ప్రజల్లో లీడర్.. పార్టీ కార్యకకర్తలకు గాడ్ ఫాదర్ లోకేష్

నారా లోకేష్. ఏపీ రాజకీయాలలో ఆయన ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్. ప్రజలలో తిరుగులేని నాయకుడు. అయినా ఆయన పార్టీ విషయానికి వచ్చే సరికి ఒక కార్యకర్త మాత్రమే. ఒక కార్యకర్తలాగే పార్టీ కోసం శ్రమిస్తారు. అదే విధంగా తోటి కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారు. లోకేష్ లోని ఈ లక్షణాలను ఆయన రాజకీయాలలో అడుగుపెట్టక ముందే..   వైసీపీ పసిగట్టేసింది. అందుకే లోకేష్ కు  రాజకీయాలంటేనే విరక్తి కలిగేలా చేయాలన్న ఉద్దేశంతో  ఆయనపై విమర్శల దాడి చేసింది.  బాడీ షేమింగ్ కు పాల్పడింది. లోకేష్ ఆహారపు అలవాట్లను గేలి చేసింది. పప్పు అంటూ అవహేళన చేసింది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు లోకేష్ పరిపూర్ణమైన నాయకుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ది లీడర్.  ఆయన గురించి స్పష్టంగా చెప్పాలంటే.. తనను తాను నాయకుడిగా మలచుకున్న యవకుడు. విమర్శల ఉలి దెబ్బలకు శిల్పంగా మారిన నేత. రాజకీయ అడుగులు ప్రారంభించిన సమయంలో  లోకేష్ మాట్లాడిన ఒకటీ రెండు అమాయకపు మాటలతో ట్రోల్ చేసే వారికి  తనయువగళం పాదయాత్రలో చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు.   వేలకిలోమీటర్లు నడిచి, ప్రజలతో మమేకమై  వారి కష్టాలను తెలుసుని, సొంత పార్టీలో, కార్యకర్తల్లో అసంతృప్తిని దూరం చేసి భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  ప్రత్యర్ధుల విమర్శల దాడికి సమాధానం చెబుతూనే, లోకేష్ వారికి దిమ్మతిరిగేలా ప్రతి సవాళ్లు విసిరారు. పాదయాత్రలో భాగంగా  కియా ఫ్యాక్టరీ వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ , అలాగే టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ సవాళ్లు రాష్ట్ర యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ.. మిస్టర్ జ‌గ‌న్ రెడ్డీ.. నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు.. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చాన‌ని చెప్పుకోగ‌లవా? అంటూ నేరుగా అప్పటి సీఎం జగన్ కు విసిరిన సవాల్ వైసీపీ నేతల నోళ్లు మూయించింది.  అంతెందుకు 2014--2019మధ్య కాలంలో ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారు. గణాంకాలతో సహా సోదాహరణంగా అపుడు మండలిలో లోకేష్ అనర్ఘళ ప్రసంగానికి  సీనియర్లు అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు లోకేష్ భారీ విజయం సాధించాక మంగళగిరిలో తన స్థానాన్ని పదిలపరచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఏ ప్రజలు అయితే తనకు భారీ మెజార్టీ ఇచ్చారో వారి కోసం అహరహం శ్రమించి పనిచేయాలని లోకేష్ భావించి కార్యాచరణ మొదలెట్టేశారు.  మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే గాక అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారానికి అధికారుల ద్వారా చర్యలు చేపట్టడం ప్రజల్లో భరోసా కల్పిస్తోంది. అంతే కాదు సమస్యలు విన్న వించేందుకు వచ్చే ప్రజల కోసం ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా లోకేష భావిస్తున్నారు.   టీడీపీ యువ నాయ‌కుడు, విద్యాశాఖ‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌  గ్రాఫ్ ఈ నిర్ణయంతో పెరిగిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ప్రజలతో మమేకం కావడం ఆయ‌న‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చి పెడుతున్నది. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసంలో ప్ర‌జాద‌ర్బార్ ప్రారంభించారు. లోకేష్ కు సమస్య చెప్పుకుంటే అది పరిష్కారమైపోయినట్లునన్న విశ్వాసం ప్రజలలో వ్యక్తం అవుతున్నదంటే ఎంతటి అకుంఠిత దీక్షతో లోకేష్ పని చేస్తున్నారో అర్ధమౌతోంది. పాదయాత్రతో ఆయన ప్రజల దృష్టిలో నాయకుడై పోయారు.  తమ కష్టాలను తీర్చడానికి నాయకుడిగా తానున్నానన్న భరోసాను ప్రజలలో లోకేష్ కల్పించారు.   