వరుసగా ఐదో రోజూ అదే సీన్.. లోక్ సభ సోమవారానికి వాయిదా

అదానీ వ్యవహారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ నినాదాలు చేస్తుండటంతో సభలో వాయిదాల పర్వం సాగుతోంది. ఐదు రోజులుగా సభ ఎలాంటి కార్యకలాపాలూ లేకుండానే వాయిదా పడుతూ వస్తున్నది. శుక్రవారం (నవంబర్ 29) కూడా లోక్ సభ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు అదానీ వ్యవహారం, యూపీలోని సంభాల్ లో చెలరేగిన హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను సాగనీయకుండా అడ్డుపడ్డాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. మిగిలిన వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేకపోవడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితిలో సోమవారానికి వాయిదా పడింది.  

జాతీయ రహదార్లకు లగచర్ల అడ్డంకి  అయ్యిందా?

లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ కోసం తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయసేకరణ వివాదాస్పదం కావడంతో జాతీయ రహదారుల కోసం  భూసేకరణ సరిగ్గా జరగడం లేదని  తెలుస్తోంది. అవార్డ్ పాస్ అయిన భూములకు ఇంత వరకు నష్ట పరిహారం అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అడ్వాన్స్ ఇవ్వకుండానే భూసేకరణ చేపడుతున్న అధికారులకు  రైతులు సహకరించడం లేదు. దీంతో రేవంత్ సర్కార్ కు విషయం అర్థమైంది.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లగచర్లను సాకుగా చేసుకుని రైతులు భూసేకరణకు ముందుకు రావడం లేదు. దీంతో లగచర్ల భూసేకరణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రైతుల నుంచి అడుగడుగునా వ్యతిరేకత రావడంతో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. భూసేకరణ చేసే జాతీయ  రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ) ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో రైతులు భూసేకరణకు సహకరించకపోతే జాతీయ ప్రాధికార సంస్థ  కు ఎలా సహకరిస్తారని  రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డికి సూటిగా ప్రాధికార సంస్థ  ప్రశ్నించింది. రైతులకు అడ్వాన్స్ ఇవ్వకుండా భూములు ఇవ్వరని కోమటిరెడ్డి తేల్చేసి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.  రీజినల్ రింగ్ రోడ్డుకోసం ఇప్పటికే 95 శాతం భూములను  ప్రాధికార సంస్థ సేకరించింది. మిగతా ఐదు శాతం భూములను సేకరించిన తర్వాతే అవార్డ్ పాస్ అయిన భూములకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధికారసంస్థ నిర్ణయించినట్టు కనబడుతోంది. శుక్రవారం లగచర్ల భూసేకరణ నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి ఇదే కారణమని తెలుస్తోంది  

లగచర్ల భూసేకరణ.. వెనక్కు తగ్గిన రేవంత్ సర్కార్.. ఎన్హెచ్ఆర్సీ అభిశంసన భయమే కారణమా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల భూసేకరణ విషయంలో వెనకడుగు వేసింది. దేశ వ్యాప్తంగా లగచర్ల భూసేకరణ వ్యవహారం సంచలనంగా మారడంతో నష్ట నివారణకు ఉపక్రమించింది. లగచర్ల భూసేకరణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  భూ సేకరణ చట్టం-2013 లోని సెక్షన్ 93 ప్రకారం  లగచర్ల భూ సేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో అభిప్రాయ సేకరణ చేసి, ప్రజాభిప్రాయం, ప్రజాభీష్టం మేరకు భూసేకరణను ఉపసం హరించు కుంటున్నట్లు పేర్కొంది.   కాగా, వికారాబాద్‌ జిల్లా  లగచర్ల భూ సేకరణ విషయంలో అభిప్రాయ సేకరణకు వెళ్లి కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడం రాష్ట వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ పై దాడి ఘటనతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. దీంతో ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం  దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాడికి పాల్పడిన 50 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసులు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందంటూ  కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, అతడి ప్రధాన అనుచరుడు భోగమోని సురేష్‌లపై పోలీసులు కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా లగచర్ల  బాధితులంతా కలిసి ఢిల్లీలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్  జాతీయ మహిళా కమిషన్‌  ను కలిసి వారిపై పోలీసులు చేసిన దాడులు, అక్రమ అరెస్టులపై ఫిర్యాదు చేశారు.   వారి ఫిర్యాదు మేరకు ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్   రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి  , డీజీపీ జితేందర్‌  కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా భూసేకరణపై వెనకడుగు వేయడం గమనార్హం. హక్కుల ఉల్లఘణ జరిగిందంటూ జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని అభిశంసించే ప్రమాదం ఉందన్న అనుమానంతో ప్రభుత్వం ముందుగానే వెనక్కు తగ్గి లగచర్ల భూసేకరణను ఉపసంహరించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా లగచర్ల ఘటనను డీల్ చేసే విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఈ విషయంలో ప్రతిపక్ష  బీఆర్ఎస్ ప్రభుత్వంపై పై చేయి సాధించిందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.  

