడంలో ఇవి తోడ్పడతాయి. నియమబద్ధమైన జీవనం లేనివారు అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేసేవారు, సోమరిపోతు విద్యార్థులు తమ అలవాట్లకు తామే బలి అవుతూ, తమకేకాక ఇతరులకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంటారు. అందుకే మనిషి జీవితానికి స్వీయ క్రమశిక్షణ అనేది జీవితాన్ని మర్చివేసే మార్గం అవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

గురక పెట్టడానికి కారణాలు ఇవే!

మనిషికి అయిదుగంటల నిద్ర పెర్ఫెక్ట్! ఆరుగంటల నిద్ర ఆరోగ్యానికి చాలామంచిది. ఏడుగంటల నిద్ర కొంతమందిలో సమంజసమే! ఎనిమిది గంటల నిద్ర ఫరవాలేదు. పది గంటల నిద్ర మనిషిలో బద్దకాన్ని... నిస్సత్తువనూ... నిరాసక్తతనూ సూచిస్తుంది. పన్నెండు గంటల నిద్ర మనిషిలో తెలియని వ్యాధికి సంకేతం. అంతకుమించిన నిద్ర ఖచ్చితంగా అనారోగ్యమే!  మానసికంగా శారీరకంగా అలసిపోయిన మనిషి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటాడు. అలాంటప్పుడు మరోగంటో గంటన్నరో ఎక్కువ నిద్రపోవడం కూడా జరుగుతుంది. ఇది అతని శరీర అలసటను తెలియజేస్తుంది. ఇటువంటప్పుడు ఎంతసేపు లేపినా నిద్రలేవరు. శారీరకంగా ఉండే అలవాటు బాగా తగ్గిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే నిద్రలేచి తమ రోజువారీ కార్యక్రమాలను చూసుకుంటుంటారు. వీరు ఈవిధంగా రోజూ నిద్రపోరు. ఎప్పుడో.. ఏవారం పదిరోజులకో ఓసారి ఇలా నిద్రపోతుంటారు. ఇలా రోజూ నిద్రపోతుంటే మాత్రం అది క్రమేపీ బద్దకంగా మారిపోతుంది. ఆఫీసులో గుమాస్తాలుగానూ, ఆఫీసర్లగానూ, ఎగ్జిక్యూటివ్ గానూ పనిచేసి వారు మానసికంగా అలసిపోతుంటారు. ఇటువంటివారు అయిదారు గంటలపాటు నిద్రపోయేసరికి మైండ్ ఫ్రెషయ్యి ఉత్సాహంగా తయారైపోతారు. కాయకష్టం చేసేవారు అంటే  ముఠా కార్మికులు, రిక్షా కార్మికులు, చిల్లరవర్తకులు, వ్యవసాయ కార్మికులు వంటివారు శారీరకంగా అలసిపోతారు. ఇటువంటి వారు అదనంగా మరో అరగంటో గంటో నిద్ర పోతారు. ఇది సహజమే! బాగా అలసిపోయి. ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవారు నిద్దట్లో తమకు తెలియకుండానే గురక పెడుతుంటారు. అయితే అలసటకు గురైనా గురికాకున్నా నిద్రపోయిన వెంటనే గురక గురక పెడుతుండటం సర్వసాధారణమే...! ఇది వారి అలసటను తెలియజేస్తుంది...! ఈ విధంగా గురక పెట్టడానికి కారణాలు అనేకంగా ఉంటాయి. మనం ముక్కుద్వారా, నోటిద్వారా గాలి పీలుస్తూంటాం. ఈవిధంగా గాలి పీల్చడానికీ, వదలడానికీ ఏదైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు మరింత బలంగా గాలిపీల్చి వదులుతుంటారు. ఈ క్రమంలో కొండనాలిక కింద భాగానికి ప్రెస్ అవ్వడం ద్వారా శబ్దతరంగాలు వెలువడుతుంటాయి. గురకపెట్టేవారు మామూలు మనిషికన్నా ఏడురెట్లు అధికంగా గాలిపీలుస్తారని వివిధ పరిశోధనల్లో తేలింది. గురక రావడానికి కారణాలు! గొంతు మరియు శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యేవారు ఎక్కువగా గురకపెడుతుంటారు. మనగొంతులోని "యువులా" అనేభాగం ఈ శబ్దతరంగాలను సృష్టిస్తుంది. ముక్కుకు సంబంధించిన క్రానిక్ కోల్ట్, సైనసైటిస్, డీవియేటెడ్ సెప్టెమ్ వంటి వ్యాధులకు గురైనవారు ముక్కుద్వారా గాలిపీల్చడం కష్టమై నోటిద్వారా గాలి పీల్చడం జరుగుతుంది. ఎక్కువ భాగం గురకలు నోటిద్వారా గాలిపీల్చడం వల్లే సంభవిస్తుంటాయి.  నోటిద్వారా గాలిపీల్చడం వల్ల 'గురక' ప్రారంభమౌతుంటుంది. గురకలు ముక్కు ద్వారానూ, గొంతుద్వారానూ కూడా వస్తుంటాయి. అయితే ముక్కుద్వారా వచ్చేగురక చిన్నశబ్దం చేస్తే గొంతుద్వారా చేసే గురక పెద్దశబ్దంతో వస్తుంది.  ముక్కు దిబ్బడ వేయడం, పొక్కులు ఉండటం, అతిగా జలుబు చేసి ముక్కువెంటనీరు కారుతుండటం, ముక్కు అట్టకట్టిపోవడం, లేదా ముక్కు దూలం వంకరకావడం వంటి కారణాలతో మనిషి నోటిద్వారా గాలి పీల్చడానికి ప్రయత్నిస్తాడు. నోటిద్వారా గాలి పీల్చడం  వల్ల సాధారణంగా ముక్కుద్వారా పీల్చే గాలికంటే ఎక్కువగాలిని పీల్చవల్సివస్తుంది. కావాల్సిన గాలికంటే ఎక్కువగాలి పీల్చి వదులుతున్నప్పుడు ఆ గాలి వేగానికి కొండనాలుక అడ్డుబడి గురకవస్తుందని చెబుతారు.  గురక పెట్టే  వ్యక్తికి తాను గురకపెడుతున్నట్లు తెలియదు. అయితే గురక పెట్టేవ్యక్తి చేసే శబ్దాలు వినేవారికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి!                                       ◆నిశ్శబ్ద.

రేడియోగ్రఫీ డే ఏమి చెబుతోంది?

