ఏసీబీ ఈడీ నోటీసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా చిక్కుల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆయనను దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా ఏసీబీ శుక్రవారం (జనవరి 3)న నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి.. ఈ నెల 7న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.  ఇదే ఇప్పుడు కేటీఆర్ ఈ కేసులో నిండా మునిగారా అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఒకే కేసులో రెండు దర్యాప్తు సంస్థలూ కేటీఆర్ ను విచారించడం, అది వరుసగా 6, 7 తేదీలలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం  కేటీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నదని చెప్పవచ్చు. ఒక్క రోజు తేడాలో ఆయన ఏసీబీ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్గాలలో ఆందోళనకు కారణమైంది.   ఫార్ములా కార్ కేసులో  అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి మీదా ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది. ఆ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ రంగంలోనికి దిగి ఆ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. ముందుగా కేసు నమోదు చేసినది ఏసీబీయే అయినా, ఆ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోనికి దిగిన ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది.  2వ తేదీన విచారణకు హాజరుకావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన హాజరవ్వాల్సిన అర్వింద్ హాజరుకాలేదు. వారిరువురూ మూడు వారాల గడువు కోరితే.. ఈడీ మాత్రం వారికి రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చింది. బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ లను వ రుసగా 8,9 తేదీలలో విచారణకు రావాల్సిందిగా మరో మారు నోటీసులు ఇచ్చింది. వారిరువురి కంటే ముందుగా ఈడీ కేటీఆర్ ను విచారించేందుకు రెడీ అయ్యింది. కేటీఆర్ ను ఈడీ ఈ నెల 7నే విచారించనుంది.చ అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ వరుసగా ఒకరి తరువాత ఒకరిని విచారించడానికి ఈడీ నోటీసులు జారీ చేసిందన్నమాట. అయితే ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వైపు ఈడీ విచారణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుండగానే.. హఠాత్తుగా ఏసీబీ కూడా దూకుడు పెంచింది. శుక్రవారం (జనవరి 3)న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి మూడు రోజుల వ్యవధి ఇచ్చి జనవరి 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అంటే నోటీసుల మేరకు కేటీఆర్ 6న ఏసీబీ ఎదుట, 7న ఈడవీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.   ఫార్ములా ఈ కార్ రేసులో  కేటీఆర్ అవినీతికి ఆధారాలున్నాయని ప్రాథమిక విచారణలో నిర్థారించుకున్న ఏసీబీ దూకుడుగా సాగుతోంది. అరెస్టు కాకుండా కేటీఆర్ కు కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, విచారణలతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ఏసీబీ ముందుకు సాగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జేసీ వ్యవహారంలో బీజేపీ నేత‌లు హ‌ద్దు మీరారా?..

ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తున్నది. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ హ‌యాంలో క‌నీస స‌దుపాయాలు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా ఇటీవలి  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌కుండా కేవ‌లం ప‌ద‌కొండు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ఆ పార్టీని ప‌రిమితం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఆర్నెళ్లు అవుతోంది. చంద్ర‌బాబు సార‌థ్యంలో అన్నిరంగాల్లో ఏపీ వ్యాప్తంగా అభివృద్ధి ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. బీజేపీ, జ‌న‌సేన పార్టీల నేత‌ల‌ను క‌లుపుకొనిపోతూ కూట‌మిలో ఎలాంటి విబేధాలూ త‌లెత్త‌కుండా చంద్ర‌బాబు పాల‌న సాగిస్తున్నారు. అయితే, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీరు వివాదాస్ప‌దం అవుతోంది. గ‌త మూడు రోజులుగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి,  బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారస్థాయిలో కొన‌సాగుతోంది. త‌న బ‌స్సును త‌గ‌ల‌బెట్టింది బీజేపీ నేత‌లే అంటూ జేసీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. బీజేపీ మ‌హిళా నేత, సినీన‌టి మాధ‌వీల‌తపై జేసీ ప్రభాకరరెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో బీజేపీ నేత‌లుకూడా జేసీపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి. నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల సంద‌ర్భంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేవ‌లం మ‌హిళ‌లే పాల్గొనాల‌ని రూల్ పెట్టారు. అయితే, బీజేపీ మ‌హిళా నేత   జేసీ పార్కులో నిర్వ‌హించే న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై అభ్యంత‌రం తెలిపారు. కేవ‌లం మ‌హిళ‌ల‌కే న్యూఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌కు ఏదైనా అయితే ఎవ‌రిది బాధ్య‌త అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో మ‌రో బీజేపీ మ‌హిళానేత, సినీ న‌టి మాధ‌వీ ల‌త జేసీ పార్కులో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఆ ప్రాంతంలో గంజాయి తీసుకునేవారు ఎక్కువ‌గా ఉంటారు. అలాంటి సెన్సిటివ్ ప్రాంతంలో కేవ‌లం మ‌హిళ‌ల‌కే పార్టీని ఏర్పాటు చేయ‌డం ఏమిటి..? మ‌హిళ‌ల‌కు ఏమైనా అయితే బాధ్య‌త ఎవ‌రిది..? అంటూ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరు ప్ర‌స్తావించ‌కుండానే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.  ఇలా వివాదం సాగుతుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందో ఏమో కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ మ‌హిళా నేత మాధ‌వీల‌త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌ల‌పైనా ఓ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు. ఇక తన బస్సులను పథకం ప్రకారం దగ్ధం చేసినా.. షార్ట్ సర్క్యూట్ అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి తన బస్సులకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో రూ.450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని.. ఇప్పుడు రెండు బస్సులకు నిప్పంటిస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. వీళ్ల కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే ఆపారని.. బీజేపీ  మాత్రం తన బస్సులను తగులబెట్టించారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జేసీ వ్యాఖ్య‌లపై బీజేపీ నేత‌లు సైతం ఫైర‌య్యారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చొనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరన్నారు. జేసీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలు సరికాదని... ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీపై జేసీ అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని జేసీకి హితవు పలికారు. జేసీ కుటుంబం న్యూఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హిస్తే బీజేపీ నేత‌ల‌కు ఇబ్బంది ఏమిట‌న్న ప్ర‌శ్న జేసీ వ‌ర్గీయుల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. కేవ‌లం కూట‌మి నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించేందుకే బీజేపీ మ‌హిళా నేత‌లు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని, అస‌లు బీజేపీ పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌కుండా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న నేత‌ల‌పై ఎలా విమ‌ర్శ‌లు చేస్తారంటూ జేసీ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది. ఈ విష‌యాన్ని తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామ‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్గీయులు అంటున్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లుసైతం  త‌గ్గేదేలే అంటున్నారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి బీజేపీ మ‌హిళా నేత‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తామ‌ని చెబుతున్నారు. అటు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఇటు బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న నేప‌థ్యంలో కూట‌మి పెద్ద‌గాఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తార‌నే అంశం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

