ఇసుక దందా.. బాపట్ల ఎంపీ సోదరుడు అరెస్ట్

వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా అక్రమాలతో చెలరేగిపోయిన  ఆ పార్టీ నేతల లీలలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకుని ప్రశ్నించిన తెలుగుదేశం ఏజెంట్ పై దాడికి పాల్పడిన కేసులో పిన్నెల్లి అరెస్టయ్యారు. ఆయన అరెస్టయిన రోజుల వ్యవధిలోనే బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ సోదరుడు నందిగం ప్రభుదాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయనను ఇసుక అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఉద్దండరాయుని పాలెం వద్ద సోమవారం (జులై 1) తెల్లవారు జామున ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని పోలీసులు లారీని పట్టుకున్నారు.  లారీ డ్రైవర్ ను అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు.  విచారణలో ఈ ఇసుక అక్రమ రవాణాలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ హస్తం ఉందని తెలియడంతో తుల్లూరు పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ప్రశ్రించారు. ఇలా ఉండగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తన సోదరుడి అరెస్టు పై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా ఉండగా గత ప్రభుత్వంలో నిబంధనలకు తిలోదకాలిచ్చి జగన్ కు అడుగులకు మడుగులొత్తే చందంగా వ్యవహరించిన అధికారులను, అలాగే అక్రమాలకు పాల్పడిన నేతలను ఉపేక్షించే ప్రశక్తే లేదని ఇప్పటికే  తెలుగుదేశం అధినేత ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి 20 రోజులు అవుతున్నా జగన్ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై ఇంత వరకూ చర్యలు తీసుకోకపోవడంపై తెలుగుదేశం శ్రేణులలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది, ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందు పాదయాత్ర సందర్భంగానూ తెలుగుదేశం కీలక నేత, మంత్రి లోకేష్ పదే పదే రెడ్ బుక్ లో అక్రమార్కుల అందరి పేర్లూ ఉన్నాయి. అధికారంలోకి రాగానే విచరణ జరపి చట్టపరంగా శిక్షిస్తామని  చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ తెలుగుదేశం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  అయితే తెలుగుదేశం కూటమి ఎవరిపైనా కక్ష సాధింపు పద్ధతిలో చర్యలు తీసుకునే ప్రశక్తే లేదని, అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో చెబుతోంది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు కూడా ఆరంభమయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందే మద్యం కుంభకోణం పై కేసు నమోదు కావడమే కాకుండా వాసుదేవరెడ్డిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించి ఆయన నుంచి మొత్తం గుట్టు రాబట్టారు. ఇప్పుడు సీఐడీ మద్యం దందా లెక్కలను తేల్చే పనిలో తలమునకలై ఉంది.  ఇక ఇసుక మాఫియాకు సంబంధించి  అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలే ప్రశక్తేలేదని, అక్రమాలు, అక్రమార్కులకు సంబంధించిన నివేదికలు సిద్ధమౌతున్నాయనీ తెలుస్తోంది. జగన్ కు వంత పాడి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన అధికారులు దాదాపుగా జీఏడీకి అటాచ్ అయ్యారు. ఇలాంటి వారంతా  ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రబాబు వద్దకు వచ్చి ఓ బొకే అందించి, తమదేమీ లేదనీ అంతా జగన్మాయేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే చంద్రబాబు మాత్రం వారి అభినందనలు స్వీకరించడానికి, వారిచ్చిన బొకే తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో తమ పప్పులుడికేలా లేవని గ్రహించిన పలువురు అధికారులు వీఆర్ఎస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని విస్పష్టంగా చెబుతోంది. ఇక తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన వీఐపీ మూకలపై కూడా చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితర నేతల అనుచరులపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైంది. దాడి జరిగిన రెండున్నరేళ్ల తరువాత ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక అధికారుల బృందం తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి దాడి జరిగిన రోజు నాటి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దాడికి పాల్పడిన వారినే కాకుండా దాడి చేయించిన వారిపైనా చర్యలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇలా జగన్  ఐదేళ్ల పాలనలో నిబంధనలకు తిలోదకాలిచ్చి, అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ఆరంభమైపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  జగన్ హయాంలోలా అడ్డగొలుగా, కక్ష సాధింపులకు పాల్పడే విధానం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో జరగదనీ, గీత దాటిన ఏ ఒక్కరినీ కూడా వదలి ప్రశక్తే లేదనీ, అంతా నిబంధనలకు అనుగుణంగా చట్టప్రకారం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

కెనడాలోనూ ఒక కేఏ పాల్..!