ప్రపంచం అభివృద్ధి చెందడంతో పాటు వైద్య రంగం కూడా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఎన్నో రకాల ఆవిష్కరణలు మనిషి జీవితాన్ని సులువు చేస్తున్నాయి. నివారణ లేదు అనుకునే జబ్బులకు పరిష్కారాలు కనుగొనబడుతున్నాయి. వైద్య రంగంలో x-కిరణాలు ఉపయోగించడం ఒక అద్భుతం. ప్రజలకు వైద్యం చేయడానికి దాన్ని ఉపయోగించడం అపురూప ఘట్టం. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 8 న జరుపుకుంటారు, ఎందుకంటే ఇది X- కిరణాలు కనుగొనబడిన సందర్భాన్ని పురస్కరించుకుని వార్షికోత్సవాన్ని జరుపుకునే రోజు.    ప్రస్తుతం అభివృద్ధి చెందిన వైద్య రంగంలో ఈ x-కిరణాలు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం.   అనేక వైద్య రోగనిర్ధారణ సాధనాలకు పునాదిగానూ మరియు అనేక రకాల సమస్యలను కనుగొనడంలోనూ ఈ x-కిరణాలు వైద్యులకు సహాయపడతాయి.   నిమిషాల వ్యవధిలో వీటిని ఉపయోగించడగలగడం, రోగులకు ఎలాంటి నొప్పి తెలియనివ్వకుండా వీటితో వైద్యం చేయగలగడం వీటికి ప్రాధాన్యత పెరగడానికి కారణం.   ఇలాంటి రేడియోగ్రఫీ దినోత్సవాన్ని గురించి, దాని వెనుక ఉన్న చరిత్రను గురించి తెలుసుకోవాలి….  1895లో జర్మనీలోని వుర్జ్‌ బర్గ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్‌జెన్ అనుకోకుండా ఎక్స్-కిరణాలను కనుగొన్నారు. రోంట్‌జెన్ తన ప్రయోగశాలలో కాథోడ్ కిరణాలతో పని చేస్తున్నప్పుడు  తన ట్యూబ్ సమీపంలోని టేబుల్‌పై స్ఫటికాల ఫ్లోరోసెంట్ గ్లోను గమనించాడు, అందులో ఒక గ్లో ఉంది.  ప్రతికూల మరియు సానుకూల ఎలక్ట్రోడ్లతో ఆ బల్బ్ ఉంది.   ట్యూబ్‌లోని గాలిని ఖాళీ చేసి, అధిక ఓల్టేజీని ప్రయోగించినప్పుడు, ట్యూబ్ ఫ్లోరోసెంట్ గ్లోను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.  ట్యూబ్‌ను నల్ల కాగితంతో కప్పి, ట్యూబ్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉంచినప్పుడు పదార్థం ఆకుపచ్చ ఫ్లోరోసెంట్ లైట్‌ను ఉత్పత్తి చేస్తుందని అతను కనుగొన్నాడు.  ఈ పరిశీలనలతో, ట్యూబ్ కొత్త రకం కిరణాలను విడుదల చేస్తోందని, అది పేపర్ కవర్ గుండా వెళ్లి ఫాస్ఫోరేసెంట్ పదార్థాలను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అతను నిర్ధారించాడు.  ఈ కొత్త కిరణం అనేక పదార్ధాల గుండా వెళుతుందని, ఘన వస్తువులపై నీడలు పడుతుందని అతను కనుగొన్నాడు.  కిరణం మానవ కణజాలాల గుండా కూడా వెళుతుందని నిర్ధారించాడు.  ఈ ఆవిష్కరణ శాస్త్రీయ పురోగతికి ఎంతగానో ఉపయోగపడింది. ఈ కిరణాలు కనుగొన్న ఒక నెల తర్వాత చాలా మంది వైద్య సిబ్బంది ఐరోపా మరియు U.S.లో రేడియోగ్రాఫ్‌లను ఉపయోగించడం ప్రారంభించారు.  ఆరు నెలల తర్వాత, రేడియోగ్రాఫ్‌లు  గాయపడిన సైనికులకు సహాయం చేయడానికి యుద్ధభూమికి చేరుకున్నాయి.  వరల్డ్ రేడియోగ్రఫీ డే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.   1895 లో X-కిరణాలు కనుగొనబడ్డాయి అయితే ఈ కిరణాల ఆవిష్కరణ విచిత్రంగా జరిగింది.  రోంట్‌జెన్ ప్రమాదవశాత్తు ఎక్స్-కిరణాలను కనుగొన్నాడు.  1896 సంవత్సరంలో మొదటి సారి శస్త్రచికిత్స లో ఉపయోగించారు.   జాన్ హాల్-ఎడ్వర్డ్ అనే వైద్యుడు  ఒక శస్త్ర చికిత్సలో భాగంగా X-కిరణాలను ఉపయోగించాడు..  1999  ఖగోళ అనువర్తనాలు చేయబడ్డాయి.  చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ విశ్వంలో హింసాత్మక ప్రక్రియల అన్వేషణను అనుమతించడం ప్రారంభించబడింది.  2010 సంవత్సరం నాటికి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల వైద్య రేడియోగ్రఫీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం 2022 నాటికి ఈ సంఖ్య, ఈ కిరణాల వినియోగం ప్రథమ స్థాయిలో ఉంది.                                         ◆నిశ్శబ్ద.

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                           ◆నిశ్శబ్ద.

జ్ఞానప్రధాత గురునానక్!

ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. గురునానక్ జయంతిని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను బట్టి  గురునానక్ ప్రకాష్ ఉత్సవ్, గురుపురాబ్, గురునానక్ దేవ్ జీ జయంతి అని కూడా పిలుస్తారు. ఈయన  సిక్కుమతం వ్యవస్థాపకుడు. ఈయన జన్మదినాన్ని యావత్ సిక్కు మతస్థులు అందరూ పండుగలా జరుపుకుంటారు.  గురునానక్ జయంతి రోజు గురునానక్ తన భోధనల్లో ప్రపంచానికి వినిపించిన ముఖ్య విషయాలను అందరూ గుర్తు చేసుకుంటారు. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గురునానక్ జయంతిని జరుపుకుంటారు, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతం విస్తృతంగా  ఉంది. ఈ ప్రాంతంలో గురునానక్ జయంతి గొప్ప వేడుకగా నిర్వహించబడుతుంది.  గురునానక్ జయంతిని ఎప్పుడు ?? ఎలా జరుపుకుంటారు?   గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్-నవంబర్లలో పౌర్ణమి రోజున వస్తుంది.  2022 సంవత్సరం, నవంబర్ 8న  నాటికి ఈ జయంతి 553వ జయంతి గా నమోదు అయింది.  గురునానక్ జయంతి సిక్కు సమాజానికి ప్రతిష్టాత్మకమైనది.   గురునానక్ జయంతిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్  మొదలైన రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలలో ఒకటిగా భావిస్తారు.   సాధారణంగా గురుద్వారాలో గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు వేడుకలు ప్రారంభమవుతాయి.  గురునానక్ జయంతికి ముందు రోజున 48 గంటల నాన్‌స్టాప్ సెషన్ కోసం ‘అఖండ మార్గం’ (దీని అర్థం ఆటంకం లేని ప్రార్థన) అని పిలువబడే గురు గ్రంథ్ సాహిబ్ పఠనం ప్రారంభమవుతుంది.  సిక్కు త్రిభుజాకార జెండాను పట్టుకున్న ఐదుగురు వ్యక్తుల నేతృత్వంలో ‘నాగర్‌కీర్తన్’ అనే ఊరేగింపు కూడా జరుగుతుంది.  ఈ పండుగ సాధారణంగా ‘ప్రభాత్ ఫేరిస్’ లేదా గురుద్వారాలో తెల్లవారుజామున ఊరేగింపులతో ప్రారంభమవుతుంది.  జెండాలు మరియు పూలతో అలంకరించబడిన వీధుల గుండా ఈ ఊరేగింపు కన్నుల పండుగగా సాగుతుంది.  పవిత్ర గురు  సాహిబ్‌ను పల్లకిలో ఉంచుతారు, అదే సమయంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడి మతపరమైన శ్లోకాలు పాడుతూ సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తారు.  కొందరు తమ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను కూడా ప్రదర్శిస్తారు.  లాంగర్ మరియు సమాజ సేవ  సిక్కు సంప్రదాయంలో, 'లంగర్' అంటే భిక్షాటన గృహం లేదా పేదల కోసం ఒక స్థలం మరియు గురుద్వారాలోని కమ్యూనిటీ వంటగదికి పెట్టబడిన పేరు.  లంగర్ అనేది కులం, తరగతి, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా  అవసరమైన ఎవరికైనా ఆహారాన్ని అందించే ప్రదేశం.  ఈ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరినీ గురు అతిథులుగా స్వాగతించడం.  సిక్కు సమాజం ముందుకు వచ్చి అవసరమైన వారికి గురుద్వారాల వద్ద ఆహారం మరియు ఆశ్రయం కల్పిస్తుంది.  మధ్యాహ్న భోజనాన్ని వాలంటీర్లు తయారు చేసి అందరికీ అందిస్తారు.  సిక్కు సంస్కృతిలో ఆహారాన్ని పంపిణీ చేయడం సమాజ సేవ (సేవా)లో భాగంగా పరిగణించబడుతుంది.  కడ ప్రసాదం ఈ పండుగ కోసం పెద్ద మొత్తంలో తయారు చేసి పంపిణీ చేసే సంప్రదాయ స్వీట్.  గురునానక్ జయంతి సందర్భంగా చూడవలసిన ప్రదేశాలు  భారతదేశంలో పండుగ జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం అమృత్‌ సర్‌లోని గోల్డెన్ టెంపుల్, ఇక్కడ భక్తులు గురుద్వారాలో బస చేసి తమ గురువు ఆశీర్వాదం కోరుకుంటారు.  ఇక్కడ, అకల్ తఖ్త్ (అధికార స్థానాలు) ప్రతి సంవత్సరం గురునానక్ పుట్టినరోజున ప్రకాశిస్తుంది.  గోల్డెన్ టెంపుల్, అమృత్ సర్  గురుద్వారా నంకనా సాహిబ్ దేశ సరిహద్దులో ఉంది మరియు ఇది గురునానక్  జన్మస్థలం కాబట్టి ఏడాది పొడవునా యాత్రికులను ఆకర్షిస్తుంది. ప్రయాణికులు హిల్ స్టేషన్ గురు నానక్ జ్ఞాపకార్థం గురుద్వారా మణికరణ్ సాహిబ్‌ను కూడా నిర్మించింది.  పురాణాల ప్రకారం, ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు గురునానక్ మరియు అతని సిక్కుల సమాజం సందర్శించారు కాబట్టి ఇది భక్తులకు ప్రసిద్ధ ప్రదేశంగా మారింది.  గురుద్వారా సిస్ గంజ్ పాత ఢిల్లీలోని చాందినీ చౌక్‌ లో ఉంది. చక్రవర్తి ఔరంగజేబ్ తల నరికి చంపిన గురు తేజ్ బహదూర్ గౌరవార్థం నిర్మించబడింది.  ఇది ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ సిక్కు తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. గురుద్వారాలో ప్రార్థనా మందిరం ఉంది, రెండు అంతస్తుల నిర్మాణంతో పాటు గాజు షాన్డిలియర్లు మరియు ఎత్తైన పైకప్పు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు తమ  మతం పట్ల గొప్పగా గర్విస్తారు. భారతీయ జనాభాలో వీరు తక్కువ శాతం మందే ఉన్నా, వీరి ఉనికి కాపాడుకోవడానికి వీరి సంప్రదాయాలను పాటిస్తున్నారు.  గురునానక్  ఈ మానవాళికి అందించిన  జ్ఞానోదయమైన బోధనలను గుర్తుచేసుకోవడం ద్వారా ఈ సందర్భాన్ని మరింత అర్థవంతంగా మార్చుకుంటారు.                                       ◆నిశ్శబ్ద.