ఆకట్టుకున్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్

చెన్నైలోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుపై తాను చేసిన పరవ్‌పాయింట్‌ ప్రజంటేషన్  సభికులను ఆకట్టుకొందని, బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కన్సెల్టెంట్‌, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఎంగేజ్డ్‌ బుద్ధిస్ట్‌ నెట్‌వర్క్‌, తమిళ్‌ బుద్ధిస్ట్‌ సొసైటీ బుద్ధిస్ట్‌ హెరిటేజ్‌ టు వర్ట్స్‌ ఇంక్లూజివ్‌ సొసైటీస్‌ అన్న అంశంపై నిర్వహిస్తున్న 21వ ద్వైవార్షిక సమావేశంలో శుక్రవారం (నవంబర్ 29)  ఆయన ముఖ్య అతిథిగా హాజరై, బుద్ధవనం ప్రత్యేకతలపై ప్రసంగించారు. ఆ ప్రసంగంలో నాగార్జునకొండ చరిత్ర, ఆచార్య నాగార్జునుని రచనలు, తెలంగాణాలో బౌద్ధ ధర్మవ్యాప్తి, స్థావరాలపై వివరించారు. శ్రీలంక, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, కొరియా, జపాన్‌ నుంచి సదస్సుకు హాజరైన బౌద్ధ భిక్షువులు, భిక్షుణీలు, బుద్ధవనాన్ని సందర్శించటానికి ఆసక్తి చూపారని, వారందరికీ బుద్ధవనం బ్రోచర్లను బహూకరించినట్లు శివనాగిరెడ్డి చెప్పారు. తరువాత నిర్వాహకుల తరఫున గౌతమ్‌ప్రభు, విజయన్‌, బుద్ధవనంపై ప్రసంగకర్త, బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని బౌద్ధ పద్ధతిలో సత్కరించారు.

రాఘవరెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టివేత.. వైఎస్ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనా?

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కడప జిల్లాలో అంతా తానై వ్యవహరించిన వైఎస్ అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారం అండతో జిల్లాలో సర్వ వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకుని ఆడింది ఆటగా పాడింది పాటగా చెలాయించిన వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు సొంత మనుషులను కూడా కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరారు. అసలే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి ఏ క్షణంలో ఆ బెయిలు రద్దౌతుందా అన్న భయంతో వణికి పోతుంటే పుండు మీద కారంలా తన పీఏ రాఘవరెడ్డిపై కేసులు నమోదు కావడం, ఆయన పారారీలో ఉండటం, ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే పరిస్థితుల్లో ఉండటంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాఘవరెడ్డి పోలీసులకు చిక్కితే వైఎస్ వివేకా హత్య కేసుతో పాటు మరిన్ని కేసులు తన మెడకు చుట్టుకోవడం ఖాయమని వివేకా కంగారు పడుతున్నారు. తాజాగా రాఘవరెడ్డి కడప కోర్టులో దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఏ కలుగులో దాగున్నా రాఘవరెడ్డిని అరెస్టు చేయడం ఖాయమని పోలీసులు అంటున్నారు.  అసలు ఇంతకీ అవినాష్ పీఏ కోసం పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు? ఆయన ఏ కేసులో అరెస్టునుంచి రక్షణ కోరుతూ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారూ అంటూ.. సామాజిక మాధ్యమంలో అసభ్య పోస్టుల వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి విచారణలో వెల్లడించిన కీలక అంశాల ఆధారంగా పోలీసులు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై కేసు నమోదు చేశారు.  రాఘవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నే తాను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసేవాడినని వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం గాలింపు ఆరంభించారు. ఇప్పుడు రాఘవరెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను కడప కోర్టు తోసిపుచ్చడంతో ఏ క్షణంలోనైనా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. రాఘవరెడ్డి అరెస్టైతే అవినాష్ రెడ్డి గుట్టు రట్టైనట్లేనని అంటున్నారు. దీంతో రాఘవరెడ్డి బెయిలు పిటిషన్ ను కొట్టివేయడం అవినాష్ కు షాకేనని అంటున్నారు.  ఇప్పటికే  వివేకా హత్య కేసులో  పీకల్లోతు ఇరుక్కుని ఉన్న అవినాష్ రెడ్డిపై ఇక సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలోనూ ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిలుపై ఉన్న ఆయన బెయిలును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం తాజాగా భాస్కరరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సుదీర్ఖ కాలంగా నత్తనడకన నడుస్తున్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు, విచారణ ఇక వేగం పుంజుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డి అరెస్టైతే ఇక అవినాష్ రెడ్డి చక్రబంధంలో ఇరుక్కున్నట్లేనని అంటున్నారు.  

