బలం లేకున్నా నామినేషన్లు వేశారు.. బహిష్కరణ అంటూ డ్రామాలాడుతున్నారు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  పీఏసీ కమిటీ సభ్యుల  ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యింది. దీనితో పాటు ప్రజాపద్దులు , అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ  ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక  జరిగింది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసింది.  సాంప్రదాయంగా ప్రతిపక్షానికి కేటాయించాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని సంఖ్యాబలంతో అధికార పక్షమే దక్కించుకోవాలన్న కుట్రతో ప్రభుత్వం ఎన్నిక నిర్వహించిందని విమర్శలు గుప్పించింది. అయితే వాస్తవానికి ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమన్నది లాంఛనం మాత్రమే. అ లాంఛనాన్ని పాటించాలన్నా సభలో ప్రతిపక్షం హోదా ఉన్న పార్టీ ఉండాల్సి ఉంటుంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. నిబంధనల ప్రకారం అయినా, లాంఛనం మేరకు అయినా వైసీపీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఆ పార్టీ పీఏసీ కోసం తగుదునమ్మా అంటూ పుంగనూరు పుడింగి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించింది.  పీఏసీలో మొత్తం 12 మంది సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే కూటమి నుంచి 9 నామినేషన్లు దాఖలు కావడంతో ప్రస్తుత సభలో సంఖ్యాబలం మేరకు వారంతా ఎన్నిక కావడం ఖాయం. అయితే వైసీపీ నుంచి దాఖలైన మూడు నామినేషన్లలో ఒక అభ్యర్ధి మాత్రం గెలిచే అవకాశముంది. ఈ తరుణంలో వైసీపీ పీఏసీ ఎన్నికల్ని బహిష్కరించింది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం రెండు వరకూ సాగింది. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటమి ఎటూ తప్పదని ముందే తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అసలు తమ పార్టీ తరఫున నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఓటు వేయడానికి వైసీపీ అధినేత జగన్ కూడా అసెంబ్లీకి రాలేదు. వైసీపీ ఎన్నిక బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఆయన బెంగళూరు చెక్కేశారు. అంటే ఏదో ఒక అయోమయం సృష్టించి ప్రభుత్వం సంప్రదాయాన్ని పాటించడం లేదు అన్న విమర్శ చేయడం కోసమే పెద్దిరెడ్డిచేత జగన్ నామినేషన్ వేయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి పీఏసీ చైర్మన్ గా వైసీపీకి నిజంగా అవకాశం ఉంటే..  క్యాబినెట్ ర్యాంక్ కోసం జగనే స్వయంగా నామినేషన్ వేసి ఉండేవారని పరిశీలకులు అంటున్నారు.   అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యా బలంతో మూడు కమిటీలకూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు  నామినేషన్లు దాఖలు చేశారో ఆ పార్టీకే తెలియాలి.  ఎన్నిక పూర్తయ్యింది. ఇక ఫలితాల ప్రకటనే తరువాయి. పీఏసీ చైర్మన్ గా  పులపర్తి ఆంజనేయులు (జనసేన), అంచనాల కమిటీ చైర్మన్ గా  వేగుళ్ల జోగేశ్వర రావు (టీడీపీ), పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ (టీడీపీ) ఎన్నిక కానున్నారు. 

ప్రభాస్ ఎవడో నాకు తెలియదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ టార్గెట్ గా ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. నాడు ప్రభాస్ ఎవడో నాకు తెలియదు నేడు కూడా తెలియదు. పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి.  జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తన సైతాన్ సైన్యం చేత విష ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించారు. ప్రభాస్ తో తనకు ఏవో సంబంధాలు ఉన్నాయని కొన్ని యూట్యూబ్ చానల్స్ చేత విష ప్రచారం చేయించింది జగన్ కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభాస్ తో ఏనాడు పర్సనల్ గా కలిసింది లేదు. జగన్ కు ఈ విషయం తెలుసు. చెల్లెలు మీద విష ప్రచారం జరుగుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడని షర్మిల ప్రశ్నించారు.  నా అన్న జగన్ తన సైతాన్ సైన్యం చేత ప్రచారం చేయించాడన్నారు. చెల్లెలు మీద జుగుప్సాకర ప్రచారం చేయడం, తల్లి మీద కేసు బనాయించడం, తండ్రి పేరును సిబిఐ చార్జిషీట్ లో ఇరికించడం జగన్ కే చెల్లిందన్నారు.  అప్పట్లో వివి వినాయక్ దర్శకత్వంలో యోగి చిత్రాన్ని షర్మిల మేనమామ  రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించారు. అప్పటి నుంచి షర్మిల, ప్రభాస్ మధ్య రిలేషన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో  ఈ వీడియోలు చక్కర్లు కొడుతుండటపై షర్మిల  తీవ్ర మనస్థాపం చెంది కేసు బనాయించారు.  వీడియోలను డిలీట్ చేయించారు. తాజాగా తనకుప్రభాస్ తో ఉన్న సంబంధంపై క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 

అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల

అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును రా ష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పదవి ద్వారా వేగుళ్లకు క్యాబినెట్ హోదా దక్కుతుంది. కాగా అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల పేరు ఖరారైంది. ఈ మేరకు వేగుళ్లకు ప్రభఉత్వం నుంచి సమాచారం కూడా అందింది.  తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన వేగుళ్ల జోగేశ్వరరావు 2004 ఎన్నికలలో అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆలమూరు నియోజకవర్గం మాయమై.. మండపేట నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికలలో మండపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వేగుళ్ల విజయం సాధించారు. అక్కడ నుంచి వరుసగా 2009, 2014, 2019, 2024 ఎన్నికలలో వేగుళ్ల విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వేగుళ్లకు చంద్రబాబు ఈ సారి కేబినెట్ లో చోటు కల్పిస్తారని అంతా భావించారు. అయితే సమీకరణాల కారణంగా వేగుళ్లకు కేబినెట్ లో స్థానం దక్క లేదు. అయితే పార్టీకి వేగుళ్ల సేవలను గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకు అంచనాల కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు.  వేగుళ్లకు 2009 నుండి అనేక కమిటీల్లో సభ్యుడుగా వేగుళ్లకు పని చేసిన అనుభవం ఉంది

బుల్డోజింగ్ రాజ్యాంగ విరుద్ధం.. కూల్చివేతల విషయంలో నిబంధనలు పాటించాలి.. సుప్రీం

ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న  బుల్డోజింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావించాలి. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఒక అధికారి న్యాయమూర్తిగా వ్యవహరించి నిందితుడి ఆస్తిని నేలమట్టం చేయడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని  దేశ సర్వోన్నత న్యాయస్థానం  పేర్కొంది. ఇది ఆర్టికల్ 19 ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. నిందితుడి తప్పు వల్ల  అతడి  కుటుంబ సభ్యులను రోడ్డున పడేయడం దారుణం, దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు విస్ఫష్టంగా పేర్కొంది.  అవి అక్రమ నిర్మాణాలు అయితే కనీసం   15 రోజుల ముందు నోటీసు ఇచ్చి కూల్చివేయాలని,  నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని ఆదేశించింది.   ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అధికారులే బాధ్యత వహించాలని, కూల్చిన కట్టడాలను సొంత ఖర్చులతో నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  ఈ తీర్పు బుల్డోజింగ్ పాలకులకు కనువిప్పు కలిగిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే యోగి సర్కార్ ఇలా సుమారు   నాలుగు లక్షల ఇళ్లు కూల్చివేశారు. ఈ నిరంకుశ న్యాయం మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన ఈ బుల్డోజింగ్ న్యాయానికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో వామపక్షాలు దీనిపై గట్టిగా గళమెత్తాయి.  గత ఏడేళ్లుగా ఈ దారుణం యూపీలో జరుగుతుంటే అదొక ఘనకార్యం గా ఆ పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి.   మైనార్టీ వర్గాలపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజింగ్ ప్రయోగిస్తున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్  ఇటీవల  ఆందోళన వ్యక్తం చేసింది.  తాజాగా ఇలాంటి కూల్చివేతలపై సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు విచారించిన  సుప్రీం కోర్టు ద్విసభ్య   ధర్మాసనం   తీర్పు వెలువరించింది. తెలంగాణలో కూడా బుల్డోజింగ్ తరహాను ఫాలో అవుతున్న హైడ్రా కూడా అక్రమ నిర్మాణాలు నిర్మించిన వారికి సమయం ఇవ్వాల్సిఉంది. హైడ్రా విధానం ప్రారంభంలో దూకుడుగా వెళ్లిన విషయం విదితమే. మూసినది చుట్టుపక్కల ఆక్రమణల పై కూడా ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. దీనిపై  ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈ బుల్డోజింగ్ పై సుప్రీంకోర్టు లో  విచారణ  ప్రారంభమైనప్పటి నుంచి హైడ్రా దూకుడు ఒకింత తగ్గింది.   మొత్తం మీద నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలను అక్రమంగా కూల్చివేయడం తగదంటూ సుప్రీం వెలువరించిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