క్యాన్సర్ మీద యుద్ధ ప్రభంజనం!

నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే  భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 7 వ తేదీన జరుపుకుంటారు.  ఈ కాన్సర్ అవేర్నెస్ డే ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే క్యాన్సర్ యొక్క తీవ్రమైన ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ అవేర్నెస్ డే రోజున ఎంతో గొప్ప కృషి జరుగుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రజలలో మరణానికి కారణమయ్యే రెండవ అత్యంత ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్.  క్యాన్సర్‌తో మరణించే వారి పరిస్థితి భారతదేశానికి తీవ్రమైన ప్రమాదంగా ఉంది.   2020లో భారతదేశంలో 8.5 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారంటే దీని ప్రభావం ప్రజల జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకుని పోయిందో అర్థం చేసుకోవచ్చు.  ఈ కారణంగా, ఈ రకమైన క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్‌నెస్ డే ని జరుపుకుంటారు.  దీని చరిత్ర ఏమిటి?  కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మొదటిసారిగా 2014 సెప్టెంబరు నెలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ప్రకటించారు. క్యాన్సర్ నియంత్రణపై రాష్ట్రస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇందులో భాగంగా  ఉచిత స్క్రీనింగ్ కోసం మున్సిపల్ క్లినిక్‌లకు సందర్శించమని ప్రజలను ప్రోత్సహించాడు.  క్యాన్సర్  ప్రారంభ సంకేతాలు మరియు దానిని ఎలా నివారించాలి అనే దాని గురించి వివరాలను పొందుపరిచిన బుక్‌లెట్ కూడా అప్పుడు పంపిణీ చేసారు.  జరిగిన కృషి  ఈ ప్రాణాంతక వ్యాధికి వ్యతిరేకంగా దేశంలో ఒక ముఖ్యమైన అడుగు 1975లో  పడింది. దేశంలో క్యాన్సర్ చికిత్సను సులభతరం చేయడానికి  నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్‌తో ఈ అడుగు ప్రారంభమైంది.  10 సంవత్సరాల తర్వాత, 1984-85లో, ముందస్తుగా క్యాన్సర్‌ని గుర్తించడం, దాని నివారణపై దృష్టి సారించేందుకు ప్రణాళిక  విధానం సవరించబడింది. ఆ తరువాత దీని గురించి కృషి జరిగినా అది ప్రజలలోకి తీవ్రంగా చొచ్చుకుని వెళ్లలేకపోయింది. దానికి తగ్గట్టు అప్పటి దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పరిష్కార మార్గాలు సులభతరం కాలేదు. ఆ తరువాత 2014 నుండి దీని గురించి అవగాహన పెంచడం మొదలుపెట్టారు.  ఈరోజే ఎందుకు?? భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవేర్నెస్ డే ని నవంబర్ 7 న జరుపుకోవడానికి కారణం.  రేడియోధార్మికశక్తిని కనుగొనడంలో  మేరీ క్యూరి చేసిన కృషి ప్రపంచం మరచిపోలేనిది. ఆమె జన్మదినాన్ని స్మరించుకుంటూ క్యాన్సర్ అవేర్నెస్ డే ని ఆమె పుట్టినరోజు అయిన నవంబర్ 7 న జరుపుకుంటున్నారు. క్యాన్సర్ గురించి కొన్ని భయానక గణాంకాలు, ఆసక్తికర విషయాలు...  పొగాకు (ధూమపానం ప్రత్యక్షం అయినా పరోక్షమయినా) వాడకం వల్ల భారతదేశంలో 3,17,928 మంది పురుషులు మరియు మహిళలు మరణిస్తున్నారు, ధూమపానం క్యాన్సర్‌కు దారి తీస్తుంది కాబట్టి దీనిని నివారించాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.  2014 క్యాన్సర్ అవగాహన యొక్క ప్రాముఖ్యత పెంచడానికి జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని భారత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తొలిసారిగా ప్రకటించారు 1975  క్యాన్సర్‌ను గుర్తించే కార్యక్రమాలను ప్రారంభించారు.  భారతదేశంలో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను అందించడానికి జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించబడింది  1911  నోబెల్ బహుమతి గ్రహీత మేరీ క్యూరీ గురించి అందరికీ తెలిసినదే. రేడియోధార్మికతలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రసాయన శాస్త్రంలో రెండవ నోబెల్ బహుమతిని అందుకుంది. ఆమె చేసిన ప్రయత్నమే నేడు ఎన్నో రకాల క్యాన్సర్లు కనుగొనడానికి మార్గమవుతోంది.   1867  మేధావి పుట్టుక  మేరీ క్యూరీ, క్యాన్సర్ చికిత్స కోసం న్యూక్లియర్ ఎనర్జీ మరియు రేడియోథెరపీ అభివృద్ధికి దారితీసిన ఆమె కృషికి గుర్తుండిపోయే ప్రముఖ శాస్త్రవేత్త, వార్సా పోలాండ్‌లో జన్మించారు.  ఆమె పుట్టిన తేదీని భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవేర్‌నెస్ డేగా జరుపుకుంటున్నారు.                                       ◆నిశ్శబ్ద.

కలలో ఏమి కనిపిస్తే దేనికి సంకేతం?

