సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ.. చిరు హాజరుపైనే సర్వత్రా ఆసక్తి

అల్లు అర్జున్ అరెస్టు తదననంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొందరు సినీ ప్రముఖులు గురువారం ( డిసెంబర్ 26) ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీతో సమస్య పరిష్కారం అవుతుందా? లేక మళ్లీ కొత్తగా మొదలౌతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు సీఎం రేవంత్ తో భేటీకి వెళ్లే సినీ ప్రముఖులు ఎవరు? ఎంతమంది? అన్నదానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు. అల్లు అర్జున్ అరెస్టు తరువాత వరుసగా జరిగిన సంఘటనలతో అసలు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోతుందా అన్న స్థాయిలో చర్చలు జరిగాయి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సినీ సెలబ్రిటీలు అరెస్టై మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి క్యూకట్టడాన్ని ఆక్షేపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించడానికి ముందుకు రాని సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి క్యూకట్టడం ఏమిటని నిలదీశారు. అసెంబ్లీ వేదికగానే  సినీ పరిశ్రమ తీరుపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక రాష్ట్రంలో   కొత్త సినిమాల విడుదలకు ప్రీమియర్ షోలకు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఉండవని కుండబద్దలు కొట్టారు. ఇది మొత్తం టాలీవుడ్ ను షేక్ చేసేసింది. సంక్రాంతి  అంటేనే సినీమల సీజన్. అటువంటి కీలకమైన తరుణంగా సినిమాల టికెట్ ధరలు పెంపునకు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఉండవు అంటే సినీ పరిశ్రమ సంక్షోభంలో పడుతుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అయ్యింది.  అయితే తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ డీసీ చైర్మన్ గా నియమించిన దిల్ రాజు సంక్షోభ పరిష్కర్తగా, ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడమే కాకుండా, కొత్త సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.  ఆయన చొరవ వల్లే సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడానికి అంగీకరించారు.  అయితే గద్దర్ అవార్డుల మార్గదర్శకాల విషయంలో సినీ పరిశ్రమ స్పందన పట్ల రేవంత్ లో ఆగ్రహం ఉంది. అలాగే గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఇచ్చిన గౌరవం, ప్రస్తుతం సీనీ పరిశ్రమ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికీ,  ముఖ్యమంత్రిగా తనకూ దక్కడం లేదన్న భావన కూడా రేవంత్ లో ఉందని అంటున్నారు. అన్నిటికీ మించి తన వ్యాఖ్యలను ఖండించడానికే అన్నట్లుగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్నీ కాంగ్రెస్ తప్పుపడుతోంది. అన్నిటికీ మించి సంధ్యా థియోటర్ తొక్కిసలాట సంఘటన తరువాత అల్లు అర్జున్ స్పందించిన తీరు పట్ల సినీ పరిశ్రమ వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ రోజు సీఎంతో భేటీకి సీని దిగ్గజాలలో ఎవరెవరు హాజరౌతారన్న దానిపైనా క్లారిటీ లేదు. మెగా స్టార్ చిరంజీవి ఈ భేటీకి దూరంగా ఉండనున్నారని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదే జరిగితే.. ఈ భేటీ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని అంటున్నారు. మొత్తానికి రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ సమస్య పరిష్కరిస్తుందా లేదా సమస్యను మళ్లీ కొత్తగా ప్రారంభమయ్యేలా చేస్తుందా చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు. 