తిరుమల కొండపై వైఎస్ అవినాష్ అనుచరుడి వీరంగం!

అధికారం కోల్పోయిన తరువాత కూడా వైసీపీయుల అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విషయంలో వారు తగ్గేదేలే అన్నట్లుగా తమ అరాచకత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రక్షాళన తిరుమల నుంచే ఆరంభించాలని సంకల్పించిన చంద్రబాబునాయుడు తిరుమలలో పవిత్రత, భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అన్న ప్రసాదం నాణ్యత పెంచడంతో పాటు అదనంగా మరో అధరవు చేర్చారు. కొండపై పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. భక్తుల సౌకర్యాలు మెరుగయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిర్దుష్ట సమయాలలో ప్రసాదాల వితరణ, జల ప్రసాద వితరణ పునరుద్ధరించారు. అయితే భక్తుల ముసుగులో తిరుమల కొండపైకి వచ్చిన వైసీపీయుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తిరుమల నిబంధనలను వైసీపీయులు యథేచ్ఛగా, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి నుంచి మొదలు పెడితే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, నారాయణ స్వామి.. ఇలా  వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత  కూడా కొండపై అరాచకంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతల జాబితా కొండవీటి చాంతాడు కంటే పొడవుగానే ఉంటుంది. తాజాగా వైసీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీనాథ్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన శ్రీవారి దర్శనం కోసం గురువారం (నవంబర్ 28) కొండపైకి వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలే ప్రైవేటు ఫొటో గ్రాఫర్లతో ఫొటో షూట్ చేయించుకున్నారు. తిరుమల నిబంధనలను ఇసుమంతైనా పాటించకుండా ఆయన నిర్వహించి ఫొటో షూట్ కు అభ్యంతరం చెప్పిన వారిపైనా, ఆ దృశ్యాలను చిత్రీకరించిన విలేకరులపైనా దాడికి పాల్పడినంత పని చేశారు. నా ఇష్టం ఫోటో షూట్ చేసుకుంటా.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ వీరంగం చేశారు. వంశీనాథ్ రెడ్డి తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కొండపై విజిలెన్స్ అధికారులు ఉన్నారా? ఉంటే ఇంత అరాచకం జరుగుతుంటే వారేం చేస్తున్నారని నిలదీస్తున్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వంశీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

లగచర్ల భూ సేకరణ రద్దు 

లగచర్ల భూసేకరణ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 580 మంది రైతులు 636  ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వంతొలుత నిర్ణయం తీసుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.  గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయం రద్దు చేసుకున్నట్లు  వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.  వికారాబాద్ జిల్లా లగచర్ల పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ  తర్వాత తీసుకున్న ప్రజాభిప్రాయం వివాదాస్పదమైంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇదే కేసులో అరెస్టయ్యారు. 