కలలు అందరికీ వస్తాయి. అయితే ప్రతి కలలో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది అందరికీ. అలా కలలో కనిపించే వస్తువు, ప్రదేశం ఇతరం ఏదైనా సరే.. దాన్ని బట్టి మనిషికి కొన్ని విషయాలను సూచిస్తుంది మనిషి అంతరంగం. మనిషి కలలో ఏమి కనబడితే ఏమవుతుంది?? ఏది దేనికి సంకేతంగా భావించబడుతుంది?? దానికి వివరణలు ఏమిటి?? ఫ్రాయిడ్ తన సిద్ధం ద్వారా నిరూపించిన విషయాలు ఇవీ... దేవదూత : కలగన్నవారు ఆధ్యాత్మిక శక్తి, ఉన్నతాత్మ, దివ్యగుణాలను (దయ, ప్రేమ, కరుణ, పవిత్రత) పొందాలనే ఆకాంక్షలకు ప్రతీక దేవదూత కలలో కనిపించడం. శిశువు: కొత్త జన్మ, కొత్త ఆదర్శాలను గుర్తించడం, చిన్న పిల్లల్లాగా  నిస్సహాయతను వ్యక్తం చేయడం దీనికి సంకేతం. అలాగే పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనే కోరిక, గర్భధారణ విషయంలో భయానికి ప్రతీక. చెంపలు: ఇవి  పిరుదులకు ప్రతీకలు, ఇవి కలలోకి వస్తే లైంగికేచ్చ అంతర్లీనంగా సంఘర్షణలో ఉన్నట్టు అర్థం. చెంపలు ఈ భావాన్ని  వ్యక్తం చేస్తాయి.  కన్ను:  దూరదృష్టిని, ఆప్రమత్తతను సూచిస్తుంది. జరగబోయే వాటి గురించి అప్రమత్తతను తెలియజేయడం దీని అర్ధం.  పెళ్లి కూతురు:  స్త్రీల కలలలో ఎక్కువగా కనిపించేది పెళ్లి కూతురు. మగవాడు పెళ్ళికూతురు గురించి కలగనడు. పెళ్ళికూతురే కలలో పెళ్ళి కూతురిని చూస్తే ప్రేమను వేడుకొందన్న మాట. తల్లిదండ్రుల శృంఖలాల నుంచి బయటికి అడుగుపెట్టడం దీనికి సంకేతం.  దొంగ : విలువైనది దేనినైన తస్కరించేవాడు. స్త్రీల విషయంలో మానాన్ని, కలగన్న వాడే దొంగ అయితే తను చేసిన, చేయనున్న దోషాలను బయటపెట్టడం, దొంగ తండ్రిని సూచించవచ్చు. ఫ్రాయిడ్ ప్రకారం, దొంగల భయం శైశవంలో పాతుకుపోతుంది. మంచం ప్రక్కన నిలబడ్డ తండ్రిని, ఆకస్మికంగా నిద్ర లేచిన బిడ్డ చీకట్లో చూచి దొంగ అనుకొంటాడు.  శవం: ఇది ఎప్పుడూ మనుష్యులు చావడాన్నే సూచించదు. అవాంఛనీయ ఆశ. ప్రేమసంబంధాల అంతాన్ని సూచించవచ్చు. తను కాదనుకొన్నవారిని మరణం ద్వారా తొలగిస్తాడు. తానే శవమైతే అనారోగ్యాన్ని, మృత్యుభయాన్ని, తను అనుభవిస్తున్న రోగబాధను సూచించవచ్చు.  పోలీసు:  అధికారం, శిక్ష, రక్షణ, అంతరాత్మ ఇవన్నీ విడివిడిగా లేదా కలిపి. రాణి: రాణి కలలో కనిపిస్తే తల్లి కాబోతున్నట్టు సంకేతమట. స్నానాల గది : లైంగిక, రుగ్మత, రహస్యకార్యమేదైన ఉంటే దానికి ఇది సంకేతం.  సేతువు : ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెందటం. సేతువును దాటటమంటే కష్టాలను దాటడం. శ్మశానం : తన లేదా ఇతరుల మరణ వాంఛ. ప్రేమ భంగం లేదా సంబంధం తెగిపోవడం కూడా దీనికి సంకేతం. గుడి: ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం, అపరాధాలను ప్రక్షాళనం చేసుకోవడం.  వ్యవసాయ క్షేత్రం : ప్రేమ, పెండ్లి, సంతానాలను సూచిస్తుంది.  హోటలు: హోటల్ కలలోకి రావడం అరుదే. అయితే ఇది పరివర్తన దశ. హోటలు తాత్కాలిక నివాసం. వాటి అంతస్తులు చేతనా చేతనలను సూచిస్తాయి. ద్వీపం : ఏకాంత సూచకం. ఒంటరిగా మౌనంగా ఉండాలని అనుకోవడానికి ఇది సూచన.  ఊబి: పరిస్థితులు తనను ముంచుతున్నాయను కొంటాడు స్వాపి. ఇతరుల సహాయం లేక బయట పడలేననుకొంటాడు. ఊబి ఎలాగైతే మనిషిని తనలోకి లాక్కుని సజీవంగా మరణం తెస్తుందో అలాగే నిజంగా జరుగుతుందని భయాడతారు. ఇలా కలలో కొన్ని విషయాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవన్నీ ఫ్రాయిడ్ తన సిద్ధాంత  పరిశీలన ద్వారా  రూపొందించినవి.                                          ◆నిశ్శబ్ద.

పోలికల వల్ల కలిగే నష్టం ఏమిటి?

