అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు కాసేపట్లో...

సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.   పూచీ కత్తుకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నారు. చెరో 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని  కోర్టు ఆదేశించింది. రెండు నెలల పాటు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యలను , కేసును ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45   నివాసం నుంచి బయలు దేరినట్టు సమాచారం. 

ఐదు పదుల వయసులో  నడి సంద్రంలో  గోలి శ్యామల  సాహసయాత్ర  

సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల కేవలం గృహిణి మాత్రమే . కనీసం స్విమ్మర్ కూడా కాని ఆమె విశాఖ ఆర్ కె బీచ్ నుంచి కాకినాడ తీరం వరకు ఈది సంచలనం సృష్టించారు.  దాదాపు 150  కిలోమీటర్లు  ఐదురోజుల్లో ఈది అరుదైన రికార్డు సాధించారు.  రోజుకు 30 కిలోమీటర్లు టార్గెట్ గా ఆమె ఈత కొట్టారు. సముద్ర కెరటాల మీద ఈత కొట్టడం అంత ఆషామాషీ కాదు. హైద్రాబాద్ లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు ఆమె పని చేశారు. దురదృష్ట వశాత్తు బాగా నష్టపోయారు. ఆర్థికంగా పూర్తిగా  చితికి పోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. మైండ్ డైవెర్షన్ కోసం స్విమ్మింగ్ నేర్చుకుని అదే స్విమ్మింగ్ మీద అరుదైన రికార్డు చేరుకోవడం గమనార్హం.  డిప్రెషన్ లో ఉన్నప్పుడు కోచ్ జాన్ సిద్దిఖీ ఆమెకు స్విమ్మింగ్ నేర్పించాడు. జీరో లెవెల్ నుంచి కెరీర్ ప్రారంభించి 150 కిలో మీటర్లు సముద్రంలో చేరుకోవడం ఆసియా స్థాయిలో సాధించిన ఘనత అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 28 కి ముందు వాతావరణం అనుకూలించక ఈ  సాహస యాత్రను రెండు పర్యాయాలు వాయిదా వేసుకున్నారు. తర్వాత వాతావరణం అనుకూలించడంతో విశాఖ ఆర్కే బీచ్ లో సముద్రంలో దూకి కాకినాడ గడ్డపై తేలారు.  2021లో ఆమె  శ్రీలంక నుంచి ఇండియావరకు రామసేతు  దాటానని గోలి శ్యామల చెప్పారు. ఈ యేడు ఫిబ్రవరిలో లక్ష్య ద్వీప్ లో 18 గంటలపాటు 48 కిలో మీటర్లు ఆమె స్విమ్ చేసారు.  బంగాళా ఖాతంలో స్విమ్ చేయాలని ఆమె రెండేళ్ల క్రితమే కలలు కని సాకారం చేశారు. ఒక ఫిషింగ్ బోట్ లో ఇద్దరు స్కూపర్ డ్రైవర్లతో ఈ సాహస యాత్ర చేశారు.  మహిళలకు ఈత కంపల్సరీ అని గోలిశ్యామల చెబుతున్నారు. గైనిక్ సమస్యలను బాధపడుతున్న వారికి ఈత చక్కటి ఉపశమనం అని ఆమె చెబుతున్నారు. స్విమ్ ను స్పోర్ట్స్ గా కాకుండా సర్వైకల్ స్పోర్ట్స్ గా బలంగా నమ్మే గోలి శ్యామల భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు.    గోలి శ్యామల ఈత నేర్చుకునే సమయంలో చాలామంది హేళన చేశారు. అయినా ఆమె పట్టించుకోలేదు. అపజయం నుంచి విజయం అందుకున్న వీర వనిత గోలి శ్యామల. 

విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో ఉక్కపోతే మిగిలింది. వణికించేస్తున్న చలిలో కూడా ఆయనను ఉక్కపోత వేధిస్తున్నట్లుంది. జనవరి చివరి వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానంటూ ఆయన చేసిన ప్రకటనకు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన పర్యటనలను వాయిదా వేసుకుని హడావుడిగా విదేశీయానానికి రెడీ అయిపోయారు. సంక్రాంతి కంటే ముందుగానే ఆయన లండన్ వెళ్లాలని భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఆయన ఈ నెల 11న లండన్ బయలుదేరి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే ఆయన అనుకున్నంత మాత్రాన విదేశీ పర్యటనకు వెళ్లగలిగే వెసులుబాటు ఆయనకు లేదు. ఆయన అక్రమాస్తుల కేసులో బెయిలుపై ఉన్నారు. అందుకే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే అందుకు సీబీఐ కోర్టు అనుమతి తప్పని సరి. అందుకే ఆయన ఇప్పుడు సీబీఐ కోర్టులో ఈ నెల 11 నుంచి 25 వరకూ యూకేలో ఉన్నత చదువులు చదువుతున్న తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన పిటిషన్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత జగన్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతాయి. ఆ తరువాతే జగన్ కు విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చేదీ లేనిదీ కోర్టు నిర్ణయిస్తుంది.     గతంలో కూడా జగన్ తన విదేశీ పర్యటనలకు ముందుగా కోర్టు అనుమతి పొందిన సంగతి విదితమే. గత ఏడాది ఏపీలో ఎన్నికల తరువాత ఫలితాలు వెలువడక ముందేజగన్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు.  ఇప్పుడు మరోసారి ఆయన తన కుమార్తెల వద్దకు వెళ్లడానికి కోర్టు అనుమతి కోరారు. అయితే ఈ సారి జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలుపుతూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో లేకపోవడం, జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇప్పటికే సుప్రీం సీబీఐకి విస్పష్ట ఆదేశాలు జారీ చేసినందున ఆయన విదేశీ పర్యటనకు అనుమతి లభించడం అంత సులువుకాదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ పండుగ వేళ ఏపీని వదిలి విదేశాలకు వెళ్లాలనుకోవడం చూస్తుంటే ఆయన రాష్ట్రంలో వైసీపీని బలోపేతం చేయాలన్న ఉద్దేశానికి తిలోదకాలిచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ ఆటలో అరటిపండేనా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులలో షెడ్యూల్ వెలువడనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆప్, బీజేపీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చాలా వరకూ పూర్తి చేయడమే కాకుండా, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు ఇంకా సమాయత్తమైనట్లు కనిపించడం లేదు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించాలంటూ ఆప్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయన్న విషయాన్ని తేటతెల్లం చేసేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ పరిస్థితి ఆటలో అరటిపండులా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన పోటీ ఆప్, బీజేపీల మధ్యే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.  గత దశాబ్దంగా ఢిల్లీ పీఠం అప్ చేతిలోనే ఉంది. దీంతో బీజేపీ ఆప్ లక్ష్యంగా వ్యూహాలు రచించి అందుకు అనుగుణంగా తన ప్రచార ప్రణాళికను రచించుకుంటోంది. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విషయంలో పూర్తిగా మోడీ కరిష్మాపైనే ఆధారపడిందనడంలో సందేహం లేదు. హిందుత్వ అజెండాను ప్రముఖంగా తెరపైకి తీసుకురావడం, అలాగే ఆప్ అవినీతి పార్టీ అంటూ చాటడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఆప్ యమున ప్రక్షాళనకు వ్యతిరేకం అంటూ ఉద్ఘాటించడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు అరెస్టైన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంపైనే బీజేపీ దృష్టి పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే ప్రధాని మోడీ తన ప్రచార శంఖారావాన్ని పూరించారు.  ప్రధాని మోడీ శుక్రవారం (జనవరి 3)న ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీలో కేంద్రం నిర్మించిన గృహాలను పేదలకు పంపిణీ చేయడం కోసం చేసిన ఈ పర్యటనను ఆయన ఎన్నికల ప్రచారం కోసం పూర్తిగా వాడుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందనీ, స్వయంగా ఆ పార్టీ అగ్రనేతలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారనీ విమర్శలు గుప్పించారు.  గుజరాత్ వ్యాపారి ఇచ్చిన పది లక్షల రూపాయల విలువైన సూటు ధరించారనీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో బాగంగా ప్రధాని తన నివాసాన్ని నిర్మించుకున్నారనీ ఘాటు విమర్శలు చేశారు. ఆ విమర్శలు, ప్రతి విమర్శలతో శీతాకాలంలో వణికించే చలిలో కూడా ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. అయితే ఇంత జరుగుతున్నా ఢిల్లీ రాజకీయ వేదికపై కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు.  దీంతో త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పాత్ర, పోటీ నామమాత్రంగానే ఉంటుందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

మహాకుంభమేళాకు ఉగ్రముప్పు?!