  అనుమతి లేకుండా మందు పార్టీ ...ఎపి ఉద్యోగ సంఘ నేత వెంకట్రాంరెడ్డి అరెస్ట్ 

ఎపి సచివాలయం ఉద్యోగులు సంఘం నేత వెంకటరామిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.  గత జగన్ ప్రభుత్వంలో వెంకట్రాంరెడ్డి వైకాపాకు అనుకూలంగా పని చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో  అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఇస్తూ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు చేసిన ఎక్సైజ్‌, పోలీసు అధికారులు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.  సచివాలయం క్యాంటిన్ ఎన్నికల నేపథ్యంలో వెంకట్రాంరెడ్డి  మందు పార్టీ ఇచ్చారు. వెంకట్రాంరెడ్డికి   వివాదాలు కొత్తేమి కాదు. అత్యంత సాధారణంగా జరిగే ఈ ఎన్నికల్లో వెంకట్రా రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు  ప్రయత్నిస్తున్నారు.  వెంట్రామి రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. 

రామ్ గోపాల్ వర్మ అతితెలివి.. తగ్గేది లేదంటూనే కాళ్ల బేరాలు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు, క్వాష్ పిటిషన్ల విచారణ వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఆయన అజ్ణాతంలోనే ఉండి కూటమి సర్కార్ ను తనను అరెస్టు చేయవద్దనీ, ఎక్కడకూ పారిపోననీ, సినీమా పనులలో బిజీగా ఉన్నాననీ వేడుకుంటున్నారు. అయితే ఆయన రామ్ గోపాల్ వర్మ కదా? అందుకే ఆ వేడుకోళ్లు, విజ్ణప్తులూ కూడా భిన్నంగా ఒక విధంగా తిరుగుబాటు ధోరణిలో ఉంటున్నాయి. అరెస్టు చేస్తే జైళ్లో ఉండి సినిమా కాథలు రాసుకుంటానంటూ అన్యాపదేశంగానైనా తన అరెస్టు తథ్యమన్న విషయం అంగీకరించేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మపై దాదాపు 9 కేసులు నమోదయ్యాయి.  ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై కించపరిచే వ్యాఖ్యలు, అసభ్య, అభ్యంతర పోస్టులు పెట్టినందుకు ఏపీ వ్యాప్తంగా  వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ అజ్ణాతంలోకి వెళ్లారు. పోలీసు నోటీసుల మేరకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా కోర్టులలో ఊరట లభిస్తుందన్న ఆశతో పరారీలో ఉన్నారు. అజ్ణాతంలో  ఉండగానే ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తనను అరెస్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు ప్రతీకార రాజకీయాలు చేస్తారని తాను అనుకోవడం లేదని  చెప్పుకొచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లు గెలిచి  ఇప్పటికే ప్రతీకారం తీర్చుసుకున్నారన్న రామ్ గెపాల్ వర్మ.. తన పోస్ట్‌లు,  సినిమాలు కనీసం ఒక్క ఓటును కూడా వారికి వ్యతిరేకంగా ప్రభావితం చేయలేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు తనపై వారు ప్రతీకారం కోసం చూస్తారని బావించడం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకున్నారు. ఓ పక్క తనపై కేసులు సమంజసం కాదని పోలీసులను విమర్శిస్తూనే రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్, లోకేష్ లను తనను క్షమించేయమని పరోక్షంగా వేడుకుంటూ, తన వ్యాఖ్యలను జనం ఇసుమంతైనా పట్టించుకోలేదని అంగీకరించేశారు. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే బాబ్బాబు నన్న వదిలేయండని ఆయన పరోక్షంగా ప్రాధేయపడుతున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై ఆయన చాలా అభ్యంతరకరమైన, కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన అరెస్టు తప్పదని తేలిపోయిన తరువాత అతి తెలివి ఉపయోగిస్తూ, తనను ఆదుకోవాలనీ, క్షమించాలనీ పరోక్షంగా నాడు తాను కించపరిచిన వారి కాళ్లా వేళ్లా పడుతున్నట్లు కనిపిస్తోంది.   