మనల్ని ఇంకొక మనిషి నుండి వేరు చేసేవి, ప్రత్యేకంగా ఉంచేవి  ఆలోచనలు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలకు తగినట్టే వారు పనులు చేస్తారు,దానికి తగ్గట్టుగా జీవిస్తారు. కానీ ఎప్పుడూ మనం ఉన్న స్థితినీ ఉండవలసిన స్థితినీ పోల్చి చూసుకుంటున్నాం. ఉండవలసిన స్థితి అనేది మన మనసు రూప కల్పన చేసినదే. సరిపోల్చి చూసుకోవడం అనేది ఎదురైనప్పుడు వైరుధ్యం వస్తుంది. ఏదో పరాయివస్తువుతో కాదు, నిన్నటి మనతో ఉన్నది, ఈరోజు మనతో ఉన్నదీ రెండింటినీ తరచి చూసుకున్నా అవి మనిషిలో ఎప్పుడూ సంఘర్షణను వెంటబెట్టుకొస్తాయి. పోల్చి చూచుకోవడం అనేది లేనప్పుడు ఉన్నది ఒక్కటే వుంటుంది. అది మనలో మనమే అయినా లేక ఇతరులతో అయినా పోలిక అనేది లేనప్పుడు మనలో ఉన్నది ఒక్కటే మనతో ఉంటుంది.  ఉన్నదానితో జీవించడమే ప్రశాంతంగా వుండడం, అప్పుడు మీరు మీ అంతరంగ స్థితికి మరే పరధ్యాసా లేకుండా పరిపూర్ణ సావధానత యివ్వగలరు. అది నిరాశ అయినా, వికారమయినా, క్రౌర్యం అయినా, భయం అయినా, ఆదుర్దా అయినా, ఒంటరితనం అయినా… ఇట్లా ఏదైనా సరే... దానితోనే పూర్తిగా సహజీవనం చేస్తారు. అప్పుడు వైరుధ్యం లేదు. కనుక సంఘర్షణ కూడా లేదు. కాని, ఎంతసేపు మనం ఇతరులతో మనను పోల్చి చూసుకుంటున్నాం. మనకంటే శ్రీమంతులు, మేధావంతులు, మరింత అనురాగపరులు, ప్రసిద్దులు, ఇలా ఎన్నో రకాలుగా మిన్న అయిన వారితో, 'మిన్న' అవడం మనల్ని నడుపుతుంది. మన జీవితాలలో అది గొప్ప ప్రాధాన్యం అయిపోతుంది. ఏదో ఒకదానితోనో, మనష్యులతోనూ పోల్చి చూసుకోవడం అనేది మనకు సంఘర్షణను తెచ్చి పెడుతున్న  ప్రథమ కారణం. అసలు పోల్చి చూసుకోవడం అనేది ఎందుకు జరుగుతోంది? మరొకళ్ళతో మిమ్మల్ని ఎందుకు పోల్చుకుంటారు? ఈ పని చిన్నతనం నుంచి నేర్చుకుంటున్నారు కదా... ప్రతి పాఠశాలలోను యిద్దరు పిల్లలకు పోలిక. రెండో వానిలాగ వుండటానికి మొదటివాడు తనను తాను నాశనం చేసుకుంటాడు. అసలు సరిపోల్చి చూసుకోవడం అనేది లేనప్పుడు, ఆదర్శం అంటూ లేనప్పుడు, అవతలి పక్షం అనేది లేనప్పుడు, ద్వంద్వప్రవృత్తి లేనప్పుడు, మీకంటే విభిన్నమయిన వారుగా మీరు కనిపించాలని ప్రయత్నం చేయనప్పుడు మీ మనసు ఏమవుతుంది? మీ మనసు వ్యతిరేకమైన దానిని నిర్మించడం, ఎదురుగా పెట్టడం మానివేస్తుంది. అప్పుడది చాల తెలివిగా, పదునుగా, లలితంగా, అమిత శక్తివంతగా తయారవుతుంది.  ఎందుకంటే ప్రయత్న ప్రయాసల వలన మన గాఢాసక్తి చెదరిపోయి పలచబడుతుంది. జీవసత్త్వమే శక్తివంతమైన లక్షణం. ఈ సత్యం లేకుండా ఏ పని చేయలేరు.  ఇతరులతో పోల్చి చూసుకోవడం అన్నపని లేనప్పుడు, మీరు మీరుగా వుండిపోతారు. పోలిక వల్ల, మీరు పరిణమించాలనుకుంటున్నారు. ఎదగాలనుకుంటున్నారు. మరింత తెలివి కలవారు, సుందరులు అవాలనుకుంటున్నారు. కాని నిజంగా అలా కాగలరా? వాస్తవం ఏమిటంటే  మీరు ఉన్న స్థితి పోల్చి చూచుకోవడం వల్ల మీరు వాస్తవాన్ని ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు. అది శక్తిని దుర్వినియోగం చేసుకోవడం.  ఎటువంటి పోలికలు లేకుండా, మీ నిజస్థితిని మీరు చూచుకున్నందువల్ల మీకు ఎంతో శక్తి సంపద ఒనగూరుతుంది. పోలికలు లేకుండా మీవంక మీరు చూసుకున్నప్పుడు మనసు తృప్తితో స్తబ్ధమయిపోయిందని కాదు అర్ధం మీరు పోలికలకు అతీతులు అయిపోతారు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవసరమయిన శక్తి,  జీవసత్త్వం ఎలా వృధా అయిపోతుందో మనకు తెలిసివస్తుంది. పోలికలు పెట్టుకోవడం జీవితంలో ఎదుగుదలను, వ్యక్తిత్వాన్ని కుచించుకునేలా చేయడమే అవుతుంది. అందుకే పోలిక మంచిది కానే కాదు.                                       ◆నిశ్శబ్ద.

ఆశించకుండా చేసే మేలు ఎలా ఉంటుంది?

మునుపటి తరాల్లో వారం చేసుకుంటూ చదువుకున్న విద్యార్థులు ఎందరో వుండేవారు. చదువుకోవాలనే వారి అభిలాషా, చదువుకునే  వారిపై ఈ గృహస్థుల అభిమానమూ చూడముచ్చటగా వుండేవి. భారతదేశ అధ్యక్షపదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటివాడే చిన్నతనంలో వారాలు చేసి చదువుకునేంత బీదరికం అనుభవించాడని ఆ తరం వారు చెప్పుకుంటారు. గుణవంతులు, ప్రతిభావంతులు అయిన మరెందరో ఆ విధంగా కష్టపడి చదివి ఆ తర్వాతి జీవితంలో ఎంతగానో గొప్పగా ఎదిగిన వారున్నారు. తనతో సహపంక్తి భోజనం చేసిన కుర్రాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఏదో ఒక ఉన్నతస్థానం ఆక్రమించినప్పుడు తానే స్వయంగా అతడి సహాయం కొరకై ఎదురుచూచే సందర్భం రాకపోయినా, అతడు ఆనాడు తనకు భోజనసదుపాయం ఏర్పరిచిన గృహయజమానిని కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకున్నాడని ఎవరైనా చెప్పినప్పుడో, ఏదైనా సందర్భం పురస్కరించుకొని ఆ పెద్దమనిషి ఈ గృహస్థును ప్రత్యక్షంగా సత్కరించినప్పుడో ఇతడి ఆనందానికి అంతు ఉండదు. దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి.. అమెరికాలోని లీలాండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున విద్యార్థులు అనుకోని ఆర్థిక ఇబ్బందులకు గురైనారు. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు సాడీరుస్కీచేత పియానో వాద్యకచేరీ పెట్టించి ఇంత డబ్బు వసూలు చేయగలిగితే తమ ఇబ్బందినుండి బయట పడచ్చుకదా అని ఒక విద్యార్థికి తట్టింది. సాడిరుస్కీ కచేరీల ఏర్పాట్లు చూసే మానేజర్ను వెళ్ళి కలిశారు. పియానో కచేరీకి రెండువేల డాలర్లు ముట్టచెప్పవలసి వుంటుందన్నాడు ఆ మానేజర్, విద్యార్థులు అలాగేనంటూ వసూళ్ళు ప్రారంభించారు. ఇద్దరు విద్యార్థులూ ఎంతో ప్రయత్నించారు కానీ, పదహారు వందల డాలర్లకన్నా వసూలు చేయలేక పోయారు. కచేరీ జయప్రదంగా ముగిసిన తర్వాత, వారిద్దరూ సాడిరుస్కీవద్దకు వెళ్ళి తాము చేసిన ప్రయత్నం అంతా వివరించి ఎంత శ్రమించినప్పటికీ చివరకు పదహారు వందల డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగామని చెప్పుకుంటూ, ఆ పదహారు వందల డాలర్లతో బాటు మరో నాలుగువందల డాలర్లకు ఓ ప్రామిసరీ నోటు వ్రాసి సాడిరుస్కీ చేతిలో ఉంచారు.  వారు చెప్పినదంతా వినిన సాడిరుస్కీ "అలా కుదరదు బాబూ" అంటూ ఆ ప్రామిసరీ నోటును చింపేసి, పదహారు వందల డాలర్లు వారికి తిరిగి ఇస్తూ “ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మీ కెంత ఖర్చయిందో అది ముందు తీసేసుకోండి. ఆ మిగిలిన మొత్తంలో చెరి పదిశాతం వంతున మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలంగా వుంచేసుకోండి. ఆ మిగతాది నాకివ్వండి" అంటూ అంత మాత్రమే తీసుకున్నాడు. కాలచక్రం దొర్లింది. ప్రథమ ప్రపంచ సంగ్రామం ప్రారంభమై అనేక దేశాల ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసి అంతమైంది. సాడిరుస్కీ మాతృదేశం పోలండ్ ఆర్థికంగా చితికిపోయింది. ఆ దేశ ప్రజలకు తినడానికి తిండికూడా కరువైన గడ్డురోజులు వచ్చాయి. ఆవేశపూరితుడైన సాడిరుస్కీ తన దేశీయుల్ని గట్టెక్కించడానికి అహర్నిశలూ తన శాయశక్తులా కృషిచేస్తున్నాడు. ఆ విపత్సమయంలో తన మాతృదేశాన్ని ఆదుకోగలిగినవాడు అమెరికా దేశ ప్రెసిడెంట్ ఒక్కడేనన్న సంగతి సాడిరుస్కీ గ్రహించాడు.  “మాకీతరుణంలో సహాయం చేసి పుణ్యం కట్టుకోండి”. అని సాడిరుస్కీ తన దేశం తరపున అమెరికన్ అధ్యక్షుడికి విజ్ఞప్తి పంపించీ పంపించక ముందే, పోలీష్ ప్రజలకు పంపిణీ చేయడానికిగాను వేలాది టన్నుల ఆహారధాన్యాలు పోలండ్ లోని ఆహారమంత్రికి అందడం ప్రారంభమైంది. క్షుధార్తులైన వారి ఆహారావసరాలు తీర్చి మరుక్షణం పారిస్ పట్టణంలో మకాం వేసుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ హార్బర్ట్ హోవర్ను కలుసుకోడానికి అక్కడికి హుటాహుటిన వెళ్ళిన సాడిరుస్కీ "సకాలంలో సహాయం అందించి మా దేశవాసుల్ని రక్షించినందుకు కృతజ్ఞత తెలుపుకోడానికి వచ్చాను" అన్నాడు. “దానిదేముంది లెండి సాడిరుస్కీ మహాశయా, మీ ప్రజల అవసరం ఎలాంటిదో నాకు అవగతమైంది. అదీకాక చాలా ఏళ్ళ క్రితం నేను చదువుకుంటున్న రోజుల్లో ఒకమారు చాలా ఆర్థిక ఇబ్బందులకు లోనైనాను. అప్పుడు మీరు నాకూ, నా స్నేహితుడికీ చాలా ఉదారంగా సహాయపడ్డారు లెండి" అని చిరునవ్వుతో సాడిరుస్కీ చేతులు పట్టుకున్నాడు హార్బర్ట్ హోవర్. ఆశించకుండా చేసే సహాయం వల్ల తిరిగి మనిషికి దక్కే ఫలితాలు ఇలాగే ఎంతో అద్బుతంగానూ, ప్రయోజనం చేకూర్చేవి గానూ ఉంటాయి.                                         ◆నిశ్శబ్ద.

