ప్రేమించడం తప్పు కాదు.. కానీ రిలేషన్ నిలబడాలంటే ఇవి ముఖ్యం..!
posted on May 15, 2025 @ 9:30AM
ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల రిలేషన్ లోతును, దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది. ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి.
నమ్మకం..
సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం, సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య సమన్వయం కూడా పెరుగుతుంది.
స్వేచ్ఛ..
ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్ ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు.
కమ్యూనికేషన్..
భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి.
శ్రద్ద..
చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు. ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు.
పోలిక..
భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు. బయట సంబంధంలో ఉన్నవారిని, ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు, నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు. దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.
*రూపశ్రీ.