బుద్ధవనం శిల్పాలు ఆకట్టుకున్నాయి

విదేశీ బౌద్ధ పరిశోధకులు బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు తమనేంతో ఆకట్టుకున్నాయి అని విదేశీ బౌద్ధ పరిశోధకులు ప్రొఫెసర్  సారా కెన్డర్ లైన్, ప్రొఫెసర్ జాఫ్రిషా అన్నారు. బౌద్ధ  ప్రదర్శనశాలల నిపుణులైన న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్  సారా ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా  ఇంకా హాంకాంగ్ నుంచి వచ్చిన మరో ఇద్దరు బౌద్ధ పరిశోధకులు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించినట్టు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు.  ఆయన, బుద్ధ వనంలోని వివిధ విభాగాలు, మహాస్తూపం  చుట్టూ ఉన్న శిలా శిల్పాలను వారికి చూపించి, వాటి విశిష్ఠతను వివరించారు.  ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు దమ్మచారి శాసన, డా. రవి చంద్ర, డి. ఆర్. శ్యాంసుందర్ రావు, సిబ్బంది విష్ణు పాల్గొన్నారు.

అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు 

సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ  నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.   పుష్ప 2 బెనిఫిట్  షో చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో చిక్కడపల్లి పోలీసులు అతనిపై బిఎన్ఎస్ 105 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు  14 రోజులు రిమాండ్ విధించింది.  ఒక రోజు జైలులో ఉన్న అతను మరుసటి రోజు ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అడ్వకేట్లు వాదనలు వినిపించడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే  అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కౌంటర్ దాఖలు చేసారు.  ఈ కేసులో వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ  శుక్రవారం తీర్పు ఇచ్చింది. 

గడగడలాడిస్తున్న హ్యుమన్ మెటానియా వైరస్.. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ

కరోనాకు పుట్టిల్లైన చైనాలో ఇప్పుడు అంత కంటే ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనాలాగే ఇది మనుషుల నుంచి మనుషులకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని వ్యాప్తి కరోనా వ్యాప్తి వేగంకంటే రెండింతలు ఎక్కువ. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కల్లోలం నుంచి కోలుకుని ప్రపంచం గాడిన పడుతోంది. అంతలోనే అంతకంటే భయంకరమైన వైరస్ చైనాలో వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచం గడగడలాడిపోతోంది.  ఈ కొత్త వైరస్ పేరు హ్యుమన్ మెటానియా వైరస్(హెచ్ఎమ్ వీవీ). దీని లక్షణాలు కూడా అచ్చం కరోనా లక్షణాల్లాగానే ఉంటాయి. అయితే కరోనా కంటే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, జలుబు, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో  ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. కరోనా కంటే ఎక్కువ ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు.   ఈ వైరస్ కు ప్రస్తుతం ఎలాంటి చికిత్సా లేదు. లక్షణాలను బట్టే చికిత్స అందిస్తున్నారు. చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఆస్పత్రి పాలయ్యారు.  దీంతో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కరోనా నాటి పరిస్థితుల్లో విధించినట్లే లాక్ డౌన్ విధించే యోచన కూడా చైనా ప్రభుత్వం చేస్తున్నది.  

