బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. గాయపడిన సైఫ్ అలీఖాన్ ను హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసి తప్పించుకుపోయిన అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. మొత్తం ఆరు కత్తిపోట్లు ఉండగా, వాటిలో రెండు చాలా లోతుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆయన వెన్నుముక వద్ద లోతైన గాయం అయ్యిందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, శస్త్ర చికిత్స చేయాల్సి ఉందనీ పేర్కొన్నారు. ఈ సంఘటన గురువారం (జనవరి 16) తెల్లవారు జామున జరిగింది.  సైఫ్ అలీఖాన్ నివాసంలోకి జొరబడిన అగంగకుడు చోరీ కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. అతడిని గమనించి అలీఖాన్ ఇంటి నౌకర్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ దుండగుడు నౌకరుతో గొడవకు దిగాడు. ఈ అలికిడికి నిద్ర నుంచి లేచిన అలీఖాన్ ఆ అగంతకుడిని అడ్డుకోబోగా అతడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్నపోలీసులు సైఫ్ అలీఖాన్ నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన దుండగుడిని పట్లుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.   దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సైఫ్ అలీఖాన్ పై దాడి సంఘటన షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు.  

ఏపీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక భయంలో బతికారు. జగన్ అరాచక పాలనలో  ఏ వర్గమూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించ లేని పరిస్ధితి ఉంది. ఇష్టారీతిగా దోపిడీ, దౌర్జన్యాల పర్వం సాగింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాయాన్ని మూటగట్టుకుని గద్దె దిగడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోంది. ప్రజల ప్రయోజనాలు, సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఏదో నామ్ కే వాస్తే అన్నట్లుగా జరిగిన సంక్రాంతి సంబరాలు ఈ సారి  మిన్నంటాయి.  సంక్రాంతి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల రంగవల్లులతో కళకళలాడే లోగిళ్లు, గొబ్బెమ్మలు. ఇవన్నీ ఈ ఏడాది మరింత కళకళలాడాయి.  పండుగ మూడు రోజులూ  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో  కోడిపందేలు జోరుగా సాగాయి.   వీటిని తిలకించడానికి లక్షల సంఖ్యలో అతిధులు వచ్చారు. ఏటా తెలుగు లోగిళ్లలోని సంక్రాంతి సంబురాలు, కోడి పందేలను తిలకించడానికి వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలి వచ్చే వారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య లక్షల్లో ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఈ సారి వారి స్వగ్రామాలకు కుటుంబ సమేతంగా తరలిరావడమే కాకుండా వారితో పాటు వారి స్నేహితులను కూడా తీసుకువచ్చారు.  ఇలా వచ్చే అతిథుల విడిది కోసం స్థానికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థతి ఇదే తొలిసారని చెబుతున్నారు.    సంక్రాంతి అనగానే కోడి పందేలు వేయడం, పోలీసులు రావడం, పందేలు వేసే వారిని, పై పందేలు కాసే వారిని తరిమి పట్టుకోవడం ఇప్పటి వరకు చూశాము.   ఈ సారి పోలీసులు కోడి పందేల బరుల వద్ద   కనిపించలేదు. పండుగ ముందు కొన్ని ప్రాంతాలలో పోలీసులు ఒకింత హడావుడి చేసినా పండుగ రోజుల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ సారి గతానికి భిన్నంగా కోడి పందేలను తిలకించేందుకు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం విశేషం. కొన్ని చోట్ల వారు కూడా పందేలలో పాల్గొన్నారు.      ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు  కోడి పందేల బరుల నిర్వాహకులుగా మారారు. వీరు బరులు ఏర్పాటు చేస్తే మగవారు నిర్వహణ బాధ్యతలు చూశారు.   కోడి పందేల బరులతో పాటు చాలా గ్రామాల్లో  రికార్డింగ్ డ్యాన్స్ లు హోరెత్తాయి. రాయలసీమ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు చేసేందుకు వెళ్లారు. ఉమ్మడి అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో వెళ్లారు.  