  అమెరికాలో గన్ పేలి హైద్రాబాద్ యువకుడు మృతి

హైద్రాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ రెడ్డి  అమెరికాలో గన్ ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆర్యన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి  ఉంది. ఎంఎస్    చదవడానికి ఆర్యన్ రెడ్డి  గత సంవత్సరం అమెరికా వెళ్లాడు . లైసెన్స్ హంటింగ్ గన్ శుభ్ర పరుస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చదువుకోవడానికి వెళ్లిన ఆర్యన్ రెడ్డి లైసెన్స్ గన్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది.   నవంబర్ 13న ఆర్యన్ రెడ్డి బర్త్ డే. ఆ రోజు కాలేజికి వెళ్లకుండా తన గదిలోనే ఆర్యన్ రెడ్డి  మృతి చెందాడు ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 23 ఏళ్ల ఆర్యన్ రెడ్డికి వేటాడటం హాబీ అని తల్లి దండ్రులు చెబుతున్నారు. శుక్రవారం సాయంతం(నవంబర్ 22) ఆర్యన్ రెడ్డి డెడ్ బాడీ హైద్రాబాద్ చేరుకోనుంది. పది రోజుల క్రితం చనిపోయినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికా పోలీసులు తల్లి దండ్రులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

వైసీపీ సర్కార్ బరితెగింపునకు మరో నిదర్శనం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పని చేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి.. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. తన కోసం, తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారినీ, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టీ, ఫోటోలు మార్ఫ్ చేసీ వేధింపులకు గురి చేసిన వారికీ పెద్ద పీట వేశారు. అనర్హులకు కూడా ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లించేశారు. మొత్తంగా జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయి. నిబంధనలు అనేవి ఉంటాయన్న సంగతే ఆయా వ్యవస్థల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులు సైతం మరచిపోయారా అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండింది.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమై రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం కొలువుదీరిన తరువాత నాడు జరిగిన తప్పులు, అవకతవకలు, అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ కు కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇచ్చే అక్రిడెషన్ కు ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిన విషయం బయటకు వచ్చింది.  ఇంతకీ ఇంటూరి రవి కిరణ్ ఎవరంటే.. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అత్యంత అసభ్య పోస్టులను పెట్టే మొనగాడు. జగన్ భజన, జగన్ సర్కార్ వ్యతిరేకులపై అసభ్య పోస్టులు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోవడంలో ఇంటూరీ ఆరితే రిపోయారు. ఆయన కృషి, ప్రత్యర్థులపై అసభ్య, అసహ్యకర పోస్టులు పెట్టడంలో ఆయన సృజన జగన్ ను మెప్పించింది. దాంతో ఆయన పనికి మెచ్చిన జగన్ తన హయాంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నెలకు 73 వేల రూపాయల భారీ వేతనాన్ని చెల్లించే ఏర్పాటు చేశారు. తన భజన చేసినందుకు, తన ప్రత్యర్థుల వ్యక్తిత్వహననానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ప్రజాధనాన్ని ఇంటూరికి జగన్ అప్పనంగా దోచి పెట్టేశారన్న మాట. అయితే అక్కడితో ఆగలేదు.. అర్హులైన జర్నలిస్టులకు కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టి మరీ నిరాకరించిన అక్రిడేషన్ ను ఎలాంటి అర్హతలూ లేని ఇంటూరి రవికుమార్ కు అతి సునాయాసంగా జారీ అయిపోయింది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి అప్పనంగా వేతనం అందుకుంటూ, ఆ సంస్థ పే రోల్ లో ఉన్న ఇంటూరి రవికుమార్ కు జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ ఎందుకు ఇచ్చారంటే.. పాపం పౌరసరఫరాల శాఖ మాత్రం ఏం చెప్పగలదు? పైవాడు ఆదేశించాడు.. మేం ఆచరించామని బిక్కముఖం వేసుకోవడం తప్ప. జగన్ హయాంలో వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలు ఎంతగా దిగజారి వ్యవహరించాయో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. అయితే జగన్ హయాంలో జరిగిన పాపాల పుట్ట పగులుతోంది. సోషల్ మీడియాలో  అనుచిత పోస్టులతో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా కేసులు, అరెస్టులు వెంటాడుతున్నాయి. ఇంటూరి ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారు. ఇక  నిబంధనలకు తిలోద కాలిచ్చేసిన అధికారుల వంతు రానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోసాని రాజకీయ సన్యాసం.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లేగా?