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి26 వరకూ జరిగే మహాకుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ 40 కోట్ల మందికి పైగా హాజరౌతారన్న అంచనాలు ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరగనున్న ఈ కుంభమేళాపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉగ్రవాదులు సాధువుల రూపంలో దాడులకు తెగబడే అవకాశం ఉందన్నహెచ్చరికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా సందర్భంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు కుంభమేళాకు వచ్చే భక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది.  

ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో శనివారం (జనవరి 4) సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ యాదగిరిగుట్ట మండలం కందుకూరులో ఉంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో ఆ ప్రమాదం జరిగింది.   పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగానే కార్మికులు భయంతో ఫ్యాక్టరీ బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మంది కార్మికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.  

రాష్ట్ర పండుగగా రథ సప్తమి.. ఏపీ సర్కార్ ప్రకటన

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రమంలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా వేడుకగా, ఘనంగా నిర్వహించే రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పంగుడగా ప్రకటించింది. తొలి సారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథ సప్తమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ ఏర్పాట్లపై కలెక్టర్ తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.  రథ సప్తమి వేడుకల కోసం లోగో రూపకల్పనకు ఔత్సాహికులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆహ్మా నించారు. ఈ వేడుకలకు ప్రత్యేక లోగో రూపకల్పనకు ఔత్సాహికులను ఆహ్వానించారు.  రథ సప్తమి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆ రోజు సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో శోభాయాత్ర నిర్వహిస్తారు.  లక్షలాది భక్తులు తరలి వచ్చే ఈ వేడుకలకు పార్కింగ్, లేజర్ షో, నమూనా దేవాలయాల ప్రదర్శన, సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాల కౌంటర్లు, రవాణా సౌకర్యాలు, వసతి సౌకర్యాలు వంటి అన్ని అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో విస్తృతంగా చర్చించారు.  రథసప్తమిని తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకూ తావులేకుండా  విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

భారీ ల్యాండ్ స్కామ్ లో జబర్దస్త్ నటి రీతూ చౌదరి?!

ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన భారీ ల్యాండ్ స్కామ్ లో బుల్లితెర నటి, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి బుక్ అయ్యారు. విజయవాడ, ఇబ్రహీం పట్నం కేంద్రంలో ఓ ముఠా 700 కోట్ల రూపాయల భూ దందాకు పాల్పడింది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ కేసులో రీతూ చౌదరి పేరు కూడా ఉంది.  ఓ రిటైర్డ్  సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఆ స్కామ్ వెలుగు చూసింది. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ నేరుగా చంద్రబాబుకు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చీమకుర్తి శ్రీకాంత్, ఆయన రెండో భార్య వనం దివ్య అలియాస్ రీతూ చౌదరితో పాటు సీఎంకు వరుసకు సోదరుడయ్యే   వైఎస్‌ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి కూడా ఈ స్కామ్ లో ఉన్నారని పేర్కొన్నారు.  రిటైర్డ్  సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్  ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గోవాలో తనను బంధించి బలవంతంగా రూ.700 కోట్ల రూపాయల ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది రిటైర్ట్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ సీఎంకు లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు సారాంశం. ఇప్పుడు ఆ ఫిర్యాదుపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రితూ చౌదరి అడ్డంగా బుక్కయ్యారని అంటున్నారు.  జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ  వచ్చిన రీతూచౌదరి భారీ ల్యాండ్ స్కామ్ లో ఉండటం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.   

తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే పిల్లలకు సోషల్ మీడియా అక్కౌంట్లు!

సోషల్ మీడియా చేస్తున్న మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన సర్వత్రా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా పిల్లలు దారి తప్పుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి అది నిజం కూడా చిన్న వయస్సు నుంచే సోషల్ మీడియా ఎడిక్ట్ లుగా మారిపోతున్న పిల్లలు చదువు, ఆటలకు దూరం అవుతున్నారు. ఇది వారిలో మానసిక సమస్యలకూ దారి తీస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం పిల్లలకు సోషల్ మీడియా అక్కౌంట్లపై నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు సోషల్ మీడియాలోకి రావాలంటే అందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తప్పని సరి చేయాలన్న నిర్ణయం తీసుకుంది.  కేంద్రం తాజాగా ప్రచురించిన  డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2025  ముసాయిదా నిబంధలన ప్రకారం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఫిబ్రవరి 18 తుదిగడువుగా పేర్కొంది. ఆ లోగా పిల్లల  సోషల్ మీడియా అక్కౌంట్ లకు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అన్న దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయనుంది.  ఆ తరువాత పిల్లలకు సోషల్ మీడియా ప్రవేశానికి తల్లిదండ్రుల అనుమతిని తప్పని సరి చేస్తూ చట్టం తీసుకురానుంది. 