కేటీఆర్ అరెస్టేనా?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం (జనవరి 16) ఈడీ విచారణకు హాజరు కానున్నారు.  ఫార్ములా ఈ  రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టులో, ఆ తరువాత బుధవారం (జనవరి 15) సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రేపు  ఈడీ విచారణకు హాజరు కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి.ఆ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్లను తిరస్కరించాయి. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.   గురువారం (జనవరి 16) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాల‌యానికి బయలుదేరుతారు. ఉద‌యం గం.10.30లకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. అయితే నంది నగర్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ప్రదర్శనగా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఏసీబీ విచారణ సందర్భంగా ఈ సీన్ కనిపించడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  ఈ సారి ఈడీ విచారణకు కూడా  అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. విచారణ తరువాత కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ భయంతోనే కేటీఆర్ బలప్రదర్శనకు రెడీ అయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేటీఆర్ అరెస్టు అనివార్యమైతే ఏసీబీ అరెస్టు చేస్తే బెటరని భావిస్తున్నారు. ఈడీ అరెస్టు చేస్తే బెయిలు రావడం కష్టమనీ, అదే ఏసీబీ అరెస్టు చేస్తే బెయిలు ఒకింత తొందరగా వస్తుందనీ భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణులు ఒక నిర్ధారణకు వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే   గురువారం ఈడీ విచారణ తరువాత కేటీఆర్ అరెస్టు అవుతారన్న భయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది.  ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొట్టపీసు కేసు అంటూ పదేపదే చెబుతూ వచ్చిన కేటీఆర్ కు ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురయ్యింది. దీంతో కేటీఆర్ చెబుతున్నట్లు ఇది లొట్టపీసు కేసు కాదని సామాన్యులు కూడా భావిస్తున్నారు. 

మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్ ను అడ్డుకున్న పోలీసులు

మంచు కుటుంబ వివాదం మరో సారి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. బుధవారం (జనవరి 15) కనుమ పండుగ సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు వచ్చిన మంచు మనోజ్ దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. తాను తన తాత, నానమ్మలకు నివాళులర్పించడానికి వచ్చాననీ, గొడవపడేందుకు కాదనీ మంచు మనోజ్ చెప్పినప్పటికీ పోలీసులు కోర్టు అనుమతి లేదంటూ ఆయనను యూనివర్సిటీలోనికి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అక్కడ నుంచి నేరుగా నారా వారి పల్లెకు చేరుకుని మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. అనంతరం అనంతరం ఎ.రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగలో  పాల్గొన్నమంచు మనోజ్ దంపతులు  మరోసారి మోహన్​బాబు వర్సిటీకి వచ్చారు. వర్సిటీ ఆవరణలోని శ్రీవిద్యానికేతన్‌ వద్దకు వచ్చిన మనోజ్‌ దంపతులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ వద్ద మర సారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో తాతా నానమ్మలకు నివాళులు కూడా అర్పించనీయరా అంటే మంచు మనోజ్ గట్టిగా కేకలు వేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  

నారా వారి ప్రాపకం కోసం మంచు వారి వెంపర్లాట.. వద్దు బాబోయ్ అంటున్న తమ్ముళ్లు!