ప్రజలలో నాయకుడిగా గుర్తింపు పొందినా నారా లోకేష్ పార్టీ విషయానికి వచ్చే సరికి ఒక కార్యకర్తలాగే ఉంటారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీకి కొండంత బలం అని ప్రగాఢంగా నమ్ముతారు. పార్టీ కార్యకర్తల కోసం నిలబడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.  ఈ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు, నిరుపేద కార్యకర్తల పిల్లలు చదువులకు ఆర్ధిక సహాయం చేస్తూ కార్యకర్తలను నిరంతరం ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మడమే కాదు.. పార్టీ కూడా అందుకు అంగీకరించేలా చేశారు. కార్యకర్తల కోసం నిరంతరం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఒక ప్రత్యేక నిధి, దానిని నిర్వహించేందుకు ఒక పటిష్ఠ వ్యవస్థ అవసరం అని లోకేష్ గట్టిగా చెప్పి పార్టీని అందుకు ఒప్పించారు. అంతే కాదు 2014లో తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే  నా రాలోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చిత్తశుద్ధితో కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు.  ఇప్పటివరకు, పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిథి నుంచి లోకేష్  138 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే  గత ప్రభుత్వ పాలనలో చట్టపరమైన కేసుల్లో చిక్కుకున్న కార్యకర్తలకు సహాయం చేయడానికి   ఒక లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు.  ప్రమాదాలకు గురైన కార్యకర్తలకు సహాయం చేయడానికి మరో సెల్ ప్రారంభించారు.  మరణించిన పార్టీ కార్యకర్తల పిల్లల పిల్లలు హైదరాబాద్ మరియు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చి వారి చదువులకయ్యే మొత్తం వ్యయాన్ని పార్టీ భరించేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు.  నిజానికి దేశంలో ప్రప్రధమంగా పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిథి ఏర్పాటు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. అలా సంక్షేమ నిథి ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా నిలవాలన్న ఆలోచన లోకేష్ దే. తెలుగుదేశం కార్యకర్తలు, వారి కుటుంబాల కోసం, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడమే కాకుండా వాటన్నినీ నిరంతరంగా కొనసాగించేందుకు పటిష్టమయిన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా నారా లోకేష్ దే.  పార్టీ కార్యకర్తలకి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఆలోచనా ఆచరణా కూడా నారా లోకేష్ దే. పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ అండగా నిలవాలన్న సదుద్దేశంతో నారా లోకేష్ కార్యకర్తల కోసం పార్టీ నిలబడుతుందన్న విశ్వాసాన్ని వారిలో కలగచేశారు.  ఇప్పుడు తాజాగా కార్యకర్తల ప్రమాద బీమా మొత్తాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం సందర్భంగా పార్టీ తరఫున ఆయన 42 కోట్లు బీమా కంపెనీకి చెల్లించారు.  తాజాగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు డ్రైవ్ కు అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ సభ్యుల సంఖ్య కోటికి చేరింది. ఈ కోటి మంది కార్యకర్తలకూ ప్రమాద బీమా సౌకర్యన్ని కల్పిస్తూ యునైటెడ్ ఇన్సూరెన్స్  కంపెనీతో ఒప్పందంపై నారా లోకేష్ బుధవారం (జనవరి 1) సంతకం చేశారు. ఒకేసారి 1 కోటి మంది కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ బీమా ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలులోకి వస్తుంది.   జనవరి 1, 2025 - డిసెంబర్ 31, 2025 మధ్య కాలంలో 1 కోటి మంది పార్టీ కార్యకర్తలకు టిడిపి మొదటి దశలో రూ. 42 కోట్లు కేటాయించింది. ఈ ఒప్పందం ప్రకారం, టిడిపి కార్యకర్తలు ప్రమాద కవరేజీ కోసం ఐదు లక్షల రూపాయలు పొందే అవకాశం కలిగింది.  కార్యకర్తల కోసం పార్టీ నిలబడేలా చేసి.. తద్వారా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడేలా చేసింది నారా లోకేష్ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం లేదు.  

