అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ.. తిరుపతిలో ఉద్రిక్తత

వైఎస్ జగన్ హయాంలో తిరుపతి, తిరుమలలో  అన్యమత ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకు కొలువులు ఇచ్చారు. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసే విధంగా పలు ఘటనలు జరిగినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల పవిత్రతను కాపాడే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తిరుమల పవిత్రత, పారిశుద్ధం మెరుగుపరచడం వంటి చర్యలతో  పాటుగా తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది. అయితే గత ప్రభుత్వంలో అరాచకాలను ప్రోత్సహించిన ఫలితంగా ఆ అరాచక శక్తుల అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నట్లుగానే కనిపిస్తోంది. తాజాగా తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి అపచారం జరిగింది. తిరుపతిలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టారు. దీంతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భజరంగ్ దళ్ కార్యకర్తలు అన్నమయ్య విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అన్నమాచార్యుడికి అపచారం చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

చిరు పరపతీ మసకబారిందా?

పుష్ప2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన నిస్సందేహంలో అల్లు అర్జున్ ను చిక్కుల్లో పడేసింది. సంఘటన జరిగిన తీరు, దానిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందన అతని హీరో ఇమేజ్ ను మసకబార్చాయి. ఆటిట్యూడ్ కారణంగా ఆయన పట్ల సామాన్య ప్రేక్షకులలో సైతం వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  సంధ్యా ధియోటర్ తొక్కిసలాట సంఘటన తరువాత అల్లు అర్జున్ వ్యవహార శైలి ఆయనకు ప్రేక్షకుల ప్రాణాల కంటే.. తన సినిమా ప్రమోషనే ముఖ్యం అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాటలో ఒక మహిళ దుర్మరణం పాలైందని తెలిసిన తరువాత అయితే పుష్ప2 హిట్ అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించినట్లుగా తనకు తెలిసిందంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్య, అలాగే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంధ్యా ధియోటర్ తొక్కిసలాట వివరాలను వెల్లడిస్తూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించిన తీరు నిస్సందేహంగా అల్లు అర్జున్ ప్రతిష్ఠను మసకబరిచాయి.  సంధ్య థియేటర్ తొక్కిసలాట సమస్య తర్వాత అల్లు అర్జున్ ఊహించని విధంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆ నటుడికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది.  నటుడితో పాటు, అతనికి మద్దతు ఇచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరూ ఇప్పుడు నష్ట నివారణకు తీసుకోవలసి చర్యలేమిటని మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలో సీఎంను కలస వివరణ ఇచ్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అన్నిటికీ మించి అల్లు అర్జున్ యాటిట్యూడ్ కారణంగా మొత్తం చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. అల్లు అర్జున్ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే  ఇకపై తెలంగాణలో సినిమాల రిలీజ్ సందర్భంగా స్పెషల్ షోలు, టికెట్ల పెంపునకు అనుమతించేదే లేదని ప్రభుత్వం ప్రకటించింది.  అలాగే అల్లు అర్జున్ తొక్కిసలాట సమాచారం తనకు పోలీసులు ఇవ్వలేదనడం, పోలీసులే తాను సంధ్యా ధియోటర్ కు వచ్చిన సందర్భంగా ట్రాఫిక్ కంట్రోల్ చేశారని చెప్పడంతో  పోలీసు వ్యవస్థ సైతం అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంధ్యా ధియోటర్ వద్ద అల్లు అర్జున్ ర్యాలీ, ధియోటర్ నుంచి పోలీసు ఉన్నతాధికారులే అల్లు అర్జున్ ను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసి పుష్ఫ హీరో గాలి తీసేశారు.  ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ వద్ద మెగాస్టార్ చిరంజీవి పరపతి కూడా మసకబారిందా అన్న అనచ్చ మొదలైంది.  చిరంజీవికి ఇటు పరిశ్రమ, అటు రాజకీయవర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ ఆయనను గౌరవిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాలలో చిరంజీవి పట్ల తనకు గౌరవం ఉందన్న విషయాన్ని చాటారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ కు మద్దతుగా చిరంజీవి ముందుకు రాలేదా? వచ్చినా ఆయన మాటకు రేవంత్ సర్కార్ విలువ ఇవ్వలేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్టు వరకూ వెళ్లకుండా చిరు మాటసాయం పని చేయలేదా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చిరంజీవి మౌనం వహించారన్న వాదనా తెరపైకి వచ్చింది.   ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.  అయితే ఆ ప్రచారాన్ని పూర్వపక్షం చేస్తూ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్టైన సమయంలో స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అలాగే జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత  అల్లు అర్జున్ కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపారు. అయితే ఆ తరువాత వరుసగా జరిగిన పరిణామాల నేపథ్యంలో చిరు మాట, పలుకుబడి రేవంత్ సర్కార్ వద్ద పని చేయలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ప్రకటించడం వల్ల వెంటనే ఎఫెక్ట్ పడేది చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ పైనే అనడంలో సందేహం లేదు.  ఎందుకంటే త్వరలో గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన సంగతేంటంటే.. అల్లు అర్జున్ పుష్ప2 వివాదం విషయంలో ఇప్పటి వరకూ  రామ్ చరణ్ స్పందించకపోవడం కూడా చిరు అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరుస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా.. పుష్ప2 చిచ్చు!

పుష్ప2 సినిమా విడుదలై నప్పటినుంచి సక్సస్ ,వసూళ్లూ సంచలనాలు రేపడం ఒక పార్శ్వమైతే.. ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాటలో  మహిళ మృతి ఘటన తీవ్ర వివాదానికి దారి తీయడం మరో పార్శ్వం.  ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారి చివరికి రాజకీయ రంగు పులుముకుంది. సంధ్యా ధియోటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ద్వారా మధ్యంతర బెయిలు పొంది అల్లు అర్జున్ బయటకు రావడం, అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పుష్ప2 రచ్చ రంబోలాగా మారింది. చివరకు ఈ వివాదం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రూపుదిద్దుకుంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ స్పందన అతిగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో  ఇంత కాలం దొరకని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అరాటపడుతోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ మద్దతు లభించినట్లు, తెలంగాణలో  అభిమానులు,క్రేజ్  ఉన్న అర్జున్ ను  తురఫ్ కార్డు గా ఉపయోగించుకోవాలని బీజేపీ తాపత్రేయపడుతున్నట్లుగా కనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో బీజేపీనాయకులు , తెలంగాణ బీజేపీ నాయకుల ప్రకటనల వెనుక బీజేపీ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ను వ్యతిరేకించడమే కాకుండా, సినీ జనాల మద్దతును గంపగుత్తగా పొందేయాలన్న ఆరాటమే బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.  సంధ్యా ధియోటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ తప్పు లేదని, సినిమా రీలీజ్ సందర్భంగా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగడం పరిపాటే నని సమర్ధించడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడటం లేదు. ఈ సంఘటనలో తప్పు అల్లు అర్జున్ దేనిని పోలీసుల వీడియో నిర్ద్వంద్వంగా చాటుతోంది. ప్రభుత్వం కూడా అదే భావిస్తోంది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి మరీ తాను నిర్దోషినని చాటుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అప్పటి వరకూ అల్లు అర్జున్ పట్ల జన బాహుల్యంలో కొద్దో గొప్పో వ్యక్తమైన సానుభూతి ఆవిరైపోయింది. సినీ నటుడు రాహుల్  రామకృష్ణ కూడా పోలీసులు రిలీజ్ చేసిన వీడియో చూసిన తరువాత అల్లు అర్జున్ కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహ రించుకుంటున్నట్లు ప్రకటించారంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్ధమౌతోంది. ఇక అల్లు అర్జున్ నష్ట నివారణ చర్యలకు దిగుతారని అంతా భావిస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగి.. ఇది కేవలం కక్ష సాధింపు,తొందర పాటు చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. మరో వైపు బీఆర్ఎస్ కూడా రాజకీయంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ తనకు అందివచ్చిన అవకాశంగా భావించి ఆయనకు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెసు కు మజ్లీస్   మద్దతు ఇస్తున్నది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వమని రేవంత్ స్పష్టం చేసారు.  అన్నిటికీ మించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలో అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, తన క్యారెక్టర్ ను తగ్గించాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు, తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటాలన్న ప్రయత్నంతోనే తాను సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొన్న గొప్పలతో వివాదం మరింత ముదిరింది.  తప్పు అర్జున్ దని,కాదని అర్జున్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి వివాదాన్ని తగ్గించాలని గాంధీ భవన్ కు వచ్చి రాష్ట్ర ఇన్చార్జి దాస్ మున్షీ కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రేవంత్ వ్యాఖ్యలపై అర్జున్ కామెంట్స్ కూడా మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి ఈ వివాదం ఎంత వరకూ వెడుతుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు హైదరాబాద్ నుంచి చిత్రపరిశ్రమ తరలిపోయేంత వరకూ ఈ వివాదం సాగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ నాటికి ఈ వివాదం సర్దుమణిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు

శీతాకాలంలో అరకుకు పర్యాటకులు పోటెత్తుతారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అరకులోయకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి అరకుకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19 వరకూ ప్రతి శని ఆదివారాలలో నడుస్తుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్ ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు అరకు నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలులో ఒక సెకండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ బోగీలతో పాటు 10 స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ బోగీలతో పాటు ఒక జనరల్ కమ్ లగేజ్ బోగీ ఉంటుంది.  ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్‌.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. పర్యాటకులకు ఉపయుక్తంగా ఉండే విధంగా విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వేశాఖ నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

పేర్ని నాని కుటుంబం త‌ప్పించుకున్న‌ట్లేనా?

కాకినాడ పోర్టు కేంద్రంగా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై గ‌త కొద్దికాలంగా కేసులు, వివాదాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు  కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో రేష‌న్ గోడౌన్ లో రేష‌న్ బియ్యం మాయం కావ‌డంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య జ‌య‌సుధ‌, ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపై పోలీసులు క్రిమిన‌ల్‌ కేసులు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బియ్యం మాయ‌మైన కేసులో ప్ర‌ధాన నిందితురాలు జ‌య‌సుధ విదేశాల‌కు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశామ‌ని, అదే స‌మ‌యంలో వారిని ప‌ట్టుకునేందుకు మూడు ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఈ కేసుకు సంబంధించి పేర్ని జ‌య‌సుధ కోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా, ఆ పిటిషన్ విచారణ మంగళవారం (డిసెంబర్ 24)కువాయిదా ప‌డింది. మ‌రోవైపు పేర్ని నాని, ఆయ‌న కుమారుడు కిట్టులు పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చెప్పేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌టంతో ఈనెల 22న‌ స్టేష‌న్ కు రావాల్సిందిగా ఇంటికి నోటీసులు అంటించారు. అయితే, వారు విచార‌ణ‌కు హాజరు కాక‌పోగా.. పోలీసుల నోటీసులు క్వాష్ చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్లు వేశారు. వారి పిటిష‌న్ల‌పై కూడా మంగ‌ళ‌వారం (డిసెంబర్ 24) కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని త‌న స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట బంద‌రు మండ‌లం పొట్ల‌పాలెంలో గోదాములు నిర్మించారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాది త‌రువాత‌ ఏపీ గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ ఆ గోదాముల‌ను అద్దెకు తీసుకుంది. బ‌స్తాకు నెల‌కు ఐదు రూపాయ‌లు  అద్దె చెల్లిస్తోంది. ఆ గోదాముల్లోని నిల్వ‌ల్లో తేడాలున్న‌ట్లు గ‌త నెల‌ చివ‌రి వారంలో పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ‌కు ఫిర్యాదు రావ‌డంతో వారు డిసెంబ‌ర్ నెల మొద‌టి వారంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్ర‌భుత్వానికి చెందిన రేష‌న్ బియ్యంలో 185 ట‌న్నులు మాయ‌మైన‌ట్లు కృష్ణా జిల్లా సివిల్ స‌ప్ల‌య్స్ కార్పొరేష‌న్ అధికారులు గుర్తించారు. దీంతో రేష‌న్ బియ్యం మాయంపై బంద‌రు పోలీస్ స్టేష‌న్ లో అధికారులు పేర్ని నాని స‌తీమ‌ణి, గోదాం యాజ‌మాని జ‌య‌సుధ‌తోపాటు ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిపైనా ఫిర్యాదు చేశారు. డిసెంబ‌ర్ 10వ తేదీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అంతేకాక రూ.1.76కోట్లు జ‌రిమానా విధించారు. షార్జేజీకి సంబంధించిన రేష‌న్ బియ్యం విలువ ప్ర‌భుత్వానికి చెల్లిస్తామ‌ని  నాని కుటుంబం పేర్కొంది. ఆ మొత్తాన్ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖకు చెల్లించిన‌ట్లు తెలిసింది. అయితే, డ‌బ్బులు చెల్లించినా.. ప్ర‌భుత్వ ఆస్తుల దుర్వినియోగంపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేర్ని నానికి సంబంధించిన గోదాంలో రేష‌న్ బియ్యం మాయంపై పోలీసులు కేసు న‌మోదు చేసిన నాటి నుంచి ప్ర‌ధాన నిందితురాలు జ‌య‌సుధ‌, ఆమె వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. వీరు ముంద‌స్తుగా పారిపోవ‌డానికి కొంద‌రు పోలీసులు, కృష్ణా జిల్లాకు చెందిన ప‌లువురు తెలుగుదేశం నేత‌లు స‌హ‌క‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు సైతం సీరియ‌స్ అయ్యార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోవైపు పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ల‌డంపై వైసీపీ శ్రేణుల్లో  నిరాశ వ్య‌క్త‌మ‌వుతున్నది. గ‌తంలో వైసీపీ హ‌యాంలో కేసులు న‌మోదైన స‌మ‌యంలో తెలుగుదేశం నేత‌లు దైర్యంగా ఎదుర్కొన్నార‌ని.. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌లు కేసులు న‌మోదు కావ‌డంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతుండ‌టం ప‌ట్ల వైసీపీ శ్రేణులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో విష‌యం ఏమిటంటే.. ఈ కేసుల నుంచి పేర్ని నాని కుటుంబం సేఫ్ గా బ‌య‌ట‌ప‌డేందుకు వైసీపీ నేత‌ల కంటే కొంద‌రు తెలుగుదేశం వారే  క్కువ ఉత్సాహం చూపుతున్నార‌న్న వాద‌న టీడీపీ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. పోలీసులు సైతం వారిని జాడ తెలిసిన‌ప్ప‌టికీ ప‌ట్టుకొని స్టేష‌న్ కు తీసుకొచ్చి విచార‌ణ జ‌రిపేందుకు వెనుకడుగు వేస్తున్నార‌న్న వాద‌న కూడా ఉంది. పోలీసుల నోటీసులు క్వాష్ చేయాల‌ని కోరుతూ హైకోర్టులో నాని, ఆయ‌న కుమారుడు కిట్టు పిటిష‌న్లు వేయ‌గా.. కేసులో ఏ1గా ఉన్న నాని స‌తీమ‌ణి జ‌య‌సుధ ఇప్ప‌టికే బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్ల‌పై మంగళవారం (డిసెంబర్ 24) కోర్టుల్లో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. కోర్టులు వారికి అనుకూలంగా తీర్పు ఇస్తే .. ఇక వారు అరెస్టు నుంచి త‌ప్పించుకున్న‌ట్లేన‌ని అంటున్నారు. వైసీపీ హ‌యాంలో త‌ప్పు చేయ‌క‌పోయినా అక్ర‌మ కేసులు పెట్టి పోలీసులు తెలుగుదేశం నేత‌ల‌ను జైళ్ల‌కు పంపించిన సంద‌ర్భాలు, పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లి చిత‌క‌బాదిన సంద‌ర్భాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో మాత్రం అందుకు విరుద్ధంగా తప్పు చేసినా కూడా వైసీపీ నేతలను అరెస్టు చేయకుండా వారు తప్పించుకునేందుకు అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అవినీతికి పాల్ప‌డినట్లు వైసీపీ నేత‌లు అడ్డంగా దొరికి, కేసులు న‌మోదైనా వారిని ప‌ట్టుకొని చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌వుతుండ‌టం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏబీవీకి ఊర‌ట మాత్ర‌మే.. పూర్తి న్యాయ‌మేదీ?!