బుక్ పోస్ట్ సర్వీసు రద్దు

భారత తపాలా శాఖ బుక్ పోస్టు సర్వీసులను రద్దు చేసింది. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుక్ పోస్టు సర్వీసులను తపాలా శాఖ రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  విస్తృతమైన వ్యవస్థ ఉండి  దేశంలో 19,101 పిన్ కోడ్ లతో 1,54,725 పోస్టాఫీసులఉన్న తపాలా శాఖ తన నెట్ వర్క్ ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.  బుక్ చేసిన పార్ట్ళిళ్లు వారం లోపు బట్వాడా అవుతున్నాయి. నగర పరిధికి పరిమితమైన స్థానిక బట్వాడాలు ఆమరుసటి రోజుకే  చేరుతున్నాయి. అయితే లాభాపేక్షతో సంబంధం లేకుండా ప్రజలలో పఠనాశక్తి పెంచే ఉద్దేశంతో దశాబ్దాలుగా కొనసాగిస్తున్న బుక్ పోస్ట్ సర్వీసులను హఠాత్తుగా రద్దు చేయడం విస్మయం కలిగిస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి పోస్టల్ డిపార్ట్ మెంట్ తన సర్వీసుల నుంచి బుక్ పోస్ట్ లను తొలగించింది. కచ్చితంగా ఇది పుస్తక ప్రియులకు, పుస్తక ప్రచురణలకు షాక్ అనడంలో సందేహం లేదు.   బుక్ పోస్ట్ సర్వీసును ఉదాత్తమైన ఆలోచనతో మొదలు పెట్టారు.విద్యను ప్రోత్సహించడం, పఠనాభిలాషను పెంపొందింప చేయడం,దేశ వ్యాప్తంగా జ్ఞానాన్నివిస్తరింప చేయడం లక్ష్యంగా ప్రారంభించిన ఈ సర్వీసు రద్దు చేయడం ఎంత మాత్రం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.    రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ (ఆర్.బి.పి.)సర్వీసు ద్వారా 5 కిలోల బరువున్న పుస్తకాలను దేశంలోని ఏమారు మూల ప్రాంతానికైనా కేవలం  80 రూపాయల ఖర్చుతో పంపించే అవకాశం ఉన్న  ఈ సర్వీసును రద్దు చేయడం దారుణమని పుస్తక ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడం లక్ష్యంగాతపాలా శాఖ  ఈ సర్వీసును నడిపేది. అతి తక్కువ రేట్లతో బుక్ పోస్ట్ ద్వారా  పుస్తకాలు, మాగజైన్లు, పీరియాడికల్స్  దేశంలోని నలుమూలలకూ పంపిణీ చేయడానికి ఉన్న అవకాశాన్ని తపాలా శాఖ లేకుండా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అత్యంత ఆదరణ పొందిన ఈ సర్వీసును రద్దు చేయాలన్న నిర్ణయం తపాలా శాఖ ఏకపక్షంగా తీసుకోవడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు  పుస్తక పరిశ్రమ, చదువరుల అభిప్రాయాలను తెలుసుకుని ఉండాల్సిందని అంటున్నారు. అవసరమైతే స్వల్పంగా చార్జీలు పెంచి అయినా సరే ఈ సర్వీసును కొనసాగించాలని కోరుతున్నారు.  రిజిస్టర్ బుక్ పోస్ట్ కేటగిరిని తపాలా శాఖ తన సాఫ్ట్ వేర్ నుంచి గుట్టుచప్పుడు  కాకుండా తీసేసింది. కనీసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు కూడా ఈ విషయాన్ని ముందుగా తెలియపరచలేదు.   దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పుస్తకాలను రిజిస్టర్ బుక్ పోస్టులో పంపడానికి వెళ్లిన వందలాది మంది ప్రచురణ సంస్థల సిబ్బంది ఇక ఈ సర్వీసు అంగుబాటులో లేదని తెలుసుకుని నిర్ఘాంత పోయారు. పలు చోట్ల పోస్టల్ సిబ్బందిని నిలదీసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బుక్ పోస్టు సర్వీసును రద్దు చేయడం ప్రచురణ రంగానికి తీరని నష్టం అనడంలో సందేహం లేదు.   ఇప్పటికే పఠనాసక్తి కొరవడి, పుస్తక పరిశ్రమ నష్టాల్లో కునారిల్లుతోంది. మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఇప్పుడు తపాలాశాఖ తీసుకున్న నిర్ణయం పబ్లిషింగ్ ఇండస్ట్రీని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసిందని పరిశీవలకులు విశ్లేషిస్తున్నారు.  

పాపం శ్రీలక్ష్మి!