పోసాని కృష్ణ మురళి తన విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందారు. ఏదో మేరకు అభిమానులనూ సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి.. జగన్ పంచన చేరారో అప్పటి నుంచి ఆయన మాట, తీరు, నడక, నడత పూర్తిగా మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం బుర్ర, బుద్ధి అనే వాటితో అవసరం లేదనీ, కేవలం నోటికి పని చేబితే చాలు వైసీపీలో పబ్బం బ్రహ్మాండంగా గడిచిపోతుందనీ కనిపెట్టేశారు. అంతే అప్పటి నుంచీ పోసాని మంచి చెడు, మర్యాద, మన్నన అనేవి పూర్తిగా మరిచిపోయారు. మీడియా మైకు దొరికితే చాలు అప్పటి విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. కులం పేరు చెప్పి దూషణలకూ పాల్పడ్డారు. జగన్ వ్యతిరేకులను ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా జగన్ మెప్పు పొందవచ్చని పోసాని ఇష్టారీతిగా రెచ్చిపోయారు. ఆయన అప్పట్లో మాట్లాడిన ప్రతిమాటా ఇప్పుడు రివర్స్ లో తనను చట్టం చక్రబంధంలో ఇరికిం చేయడం ఖాయమని అర్ధమైపోయింది. దీంతో పోసాని ప్లేట్ ఫిరాయించేశారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లను అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించేశారు. తనకు వైసీపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదనీ, రాజీనామా చేసేశానని చెప్పేశారు. జగన్ ఎంపీ, ఎమ్మెల్యేల కంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకున్న పోసాని కృష్ణ మురళి అటువంటి నేతను క్లిష్ట సమయంలో వదిలేని వెళ్లిపోతున్నందుకు పనిలో పనిగా బాధ కూడా వ్యక్తం చేశారు. తాను రాజకీయాలు మాట్లాడితే తిక్క, కోపం అంటూ విమర్శలు చేశారనీ, కానీ తాను ఇంత వరకూ మంచి నాయకులను ఎన్నడూ విమర్శించలేదనీ చెప్పుకున్నారు. రాజకీయ సన్యాసం చేస్తూ కూడా గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు. చింత చచ్చినా పులుపు చావలేదని చాటుకున్నారు. తాను చంద్రబాబు, పవన్  కల్యాణ్ వంటి వారిపై చేసిన విమర్శలు వారి గుణగణాల ఆధారంగానే చేశానని ఏకంగా తన తల్లి మీద ప్రమాణం కూడా చేసేశారు. ఇప్పుడు కూడా తాను రాజకీయాలకు దూరం కావడం తన కుటుంబ క్షేమం కోసమేనని చెప్పు కొచ్చారు. ఇక పనిలో పనిగా ఆయన తన ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘రాజా ఐ లవ్యూ’ రీతిలో  జగన్ ఐ లవ్యూ అని కూడా అనేశారు. ఆ వెంటనే ఇక తాను బతికున్నంత వరకూ రాజకీయాలు మాట్లాడనని శపథం చేసేసి, ఇలా అంటున్నానంటే కేసులకు భయపడుతున్నానని కాదనీ చెప్పుకున్నారు. కానీ వాస్తవం మాత్రం అదే అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఎందుకంటే ఇంత కాలం లేనిది ఇప్పడు తన వాచాలత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదైన తరువాత ఒక్క సారిగా జ్ణానోదయమై రాజకీయా సన్యాసం ప్రకటించేయడానికి కారణం అరెస్టు భయం కాక ఇంకేమిటని నెటిజనులు పోసానిని తెగ ట్రోల్ చేస్తున్నారు. 

అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ అవినీతి మయం.. అనుమానాలే కాదు.. ఆధారాలూ ఉన్నాయా?

అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక  రాజకీయ అండదం డలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది. ఇప్పుడే కాదు గతంలోనూ అదానీ అవినీతి వ్యవహారాలపై పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ అనే పరిశోధనా సంస్థ గతంలో పలు మార్లు అదానీ వ్యాపార సామ్రాజ్యం అతి వేగంగా విస్తరించడం వెనుక మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికలు వెలువరించింది. తన నివేదికలకు ఆధారంగా స్విట్జర్ ల్యాండ్ విచారణ నిగ్గు తేల్చిన అంశాలను ప్రస్తావించింది. స్విట్జర్ ల్యాండ్ ఆ దేశంలో అదానీ గ్రూపునకు చెందిన పలు బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసిందని పేర్కొంది. అలా స్విట్జర్ ల్యాండ్ లో సీజ్ అయిన అదానీ అక్కౌంట్లలో 2600 కోట్ల రూపాయలు ఉన్నాయని హిడెన్ బర్గ్ గతంలో పేర్కొంది. అందుకు ఆధారంగా అక్కడి అంటే స్విట్జన్ ల్యాండ్ క్రిమినల్ కోర్డు రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని పేర్కొంది. అంతే కాకుండా వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో కూడా అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయనీ, అవన్నీ కూడా మనీల్యాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీల ద్వారా జమ చేసినవేనని ఆరోపించింది.  అయితే సహజంగానే అదానీ గ్రూపు ఆ ఆరోపణలను ఖండించింది.  అయితే అప్పట్లో హిడెన్ బర్గ్ నివేదిక వెలువడిన తరువాత మార్కెట్ లో అదానీ షేర్ల విలువ భారీగా పతనమైంది. అప్పట్లోనే.. అంటే హిడెన్ బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకూ  ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అదాని, ఆ నివేదిక వెలువడిన స్వల్ప వ్యవధిలోనే  26వ స్థానానికి పడిపోయారు. అలాగే అదానీ గ్రూప్ షేర్ల విలువ కూడా భారీగా పతనమైంది. నివేదిక వెలువడిన నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద 11లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అప్పట్లో అదానీపై హిడెన్ బర్గ్ అక్కౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల విలువ కృత్రిమంగా పెంచడం, మనీ ల్యాండరింగ్, అవినీతి వంటి ఆరోపణలు చేసింది.   ఇప్పుడు అమెరికాలో అదానీపై నమోదైన కేసులో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. లాభాల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి ముడుపులు చెల్లించారనీ, చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న అభియోగాలపై అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. సహజంగానే ఇప్పుడు కూడా అదానీ గ్రూప్ ఆ ఆరోపణలను ఖండించింది.   అభియోగాలు, ఖండనల సంగతి ఎలా ఉన్నా.. ఒకే వ్యాపారిపై తరచుగా అవినీతి ఆరోపణలు రావడాన్ని బట్టి అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరణ వెనుక మతలబు ఉందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు. ఎంత మంది, ఎన్ని శక్తులు అండగా, దండగా నిలబడినా నిజం నికలకడ మీద తేలక తప్పదు.

జర్నలిస్ట్ ల భూములకు మోక్షం... పేట్ బషీర్ బాద్ లో తొలి కూల్చివేత 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు మోక్షం లభించే రోజులు వచ్చేశాయి. . నిజాంపేటలో 32  ఎకరాలు, పేట బషీర్ బాద్ లో 38  ఎకరాలు 2008లో జెఎన్ జె హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసింది. న్యాయ వివాదాల్లో ఇరుక్కుని  రెండు దశాబ్దాలుగా లబ్దిదారులకు అంద లేదు. 2017 లో సుప్రీం ఇంటెరిం ఆర్డర్ వచ్చినప్పటికీ కెసీఆర్ ప్రభుత్వం ఆ స్థలాలు  జర్నలిస్టులకు అప్పగించలేదు. తుది తీర్పు వచ్చినప్పటికీ అదే పరిస్థితి. టీం జెఎన్ జె నేతృత్వంలో  పోరాట ఫలితంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది.  ఇచ్చిన మాటకు రేవంత్ సర్కార్  కట్టుబడి ఆ స్థలాలను అప్పగించింది. కెసీఆర్ హాయంలో జరిగిన  ఈ భూముల ఆక్రమణలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే  స్పందిస్తోంది. గురువారం పేట్ బషీర్ బాద్ లో వెలిసిన అక్రమ కట్టడాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్న కట్టడాల జోలికి పోవడం లేదు. గత ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ భూములుగా  రికార్డుల్లో ఉంది. వైఎస్ ఆర్ కేటాయించిన ఈ భూములను తిరిగి జర్నలిస్ట్ లకు అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని సొసైటీ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు. 

విడుదలయ్యాక నోరు విప్పిన కవిత

తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత తొలిసారి రాజకీయాలపై స్పందించారు. తెలంగాణ రాజకీయాలపై కాకుండా జాతీయ రాజకీయాలపై స్పందించారు. సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం కోసం 5 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు ఆదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసుపై బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్​ వేదికగా స్పందించారు. ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా, ఆడబిడ్డను అరెస్టు చేయడం మోదీ సర్కార్​కు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదే ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా అని ప్రశ్నించారు.  ఆదానిపై ఆరోపణలు కొత్తేమీ కాదు అయినా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించిందన్నారు. 164 జైలు జీవితం గడిపిన కవిత  నోరు విప్పడం చర్చనీయాంశమైంది.   

