నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రభుత్వ అజెండా ఎంటంటే..?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకూ జరిగే ఈ సమావేశాలలో మొత్తం 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అత్యంత కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఈ పార్లమెంటు సమావేశాలలో దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మహారాష్ట్ర ఎన్నికలలో అందరి అంచనాలనూ తల్లకిందులు చేసి మరీ అనూహ్య విజయాన్ని అందుకున్న బీజేపీ ఆ ఊపులో ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా సభలో ఏయే విషయాలు చర్చకు రానున్నయి అన్న విషయాన్ని సభ్యులకు లోక్ సభ స్పీకర్, రాజ్య సభ చైర్మన్ ముందుగానే పరిశీలించి అనుమతి ఇస్తారు.
ఇక ఈ శీతాకాల సమావేశాలలో భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు, విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లు, ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, రైల్వేస్ (సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు, వక్ఫ్ (సవరణ) బిల్లు, చమురు క్షేత్రాల (నియంత్రణ మరియు అభివృద్ధి) సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయాల బిల్లు, పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఎజెండాలో లేకపోయినప్పటికీ ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లును కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.