మంచు కుటుంబంలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. అన్నదమ్ముల ఆస్తుల వివాదం కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయే వరకూ దారి దీసింది. మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వైపు, మంచు మనోజ్ ఒక వైపు అన్నట్లుగా కుటుంబం చీలిపోయింది. పలు మార్లు దాడులు, ప్రతి దాడుల వరకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు, అటు మంజు విష్ణు కూడా రాజకీయ అండ కోసం పాకులాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు, అండ కోసం వెంపర్లాడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో  ప్రదర్శించిన ప్లెక్సీల్లో మోహన్ బాబు ఫొటోతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా ఉంది.  వాస్తవానికి మోహన్ బాబుకు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలూ లేవు. జగన్ హయాంలో మరీ ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చంద్రబాబుపైనా, తెలుగుదేశంపైనా ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.  సరే జగన్ కోసం ఎంతగా పని చేసినా, 2019 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో అప్పటి తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఊరేగింపులు, ధర్నాలూ నిర్వహించినా జగన్ నుంచి మోహన్ బాబుకు ఎటువంటి ప్రశంసా రాలేదు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఊహాగానాలు ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మోహన్ బాబుకు ఏదో కీలక కార్పొరేషన్ పదవి, రాజ్యసభ సభ్యత్వం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతే. జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు.  దీంతో విసిగి వేసారిన మోహన్ బాబు జగన్ కు దూరం జరిగారు. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం చేయలేదు సరికదా.. ఎన్నికల ముందు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. చివరికి అదీ జరగలేదు. ఇక గత కొంత కాలంగా మోహన్ బాబు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. అయితే అదేమీ ఆయన నటనావైదుష్యం కారణంగానో, విద్యాసంస్థల అధినేతగా వచ్చిన పేరు ప్రతిష్ఠల కారణంగానో కాదు, కుటుంబ గొడవలలొ వివాదాస్పద వ్యవహార శైలి కారణంగా ఆయన వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. జర్నలిస్టుపై దాడి కేసులో అరెస్టును తప్పించుకోవడానికి అజ్ణాతంలోకి వెళ్లిన కారణంగా వార్తల్లో నిలిచారు.   అలాగే ఆయన విద్యాసంస్థల విషయంలో  ఆయనను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ విద్యా సంస్థలలో ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మోహన్ బాబు విద్యాసంస్థపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు చంద్రబాబుతో గతంలో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకుని ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో చంద్రబాబు ఫ్లెక్సీల ప్రదర్శన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఊసరవిల్లి సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తున్నారనీ, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న చందంగా మోహన్ బాబు వ్యవహార శైలి ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   మరో వైపు తండ్రితో, సోదరుడు విష్ణుతో విభేదాల కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ కూడా చంద్రబాబుకు దగ్గర కావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కనుమ పండుగ రోజున మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారా వారి పల్లె వెళ్లి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.   మోహన్ బాబు కుటుంబం ఇలా చంద్రబాబు, లోకేష్ మద్దతు కోసం పాకులాడుతుంటే.. సోషల్ మీడియాలో మాత్రం వీరి వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచు కుటుంబాన్ని చంద్రబాబు, లోకేష్ దూరం పెట్టడమే మంచిదన్న అభిప్రాయాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.   

న్యూఢిల్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆప్ అభ్యర్థిగా కేజ్రీవాల్ బుధవారం (జనవరి 15) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన  ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించారు. ప్రజలు ఆలోచించి, పని చేసే వారికే ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.  కష్టపడి పని చేసే వారికే ప్రజలు ఓటు వేస్తారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.  70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు  నోటిఫికేషన్ ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 17 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది. ఈ ఎన్నికలలో బీజేపీ, ఆప్ ను హోరాహోరీ తలబడుతుండగా, కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. 

అమరావతి రైతుల ఖాతాల్లో ఆ సొమ్ములు జమ.. చంద్రబాబు సంక్రాంతి కానుక

అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచిపోయిన కౌలు సొమ్మును వారి ఖాతాలలో జమ చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని కోరుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను అందించిన రైతులకు సీఆర్డీయే పరిధిలో వాణిజ్య, నివాస స్థలాలలో పాటు రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ కౌలు చెల్లిస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులతో ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే.  అయితే జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాటు కౌలు కూడా నిలిపివేసింది జగన్ సర్కార్.అయితే రైతులు న్యాయపోరాటం చేశారు. హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ దిగి వచ్చి విడతల వారీగా కౌలు సొమ్ములను అమరాతి రైతుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. కానీ ఎన్నికల ఏడాదది ముందు నుంచి రైతులకు కౌలు సొమ్ముల జమను నిలిపివేసింది. ఎన్నికలలో జగన్ సర్కార్ ఘోర పరాజయం పాలు కావడం, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాదిన్న కాలంగా పెండింగ్ లో ఉన్న అమరావతి రైతుల కౌలు సొమ్ములను సరిగ్గా పండుగ వేళ వారి ఖాతాలో జమ అయ్యాయి. దీనిపై హర్షం వ్యక్తం చేసిన అమరావతి రైతులు చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారు.  అంతే కాకుండా జగన్ హయాం అప్పట్లో అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్5 జోన్ ఏర్పాటు చేసి.. ఆ ప్రాంతంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి చేసిన భూ కేటాయింపులను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి ఆ భూములను తిరిగి సీఆర్డేయేకు అప్పగించింది. అమరావతి రైతులకు ప్రయోజనం కలిగేలా తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పట్లా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్