మనిషిలో మరొక అంతర కోణం!

హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.

మనిషికి స్పష్టత ఎలా చేకూరుతుంది?

మనందరిలోను ఒక ప్రవృత్తి వుంది అదేంటంటే…. అన్నిటితోనూ సర్దుకుపోవడం అని. దాన్నే అలవాటుపడిపోవడం అంటారు.  పరిస్థితులను నిందిస్తూ కాలం గడపడం, పరిస్థితులు వేరుగా వున్నట్లయితే, నేనూ మరో విధంగానే రూపొందేవాడిని అనో, నాకో అవకాశం ఇవ్వండి, యేం చేస్తానో చూడండి అనో, అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు అనో, ఇలా ఒకటి అని కాదు బోలెడు రకాల మన ఇబ్బందులను ఇతరులకు, పరిస్థితులకు, మన చుట్టూ ఉండే వాతావరణానికి, ఆర్థిక ఒత్తిడులకు ఇలా ఏదో ఒకదానికి అంటగట్టడానికి ప్రయత్నిస్తాము. ఈ చికాకులకు అలవాటు పడిపోయాడంటే వ్యక్తి మనసు బద్ధకంగా తయారయిపోయిందన్నమాట. మన చుట్టూ వున్న సౌందర్యానికి అలవాటు పడిపోయి దాని అస్తిత్వాన్నే గమనించకుండా వుండిపోతాము గదా! అలవాటు పడిపోకపోతే, దాన్నుంచి పరుగులు తీద్దామనుకుంటాము, ఏ మందో మాకో తీసుకుని, రాజకీయ ముఠాలలో చేరి, అరుస్తూ, వ్రాసుకుంటూ, ఆటలకు వెడుతూ గుడి గోపురానికో దర్శనానికి నడుస్తూ పారిపోదామనుకుంటాం. ఏదో మరో రకం వినోదం కల్పించుకుంటూ వాస్తవ విషయాల నుంచి ఎందుకని పరుగెత్తుకుపోదాం అనుకుంటాం?  మనకు మృత్యువు అంటే భయం. ఇది అందరికీ తెలిసిన విషయమే…. ఎవరూ మృత్యువుని ప్రేమించరు. దీనికోసం ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఆశలు, విశ్వాసాలు కనిపెడతారు.  మృత్యువుకు ముసుగు వేయటానికి, అయినా వాస్తవం అలా ఇంకా నిలిచే వుంది. వాస్తవాన్ని అవగాహన చేసుకోవాలంటే మనం దానివంక చూడగలగాలి, దాని నుంచి పారిపోవడం మార్గం కాదు.  మనలో చాలమందికి బ్రతకాలన్నా భయమే, మృత్యువన్నా భయమే. మనకు కుటుంబం అంటే భయం, పదిమంది మాట అంటే భయం, ఉద్యోగం పోతుందేమోనని భయం, మన భద్రత  గురించి భయం, ఇంకా ఇలాంటివే వందలాది విషయాలను గురించి భయం. అసలు వాస్తవం ఏమిటంటే  మనకు భయం, దీన్ని చూసి దాన్ని చూసి కాదు.  వాస్తవాన్ని చూడలేక కలుగుతున్న భయం అది. మనం ఎందుకని ముఖాముఖి ఆ వాస్తవాన్ని చూడలేకపోతున్నాం??  వాస్తవాన్ని సందర్శించడం అనేది వర్తమానంలోనే సాధ్యం. కానీ  ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ దాన్ని ముందుకు రానివ్వడమే లేదు. పలాయన ప్రక్రియకు అనుగుణంగా మనమొక చక్కని వల తయారు చేసుకున్నాం కాబట్టి ఈ అలవాటులోనే చిక్కుబడి పోతున్నాం. మనుషులు అందరూ సునిశితులు, తీవ్రంగా ఆలోచించేవాళ్ళు అయితే, వారి నిబద్ధత వారికి తెలిసి రావడమే కాకుండా, అది తీసుకువచ్చే తదుపరి ప్రమాదాలు కూడా గమనించగలుగుతారు. అది ఎంత క్రౌర్యం, హింస, దుస్సహసస్థితి తీసుకు వస్తుందో తెలుసుకోగలుగుతారు. మీ నిబద్ధతలో వున్న ఈ ప్రమాదాలనన్నిటినీ గమనించినప్పుడు, పని చేయటానికి ఎందుకు పూనుకోరు?  సోమరిపోతులు కాబట్టినా ? సోమరితనం ఎలా కలుగుతుంది??  తగినంత శక్తి - జీవసత్వం లేకపోవడం వల్ల కలుగుతుంది. మీ కళ్లకు ఎదురుగా ఏదో పామో, మంటో, గుంటో వుంటే ఆ స్థూల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అవసరమయ్యే శక్తి మీకు తక్షణమే వాటిని చూసిన వెంటనే సమకూరుతుంది కదా! మరి కొన్ని జీవితకాల విషయాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు. మాటమాత్రంగానే చూసినందువల్ల  మాటకు, ఆచరణకు వైరుధ్యం వస్తుంది. ఆ వైరుధ్యం శక్తి సంపదనంతా కొల్లగొట్టుకుపోతుంది. నిబద్ధతతో స్పష్టంగా చూసి దానిపల్ల వచ్చే ప్రమాదాలను తక్షణమే గమనించగలిగితే అప్పుడే మీరు కార్యాసక్తులవుతారు. కాబట్టి చూడడమే కార్యాచరణ.  మనలో చాలమందిమి జీవితాన్ని అశ్రద్ధగా తీసుకుంటాము. మనం పెరిగిన వాతావరణానికి అనుగుణంగా స్పందనలు, ప్రతిస్పందనలు చేస్తూ వుంటాము. ఇవన్నీ మరింత కట్టుబాటును, బంధనాన్ని తీసుకువస్తాయి. అలా వచ్చినప్పుడే మనిషికి తనమీద తనకు ఒక స్పష్టత చేకూరుతుంది.                                        ◆నిశ్శబ్ద.  

సమైక్యతా స్వరపు ఉక్కు సంకల్పం!