ఇంటర్ విద్యార్థులకు డోక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకం.. అమలుకు సర్వం సిద్ధం

జగన్ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్య పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే  మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలి తాల మెరుగునకు పలు చర్యలు చేపట్టారు.  రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం నుంచి అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 398 సమీపంలోని పాఠశాలలు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు.  మిగిలిన 77 కళాశాలలను   వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు.  ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ కంకణం కట్టుకున్నారు.   ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎపి మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూలు ప్లస్ స్కూళ్లలో విద్యనభసిస్తున్న 2లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులను  ఉచితంగా పంపిణీ చేసింది. బోధనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్  లను ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లాలోని 25, గుంటూరు జిల్లాలోని 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి మద్రాసు సహకారంతో విద్యాశక్తి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నది. దీనిద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు సబ్జెక్టులలో విద్యార్థుల సామర్థ్యం పెంచాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఐఐటి మద్రాసులో శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకులు ప్రతిరోజూ సాయంత్రం 4నుంచి 5గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మెళుకువలు నేర్పుతున్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ – టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.  మొత్తం మీద మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంటర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.  

మాధవిలతపై  కేసు 

సినీ నటి , బిజెపి నేత  మాధవిలత పై  తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పెన్నానది ఒడ్డున జెసిపార్క్ లో ప్రతీ యేడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ యేడు కూడా సెలబ్రేషన్స్ జరిగాయి. తాడిపత్రిలోని   జెసి పార్క్ లో జరుగనున్న    న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు హాజరుకావొద్దని  మాధవిలత పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు తర్వాతే జెసి ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులు దగ్దమయ్యాయి.  ఇది బిజెపి పని అని జెసీ  ప్రభాకర్ రెడ్డి  ఆరోపించారు. అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయనని  పోలీసులే సుమోటోగా  తీసుకోవాలన్నారు. తాడిపత్రి ప్రజల మనో భావాలు దెబ్బతినే విధంగా మాధవిలత వ్యాఖ్యలు చేసినందుకు పోలీస్  కంప్లయింట్ ఇచ్చారు కొందరు మహిళా కౌన్సిలర్లు . ఈ ఫిర్యాదు ఆధారంగా  మాదవిలతపై కేసు నమోదైంది. 

విజయవాడ, విశాఖపట్నంలలో డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో!

ఆధునికత, సృజనాత్మకత, ప్రజా ప్రయోజనం, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఇవీ.. చంద్రబాబు పాలనకు ట్రేడ్ మార్కులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన అలాగే సాగింది. ఆ తరువాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పాలన అదే బాటలో సాగింది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఆయన ఆధునికత, సాంకేతికతల మేళవింపుతో ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు నిర్ణయించి, అందు కోసం కసరత్తు ప్రారంభించేశారు. అందులో భాగంగానే విజయవాడలో రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి నిడమానూరు వరకూ 4.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా ప్రతిపాదించిన డిజైన్లకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. డబుల్ డెక్కర్ మోడల్ అంటే కింద రోడ్డు, పైన ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో రైల్ లైన్ అన్న మాట. మొత్తంగా 18 మీటర్ల ఎత్తులో కొన్ని ప్రాంతాలలో మెట్రో రైల్ నడుస్తుందన్న మాట. ఈ మోడల్ ప్రకారం రోడ్డుకు పది మీటర్ల ఎత్తులో ఫ్లై ఓవర్ ఉంటుంది. దానికి ఎనిమిది మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ ఉంటుందన్న మాట. ఫ్లై ఓవర్ దాటిన తరువాత మెట్రో రైల్ ట్రాక్ పది మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. ఇదే మోడల్ ను విశాఖలోనూ అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్ల పాలెం వరకూ, అలాగే గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ మొత్తం 19 కిలోమీటర్ల పోడవున మెట్రో ప్రాజెక్టుకు చంద్రబాబు పచ్చ జెండా ఊపారు.  ఇక ఈ రెండు నగరాలలోనూ మెట్రో ప్రాజెక్టు వ్యయాన్ని వంద శాతం కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  

గెలిస్తేనే సచివాలయం.. ఓడితే ఫామ్ హౌస్ లో రెస్టే.. ఎప్పుడో చెప్పిన కేసీఆర్!

గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ బీఆర్ఎస్ అధినేత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. ఆయన క్రీయాశీలంగా లేకపోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ పార్టీగా బలహీనపడింది. ఆ పార్టీ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది. అయితే కేసీఆర్ అధికారంలో ఉండగా  వాగ్దానాలను ఏ మేరకు నిలబెట్టుకున్నారన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికలకు ముందు ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిగా సచివాలయంలో ఉంటా... ఓడితే ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటా అని విస్పష్టంగా చెప్పారు. ఆ మాటకే కట్టుబడి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అధికారంలో ఉంటేనే ప్రజా జీవితంలో ఉంటాననీ, లేకుంటే రెస్టు తీసుకుంటాననీ ఆయన ఎన్నికలకు ముందే విస్పష్టంగా చెప్పేశారు. ఆ మాట మీదే నిలబడ్డారు. నిలబడుతున్నారు. ఇందులో ఆయనను తప్పుపట్టాల్సిన పని లేదని పరిశీలకులు అంటున్నారు.  ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావం తరువాత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. వరుసగా రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆయా ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నో హామీలిచ్చారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తాను అన్న హామీ నుంచి భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి వరకూ ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే వాటి అమలును ఎన్నడూ పట్టించుకోలేదు. మాట ఇవ్వడం, మాట తప్పడం కేసీఆర్ కు అలవాటే అన్న భావన తెలంగాణ సమాజంలో పాతుకుపోయింది.   అలా కాదు.. ఇచ్చిన మాటకు కట్టుబడతాను అని నిరూపించాలని కేసీఆర్ భావించారో ఏమో.. పార్టీ ఓటమి తరువాత ఆయన చెప్పిన విధంగా ఫామ్ హౌస్ కే పరిమితమై రెస్టు తీసుకుంటున్నారు.  గత 13 నెలలుగా రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ వానప్రస్థంలో గడుపుతున్నట్లు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.    ప్రత్యేక తెలంగాణా డిమాండును నెరవేర్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణించిన తర్వాత నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశన సందర్భంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. నిజానికి మన్మోహన్ మంత్రివర్గంలో కేసీఆర్ రెండేళ్ళు కార్మిక మంత్రిగా పని చేశారు. అందుకైనా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై సంతాప తీర్మానంపై మాట్లాడతారని అంతా భావించారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి బయటకు రాలేదు.   కేసీఆర్ తీరు కారణంగానే  ఇప్పుడు బీఆర్ఎస్ చీలికలు పేలికలుగా మారిపోయే పరిస్ధితిలో ఉంది. కేటీఆర్, హరీష్ రావు, కవితల మధ్యా పార్టీ పగ్గాల కోసం అంతర్గత పోరు జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్యాడర్ అయితే కేటీఆర్, కవితల మధ్య నిట్టనిలువుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. మొత్తం మీద అధికారంలో ఉండగా సర్వం తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. అధికారం పోయిన తరువాత రాష్ట్రాన్ని, ప్రజలను, చివరకు పార్టీనీ కూడా పట్టించుకోకుండా మౌనంగా ఉండటం ఆయన ప్రతిష్టను మసకబారుస్తోందనడంలో సందేహం లేదు. 

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై మరికొద్ది సేపట్లో తీర్పు

అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై మరి కొద్ది సేపట్లో తీర్పు రానుంది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్  గత నెల 13న అరెస్ట్  అయ్యారు. 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అల్లు అర్జున్ అడ్వకేట్లు కోర్టులో వాదించి మధ్యంతర బెయిల్  ఇప్పించారు. అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వాదనల అనంతరమే  బెయిల్  మంజూరైంది. అరెస్ట్ అయిన మరుసటి రోజే అల్లు అర్జున్ విడుదలయ్యారు.  అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై   నాంపల్లి కోర్టులో వాదనలు ముగిసాయి. గత నెల 26న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలైంది.  

బియ్యం మాయం కేసు.. పేర్ని దంపతులకు తప్పించుకునే దారి లేదు!