గుజరాత్ కు  వెళ్లిపోయిన అఘోరీ 

అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాలకు స్వస్థి చెప్పి గుజరాత్ వెళ్లిపోయింది. శైవక్షేత్రాల దర్శనార్థమే అఘోరీ గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. వరంగల్ రంగ సాయి పేటలో వింతపూజలు చేసిన అఘోరీ ఐదు రోజుల పాటు మౌనవ్రతంలో ఉన్నారు. ఈ కారణంగానే ఆమె తనను కలవడానికి వచ్చిన ట్రాన్స్ జెండర్లకు చెప్పారు.  పురుషులతో తాను మాట్లాడనని స్మశాన వాటికలో  ట్రాన్స్ జెండర్లకు తెలిపారు. అఘోరీ గుజరాత్ వెళ్లేముందు తన ఐ 20 కారును సర్వీసింగ్  చేసుకున్నారు. స్మశాన వాటికలో వింత పూజలు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యక్షమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో నానా రచ్చచేసి గుజరాత్ వెళ్లిపోయారు. 

అమెరికాలో కదిలిన అదానీ అవినీతి తీగ.. ఏపీలో కదిలిన జగన్ అక్రమాల డొంక!

దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ అవినీతి తీగ కదిలినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ డొంక కదిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన వైసీపీ, రాష్ట్రాన్ని అవినీతికి, అక్రమాలకు కేంద్రంగా మార్చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దగ్గర నుంచి పలు అంశాలలో వైసీపీ నేతల ప్రమేయం బయటపడింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోచుకోవడం, దాచుకోవడమే పాలన అన్నట్లుగా ఐదేళ్ల అధికారాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు తాజాగా అమెరికాలో అదానిపై నమోదైన కేసులో కూడా జగన్ హయాంలో అవినీతి వ్యవహారాన్ని వెలుగులోనికి తీసుకువస్తోంది.  ఇంతకీ విషయమేమిటంటే..అమెరికాలో భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానిపై లంచం కేసు నమోదైంది.  ఆ కేసేమిటంటే  గౌతమ్ అదానీ  అమెరికాలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో.. అక్రమ మార్గంలో నిధులు రాబట్టాలని భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలను ఆఫర్ చేశారు. దీనిపైనే    గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదైంది.   అయితే ఆ కేసు తీగ అక్కడ కదిలితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల డొంక కదులుతోంది. అదానీ   20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకు నేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు   265 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 2 వేల 236 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న అభియోగాల మేరకు కేసు నమోదైంది.   మామూలుగా అయితే ఇండియాలో జరిగిన అవినీతిపై  అమెరికా లో కేసులు నమోదు చేయరు.  అయితే  న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజీలో లిస్టయిన కంపెనీ కావడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ అవినీతి మూలం ఏపీలో ఉంది. ఓసియార్ ఎనర్జీ   ఏపీలో రూ.40 వేల కోట్లతో ఓసియార్ ప్లాంట్ పెట్టాలని జగన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.  అసలు అమెరికా అధికారులు ఏపీకి వచ్చి మరీ ఈ ఒప్పందంపై చర్చించారని,  ఏపీతో  ఒప్పందాల కోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చారు. ఈ వివరాలన్నీ అదానీపై అమెరికా నమోదు చేసిన కేసులో ఉన్నాయి. ముఖ్యంగా అదానీ ఆంధ్రప్రదేశ్ లోనే మూడు దఫాలుగా అమెరికా అధికారులతో భేటీ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.   ముడుపుల విషయంలో ఒక అవగాహన కుదరడంతో 2021 జులై 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో  ఒడిశా, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొన్ని విద్యుత్ సరఫరా కంపెనీలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఇందన విక్రయ ఒప్పందం (పిఎస్ఏ) కుదుర్చుకున్నాయి. వీటిలో  ఆంధ్రప్రదేశ్  విద్యుత్ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యధికంగా దాదాపు ఏడు గిగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల కోసమే అదానీ  1750 కోట్ల ముడుపులిచ్చారన్న అభియోగాలున్నాయి. ఈ డీల్ కుదరడంలో ఏపీ ప్రభుత్వంలో  ఓ ఉన్నతాధికారి అత్యంత కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అదానీ కంపెనీతో విద్యుత్ ఒప్పందాలపై అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలన్నీ అక్షర సత్యాలని ఇప్పుడు అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడంతో తేటతెల్లమౌతోంది.  

పుతిన్ దయాదాక్షిణ్యాలపై మానవాళి మనుగడ!