అడ్డంగా దొరికిపోయిన పేర్ని నాని.. ఇక శ్రీకృష్ణజన్మస్థానమే!

రేష‌న్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని మెడ‌కు ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హ‌స్తం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. తెర‌వెనుక ఉండి ఆయ‌నే రేష‌న్ బియ్యాన్ని మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు త‌ర‌లించిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు గుర్తించారు. దీనికితోడు జ‌య‌సుధ‌ను విచారించిన స‌మ‌యంలోనూ, కేసులో ఉన్న మ‌రో నలుగురిని విచారించిన స‌మ‌యంలోనూ పేర్ని నాని పేరును ప్ర‌ముఖంగా వారు ప్ర‌స్తావించార‌ట‌. దీంతో పేర్ని నానిని అరెస్టుచేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో రంగం సిద్ధంచేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ6 ముద్దాయిగా ఉన్న పేర్ని నాని.. అరెస్టు చేయొద్దంటూ కోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, వ‌చ్చే సోమ‌వారం బెయిల్ పిటిష‌న్‌పై మ‌రోసారి కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత పేర్ని నాని అరెస్టు ఖాయ‌మ‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలాఉంటే పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు గురించి విచారిస్తున్న క్ర‌మంలో పోలీసులు మ‌రికొన్ని వివ‌రాల‌ను సేక‌రించారు. ఇత‌ర జిల్లాల్లోనూ కొంద‌రు వైసీపీ నేత‌లు గోదాముల్లో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా కాకినాడ పోర్టుకు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌డితే మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు సైతం జైలు ఊచలు లెక్కించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది.     వైసీపీ హ‌యాంలో త‌న స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట పేర్ని నాని గోదాముల‌ను నిర్మించారు. ఆ గోదాముల‌ను పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు అద్దెకు ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గోదాములో అధికారులు త‌నిఖీలు నిర్వహించగా.. పెద్ద ఎత్తున బియ్యం నిల్వ‌ల్లో తేడాలు ఉన్న‌ట్లు గుర్తించారు. భారీ మొత్తంలో బియ్యం మాయ‌మైన‌ట్లు నిర్దార‌ణ‌కు వ‌చ్చిన‌ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గోదాము యాజ‌మాని పేర్ని జ‌య‌సుధ‌, గోదాము మేనేజ‌ర్ మ‌న‌స తేజ్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి కోటిరెడ్డితో పాటు మ‌రో ఇద్ద‌రిపై పోలీసులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశారు. మాన‌స‌త్ తేజ్‌, కోటిరెడ్డితోపాటు మ‌రో ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు 25ల‌క్ష‌ల నుంచి 30 ల‌క్ష‌ల మేర లావాదేవీలు జ‌రిగిన‌ట్లు, పేర్ని నాని కుటుంబ స‌భ్యుల బ్యాంకు ఖాతాల‌కు కూడా మాన‌స్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి ల‌క్ష‌ల్లో లావాదేవీలు జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అయితే, తేడా వ‌చ్చిన రేష‌న్ బియ్యం మొత్తానికి డ‌బ్బులు చెల్లిస్తామ‌ని పేర్ని నాని కుటుంబం అధికారుల‌కు లేఖ రాసింది. రూ.3.37 కోట్ల‌కుపైగా విలువైన బియ్యం మాయ‌మైంద‌ని అధికారులు అంచ‌నాకు వ‌చ్చారు. తొలుత రూ.1.70కోట్లు చెల్లించాల‌ని సూచించ‌గా.. పేర్నినాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించింది. మూడు రోజుల కిందట మరో రూ.1.67 కోట్లు చెల్లించాల‌ని అధికారులు పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న జ‌య‌సుధ కోర్టు ద్వారా ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఉన్న మాన‌స్ తేజ్‌, కోటిరెడ్డి, లారీ డ్రైవ‌ర్ మంగారావు, రైస్ మిల్ల‌ర్ ఆంజ‌నేయులును పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అనంత‌రం సోమ‌వారం రాత్రి కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా.. కోర్టు వారికి 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో వారిని  మ‌చిలీప‌ట్నం స‌బ్ జైలుకు త‌ర‌లించారు.   విచారణలో వీరు  గోదాములో బియ్యం మాయం వెనుక పేర్ని నాని ప్ర‌మేయం ఉంద‌ని  స్ప‌ష్టం చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఏ6గా చేర్చారు. ఎఫ్ఆర్ఐ న‌మోదు చేయ‌గా.. నాని అరెస్టు అవుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. వ‌చ్చే సోమ‌వారం వ‌ర‌కు నానిని అరెస్టు చేయొద్ద‌ని కోర్టు పోలీసుల‌కు అదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో సోమ‌వారం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌కు సూచించింది.  అంతే కాకుండా బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జ‌య‌సుధకు పోలీసులు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు. దీంతో ఆమె బుధ‌వారం మ‌ధ్యాహ్నం  విచారణ నిమిత్తం ఆర్ పేట పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చారు. రెండు గంట‌ల‌కుపైగా పోలీసులు ఆమెను విచారించారు. ఇదిలా ఉంటే.. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది.  మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించలేదు. స్టేషన్ బయటే ఆపివేశారు. అయితే, స్టేష‌న్ బ‌య‌ట వైసీపీ శ్రేణులు పెద్ద హంగామానే చేశారు. మా మేడమ్ ను ఇంత‌సేపు విచారిస్తారా అంటూ పోలీసుల‌పై నోరుపారేసుకున్నారు. రెండు గంట‌ల‌కుపైగా జ‌యసుధ‌ను విచారించిన పోలీసులు కీల‌క విష‌యాల‌ను రాబ‌ట్టారు. పేర్ని జ‌య‌సుధ‌ను విచారించిన త‌రువాత‌.. గోదాములో రేష‌న్‌ బియ్యం మాయం వ్య‌వ‌హారం వెనుక క‌థ న‌డిపింది పేర్ని నాని అని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రేష‌న్ బియ్యాన్ని మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కాకినాడ‌కు త‌ర‌లించార‌ని పోలీసులు గుర్తించారు. దీంతో తీగ‌ లాగితే డొంక క‌దిలిన‌ట్లు కాకినాడ పోర్టులో రేష‌న్ బియ్యం దందా సైతం క్ర‌మంగా వెలుగులోకి వ‌స్తుంది. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. మ‌రోవైపు ఈ కేసులో పేర్ని నానిని అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. వారం రోజుల్లో పేర్ని నానిని అరెస్టు చేసి జైలు పంపించ‌డం ఖాయ‌మ‌ని, పోలీసుల‌కు నాని అడ్డంగా దొరికిపోయారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. మొత్తానికి రేష‌న్‌ బియ్యం మాయం కేసులో పేర్ని నాని మెడ‌కు ఉచ్చు బ‌లంగా బిగుసుకుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరు కానున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ ఐదు రోజుల పాటు దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 21నుంచి 23 వరకూ మూడు రోజుల పనాటు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా దోవోస్ కంటే ముందు  ఆస్ట్రేలియా, సింగపూర్ లలో పర్యటించనున్నారు.  ఈ నెల 15 నుంచి 19 వరకూ ఐదు రోజుల పాటు అధికారుల బృందంతో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.  అనంతరం 19నే సింగపూర్ చేరుకుంటారు. 19, 20 తేదీలలో సింగపూర్ లోపర్యటిస్తారు. అనంతరం దావోస్ వెడతారు. మంత్రి రేవంత్ రెడ్డి వెంట ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ ఇతర ఉన్నతాధికారులు ఉంటారు.    

దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు

దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఇందు కోసం ఆయన ఈ నెల 19న దావోస్ కు బయలుదేరి వెడతారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో అధికారుల బృందం హాజరు కానుంది. ఈ బృందంలో మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. సీఎం వెంట రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు అధికారులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా దోవోస్ కు బయలుదేరుతున్న బృందంలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా చంద్రబాబు రాష్ట్రంలో వనరులు, పెట్టుబడులకు అన్న అవకాశాలను పెట్టుబడి దారులకు వివరించనున్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన ఉండనుంది.  

ఏపీకి తెలుగు సినీ పరిశ్రమ.. ఇప్పుడప్పుడే కాదు!

పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్క సారిగా హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ పట్ల చిన్న చూపుతో వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భేటీ అయిన తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చినప్పటికీ.. పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందన్న చర్చ మాత్రం ఆగలేదు. ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ ను తెలుగు సినీ పరిశ్రమకు హబ్ గా మారింది. అలా మారడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివస్తే... ఆయన నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్న భావన అందరిలోనూ నెలకొని ఉంది. అంతే కాకుండా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు, అలాగే  జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ స్వయంగా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి. మెగా పవర్ స్టార్ గా ఆయనకు ప్రేక్షకులలో తిరుగులేని ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సిని పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడానికే మొగ్గు చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషించారు.  అయితే పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని చంద్రబాబు కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమపై కూడా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిరావడంపై తాను పెద్దగా దృష్టి పెట్టడం లేదని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తైతే షూటింగుల కోసం వారే ఇక్కడకు వస్తారని ఆయన చెప్పారు. అయితే రాష్ట్రాలుగా విడిపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రయోజనాలే తనకు ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. అయినా హైదరాబాద్ లో తెలుగు పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను చేసిన కృషి కూడా ఒక కారణమన్న ఆయన   తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ పరిశ్రమ అయినా ఒక రాష్ట్రం నుంచి తీసేసి మరో రాష్ట్రానికి తరలించడం అనేది అంత తేలిక కాదన్న చంద్రబాబు నాయుడుఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చాలా కాలం పడుతుందని, వాటిని కల్పించిన తరువాతే పరిశ్రమను ఏపీకి ఆహ్వానించడంపై ఆలోచిస్తాననీ, ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదని విస్పష్టంగా చెప్పారు.  

టాలీవుడ్.. రేవంత్ సర్కార్ మధ్య గ్యాప్ తగ్గినట్లేనా?

సినీ పరిశ్రమ వర్సెస్ రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయిందా? అన్న ప్రశ్నకు ఔనన్న సమాధానమే వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచే బీఆర్ఎస్ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాన్ని ఎగదోసి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు సినీ పరిశ్రమ నుంచే వస్తున్నాయి. ఇంత కాలం సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన, తదననంతర పరిణామాలు అంటే.. అల్లు అర్జున్ అరెస్టు, కొత్త సినిమాలకు ప్రీమియర్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి నిరాకరణ వంటి సంఘటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే రేవంత్ టార్గెట్ గా ఈ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగా మారాయి.  పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మరచిపోయారనీ, ప్రముఖులకే రేవంత్ ఎవరో తెలియని పరిస్థితి ఉంటే ఇక సామాన్యులకు ఆయన ఎలా తెలుస్తారనీ కేటీఆర్ చేసి వ్యాఖ్యలు సినీ పరిశ్రమ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అంతే కాకుండా సినీ ప్రముఖులతో భేటీలో రేవంత్ సూటిగానే పరిశ్రమను అడ్డు పెట్టుకుని కేటీఆర్ తనను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలకు పరిశ్రమ పెద్దల నుంచి కౌంటర్ ఎందుకు రావడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నకు సినీ ప్రముఖల వద్ద నుంచి సమాధానం లేకుండా పోయింది.  అయితే ఆ భేటీ తరువాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీటుగా సమాధానం ఇచ్చారు.  సినీ పరిశ్రమను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని కేటీఆర్ కు దిల్ రాజు చాలా స్పష్టంగా చెప్పారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన  సమావేశం  పూర్తి సుహృద్భావ వాతావ రణంలో జరిగిందని స్పష్టం చేసిన దిల్ రాజు.. అనవసర వివాదాల్లోకి సినీ పరశ్రమను లాడగం మంచిది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమను అడ్డం పెట్టుకోవద్దని ఒకింత ఘాటుగానే చెప్పారు. దిల్ రాజు ప్రకటన తరువాత సినీ పరిశ్రమలో ఒకింద ధీమా వ్యక్తం అవుతోంది. దిల్ రాజు వినా మిగిలిన సినీ ప్రముఖులెవరూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించలేదు. అలాగే దిల్ రాజు ప్రకటనను స్వాగతిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. దీనిని బట్టే కేటీఆర్ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న విషయం తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా సీఎం రేవంత్ తో భేటీ సందర్భంగా ఆ భేటీకి హాజరైన సినీ ప్రముఖులంతా పోటీలు పడి రేవంత్ పై ప్రశంసలు కురిపించడమే బీఆర్ఎస్, కేటీఆర్ అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని చాటినట్లైందని అంటున్నారు.   ఇక అన్నిటి కంటే ప్రముఖంగా చెప్పుకోవలసినదేమిటంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్ తో సినీ పరిశ్రమకు, రేవంత్ సర్కార్ కు ఉన్న గ్యాప్ తగ్గిపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే సినీపరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా సమస్యల పరిష్కారినికి ఒక వేదికను ఏర్పాటు చేసే బాధ్యతను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు తీసుకున్నట్లైంది. ఇటు ప్రభుత్వం తరఫునా, అటు సినీ పరిశ్రమ తరఫునా కూడా తన వాయిస్ ను వినిపించడానికి ఆయన ఎటువంటి భేషజాలూ లేకుండా ముందుకు వచ్చారు. పరిశ్రమకు కావలసినవి ప్రభుత్వం ముందు ఉంచడంతో పాటు, ప్రభుత్వం పరిశ్రమ విషయంలో ఏ చేయాలని అనుకుంటోందన్నది పరిశ్రమ పెద్దలకు స్పష్టం చేశారు.  దీంతో ముందు ముందు సినీపరిశ్రమ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలతో పాటు పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే వాతావరణాన్ని దిల్ రాజు కల్పించారన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాలలోనే కాకుండా పరిశీలకుల నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 

సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు... తెలంగాణ ఇలా.. ఏపీ అలా!

తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాలు విడుదలౌతున్నాయంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే పండగ శోభకు కొత్త సొబగులు అద్దినట్లే ఉంటుంది. ఇక కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల ధరల పుంపు మామూలే. అయితే పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆ సినిమా హీరో అల్లు అర్జున్ వైఖరినీ, అరెస్టై మధ్యంతర బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి జాతరలా వెళ్లిన సినీ ప్రముఖులనూ తప్పు పట్టారు. తాను సీఎంగా ఉన్నంత వరకూ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా తెలుగుసినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పుంపు లేకపోతే.. కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమాల పెట్టుబడులు వెనక్కు వచ్చే అవకాశాలు మృగ్యమన్న ఆందోళన సినీ పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అయ్యింది. దీంతో తెలంగాణ సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ తరువాత కూడా రేవంత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రశక్తే లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అదే సమయంలో రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.  సరే తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతించారు. దీంతో ఏపీలో కూడా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు బ్రేక్ పడినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. కానీ ఏపీ సర్కార్ తెలుగుసినీ పరిశ్రమకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  సంక్రాంతికి రాబోతున్న మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది.   ఈ సంక్రాంతికి విడుదలౌతున్న మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు వాటి వాటి బడ్జెట్ ను బట్టి  టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌  బడ్జెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు కావడంతో ఆ సినిమాకి  మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లో రూ.135, మల్టీప్లెక్స్‌ల్లో రూ.175లు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. అలాగే పరిమిత సంఖ్యలో బెనిఫిట్‌ షోలకూ అనుమతించి, బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లను రూ.600లుగా నిర్ణయించింది. అదే విధంగా బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో   నిర్మించిన డాకు మహారాజ్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి దక్కింది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.110లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ..135లు పెంపునకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అలాగే బెనిఫిట్‌ షోలకు టికెట్ రేటు 500రూపాయలుగా ఫిక్స్ చేసింది. అలాగే వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.75లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూడు సినిమాలకు ఏపీ ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని చెప్పాలి.  మొత్తంగా కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో సంక్రాతి సినిమాలకు తెలంగాణలో తక్కువ కలెక్షన్లు, ఏపీలో అధిక కలెక్షన్లు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమకు శరాఘాతంగా మారితే.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమ వర్గాలకు కొండంత ఊరట చేకూర్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తిరుమలలో లాగే అమరాతి వేంకటేశ్వర స్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద టీటీడీ నిర్మించిన  శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో   జె.శ్యామల రావు మంగళవారం (డిసెంబర్ 31) సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రోజువారి  రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వివరాలను, ఇతర కార్యక్రమాలను ఈవోకు అధికారులు తెలియజేశారు.   తిరుమలలో జరుగుతున్న విధంగానే అమరావతి ఆలయంలోనూ శ్రీవారి రోజువారీ సేవలు జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆలయ అధికారులను ఆదేశించారు.   టిటిడి సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈవో శ్యామలరావు ఈ సందర్భంగా ఆదేశించారు. ఆలయానికి సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు ఆలయానికి ఈవో చేరుకోగానే సాంప్రదాయ బద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఇఇ నాగభూషణం, సూపరెంటెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇస్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరిలో వైసీపీ గాయెబ్!