చిన్నప్పుడు ఆవు, పులి కథ పాఠంగా ఉండేది. మూడు ఆవులు కలసి మెలసి ఉండేవి. అవి ఎప్పుడూ కలని తిరిగేవి. కలిసి పచ్చిక మేయడానికి వెళ్ళేవి. అవి అలా కలసి ఉండటంతో వాటి దగ్గరకు వస్తున్న పులిని వాటి కొమ్ముల సహాయంతో తరిమి కొట్టేవి. కానీ ఆ ఆవుల మధ్య గొడవలు వచ్చాయి, ఒకదానికొకటి మాట్లాడుకోవడం మానేసాయి. అది గమనించిన పులి ఒక్కొక్క ఆవును చంపి తినడం మొదలుపెట్టింది. చివరికి ఆ ఆవులను అన్నిటినీ చంపి తినేసింది. ఆవులు కలసి ఉన్నప్పుడు వాటిని ఏమి చేయలేని పులి అవి విడిపోగానే వాటిని చంపేసింది. అంటే కలసి ఉన్నప్పుడు ఆవుల బలం ఎక్కువ, కానీ విడిపోగానే పులి బలం ఎక్కువయ్యింది.  ఇదే విధంగానే ఇంకొక కథ ఉండేది. ఒక తండ్రి తన కొడుకులు ఆస్తి పంచుకుని విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని బాధపడి వాళ్ళను పిలిచి  ఒక్కొక్కరికి ఒకో కర్ర ముక్క ఇచ్చి దాన్ని విరచమని చెబుతాడు. వారు ఎంతో సులభంగా విరిచేస్తారు. ఆ తరువాత కట్ట కఱ్ఱముక్కలు ఇచ్చి విరచమంటే విరచలేరు. కారణం కలసికట్టుగా ఉంటే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ రెండు కథలు అందరికీ తెలియజేసేది ఒకటే…. ఐకమత్యంగా ఉంటేనే అది గొప్ప శక్తిగా అవుతుంది అని.  జాతీయ సమైక్య దినోత్సవం వెనుక కూడా ఇలాంటి కారణమే ఉంది. భారత మొదటి హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నారు.  వల్లభాయ్ పటేల్ జయంతికి సమైక్యతా దినోత్సవానికి లింకేంటి?? భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన ముద్ర వేసిన వల్లభాయ్ పటేల్ లో న్యాయకత్వ నైపుణ్యాలు చాలా ఎక్కువ. ఈయన దేశాన్ని నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ముఖ్యంగా స్వాతంత్య్రం తరువాత 1947 సంవత్సరంలో జరిగిన భారత్- పాక్ యుద్ధ సమయంలో భారతదేశానికి సమర్థమంతమైన వ్యూహాన్ని అందించినవాడు ఈయన. ఈయనలో ఉన్న నైపుణ్యం ఫలితంగా ఈయనను "సర్దార్" అనే పేరుతో పిలుచుకుంటారు. ఇది మాత్రమే కాకుండా ఐక్యతలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించిన ఈయన బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిన తరువాత  అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో చేరేలా చేయడంలో  చేసిన కృషి మరచిపోలేనిది. ఇది భారతదేశం మొత్తం ఐక్య దేశంగా అవతరించడానికి మూలకారణం అయ్యింది.   ఒకటా రెండా బ్రిటీష్ ఆధిపత్యం నుండి విడుదలైన 565 స్వయం పాలక సంస్థానాలలో దాదాపు ప్రతి ఒక్కటి భారత యూనియన్‌లో చేరడానికి ఒప్పించిన అద్భుతమైన నైపుణ్యం  ఈయనదే…. ఇంతటి అసాధ్య పనిని సుసాధ్యం చేసినందుకు గానూ ఈయనను "భారతదేశపు ఉక్కు మనిషి" అనే బిరుదుతో ఎంతో ఆత్మీయంగా పిలుచుకుంటారు. 2014 సంవత్సరంలో అత్యంత ఎత్తైన ఉక్కు విగ్రహాన్ని ఆవిష్కరించింది మోదీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం హాయంలో ఆ సందర్భంగానే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవం లేదా  రాష్ట్రీయ ఏక్తా దివస్ ను దేశ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించారు. అప్పటినుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 తేదీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారిక ప్రకటనలో  ఏ బెదిరింపులకు లోనూ కాకుండా దేశం యొక్క స్వాభావిక బలం మరియు స్థితిస్థాపకతను పునరుద్ఘాటించే అవకాశాన్ని కల్పిస్తుంది. మన దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రత గురించి దేశం మరొక అడుగు ముందుకు వెళ్లే దిశగా ఆలోచనలు, సరికొత్త ఆచరణలు చేపడుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ చేయబడుతుంది. దాని సారాంశం ఎలా ఉంటుందంటే…. "జాతి ఐక్యత, సమగ్రత భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తానని, నా తోటి దేశస్థులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్  దార్శనికత, ఆయన జీవించి ఉన్న కాలంలో చేపట్టిన  చర్యలు గుర్తుంచుకొని నా దేశం యొక్క అంతర్గత భద్రత విషయంలో నా స్వంత సహకారం అందించాలని నిర్ణయించుకున్నాను" అనే ప్రతిజ్ఞ చేయబడుతుంది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు). మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పాటించేందుకు అక్టోబర్ 31న ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞను నిర్వహించేందుకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా జాతీయ సమైక్యతా దినోత్సవం వెనుక భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అనిర్వచనీయమైనదిగా ఉంది.                                      ◆నిశ్శబ్ద.

ఆహారమే ఆరోగ్యమంటారు ఎందుకు?

ఆరోగ్యానికి ఆయువుపట్టు మనం తీసుకునే ఆహారం. ఆహారం నియమబద్ధంగా ఉండాలి. మనం బ్రతకడానికి తినాలి. అంతే కానీ తినడం కోసమే బ్రతకకూడదు. పౌష్టికాహారాన్ని నియమబద్దంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ నియమబద్ధమైన ఆహారం కొందరికి మాత్రమే పరిమితం కాదు. ఇది అన్ధశ్రీ హక్కు. దీన్ని అందరూ తీసుకోవాలి. క్రొవ్వు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మితంగా తినాలి, బాగా పనిచేయాలి. ఎప్పుడూ హుషారుగా ఉండాలి. మన శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పోషించేవి విటమిన్స్. న్యూట్రిషన్ ఫుడ్ అంటే సంపూర్ణాహారం తీసుకోవాలి. పాలు, పండ్లు, సంపూర్ణ ఆహారం క్రిందకు వస్తాయి. నువ్వెంత తిన్నావని కాదు ప్రశ్న. ఏ రకమైన ఆహారం తీసుకున్నావన్నది ముఖ్యం. మనం తీసుకునే ఆహారం మనకు ఆరోగ్యదాయకం కాకపోయినా మనకు అనారోగ్యాన్ని చేకూర్చకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి.  బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటి? అని చాలా మంది సందేహం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, క్రొవ్వు పదార్థాలు ఉండాలి. ప్రతి వ్యక్తికి కొంతశాతం అంటే కొన్ని కేలొరీల శక్తి గల ఆహారం కావాలి. కేలొరీల శక్తి మరీ తగ్గకూడదు. మరీ హెచ్చు కాకూడదు. రెండూ కూడా మన ఆరోగ్యానికి హానికరమే ! సామాన్యంగా మనం తీసుకునే ఆహారంలో తక్కువ కేలరిక్ వేల్యూ ఉండాలి. న్యూట్రిషన్ వేల్యూ, ఫుడ్ వేల్యూ హెచ్చుగా ఉండాలి. ముందుగా పౌష్టికాహారానికి కావలసింది ప్రోటీన్స్. అవి బాగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి బలం చేకూర్చడానికి ప్రోటీన్స్ తో పాటు, కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. చాలా మందికి కార్బొహైడ్రేట్స్ మూలంగా లావెక్కుతారనే అపోహ ఉంది. ఎక్కువగా ఏ రకమయిన ఆహారం తీసుకున్నా ప్రమాదమే. కొవ్వు పదార్థాలను కూడా మితిమీరి తీసుకోరాదు. నిజానికి శరీర దారుఢ్యతకు కొవ్వు ఎంతో అవసరం. కొవ్వు పదార్థాలను అసలు తీసుకోకపోవటం కూడా హానికరమే. కనుక మన నియమిత ఆహారంలో కొవ్వు పదార్థం కూడా తీసుకోవాలి. అలాగని ఎక్కువగా తీసుకోకూడదు.  మనం తీసుకునే ఆహారంలో హెచ్చుభాగం పండ్లు ఉండేటట్లు చూసుకోవడం మంచిది. కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో హెచ్చుగా విటమిన్స్ లభ్యమవుతాయి. మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. తాజా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. టొమోటాలు, దోసకాయ, పాల కూర మొదలయిన వాటిలో హెచ్చుగా కాల్షియం ఉంటుంది. ఐరన్ ఉంటుంది. కెరోటిన్, రిబోఫ్లోవిన్, విటమిన్ 'సి' ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిది.  తాజాపండ్లు ఆరంజ్,  ఆపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యుస్ కూడా మంచిదే. అందులో విటమిన్ 'సి' ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలని అనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి. ఎక్కువగా కాఫీ, టీ తాగకూడదు. చల్లని పానీయాలు ఆరోగ్యానికి హానికరం ఎక్కువగా తీసుకోరాదు.నీరు పుష్కలంగా తాగాలి. పైన చెప్పుకున్న  ఆహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా, అందం సొంతం చేసుకోవచ్చు.                                          ◆నిశ్శబ్ద.