మన కేఏ పాల్ లాంటి పెద్దమనిషి కెనడాలో కూడా ఒకాయన వున్నాడు. ఆయన పేరు హామెల్. ఎలక్షన్లలో పోటీ చేయడం, అదిరిపోయే లెవల్లో ప్రచారం చేయడం, చివరికి ఓడిపోవడం. ఇది ఆయనకి బాగా అలవాటు. లేటెస్ట్.గా టొరంటో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. హామెల్ కూడా ఈ ఉప ఎన్నికలో పోటీ చేశాడు. రిజల్ట్స్ వచ్చాక ఆయనకి వచ్చిన ఓట్లు చూసి అందరూ బిత్తరపోయారు. ఏంటీ.. ఆయన గెలిచారని అనుకుంటున్నారా? ఆయనకి అంత సీను లేదు. మన కెనడా కేఏ పాల్‌కి ఆ ఎలక్షన్స్.లో జీరో ఓట్లు వచ్చాయి.. అవునండీ, కనీసం ఒక్క ఓటు కూడా రాలేదు. అదేంటీ? కనీసం ఆయన ఓటైనా ఆయనకు పడాలి కదా అనుకుంటున్నారా? అది కుదరదండీ.. ఎందుకంటే, ఆయన లోకల్ సిటిజన్ కాదు.. అందువల్ల టొరంటో నియోజకవర్గంలో ఆయనకు ఓటు లేదు. హామెల్‌కి ఒక్క ఓటు కూడా పడకపోవడం కెనడాలో ఒక రికార్డుగా మారింది. ఇప్పటి వరకు కెనడాలో జరిగిన ఏ ఎలక్షన్‌లో కూడా ఎవరికీ జీరో ఓట్లు రాలేదట. అలా జీరో ఓట్లు సాధించిన మన కెనడా కేఏ పాల్... కొత్త రికార్డు క్రియేట్ చేసిన హీరో అయ్యాడు. మరి, మన కేఏ పాల్ సారు ఎప్పుడు హీరో అవుతారో!

బిఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురేనా? సబిత చూపు కాంగ్రెస్ వైపే

గత కొంతకాలంగా బిఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు , ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా దూసుకెళ్తుంది గత అసెంబ్లీలో బిఆర్ఎస్ అట్టర్ ప్లాప్ కావడంతో పార్లమెంటు ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలని భావించిన బిఆర్ఎస్ కు చుక్కెదురైంది. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ జీరోకి పడిపోయింది. గత వారం చేవెళ్ల కాలేయాదయ్య, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాలె యాదయ్య అయితే తాను చచ్చే వరకు బిఆర్ఎస్ లో కొనసాగుతానని చెప్పి తీరా కాంగ్రెస్ లో చేరారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరగడంతో ఆయన అధికారపక్షమైన కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మాజీ స్పీకర్ పోచారంశ్రీవివాస్ రెడ్డి కెసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అతనికి కెసీఆర్ స్పీకర్ పదవి కట్టబెట్టారు. బిఆర్ఎస్ లో అత్యంత ముఖ్యమైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పోచారం చివరకు కాంగ్రెస్ లో చేరడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. పోచారం కాంగ్రెస్ లో చేరే ముందు హరీష్ రావు బుజ్జగించారు. అయినప్పటికీ పోచారం తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ లోచేరుతున్నట్టు ప్రకటించారు. సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరుగా కొనసాగుతున్నారు. అయితే కెసీఆర్ ఇటీవలె తన ఫామ్ హౌజ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కెసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి డుమ్మా కొట్టారు. అప్పట్నుంచి సోషల్ మీడియాలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. బడంగ్ పేటలో గత శుక్రవారం ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు కొందరు విలేకరులు మీరు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రేవంత్ కేబినెట్ లో ఉంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి అన్నప్పుడు ఆమె ఖండించకపోగా మంత్రి పదవి రావడం అదృష్టం ఉంటేనే దక్కుతుంది అని ఆమె అనడంతో  సబిత పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తనకు మంత్రి పదవి, తన కుమారుడికి కార్పోరేషన్ చైర్మన్  పదవి అని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపించింది.      అయితే ఈ వార్తలను సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. తనకు బిఆర్ఎస్ పార్టీలో ప్రత్యేక స్థానం ఇచ్చారని పైకి చెబుతున్నప్పటికీ సబిత కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం మరింత ఎక్కువైంది. బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరూ కారు దిగిపోతుండటంతో చివరకు కెసీఆర్ కుటుంబానికి చెందిన కెటీఆర్, హరీష్ రావ్, కవిత మాత్రమే బిఆర్ఎస్ లో మిగుల్తారని నెటిజన్లు కామెంట్స్ పాస్ చేస్తున్నారు.