రష్యా నిర్ణయంపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఔననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే ఫైల్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన క్షణం నుంచీ భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేసే అత్యంత భయంకరమైన అణ్వాయుధం రష్యా వద్ద ఉంది. కేవలం ఒక్క మీట నొక్కితే చాలు ప్రపంచాన్ని అంతం చేసేంత శక్తిమంతమైన అణ్వాయుధాన్ని చేతిలో ఉంచుకున్న రష్యా ఇప్పుడు దానిని ఉపయోగించడానికి రెడీ అయిపోయింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో గెలుపు, ఓటమి లేకుండా తీవ్రంగా నష్టపోతున్న రష్యా అసలే ఉక్రోషంలో ఉంది. సరిగ్గా అటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రాజకీయ తంత్రమో, కుతంత్రమో తెలియదు కానీ అనాలోచితంగా తాము సరఫరా చేసిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపైకి ప్రయోగించడానికి అనుమతి ఇచ్చేశారు. ఇలా అనుమతి వచ్చిందో లేదో అలా ఉక్రెయిన్ అమెరికా క్షిపణిని రష్యాకు గురిపెట్టింది. బైడెన్ నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్.. గతంలో హెచ్చించిన విధంగా అణ్వాయుధాల వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అసలు సోవియెట్ యూనియన్ కాలం నుంచీ కూడా రష్యాది దుందుడుకు వ్యవహారమే. ఏక థృవ ప్రపంచాన్ని రష్యా సవాల్ చేస్తూనే వస్తోంది. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా రష్యా వ్యూహాత్మకంగా అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతూనే ఉంది. ఇందుకు చైనా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాల మద్దతును కూడగట్టుకుంది.  1990 పూర్వం సోవియట్,అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచేది. అప్పుడు ప్రపంచంలోని దేశాలు రెండు వర్గాలుగా విడిపోయాయి.కొన్ని తటస్థ దేశాలు అలీన విధానం అవలంబించి నా ఆ ఆ అలీన విధానం ప్రాధాన్యత ప్రాభవం కల్పోయింది. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నంతో అమెరికా అటోమేటిక్ గా అగ్రరాజ్యంగా, ప్రపంచ దేశాలకు పెద్దన్నగా తనకు తాను ప్రకటించేసుకుని ఎదురులేని శక్తిగా మారింది. అయితే రష్యా అధ్యక్ష పగ్గాలు పుతిన్ చేతికి వచ్చిన తరువాత పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. అమెరికా,నాటో దేశాలతో ఢీకొనడానికి అవసరమైన శక్తియుక్తులను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ను రష్యాపై ప్రయోగించడంతో  నిశ్శబ్దం ఒక్కరానిగా బద్దలైపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ కంటే అమెరికాయే టార్గెట్  అని  రష్యా అధ్యక్షుడి ప్రకటనలు రూఢీ చేస్తున్నాయి. దీంతో అమెరికా ఎప్పుడు, ఏ రూపంలో దాడులకు జరుగుతాయోనన్న భయంతో వణికిపోతున్నది. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత  రష్యా విషయంలో అమెరికా ఈ స్థాయిలో భయపడటం ిదే తొలిసారని చెప్పవచ్చు. రష్యా వద్ద 5500 నూక్లియర్  వార్ హెడ్స్ ఉంటే, అమెరికా వద్ద 5,044 మాత్రమే ఉన్నాయి.   .ఉక్రెయిన్ రష్యాపై మరిన్ని దాడులకు పాల్పడితే రష్యా నిస్సందేహంగా అమెరికాపై అణుదాడులకు పాల్పడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా నాటో దేశాలపై కూడా దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.  ఇదే జరిగితే  ప్రపంచానికి ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అమెరికాలో అధికారమార్పిడి జరిగి మరో రెండు నెలల వ్యవధిలో బైడన్ స్థానంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు అంత వరకూ పుతిన్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.   ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించగలరన్న నమ్మకాన్ని ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ట్రంప్ ఎన్నికల సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ చేసిన వాగ్దానం ప్రధాన కారణం. పుతిన్, ట్రంప్ ల మధ్య అనుబంధం తెలియనిది కాదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపనుండడమే  ఉక్రెయిన్ అధ్యక్షుడి దూకుడుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ జోక్యంతో యుద్ధం ఆగినా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలనెస్కీ మాత్రం సేఫ్ కాదని అంటున్నారు. అందుకే   ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు అందుకోవడానికి ముందే  పుతిన్ తో లెక్కలు తేల్చేసుకోవాలని  జెలనెస్కీతొందరపడుతున్నారు. ఇదే పుతిన్ ను అణ్యాస్త్రాల ప్రయోగం దిశగా రెచ్చగొడుతున్నది. ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే పుతిన్ దయాదాక్షిణ్యాల మీదే ప్రపంచ దేశాల, మానవాళి మనుగడ ఆధారపడి ఉందని చెప్పడానకి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

పీఏసీ కోసం పెద్దిరెడ్డి నామినేషన్.. బలం లేకున్నా పోటీకి తయారు!