స్కిల్ కేసులో చంద్రబాబునాయుడికి సుప్రీంలో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.   ఈ కేసులో ఇప్పటికే  చార్జిషీట్ దాఖలు చేసినందున  బెయిలు రద్దు పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ఈ కేసు విచారించిన జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు.  ఈ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు 2023 నవంబర్ లో బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు బెయిలు పిటిషన్ రద్దు చేస్తూ వెలువరించిన ఉత్తర్వ్యులలో సుప్రీం కోర్టు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది.  ఇలా ఉండగా చంద్రబాబు బెయిలు రద్దు కోరుతూ సీనియర్ జర్నలిస్టు తిలక్ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ పై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎవరు, ఈ కేసుతో మీకేం అంబంధం, పిటిషన్ దాఖలుకు మీకున్న అర్హత ఏమిటి అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.  సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ అభ్యంతరం తెలిపిన సుప్రీం కోర్టు, మరో సారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరిస్తూ తిలక్ దాఖలు చేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది.  

ఖమ్మంజిల్లాలో  యువకుడి అదృశ్యం... సంచలనం సృష్టించిన  వాయిస్ మెసేజ్ 

ఖమ్మం జిల్లాలో  ఓ యువకుడి కిడ్నాప్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ఈ వార్త కలకలం రేపింది. సంక్రాంతి సందర్బంగా ఖమ్మం పోలేపల్లికి చెందిన సాయి హైద్రాబాద్ నుంచి   ఖమ్మం బస్టాండ్ కు చేరుకున్నాడు     ఈ  క్రమంలో సాయి తమ్ముడు  సంజయ్ ఖమ్మం బస్టాండ్  వద్ద  అదృశ్యమయ్యాడు.  అన్నను రిసీవ్ చేసుకోవాలని ఖమ్మం బస్టాండ్ కు వచ్చిన సంజయ్  నాటకీయ పరిణామాలతో అదృశ్యమయ్యాడు. అన్న బస్టాండ్ లో ఉండగానే తమ్ముడు సంజయ్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. అన్నయ్య నాకు ప్రాణహాని ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక అమ్మాయిని హత్య చేశారు. నన్ను కూడా హత్య చేస్తారు అని ఆ వాయిస్ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ ను అన్న సాయి కుటుంబసభ్యులకు ఫార్వర్డ్ చేశాడు. నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సంజయ్ బైక్ అక్కడే కనిపించింది కానీ సంజయ్ మాత్రం కనిపించలేదు. సంజయ్ మెసేజ్ లో చెప్పిన అమ్మాయి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీటీవీలో సంజయ్ కనిపించాడు కానీ సంజయ్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. 

యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం.. ఒకరి సజీవ దహనం

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి సజీవదహనమయ్యారు. ఉత్తర ప్రదేశ్ ప్రయాగలో జరుగుతున్న మహా కుంభమేళా కోసం తెలంగాణ నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఒక బస్సులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన మధుర వద్ద  మంగళవారం (జనవరి 13) చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంల బయటపడిన వారిని వారి వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవదహనమయ్యారు. మిగతా వారిని స్వస్థలాల కు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. 

మంచు కుటుంబంలో మళ్లీ మంటలు?

మంచు కుటుంబంలో విభేదాలు ఇప్పట్లో చల్లారేలా లేవా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది. ఇటీవల మంచుకుటుంబంలో విభేదాలు రచ్చకెక్కి పోలీసు కేసుల వరకూ వెళ్లిన సంగతి తెలిసిదే. కుటుంబం  మోహన్ బాబు, విష్ణు ఒక వైపు, మనోజ్ మరో వైపు అన్నట్లుగా నిట్టనిలువుగా చీలిపోయిన పరిస్థితి ఏర్పడింది.  ఈ విభేదాలపై మీడియా కవరేజ్ సందర్భంగా మోహన్ బాబు ఒక విలేకరిపై దాడికి పాల్పడిన ఘటనపై ఆయనపై పోలీసు కేసు నమోదైంది. దీంతో ఆయన కొన్ని రోజులు అజ్ణాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించి తాత్కాలిక ఊరట పొందారు. సుప్రీంలో అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట వచ్చిన తరువాతే ఆయన బయటకు వచ్చారు. గత కొద్ది రోజులుగా ఆయన తిరుపతిలో  సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలలో ఆయన పెద్ద కుమారుడు   విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంజు మనోజ్ మాత్రం ఇప్పటి వరకూ ఈ సంబరాలకు దూరంగా ఉన్నారు. భోగి, సంక్రాంతి వేడుకల్లో ఎక్కడా కనిపించని మనోజ్ కనుమ రోజున జరిగే సంబరాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. రంగంపేటలో బుధవారం (జనవరి 15)న జరిగే జల్లి కట్టు వేడుకల్లో పాల్గొనేందుకు నమోజ్ రానున్నారు. అనంతరం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెల్లారని సమాచారం.  ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, విష్ణు ఉండటంతో.. మనోజ్ రాకతో అక్కడ మళ్లీ  గొడవలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మనోజ్ రాక సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  