అమెరికాలో అంతే..!

అమెరికాలో ఒక తల్లి.. నలుగురు పిల్లలతో కలసి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ నలుగురు పిల్లలూ ఒక మ్యాన్‌హోల్లో పడిపోయారు. దాంతో ఆ తల్లి విలవిలలాడిపోయింది. సహాయం కోసం తల్లడిల్లిపోయింది. ఆ తల్లి బాధని అక్కడున్నవాళ్ళు చూశారు. వెంటనే స్పందించారు. ఫైర్ ఫైటర్స్.కి ఫోన్ చేశారు. ఫైర్ ఫైటర్స్ మెరుపు వేగంతో వచ్చారు. ఒక్కళ్లు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు వచ్చారు. వీళ్ళే కాకుండా ఇద్దరు పోలీసులు కూడా వచ్చారు. వచ్చిన వెంటనే ఫైర్ ఫైటర్స్ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మాన్‌‌హోల్లోకి దిగారు. నలుగురు పిల్లల్నీ కాపాడారు. థాంక్‌గాడ్... నలుగురు పిల్లలకీ ఏమీ కాలేదు.. చాలా సేఫ్‌గా వున్నారు. పరుగు పరుగున తల్లి దగ్గరకి వెళ్ళారు. పిల్లలు క్షేమంగా బయటపడేసరికి ఆ తల్లి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తన పిల్లల్ని కాపాడిన ఫైర్ ఫైటర్స్ వైపు కృతజ్ఞతగా చూసింది. ఆనందంగా తోక ఊపింది. అంతా బాగానేవుంది కానీ, ఈ తోక ఊపడం ఏంటీ అనుకుంటున్నారా? ఆ తల్లి ఎవరో కాదు.. బాతు.. ఫైర్ ఫైటర్స్ కాపాడింది మరెవర్నో కాదు.. బాతు పిల్లల్ని. అమెరికాలో అంతేనండీ... ఎవర్ని కాపాడ్డానికైనా రెడీగా వుంటారు.

ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టిన కేజ్రీవాల్ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని, రిమాండ్ కు తరలించడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అలాగే తనను మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ జూన్ 26న ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా ఆయన తప్పుబడుతూ కోర్టుకెక్కారు. సీబీఐ తనను అరెస్టు చేయడం చట్టబద్ధమేనంటూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జూన్ 26న ఆదేశాలు జారీ చేయడం.. తనను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో జూన్ 29న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్ ను జూలై 12 దాకా అంటే మొత్తం 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది.  కేజ్రీవాల్ ను కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులోని ప్రధాన కుట్రదారుల్లో ఒకరిగా కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చిందని గుర్తుచేసింది. అలాగే ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున ఆయన కస్టడీ అవసరమని పేర్కొంది. అంతకుముందు వాదనల సందర్భంగా సీబీఐ ట్రయల్ కోర్టుకు కేజ్రీవాల్ తమ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది. తాము అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వడం లేదని తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ను మార్చి 21న అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం విధానంలో భారీగా డబ్బు చేతులు మారిందని.. ఇందులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీలోని ట్రయల్ కోర్టు ఇటీవల ఆయనకు బెయిల్ ఇవ్వగా ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది. ఈ కేసులో 17 మందిని నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేసింది. కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆప్ మీడియా ఇన్ చార్జి విజయ్ నాయర్ వివిధ మద్యం తయారీ సంస్థలు, మద్యం వ్యాపారులను ముడుపులు అడిగారని ఈడీ ఆరోపిస్తోంది. ముడుపులు ఇచ్చే సంస్థలు, వ్యాపారులకు అనుకూలంగా 2021–22 ఎక్సైజ్ పాలసీలో నిబంధనలు పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. ఇందుకు అంగీకరించిన సౌత్ గ్రూప్ సహా కొన్ని సంస్థలతోపాటు కొందరు వ్యాపారుల నుంచి సుమారు రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని తెలిపింది. ఆ సొమ్మును హవాలా మార్గం ద్వారా పార్టీ ఖాతాలోకి మళ్లించారని.. అందులో సుమారు రూ. 44 కోట్లను 2021‌‌–22 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారని వివరించింది. ఎక్సైజ్ పాలసీపై రాజకీయ దుమారం రేగడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2022 జూలైలో ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రద్దు చేసింది.