ఏపీకి ఫెంగల్ ముప్పు లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫెంగల్ తుపాను ముప్పు లేదని వాతావరణ శాఖ పేర్కొంది. భయపడినట్లుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారలేదనీ, ఇది క్రమంగా బలహీనపడుతూ శుక్రవారం (నవంబర్ 29) సాయంత్రానికి వాయుగండంగా మారి శనివారం (నవంబర్ 30) ఉదయానికి రారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే తుపాను ముప్పు తప్పినా దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  అయితే ఫెంగల్ ప్రభావం తమిళనాడుపై అధికంగా ఉంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.   చెన్నైలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుత్తురై, తిరువారూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కడలూరు, నాగపట్నం తీరం అల్లకల్లోలంగా మారింది. పుదుచ్చేరి, కారైకాల్, కడలూరులో విద్యా సంస్థలకు నేడూ రేపూ సెలవు ప్రకటించారు.  

ఆరు నెలల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్!

రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే పనులు ఎంత శరవేగంగా సాగుతాయో, ప్రజా ప్రయోజనాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ఎంత చక్కగా ఉంటుందో ఐదు నెలల తెలుగుదేశం కూటమి పాలనలో ప్రజలకు చక్కగా అర్ధమౌతోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు హామీని నెరవేర్చే విషయంలో తెలుగుదేశం కూటమి సర్కార్ అడుగులు ఎంత వేగంగా పడుతున్నాయో  చెప్పడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన ప్రకటనే సాక్ష్యం. ఆరు నెలలలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటౌతుందని ఆయన వెల్లడించారు.  అదే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంటూ ఓ అసంబద్ధ ప్రతిపాదనలో జగన్ ముందుకు వెళ్లారు. అప్పటికే 70 శాతం వరకూ పూర్తైన అమరావతి నిర్మాణాలను నిలిపివేశారు. అమరావతిని నిర్వీర్యం చేశారు. పోనీ మూడు రాజధానుల విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగైనా ముందకు వేయగలిగారా అంటే అదీ లేదు. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించిన జగన్ తన హయాంలో ఆ దిశగా ఒక్క ఇటుక పేర్చిన పాపాన పోలేదు. శాసన రాజధాని అని చెప్పిన అమరావతినీ పాడుపెట్టారు. ఇక విశాఖ విషయానికి వస్తే అక్కడ రుషికొండకు గుండు కొట్టి తన కోసం ప్యాలెస్ నిర్మించుకోవడం వినా రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేసింది లేదు.  కానీ తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ అమరావతే ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అని ప్రకటించి.. ఆ దిశగా కార్యాచరణ చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేసింది. నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియకు సిద్ధమైంది.  కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం అన్వేషణ ఆరంభించారు.  త్వరలోనే ప్రక్రియను పూర్తి  కాబోతోంది.  జగన్ సర్కార్ కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేస్తామని హామీ ఇచ్చి  మోసం చేస్తే, తెలుుదేశం కూటమి సర్కార్  హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది.  కర్నూలులో హైకోర్టు బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్న సమయం పట్టే అవకాశం ఉండటంతో తాత్కాలిక భవనంలో హైకోర్టు బెంచ్ ను ఆరు నెలలలోగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే అర్ధ సంవత్సరంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. అదే సమయంలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలు కూడా కర్నూలులోనే కొనసాగనున్నాయి. కర్నూలు ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. చిత్తశుద్ధితో, సంకల్పంతో పని చేస్తే పనులు ఎంత వేగంగా సాగుతాయన్నదానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉదాహరణగా నిలుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి నిర్మాణమే కాదు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పట్టాలెక్కాయి. నిర్దుష్ట కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి కానున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడాన్ని వారు ఇందుకు తార్కానంగా చూపుతున్నారు.   