వలస పక్షులను కాటేస్తున్న కాలుష్యం!

కాలుష్యం పర్యావరణానికి చేస్తున్న హాని ఇంతా అంతా కాదు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్యం.. పశుపక్ష్యాదుల ఉసురు కూడా తీస్తున్నది. ముఖ్యంగా జలాలలోకి పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా విడుదల చేస్తుండటంతో  వలస పక్షులు బలి అవుతున్నాయి. ప్రతి శీతాకాలంలో విదేశాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ శివారు కిష్టారెడ్డి పేట్ సరస్సును ఆవాసంగా చేసుకునే విదేశీ పక్షులు జల కాలుష్యం కాటుకు బలి అవుతున్నాయి.  కిష్టారెడ్డిపేట్ సరస్సులోకి పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా విడుదల చేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వలస పక్షుల కిలకిలారావాలతో వీనులకు, కన్నులకు విందుగా విలసిల్లాల్సిన కిష్టారెడ్డి పేట్ సరస్సు నేడు ఆ వలస పక్షులకు అంతిమ విడిదిగా మారిపోయింది.   సంగారెడ్డి- మేడ్చల్ జిల్లాల మధ్యలో ఉన్నఈ సరస్సులోకి చుట్టుపక్కల ఉన్న ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి వ్యర్థ కలుషిత జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ సరస్సు వలస పక్షుల  పాలిట శాపంగా మారిన పరిస్థితులు దాపురించాయి. పరిశ్రమల వ్యర్థాలను సరస్సులోకి విడుదల చేయకుండా నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఆ పని చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వలస పక్షులు మరణించడంతో చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగారు. పరిశ్రమల నుంచి వెలువడిన కాలుష్యం ఒక్కటే కాదు, గృహాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి సరస్సులో కలపడం వల్ల కూడా సరస్సు జలం కలుషితమైందనీ, అందుకే పక్షులు పెద్ద సంఖ్యలో మరణించాయనీ అంటున్నారు. కిష్టారెడ్డిపేట్ సరస్సులోని నీటి నమూనాలను సేకరించారని, పరీక్షల్లో నీరు కలుషితమైందని తేలితే అందుకు కారణమైన పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు.    అసలు పటాన్ చెరు ప్రాంతంలోని పలు పరిశ్రమలు నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా వ్యర్థాలను సరస్సులోకి విడుదల చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు అంటున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా జనం కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆరోపిస్తున్నారు.    

ఏసీబీ ఈడీ నోటీసులతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా చిక్కుల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆయనను దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా ఏసీబీ శుక్రవారం (జనవరి 3)న నోటీసులు జారీ చేసింది. అంతకు ముందే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి.. ఈ నెల 7న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.  ఇదే ఇప్పుడు కేటీఆర్ ఈ కేసులో నిండా మునిగారా అన్న అనుమానాలకు తావిస్తున్నది. ఒకే కేసులో రెండు దర్యాప్తు సంస్థలూ కేటీఆర్ ను విచారించడం, అది వరుసగా 6, 7 తేదీలలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం  కేటీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నదని చెప్పవచ్చు. ఒక్క రోజు తేడాలో ఆయన ఏసీబీ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్గాలలో ఆందోళనకు కారణమైంది.   ఫార్ములా కార్ కేసులో  అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి మీదా ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది. ఆ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ రంగంలోనికి దిగి ఆ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. ముందుగా కేసు నమోదు చేసినది ఏసీబీయే అయినా, ఆ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోనికి దిగిన ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది.  2వ తేదీన విచారణకు హాజరుకావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన హాజరవ్వాల్సిన అర్వింద్ హాజరుకాలేదు. వారిరువురూ మూడు వారాల గడువు కోరితే.. ఈడీ మాత్రం వారికి రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చింది. బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ లను వ రుసగా 8,9 తేదీలలో విచారణకు రావాల్సిందిగా మరో మారు నోటీసులు ఇచ్చింది. వారిరువురి కంటే ముందుగా ఈడీ కేటీఆర్ ను విచారించేందుకు రెడీ అయ్యింది. కేటీఆర్ ను ఈడీ ఈ నెల 7నే విచారించనుంది.చ అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ వరుసగా ఒకరి తరువాత ఒకరిని విచారించడానికి ఈడీ నోటీసులు జారీ చేసిందన్నమాట. అయితే ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వైపు ఈడీ విచారణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుండగానే.. హఠాత్తుగా ఏసీబీ కూడా దూకుడు పెంచింది. శుక్రవారం (జనవరి 3)న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి మూడు రోజుల వ్యవధి ఇచ్చి జనవరి 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అంటే నోటీసుల మేరకు కేటీఆర్ 6న ఏసీబీ ఎదుట, 7న ఈడవీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.   ఫార్ములా ఈ కార్ రేసులో  కేటీఆర్ అవినీతికి ఆధారాలున్నాయని ప్రాథమిక విచారణలో నిర్థారించుకున్న ఏసీబీ దూకుడుగా సాగుతోంది. అరెస్టు కాకుండా కేటీఆర్ కు కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, విచారణలతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ఏసీబీ ముందుకు సాగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