కాళ్లు కడిగి పెన్షన్ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు 

వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఎపిలో ఓ మంత్రి కాళ్లు కడిగి పెన్షన్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏపీలో పెన్ష‌న్ల పంపిణీ జ‌రుగుతోంది. మంత్రి నిమ్మ‌ల రామానాయుడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా య‌ల‌మంచ‌లీ మండ‌లం అడ‌విపాలెంలో అనారోగ్యానికి గుర‌యిన లారీ డ్రైవ‌ర్‌కు తొలి పింఛ‌న్ అందించి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించారు. ఇదే గ్రామానికి చెందిన పెద‌పాటి భాగ్య‌ల‌క్ష్మి కాళ్లు క‌డిగారు మంత్రి.  అలాగే పాల‌కొల్లులో ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దు అంద‌జేశారు. కూటమి ప్ర‌భుత్వం ఇచ్చిన ప్ర‌తీ హామీని నెర‌వేరుస్తుంద‌ని మంత్రి తెలిపారు. టీడీపీ కూట‌మికి చారిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించిన రాష్ట్ర ప్ర‌జ‌లకు రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు.   ఈ క్ర‌మంలో ఆయన వృద్ధులు, విక‌లాంగుల కాళ్లు క‌డిగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక ప్ర‌తి నెల పెరిగిన పెన్ష‌న్ ల‌బ్ధిదారుల ఇంటికి చేరుతుంద‌న్నారు. కాగా, సీఎం చంద్రబాబు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పెన్ష‌న్‌ అందజేశారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు అందజేశారు.

నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల 

 వివాదాస్పదమైన  నీట్ పరీక్షలు రద్దయి  ఎట్టకేలకు రీ ఎగ్జామ్ కు నోచుకున్నాయి. అయితే ఇవ్వాళ నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి.  యూజీ ఫలితాల్లో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదాస్పదం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) వారికి నిర్వహించిన రీ ఎగ్జామ్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. తమ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET/ లో రివైజ్డ్ ఫలితాలను అందుబాటులో ఉంచామని.. రీ ఎగ్జామ్ రాసిన వారితోపాటు ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులంతా రివైజ్డ్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎన్ టీఏ తెలిపింది. అయితే ఎన్ టీఏ వర్గాల సమాచారం ప్రకారం తాజా ఫలితాలతో టాపర్ల సంఖ్య తొలిసారి ప్రకటించిన 67 నుంచి 61కి తగ్గినట్లు తెలిసింది. మొత్తం 1,563 మంది విద్యార్థులకుగాను 813 మందే జూన్ 23న రీ ఎగ్జామ్ రాశారు. మిగిలిన 750 మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు మినహాయించగా వచ్చే పాత స్కోర్ కే కట్టుబడతామని ఇప్పటికే తెలిపారు. ఎంబీబీఎస్ సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో పేపర్ కాస్త ఆలస్యంగా ఇవ్వడం వల్ల పరీక్ష సమయం కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు వారు సాధించిన స్కోర్ కు అదనంగా 5 గ్రేస్ మార్కుల చొప్పున ఎన్ టీఏ కలిపింది.  అయితే దీనిపై ఇతర విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు 720కిగాను 720 స్కోర్ సాధించి టాపర్లుగా నిలవడం, కొన్నిచోట్ల పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, జూలై 6 నుంచి జరిగే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ను నిలిపేయాలని కోరారు. అయితే ఈ డిమాండ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఎన్ టీఏను ఆదేశించింది.  మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ టీఏ డైరెక్టర్ ను ఆ పదవి నుంచి తప్పించింది. అలాగే దీనిపై అంతర్గత దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ కు సంబంధించి బిహార్ లో పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ కేసు దర్యాప్తును కేంద్రం సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది.

అంబటి అజ్ణాన ప్రదర్శనలో మేటి!

మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అజ్ణాన ప్రదర్శనకు తహతహలాడిపోతున్నారు. తాను మంత్రిగా ఉండి పాడుబెట్టిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తూ చంద్రబాబు ప్రజలలో తన గ్రాఫ్ ను అమాంతం పెంచేసుకుంటుంటే.. ఓర్వలేని తనంతో, దుగ్ధతో ఆయన తన అజ్ణాన ప్రదర్శనకు మెరుగులు పెట్టి మరీ నవ్వుల పాలౌతున్నారు. పోలవరం చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. అది ఎవరికీ అర్ధం కాదు. ఎందుకంటే నాకూ అర్ధం కాలేదు కనుక అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించని అంబటి తాజాగా జగన్ హయాంలో పోలవరం పనులు బ్రహ్మాండంగా చేశాం. అయితే అంతకు ముందు చంద్రబాబు నిర్వాకం వల్లే తమ పనులు ఫలితం లేకుండా పోయాయి. అందుకే ప్రస్తుతం పోలవరం పరిస్థితికి వందకు వంద శాతం చంద్రబాబే కారణమంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో మీడియా ముందుకు వచ్చారు.  తన మాటల్లోని డొల్ల తనం ఏమిటో అంబటికి తప్ప అందరికీ బాగానే అర్ధమౌతాయి. తన వైఫల్యాలను ఎదుటివారిపైకి నెట్టడానికి ఆయన హేతువును పూర్తిగా విస్మరించేస్తారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్ అస్తవ్యస్తంగా మార్చేశారు. 70శాతానికి పైగా పూర్తి అయిన ప్రాజెక్టును జగన్ తన అహంకారంతో, అవగాహనా రాహిత్యంతో రివర్స్ టెండరింగ్ అంటూ తల్లకిందులు ఆలోచనలతో చిందరవందర చేశారు.  2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరులెత్తించారు.  అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించిన జగన్ తన చాతగాని తనంతో ప్రాజెక్టు పనుల పురోగతి ఎలా? అనిపించేలా గందరగోళం చేసి పారేశారు. విధ్వంసం వినా మరోటి తెలియని జగన్  పోలవరాన్ని ప్రశ్నార్ధకంగా మార్చేశారు. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం పురోగతికే అగ్రతాంబూలమిచ్చారు. పోవలరం సందర్శన, పరిశీలన జరిగిన వెంటనే  జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ఈ ప్రాజెక్టుని త్వరగా పూర్తిచేసేందుకు తగిన సూచనలు, సలహాలతో నివేదిక ఇచ్చేందుకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇరిగేషన్ నిపుణులను రప్పించారు. వారు జూలై 3 వరకు పోలవరం ప్రాజెక్టు అంతా పర్యటించి, అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీలతో సమావేశమయ్యి చర్చిలు జరిపి ఒక నివేదిక ఇచ్చే పనిలో నిమగ్నమైపోయారు. అలాగే పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేశారు.  దీంతో తాము అధికారంలో ఉండగా పోలవరంపై అవగాహనా రాహిత్యంతో పాడుపెట్టేశామన్న విమర్శలకు బదులివ్వకుంటే ఎలా అనుకున్నారో ఏమో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అజ్ణానాన్నంతా రంగరించి మరీ  మేం పోలవరం కోసం బ్రహ్మాండంగా పని చేశాం అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేశారు. ఆ సందర్భంగా   చంద్రబాబు నాయుడు వలనే పోలవరం ప్రాజెక్టుకు  ఈ దుస్థితి దాపురించిందని చెప్పారు.  అంత పెద్ద జాతీయ ప్రాజెక్టుని కూడా భ్రష్టు పట్టించేసి మళ్ళీ నిసిగ్గుగా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు.  చంద్రబాబు నాయుడుకి అవగాహన లేక పోలవరం ప్రాజెక్టుకి నష్టం కలిగించారని జగన్, అంబటి రాంబాబు భావిస్తున్నట్లయితే, వాటిని సరిదిద్ది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఉండాలి కదా?   గత ఐదేళ్లూ అధకారంలో ఉన్నది వారే కదా? కనీసం ఈ లాజిక్ ను కూడా మర్చిపోయి అంబటి  తన అజ్ణాన ప్రదర్శనకు తానే చప్పట్లు కొట్టేసుకుంటున్నారు.  పైగా పోలవరం చాలా కాంప్లికేటెడ్. అది ఎవరికీ అర్ధం కాదు, ఎందుకంటే నాకు అర్ధం కాలేదుఅంటూ తనకు తానే మేధావిగా కితాబులిచ్చేసుకుంటున్నారు.  అంబటి అజ్ణాప ప్రదర్శనపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  

కేసీఆర్ పిటిషన్ కొట్టేసిన కోర్టు!

బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్‌ని రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం కొట్టేసింది. కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద కేసీఆర్ న్యాయవాది చేసిన వాదనతో హైకోర్టు ధర్మాసనం విభేదించింది. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌కి విచారణార్హత లేదని అన్నారు. అడ్వకేట్ జనరల్ వాదనలను హైకోర్టు సమర్థించింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ, విద్యుత్ కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని పేర్కొంది.

‘భారతీయ న్యాయ సంహిత’ తొలి కేసు నమోదు!

ఇంతకాలం మనం వింటూ వచ్చిన ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ఇక వుండదు. దాని స్థానంలో బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) వచ్చింది. దీనితోపాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) కూడా అమలులోకి వచ్చాయి. జులై 1 నుంచి కొత్త బీఎన్ఎస్ చట్టం ప్రకారం తొలి కేసు నమోదైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ పరిధిలోని ఒక వీధి వ్యాపారి మీద కొత్త క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలోని ఒక వ్యాపారి రోడ్డు మీద వాటర్ బాటిళ్ళు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దానివల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దాన్ని వేరేచోటుకు తరలించమని అతనికి పోలీసులు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పోలీసులు వీడియోగా తీసి, కేసు నమోదు చేసినట్టు ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్నారు. అదేంటో, ఏ చట్టమైనా మొదట సామాన్యుల దగ్గరే బాగా పనిచేస్తుంది. 

వణికి చస్తున్న పెద్దిరెడ్డి.. కాషాయ రక్షణ కోసం అర్రులు?!

వైసీపీ ప్ర‌భుత్వంలో చ‌క్రంతిప్పిన నేత‌ల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత‌ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఒక‌రు. ఐదేళ్ల కాలంలో రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఏం చెబితే అధికారులు అది శాస‌నంగా భావించి చేశారు. ఇందు కోసం నిబంధనలు, నియమాలు, మంచీ, చెడూ అన్నీ పక్కన పెట్టేశారు. తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై పెద్దిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో , కనుసైగ ఆదేశాలతో అనేక‌ సార్లు దాడులు జ‌రిగాయి. కొంద‌రు పోలీసులు అతిగా ప్ర‌వ‌ర్తించి తెలుగుదేశం నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్టి ఇబ్బందుల‌కు గురిచేశారు. దీనికితోడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంను టార్గెట్ చేశారు.  కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు అడుగుపెట్ట‌కుండా చేసేందుకు ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించారు. పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని బాబుపై దాడుల‌కు సైతం ప్ర‌య‌త్నాలు చేశారు. కుప్పంలో చంద్ర‌బాబును ఓడిస్తామ‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌వాళ్లు  చేశారు.  సీన్ రివ‌ర్స్ అయ్యింది. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ఓటు ద్వారా వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, పెద్దిరెడ్డితో పాటు మ‌రో తొమ్మిది మంది మొత్తం 11 మంది మాత్రమే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులు పోలీసుల స‌హాయంతో విర్ర‌వీగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న గ్యాంగ్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వ‌ణికిపో తున్నారు. తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల‌కే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషతోపాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయంపై తెలుగుదేశం జెండా రెపరెపలాడనుంది. మొత్తం 31 మంది సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో  మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. క్యాడ‌ర్ చేజారుతున్న క్ర‌మంలో పెద్దిరెడ్డికి తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం మ‌రో బిగ్ షాకిచ్చింది. ఆయ‌న సెక్యూరిటీని త‌గ్గించింది. గ‌తంలో పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం 5ప్ల‌స్5 సెక్యూరిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండ‌టంతో 1ప్ల‌స్1 సెక్యూరిటీ మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్పింది. పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డికి గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం ఉండ‌టంతో 4ప్ల‌స్4  సెక్యూరిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం కేవ‌లం ఎంపీగా ఉండ‌టంతో అందుకు త‌గిన భ‌ద్ర‌త‌ను ప్ర‌భుత్వం క‌ల్పించ‌నుంది. దీంతో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తమకు భద్రత పెంచాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా హడావిడిగా సెక్యూరిటీ తొలగించారని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరింది. చట్టపరమైన నిబంధనల ప్రకారమే వారికి భద్రత కల్పిస్తామని ప్ర‌భుత్వం తేల్చిచెప్పేసింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం జులై 8కి వాయిదా వేసింది. దీనికితోడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు శాఖ‌ల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా ప‌నిచేశారు. ఇసుక, గ‌నుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌భుత్వం  పెద్దిరెడ్డి శాఖ‌ల‌పై గురిపెట్టింది. శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తే జైలుకెళ్లే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీంతో ప్ర‌భుత్వం టార్గెట్ నుంచి త‌ప్పించుకునేందుకు పెద్దిరెడ్డి, ఆయ‌న కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేకుంటున్న‌ట్లు స‌మాచారం. కాషాయం కప్పుకుంటే రక్షణ లభిస్తుందన్న ఆశతో బీజేపీ కరుణా కటాక్ష వీక్షణాల  కోసం అర్రులు చాస్తున్నారు.  ఏపీ బీజేపీ నేత‌ల్లో కొంద‌రు మొద‌టి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉంటూ వ‌స్తున్నారు. దీంతో వీరి ద్వారా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం వీరిని పార్టీలోకి చేర్చుకునేందుకు సుముఖ‌త చూప‌డం లేద‌ని స‌మాచారం. ఎన్డీయే ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు కీల‌కంగా ఉన్నారు. చంద్ర‌బాబును కాద‌ని వైసీపీ నేత‌ల‌ను బీజేపీలోకి తీసుకుంటే ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. దీంతో ప్ర‌స్తుతానికి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలు బీజేపీలోకి వెళ్లే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌ను ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యంతో వణికిపోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