మంగళగిరి నియోజకవర్గంలో  ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వైసీపీ నాయకుడు కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఏమంత పట్టు లేని నియోజకవర్గం ఇది. 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి తరువాత నుంచీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ పని చేశారు. ఆయన శ్రమ, కృషి ఫలించింది. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారిపోయింది. 2024 ఎన్నికలలో లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంత వరకూ నియోజకవర్గంలో తోపులం మేమే అంటూ బోర విరుచుకు తిరిగిన వైసీపీ నేతలంతా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ఈ నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది. నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంగానే జగన్ నివాసం ఉంది. పార్టీ కార్యాలయం కూడా అదే.  అలాంటి మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ తరఫున పని చేయడానికి నాయకుడూ, కార్యకర్తా కూడా కనిపించని పరిస్థితి ఉంది. అలాంటి చోట‌. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో వైసీపీ ఫేస్ గా ఫోజులు కొడుతూ తిరిగిన వారంతా ఎంత తొందరగా వైసీపీకి గుడ్ బై కొడితే అంత మేలు అన్నట్లుగా మారిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా, లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య.. ఓటమి తరువాత కనిపించడం లేదు. ఆమె అజాపజా లేదు. ఆమె మావ మురుగుడు హనుమంతరావు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నా... ఏ మాత్రం క్రియాశీలంగా లేరు. ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అటు నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా దూకేద్దామన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి 2024కు ముందు వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అలియాస్ కరకట్ట కమల్ హసన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక వీరు కాకుండా వైసీపీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన గంజి చిరంజీవి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడినా గంజి చిరంజీవి వైసీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన వైఖరి మారింది. పార్టీకి దూరం జరగడమే కాదు.. జనసేనకు దగ్గరయ్యారు. అతి కష్టం మీద పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది జనసేన గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంప్టీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలను నడిపించే వారు కాదుకదా అసలా పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి ఉంది.  అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గంలో రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజాదర్బార్ లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి వారికీ నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో జనం స్వచ్ఛందంగా ఆయన నాయకత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 75 వేల మంది కొత్తగా తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు గడువు ముగిసే సరికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి రద్దీని తట్టుకునేలా  6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిలో 557 సర్వీసు లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.  గత ఏడాది టీజీ ఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా  4,484 ప్రత్యేక బస్సుల నడపాలని నిర్ణయించినప్పటికీ, ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉండటతో ఆ సంఖ్యలు  5246 బస్సులను సంస్థ నడిపింది. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు   అందుబాటులో ఉంటాయి.  హైదరాబాద్ లో   ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.  హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ, కందుకూరు, అమలాపురం, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి లకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి.  అలాగే ఏపీ నుంచి పండుగ అనంతరం తిరుగు ప్రయాణం అయ్యేవారి కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.   రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని టీజీఆర్టీసీ తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించింది. 

తిరుమలలో తాచుపాము హల్ చల్.. కొత్త సంవత్సరంలో కంగారుపెట్టిన సర్పం

కొత్త సంవత్సరానికి తిరుమలలో ఓ నాగుపాము స్వాగతం చెప్పింది. బుసలు కొడుతూ ఊగిపోతున్న ఆ తాచుపామును చూసి భక్తులు భయకంపితులయ్యారు. బుధవారం (జనవరి 1) ఉదయం తిరుమల  రాంబగిచా గెస్ట్ హౌస్ దగ్గర ఓ తాచుపాము హల్ చల్ చేసింది. దాదాపు ఆరు అడుగులు ఉన్న ఈ పాము బుసలు కొడుతూ ఊగిపోతుండటంతో భక్తులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతడు వెంటనే రంగంలోకి దిగి అతి కష్టం మీద ఆ తాచుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం జనంలో సందడిగా ఉండే రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్ద నాగుపాము హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.  

రేవంత్ ఎఫెక్ట్.. సోషల్ అవేర్ నెస్ వీడియోలు చేస్తున్న సినీ స్టార్స్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు తన స్థానం ఏమిటో చూపించారు. ఆయన దెబ్బకు స్టార్లు దిగి వచ్చారు. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుతో రాత్రికి రాత్రి సినిమాకు పెట్టిన ఖర్చంతా రాబట్టేసుకోవడమే వ్యాపారం అనుకుంటూ వస్తున్న టాలీవుడ్ స్టార్లకు సామాజిక బాధ్యత మరిస్తే సహించేది లేదన్న స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన దెబ్బకు టాలీవుడ్ పరిశ్రమ కాళ్లు నేల మీద ఆన్చింది. రేవంత్ రెడ్డి ఇలా చెప్పారో లేదో అలా ఇద్దరు స్టార్లు సోషల్ అవేర్ నెస్ కలిగేలా వీడియోలు చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   వారిలో ఒకరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ వీడియో చేశారు. దాదాపు 28 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రభాస్ ప్రజలు, ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దంటూ పిలుపు నిచ్చారు.  మరో స్టార్ అప్ కమింగ్ హీరోయిన్ శ్రీ లీల. ఆమె కూడా దాదాపు 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. వ్యూస్, లైక్ ల కోసం మరొకరిపై బురద జల్లోదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాన్ని సమాజానికి మేలు జరిగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, అందరూ సామాజిక బాధ్యతను అలవరచుకోవాలని శ్రీలీల తన వీడియోలో పిలుపునిచ్చారు.   ఇంత హఠాత్తుగా సీనీజనంలో పరివర్తన రావడానికి కారణం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు, సినీ ప్రముఖులు సమాజంలో అవేర్ నెస్ పెంచే దిశగా ప్రకటనలు చేయాలని ఇచ్చిన పిలుపే అనడంలో సందేహం లేదు.  పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు  సంధ్యా ధియేటర్లో ప్రీమియర్ షో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం,   అదే తొక్కిసలాటలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.  ఆ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత మధ్యంతర బెయిలుపై ఆయన బయటకు వచ్చారు అది వేరే సంగతి. ఈ ఘటనపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి  తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, ప్రీమియర్ షోలుండవని, సినిమా టికెట్ల రేట్లు పెంపు కూడా ఉండదని ప్రకటించారు. రేవంత్ ప్రటకనతో సినిమాపరిశ్రమ ఒక్కసారిగా షేక్ అయిపోయింది.  ఆ తరువాత ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో కొందరు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. రేవంత్ ను ప్రసన్నం చేసుకుని ప్రీమియర్ షోలు, టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేలా ఆయనను ఇన్ ఫ్లుయెన్స్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగింది. అయితే  ఆ భేటీలో సినీ ప్రముఖులు తాము కోరుకున్నది సాధించుకోలేకపోవడం అటుంచి, వారికి రేవంత్ గట్టిగా క్లాస్ పీకారు.  టాలీవుడ్ స్టార్లకు సామాజికబాద్యత లేదా అని నిలదీశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు ఎందుకు నోరు విప్పటంలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ కంట్రోల్ కు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సినీపరిశ్రమ మద్దతుగా నిలబడి తీరాలన్నారు. ఇందుకు  భేటీలో పాల్గొన్న సినీ ప్రముఖులు అంగీకరించారు.   ప్రభాస్, శ్రీలీలల సోషల్ అవేర్ నెస్ వీడియోలు దానికి ఫాలో అప్ గానే చూడాల్సి ఉంటుంది.   ముందు ముందు మరింత మంది స్టార్ హీరోల నుంచి ఇటువంటి వీడియోలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఎటూ లేకుండా పోయింది. రేవంత్ ను మెప్పించి ఆ తరువాతైనా వీటిని సాధించుకోవాలన్న భావనతో టాలీవుడ్ పరిశ్రమ ఉందని అంటున్నారు.  