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తెలుగుదేశం నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారు. అక్ర‌మ కేసులు పెట్టి వారిని జైళ్ల‌కు  పంపించి తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశారు. అదే త‌ర‌హాలో కొంద‌రు సీనియ‌ర్ అధికారుల‌ను కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ జాబితాలో ప్ర‌ముఖంగా వినిపించే పేరు మాజీ డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. గ‌త  తెలుగుదేశం ప్ర‌భుత్వ  హ‌యాంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేశారని జ‌గ‌న్ క‌క్ష క‌ట్టారు.  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న్ను టార్గెట్ చేశారు. అయితే, ఏబీవీ సైతం ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఐదేళ్లు యూనిఫాం వేసుకోకుండానే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై న్యాయ‌స్థానాల ద్వారా వీరోచిత పోరాటం చేశాడు. ఈ క్ర‌మంలో ఒకానొక ద‌శ‌లో జ‌గ‌న్ రెడ్డి ధ‌న బ‌లం, అధికార బ‌లం ముందు ఏబీవీ నిల‌వ‌లేక పోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను సైతం అడ్డగోలుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ధిక్క‌రించింది. ఆయన మళ్లీ పోలీస్ డ్రస్ వేసుకోకుండా  చేయడానికి లాయర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. త‌న కుమారుడి కంపెనీ నుంచి పరికరాల కొనుగోలు చేశారన్న అభియోగంతో ఏబీవీని సస్పెండ్ చేసిన జగన్ సర్కారు.. ఆ అభియోగాల‌ను రుజువు చేయ‌లేక పోయింది. ఒకే కేసులో రెండుసార్లు ఏబీవీని స‌స్పెండ్ చేసి క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. చివరకు క్యాట్‌లో సైతం ఏబీవీపై ఆరోపణలను జ‌గ‌న్ స‌ర్కార్‌ రుజువు చేయలేకపోయింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన రిటైర్‌మెంట్ రోజున పోస్టింగ్ ఇచ్చింది. సుదీర్ఘ‌కాలం త‌రువాత ఉద‌యం పోలీసు డ్ర‌స్ వేసుకొని సాయంత్రం రిటైర్ కావాల్సిన ప‌రిస్థితిని ఏబీ వెంకటేశ్వరరావు ఎదుర్కొన్నారు. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై జ‌గ‌న్ రెడ్డి క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి వారిద్ద‌రి మ‌ధ్య ఆస్తి త‌గాదాలు లేవు. ఆయ‌న గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంటెలిజెన్స్  చీఫ్‌గా ప‌నిచేశారు. ఆ స‌మయంలో ఏబీవీ తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించారన్న అపోహతోనే జగన్  ఆయనపై కక్ష పెట్టుకున్నారు. అంద‌రిలా జగన్‌తో స‌ర్దుకుపోయి ఉంటే ఏబీ భవిష్యత్ మరోలా ఉండేదన్నది వైసీపీ నేత‌ల వాద‌న‌. కానీ ఏబీవీ మాత్రం జ‌గ‌న్‌కు త‌లొగ్గ‌కుండా న్యాయ‌స్థానాల ద్వారా సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏబీ వెంటేశ్వ‌ర‌రావుకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఆయ‌న్ను నియ‌మిస్తార‌ని, ఇక వైసీపీ హ‌యాంలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా ప‌నిచేసిన అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అంద‌రూ భావించారు. కానీ, అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్య‌యి. తెలుగుదేశం కోసం జ‌గ‌న్‌కు టార్గెట్ గా మారి ఐదేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఏబీవీకి కూట‌మి ప్ర‌భుత్వం అధికార‌లోకి వ‌చ్చిన త‌రువాత ఆశించిన స్థాయిలో న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న వాద‌న తెలుగుదేశం శ్రేణుల నుంచే వ్య‌క్త‌మ‌వుతున్నది. తాజాగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులనూ ఎత్తివేస్తున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి జగన్‌పై ఐదేళ్లు అలుపెర‌గ‌ని పోరాటం చేసిన పోలీసు పోరాట యోధుడు ఏబీకి ఇది స్వల్ప ఊరట మాత్రమే అని చెప్పాలి. పూర్తి న్యాయం మాత్రం ఇంకా జ‌ర‌గ‌లేద‌ని అంతా భావిస్తున్నారు. 2019లో జ‌గ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన అధికారుల‌కు చ‌క‌చ‌కా కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించారు. తెలుగుదేశంకుఫేవ‌ర్ గా ఉంటూ వ‌చ్చిన అధికారులు ఐదేళ్ల జ‌గ‌న్ హ‌యాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి ఆర్నెళ్లు అయినా వారికి ఇప్పటికీ స‌రైన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్న వాద‌న ఉంది. ఏవీ వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా అదే జాబితాలో ఉన్నారు. ప్రధానంగా ఏసీబీ విచారణను ఉపసంహరించుకునేలా, అడ్వకేట్ జనరల్ చొరవ తీసుకుంటారని చాలామంది భావించారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత గానీ ఆ ఫైలులో కదలిక రాకపోవడమే విచిత్రం. దానికంటే ముందు.. ఏబీవీని రెండోసారి సస్పెండ్ చేసేందుకు కారణమయిన కేసును కూడా ప్ర‌భుత్వం వేగంగా ఉపసంహరించుకుంటుందని పార్టీ నాయకులు అంచనా వేశారు. ఇక్క‌డ మ‌రో విషాదక‌ర విష‌యం ఏమిటంటే.. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినప్పటికీ ఏబీవీకి న్యాయంగా ప్రభుత్వం నుంచి రావలసిన కోటీ 70 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ రాలేదు. దాని కోసం ఆయన సీఎస్‌కు ఇచ్చిన లేఖ ఏటుపోయిందో మ‌రి..! అంటే.. మంచి ప్రభుత్వంలో అధికారులు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నారో, ఎంత చురుకుగా పనిచేస్తున్నారో అర్ధమవుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అధికారుల బ‌దిలీల్లో ఏబీవీ వెంక‌టేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర పోషిస్తున్నారంటూ ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఎదుర్కోవాల్సి వ‌స్తున్నది. కూట‌మి ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు పూర్తి న్యాయం జ‌ర‌క్క‌పోగా.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ప‌రిస్థితి. ఇదిలాఉంటే.. ఏబీవీపై జగన్ ప్రభుత్వం నమోదు చేసిన అన్ని కేసులూ ఉపసంహరించుకున్నట్లు కూట‌మి ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేప‌థ్యంలో అప్పటి విచారాణాధికారి సిసోడియా వ్యవహారశైలి మరోసారి చర్చకు వచ్చింది. ఏబీవీపై విచారణకు జగన్ సర్కారు సిసోడియాను విచారణాధికారిగా నియమించింది. ఆ సంద‌ర్భంలో సిసోడియా ఏబీపై అడ్డగోలుగా నివేదిక ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాతనే సిసోడియాను గవర్నర్ కార్యదర్శిగా నియమించారని తెలుగుదేశం వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే, ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇప్పించిన కారణంగానే సిసోడియాను తప్పించారే తప్ప ఆయనేమీ జగన్ బాధితుడు కాదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు అదే సిసోడియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నారని, ఆయనకే సీఎస్ పదవి దక్కుతుందన్న ప్రచారంపై  సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. తాజాగా ప్రభుత్వం ఏబీవీపై అన్ని కేసులు ఉపసంహరించుకున్న ఉత్తర్వు పరిశీలిస్తే సిసోడియా నివేదిక డొల్లతనం ఏమిటో స్పష్టమవుతోందని ఐపీఎస్ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. అలాంటి నివేదికలిచ్చిన సిసోడియాను సీఎస్‌గా నియమించి చంద్రబాబు ప్రభుత్వం అప్రతిష్ఠ ఎందుకు కొనితెచ్చుకుంటుందన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 

ఏపీకి టాలీవుడ్ తరలింపు సాధ్యమేనా?