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి చూస్తే ఎవరికీ అయ్యో పాపం అని కూడా అనాలని అనిపించదు.  ఎందుకంటే గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. జగన్ క్విడ్ ప్రొకో కేసులలో విచారణను ఎదుర్కొన్నారు. ఆ అరెస్టులు, విచారణల ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలం వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అయితే అప్పటి తప్పిదాల నుంచి ఆమె ఎటువంటి పాఠాలూ నేర్చుకోలేదు. 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత.. ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అలా వచ్చిన ఆమెకు జగన్ కీలక పోస్ట్ ఇచ్చారు.  సీనియర్ ఐఏఎస్ అధికారిణి యర్రా శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి జగన్ క్విడ్ ప్రోకో కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు. అప్పట్లో, కేసుల ఒత్తిడి ఆమె ఆరోగ్యం క్షీణించింది మరియు చాలా నెలలు ఆమెను వీల్ చైర్‌కు పరిమితం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ ఇప్పించారు.  ఆమె జగన్ కోసం మళ్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అది పక్కన పెడితే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ మరి కొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తదుపరి సీఎస్ ఎవరు అన్న చర్చకు వచ్చింది. సీనియారిటీని బట్టి చూస్తే నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో  శ్రీలక్ష్మి నియమితురాలు అవ్వాల్సి ఉంటుంది. అయితే  జగన్ తో మఅంటకాగి నింబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ఆమెకు ఆ పదవి దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవు.  దీంతో ప్రతి ఐఏఎస్ కలలు కనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి శ్రీలక్ష్మికి అందే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందుకు కారణం ఆమె స్వయం కృతాపరాధమేనని ఏపీ సెక్రటేరియెట్ లో చర్చ జరుగుతోంది.  జగన్  కోసం నిబంధనలను తుంగలోకి తొక్కినందుకు శ్రీలక్ష్మి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు.  ఆమె మూల్యం చెల్లిస్తోందని ఏపీ సెక్రటేరియట్ లాబీల్లో చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా శ్రీలక్ష్మికి సీఎస్ పదవి దక్కకపోవడానికి అన్యాయాలకు కొమ్ము కాసి, అధికార పార్టీ అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి వంత పాడటమే కారణమని అంటున్నారు. 

అల్లు అర్జున్ కు తత్వం బోధపడినట్లేనా?

అల్లు అర్జున్  తన సినీమాలు వరుస విజయాలు అందుకుంటుండటంతో ఆయన యాటిట్యూడ్ మారిందన్న విమర్శలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో  అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం పెను వివాదానికి దారి తీసింది. అప్పటి వరకూ కలిసిమెలిసి ఉన్న అల్లు, మెగా కుటుంబాల మధ్య వివాదాలకు, విభేదాలకు అది కారణమైందన్న వాదనా ఉంది. మొత్తం మీద అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం తరువాత నుంచి   అల్లు, మెగా అభిమానుల మధ్య  వైరం ప్రస్ఫుటంగా తెరమీదకు వచ్చింది. మెగా అభిమానులు అల్లు అర్జున్ కు దూరం అయ్యారు. ఆ ప్రచారం పుష్ప2పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి. సినిమాపై ప్రభావం సంగతి పక్కన పెడితే ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేసిన నాటి నుంచి అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు.   ఇక అప్పుడు పుష్ప2 బెనిఫిట్ షో లేదా ప్రీమియర్ షో  సందర్భంగా  సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటనను  వైసీపీ తనకు అంది వచ్చిన అవకాశంగా భావించి అల్లు అర్జున్ కు బాసటగా నిలిచింది. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు.  అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.  దీనిని ఆంధ్రప్రదేశ్ లో మెగా ఫ్యామిలీ పరపతిని తగ్గించేందుకు, అలాగే కాపు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి తనకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ నానా ప్రయత్నాలూ చేసింది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూల, సొంత మీడియా కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా కథనాలు వండి వార్చింది. అల్లు అర్జున్ అరెస్టు వెనుక మెగా రాజకీయం ఉందన్న భావాన్ని ప్రజలలో నటేందుకు ప్రయత్నాలు చేసింది.  మరో వైపు తెలంగాణలో అధికారానికి దూరమై అసహనంతో ఉన్న బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అంశంగానే భావించి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఆరోపణలనే గుప్పించింది. బీఆర్ఎస్ ట్రాప్ లో అల్లు అర్జున్ పడ్డారా అన్న అనుమానం కలిగే విధంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు కారణం జనాలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణం అన్నట్లుగా మాట్లాడారు. అయితే పోలీసులు అల్లు అర్జున్ రోడ్ షో వీడియోలను విడుదల చేయడంతో ఆయన నేల మీదకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పోలీసుల విచారణలో ఆయన తన తప్పు ఒప్పుకున్నారనీ, సారీ చెప్పారనీ వార్తలు వినవస్తున్నాయి. అదంతా పక్కన పెడితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ అత్యుత్సాహం ఆ పార్టీని ప్రజలలో మరింత పలుచన చేసింది.  ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టై విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన  ఏ సందర్భంలోనూ ఆయన జగన్ ప్రస్తావన కానీ, వైసీపీ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. అంతే కాకుండా అల్లు అర్జున్ స్వయంగా  చిరంజీవి నివాసానికి, నాగబాబు ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపి వచ్చారు. దీనిని బట్టే తన నంద్యాల ప్రచారం తొందరపాటేనని అల్లు అర్జున్ పరోక్షంగా అంగీకరించినట్లైంది.  అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీతో మరింత కలివిడిగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. దీంతో జగన్ పార్టీ అత్యుత్సాహం మీద అల్లు అర్జున్ నీళ్లు చల్లినట్లైంది.

శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల పవిత్రత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులు, జరిగిన అపచారాల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కలియుగ వైకుఠం అనే తరుమలలోనే పవిత్రతకు భంగం వాటిల్లే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల వెళ్లిన చంద్రబాబు రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన ఆరంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అన్న మాట ప్రకారం ఆయన తిరుమల ప్రక్షాళనకు నడుంబిగించారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, పారిశుద్ధ్య పరిస్థితిని చక్కదిద్దారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న, జల ప్రసాద వితరణను పునరుద్ధరించారు. కొండపై హోటళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులను చక్కదిద్దారు. ఆహారం నాణ్యత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో  కొలువులు చేస్తున్న అన్యమతస్థులను బదలీ చేశారు. అలాగే కొండపై అన్యమత చిహ్నాలను తొలగింపచేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించారు. అలాగే తాజాగా శ్రీశైలంలో కూడా అన్య మత ప్రచారాన్ని నిషేధించారు. అలాగే శ్రీశైలంలో అన్యమతాలకు సంబంధించిన కార్యకరాలపాలు, బోధనలపై నిషేధం విధించారు. అలాగే అన్యమత చిహ్నాలు కూడా శ్రీశైలంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.   అన్యమతానికి సంబంధించిన ఫోటోలు కలిగిఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతింబోమని ఈవో స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అని శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు. 