వైసీపీ అధినేత జగన్ కు స్వప్రయోజనాలు తప్ప ప్రజా క్షేమం, ప్రజా ప్రయోజనాలు ఇసుమంతైనా పట్టవని మరో మారు నిర్ద్వంద్వంగా రుజువైపోయింది. ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా మిగిలింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటూ సభ్యుల సంఖ్యను బట్టి కనీసం 18 మంది ఎమ్మెల్యేలుగా గెలివాల్సి ఉండగా జగన్ నాయకత్వంలోని వైసీపీకి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో జగన్ వైసీపీ అధినేతే అయినా విపక్ష నేత హోదా లేకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే సభలో కూర్చోవలసి ఉంటుంది. దీంతో ఆయన విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తన ఒక్కడికే ఆ బహిష్కరణను పరిమితం చేయకుండా మొత్తం వైసీపీ సభ్యులందరినీ సభకు హాజరు కాకుండా ఆపేశారు.   అయితే ఇప్పుడు పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ఎన్నిక  ప్రక్రియ మొదలు కావడంతో వైసీపీ ఆలోచనలో మార్పు వచ్చింది. పీఏసీ చైర్మన్ కు కేబినెట్ హోదా ఉంటుంది. ఆ హోదాతో పాటు వచ్చే సౌకర్యాలూ అందుతాయి. దీంతో  వైసీపీ ఆ పదవిపై కన్నేసింది. సాధారణంగా ప్రతిపక్ష  ఎమ్మెల్యేను పీఏసీగా చేయడం సాంప్రదాయం. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేదు. దీంతో సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమనే ప్రశ్నే తలెత్తదు. కానీ కేబినెట్ ర్యాంక్ కోసం తహతహలాడిపోతున్న జగన్, ఆయన పార్టీ.. ఇప్పుడీ పీఏసీ చైర్మన్ పదవి కోసం అర్రులు చాస్తోంది. ఈ పదవికి నామినేషన్ వేయడానికి రెడీ అయిపోయింది. ఆ పదవి కోసం మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అయితే పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ వైసీపీకి ఆ బలం లేదు. బలం లేకపోయినా వైసీపీ బరిలోకి దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నిబంధనల మేరకు పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులలో తొమ్మండుగురు అసెంబ్లీ నుంచీ, ముగ్గురు శాసనమండలి నుంచి ఎన్నికౌతారు. అయితే పీఏసీ చైర్మన్ను మాత్రం ఎమ్మెల్యేల నుంచే ఎన్నుకుంటారు. గత అసెంబ్లీలో తెలుగుదేశం కు ప్రతిపక్ష హోదా ఉంది కనుక పయ్యావుల కేశవ్ కు అప్పుడు పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. అసెంబ్లీ నుంచి పీఏసీకి వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఎన్నికయ్యే అవకాశం లేదు. అయినా తగుదునమ్మా అంటూ పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించడానికి వైసీపీ అధినేత జగన్ తయారైపోయారు. అయితే కేబినెట్ హోదా కోసం వేస్తున్న నామినేషన్ ఆయనే స్వయంగా వేస్తే సరిపోయేదిగా అని తెలుగుదేశం వర్గీయులు ఎగతాళి చేస్తున్నారు.   

టీచర్ కే  ప్రేమ పాఠాలు...   ఆపై హత్య

తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం టీచర్ దే.  మాతృదేవో భవ, పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ మాత్రమే.  కానీ తమిళనాడులో ఓ టీనేజ్ అబ్బాయి ఏకంగా టీచర్ నే ప్రేమించేశాడు. పాఠాలను ప్రేమించడం మానేసి రమణి టీచర్ అందాన్ని ప్రేమించాడు.   ఇక్కడితో ఆగలేదు. తనను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేశాడు. టీచర్ ససేమిరా అంది. ఇది పద్దతి కాదని బోధించింది.  దీంతో క్లాస్ రూంలోనే టీచర్ ను హత్య చేశాడు. తమిళనాడు తంజావూరులో జరిగిన  ఈ సంఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటుగా మారింది.  భారత  రాష్ట్రపతి గా పని చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన గడ్డమీదే ఈ ఘాతుకం  జరగడం పెద్ద చర్చకు దారి తీసింది. సర్వేపల్లి జన్మ దినోత్సవం రోజే ఉపాధ్యాయదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.   టీచర్ కు ఆ విద్యార్థి ఇచ్చిన నివాళి చూసి రాధాకృష్ణ ఆత్మక్షోభిస్తుందేమో మరి.