తెలంగాణ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి తరలనుందన్న చర్చ మరో సారి మొదలైంది. రాష్ట్ర విభజనకు ముందే ఈ చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ హీరోలను టార్గెట్ చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. దీంతో అప్పటి నుంచే రాష్ట్రం విడిపోతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడం ఖాయమన్న చర్చ అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. రాష్ట్ర విభజన జరిగి బీఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలో ఇండస్ట్రీ ఇక ఏపీకి తరలిపోవడం లాంఛనమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది కూడా. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారంలోకి వచ్చే వరకూ తెలుగుహీరోలను, ఆంధ్రామూలాలున్న సీని వ్యక్తులను టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఆ తరువాత వైఖరి మార్చుకుంది. రాష్ట్ర ఆదాయంలో మద్యం తరువాతి స్థానం సినీ ఇండస్ట్రీదే కావడంతో బీఆర్ఎస్ సర్కార్ తెలుగు సినీ పరిశ్రమను చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఉద్యమ సమయంలో తరిమి కొడతాం అంటూ హెచ్చరికలు జారీ చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సినీ పరిశ్రమను ఇతోధికంగా ప్రోత్సహించి, అక్కున చేర్చుకుంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమ తెలంగాణలో హాయిగా కొనసాగింది.  అయినా ఇలా ఒక సమస్య వచ్చిందని పరిశ్రమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించేయడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. హైదరాబాద్ లో దశాబ్దాల పాటు పాతుకుపోయిన టాలీవుడ్ పరిశ్రమ తనకు అవసరమైన మౌలిక వసుతలన్నీ ఇక్కడ అభివృద్ధి చేసుకుంది. పరిశ్రమ అంటే ఒక్క సినిమా  షూటింగ్ మాత్రమే కాదు. స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు, ఆర్టిస్టుల నివాసాలు ఇలా ఎన్నోఎన్నెన్నో ముడిపడి ఉన్నాయి.  ఇప్పుడు ఒక్క హీరోకు కష్టం వచ్చిందని పరిశ్రమ తరలిపోబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మడం కష్టం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఏపీకి టాలివుడ్ తరలిపోబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  పరిశ్రమ మనుగడకు అవసరమైన సకల మౌలిక సదుపాయాలూ హైదరాబాద్ లో అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో పరిశ్రమ విస్తరణకు అవకాశాలు ఉంటే ఉండొచ్చు.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమ అక్కడా విస్తరించేందుకు ఆస్కారం ఉంది కానీ.. ఇక్కడ నుంచి తట్టాబుట్టా సర్దేసుకునే మొత్తం ఇండస్ట్రీ, హీరోలు, నిర్మాతలూ తట్టాబుట్టా సర్దేసుకుని ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అవకాశాలు ఇసుమంతైనా లేవని గట్టిగా చెప్పవచ్చు.   ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాల్సి ఉంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద మంత్రదండం ఏమీ లేదు. రాత్రికి రాత్రి టాలీవుడ్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి.   అల్లు అర్జున్ ఎపిసోడ్ తో టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఏపీ ప్రభుత్వం వైపు చూడటం సహజమే. అయితే ఆ ఆపన్నహస్తం అందించేందుకు ఏపీ సర్కార్ ముందుకు వస్తుందన్న నమ్మకం లేదు. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండాలనే ఏపీ సర్కార్ భావిస్తుంది.  కనుక ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా తెలంగాణ ప్రభుత్వంతో  ఘర్షణ వైఖరికి ఇష్టపడరు. అందుకే తెలంగాణలో స్ధిరపడిన తెలుగు సినీ పరిశ్రమ కోసం వారు కనీసం మాట సాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవచ్చు.  ఏపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ ఉన్నారు. సినీ ప్రముఖులలో పలువురికి వారితో, సిఎం చంద్రబాబు నాయుడుతో  సత్సంబంధాలున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకూలంగానే ఉంటారు. పైగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న ఈ సమయంలో టాలీవుడ్‌ కదిలి రావడానికి ఇదే సరైన సమయమని పలువురు భావిస్తున్నారు.  ఇక సినిమాల కలెక్షన్ల పరంగా చూస్తే తెలంగాణ కంటే ఏపీ నుంచే సీనీమాలకు ఆదరణ ఎక్కువ. అలాగే కలెక్షన్లూ అధికం.  సినిమా స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడానికి, షూటింగ్‌లు చేసుకోవడానికి ఏపీలో అన్ని హంగులూ ఉన్నాయి. కొత్తగా మరో మూడు విమానాశ్రయాలు వస్తున్నాయి. కనుక అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం గొడవ దీర్ఘ కాలం కొనసాగితే మాత్రం ఏపీకి పరిశ్రమ తరలిరావడానికే సీనీ ప్రముఖులు మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. అయినా సీనిమా సీజన్ గా చెప్పుకునే సంక్రాంతి నాటికి కూడా అల్లు అర్జున్ వివాదం సర్దుమణగకపోతే.. సినిమాల బెనిఫిట్ షోలు, ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించకుంటే.. అప్పుడు టాలీవుడ్ కచ్చితంగా ఏపీ వైపు చూస్తుందనడంలో సందేహం లేదు. 

జగన్ ప్రగతికి ప్రతిబంధకం!

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాన్ని విస్తృతంగా ఉపయోగించారు. అలాగే చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ఇద్దరూ జగన్  సమాజానికి చీడపురుగుగా అభివర్ణించారు. జగన్ ను మరో సారి అధికారంలోనికి రానీయకూడదని పదే పదే ప్రజలకు పిలుపు నిచ్చారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారానికి దూరమైంది. అయితే అధికారం కోల్పోయిన తరువాత జగన్, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శలు అక్షర సత్యాలని నిరూపించే విధంగానే ఉన్నాయి.  జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా పోయింది. పరిశ్రమలు రావడం మాట అటుంచి ఉన్న పరిశ్రీమలు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం పనులు నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్ అంటూ  వేగంగా జరుగుతున్న పోలవరం పనులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక అమరావతిని నిర్వీర్యం చేశారు. భవనాలను పాడుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత అమరావతి, పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. దాదాపు ఐదేళ్ల ప్రతిష్ఠంభన తరువాత అమరావతి నిర్మాణం తిరిగి మొదలైంది. అమరావతి కోసం ఆసియా అభివృద్ధి బోర్డు, ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేశాయి. దీంతో సీఆర్డీయే అమరావతి పనుల కోసం టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సంక్రాంతి నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది.  సరిగ్గా ఇదే సమయంలో జగన్, వైసీపీయులు చేస్తున్న దుష్ప్రచారం, విమర్శలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకులకు రాసిన లేఖలు, పంపిన ఈ మెయిల్స్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరుల విమర్శలు అక్షర సత్యాలు అన్న విషయాన్ని రుజువు చేసేవిగా ఉన్నాయి.   రాజధాని అమరావతికి నిధులు ఇవ్వవద్దంటూ ప్రపంచ బ్యాంకుకు ఈమెయిల్స్ వైసీపీయులు ఈమెయిల్స్ పంపారు.   ఆహార భద్రత, పేదల స్థానభ్రంశం, వరద ముంపు వంటి కారణాలు చూపుతూ అమరావతి పురోగతిని అడ్డుకోవడానికి శతధా ప్రయత్నిస్తూ లేఖలు రాయడం, ఈమెయిల్స్ పంపడం ద్వారా రాష్ట్ర ప్రగతికి తాము ప్రతిబంధకమని చాటుకుంటున్నారు.  వైసీపీ ప్రతిపక్షంగా ఉన్న 2014 - 2019 మధ్య కాలంలో కూడా ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వ్యవహార శైలి ఇలాగే ఉంది. అమరావతి పురోగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పుడూ, ఆ తరువాత అధికారంలో ఉన్న సమయంలోనూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా ప్రయత్నిస్తున్నారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా మూడు రాజధానులంటూ తగ్లక్ విధానాలతో అమరావతిని నిర్వీర్యం చేశారు. అమరావతికి పోటీగా విశాఖ రాజధాని అంటూ అర్భాటం చేసినా, ఆ దిశగా ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు సరికదా  రుషికొండకు గుండు కొట్టి పర్యావరణ వినాశనానికి పాల్పడ్డారు. సొంతానికి విలాస భవంతిని నిర్మించుకోవడంపైనే శ్రద్ధ పెట్టారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు.. స్వప్రయోజనం కోసమే జగన్ తన ఐదేళ్ల అధికారాన్ని వాడుకున్నారు. అభివృద్ధికి తాను, తన పార్టీ పూర్తి వ్యతిరేకమని అధికారంలో ఉండానూ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాతా చాటుకుంటున్నారు.  