మనిషికి దుఃఖం నేర్పేది ఏమిటి?

జీవితంలో మనిషి సుఖాన్ని మాత్రమే కోరుకుంటాడు. బాధకలుగుతుందంటే భయపడతాడు. శారీరక బాధకు మానసికమైన ఆదుర్దా, భయమూ గనక జోడించకపోతే, కేవలం శారీరక బాధ బాధాకరం కాదు. ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక వైద్యవిధానంలో ఈ బాధను చాలావరకు ఉపశమింపచేయగలిగి ఉన్నారు. కానీ బాధను ఓర్చుకోడం కూడా కొంత నేర్చుకోవాలి. అసలు ఓర్వలేనంటూ బాధకలిగి కలగకముందే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటే ఇక బాధ ద్వారా ప్రకృతి మనిషికి నేర్పగలిగింది కానీ, మనిషి నేర్చేదికానీ ఏమీ వుండదు. బాధ నేర్పేదేమిటనే ప్రశ్న కలగవచ్చు. నిజానికి జీవితంలో మనం నేర్చుకునేది చాలామటుకు బాధద్వారే గానీ సుఖం ద్వారా కాదు. సుఖం మనిషిని మత్తులో ముంచుతుంది. బాధ ఏ రంగంలో ఏ అవయవంలో మనకు కలుగుతుందో, ఆ విషయం మొత్తం విశదంగా తేట తెల్లంగా సంపూర్ణంగా మనకు తెలియజేస్తుంది.  ప్రేయసీ ప్రియుల హృదయాలు విరహవేదనను అనుభవించినప్పుడే ప్రేమ నిజంగా ప్రకటితమవుతుంది. స్త్రీ పురిటినొప్పులు పడినప్పుడు కానీ నూతనసృష్టి ప్రారంభం కాదు. గౌతముడు దుఃఖాగ్నిని అనుభవించినందునే సత్యాన్వేషకుడైనాడు. ఒక శ్వేతజాతీయుడు దక్షిణాఫ్రికాలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే వ్యక్తిని అర్థరాత్రి రైలునుండి బయటికి తోసేస్తే, చలిలో వణుకుతూ స్టేషన్లో కూర్చున్నందునే గాంధీ హృదయంలో శ్వేత జాత్యహంకారాన్ని నిర్మూలించాలనే అకుంఠిత దీక్ష బయలుదేరింది. పురాణకాలం నుండీ ఆధునిక కాలం వరకూ బాధలేకుండా ప్రయోజనకరమైన పని ఏదీ జరగలేదు. ప్రజలు బాధలకు గురియైన తర్వాతగానీ అవతార పురుషులుగా మార్లు చెందలేదు.  మనిషి బాధపడిన తర్వాతగానీ జ్ఞానము ఉదయించదు. బాధనెరగని జీవితం పరిపూర్ణమైన జీవితం కానేకాదు. బాధకీ, భక్తికీ దగ్గర సంబంధమని తోస్తుంది. “బాధలకొరకే బ్రతికించితివా” అనే పాటను సక్కుబాయి నిజజీవితంలో పాడినా పాడకపోయినా, ఆ బాధామయ జీవితంలోనే ఆవిడ అనేకసార్లు మూర్ఛిల్లడం, అనేకమార్లు ఆవిడకు పాండురంగ విఠల్ దర్శనమివ్వడం జరిగింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి మరచిపోకుండా వుండడానికి తరచూ తనకు బాధలు కలిగించమని ప్రార్థించింది కుంతీదేవి. బాధలోగానీ భగవంతుడు కనిపించడన్నమాట, “ఎంత బాధపడ్డానో, దేవుడు కనిపించాడనుకోండి” అని వారూ, వీరూ ఉత్తుత్తగా అనడం వింటుంటాం. నిజంగా అంత బాధపడివుండరు. దేవుడు కనిపించీ వుండడు. కానీ నిజంగా బాధపడితే దేవుడు కనిపించడం కూడా యథార్థమే అయివుండాలి. భక్తరామదాసుకు అలాగే కనిపించాడు. హృదయవేదనకు గురైన త్యాగరాజుకు అలాగే కనిపించాడు. ఆవేదనలో నుండే అద్భుతమైన భక్తి సంగీత సాహిత్యాలు వెల్లువలై పొంగి ప్రవహించాయి. మామూలు మనిషికి బాధ అంటే ఎంత భయమో, మరణం ఆసన్నమవుతోంది అంటే అంతకు పదిరెట్లు భయం. కానీ స్థిరచిత్తులైన వారికి మరణం సమీపిస్తున్నదంటే, తాము నిర్ణయించుకున్న కర్తవ్యం పూర్తి చేయాలనే పట్టుదల అధికమవుతుంది. ప్రఖ్యాత జర్మన్ సంగీత స్రష్ట ఫ్రెడరిక్ షోపోన్ ఆరోగ్యం క్షీణిస్తున్న రోజులలో ఇక తన జీవితకాలం సమాప్తం కానున్నదనే సంకోచం ఏర్పడింది. అందుకని మరింత పూనికతో సంగీతాన్ని కంపోజ్ చేస్తుండేవాడు. తరచూ తీవ్రమైన అనారోగ్యానికి గురవడం వల్ల షోపోన్ ఇక బ్రతకడేమోననే అనుమానం ఊరివారందరికీ తరచూ కలుగుతుండేది. షోపోన్ మరణించాడనే వార్త వ్యాపించినా అందరూ ఇట్టే నమ్మేవారు. షోపోన్ తన వైద్యులిచ్చిన రిపోర్టుల సంగ్రహాన్ని ఇలా తెలియజేసుకున్నాడు. " ఒక వైద్యుడు నేను ఖాయంగా చనిపోతానని తెలియజేశాడు. మరొక వైద్యుడు ఇక నేను మరణించడానికి అట్టే కాలవ్యవధి లేదన్నాడు. మూడో వైద్యుడు నేను గతించాననే ప్రకటించేశాడు. ఏంచేయను?" అని తన నిస్సహాయతను ప్రకటించాడు. తన పరిస్థితి తరచూ అంతగా విషమంగా లేదన్నమాట. షోఫోన్ బాధతోనే గతించాడు. అయితేనేమి ఈ భూలోకవాసులకు గాంధర్వ గానమందించి వెళ్ళాడు. నిజానికి షోపోన్ యొక్క అలౌకిక సంగీతం అతడి బాధాతప్త హృదయం నుండి జనించింది. షోపోన్ మూలుగే మహాద్భుతమైన మ్యూజిక్ అయింది. ఇదీ మనిషికి బాధ, దుఃఖం, కష్టం నేర్పించే గొప్ప పాఠం, అది అందించే గొప్ప బహుమానం.                                                            ◆నిశ్శబ్ద.