హస్తినను కమ్మేసిన పొగమంచు.. చలికి గజగజలాడుతున్న ఉత్తర భారతం

దేశ రాజధాని నగరం హస్తినను పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతతో మొత్తం ఉత్తర భారతం గజగజలాడుతున్నది. హస్తినలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బుధవారం ఉదయం రాజధాని నగరంలో  9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పొగమంచు కారణంగా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాయు కాలుష్యం మరోసారి పీక్స్ కు చేరడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దు చేయగా, మరి కొన్నిటిని రీ షెడ్యూల్ చేశారు. అలాగే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.   

మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో పర్యటిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా సదైవ్ అటల్ లో ఆయనకు నివాళులర్పించి సర్వమత ప్రార్థన సభలో పాల్గొన్న చంద్రబాబు. ఈ రోజంతా హస్తినలో బిజీబిజీగా గడపనున్నారు. ఈ మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీయే సీఎంల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామితో భేటీ అవుతారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  అనంతరం కేంద్ర విత్త మంత్ర నిర్మలాసీతారామన్ తో భేటీ కానున్నారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం నిర్మాణం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు ఈ భేటీలలో చర్చించనున్నారు.  

కేటీఆర్ ఫేడౌట్ అయిపోయారా?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ రాష్ట్రం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ప్రమేట్ చేసేవారు. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నాటి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, పరస్పర దూషణలతో తెలంగాణ రాష్ట్రం పొలిటికల్లీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. నిత్యం ఏదో వివాదంతో జాతీయ స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రం పతాక శీర్షికలలో నిలుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా ఆంధ్రాను అధిగమించి తెలంగాణ రాజకీయ వివాదాల్లో  అగ్రపీఠిన నిలుస్తోంది.  రాజకీయ విమర్శలు ఓ స్థాయి దాటి దూషణల పర్వానికి వెళ్లాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో దూకుడు ప్రదర్శిస్తుంటే.. అంతకు మించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ, దర్యాప్తుల పేరిట కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకు కోర్టు నుంచి తాత్కాలిక ఉపసమనం లభించింది. అయితే వెంటనే ఇదే విషయంలో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయం పక్కన పెడితే పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలుపై విడుదల సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. అల్లు అర్జున్ వ్యవహారం తెరపైకి రాగానే కేటీఆర్ అరెస్టు, కేసుల విషయం ఒక్కసారిగా ఫేడౌట్ అయిపోయింది.    ఫార్ములా ఇ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచడం, కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడానికి రెడీ అవుతోందన్న వార్తలకు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ స్థానం లేకుండా పోయింది.  ప్రజలు, మీడియా దృష్టి మొత్తం అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీకి తరలిపోతుందా అన్న దానిపైనే కేంద్రీకృతమై ఉంది. అసలు ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చిక్కులలో పడ్డారు అన్న చర్చకు తావే లేకుండా పోయింది. మొత్తంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఈడీ కేసు విషయాన్ని జనం పట్టించుకోలేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.  

సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు మాస్ వార్నింగ్ 

సంక్రాంతికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. పండుగకు స్వంత గ్రామాలు చేరుకునే వారు కూడా ఎక్కువే. స్వంత గ్రామాలకు చేరుకునే వారికి గుంటలు లేని రోడ్లు గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు రోడ్ల రిపేర్లు పూర్తిచేయాలని సూచించారు.  సంక్రాంతి సందర్బంగా వైకాపా సోషల్ మీడియా కించపరిచే పోస్టులు  పెడుతుందని చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా సోషల్ మీడియా అలాంటి పోస్టులు పెడితే నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యులవుతారని చంద్రబాబు హెచ్చరించారు. రోడ్లు బాగా లేవని వైకాపా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రమాదముందన్నారు. వీటిని నిలువరించడానికి టిడిపి ఎమ్మెల్యేలు ముందుకు రావాలన్నారు. గుంతలు పడ్డ రోడ్ల రిపేర్ పూర్తి చేయాలని సూచించారు.  నేను ఒకటే చెబుతున్నాను. తెలుగు దేశం పార్టీ సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది తెలుగుదేశం పార్టీ. సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తే చూసూ ఊరుకునేది లేదని చంద్రబాబు  వైకాపా నేతలను హెచ్చరించారు. 

ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీపై నిషేధం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వమ్య దేశం ఇండియా. అయితే ప్రస్తుతం ఇండియాలో ప్రజాస్వామ్యం అన్నదానికి అర్ధం మారిపోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే తొలి రెండు సార్లూ కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని నడిపే బలం బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు.. మూడో సారి మాత్రం ఆ బలాన్ని ఇవ్వలేదు. మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి కల్పించి.. వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్న ప్రధాని మోడీ సర్కార్ కు చెక్ పెట్టారు. వ్యక్తిగత అజెండా, సంఘ్ పరివార్ రహస్య అజెండా అమలుకు అసలే మాత్రం అవకాశం లేకుండా ముందరి కాళ్లకు బంధం వేశారు. అయితే ప్రతిపక్ష  కూటమి అనైక్యత కారణంగా ఆ బంధనాలు మోడీ సర్కార్ ను ఇసుమంతైనా ఇరుకున పెట్టలేకపోతున్నాయి. జమిలి ఎన్నికల నుంచి, ఎన్నికల సంస్కరణల వరకూ అన్నీ తన ఇష్టారాజ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం వాటిల్లేలా చేస్తున్నది. తాజాగా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మోడీ నిర్ణయం ఆ విమర్శలకు బలం చేకూర్చేదిగానే ఉంది.  ఎన్నికలకు సంబంధించి సిసి టీవి ఫుటేజి, వెబ్‌ కాస్టింగ్‌, అభ్యర్ధుల వీడియోలు వంటి ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీని కేంద్రం నిషేధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతకు తావే లేకుండా చేసిందని పరిశీలకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం  ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ఆధారిత పార్లమెంటరీ వ్యవస్థకు తీవ్ర విఘాతం అనడంలో ఇసుమంతైనా సందేహాంచాల్సిన అవసరం లేదు. 1961-ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 93(2)(ఎ) ప్రకారం ఎవరైనా ఎన్ని కలకు సంబంధించిన అన్ని రికార్డులనూ తనిఖీ చేయడానికి అనుమతి ఉంది. ఇక నుంచి ఎలక్ట్రానిక్‌ రికార్డుల పరిశీలన కుదరదని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఎన్నికల రూల్స్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఒక కేసు కారణంగా ఎన్నికల సంఘం (ఇసి) సిఫారసు మేరకు రూల్స్‌ సవరించామన్న ప్రభుత్వ వివరణ ఈ దుర్మార్గ నిర్ణయం విషయంలో తన చేతికి మట్టి అంటుకోలేదని సంబరపడటానికి తప్ప మరెందుకూ పనికి రాదు.    ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హర్యానా-పంజాబ్‌ హైకోర్టులో వేసిన కేసులో పిటిషన్‌దారు అభ్యర్ధన మేరకు రికార్డులన్నింటినీ షేర్‌ చేయాలని న్యాయస్థానం ఇసి ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ రూల్స్‌ ప్రకారం ఇవ్వాలని నిర్దేశించింది. కోర్టు తీర్పును అమలు చేయాల్సిన ఇసి, అందుకు భిన్నంగా రూల్స్‌ మార్చాలని కేంద్రాన్ని కోరింది. అలా కోరడం తరువాయి.. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆఘమేఘాల మీద నిబంధనలను మార్చేసి న్యాయస్థానం అదేశాలను తుంగలోకి తొక్కేసింది.     రిగ్గింగ్‌, అవకతవకలు సహా ఎన్నికల్లో అక్రమాలను, నిరోధించేందుకు, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం సిసి టీవీలను, వెబ్‌ కాస్టింగ్‌ను కొన్నేళ్ల కిందట  ఈసీ  ప్రవేశపెట్టింది. పోలింగ్‌కు ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో  అభ్యర్ధుల, రాజకీయ పార్టీల ఫిర్యాదుల మేరకు ఈసీ వీడియోలను పరిశీలించి రీపోలింగ్‌కు ఆదేశించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఏ చిన్న మార్పు చేయాల్సి వచ్చినా రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం విస్తృత సంప్రదింపులు జరపడం ఆనవాయితీ.  కానీ ప్రస్తుత రూల్స్‌ మార్పుపై ఆ విధంగా చర్చ జరగలేదు. ఈసీ కోరింది. కేంద్రం చేసేసింది. అంతే. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ప్రతిపక్షాలను, రాజకీయ పార్టీలనూ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.   రికార్డుల తనిఖీ వలన ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని, వీడియోలను ఉపయోగించుకొని కృత్రిమ మేధ సహాయంతో పైరసీ వీడియోలు తయారు చేస్తున్నారన్న కేంద్ర ప్రభుత్వ, ఇసి వాదనలో పస లేదు. ఎన్నికల రికార్డులు బయట పడితే  తమకు ఇబ్బంది అన్న భయంతోనే  మోడీ సర్కార్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీపై నిషేధం విధించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మోడీ సర్కార్‌ ప్రభావంలో ఇసి పని చేస్తోందనడానికి గడచిన పదేళ్లల్లో ఎన్నో దృష్టాంతాలున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకపు ప్యానెల్‌లో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ను తొలగించడంతోనే ఈ విషయం నిర్ద్వంద్వంగా రుజువైంది. ఇప్పుడు ఏకంగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రూల్స్‌నే మార్చేయడం తిరుగులేని రుజువుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  స్వతంత్రంగా పని చేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ ఇసిపై ఇంతటి స్థాయిలో సందేహాలు రావడం ఏ విధంగా చూసినా  ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల సంఘంపై  ప్రజలు విశ్వాసం కోల్పోతే రాజ్యాంగానికే ప్రమా దం. రాజకీయ పార్టీల, అభ్యర్ధుల హక్కులను ప్రస్తుత నిబంధనల మార్పు చిదిమేస్తుందనడంలో సందే హం లేదు. కాగా నిబంధనలను మార్చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అది వేరు సంగతి. అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఎన్నికల నిబంధనలను మార్చేసి ఎలక్ట్రీనిక్  రికార్డుల తనిఖీపై విధించిన నిషేధాన్ని మోడీ సర్కార్ బేషరతుగా తక్షణమే ఉపసంహరించుకోవాలి.  