జమిలీ.. ఎన్నికల సంస్కరణల దిశగా తొలి మజిలీ?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  జమిలి ఎన్నికలపై చర్చ జరుుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి జేపీసీకి పంపింది.  ఈ జమిలీ ఎన్నికల బిల్లును  బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప జేసుకోగలదా అన్న సంశయం బీజేపీ నేతలతో సహా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలంటే సభలో మూడింట రెండోంతుల మంది మద్దతు అవసరం. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు సభలో ఆ బలం లేదు. అయితే ప్రధాని మోడీ ఏ ధైర్యంతో ముందుకు వెడుతున్నారన్న సందేహం బీజేపీయేతర పార్టీలలో బలంగా వ్యక్తం అవుతోంది.  పార్లమెంటు ఉభయ సభల్లో జమిలి ఎన్నికలకు మద్దతు ఎలా సాధించగలదన్న  అనుమానం పార్టీ కేడర్ లో,ఇతర పార్టీల్లో,ప్రజలలో వ్యక్తం అవుతోంది.  మోదీ ధైర్యం ఏమిటనేది అర్ధం కావడం లేదు.  అది అలా ఉంచితే.. జమిలీతో పాటు పలు ఎన్నికల సంస్కరణలను మేధావులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బిల్లు సభలో ప్రవేశపెట్టడానికి కావలసిన సాధారణ మేజార్టీ వచ్చింది. డిసెంబరు 12 రెండు బిల్లులను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 17నన్యాయశాఖ మంత్రి పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సమర్పించారు. ఆ జేపీసీని  21మంది లోక్ సభ సభ్యులు, 10మంది రాజ్యసభ సభ్యులతో నియమించారు.  ఈ జేపీసీ తన నివేదికను సమర్పించడానికి 90 రోజుల గడువు విధించారు.  అవసరమైతే పొడిగిస్తారు. ఈ జేపీసీ ప్రధాన బాధ్యత  ప్రజాభిప్రాయ సేకరణ. అందరి అభిప్రాయాలను సేకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎలాంటి నిర్ణయాధికారం లేదు.  కేవలం అభిప్రాయాలను తెలపడానికే ఇది పరిమితం. అన్నిటికీ మించి జమిలి  బిల్లు చట్టం కావాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది.  రాజ్యాంగ సవరణ చేయాలంటే  పార్లమెంటు లో 2|3మేజార్టీ అనివార్యం. లోక్ సభలో 362, రాజ్యసభ లో 164 మంది జమిలికి అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఎన్డీఏకు లోక్ సభలో 293, రాజ్యసభ లో 125 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఏదో విధంగా ఆ మద్దతు కూడగట్టినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కర్ జమిలి ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా  2034 వరకూ ఆగాల్సిందే.  కాగా భారత్లో స్వాతంత్ర్యం అనంతరం తొలి నాలుగు సార్వత్రిక ఎన్నికలు జమిలి ఎన్నికలో. అంటే జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదు.    1960 దశకం తరువాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా తరచూ ఎన్నికలు వస్తున్నాయి. ఇదొక రాజకీయ అనివార్యంగా మారిపోయింది. దీంతో .దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉన్న పరిస్థితి ఎర్పడింది.  అయితే ఇప్పుడు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తానేదో కొత్తగా కనిపెట్టినట్లుగా జమిలి ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. కానీ బీజేపీ జమిలి నినాదంపై దేశ వ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జమిలి పద్ధతిలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భారీగా వ్యయం తగ్గుతుంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పథకాల అమలుకు అవరోధాలు చాలా వరకూ తగ్గిపోయాయి.  అలాగే జమిలి వల్ల ఖర్చు తగ్గి జీడీపీ 1.5 శాతం పెరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల దేశంఆర్ధికంగా దేశం బలపడుతుందని నమ్మబలుకుతోంది.   ఇక జమిలి వల్ల రాష్ట్రాలలో,కాని కేంద్రంలో గాని మేజార్టీ లేక ప్రభుత్వాలు పడిపోతే మళ్లీ ఎన్నికలు జరుగుతాయి, అయితే అలా మధ్యంతరంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పదవీ కాలం తరిగిపోతుంది.  జమిలి పద్ధతిలో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలతో పాటు మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.  ఇక జమిలీ జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు.ఎవరైనా మరణిస్తే ఉప ఎన్నికలు ఎలా జరిపిస్తారనేదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. జమిలీ ప్రతిపాదన ఎన్నికల సంస్కరణలకు తొలి మజిలీగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమిలి పద్ధతి అమలులోకి వస్తే ఒక అభ్యర్థి ఒక స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలన్న నిబధనను అనివార్యంగా విధించాల్సి ఉంటుంది.  అలా కాకుండా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధిస్తు.. ఆ అభ్యర్థి రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానానికి జరిగే ఉప ఎన్నిక వ్యయాన్ని ఆ అభ్యర్థే భరించేలా నిబంధన తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నారు.   అదే సమయంలో నేరచరితులను ఎన్నికలకు దూరంగా ఉంచే విధంగా కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.  కోర్టుల్లోకేసులు తీర్పులు వచ్చేవరకూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్న విషయంపై కూడా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.   జమిలీ ఎన్నికల అధ్యయనం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ జమిలితో పాటు ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలని చేసిన సిఫారసును కేంద్రం పరిగణనలోనికి తీసుకోవాలి.   అన్నిటికంటే అతి ముఖ్యమైనది కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంపై కేంద్రం నియంత్రణ పెచ్చరిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. వాటిని పూర్వపక్షం చేస్తూ ఎన్నికల సంఘానికి పూర్తి స్వయంప్రతిపత్తి ఉండేలా చర్యలు తీసుకుంటే మాత్రమే జమిలి ఎన్నికలకు సార్థకత ఉంటుంది. 