మాజీ మంత్రి బాలినేని.. ఏరీ? ఎక్కడా?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఎవరు ఔనన్నా కాదన్నా బాలినేని ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు. ఇందులో సందేహం లేదు.  జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రజలలో పరపతి ఉంది. జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బాలినేని. ఆ తరువాత మూడేళ్లకు జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ లో స్థానం కోల్పోయారు. అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి జగన్ ను గాభరా పెట్టింది. సజ్జల వంటి వారి రాయబారాలు కూడా ఫలించకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి బాలినేనిని బుజ్జగించాల్సి వచ్చింది. జగన్ కు బంధువు కూడా అయిన బాలినేని.. ఇక అప్పటి నుంచీ జగన్ ప్రభుత్వం పతనమయ్యే వరకూ వైసీపీలోనే కొనసాగినా.. నిత్య అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. ఒక దశలో ఆయన జగన్ పాలిట రెండో ఆర్ఆర్ఆర్ (అప్పటి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు)లా మారిపోతారా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగింది. ఏది ఏమైనా తన మాట చెల్లినా చెల్లకపోయినా బాలినేని మాత్రం ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలయ్యేంత వరకూ పార్టీలోనే ఉన్నారు. అయితే జగన్ తో ఆయన తీరు టామ్ అండ్ జెర్రీని తలపించేది. అలగడం, అవమానాలు భరించడం, అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపించడం ద్వారా ఆయన అప్పట్లో జగన్ కు నిత్య తలనొప్పులు తెచ్చి పెట్టారు. మంకు పట్టు పట్టి మరీ ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీ నుంచి టికెట్ సాధించుకున్నా.. తాను కోరిన విధంగా మాగుంటకు ఒంగోలు లోక్ సభ టికెట్ ఇప్పించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ఒంగోలులో పరాజయాన్ని  చవి చూశారు. ఆ తరువాత ఆయన వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు.  అక్కడి వరకూ బానే ఉంది. ఆయన జేనసేనలో చేరే సమయంలో పెద్ద ఎత్తున హంగామా చేయాలని భావించినప్పటికీ జనసేనాని పడనివ్వలేదు. బుద్ధిగా ఒక్కడిగా వచ్చి పార్టీ కండువా కప్పుకోవాలని విస్ఫష్టంగా చెప్పడంతో ఆయన జేనసేనలో చేరిక నిరాడంబరంగా జరిగిపోయింది.  ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి.. మందీ మార్బలంతో ఆర్బాటంగా జనసేన కండువా కప్పుకోవాలని ఆయన భావించినా జనసేనాని అంగీకరించలేదు. మంగళగిరి వచ్చి ఒక్కడిగా పార్టీ కండువా కప్పుకోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన ఆ పని చేశారు. అప్పట్లో కొంత విరామం తరువాత జనసేన తరఫున ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనానినిని తీసుకువస్తానని అప్పట్లో బాలినేని చెప్పినప్పటికీ నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడలేదు. అలాగే పార్టీ పదవి, మండలి సభ్యత్వం ఆశించిన బాలినేనికి జనసేనాని వాటిని ఆవిరి చేశారని బాలినేని అనుచరులు చెబుతున్నారు. నాగబాబుకు మండలి సభ్యత్వం, కేబినెట్ లో స్థానం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేనికి రాజ్యసభ స్థానం జనసేన ద్వారా అందని ద్రాక్షేనని తేలిపోయింది. అసలు ఆయన జనసేన చేరికను ఆ పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నుంచి తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. వాటన్నిటినీ అధిగమించి ఎలాగోలా జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేనికి ఆయన ఆశించిన ప్రాధాన్యతా పార్టీలో దక్కకపోవడం నిరాశనే మిగిల్చింది. అయితే ఎలాగోలా జనసేనలో ఒకింత ప్రాధాన్యత సాధించుకోవాలన్న తాపత్రయంతో అదానీ నుంచి జగన్ కు ముడుపులు అందినట్లు అమెరికాలో కేసు నమోదైన సందర్భంలో బాలినేని మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను మంత్రిగా ఉన్నానని గుర్తు చేసి మరీ అప్పట్లో తనను అర్ధరాత్రి లేపి మరీ సంతకాలు చేయమని జగన్ ఒత్తిడి చేశారని చెప్పి ఒకింత సంచలనం సృష్టించారు. అయితే అదేమీ ఆయనకు జనసేనలో పెద్ద పీట వేయడానికి దోహదపడలేదు. పార్టీ అధిష్ఠానం బాలినేనిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో  బాలినేని గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించారు.  ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో బాలినేని ఏరీ? ఎక్కడా అంటూ చర్చ జరుగుతోంది. 

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు?

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ఐఏఎస్ అధికారి దాన కిశోర్ ను విచారించారు. సుదీర్ఘంగా దాదాపు ఏడు గంటల పాటు దానకిశోర్ ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన విచారణ సందర్భంగా వెల్లడించిన వివరాల ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాన కిశోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో  మరో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశలు ఉన్నాయని చెబుతున్నారు.   ఫార్ములా ఈ-రేస్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి దానకిషోర్ ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు సమర్పించారు.  అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి  కేటీఆర్‌ ఆదేశాల మేరకే హెచ్‌ఎండీఏ నుంచి నిధులు బదిలీ అయినట్టు దానకిశోర్ ప్రభుత్వానికి వెల్లడించిన సంగతి విదితమే. ఇక ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను పేర్కొన్న సంగతి విదితమే. ఇలా ఉండగా ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా ఫార్ములా ఈ రేస్ విషయంలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టిన సంగతి తెలసిందే. ఈడీ కూడా ఇదే కేసులో కేటీఆర్ కు త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నా యంటున్నారు.  

హస్తినను కమ్మేసిన పొగమంచు.. చలికి గజగజలాడుతున్న ఉత్తర భారతం

దేశ రాజధాని నగరం హస్తినను పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతతో మొత్తం ఉత్తర భారతం గజగజలాడుతున్నది. హస్తినలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బుధవారం ఉదయం రాజధాని నగరంలో  9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పొగమంచు కారణంగా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాయు కాలుష్యం మరోసారి పీక్స్ కు చేరడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దు చేయగా, మరి కొన్నిటిని రీ షెడ్యూల్ చేశారు. అలాగే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.   

మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో పర్యటిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా సదైవ్ అటల్ లో ఆయనకు నివాళులర్పించి సర్వమత ప్రార్థన సభలో పాల్గొన్న చంద్రబాబు. ఈ రోజంతా హస్తినలో బిజీబిజీగా గడపనున్నారు. ఈ మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీయే సీఎంల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామితో భేటీ అవుతారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  అనంతరం కేంద్ర విత్త మంత్ర నిర్మలాసీతారామన్ తో భేటీ కానున్నారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం నిర్మాణం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు ఈ భేటీలలో చర్చించనున్నారు.  

కేటీఆర్ ఫేడౌట్ అయిపోయారా?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ రాష్ట్రం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ప్రమేట్ చేసేవారు. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నాటి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, పరస్పర దూషణలతో తెలంగాణ రాష్ట్రం పొలిటికల్లీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. నిత్యం ఏదో వివాదంతో జాతీయ స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రం పతాక శీర్షికలలో నిలుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా ఆంధ్రాను అధిగమించి తెలంగాణ రాజకీయ వివాదాల్లో  అగ్రపీఠిన నిలుస్తోంది.  రాజకీయ విమర్శలు ఓ స్థాయి దాటి దూషణల పర్వానికి వెళ్లాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో దూకుడు ప్రదర్శిస్తుంటే.. అంతకు మించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ, దర్యాప్తుల పేరిట కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకు కోర్టు నుంచి తాత్కాలిక ఉపసమనం లభించింది. అయితే వెంటనే ఇదే విషయంలో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయం పక్కన పెడితే పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలుపై విడుదల సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. అల్లు అర్జున్ వ్యవహారం తెరపైకి రాగానే కేటీఆర్ అరెస్టు, కేసుల విషయం ఒక్కసారిగా ఫేడౌట్ అయిపోయింది.    ఫార్ములా ఇ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచడం, కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడానికి రెడీ అవుతోందన్న వార్తలకు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ స్థానం లేకుండా పోయింది.  ప్రజలు, మీడియా దృష్టి మొత్తం అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీకి తరలిపోతుందా అన్న దానిపైనే కేంద్రీకృతమై ఉంది. అసలు ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చిక్కులలో పడ్డారు అన్న చర్చకు తావే లేకుండా పోయింది. మొత్తంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఈడీ కేసు విషయాన్ని జనం పట్టించుకోలేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.  

సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు మాస్ వార్నింగ్ 

సంక్రాంతికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. పండుగకు స్వంత గ్రామాలు చేరుకునే వారు కూడా ఎక్కువే. స్వంత గ్రామాలకు చేరుకునే వారికి గుంటలు లేని రోడ్లు గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు రోడ్ల రిపేర్లు పూర్తిచేయాలని సూచించారు.  సంక్రాంతి సందర్బంగా వైకాపా సోషల్ మీడియా కించపరిచే పోస్టులు  పెడుతుందని చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా సోషల్ మీడియా అలాంటి పోస్టులు పెడితే నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యులవుతారని చంద్రబాబు హెచ్చరించారు. రోడ్లు బాగా లేవని వైకాపా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రమాదముందన్నారు. వీటిని నిలువరించడానికి టిడిపి ఎమ్మెల్యేలు ముందుకు రావాలన్నారు. గుంతలు పడ్డ రోడ్ల రిపేర్ పూర్తి చేయాలని సూచించారు.  నేను ఒకటే చెబుతున్నాను. తెలుగు దేశం పార్టీ సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది తెలుగుదేశం పార్టీ. సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తే చూసూ ఊరుకునేది లేదని చంద్రబాబు  వైకాపా నేతలను హెచ్చరించారు. 

ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీపై నిషేధం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం!