బొత్స సత్యనారాయణ స్వరం మారిపోయిందిగా?

బొత్స సత్యనారాయణ.. తెలుగు రాజకీయాలతో  ఏ మాత్రం పరిచయం ఉన్నా.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. అంతగా బొత్స సత్యనారాయణ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికలకు ముందు ఆయన విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అయితేనే భేషుగ్గా ఉంటుందన్న ప్రకటన కూడా చేశారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తరువాత తీరిగ్గా వైసీపీలోకి జంప్ చేసేశారు. 2019 ఎన్నికలలో చీపురుపల్లి నుంచి విజయం సాధించి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. జగన్ తొలి, మలి కేబినెట్ లలో స్థానం దక్కించుకున్న అతి కొద్ది మందిలో బొత్స ఒకరు. అంతగా ఆయన అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఎలా అన్న విద్యలో ఆరితేరిపోయారు.  సరే ఇప్పుడు అంటే 2024లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించు కోలేకపోయింది. అది వేరే సంగతి కానీ ఎన్నికలు అయిన తరువాత ఫలితాలు రావడానికి ముందు బొత్స సత్యనారాయణ వైసీపీ విజయం, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం పై బోలెడంత ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత, పార్టీతో సహా తానూ పరాజయాన్ని మూటగట్టుకున్న అనంతరం బొత్స వ్యూహాత్మకంగా కొంత కాలం వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు తన రాజకీయ చాణక్యం చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిపై అదే పనిగా  పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పనిలో పనిగా తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సరిగా పని చేయలేదని చెప్పకనే చెప్పేస్తున్నారు.  పింఛన్ సొమ్ము పెంచి జులై 1వ తారీకు నుంచే అందించడం  అభినందనీయమని చప్పట్లు కొట్టేస్తున్నారు. అంతేనా ప్రభుత్వం మారినప్పుడు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ ల మార్పు సహజమేననీ, దీనిని రాజకీయ కక్ష సాధింపుగా భావించడం సరికాదని ఎవరూ అడగకుండానే తన అమూల్య అభిప్రాయాన్ని వెలిబుచ్చిన బొత్స..  రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్‌ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్న చంద్రబాబు విమర్శపై చాలా ఆచితూచి స్పందించారు.  ఆ విషయం రాబోయే రోజుల్లో తేలుతుందన్నారు. అంతే కాదు.. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు, మూకలు  తెలుగుదేశం కార్యాలయాలపై జరిపిన దాడులు తప్పేనని బేషరతుగా అంగీకరించేశారు. అలాగే తాను ఆనాడే ఈ దాడులను తప్పుపట్టానని చెప్పుకొస్తున్నారు.  తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు.  విద్యాశాఖ మంత్రిగా తాను ఉపాధ్యాయుల సమస్య పరిష్కారంలో విఫలమయ్యానని అంగీకరించేశారు. ఇక అన్నిటికంటే ముఖ్య మైనదేమిటంటే.. ఎన్నికలలో వైసీపి ఓటమికి ఈవీఎంలే కారణమని అవి టిడిపి చేతిలో శకుని పాచికల్లా మారాయని జగన్మోహన్‌ రెడ్డి ఓ వైపు లేఖలు, ప్రకటనలు, విమర్శలు గుప్పిస్తుంటే.. మాజీ మంత్రి బొత్స సత్యనా రాయణ మాత్రం ప్రజలు  తమ పాలనను, విధానాలను  ఆలోచనలను పూర్తిగా తిరస్కరించారని ఎలాంటి శషబిషలూ లేకుండా ఒప్పుసుకుంటున్నారు. ఇలా తెలుగుదేశం అధినేతను పొగిడేస్తూ, సొంత పార్టీ అధికారంలో ఉండగా తప్పులు చేసిందనీ, పాలనలో విఫలమైందనీ ఒప్పేసుకోవడం ద్వారా సైకిలెక్కేయడానికి ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. అయితే బొత్స తెలుగుదేశం గూటికి వద్దామన్నా అక్కడ ఆయనకు స్థానం లేదని తెలుగుదేశం శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.  బొత్సకు కూడా తనకు తెలుగేదేశం ఎంట్రీ అంత వీజీ కాదని తెలుసు. అయితే చంద్రబాబును పొగిడి,  జగన్ తప్పిదాలను ఎత్తి చూపడం ద్వారా ముందు ముందు తెలుుగదేశం పార్టీ తనను ఇబ్బందులు పెట్టకుండా ఉంటుందని ఆయన ఆశపడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