అడ్డగోలుగా అవినీతికి పాల్పడి.. తీరా అది బయటపడేసరికి తమదేం లేదు.. అంతా తమ వద్ద పని చేసేవారే చేశారంటూ బుకాయించి తప్పించుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలు ఫలింలేలా లేవు. సొంతంగా ఓ గోడౌన్ నిర్మించి దానికి పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చి.. ఇటు అద్దె సొమ్ములు తీసుకోవడమే కాకుండా, ఆ గోడౌన్ లో  పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధా పూర్తిగా ఇరుక్కున్నారు. ఈ కేసులో పేర్ని నాని భార్యకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయగా, పేర్ని నానికి తాత్కాలిక ఊరట లభించింది. అయితే పేర్ని నాని సతీమణిని పోలీసుల విచారణకు సహకరించాల్సిందేనని ఆదేశించింది. దీంతో పోలీసుల నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరై.. బియ్యం మాయం విషయం తనకేమీ తెలియదనీ, గోడౌన్ వ్యవహారాలన్నీ ఆ గోడౌన్ మేనేజన్  మానస్ తేజ్ చూసుకుంటారనీ చెప్పి చేతులు దులిపేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసు వ్యవహారం వెలుగులోనికి వచ్చినప్పటి నుంచీ పేర్ని నాని కూడా దాదాపుగా ఇవే మాటలు చెబుతున్నారు. గోడౌన్ వ్యవహారాలను రోజువారీగా చూసుకునే తీరిక తనకు కానీ తన భార్యకు కానీ లేదనీ, ఉద్యోగులకే ఆ బాధ్యత అప్పగించేశామని చెప్పుకొస్తున్నారు.  నిజమే గోడౌన్ వ్యవహారాలన్నీ మేనేజరే చూసుకుంటే.. మరి మాయమైన బియ్యానికి సంబంధించి ఫెనాల్టీ సొమ్ము నాని కుటుంబం ఎందుకు చెల్లించినట్లు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక పేర్ని నాని మీడియా సమావేశంలో తడబడ్డారు. అయినా తమ తప్పు లేదనీ, అంతా మేనేజరే చేశాడనీ చెప్పుకోవడానికి, ప్రజలను, పోలీసులను నమ్మించడానికి పేర్ని దంపతులు నానా తంటాలూ పడుతున్నారు. ఇప్పటికే గోడౌన్ మేనేజన్ మానస్ తేజ అరెస్టై జైలులో ఉన్నాడు. అతనిని విచారించిన తరువాతే పోలీసులు ఈ కేసులో ఎ6గా పేర్ని నానిని చేర్చారు. ఇంత జరిగిన తరువాత నయానో భయానో మేనేజన్ మానస్ తేజ్ చేత పేర్ని కుటుంబానికి బియ్యం మాయంతో ఏం సంబంధం లేదు, అంతా తనదే బాధ్యత అని చెప్పించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. అయితే ఇక్కడ మాయం అయిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించేశారు. అక్కడ నుంచి అక్రమంగా దేశం కూడా దాటించేశారు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయంటున్నారు పోలీసులు. అంతే కాదు.. బియ్యం అమ్ముకున్న డబ్బులు మేనేజర్ మానస్ తేజ్ ఖాతాలోనే జమ అయ్యాయి. అయితే ఆయన ఖాతా నుంచి పేర్ని కుటుంబానికి బదిలీ అయ్యాయి. అదీ ఫోన్ పే ద్వారానే బదలీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలూ పోలీసులు సేకరించారు. అంతా మేనేజరే చేసి, బియ్యం మాయం చేసి అమ్ముకుంటే.. ఆ సొమ్ములు పేర్ని కుటుంబానికి ఎందుకు చేరాయన్నదానికి ఆయన సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఎంతగా తమ తప్పు లేదనీ, తామేం పాపం ఎరుగమంటూ నంగనాచి కబుర్లు చెప్పినా వారికి సొమ్ములు ముట్టినట్లు పోలీసులు స్పష్టమైన ఆధారాలు సేకరించడంతో  పేర్ని నాని కానీ, ఆయన భార్య కానీ ఈ కేసులోంచి తప్పించుకునే అవకాశాలు లేవని న్యాయనిపుణులు అంటున్నారు. అయినా బియ్యం మాయం బాగోతం బయటపడిన తరువాత.. కోర్టులో ముందస్తు బెయిలు వచ్చే వరకూ పేర్ని జయసుధ, పేర్ని నాని అజ్ణాతంలోకి వెళ్లిపోవడమే ఈ వ్యవహారంలో వారు అమాయకులు కాదని తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా

తెలుగు రాష్ట్రాలను చలి వణికించేస్తున్నది. ఇరు రాష్ట్రాలలోనూ కూడా పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు పొగమంచు కమ్మేస్తుండటంతో ఉదయం 9 గంటలకు కూడా విజిబులిటీ తక్కువగా ఉండటంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని  సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.  ఇక ఆంధ్రప్రదేశ్ లోని చింతపల్లి, లంబసింగి, పాడేరులలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు చలిగాలులు కూడా వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వాతావరణం మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.  

సజ్జల కబ్జాల పర్వంపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్

సజ్జల పాపాల పుట్ట పగులుతోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన పాల్పడిన భూకబ్జాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా ఆయన అటవీ భూములను సైతం వదల లేదు. అటవీ భూములలో ఏకంగా గెస్ట్ హౌస్ లే నిర్మించుకుని జల్సాలు చేసిన వైనం విస్తుగొల్పుతోంది.  సజ్జల భూ బాగోతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వం తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే. షాడో సీఎంగా సజ్జలే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపారన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి.  వాస్తవానికి జగన్ ఐదేళ్ల పాలనా దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, కబ్జాలకు హద్దన్నదే లేదన్నట్లుగా సాగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు యధేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. అందిన కాడికి భూముల కబ్జాయే లక్ష్యమన్నట్లుగా వారి తీరు సాగింది. ప్ర‌భుత్వ భూములు,  అట‌వీ భూములు, ప్రైవేట్ భూములను ఇష్టారీతిగా ఆక్రమించేసి.. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా చెలరేగిపోయారు.  జగన్ పాలన అంతా  ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే అన్నట్లుగా సాగింది.  జగన్ కేబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా కొన‌సాగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుటుంబం పెద్ద ఎత్తున  భూకబ్జాలకు పాల్పడింది. అలాగే విశాఖపట్నంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు  విజ‌య‌సాయిరెడ్డి భూదందా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల భూక‌బ్జాల ప‌ర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది. ఇప్పుడు తాజాగా  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుటుంబం భూదందా వ్య‌వ‌హారం వెలుగులోనికి వచ్చింది. జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి  యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. ఆయన భూ కబ్జాల పర్వం ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తోంది.  అధికారాన్ని అడ్డుపెట్టుకొని సజ్జల ఏకంగా అట‌వీ భూమిని  క‌బ్జా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌జ్జ‌ల‌ భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో   అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఏకంగా 42 ఎక‌రాల అట‌వీ భూమిని క‌బ్జా చేసిన‌ట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములలో  పండ్ల‌తోట‌లు, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారు. అంతే కాక అట‌వీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, ప‌నివారికోసం షెడ్లు క‌ట్టించారు. అయితే, స‌జ్జ‌ల పేరు బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న అండ‌తో  సోద‌రులు, కుటుంబ స‌భ్యులు అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు స‌మాచారం. వారంతా స‌జ్జ‌ల బినామీలేన‌ని ప్ర‌చారం జరుగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల సోద‌రులు క‌డ‌ప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  