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వమ్య దేశం ఇండియా. అయితే ప్రస్తుతం ఇండియాలో ప్రజాస్వామ్యం అన్నదానికి అర్ధం మారిపోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే తొలి రెండు సార్లూ కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని నడిపే బలం బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు.. మూడో సారి మాత్రం ఆ బలాన్ని ఇవ్వలేదు. మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి కల్పించి.. వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్న ప్రధాని మోడీ సర్కార్ కు చెక్ పెట్టారు. వ్యక్తిగత అజెండా, సంఘ్ పరివార్ రహస్య అజెండా అమలుకు అసలే మాత్రం అవకాశం లేకుండా ముందరి కాళ్లకు బంధం వేశారు. అయితే ప్రతిపక్ష  కూటమి అనైక్యత కారణంగా ఆ బంధనాలు మోడీ సర్కార్ ను ఇసుమంతైనా ఇరుకున పెట్టలేకపోతున్నాయి. జమిలి ఎన్నికల నుంచి, ఎన్నికల సంస్కరణల వరకూ అన్నీ తన ఇష్టారాజ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం వాటిల్లేలా చేస్తున్నది. తాజాగా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మోడీ నిర్ణయం ఆ విమర్శలకు బలం చేకూర్చేదిగానే ఉంది.  ఎన్నికలకు సంబంధించి సిసి టీవి ఫుటేజి, వెబ్‌ కాస్టింగ్‌, అభ్యర్ధుల వీడియోలు వంటి ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీని కేంద్రం నిషేధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతకు తావే లేకుండా చేసిందని పరిశీలకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం  ప్రజాస్వామ్యానికి, ఎన్నికల ఆధారిత పార్లమెంటరీ వ్యవస్థకు తీవ్ర విఘాతం అనడంలో ఇసుమంతైనా సందేహాంచాల్సిన అవసరం లేదు. 1961-ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 93(2)(ఎ) ప్రకారం ఎవరైనా ఎన్ని కలకు సంబంధించిన అన్ని రికార్డులనూ తనిఖీ చేయడానికి అనుమతి ఉంది. ఇక నుంచి ఎలక్ట్రానిక్‌ రికార్డుల పరిశీలన కుదరదని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఎన్నికల రూల్స్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఒక కేసు కారణంగా ఎన్నికల సంఘం (ఇసి) సిఫారసు మేరకు రూల్స్‌ సవరించామన్న ప్రభుత్వ వివరణ ఈ దుర్మార్గ నిర్ణయం విషయంలో తన చేతికి మట్టి అంటుకోలేదని సంబరపడటానికి తప్ప మరెందుకూ పనికి రాదు.    ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హర్యానా-పంజాబ్‌ హైకోర్టులో వేసిన కేసులో పిటిషన్‌దారు అభ్యర్ధన మేరకు రికార్డులన్నింటినీ షేర్‌ చేయాలని న్యాయస్థానం ఇసి ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ రూల్స్‌ ప్రకారం ఇవ్వాలని నిర్దేశించింది. కోర్టు తీర్పును అమలు చేయాల్సిన ఇసి, అందుకు భిన్నంగా రూల్స్‌ మార్చాలని కేంద్రాన్ని కోరింది. అలా కోరడం తరువాయి.. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆఘమేఘాల మీద నిబంధనలను మార్చేసి న్యాయస్థానం అదేశాలను తుంగలోకి తొక్కేసింది.     రిగ్గింగ్‌, అవకతవకలు సహా ఎన్నికల్లో అక్రమాలను, నిరోధించేందుకు, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం సిసి టీవీలను, వెబ్‌ కాస్టింగ్‌ను కొన్నేళ్ల కిందట  ఈసీ  ప్రవేశపెట్టింది. పోలింగ్‌కు ఆటంకాలు ఏర్పడిన సందర్భాలలో  అభ్యర్ధుల, రాజకీయ పార్టీల ఫిర్యాదుల మేరకు ఈసీ వీడియోలను పరిశీలించి రీపోలింగ్‌కు ఆదేశించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియలో ఏ చిన్న మార్పు చేయాల్సి వచ్చినా రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం విస్తృత సంప్రదింపులు జరపడం ఆనవాయితీ.  కానీ ప్రస్తుత రూల్స్‌ మార్పుపై ఆ విధంగా చర్చ జరగలేదు. ఈసీ కోరింది. కేంద్రం చేసేసింది. అంతే. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం ప్రతిపక్షాలను, రాజకీయ పార్టీలనూ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.   రికార్డుల తనిఖీ వలన ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని, వీడియోలను ఉపయోగించుకొని కృత్రిమ మేధ సహాయంతో పైరసీ వీడియోలు తయారు చేస్తున్నారన్న కేంద్ర ప్రభుత్వ, ఇసి వాదనలో పస లేదు. ఎన్నికల రికార్డులు బయట పడితే  తమకు ఇబ్బంది అన్న భయంతోనే  మోడీ సర్కార్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డుల తనిఖీపై నిషేధం విధించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మోడీ సర్కార్‌ ప్రభావంలో ఇసి పని చేస్తోందనడానికి గడచిన పదేళ్లల్లో ఎన్నో దృష్టాంతాలున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకపు ప్యానెల్‌లో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ను తొలగించడంతోనే ఈ విషయం నిర్ద్వంద్వంగా రుజువైంది. ఇప్పుడు ఏకంగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రూల్స్‌నే మార్చేయడం తిరుగులేని రుజువుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  స్వతంత్రంగా పని చేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ ఇసిపై ఇంతటి స్థాయిలో సందేహాలు రావడం ఏ విధంగా చూసినా  ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల సంఘంపై  ప్రజలు విశ్వాసం కోల్పోతే రాజ్యాంగానికే ప్రమా దం. రాజకీయ పార్టీల, అభ్యర్ధుల హక్కులను ప్రస్తుత నిబంధనల మార్పు చిదిమేస్తుందనడంలో సందే హం లేదు. కాగా నిబంధనలను మార్చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అది వేరు సంగతి. అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఎన్నికల నిబంధనలను మార్చేసి ఎలక్ట్రీనిక్  రికార్డుల తనిఖీపై విధించిన నిషేధాన్ని మోడీ సర్కార్ బేషరతుగా తక్షణమే ఉపసంహరించుకోవాలి.  