స్వయంగా పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పెనుమాక ఎస్టీ కాలనీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడ లబ్దిదారు పాముల నాయక్‌కి వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. అలాగే నాయక్ భార్యకు సీడీఆర్ఏ పెన్షన్, కుమార్తెకి వితంతు పెన్షన్ అందించారు. వాళ్లు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పూరింట్లో నివాసం వుంటున్న పాముల నాయక్ తనకు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. పరిశీలిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా లబ్దిదారు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడం ఇదే ప్రథమం.

అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి.. మోడీ పిలుపు!

ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలి.. ఆ మొక్కను అమ్మను చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి... ఇదీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన కొత్త ప్రచారం ఉద్దేశం. ఈ ప్రచార కార్యక్రమానికి ఆయన హిందీలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం నాడు నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తూ, రేడియోలో మాట్లాడారు. ‘‘నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి’’ అని మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు ‘స్వచ్ఛ భారత్’ అనే ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ప్రధాని అయ్యాక ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ‘ఏక్ పేడ్ మా కే నామ్’. మరి మీరు కూడా మీ అమ్మ పేరుతో ఒక మొక్కని నాటి, ఆ మొక్కను అమ్మని చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటారు కదూ!?

పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణులు!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పురోగతి ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్టును అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జల వనరుల నిపుణులు పరిశీలించారు. ఆదివారం ప్రాజెక్టు దగ్గరకి చేరుకుని, అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి వచ్చిన డేవిడ్ పి పాల్, గెయిన్ ప్రాంకో డి సిక్కో, కెనడా నుంచి వచ్చిన రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ అంతర్జాతీయ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్ల దగ్గర్నుంచి, ఇప్పటి పరిస్థితి వరకు ప్రతి విషయాన్ని ఈ నిపుణులు కూలంకషంగా అధ్యయనం చేయనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు ప్రాజెక్టు దగ్గరే ఈ నిపుణులు వుంటారు. పనులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత వీరు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలసి సమీక్ష నిర్వహిస్తారు. 

జస్టిస్ నర్సింహారెడ్డికి బిఆర్ఎస్ లేఖాస్త్రం 

విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. 2003లో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారం పీజీసీఐఎల్ నిబంధనలకు లోబడి ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడిందే కానీ నష్టం జరగలేదని వివరించారు. నాడు ఉన్న చట్టాలకు, నిబంధనలకు లోబడే భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ ముందుకు రావడంతో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక అంశంపై విచారణ జరిగినప్పుడు ఒప్పందాల్లో భాగస్వాములైన వారందరినీ విచారించాలన్నారు. కానీ కొంతమందిని మాత్రమే విచారించి మీడియా సమావేశంలో మాట్లాడటం బాధాకరమన్నారు. ఇలా చేయడం ద్వారా, తమ రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్థరహిత ఆరోపణలకు ఊతమిచ్చినట్లే అవుతుందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరుతూ భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ హైకోర్టు తలుపు తట్టారు. తెలంగాణకు వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన కెసీఆర్     కమిషన్ ను  సవాలు చేస్తూ  హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.