ఏపీ బీజేపీ చీఫ్ సుజనా చౌదరి.. కేంద్ర పెద్ద‌ల మ‌ద్ద‌తు ఆయ‌న‌కేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడు రాబోతున్నారా?  పార్టీ అధిష్టానం ఆ మేర‌కు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిందా?  ప్ర‌స్తుతం అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రికి కేంద్రంలో ప్రాధాన్య‌త క‌ల్పించి.. రాష్ట్రంలో కొత్త‌వారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానమే పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి వినిపిస్తోంది. అయితే, బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో నలుగురు ఉండగా వారిలో సుజనా చౌదరికే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా అంటున్నారు.  పార్టీ పెద్దలు కూడా బీజేపీ రాష్ట్ర పగ్గాలు సుజనా చౌదరికే అప్పగించాలన్న భావనతో ఉన్నట్లు చెబుతున్నారు.  సుజనా చౌదరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెడితే ఏపీ సర్కార్ తో సమన్వయం చక్కగా ఉంటుందన్నది బీజేపీ అగ్రనాయత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ముందుకు సాగాల‌న్న ఆలోచ‌న‌లోనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితేనే కూట‌మి ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ ఏపీలో బీజేపీ బ‌లోపేతానికి కృషి చేస్తార‌ని కేంద్ర పార్టీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే, సుజ‌నా చౌద‌రికి అధ్య‌క్ష బాధ్య‌త‌లుఇచ్చే విష‌యంపై రాష్ట్ర పార్టీలోని కొందరి నుంచి అభ్యంతరం వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వారికే పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌లు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ అధిష్ఠానం అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. క‌ర్ణాట‌క‌లో బ‌ల‌మైన పార్టీగా ఉన్న బీజేపీ.. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైంది. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు ప‌ని చేస్తున్నారు. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌ కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామిగా ఉంది. రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు మంత్రిగా ఉన్నారు. ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ బీజేపీకి ప్రాధాన్య‌త ద‌క్కింది. ప‌లువురు బీజేపీ నేత‌లకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు ల‌భించాయి. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షురాలు, ఎంపీ పురందేశ్వ‌రి ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే, ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ద‌వి ఇచ్చేందుకు బీజేపీ కేంద్ర పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆమె స్థానంలో ఏపీలో బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌ట్టినా ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూనే పార్టీ  బ‌లోపేతంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వానికీ బీజేపీ అధ్య‌క్షుడికి మ‌ధ్య ఏమాత్రం గ్యాప్ వ‌చ్చినా ఎన్డీయే కూట‌మికే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. గతంలో అంటే 2014 తరువాత ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడి తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధ్య‌క్షుడి ఎంపికకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల అభిప్రాయాలను కూడా బీజేపీ హైకమాండ్ పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంది.   ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లకు కొద్ది నెల‌ల ముందు పురందేశ్వ‌రికి రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన, టీడీపీ క‌లిసి పోటీచేయ‌డానికి ఆమె కీల‌క భూమిక పోషించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రంలోని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లి జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మిలో బీజేపీ భాగ‌స్వామిగా మారడంలో పురందేశ్వ‌రి కీ రోల్ పోషించార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత ఓ సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. పురందేశ్వ‌రి కాకుండా బీజేపీ ఏపీ అధ్య‌క్ష స్థానంలో మ‌రొక‌రు ఉంటే మూడు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరేది కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ప‌వ‌న్‌, చంద్ర‌బాబుతో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ నామినేటెడ్ ప‌దువుల్లో బీజేపీ నేత‌లకు ప్రాధాన్య‌త ద‌క్కేలా ఆమె కృషి చేశారు. ప్ర‌స్తుతం ఆమెను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద‌వుల్లోకి లేదా కేంద్ర పార్టీ ప‌ద‌వుల్లోకి తీసుకోవాల‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు. దీంతో పురందేశ్వ‌రి త‌ర‌హాలో ప్ర‌భుత్వంతో మంచి సంబంధాలు కొన‌సాగిస్తూనే.. పార్టీని బ‌లోపేతం చేసే నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీ ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంలో స‌మ‌ర్ధుడ‌న్న భావ‌న‌కు కేంద్ర పార్టీ పెద్ద‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు చంద్ర‌బాబు మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ సుజ‌నా చౌద‌రికి మంచి సంబంధాలు ఉన్నాయి.  విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రితోపాటు ఆధోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత రఘురామ్‌ పేర్లు అధ్య‌క్షుడి రేసులో వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీలోని కొంద‌రు నేత‌లు మాత్రం.. ఆర్ఎస్ఎస్ మూలాలు క‌లిగిన‌ నేత‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేంద్ర పార్టీ పెద్ద‌ల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో పార్థసారథికి ఆర్ఎస్ఎస్ తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మ‌రోవైపు ఆయ‌న రాయలసీమ ప్రాంతం వాసి. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ఈసారి రాయ‌ల‌సీమ నేతకు అప్ప‌గించాల‌న్న డిమాండ్ కూడా ఉంది. మాధ‌వ్ పేరు కూడా అధ్య‌క్ష రేసులో బ‌లంగా వినిపిస్తుంది. అయితే, సుజ‌నా చౌద‌రివైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ తో ఆయ‌న‌కు మంచి సంబంధాలున్నాయి. మ‌రోవైపు సుజనా చౌద‌రికి కూట‌మి పార్టీల్లోని నేత‌ల‌తోపాటు వైసీపీ లోని నేత‌ల‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీలోని ముఖ్య‌నేత‌లు కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సుజ‌నా చౌద‌రి బీజేపీ అధ్య‌క్ష  స్థానంలో ఉంటే వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేవారిలో ఎక్కువ‌ మంది బీజేపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ద్వారా రాష్ట్రంలో  పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశం ఉంది. దీంతో కేంద్ర పార్టీ పెద్ద‌లు సుజ‌నా చౌద‌రికే ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.  