సుప్రీం లో కేటీఆర్ కు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ ఉపసంహరణ

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు సుప్రీంలోనూ చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో  ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్  బుధవారం (జనవరి 15) విచారణకు వచ్చింది.   ఈ సందర్భంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులలో జోక్యం చేసుకోబోని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన ను డిస్మిస్ చేసే పరిస్థితి ఉండటంతో కేటీఆర్ తరఫు న్యాయవాది పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది. పేర్కొంది.   ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా కేటీఆర్ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో తమ వాదన కూడా వినాలని కోరుతూ సుప్రీంలో కేవియెట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ సుప్రీం కోర్టులో తన క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడంతో మళ్లీ ఆయన అరెస్టుపై చర్చ మొదలైంది. 

ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ నెత్తిన పాలు పోస్తున్న కాంగ్రెస్, ఆప్ విభేదాలు!

ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ గత మూడు పర్యాయాలుగా చెమటోడుస్తూనే ఉంది. అయినా హస్తిన ప్రజ కమలనాథులకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో కష్టం లేకుండానే హస్తినపై కమలనాథుల జెండా ఎగిరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు బీజేపీ ప్రయోజకత్వం కానీ, ఆ పార్టీపై ప్రజలలో నమ్మకం పెరగడం కానీ కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఏమిటి కారణం? అన్న ప్రశ్నకు కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలే కారణమన్న సమాధానం వస్తోంది. అసలు దేశంలో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ అధికార పగ్గాలను అందుకోవడానికి కారణం బీజేపీయేతర పార్టీల అనైక్యతేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోనూ అదే జరగనుందని అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం కూడా జోరందుకుంది. పోటీ ప్రధానంగా అధికార ఆప్, విపక్ష బీజేపీల మధ్యే అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం దగ్గర నుంచీ అన్నిటా వెనుకబడే ఉంది. బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఢిల్లీ మార్మోగిపోతున్నది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ  చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  బీజేపీ, కాంగ్రెస్ జుగల్ బందీ నాటకం బయటపెడతానని చేసిన వ్యాఖ్యలతో  బీజేపీ నెత్తిన పాలు పోసినట్లైంది.    కాగా కేజ్రీవాల్ వ్యాఖ్యలై కాంగ్రెస్ మండి పడింది.   రాహుల్ గాంధీ కూడా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే.. కాంగ్రెస్, ఆప్ లు పరస్పర విమర్శలపై పెట్టిన దృష్టి కమలంపై పెట్టడం లేదు. ఈ రెండు పార్టీలూ కమలం పార్టీని వదిలేసి పరస్పర నిందలతో సరిపెడుతున్నాయి. దీంతో ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ పని నల్లేరుమీద బండి నడకలా మారిందని విశ్లేషకులు అంటున్నారు.  ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా వెండిపల్లెంలో పెట్టి బీజేపీకి ఢిల్లీని అప్పగించడంలో పోటీ పడుతున్నాయన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. 

కనుమ రోజు కోడి పందేల జోరు 

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి.  సంక్రాంతి  సంబురాలైన చివరి రోజు కనుమ రోజున పందేలు ఊపందుకున్నాయి.  ఈ యేడు పురుషులతో బాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పందెం రాయుళ్లు  లక్షల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు ఆచారంగా వస్తోంది.  బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు చేతులు మారినట్టు అంచనా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200 కి పైగా బరులు బరిలో దిగాయి. మురమళ్ళలో వీఐపీలో బరి రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పందాలు జరిగియని సమాచారం.  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు మూడో రోజుకు చేరుకున్నాయి. 

పగటి కలలా? మానసిక రుగ్మతా.. జగన్ వింత ప్రవర్తనకు కారణమేంటి?