ఉద్యోగులకు సంక్రాతి కానుక!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా రెండు డీఏలను ప్రకటించనుంది. గురువారం (జనవరి 2)వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశాలుగా భావిస్తున్న   పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులపై కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా చర్చించి  నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉగాది నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సీఎం దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన రంజాన్, సంక్రాంతి, క్రిస్ మస్ కానుకలను తిరిగి ప్రారంభించే విషయంపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.  ఇక ఉద్యోగులకు కూడా సంక్రాంతి కానుకగా రెండు డిఏలను ప్రకటించే విషయంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.  అలాగే పేరివిజన్ కమిషన్, ఇంటీరియమ్ రిలీఫ్ లపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.  

తెలంగాణ పంచాయతీ ఎన్నికల బరిలో తెలుగుదేశం?.. చంద్రబాబు వ్యూహమేంటి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారింది. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డులు సృష్టించింది. జగన్ ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలూ పడిన జనం స్వచ్ఛందంగా తెలుగుదేశం సభ్యత్వం కోసం క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ గతంలో ఎన్నడూ లేనంత అధికంగా తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్పందన లభించింది. దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అంతగా పట్టు లేదని భావించే రాయలసీమ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలంగా మారింది. దీంతో ఆ పార్టీ అధినేత ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఆ రాష్ట్రంలో కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.   ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండీ సీఎం చంద్రబాబు   తెలంగాణ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.   తెలంగాణలో నిర్వహించిన పార్టీ  సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన లభించింది. వాస్తవానికి తెలంగాణలో పార్టీకి క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ బలం ఉంది. క్యాడర్ ఉంది. రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే  దానిని క్రియాశీలంగా మార్చేందుకు అవసరమైన నాయకత్వం మాత్రం కరవైంది. రాష్ట్ర విభజన తరువాత పార్టీని నేతలు వీడికా క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందని పరిశీలకులు పలు సందర్భాలలో సోదాహరణగా విశ్లేషణలు చేశారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలుగుదేశం క్యాడర్ ది చాలా కీలకమైన పాత్ర అని పరిశీలకుల భావన.  ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా తెలంగాణపై దృష్టి సారించడంతో ఇంత కాలం వేరే వేరే పార్టీలలో ఉన్న నేతలు ఒకరి తరువాత ఒకరుగా తెలుగుదేశం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలు ఇప్పటికే బాహాటంగా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే మాజీ మంత్రి బాబూమోహన్ సైతం తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇక  తాజా నివేదికల ప్రకారం, ఫిబ్రవరి నెలలో జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయడానికి సమాయత్తమౌతోంది. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, అటు పిమ్మట 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పోటీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందు కోసం త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనం గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్,  రాబిన్ శర్మలతో చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో  గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కేడర్   బలంగా ఉందని, అయితే క్యాడర్ కు దిశానిర్దేశం చేసే నాయకత్వమే కరవనీ తేలింది. దీంతో ఆ కొరతను తీర్చేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని అంటున్నారు.  ఇందు కోసం రాష్ట్ర విభజన తర్వాత వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీల పంచన చేరిన నాయకులను సొంత గూటికి చేరేందుకు తలుపులు బార్లా తెరిచినట్లు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. మాజీలంతా తెలుగుదేశం గూటికి చేరితే రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తథ్యమని అంటున్నారు. 

ఏడాది పాలనలో కానరాని రేవంత్ ముద్ర!

