Read more!

మాటలతో కట్టిపడేయాలంటే ఇలా ఆకట్టుకోవాలి!

మాట ఆభరణం మనిషికి అంటారు పెద్దలు. మాటే మంత్రము అంటారు కవులు. మాట ఇతరులను ముగ్ధులను చేస్తుంది, ఆకర్షిస్తుంది. అందంగా ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా ఒక కళ. ఇప్పటి యూత్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మాట్లాడటం గురించి కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మాట్లాడటంలో అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. 

ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణలో మనం ఎప్పుడూ ఇతరులతో వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. సంభాషణలో మనకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అంతేకానీ వాదనకు దిగటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాదనే గొడవలకు దారి తీస్తుంది. సంభాషణలో ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ మాట్లాడాలి. ఇతరులు చెప్పిన దాన్ని వారి ముఖం మీదే తప్పు అని ఖండిస్తూ మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా సంభాషణలో మనం మాట్లాడేది తప్పు అని మీరు గమనించినా లేక ఇతరులు తెలియజేసినా హుందాగా ఆ తప్పును అంగీకరించాలి. అంగీకరించడంలో కూడా గొప్ప వ్యక్తిత్వం వ్యక్తం అవుతుంది. అంతేగానీ ఆ తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నించకూడదు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ఇతర పనులు కూడా తప్పిదాలే అవుతాయి. ఒకదాని వెనుక ఒకటిగా తప్పుల చిట్టా పెరుగుతుంది. సంభాషణని ఎప్పుడూ కూడా స్నేహపూర్వకంగా ప్రారంభించాలి. అలాగే చిరునవ్వుతో ముగించాలి. అప్పుడే విలువను కాపాడుకోగలిగిన వారమవుతాము. నచ్చని విషయాలు ఉన్నా, న్యాయమైన విషయాలు లేకపోయినా వాటిని సుతిమెత్తగా నవ్వుతూనే చెప్పాలి తప్ప గొడవకు దారితీసేలా ఆవేశంగా ఉండకూడదు.

ఇతరులు చెప్పే విషయాలను మనం ఎప్పుడూ జాగ్రత్తగా వినాలి. వారు చెబుతున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీలో లేదా కూర్చున్న స్థానంలో కొంచెం ముందుకు వంగి వినాలి. వారికి అటెన్షన్ ఇస్తున్నామనే అభిప్రాయం  కలుగుతుంది. చెప్పాల్సిన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా, దాపరికం లేకుండా చెబుతారు. ఇతరుల అభిప్రాయాలపట్ల సానుకూలంగా స్పందించాలి. ఎప్పుడూ కూడా సంభాషణలో ఇతరులను ఆకర్షించాలంటే ఎదుటి వారిని ఎక్కువగా మాట్లాడనివ్వాలి. మనం చెప్పాలనుకున్న విషయాలు, మనం చేయాలనుకున్న ఆలోచనలనూ ఇతరుల ఆలోచనలుగా చేసి వాటిని ఆమోదించాలి.

విషయాలను మనం చూసే కోణంలో కాక ఇతరుల కోణంలోంచి చూడాలి, ఆలోచించాలి. మనం ఇతరులపట్ల చూపవలసింది గౌరవాన్ని అనే విషయం మరచిపోకూడదు. వారు చెప్పే మంచిని మనస్ఫూర్తిగా అభినందించాలి. సంభాషణలో అన్నీ నాకు తెలుసు అనుకొనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవతలి వారు అభిప్రాయాన్ని విషయాన్ని పూర్తిగా చెప్పేంతవరకూ వినాలి. అంతేకానీ మధ్యలో  తొందరపడి ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వకూడదు. సూచనలు ఇచ్చే ముందు వారు చెప్పిన విషయాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొన్నాకే ఇవ్వండి.

ఇతరులతో సంభాషించే ముందు సంభాషణను అభినందనతో ప్రారంభించాలి. ఇతరులు చేసిన పొరబాట్లను బహిరంగంగా విమర్శించకూడదు. ఇతరులను విమర్శించే ముందు మీ తప్పుల్ని మీరు అంగీకరించాలి. ఇతరులకు ఆజ్ఞాపూర్వకమైన సూచనలు ఇవ్వవద్దు. దానికి బదులుగా సలహాపూర్వక సూచనలు ఇవ్వాలి. సంభాషణలో ఎప్పుడూ కూడా ఇతరులను అవమానించకూడదు. ఇతరులలో ఉన్న మంచి గుణాలను గాని లేక ఇతరులలో మీరు ఆశిస్తున్న మంచి గుణాలను వారికి ఆపాదించి, వారిని ఆ విధంగా ఉండేలా మలచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇతరులను ఆకర్షించుకోగలుగుతాము. ఎప్పుడైనా సరే ఎదుటివారి మంచిని బయటకు చెప్పి వారిలో ఉన్న తప్పును ఇది ఇలా ఉండచ్చా?? అలా ఉంటుందని నాకు తెలియదు లాంటి మాటలతో చెప్పాలి. అలా చెబితే మన మాటల ద్వారా అది తప్పేమో అనే ఆలోచన చేసి చివరికి వారు దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ మాటల్లో ఉన్న మర్మం, మాటకు ఉన్న ఆకర్షణ, మాటకున్న శక్తి. 

                                    ◆నిశ్శబ్ద.