Read more!

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

పిల్లలకు ఈమధ్య కాలంలో మెదడు చురుగ్గా అవ్వడం కోసం ఫోనెటిక్ నెంబర్స్ గురించి చెబుతున్నారు. అయితే ఈ నంబర్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

ఇది ప్రాచీన కాలంలో గ్రీకు దేశంలోవారు తమ జ్ఞాపకశక్తితో రాజుల మెప్పు పొందేందుకు అక్కడి  ఆస్థాన పండితులు కనుగొన్నారు. అచ్చుల హల్లుల ఉచ్ఛారణకు ఒక్కొక్క అంకెను కేటాయించి వాటితో పెద్ద పెద్ద అంకెలను పదాలుగా గుర్తుంచుకొని ఆ అంకెలను వెంటనే ఏ క్రమంలో అడిగితే ఆ క్రమంలో చెప్పగలగడం ఈ పద్ధతి యొక్క విశేషం.

ఈ విధానాలతో అనేక మంది జ్ఞాపక శక్తి ప్రదర్శనలు ఇస్తూ మానవ మెదడు యొక్క అద్భుత శక్తిని తెలియచేయడం అందరికీ తెలిసినదే. ఈ ప్రదర్శనల వల్ల ఏమిటి లాభం అనే సందేహం కొంతమంది మేధావులకు ఉన్నప్పటికీ తమకు తెలివితేటలు లేవు తాము సరిగా చదవలేమని ఆత్మన్యూనత భావంతో బాధపడే విద్యార్థులలో ఇటువంటి ప్రదర్శనలు మంచి ఆత్మవిశ్వాసం కలిగిస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

అన్నింటికన్నా జ్ఞాపకశక్తికి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆ విషయం పట్ల ఒక వ్యక్తికున్న ఆసక్తి మరియు ప్రాధాన్యత. చాలా మంది డబ్బు విషయంలో గాని, ఇష్టమైన వారి పుట్టినరోజు విషయంలో గాని, తమ అభిమాన హీరో సినిమా వివరాల గురించి గాని, అభిమాన క్రికెటెర్ల రికార్డుల గురించి గాని ఏ మాత్రం మరచిపోవడం ఉండదు. ఎందుకంటే వాటికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. అలాగే చదువు కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడిన విషయం అనే అవగాహన మరియు శ్రద్ధ వారికి కల్పిస్తే వాటికి సంబంధించిన విషయాలను వారు మరచిపోయే పరిస్థితి తలెత్తదు. 

బాల్యం యొక్క అమాయకత్వం వలన తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన వారు చదువు పట్ల ఆసక్తి కనబరచకపోవచ్చును. పై విషయాలన్నింటినీ చదివాక ఏమి అర్థం అవుతుందంటే... శారీరకంగా, పుట్టుకతో ప్రతీ విద్యార్థికి ఒకే రకమైన మేథస్సు, సామర్ధ్యం ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలియచేసారు. పైన పేర్కొన్న అంశాలు చదివితే అందరికీ అదే అనిపిస్తుంది. ఈ మెదడు దాని సామర్ధ్యం అందరికీ ఒకేలా ఉన్నప్పుడు మరి అందరి యొక్క పనితీరు, ఫలితాలు మరియు పెరఫార్మెన్స్ ఒకేలా ఎందుకు ఉండటం లేదు. ఈ విషయం గురించి ప్రశ్న వేసుకుంటే… చాలామంది తెల్ల ముఖాలు వేస్తారు. 

దీనికి సరైన విధంగా అర్థమయ్యేట్టుగా కంప్యూటర్ పరిభాషలో చెప్పుకుంటే హార్డ్వేర్ అందరికీ ఒకేలా ఉంది కాని సాఫ్ట్వేర్ సరిగా తయారుచేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులది మరియు ఇటు ఉపాధ్యాయులదే. అన్నింటికన్నా ఒక విషయం బాగా గుర్తుండాలంటే ఆ విషయం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని ఆ విద్యార్థి గ్రహించాలి.

అందుకే శ్రద్ధ అంటే తెలుసుకోవాలనే ఉత్సుకత, తెలుసుకోడానికి సంసిద్ధత మరియు నేర్పుతున్నవారిపట్ల గౌరవభావం. అందువలనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మరియు ఆసక్తి కరంగా బోధించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే..

మరి వారి సహజ సామర్థ్యాలు మరుగునపడకుండా వారికి వారు సంపూర్ణంగా ఉపయోగపడే విధంగా తయారుచేయవలసిన గురుతర బాధ్యత అటు తల్లిదండ్రుల చేతిలో ఇటు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందనడం నిర్వివాదాంశం కదా!! ఇదే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. వాటిని పాటించాలి.

                                  ◆నిశ్శబ్ద.