పార్టీ పగ్గాల కోసం కవిత కేటీఆర్ మధ్య పోటీ.. బీఆర్ఎస్ లో మరో సంక్షోభం?

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  అనూహ్యంగా రాజకీయాలకు దూరంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఇది పార్టీ క్యాడర్ విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరింత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కనీసం ఒక్క లోక్ సభ స్థానంలోనూ విజయం సాధించలేకపోవడమే కాకుండా, ఓటు బ్యాంకును కూడా భారీగా కోల్పోయింది. ఇక కేసీఆర్ ఇన్ యాక్టివ్ అయిన సమయంలో పార్టీని నడిపిస్తున్న ఆయన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనదైన ముద్ర చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలు పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. రుణమాఫీ, రైతు భరోసా, అలాగే ఎన్నికల హామీల అమలులో రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టడంలో కేటీఆర్ నాయకత్వం విఫలమైందన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  ఒక పక్క కేటీఆర్ తన నాయకత్వ పటిమను చాటుకోవడంలో విఫలమౌతున్న సమయంలోనే, పార్టీకి మరో సారి నాయకత్వ సంక్షోభం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేశాయి. విచారణకు రావలసిందిగా నోటీసులు కూడా జారీ చేశాయి. ఈ కేసులో కేటీఆర్ అరెస్టయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో మరోసారి బీఆర్ఎస్  నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీష్ రావు ఉన్నప్పటికీ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో కేసీఆర్ కానీ, ఆయన పిల్లలు కేటీఆర్, కవితలు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ రాజకీయవారసత్వాన్ని అందుకోవాలన్న అభిలాషను కల్వకుంట్ల కవిత వ్యక్తం చేస్తున్నారు.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కొన్ని నెలల పాటు తీహార్ జైలులో ఉండి బెయిలుపై విడుదలైన తరువాత కవిత చాలా కాలం స్తబ్దుగా ఉన్నారు. ఆమె కూడా రాజకీయాలకు దూరమౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న కవిత ఇప్పుడు మళ్లీ చురుకుగా రాజకీయాలలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఇటీవల ఆమె నిజామాబాద్ పర్యటించిన సందర్భంలో ఆమె అభిమానులు సీఎం కవిత, సీఎం కవిత అన్న నినాదాలు చేయడం ఆమె తండ్రి రాజకీయ వారసురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టాలని అభిలషిస్తున్నట్లు స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా అంటే ఆమె బెయిలుపై విడుదలై హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా సీఎం కవిత అన్న నినాదాలు వినిపించాయి.   దీనికి కౌంటర్ అన్నట్లుగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కేటీఆర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మద్దతు దారులు సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఈ సంఘటనలను బట్టి పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టే విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ కేసీఆర్ కుటుంబంలో ఈ తగాదా ఉందనీ, కవిత, కేటీఆర్ ల మధ్య కేసీఆర్ నలిగిపోయారనీ అప్పట్లో పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఇప్పుడు కేసీఆర్ రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయిన సందర్భంలో పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవితల మధ్య పోటీ ఎంత వరకూ వెడుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా.. పార్టీ నేతల వ్యతిరేకతే కారణమా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానంటే ఆయన పార్టీ క్యాడర్, నేతలు వణికి పోతున్నారు. ఇప్పుడప్పుడే వద్దు మహప్రభో అంటూ వేడుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. కనీసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఆయన బయటకు వచ్చినా దారి పొడవునా పరదాలు కట్టుకుని జనం ముఖం చూడటానికి కూడా ఇష్టం లేని విధంగా వ్యవహరించారు. ఇక ఎన్నికలకు ముందు సిద్ధం సభల కోసం ఆయన బయటకు వచ్చినా.. ఆ సభలకు బెదరించి మరీ డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, పథకాల లబ్ధిదారులను బెదరించి సభలకు తీసుకువచ్చేవారు. ఇది పక్కన పెడితే ఆయన పర్యటనల కోసం జనాలను తరలించడం అన్నది పార్టీ నేతలకు తలకు మించిన భారంగా మారిపోయేది.  