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీని విజయపథంలో నడిపించి, విజయం తరువాత అధిష్ఠానం ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలకు దాదాపుగా చరమగీతం పాడేశారు. సీఎంగా ఆయనకు పార్టీ నుంచీ, మంత్రివర్గ సహచరుల నుంచీ సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సాధించిన అతి గొప్ప విజయాలలో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. చివరి క్షణం వరకూ ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ తో పోటీ పడిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేవంత్ కేబినెట్ లో కీలక పదవులలో ఉన్నారు. రేవంత్ నాయకత్వంలో వారు అరమరకలు లేకుండా పని చేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించి పని చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర కాంగ్రెస్ లో ఐకమత్యం కనిపిస్తోంది. ఇంతటి సానుకూల వాతావరణంలో రేవంత్ తనదైన దూకుడుతో పాలనలో తనదైన ముద్ర వేస్తారని అంతా భావించారు.  అయితే తన ఏడాది పాలనలో రేవంత్ అటువంటి ముద్ర వేయడంలో విఫలమైనారన్నదే పరిశీలకుల విశ్లేషణ. రేవంత్ ఏడాది పాలనలో పెద్దగా ఘనతలు ఏమీ లేవని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయారు.  అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూడా  ఆయన అడుగులు తడబడుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ పూర్తిగా సక్సెస్ కాలేదు.  కొన్ని పథకాలు ప్రారంభమయ్యాయి కానీ లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని, చాలా మంది ఇబ్బందులు పడ్డారని విమర్శలు వచ్చాయి. అలాగే ఎన్నికలకు ముందు దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం, అత్యంత ఖరీదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం నిరుపయోగంగా మారడం కూడా రేవంత్ పై విమర్శలకు తావిచ్చింది.  ఇక మేడిగడ్డ, కాళేశ్వరంలు పూర్తిగా నిరుపయోగంగా మారడానికి, తద్వారా కేసీఆర్ ను బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వాటిని పక్కన పెట్టేయడమే కారణమన్న విమర్శలూ గట్టిగా వినిపిస్తున్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రికి, హైదరాబాద్‌కు మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పెట్టుబడుల ఆకర్షణ చాలా ముఖ్యమైనవి. ఆ దిశగా ముందుకు సాగాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులలో కొనసాగింపు ఉంది కానీ రేవంత్ రెడ్డి ముద్రను సూచించే కొత్త ప్రాజెక్టులు ఏవీ ఈ ఏడాది కాలంలో ప్రారంభం కాలేదు. ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కూడా లేవు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా రేవంత్ పాలనా పగ్గాలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో పెద్దగా కదలిక లేదు.  ఇక పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఆ సినిమా హీరో అల్లు అర్జున్ పై కేసు, అరెస్టు విషయంలో రేవంత్ దూకుడుపై మిశ్రమ స్పందన వచ్చింది.   మొత్తం మీద 2024లో రేవంత్ పాలనలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

ఫణిగిరి బౌద్ధ శిల్పాలు అద్భుతం

కొనియాడిన విదేశీ బౌద్ధ పరిశోధకులు చరిత్రను వివరించిన శివనాగిరెడ్డి   నాగారం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల  దూరంలో ఉన్న రెండు వేల ఏళ్ల నాటి ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన విదేశీ బౌద్ధ పరిశోధకులు, స్థానిక ప్రదర్శనశాలలోని శిల్పాలను కొనియాడారని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, బుద్ధవనం కన్సల్టెంట్, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ సారా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా ఫణిగిరి కొండల పైనున్న బౌద్ధారామాన్ని మంగళవారం(డిసెంబర్ 31) సందర్శించారు.  స్థూపం, చైత్య గృహాలు, శిలామండపాలు, విహారాలు, స్థానిక ప్రదర్శనశాలలోని సిద్ధార్థుని జననం, మహాభినిష్క్రమణం, బుద్ధుని ధర్మ చక్రప్రవర్తన, జాతక కథల బుద్ధుని శిల్పాల గురించి ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. క్రీస్తుపూర్వం 1- క్రీస్తుశకం 4 శతాబ్దాల మధ్య ఫణిగిరి గొప్ప బౌద్ధ క్షేత్రం గా విలసిలిందని ఆయన వారికి చెప్పారు. సర్పంచ్ గట్టు నర్సింహారావు వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఫణిగిరి మ్యూజియం సిబ్బంది వీరయ్య, యాకయ్య, కార్తీక్ పాల్గొన్నారు.

కేసీఆర్ మౌనం.. ప్రభావం చూపని కేటీఆర్ నాయకత్వం.. జారుడుబండ మీద బీఆర్ఎస్!

తెలంగాణ సాధించిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2024 సంవత్సరం అత్యంత గడ్డుకాలంగా మిగిలిపోతుంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, ఆ తరువాత ఇప్పటి వరకూ కోలుకోలేదు సరికదా రోజు రోజుకూ దిగజారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినడానికి ప్రధాన కారణం ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోవడం, మరో వైపు ఆయన స్థానంలో పార్టీని ముందుండి నడిపిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎటువంటి ప్రభావం చూపలేకపోవడమేనని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరింత అధ్వానంగా పెర్ ఫార్మ చేసింది. ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ ఓటు బ్యాంకును కూడా భారీగా పోగొట్టుకుంది. కొన్ని స్థానాలలో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఇంత జరిగినా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగలేదు. అంతెందుకు ఆయన కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్టై చాలా రోజుల పాటు జైలులో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. పూర్తిగా తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ఈ కష్ట కాలంలో పార్టీని నడిపించిన కేటీఆర్ ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన ప్రకటనలు, ఆందోళనలు, విమర్శలు పెద్దగా ప్రజలను కదిలించలేదు. ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో కూడా సఫలీకృతుడు కాలేకపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ఠ కోసమే ఈ ఫార్ములా రేస్ అంటూ చెప్పుకువచ్చిన కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము బదలాయింపు విషయంలో మాత్రం తన తప్పు లేదని అధికారులపై నెట్టేసి తప్పుకోవడానికి చూడటం పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రైతులను కదిలించడంలో విఫలమయ్యాయి. ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా కేసు నమోదు చేసి కేటీఆర్ కు నోటీసులు పంపింది. ఈ కేసులో ఫెమా, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, నిబంధనలను తుంగలో తొక్కి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వాహకులకు అక్రమ చెల్లింపులు జరిగాయనీ ఆధారాలు ఉన్నాయనీ ఈడీ చెబుతోంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని పార్టీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతోంది.