ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని
posted on Aug 17, 2024 @ 11:03AM
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు వైసీపీ నుంచి, ఆ పార్టీ ఎంపీ విజయసాయి కబంధ హస్తాల నుంచీ పూర్తిగా విముక్తి లభించింది. గత ఐదేళ్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైసీపీ ప్రభుత్వ కనుసన్ననలో నడిచింది. వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఏసీఏను చేజిక్కించుకుని ఐదేండ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహించారు.
అయితే ఇటీవలి ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఏసీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏసీఏ కార్యవర్గం రాజీనామా చేసింది. దీంతో సెప్టెంబర్ 8న ఏసీఏకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విశాఖలో శుక్రవారం (ఆగస్టు 16) జరిగిన నామినేషన్ల పర్వంలో ఆంధ్రా క్రికెట్ సోసియేషన్ ఒక్కొ పదవికి ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అయితే ఫలితాలను అధికారికంగా వచ్చే నెల 8న ప్రకటించనున్నారు.
ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పి. వెంకట ప్రసాద్, కార్యదర్శిగా సాన సతీష్, సంయుక్త కార్యదర్శిగా విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్ గా దండమూడి శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.