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్టు

అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఆంటోనీని ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పని చేస్తున్న ఆంటోనీని అరెస్టు చేయడానికి ముందు దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో పోలీసులు విచారించారు. ఆ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగానే ఆంటోనీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.   ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అల్లు అర్జున్ బౌన్సర్ల టీమ్ ఆర్గనైజర్ ఆంటోనీని అరెస్టు చేయడం, అల్లు అర్జున్ ను సుదీర్ఘంగా విచారించడంతో ఇప్పుడో, ఇహనో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కాకతీయ అనవాళ్లు పరిరక్షించుకోవాలి

ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  నార్సింగి మండలం, మంచిరేవులలో చాళుక్య, కాకతీయ అనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. టీ.జీ.ఎస్.పి ప్రాంగణానికి ఎడమవైపున, మూసీ నది కుడివైపున గల వీరభద్రాలయంలో యోని ఆకారంలో గల పానపట్టం, దాని పైనున్న శివలింగం క్రీ.శ 8వ శతాబ్ది చాళుక్యుల కాలానికి చెందిందని, ఆలయం వెలుపల ఉత్తరం వైపు గల భిన్నమైన వీరభద్రుని విగ్రహం క్రీ.శ 13వ శతాబ్ది కాకతీయుల కాలం నాటిదని అన్నారు. మచిరేవుల పరిసరాలలో చారిత్రక ఆనవాళ్లు గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం నాడు ఈ విగ్రహాలను పరిశీలించారు. ఆరు చేతులు గల వీరభద్రుడు కుడివైపున కత్తి, బాణము, ఢమరుకం, ఎడమ వైపున డాలు, విల్లు, శూలం ధరించి, శరీరం అన్ని ఆభరణాలతో అలంకరించబడి ఉందని, ఆలయ ప్రవేశ ద్వారం ముందు, అసంపూర్ణంగా చెక్కిన నంది శిల్పం కూడా కాకతీయుల కాలంనాటిదేనని శివనాగిరెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాలను భద్రపరిచి, కాపాడుకోవాలని ఆలయ వంశ పారంపర్య అర్చకులు మాడపాటి పరమేశ్వర్ గారికు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ శిల్పాల ద్వారా హైదరాబాద్ నగర శివారులోని మంచిరేవుల గ్రామ చరిత్ర చాళుక్యకాలం అంటే 1200 సంవత్సరాల ప్రాచీనత కలిగి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కార్యదర్శి పాములపాటి శ్రీనాథ్ రెడ్డి, ఆలయ అర్చకులు మాడపాటి పరమేశ్వర్ పాల్గునారు.

అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ.. తిరుపతిలో ఉద్రిక్తత

వైఎస్ జగన్ హయాంలో తిరుపతి, తిరుమలలో  అన్యమత ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకు కొలువులు ఇచ్చారు. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసే విధంగా పలు ఘటనలు జరిగినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల పవిత్రతను కాపాడే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తిరుమల పవిత్రత, పారిశుద్ధం మెరుగుపరచడం వంటి చర్యలతో  పాటుగా తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది. అయితే గత ప్రభుత్వంలో అరాచకాలను ప్రోత్సహించిన ఫలితంగా ఆ అరాచక శక్తుల అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నట్లుగానే కనిపిస్తోంది. తాజాగా తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగింది. తిరుపతిలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టారు. దీంతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలు అన్నమయ్య విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అన్నమాచార్యుడికి అపచారం చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

చిరు పరపతీ మసకబారిందా?

పుష్ప2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన నిస్సందేహంలో అల్లు అర్జున్ ను చిక్కుల్లో పడేసింది. సంఘటన జరిగిన తీరు, దానిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందన అతని హీరో ఇమేజ్ ను మసకబార్చాయి. ఆటిట్యూడ్ కారణంగా ఆయన పట్ల సామాన్య ప్రేక్షకులలో సైతం వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  సంధ్యా ధియోటర్ తొక్కిసలాట సంఘటన తరువాత అల్లు అర్జున్ వ్యవహార శైలి ఆయనకు ప్రేక్షకుల ప్రాణాల కంటే.. తన సినిమా ప్రమోషనే ముఖ్యం అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాటలో ఒక మహిళ దుర్మరణం పాలైందని తెలిసిన తరువాత అయితే పుష్ప2 హిట్ అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించినట్లుగా తనకు తెలిసిందంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్య, అలాగే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంధ్యా ధియోటర్ తొక్కిసలాట వివరాలను వెల్లడిస్తూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించిన తీరు నిస్సందేహంగా అల్లు అర్జున్ ప్రతిష్ఠను మసకబరిచాయి.  సంధ్య థియేటర్ తొక్కిసలాట సమస్య తర్వాత అల్లు అర్జున్ ఊహించని విధంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ నటుడికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.  నటుడితో పాటు, అతనికి మద్దతు ఇచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరూ ఇప్పుడు నష్ట నివారణకు తీసుకోవలసి చర్యలేమిటని మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో సీఎంను కలస వివరణ ఇచ్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అన్నిటికీ మించి అల్లు అర్జున్ యాటిట్యూడ్ కారణంగా మొత్తం చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. అల్లు అర్జున్ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే  ఇకపై తెలంగాణలో సినిమాల రిలీజ్ సందర్భంగా స్పెషల్ షోలు, టికెట్ల పెంపునకు అనుమతించేదే లేదని ప్రభుత్వం ప్రకటించింది.  అలాగే అల్లు అర్జున్ తొక్కిసలాట సమాచారం తనకు పోలీసులు ఇవ్వలేదనడం, పోలీసులే తాను సంధ్యా ధియోటర్ కు వచ్చిన సందర్భంగా ట్రాఫిక్ కంట్రోల్ చేశారని చెప్పడంతో  పోలీసు వ్యవస్థ సైతం అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంధ్యా ధియోటర్ వద్ద అల్లు అర్జున్ ర్యాలీ, ధియోటర్ నుంచి పోలీసు ఉన్నతాధికారులే అల్లు అర్జున్ ను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసి పుష్ఫ హీరో గాలి తీసేశారు.  ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ వద్ద మెగాస్టార్ చిరంజీవి పరపతి కూడా మసకబారిందా అన్న అనచ్చ మొదలైంది.  చిరంజీవికి ఇటు పరిశ్రమ, అటు రాజకీయవర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ ఆయనను గౌరవిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాలలో చిరంజీవి పట్ల తనకు గౌరవం ఉందన్న విషయాన్ని చాటారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ కు మద్దతుగా చిరంజీవి ముందుకు రాలేదా? వచ్చినా ఆయన మాటకు రేవంత్ సర్కార్ విలువ ఇవ్వలేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్టు వరకూ వెళ్లకుండా చిరు మాటసాయం పని చేయలేదా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చిరంజీవి మౌనం వహించారన్న వాదనా తెరపైకి వచ్చింది.   ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.  అయితే ఆ ప్రచారాన్ని పూర్వపక్షం చేస్తూ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్టైన సమయంలో స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అలాగే జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత  అల్లు అర్జున్ కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపారు. అయితే ఆ తరువాత వరుసగా జరిగిన పరిణామాల నేపథ్యంలో చిరు మాట, పలుకుబడి రేవంత్ సర్కార్ వద్ద పని చేయలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ప్రకటించడం వల్ల వెంటనే ఎఫెక్ట్ పడేది చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ పైనే అనడంలో సందేహం లేదు.  ఎందుకంటే త్వరలో గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన సంగతేంటంటే.. అల్లు అర్జున్ పుష్ప2 వివాదం విషయంలో ఇప్పటి వరకూ  రామ్ చరణ్ స్పందించకపోవడం కూడా చిరు అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరుస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా.. పుష్ప2 చిచ్చు!