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్టు

అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఆంటోనీని ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పని చేస్తున్న ఆంటోనీని అరెస్టు చేయడానికి ముందు దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో పోలీసులు విచారించారు. ఆ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగానే ఆంటోనీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.   ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అల్లు అర్జున్ బౌన్సర్ల టీమ్ ఆర్గనైజర్ ఆంటోనీని అరెస్టు చేయడం, అల్లు అర్జున్ ను సుదీర్ఘంగా విచారించడంతో ఇప్పుడో, ఇహనో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కాకతీయ అనవాళ్లు పరిరక్షించుకోవాలి

ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  నార్సింగి మండలం, మంచిరేవులలో చాళుక్య, కాకతీయ అనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. టీ.జీ.ఎస్.పి ప్రాంగణానికి ఎడమవైపున, మూసీ నది కుడివైపున గల వీరభద్రాలయంలో యోని ఆకారంలో గల పానపట్టం, దాని పైనున్న శివలింగం క్రీ.శ 8వ శతాబ్ది చాళుక్యుల కాలానికి చెందిందని, ఆలయం వెలుపల ఉత్తరం వైపు గల భిన్నమైన వీరభద్రుని విగ్రహం క్రీ.శ 13వ శతాబ్ది కాకతీయుల కాలం నాటిదని అన్నారు. మచిరేవుల పరిసరాలలో చారిత్రక ఆనవాళ్లు గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం నాడు ఈ విగ్రహాలను పరిశీలించారు. ఆరు చేతులు గల వీరభద్రుడు కుడివైపున కత్తి, బాణము, ఢమరుకం, ఎడమ వైపున డాలు, విల్లు, శూలం ధరించి, శరీరం అన్ని ఆభరణాలతో అలంకరించబడి ఉందని, ఆలయ ప్రవేశ ద్వారం ముందు, అసంపూర్ణంగా చెక్కిన నంది శిల్పం కూడా కాకతీయుల కాలంనాటిదేనని శివనాగిరెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాలను భద్రపరిచి, కాపాడుకోవాలని ఆలయ వంశ పారంపర్య అర్చకులు మాడపాటి పరమేశ్వర్ గారికు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ శిల్పాల ద్వారా హైదరాబాద్ నగర శివారులోని మంచిరేవుల గ్రామ చరిత్ర చాళుక్యకాలం అంటే 1200 సంవత్సరాల ప్రాచీనత కలిగి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కార్యదర్శి పాములపాటి శ్రీనాథ్ రెడ్డి, ఆలయ అర్చకులు మాడపాటి పరమేశ్వర్ పాల్గునారు.