బీజేపీ-సంఘ్ పరివార్ మధ్య అగాధం.. మోహన్ భగవత్ శాంతి మంత్రం సంకేతమదేనా?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా సంఘ్ పరివార్, బీజేపీ మధ్య అగాధం ఇంకా పూడలేదన్న సంకేతాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. తాజాగా మోహన్ భగవత్ మసీదు, మందిరం వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రవచించడం  బీజేపీ,సంఘ్ పరివార్ మధ్య సంబంధాలు ఇంకా బలపడలేదనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ముందు సంఘ్ పరివార్, బీజేపీ అగ్రనాయకత్వం మధ్య అగాధం ఉదన్న విషయం ప్రస్ఫుటమైంది. బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు అప్పట్లో పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు వారి మధ్య సామరస్యం లేదని విస్పష్టంగా తేల్చేశాయి. ఇక తాజాగా   మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా సంఘ్ పరివార్, బీజేపీ నేతలు పరస్పర అవగాహనతో, సామరస్యంగా కలిసి పని చేశారన్న భావన కలిగింది.  అయితే అదేమీ వాస్తవం కాదని అకస్మాత్తుగా భగవత్ చేసిన మసీదు, మందిరం వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ చేసిన శాంతి ప్రకటన బీజేపీ అగ్రనాయకత్వం విధానాల పట్ల సంఘ్ పరివార్ అసంతృప్తితో ఉందన్న భావన కలిగించేలా ఉంది.  బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మైనార్టీలపై తమ వ్యాఖ్యల ద్వారా విషం చిమ్ముతున్నారని, ఫలితంగా దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారనీ మోహన్ భగవత్  తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా హెచ్చరించినట్లయింది. భారత దేశమంటేనే పరమతసహనం. అదే కొనసాగాలి. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం. అన్ని మతాల వారు ఎన్నో వందల సంవత్సరాలుగా కలసి మెలసి బతుకుతున్నారు. మసీదు, మందిరం వివాదాలు ఇకపై కొనసాగనివ్వరాదు అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ ఆరంభమైంది. శ్రీరాముడు హిందువుల ఆరాధ్యుడు. రామమందిర నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కనుక మందిర నిర్మాణం వారి నమ్మడానికి ప్రతీక అన్నారు. అలాగని ప్రతిచోటా కొత్త వివాదాలు రెకెత్తించడం సబబుకాదని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు. ప్రతి మతానికి నమ్మకాలు,  దైవం.సంస్కృతి ఉంటాయని వాటిని గౌరవించి తీరాల్సిందేననీ మోహన్ భగవత్ చెప్పారు.  దేశంలోని ప్రతిపౌరునికీ తమకు నచ్చిన దైవాన్ని ఆరాధించే హక్కు ఉందన్నారు.  మహారాష్ట్ర లోని విశ్వగురు భారత్, ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ మసీదు, రాజస్తాన్ లోని అజ్మేర్ షరీఫ్ దర్గా ల వివాదాలు ప్రస్తావించి వాటి వివాదంలోకి లాగడాన్ని  తప్పుపట్టారు. ఇకపై కొత్త వివాదాలకు అవకాశాలు ఇవ్వరాదని బీజేపీకి హితవు చెప్పారు.  దేశంలో అందరూ కలసిమెలసి జీవిస్తున్నారని,అలాగే శాంతియుతంగా జీవించడమే అసలైన గుర్తింపు అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని మెలగాలని సూచించారు. జరిగిన తప్పులు మరలా జరగకుండా తగిన జాగర్తలు తీసుకుని సర్దుకుపోవడం వల్ల ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర మతాల దైవాలను అవమానించడం మన సంస్కృతి కాదన్నారు. ఏ దేశంలో నైనా మెజార్టీలూ,మైనార్టీలు ఉంటారని,   వారి మధ్య విభేదాలు రాకూడదన్నారు.  ప్రపంచ శాంతి కోసం భారత్ ప్రకటనలు,మధ్యవర్తిత్వం జరుగుతున్నా యుద్ధాలు ఆగడం లేదు.భారత్ లో మైనార్టీల అణచివేత జరుగుతోందన్న ప్రచారం ఉందనడం ద్వారా మోహన్ భగవత్ బీజేపీకి ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు.  ఇకపై మసీదు శిధిలాల్లో మందిరం  అనే వివాదాలను తెచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని సూచించారు. సంఘ్ పరివార్, బీజేపీ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా సరిలేవని,అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మేజార్టీ రాలేదన్న వాదనకు బలం చేకూర్చేవిగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదిఏమైనా భగవత్  చెప్పిన విషయం అక్షర సత్యమనడంలో సందేహం లేదు. దేశంలో పరమత సహనంతో అందరూ కలసిమెలసి బ్రతకాలన్న ఆయన సూచన శిరోధార్యం.  హిందూత్వ అతివాదులు ఆయన వ్యాఖ్యలను ఔదాల్చి వివాదాలకు స్వస్థి పలికితే భారత్   ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

అల్లు వారి దూకుడు.. షేక్ అవుతున్న టాలీవుడ్‌!

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న చినికిచినికి గాలివాన‌లా మారి పెనుదుమారాన్ని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర‌ రాజ‌కీయాల‌తోపాటు టాలీవుడ్‌నూ షేక్ చేస్తుంది. ప్ర‌భుత్వం వ‌ర్సెస్ అల్లు అర్జున్ గా ఈ వ్య‌వ‌హారం మారింది. ప‌నిలో ప‌నిగా అర్జున్ లీగ‌ల్ టీం పోలీసుల‌ను సైతం రెచ్చ‌గొట్ట‌డంతో ఇంకాస్త ముదిరింది. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన ముద్దాయిగా అల్లు అర్జున్ ను ప్ర‌భుత్వం, పోలీస్ యంత్రాంగం ప్రొజెక్ట్ చేస్తుండ‌గా.. త‌న త‌ప్పేమీ లేదంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ వివాదం పెను దుమారంగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం అల్లు అర్జున్ వ్య‌వ‌హార‌శైలి అన్న చ‌ర్చ మొదలైంది. థియేట‌ర్ వ‌ద్ద ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో అర్జున్ వ్య‌వ‌హార శైలి, కోర్టులో బెయిల్ కోసం వాద‌న‌లు జ‌రిగే స‌మ‌యంలో పోలీసుల‌ను కించ‌ప‌ర్చేలా ఆయ‌న లీగ‌ల్ టీం చేసిన వ్యాఖ్య‌లు వివాదాన్ని పెంచేశాయి. దీనికితోడు.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌పై హ‌డావుడిగా మీడియా స‌మావేశం పెట్టి అల్లు కుటుంబం ప్ర‌భుత్వాన్ని రెచ్చ‌గొట్టింద‌న్న వాద‌న ఉంది. భారీగా టికెట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇస్తే.. మాపైనే విమ‌ర్శ‌లు చేస్తారా అంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు క‌న్నెర్రజేశారు.  ఫ‌లితంగా అల్లు వారి దూకుడు టాలీవుడ్ కు పెనుశాపంగా మారింద‌ని ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సంధర్బంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ పై బయటకు రావ‌డం 24గంట‌ల్లో జ‌రిగిపోయాయి. దీంతో, ఈ విష‌యం స‌ర్దుమ‌ణిగింద‌ని అంద‌రూ భావించారు. కానీ, సోష‌ల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోపాటు.. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప‌నిలో ప‌నిగా పోలీసుల‌పైనా సోష‌ల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ విమ‌ర్శ‌లు చేశారు. దీంతో త‌ప్పంతా సీఎం రేవంత్ రెడ్డి, పోలీసుల‌ది అన్న‌ట్లుగా వ్య‌వ‌హారం మారింది. ఇంత‌ జ‌రిగితే ప్ర‌భుత్వం ఊరుకుంటుందా.. అవ‌కాశం కోసం ఎదురు చూసింది. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ అల్లు అర్జున్ వ్య‌వ‌హారాన్ని లేవ‌నెత్తాడు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స‌మాధానం ఇస్తూ అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ప‌నిలో ప‌నిగా సినిమా వాళ్ల‌కు ప్ర‌త్యేక చ‌ట్టం ఏమైనా ఉందా అంటూనే.. ఎవ్వ‌రినైనా త‌ప్పుచేస్తే వ‌దిలిపెట్టేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవతి మృతికి, శ్రీ‌తేజ్ ఆస్ప‌త్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం అల్లు అర్జున్ అని, ఆయ‌న వ్య‌వ‌హార శైలి వ‌ల్ల‌నే ఇదంతా జ‌రిగింద‌ని నేరుగా అల్లు అర్జున్ ను టార్టెట్ చేశారు. మ‌రోవైపు అల్లు అర్జున్ సైతం త‌గ్గేదే లే అంటూటూ రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది గంట‌ల‌కే మీడియా స‌మావేశం పెట్టాడు. త‌నపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. సీఎం రేవంత్ పేరు ప్ర‌స్తావించకుండానే ఆయ‌న్ను టార్గెట్ చేశాడు . అల్లు అర్జున్ దూకుడుకుతోడు.. ఆయ‌న లీగ‌ల్ టీంసైతం అదుపు త‌ప్పి వ్యాఖ్యలు చేయడంతో వివాదం మ‌రింత ముదిరింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు వినిపించేటప్పుడు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి పోలీసులపై వేసిన వంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు హ‌ర్ట్ అయ్యారు. అంతే కాదు.. తనను వెళ్లిపోవాలని ఏ పోలీసు అధికారి చెప్పలేదని.. పైగాతాను వ‌స్తుంటే వాళ్లే రూట్ క్లియర్ చేశారని అల్లు అర్జున్ మీడియా స‌మావేశంలో చెప్పాడు. అల్లు వ్య‌వ‌హార‌శైలి, ఆయ‌న లీగ‌ల్ టీం వ్య‌వ‌హార‌శైలి పోలీస్ డిపార్టుమెంట్ కు ఆగ్రహాన్ని కలిగించింది. సస్పెన్షన్ లో ఉన్న ఏసీపీ కృష్ణమూర్తి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేం తల్చుకుంటే ఇక్కడ ఉండలేరని హెచ్చరించారు. పోలీస్ కమిషనరే మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి.. అర్జున్ చేసిన వ్యాఖ్యన్నీ తప్పు అని చెప్పేలా ఆధారాలు బయట పెట్టారు. నిజానికి అర్జున్ తన తప్పేం లేదని చెప్పుకోవడానికి కొన్ని ప్రివిలేజెస్ తీసుకున్నారు. తనకు అనుకూలంగా వాదనలు వినిపించుకున్నారు. తన ఇమేజ్ కు దెబ్బపడుతోందని బాధపడ్డారు. కానీ నీ ఇమేజ్ సంగతి సరే.. డిపార్టుమెంట్ ఇమేజ్ ను దెబ్బ‌తీస్తానంటే ఊరుకుంటామా అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడీ ఇష్యూలో.. అర్జున్ రాజకీయ నేతలతో పెట్టుకున్నదికాక.. పోలీసులతోనూ పెట్టుకున్నారు. తాత్కాలికంగా త‌న వాద‌న‌ల‌తో బెయిల్ ఇప్పించిన నిరంజన్ రెడ్డి భవిష్యత్ లో దిద్దుకోలేనంత నష్టం చేశారు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌నలో అల్లు అర్జున్ వ్య‌వ‌హార‌శైలి టాలీవుడ్ కు శాపంగా మారింది. టికెట్ రేట్లు భారీగా పెంచి, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌భుత్వంపై అల్లు వారి కుటుంబం క‌య్యానికి కాలుదువ్వింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా.. అన్నం పెట్టిన ఇంటికే క‌న్నం వేస్తారా అంటూ ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచ‌టాలు ఉండ‌వ‌ని తేల్చి చెప్పేశాడు. రాబోయేది పండుగ‌ల సీజ‌న్ కావ‌టంతో వ‌రుసగా రిలీజ్‌కు పెద్ద సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అల్లు అర్జున్ వ్య‌వ‌హార‌శైలితో ఇప్పుడు ఆ సినిమాల‌కు భారీ న‌ష్టం వాటిల్ల‌నుంది. ఈ వ్య‌వ‌హారంలో అల్లు అర్జున్ వెన‌క్కుత‌గ్గి ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు సారీ చెప్పేవ‌ర‌కు రేవంత్ ప్ర‌భుత్వం త‌గ్గేదేలే అంటుంది. ఇందులో ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్ట‌నికి కూడా ఏమీలేదు. ఎందుకంటే ప్ర‌భుత్వం ఇచ్చిన అవ‌కాశాన్ని అల్లు అర్జున్ త‌న యాటిట్యూడ్ తో దుర్వినియోగం చేసి టాలీవుడ్ మొత్తానికి పెద్ద త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాడు.

రామ్ గోపాల్ వర్మకు బిగ్‌ షాక్‌.. ఆ డ‌బ్బు చెల్లించ‌కుంటే జైలుకే!

వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాలు అన్నీఇన్నీకావు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత  వైసీపీ నేత‌ల అవినీతి భాగోతాలు గుట్టలు గుట్టలుగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప్రజ‌లు ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి చెల్లించిన సొమ్మును జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అప్ప‌నంగా తన అనుచ‌ర గ‌ణానికి, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బూతులు తిట్టిన వారికి జీతాల రూపంలో ఇచ్చేశారు. ఏపీ విజిలెన్స్ విభాగం ఫైబ‌ర్ నెట్‌, డిజిట‌ల్ కార్పొరేష‌న్, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ల‌లో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణలో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ డ‌బ్బు తీసుకొని వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీశార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌కు ఇచ్చిన డ‌బ్బు ఎవ‌రో నిర్మాత‌లు ఇచ్చింది కాదు,  ప్ర‌భుత్వం సొమ్మేన‌ని తేటతెల్లమైంది. అంతే కాదు.. డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా, ఫైబ‌ర్ నెట్ ద్వారా, స్కిల్ డ‌వ‌ల‌ప్ మెంట్ ద్వారా వైసీపీ కుటుంబ స‌భ్యుల‌కు, వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు భారీ మొత్తంలో జీతాలు చెల్లించేశారు. వీరంతా సోష‌ల్ మీడియా ద్వారా అప్పటి ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని, జ‌గ‌న్‌తో రాజ‌కీయంగా విభేదించిన ఆయ‌న‌ చెల్లిని, త‌ల్లిని విమ‌ర్శించ‌డంతోపాటు, అస‌భ్య‌  ప‌ద‌జాలంతో దూసించేవారు.   వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాంగోపాల్ వ‌ర్మ వ్యూహం, శ‌పథం అనే రెండు సినిమాల‌ను తీశారు. రాంగోపాల్ వ‌ర్మ ఈ సినిమాలు తీసే స‌మ‌యంలోనే.. ఈ సినిమాలు తీసేది చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను విమ‌ర్శించ‌డానికి.. వైఎస్ఆర్‌, వైఎస్‌ జ‌గ‌న్ రెడ్డిని పొగ‌డ‌టానికి అని బొమ్మ‌ల ద్వారా త‌న‌ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైసీపీ మేలు చేసేలా తీసిన వ్యూహం సినిమాను ఏపీ ఫైబ‌ర్ నెట్‌లో విడుద‌ల చేశారు. ఇందుకుగాను పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ ద్వారా రూ.2.10కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. రాంగోపాల్ వ‌ర్మ‌కు సంబంధించిన ఒక సంస్థ‌కు సుమారు 1.10 కోట్లు చెల్లించిన‌ట్లు ఏపీ విజిలెన్స్ విభాగం విచార‌ణ‌లో వెలుగులోకి వ‌చ్చింది. మ‌రో రూ.90ల‌క్ష‌లు పెండింగ్‌లో ఉండ‌గా..  పెండింగ్ సొమ్ము చెల్లించ‌వ‌ద్ద‌ని ఫైబ‌ర్ నెట్ కొత్త కార్య‌వ‌ర్గానికి విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసింది. అదేవిధంగా మ‌మ్ముట్టి  క‌థానాయ‌కుడిగా తీసిన యాత్ర‌-2 సినిమాకు కూడా రూ.2.10 కోట్లు ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ ద్వారా కేటాయించారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏపీ డిజిట‌ల్ కార్పొరేష‌న్ కు ఎండీగా వాసుదేవ రెడ్డి ఉన్నారు. వీరి ఆధ్వ‌ర్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు ప్ర‌భుత్వ సొమ్ముతో జీతాలు చెల్లించార‌ని తెలుస్తోంది. వీరంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి క‌టుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌  ప‌ద‌జాలంతో, మార్పింగ్ పొటోల‌తో పోస్టులు చేసేవారు. వీరిలో కొంద‌రు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.  తాజాగా  సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్ల రూపాయలు అనుచితంగా లబ్ది పొందారని పేర్కొంటూ రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు పంపింది ఏపీ స‌ర్కార్‌. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల లోపు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కట్టాలని ఆదేశించారు.  ఈ విష‌యంపై జీవీ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన 'వ్యూహం' సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించిందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్  ఉన్నాయని, ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని, దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది అని చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. పదిహేను రోజుల్లోపు తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇవ్వకపోతే కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజాధనానికి సంబంధించిన మ్యాటర్ కావడంతో ముందుగా డబ్బుల రికవరీకి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్జీవీకి ఈ మొత్తమే వచ్చాయా..ఇతర మార్గాల్లో ఏమైనా ప్రభుత్వం చెల్లించిందా అన్నది బయటకు రావాల్సి ఉంది.