పుష్ప2 సినిమా విడుదలై నప్పటినుంచి సక్సస్ ,వసూళ్లూ సంచలనాలు రేపడం ఒక పార్శ్వమైతే.. ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాటలో  మహిళ మృతి ఘటన తీవ్ర వివాదానికి దారి తీయడం మరో పార్శ్వం.  ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారి చివరికి రాజకీయ రంగు పులుముకుంది. సంధ్యా ధియోటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ద్వారా మధ్యంతర బెయిలు పొంది అల్లు అర్జున్ బయటకు రావడం, అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పుష్ప2 రచ్చ రంబోలాగా మారింది. చివరకు ఈ వివాదం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రూపుదిద్దుకుంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ స్పందన అతిగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో  ఇంత కాలం దొరకని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అరాటపడుతోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ మద్దతు లభించినట్లు, తెలంగాణలో  అభిమానులు,క్రేజ్  ఉన్న అర్జున్ ను  తురఫ్ కార్డు గా ఉపయోగించుకోవాలని బీజేపీ తాపత్రేయపడుతున్నట్లుగా కనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో బీజేపీనాయకులు , తెలంగాణ బీజేపీ నాయకుల ప్రకటనల వెనుక బీజేపీ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ను వ్యతిరేకించడమే కాకుండా, సినీ జనాల మద్దతును గంపగుత్తగా పొందేయాలన్న ఆరాటమే బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.  సంధ్యా ధియోటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ తప్పు లేదని, సినిమా రీలీజ్ సందర్భంగా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగడం పరిపాటే నని సమర్ధించడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడటం లేదు. ఈ సంఘటనలో తప్పు అల్లు అర్జున్ దేనిని పోలీసుల వీడియో నిర్ద్వంద్వంగా చాటుతోంది. ప్రభుత్వం కూడా అదే భావిస్తోంది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి మరీ తాను నిర్దోషినని చాటుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అప్పటి వరకూ అల్లు అర్జున్ పట్ల జన బాహుల్యంలో కొద్దో గొప్పో వ్యక్తమైన సానుభూతి ఆవిరైపోయింది. సినీ నటుడు రాహుల్  రామకృష్ణ కూడా పోలీసులు రిలీజ్ చేసిన వీడియో చూసిన తరువాత అల్లు అర్జున్ కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహ రించుకుంటున్నట్లు ప్రకటించారంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్ధమౌతోంది. ఇక అల్లు అర్జున్ నష్ట నివారణ చర్యలకు దిగుతారని అంతా భావిస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగి.. ఇది కేవలం కక్ష సాధింపు,తొందర పాటు చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. మరో వైపు బీఆర్ఎస్ కూడా రాజకీయంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ తనకు అందివచ్చిన అవకాశంగా భావించి ఆయనకు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెసు కు మజ్లీస్   మద్దతు ఇస్తున్నది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వమని రేవంత్ స్పష్టం చేసారు.  అన్నిటికీ మించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలో అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, తన క్యారెక్టర్ ను తగ్గించాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు, తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటాలన్న ప్రయత్నంతోనే తాను సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొన్న గొప్పలతో వివాదం మరింత ముదిరింది.  తప్పు అర్జున్ దని,కాదని అర్జున్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి వివాదాన్ని తగ్గించాలని గాంధీ భవన్ కు వచ్చి రాష్ట్ర ఇన్చార్జి దాస్ మున్షీ కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రేవంత్ వ్యాఖ్యలపై అర్జున్ కామెంట్స్ కూడా మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి ఈ వివాదం ఎంత వరకూ వెడుతుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు హైదరాబాద్ నుంచి చిత్రపరిశ్రమ తరలిపోయేంత వరకూ ఈ వివాదం సాగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ నాటికి ఈ వివాదం సర్దుమణిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు

శీతాకాలంలో అరకుకు పర్యాటకులు పోటెత్తుతారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అరకులోయకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి అరకుకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19 వరకూ ప్రతి శని ఆదివారాలలో నడుస్తుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్ ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు అరకు నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలులో ఒక సెకండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ బోగీలతో పాటు 10 స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ బోగీలతో పాటు ఒక జనరల్ కమ్ లగేజ్ బోగీ ఉంటుంది.  ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్‌.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. పర్యాటకులకు ఉపయుక్తంగా ఉండే విధంగా విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వేశాఖ నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

పేర్ని నాని కుటుంబం త‌ప్పించుకున్న‌ట్లేనా?

కాకినాడ పోర్టు కేంద్రంగా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై గ‌త కొద్దికాలంగా కేసులు, వివాదాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు  కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో రేష‌న్ గోడౌన్ లో రేష‌న్ బియ్యం మాయం కావ‌డంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జ‌య‌సుధ‌, ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపై పోలీసులు క్రిమిన‌ల్‌ కేసులు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బియ్యం మాయ‌మైన కేసులో ప్ర‌ధాన నిందితురాలు జ‌య‌సుధ విదేశాల‌కు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామ‌ని, అదే స‌మ‌యంలో వారిని ప‌ట్టుకునేందుకు మూడు ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించి పేర్ని జ‌య‌సుధ కోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా, ఆ పిటిషన్ విచారణ మంగళవారం (డిసెంబర్ 24)కువాయిదా ప‌డింది. మ‌రోవైపు పేర్ని నాని, ఆయ‌న కుమారుడు కిట్టులు పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చెప్పేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌టంతో ఈనెల 22న‌ స్టేష‌న్ కు రావాల్సిందిగా ఇంటికి నోటీసులు అంటించారు. అయితే, వారు విచార‌ణ‌కు హాజరు కాక‌పోగా.. పోలీసుల నోటీసులు క్వాష్ చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. వారి పిటిష‌న్ల‌పై కూడా మంగ‌ళ‌వారం (డిసెంబర్ 24) కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని త‌న స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట బంద‌రు మండ‌లం పొట్ల‌పాలెంలో గోదాములు నిర్మించారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాది త‌రువాత‌ ఏపీ గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ ఆ గోదాముల‌ను అద్దెకు తీసుకుంది. బ‌స్తాకు నెల‌కు ఐదు రూపాయ‌లు  అద్దె చెల్లిస్తోంది. ఆ గోదాముల్లోని నిల్వ‌ల్లో తేడాలున్న‌ట్లు గ‌త నెల‌ చివ‌రి వారంలో పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ‌కు ఫిర్యాదు రావ‌డంతో వారు డిసెంబ‌ర్ నెల మొద‌టి వారంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్ర‌భుత్వానికి చెందిన రేష‌న్ బియ్యంలో 185 ట‌న్నులు మాయ‌మైన‌ట్లు కృష్ణా జిల్లా సివిల్ స‌ప్ల‌య్స్ కార్పొరేష‌న్ అధికారులు గుర్తించారు. దీంతో రేష‌న్ బియ్యం మాయంపై బంద‌రు పోలీస్ స్టేష‌న్ లో అధికారులు పేర్ని నాని స‌తీమ‌ణి, గోదాం యాజ‌మాని జ‌య‌సుధ‌తోపాటు ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపైనా ఫిర్యాదు చేశారు. డిసెంబ‌ర్ 10వ తేదీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అంతేకాక రూ.1.76కోట్లు జ‌రిమానా విధించారు. షార్జేజీకి సంబంధించిన రేష‌న్ బియ్యం విలువ ప్ర‌భుత్వానికి చెల్లిస్తామ‌ని  నాని కుటుంబం పేర్కొంది. ఆ మొత్తాన్ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖకు చెల్లించిన‌ట్లు తెలిసింది. అయితే, డ‌బ్బులు చెల్లించినా.. ప్ర‌భుత్వ ఆస్తుల దుర్వినియోగంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేర్ని నానికి సంబంధించిన గోదాంలో రేష‌న్ బియ్యం మాయంపై పోలీసులు కేసు న‌మోదు చేసిన నాటి నుంచి ప్ర‌ధాన నిందితురాలు జ‌య‌సుధ‌, ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. వీరు ముంద‌స్తుగా పారిపోవ‌డానికి కొంద‌రు పోలీసులు, కృష్ణా జిల్లాకు చెందిన ప‌లువురు తెలుగుదేశం నేత‌లు స‌హ‌క‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు సైతం సీరియ‌స్ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోవైపు పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ల‌డంపై వైసీపీ శ్రేణుల్లో  నిరాశ వ్య‌క్త‌మ‌వుతున్నది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో కేసులు న‌మోదైన స‌మ‌యంలో తెలుగుదేశం నేత‌లు దైర్యంగా ఎదుర్కొన్నార‌ని.. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌లు కేసులు న‌మోదు కావ‌డంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండ‌టం ప‌ట్ల వైసీపీ శ్రేణులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో విష‌యం ఏమిటంటే.. ఈ కేసుల నుంచి పేర్ని నాని కుటుంబం సేఫ్ గా బ‌య‌ట‌ప‌డేందుకు వైసీపీ నేత‌ల కంటే కొంద‌రు తెలుగుదేశం వారే  క్కువ ఉత్సాహం చూపుతున్నార‌న్న వాద‌న టీడీపీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. పోలీసులు సైతం వారిని జాడ తెలిసిన‌ప్ప‌టికీ ప‌ట్టుకొని స్టేష‌న్ కు తీసుకొచ్చి విచార‌ణ జ‌రిపేందుకు వెనుకడుగు వేస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. పోలీసుల నోటీసులు క్వాష్ చేయాల‌ని కోరుతూ హైకోర్టులో నాని, ఆయ‌న కుమారుడు కిట్టు పిటిష‌న్లు వేయ‌గా.. కేసులో ఏ1గా ఉన్న నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ ఇప్ప‌టికే బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌పై మంగళవారం (డిసెంబర్ 24) కోర్టుల్లో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. కోర్టులు వారికి అనుకూలంగా తీర్పు ఇస్తే .. ఇక వారు అరెస్టు నుంచి త‌ప్పించుకున్న‌ట్లేన‌ని అంటున్నారు. వైసీపీ హ‌యాంలో త‌ప్పు చేయ‌క‌పోయినా అక్ర‌మ కేసులు పెట్టి పోలీసులు తెలుగుదేశం నేత‌ల‌ను జైళ్ల‌కు పంపించిన సంద‌ర్భాలు, పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లి చిత‌క‌బాదిన సంద‌ర్భాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో మాత్రం అందుకు విరుద్ధంగా తప్పు చేసినా కూడా వైసీపీ నేతలను అరెస్టు చేయకుండా వారు తప్పించుకునేందుకు అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అవినీతికి పాల్ప‌డినట్లు వైసీపీ నేత‌లు అడ్డంగా దొరికి, కేసులు న‌మోదైనా వారిని ప‌ట్టుకొని చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌వుతుండ‌టం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏబీవీకి ఊర‌ట మాత్ర‌మే.. పూర్తి న్యాయ‌మేదీ?!

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తెలుగుదేశం నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. అక్ర‌మ కేసులు పెట్టి వారిని జైళ్ల‌కు  పంపించి తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశారు. అదే త‌ర‌హాలో కొంద‌రు సీనియ‌ర్ అధికారుల‌ను కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ జాబితాలో ప్ర‌ముఖంగా వినిపించే పేరు మాజీ డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. గ‌త  తెలుగుదేశం ప్ర‌భుత్వ  హ‌యాంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేశారని జ‌గ‌న్ క‌క్ష క‌ట్టారు.  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న్ను టార్గెట్ చేశారు. అయితే, ఏబీవీ సైతం ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఐదేళ్లు యూనిఫాం వేసుకోకుండానే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై న్యాయ‌స్థానాల ద్వారా వీరోచిత పోరాటం చేశాడు. ఈ క్ర‌మంలో ఒకానొక ద‌శ‌లో జ‌గ‌న్ రెడ్డి ధ‌న బ‌లం, అధికార బ‌లం ముందు ఏబీవీ నిల‌వ‌లేక పోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను సైతం అడ్డగోలుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ధిక్క‌రించింది. ఆయన మళ్లీ పోలీస్ డ్రస్ వేసుకోకుండా  చేయడానికి లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. త‌న కుమారుడి కంపెనీ నుంచి పరికరాల కొనుగోలు చేశారన్న అభియోగంతో ఏబీవీని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు.. ఆ అభియోగాల‌ను రుజువు చేయ‌లేక పోయింది. ఒకే కేసులో రెండుసార్లు ఏబీవీని స‌స్పెండ్ చేసి క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. చివరకు క్యాట్‌లో సైతం ఏబీవీపై ఆరోపణలను జ‌గ‌న్ స‌ర్కార్‌ రుజువు చేయలేకపోయింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన రిటైర్‌మెంట్ రోజున పోస్టింగ్ ఇచ్చింది. సుదీర్ఘ‌కాలం త‌రువాత ఉద‌యం పోలీసు డ్ర‌స్ వేసుకొని సాయంత్రం రిటైర్ కావాల్సిన ప‌రిస్థితిని ఏబీ వెంకటేశ్వరరావు ఎదుర్కొన్నారు. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై జ‌గ‌న్ రెడ్డి క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి వారిద్ద‌రి మ‌ధ్య ఆస్తి త‌గాదాలు లేవు. ఆయ‌న గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంటెలిజెన్స్  చీఫ్‌గా ప‌నిచేశారు. ఆ స‌మయంలో ఏబీవీ తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించారన్న అపోహతోనే జగన్  ఆయనపై కక్ష పెట్టుకున్నారు. అంద‌రిలా జగన్‌తో స‌ర్దుకుపోయి ఉంటే ఏబీ భవిష్యత్ మరోలా ఉండేదన్నది వైసీపీ నేత‌ల వాద‌న‌. కానీ ఏబీవీ మాత్రం జ‌గ‌న్‌కు త‌లొగ్గ‌కుండా న్యాయ‌స్థానాల ద్వారా సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏబీ వెంటేశ్వ‌ర‌రావుకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆయ‌న్ను నియ‌మిస్తార‌ని, ఇక వైసీపీ హ‌యాంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా ప‌నిచేసిన అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్య‌యి. తెలుగుదేశం కోసం జ‌గ‌న్‌కు టార్గెట్ గా మారి ఐదేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఏబీవీకి కూట‌మి ప్ర‌భుత్వం అధికార‌లోకి వ‌చ్చిన త‌రువాత ఆశించిన స్థాయిలో న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న వాద‌న తెలుగుదేశం శ్రేణుల నుంచే వ్య‌క్త‌మ‌వుతున్నది. తాజాగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులనూ ఎత్తివేస్తున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి జగన్‌పై ఐదేళ్లు అలుపెర‌గ‌ని పోరాటం చేసిన పోలీసు పోరాట యోధుడు ఏబీకి ఇది స్వల్ప ఊరట మాత్రమే అని చెప్పాలి. పూర్తి న్యాయం మాత్రం ఇంకా జ‌ర‌గ‌లేద‌ని అంతా భావిస్తున్నారు. 2019లో జ‌గ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన అధికారుల‌కు చ‌క‌చ‌కా కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించారు. తెలుగుదేశంకుఫేవ‌ర్ గా ఉంటూ వ‌చ్చిన అధికారులు ఐదేళ్ల జ‌గ‌న్ హ‌యాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి ఆర్నెళ్లు అయినా వారికి ఇప్పటికీ స‌రైన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్న వాద‌న ఉంది. ఏవీ వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా అదే జాబితాలో ఉన్నారు. ప్రధానంగా ఏసీబీ విచారణను ఉపసంహరించుకునేలా, అడ్వకేట్ జనరల్ చొరవ తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత గానీ ఆ ఫైలులో కదలిక రాకపోవడమే విచిత్రం. దానికంటే ముందు.. ఏబీవీని రెండోసారి సస్పెండ్ చేసేందుకు కారణమయిన కేసును కూడా ప్ర‌భుత్వం వేగంగా ఉపసంహరించుకుంటుందని పార్టీ నాయకులు అంచనా వేశారు. ఇక్క‌డ మ‌రో విషాదక‌ర విష‌యం ఏమిటంటే.. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినప్పటికీ ఏబీవీకి న్యాయంగా ప్రభుత్వం నుంచి రావలసిన కోటీ 70 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ రాలేదు. దాని కోసం ఆయన సీఎస్‌కు ఇచ్చిన లేఖ ఏటుపోయిందో మ‌రి..! అంటే.. మంచి ప్రభుత్వంలో అధికారులు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారో, ఎంత చురుకుగా పనిచేస్తున్నారో అర్ధమవుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అధికారుల బ‌దిలీల్లో ఏబీవీ వెంక‌టేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర పోషిస్తున్నారంటూ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఎదుర్కోవాల్సి వ‌స్తున్నది. కూట‌మి ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు పూర్తి న్యాయం జ‌ర‌క్క‌పోగా.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప‌రిస్థితి. ఇదిలాఉంటే.. ఏబీవీపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులూ ఉపసంహరించుకున్నట్లు కూట‌మి ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేప‌థ్యంలో అప్పటి విచారాణాధికారి సిసోడియా వ్యవహారశైలి మరోసారి చర్చకు వచ్చింది. ఏబీవీపై విచారణకు జగన్ సర్కారు సిసోడియాను విచారణాధికారిగా నియమించింది. ఆ సంద‌ర్భంలో సిసోడియా ఏబీపై అడ్డగోలుగా నివేదిక ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాతనే సిసోడియాను గవర్నర్ కార్యదర్శిగా నియమించారని తెలుగుదేశం వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే, ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇప్పించిన కారణంగానే సిసోడియాను తప్పించారే తప్ప ఆయనేమీ జగన్ బాధితుడు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే సిసోడియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారని, ఆయనకే సీఎస్ పదవి దక్కుతుందన్న ప్రచారంపై  సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. తాజాగా ప్రభుత్వం ఏబీవీపై అన్ని కేసులు ఉపసంహరించుకున్న ఉత్తర్వు పరిశీలిస్తే సిసోడియా నివేదిక డొల్లతనం ఏమిటో స్పష్టమవుతోందని ఐపీఎస్ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. అలాంటి నివేదికలిచ్చిన సిసోడియాను సీఎస్‌గా నియమించి చంద్రబాబు ప్రభుత్వం అప్రతిష్ఠ ఎందుకు కొనితెచ్చుకుంటుందన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.