న్యూజిలాండ్ పార్లమెంట్ లో   మహిళా ఎంపీ హాకా నృత్య ప్రదర్శన అదుర్స్ 

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ మహిళ   కోపంతో అరుస్తూ కాగితాన్ని చించేసింది. ఆమె సూట్  వేసుకుని ఉంది.   ఆమె న్యూజిలాండ్ కు చెందిన పార్ల మెంటు సభ్యురాలు.  ఆమె పేరు హనా రావితి .న్యూజిలాండ్  పార్లమెంటు చరిత్రలో  అతి పిన్న వయస్కురాలు. ఆమె  అలా ఎందుకు అరుస్తుంది తెలుసుకునే ముందు.న్యూజిలాండ్ లో మావూరి గిరిజన తెగ  గూర్చి తెలుసుకుందాం.   ఆమె న్యూజిలాండ్ మావూరి తెగకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. 1320 కి పూర్వం  న్యూజిలాండ్ లో ఎవరూ ఉండే వారు కాదు. అంటే ఆవాసిత ప్రాంతం కాదు.  పోలినేషియా నుంచి ఆదివాసి తెగ అక్కడకు వచ్చేసింది. కొద్ది కాలంలోనే ఆ తెగ న్యూజిలాండ్ విస్తరించింది.  వారి జనసాంద్రత పెరగడంతో వారి సంస్కృతి విస్తరించింది. భాష, కళలు కూడా  న్యూజిలాండ్ గడ్డపై పురుడు పోసుకున్నాయి.  ప్రస్తుతం శ్వేత జాతీయులు 80 శాతం వరకు ఉన్నారు.  మావూరి తెగ న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టినప్పటికీ కేవలం 20 శాతం జనాభాకే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ లోకసభలో ఒక బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో స్పీకర్ ఆమె అభిప్రాయాన్ని అడిగినప్పుడు హాకా నృత్య ప్రదర్శన చేసింది. తన నిరసన వ్యక్తం చేసింది.14  నవంబర్ 2024లో జరిగిన సంఘటన ఇది.   సంప్రదాయంగా వస్తున్న నృత్య ప్రదర్శన ఇది. కోపం, ఆనందం కలిగినప్పుడు వ్యక్తం చేసే నృత్యం అని చెప్పొచ్చు. అది వైరల్ అయ్యింది.

అనుచిత వ్యాఖ్యలకు మద్దతుగా పిల్ వేస్తారా? జర్నలిస్టు విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం

పిల్ ఉద్దేశాలను విస్మరించి రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పి. విజయబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రూ.50 వేలు జరిమానా విధించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ విజయబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు స్వీకరించిన సందర్భంలోనే అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారంటూ వ్యాఖ్యానించిన కోర్టు..  ఈ రోజు విచారణ సందర్భంగా మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏయే సందర్భాలలో దాఖలు చేయాలో వివరిస్తూ రాజకీయ దురుద్దేశంతో పిల్ దాఖలు చేసిన విజయబాబుకు రూ. 50 వేలు జరిమానా విధించింది. నెల రోజులలోగా ఆ జరిమానాను లీగల్ సర్వీసెస్ అథారిటీలో చెల్లించాలని ఆదేశించింది. ఆ సోమ్మును అంధులు, బధిరుల సంక్షేమం కోసం వినియోగించాలని లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. విజయబాబు పిల్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విజయబాబు తన పిటిషన్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్నవారిపై చర్యలు తీసుకోవల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టే వారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని పేర్కొన్న కోర్టు, అటువంటి వారి కోసం పిల్ వేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది సమాజంలో అణగారిన వర్గాలు కోర్టులను ఆశ్రయించేందుకు తగినంత ఆర్థిక స్థోమత లేని వారి కోసం వేయాలని, అటువంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ఉద్దేశాలతో వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అభ్యంతరకర భాష వాడుతున్నారని , ఈ వ్యాఖ్యలు సమాజంలో నిజాయితీగా, చట్టబద్ధంగా ఉండేవారిని కించపరిచే విధంగా ఉన్నాయనీ వ్యాఖ్యనించిన హైకోర్టు అటువంటి వారికి మద్దతుగా ప్రజా ప్రయోజనవ్యాజ్యం ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాన్ని ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవడాన్ని చట్టం అంగీకరించదని స్పష్టం చేసింది.  సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు నేరమేనని విస్ఫష్టంగా పేర్కొంది. 

ఆర్డీవీహైడింగ్.. ఎంత కాలం?

ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు మూడు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ అజ్ణాతంలోనే ఉన్నారు. అక్కడ నుంచే వీడియోలు విడుదల చేస్తూ తన కోసం పోలీసుల గాలింపునూ, తన సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదునూ ప్రశ్నిస్తున్నారు. భయం లేదనీ, పోలీసుల కేసులను ఖాతరు చేయననీ గప్పాలు కొడుతున్నారు. అదే సమయంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలనీ, తనపై కేసులను క్వాష్ చేయాలనీ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. అలాగే తాను భౌతికంగా విచారణకు హాజరు కాలేననీ, తాను సెలబ్రిటీననీ, సినిమాలతో చాలా చాలా బీజీ అని చెప్పుకుంటూ వర్చువల్ విచారణ కోరుతున్నారు.  తనలోని భయాన్ని కప్పిపుచ్చుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ చేస్తున్నారని నెటిజనులు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు అది వేరే సంగతి.  వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ ఈ నెల 35న ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన గైర్హాజరయ్యారు. మరో వైపు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్లు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అవి ఎప్పుడు విచారణకు వస్తాయో చూడాలి. ఒక వేళ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయకపోతే రామ్ గోపాల్ వర్మ ఇంకెంత కాలం అజ్ణాతంలో ఉంటారో, పోలీసుల నుంచి ఎంత కాలం తప్పించుకు తిరగగలుగుతారో చూడాల్సి ఉంది. ఇక ఆయన కోరినట్లుగా వర్చువల్ విచారణ ప్రశక్తే లేదని పోలీసులు కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఎలా చూసినా రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాకుండా ఉండాలంటే కోర్టులు యాంటిసిపేటరీ బెయిపు పిటిషన్ పై సానుకూల తీర్పైనా ఇవ్వాలి. లేదా రామ్ గోపాల్ వర్మ తన అజ్ణాత జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. 

సిరిసిల్ల కలెక్టర్ పై కెటీఆర్ దురుసు ప్రవర్తన

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి ఏడాది కావొస్తుంది. అయినా ఆ పార్టీకి  అహంకారం ఏ మాత్రం తగ్గలేదు.  తాను ప్రాతినిద్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాసి అని వ్యాఖ్యానించడం చూస్తుంటే తెలంగాణలో  బిఆర్ఎస్  అధికారంలో ఉందా అన్న అనుమానం కలుగుతోంది  బిఆర్ఎస్ నోరుపారేసుకోవడం పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. కెటీఆర్ పై కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించాలని సంఘం భావిస్తుంది. ఒక  ప్రజా ప్రతినిధి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కంపల్సరీ. కాబట్టి కాంగ్రెస్ సర్కారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.  గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి రెండూ కెటీఆర్ అని నిర్ధారణ అయ్యింది. గవర్నర్ ఆమోదం తీసుకుని కెటీఆర్ ను అరెస్ట్ చేయాలని స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ యాక్షన్ మాత్రం స్టార్ట్ కాలేదు. తాజాగా సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాసి అని, కాంగ్రెస్ కార్యకర్త అని బాహాటంగా విరుచుకుపడటం చూస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. పదేళ్ళు అదికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు బిఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేసారా? పచ్చకామెర్లు వచ్చిన వాడికి అందరూ పచ్చగా కనిపిస్తారు మరి.  కెటీఆర్ ఇలా బరి తెగించడానికి కారణం కాంగ్రెస్ అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. 

అవినీతి అనకొండ వల్లభనేని వంశీ.. అరెస్టుకు రంగం సిద్ధం..!

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టుకు రంగం సిద్ద‌మైందా?  అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది.  గ‌న్న‌వ‌రం తెలుగుదేశంకార్యాల‌యంపై దాడి కేసుతోపాటు.. నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి అక్ర‌మాల కేసుల్లో ఇప్ప‌టికే వంశీపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి. తాజాగా మ‌రికొన్ని కేసుల విచార‌ణ స‌మ‌యంలో  వాటిలో కూడా వల్లభనేని వంశీ ప్ర‌మేయం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో త్వ‌ర‌లో ఆయ‌న్ను అరెస్టు చేసేందుకు పోలీసులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.  వైసీపీ  హ‌యాంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయన అనుచ‌రుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.  వంశీ ప్రోద్భ‌లంతో తెలుగుదేశం నేత‌ల‌పై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయించి ఇబ్బందుల‌కు గురిచేశారు. దీనికితోడు చంద్ర‌బాబు, లోకేశ్‌, వారి కుటుంబంపై వంశీ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాగా  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ లెక్క తేల్చేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో వంశీ, ఆయ‌న అనుచ‌రుల అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో  గత ప్రభుత్వ హయాంలో వంశీ ఆధ్వర్యంలో గన్నవరం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై కూలంకషంగా దర్యాప్తు జ‌రుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం తరఫున  ఎమ్మెల్యేగా వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌యం సాధించాడు.  వైసీపీ అధికారంలోకి రావ‌డంతో కొద్దిరోజుల‌కే ఆయన వైసీపీకి అనుకూలంగా మారాడు. వైసీపీ  అండ‌తో వంశీ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దెత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత విచార‌ణ జ‌ర‌ప‌గా నియోజ‌క‌వ‌ర్గంలో వంశీ అవినీతి అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నారు. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో వల్లభనేని వంశీ.. తన వద్ద పనిచేసే డ్రైవర్లు, కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంతగా విస్తరించి కొండలన్నీ పిండి చేశారు.  గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర   ప్రకటించారు.  రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలిసింది. సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేశారు.  వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయ‌న అనుచ‌రులు పెద్దెత్తున మోసాల‌కు సైతం పాల్ప‌డ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయ‌లు జేబులో వేసుకున్న‌ట్లు, వంశీ క‌నుస‌న్న‌ల్లోనే ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుల మోసాల పర్వం కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి.   ఇప్పుడు తాజాగా  మ‌రో మోసం వెలుగులోకి వచ్చింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం అంజయ్య .. గన్నవరం సమీపంలో చంద్రికా అయోధ్య భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం చేసిన కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు నాలుగు కోట్ల రూపాయలను గుర్రం అంజయ్య ఎగ్గొట్టారు.   ఆస్తులను విక్రయించి.. నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్లు రామ్మోహనరావు, సతీష్‌లను వంశీ ప్ర‌ధాన అనుచ‌రుడు మోసం చేశారని , కాంట్రాక్టర్లు నగదు చెల్లించినా తమకు గుర్రం అంజయ్య సొమ్ములు ఎగ్గొట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తాము తమకు రావాల్సిన సొమ్ము కోసం డిమాండ్ చేస్తే  తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోట చెప్పుకో మంటున్నారని కార్మికులు   ఆవేదన వ్యక్తం చేశారు.  గన్నవరంలోని చంద్రికా అయోధ్య గృహ సముదాయం ఎదుట బుధ‌వారం భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.ఇదిలా ఉంటే.. తెలుగుదేశం నేతపై దాడి కేసులో గుర్రం అంజ‌య్య‌ ముద్దాయిగా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా పోలీసులు ఈ ఘ‌ట‌న‌పైనా కూపీ లాగుతున్నారు. ఈ మోసంలో వంశీ ప్ర‌మేయం   ఉన్న‌ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  మొత్తానికి వైసీపీ హ‌యాంలో అధికార మ‌దంతో విర్ర‌వీగిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆయన అనుచరులపై  చట్టపరంగా చర్యలకు రంగం సిద్ధమౌతోంది. అధికారం అండతో మంచీ చెడూ లేకుండా విర్రవీగి చేసిన అన్యాయాలు, అకృత్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి తలెత్తింది. 

లగచర్ల దాడి కేసులో  పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్  పొడగింపు

లగచర్ల దాడి కేసు దేశ వ్యాప్తంగా సంచలనమైంది. లగచర్ల కేసు లో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే  పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను కోర్టు పొడగించింది. నిన్నటితో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ గడువు ముగిసిపోయింది. అయితే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు  గురువారం కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతని రిమాండ్ ను డిసెంబర్ 11 వరకు పొడగిస్తూ జూనియర్ సివిల్ జడ్జీ ఉత్తర్వులను జారీ చేసారు.నవంబర్ 11న లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ పై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు  వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై లగచర్ల రైతులు, ప్రజలు దాడి చేసారు.  ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం  ఉందని ఆరోపణలు వచ్చాయి.  పట్నం నరేందర్ రెడ్డిని ఎ 1 గా చేర్చారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. దాదాపు 14 రోజుల  పాటు రిమాండ్ లో ఉన్నారు.