ష‌ర్మిల‌కు చెక్‌పెట్టే ప‌నిలో జ‌గ‌న్‌.. జగన్ కు షాక్ ఇచ్చేందుకు రంగంలోకి రాహుల్!

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఏపీలో అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. కేంద్రం స‌హ‌కారంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. జ‌గ‌న్ వెంట ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన వైసీపీ కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోకి క్యూ క‌డుతున్నారు. మ‌రోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లోపేతంపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, త‌న చెల్లి ష‌ర్మిల‌ దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఆరంభించారు‌. ముఖ్యంగా ఆమెను ఏపీపీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ఢిల్లీలో  ఆయ‌నకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ఏపీ కాంగ్రెస్ లో ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కు వైసీపీ కండువా క‌ప్పి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి వైస్ ష‌ర్మిల కీల‌క భూమిక పోషించారు. అయితే, సీఎంగా జ‌గ‌న్‌ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ష‌ర్మిల‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఆస్తుల విష‌యంలోనూ వారిమ‌ధ్య వివాదాలు త‌లెత్తాయి. ఈ క్ర‌మంలో ష‌ర్మిల తెలంగాణ‌లో సొంత రాజ‌కీయ పార్టీ పెట్టుకున్నారు. కొద్దికాలానికే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ష‌ర్మిల‌..  ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఏపీ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు నుంచి జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ఆమె విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాల్లో వైఎస్ ష‌ర్మిల‌కూడా ఒక‌రు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఎన్నిక‌ల త‌రువాతా కూడా జ‌గ‌న్ రెడ్డి టార్గెట్ గా ష‌ర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇన్నాళ్లు ష‌ర్మిల విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. ఇప్పుడు ఆమె పేరు చెబితేనే భ‌య‌ప‌డుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి‌. దీంతో ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేలా   పావుల‌ను క‌దిపేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు కనిపిస్తోంది.  ఏపీ కాంగ్రెస్ లో ష‌ర్మిల నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను జ‌గ‌న్ వైసీపీలోకి ఆహ్వానించారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది‌. షర్మిల నాయకత్వంపై కొంత‌కాలంగా సీనియర్లు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఆమె తీరు, వ్యవహారశైలిపై పార్టీ అధినాయకత్వానికి   ఫిర్యాదులు రూడా చేశారు. షర్మిల పార్టీ బలోపేతం కంటే తన వ్యక్తిగత అంశాల కోసం పార్టీని వాడుకుంటున్నార‌ని, ఎన్డీఏ కూటమి కంటే జగన్ పైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర పార్టీ పెద్దల‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదే సరైన సమయంగా భావిస్తున్న జగన్ కేంద్ర పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న‌వారి ద్వారా ష‌ర్మిలను పీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ముఖ్య‌ అనుచ‌రులుగా కొన‌సాగిన నేత‌లు కొంద‌రు ఏపీ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు. వారంద‌రితో ఇటీవ‌ల‌ జ‌గ‌న్ ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు జ‌గ‌న్‌, వైసీపీ నేతలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ   చీఫ్ శైలజానాథ్ ఉన్నారు. శైలజానాధ్, జ‌గ‌న్ ఒక‌రికొక‌రు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొద్ది సేపు విడిగా ముచ్చటించుకున్నారు. ఈ క్ర‌మంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై  వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌జరిగిందని తెలుస్తోంది. అయితే, అంత‌కుముందే వైసీపీలో చేరే విష‌యంపై జ‌గ‌న్‌, శైలజానాథ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం ఉంది. వ‌చ్చే రెండు నెల‌ల్లో శైల‌జానాధ్ తోపాటు మ‌రో ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  మ‌రోవైపు  ఇప్ప‌టికే ఏపీ కాంగ్రెస్ బ‌లోపేతంపై దృష్టిపెట్టిన రాహుల్ గాంధీ.. తాజా ప‌రిణామాల‌పై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్య‌నేత‌ల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి‌. ఏపీలోని ఓ సీనియ‌ర్‌ నేత‌, తెలంగాణ‌కు చెందిన ఓ కీల‌క నేత ఏపీ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు రాహుల్‌కు నివేదిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  అధికారం కోల్పోయిన త‌రువాత వైసీపీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ‌గ‌న్‌కు ముఖ్య అనుచ‌రులుగా పేరున్న నేత‌లు సైతం వైసీపీని వీడి కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీలోని ముఖ్య‌నేత‌ల‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా రాహుల్ టీం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వారు ప‌లువురు వైసీపీ నేత‌లతో మంత‌నాలు జరిపినట్లు స‌మాచారం. ష‌ర్మిల నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు రాహుల్ టీంకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. వారంతా వ‌చ్చే రెండు నెల‌ల్లో కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నార‌ని, వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు పేర్కొంటున్నారు. మొత్తానికి ష‌ర్మిల‌కు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ రంగంలోకి దిగ‌గా.. వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి గ‌ట్టి షాకిచ్చేందుకు రాహుల్ టీం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలో ఎవ‌రిది పైచేయి అవుతుందో  చూడాలంటే మ‌రికొద్దిరోజులు ఆగాల్సిందే.

శ్రీతేజ్ ను పరామర్శించిన మంత్రి  కోమటి రెడ్డి 

సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి  అగ్రహం చేసిన కొద్దిసేపట్లో మంత్రి కోమటిరెడ్డి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్ డామేజ్ జరిగి ఆక్సిజన్ అందలేదు. దీంతో శ్రీతేజ్ స్పృహ కోల్పోయి  ప్రాణాపాయ స్థితిలో  కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు కారణమైన అల్లు అర్జున్ ఇంతవరకు పరామర్శించలేదు. కానీ మంత్రి కోమటి రెడ్డి శనివారం కిమ్స్ చేరుకుని బాధిత కుటుంబానికి 25 లక్షల చెక్కును అందజేశారు. బెనిఫిట్స్  పోలు తెలంగాణ వ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు  ప్రకటించారు. 

అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయింది: రేవంత్ రెడ్డి 

సినీ హీరో అల్లు అర్జున్ వల్లే సంధ్య థియేటర్ ఘటనలో  తల్లి రేవతి చనిపోయిందని, కొడుకు కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు రావొద్దని పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. థియేటర్ కు ఎంట్రీ, ఎగ్జిట్ దారి ఒకటే ఉండటంతో తొక్కిసలా జరిగి రేవతి చనిపోయిందన్నారు. కొడుకు ను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రిలో చేర్చితే అల్లు అర్జున్ మాత్రం సినిమా చూడటానికి  హాల్ లో కూర్చున్నాడని అన్నారు.   రేవతి చావు వార్తను ఎసిపి వెళ్లి అల్లు అర్జున్ కు తెలియజేసి  వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు  డిసిపి అల్లు అర్జున్ కు  అరెస్ట్ చేస్తామని చెబితే కూడా ఓపెన్ టాప్ జీప్ లో అల్లు అర్జున్ వెళ్లిపోయాడని రేవంత్ మండి పడ్డారు. హీరో  కన్ను పోయిందా? కాలు పోయిందా? సినీ ప్రముఖులు వెళ్లి ఎందుకు పరామర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.