ఇక పథకాలకు బటన్లు నొక్కేందుకు ఆయన బయటకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసే సభలకు పార్టీ నేతలు తరలించిన జనాలు జగన్ ప్రసంగం ప్రారంభించగానే పారిపోయేవారు. వారిని ఆపడానికి పోలీసులు, పార్టీ క్యాడర్ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించేవి కావు. ఇక  పార్టీ పరాజయం తరువాత ఆయన జనం ముందుకు వచ్చే ధైర్యం చేస్తారని ఎవరూ భావించలేదు. పార్టీ నేతలూ క్యాడర్ కూడా ఇహ ఇప్పట్లో జగన్ సభలు ఉండవు, జనాలను తరలించే బాధ తప్పుతుందని ఆనందించారు. అయితే జగన్ మాత్రం ఉరుములేని పిడుగులా జనవరి నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని ప్రతి బుధ గురువారాలలో ఈ పర్యటనలు ఉంటాయని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పర్యటనలు జనంలో పార్టీ పట్ల, తన పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికీ, క్యాడర్ లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికేనని ఆయన చెప్పారు. అయితే పార్టీ నేతలూ, కార్యకర్తలు మాత్రం ఆయన పర్యటనలను స్వాగతించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడప్పుడే పర్యటనలు వద్దు సార్ అంటూ ఆయనకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి నెలకొందని పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్న మాట.  ఈ నెల చివరి వారం నుంచి తన జిల్లా పర్యటనలు ఉంటాయని ప్రకటించిన జగన్ ఆ పర్యటనలకు జగనన్న విత్ క్యాడర్ అని నామకరణం కూడా చేశారు. ఘోర పరాజయం నుంచి తేరుకుని ఇంత త్వరలో ఆయన జనంలోకి వస్తానంటూ చేసిన ప్రకటన రాజకీయ పరిశీలకులనే కాదు, సొంత పార్టీ క్యాడర్ ను కూడా ఆశ్చర్య పరిచింది.ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలతో, పార్టీ క్యాడర్ తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన జగన్, ఇప్పుడు జనంలో ఏమాత్రం ఆదరణ లేని పరిస్థితుల్లో, క్యాడర్ పూర్తిగా నిస్తేజంగా మారిన సమయంలో జిల్లాల పర్యటన పెట్టుకోవడం ఏమిటి? అసలాయన పర్యటన ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలు ముందుకు వస్తారా? అన్న అనుమానాలూ సర్వత్రా వ్యక్తం అయ్యాయి.   సరే ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా జగన్ చెప్పా పెట్టకుండా తన జిల్లాల పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు నేతల నుంచి కానీ, క్యాడర్ నుంచి కానీ తన జిల్లాల పర్యటన ప్రకటనకు ఇసుమంతైనా స్పందన కానకారపోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ జిల్లాల పర్యటనలకు ఏర్పాటు చేయడం తమ స్థోమతకు మించిన పనిగా మారుతుందని పార్టీ నేతలు భయపడ్డారు. అధికారం చేతిలో లేనందున జనాలను కూడా తరలించే పరిస్థితి ఉండదని జగన్ కు పార్టీ నేతలు నివేదించడంతోనే ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సరే పార్టీ నేతలూ, క్యాడరే వద్దంటున్నారని చెప్పుకోలేక జగన్ తన పర్యటన వాయిదా కోసం లండన్ లో చదువుకుంటున్న తన కుమార్తెల వద్దకు వెళ్లనున్నట్లు, అందుకే జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అసలు జగన్ పర్యటనలపై ప్రకటన చేయడం, ఆ తరువాత సరైన కారణం లేకుండానే వాటిని వాయిదా వేయడం అన్నది ఆయన అధికారంలో ఉన్నటప్పటి నుంచీ ఆనవాయితీగా మారింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.