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడం అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పిలుపు నిచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం తాను కలలు కంటాననీ, వాటిలోనే జీవిస్తాననీ, అదే వాస్తవమని తాను నమ్మడం కాకుండా, పార్టీ నేతలు, క్యాడర్, ప్రజలూ కూడా నమ్ముతున్నారని భ్రమ పడుతున్నారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనపై ప్రజలు తమ వ్యతిరేకతను, ఆగ్రహాన్ని గత ఏడాది జరిగిన ఎన్నిలలో విస్పష్టంగా చాటారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ దీనంగా కోరిన జగన్ కు ఆ చాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టినందుకు తమను తాము తిట్టుకుంటూ ఐదేళ్లు గడిపిన ప్రజలు.. ఐదేళ్ల తరువాత ఎన్నికలు రాగానే జగన్ ఇక చాలు.. నీకు మరో చాన్స్ లేదని విస్పష్టంగా చాటేలా ఓట్లు వేశారు. అందుకే ఆయన పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 11 అంటే 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ ఎన్నికల్లో జగన్ కు ఆయన అండ చూసుకుని విర్రవీగిన ఆయన పార్టీ నేతలకూ గట్టి బుద్ధి చెప్పారు.  సరే జగన్ ప్రభుత్వం పతనమై చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు దాటింది. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టిస్తోంది. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లోని ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ప‌ని తీరు ప‌ట్ల ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతుకుల ర‌హ‌దారుల‌ స్థానంలో అద్దాల్లాంటి రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లు రాష్ట్రం వైపు చూడడానికే భయపడిన పెట్టుబడి దారులు ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రానికి ప్ర‌పంచ స్థాయి కంపెనీలు తరలి వస్తున్నాయి. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సార‌థ్యంలో  రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందన్న జనం బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ప్రజల ఆకాంక్షలు, అభీష్ఠాలతో ఏ మాత్రం సంబంధం లేని, మాజీ  మయుఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం తన అధికార వియోగం తాత్కాలికమేననీ,  కొద్ది రోజులలోనే లేకుంటే కొద్ది నెలల్లోనే మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతాననీ తాను నమ్మడమే కాకుండా అందరూ నమ్మి తీరాలంటున్నారు.   ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉండి..  ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బనాయించి జైలు పంపించ‌డం, ప‌ర‌దాలు క‌ట్టుకొని బ‌య‌ట‌కు రావ‌డం, ప్ర‌భుత్వ ప‌నితీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయించ‌డం, సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ఆడ‌వారిపై కూడాఅస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టించ‌డం చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌చేతిలో చావుదెబ్బ‌తిన్నా బుద్ధి మార్చుకోలేదు.  కనీసం ప్రతిపక్ష  హోదా కూడా లేక‌పోయినా అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాత్రిళ్లు దేవుడు క‌ల‌లోకి వ‌చ్చి చెప్పిన‌ట్లు ఈ ప్ర‌భుత్వం ఎక్కువ రోజులు ఉండ‌దు అంటూ అధికారుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. అధికారం కోల్పోయి ఏడాదికూడా కాక‌ముందే .. మ‌రికొద్ది రోజుల్లో అధికారంలోకి వ‌స్తున్నామంటున్న జ‌గ‌న్ తీరును చూసి వైసీపీ నేతలూ, శ్రేణులే తలలు బాదుకుంటున్నాయి. ఆయన మానసిక స్థితిపై వారిలో  అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రచారంలో ఉన్నట్లుగా జగన్ కు ఏదైనా మానసిక రుగ్మత ఉందా అన్న సందేహాలు వైసీపీ నుంచే వ్యక్తం అవుతున్నాయి.  ఎన్నిక‌ల్లో అధికారం కాల్పోయిన ఏ పార్టీ అయినా.. త‌మ పాల‌న‌లో ఎక్క‌డ పొర‌పాట్లు జ‌రిగాయి.. ప్ర‌జ‌లు ఎందుకు మ‌న‌ల్ని ఓడించారు అన్న విషయాలపై సమీక్షలు చేసుకుంటుంది.  మ‌రోసారి అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. కానీ వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం అటువంటి వాటి జోలికి పోవడం లేదు.  అధికారం కోల్పోయిన నెల రోజుల నుంచే మళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం.. అప్పుడు మీ అంతు చూస్తాం అంటూ అధికారుల‌బెదరింపులకు దిగడం మొదలు పెట్టారు. ఇక్కడ జగన్ మానసిక పరిస్థితిపై ప్రజలలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  జ‌గ‌న్ అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికారుల‌ను బెదిరిస్తూ భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొట్ట‌మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో త‌న‌ను నేరుగా అసెంబ్లీలోకి పంపించ‌డం లేద‌ని మ‌ధుసూద‌న్ రావు అనే అధికారిని జ‌గ‌న్ బెదిరించారు.  ఆ తరువాత తిరుప‌తి మాజీ ఎస్పీ సుబ్బారాయుడిపైనా బెదరింపుల పర్వానికి దిగారు. మేం అధికారంలోకి రాబోతున్నాం.. అప్పుడు నువ్వు ఎక్క‌డికిపోయినా  తీసుకొచ్చి నీ అంతుతేలుస్తాం అంటూ జ‌గ‌న్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా పులివెందుల‌లో డీఎస్పీ ముర‌ళీనాయ‌క్ కు సైతం జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చారు.  తనకు వరసకు సోదరుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా సతీసమేతంగా పులివెందుల  వ‌చ్చిన జ‌గ‌న్‌.. కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలీప్యాడ్ వద్దకు డీఎస్పీ మురళీనాయక్‌ను పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారు.  వైసీపీ అధికారంలోకి వ‌స్తుంది ఏపీలో నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జ‌గ‌న్ అధికారంలో ఉండి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ లాంటి నేత‌లు ఎవ‌రైనా అధికారుల‌పై ఇలా బెదిరింపుల‌కు పాల్ప‌డితే వెంట‌నే పోలీసు అధికారుల సంఘం నేత‌లు ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్ ఇచ్చేవారు. కానీ జ‌గ‌న్ వ‌రుస‌గా అధికారుల‌ను బెదిరిస్తున్నా పోలీసు అధికారుల‌ సంఘాల నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌టంతో ప్ర‌జ‌లుసైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వం కూడా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేద‌న్న వాద‌న ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌గ‌న్ తీరుపై స్పందిస్తూ.. అధికారుల‌ను బెదిరిస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా జ‌గన్ ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. అధికారం కోల్పోయినా అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌పైచ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  జ‌గ‌న్‌ తీరుపై కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుంద‌నేది వేచి చూడాల్సిందే.

కేజ్రీవాల్, మనీష్ సిసోడియా విచారణకు ఈడీకి అనుమతి.. ఎన్నికల వేళ ఆప్ కు కొత్త తలనొప్పి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆప్ ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆప్ కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ అగ్రనేతలు, మాజీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విచారించేందుకు హోంమంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది.  ఈ కేసులో ఈ ఇరువురూ అరెస్టై ఇప్పుడు బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే.   ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేజ్రీవాల్‌ను విచారించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కి అనుమతి మంజూరు చేసింది. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల విచారణకు ఈడీ రంగంలోకి దిగడం కచ్చితంగా ఆప్ కు ఇబ్బంది కరమైన విషయమే.   

సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు గోశాల ప్రసాద్ కన్నుమూత

సీనియర్ జర్నలిస్టు గోశాల ప్రసాద్ కన్ను మూశారు. నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ హోదాలలో పలు మీడియా హౌస్ లలో పని చేసిన గోశాల ప్రసాద్ బుధవారం (జనవరి 15) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కాకినాడ ఆయన స్వస్థలం. భార్యా, కుమారుడు ఉన్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు ఆంధ్రప్రభలో వివిధహోదాల్లో పని చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పత్రిక ఆంధ్రప్రదేశ్ కు అసోసియేట్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత కొంత కాలం మిర్రర్ టుడే అనే సొంత పత్రిక నిర్వహించారు.   కాగా 2010-14 మధ్య కాలంలో అప్పటి మంత్రి ఆనం వద్ద, ఆ తరువాత 2014-16 మధ్య కాలంలో అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వద్ద పీఆర్వోగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరాధన పత్రిక కు ఎడిటర్ గా ఉన్నారు. అలాగే పలు ప్రముఖ టీవీ చానల్స్ లో టీవీ డిబేట్లలో విశ్లేషకుడిగా తనమైన ముద్ర వేశారు.   గోశాల ప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ విధ్వంస పాలనపై ధైర్యంగా గళమెత్తిన ధైర్యశాలి గోశాల ప్రసాద్ అని పేర్కొన్నారు.  రాజకీయ పరిణామాలపై టీవీ చర్చల్లో లోతైన విశ్లేషణతో   తనదైన ముద్ర వేశారని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.