జేసీ వ్యవహారంలో బీజేపీ నేత‌లు హ‌ద్దు మీరారా?..

ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకెళ్తున్నది. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ హ‌యాంలో క‌నీస స‌దుపాయాలు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా ఇటీవలి  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌కుండా కేవ‌లం ప‌ద‌కొండు నియోజ‌క‌వ‌ర్గాల‌కే ఆ పార్టీని ప‌రిమితం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఆర్నెళ్లు అవుతోంది. చంద్ర‌బాబు సార‌థ్యంలో అన్నిరంగాల్లో ఏపీ వ్యాప్తంగా అభివృద్ధి ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. బీజేపీ, జ‌న‌సేన పార్టీల నేత‌ల‌ను క‌లుపుకొనిపోతూ కూట‌మిలో ఎలాంటి విబేధాలూ త‌లెత్త‌కుండా చంద్ర‌బాబు పాల‌న సాగిస్తున్నారు. అయితే, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీరు వివాదాస్ప‌దం అవుతోంది. గ‌త మూడు రోజులుగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి,  బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారస్థాయిలో కొన‌సాగుతోంది. త‌న బ‌స్సును త‌గ‌ల‌బెట్టింది బీజేపీ నేత‌లే అంటూ జేసీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. బీజేపీ మ‌హిళా నేత, సినీన‌టి మాధ‌వీల‌తపై జేసీ ప్రభాకరరెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో బీజేపీ నేత‌లుకూడా జేసీపై తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి. నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల సంద‌ర్భంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కేవ‌లం మ‌హిళ‌లే పాల్గొనాల‌ని రూల్ పెట్టారు. అయితే, బీజేపీ మ‌హిళా నేత   జేసీ పార్కులో నిర్వ‌హించే న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై అభ్యంత‌రం తెలిపారు. కేవ‌లం మ‌హిళ‌ల‌కే న్యూఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌కు ఏదైనా అయితే ఎవ‌రిది బాధ్య‌త అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో మ‌రో బీజేపీ మ‌హిళానేత, సినీ న‌టి మాధ‌వీ ల‌త జేసీ పార్కులో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఆ ప్రాంతంలో గంజాయి తీసుకునేవారు ఎక్కువ‌గా ఉంటారు. అలాంటి సెన్సిటివ్ ప్రాంతంలో కేవ‌లం మ‌హిళ‌ల‌కే పార్టీని ఏర్పాటు చేయ‌డం ఏమిటి..? మ‌హిళ‌ల‌కు ఏమైనా అయితే బాధ్య‌త ఎవ‌రిది..? అంటూ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరు ప్ర‌స్తావించ‌కుండానే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.  ఇలా వివాదం సాగుతుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందో ఏమో కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ మ‌హిళా నేత మాధ‌వీల‌త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌ల‌పైనా ఓ రేంజ్ లో విరుచుకుప‌డ్డారు. ఇక తన బస్సులను పథకం ప్రకారం దగ్ధం చేసినా.. షార్ట్ సర్క్యూట్ అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి తన బస్సులకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.  వైసీపీ ప్రభుత్వంలో రూ.450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని.. ఇప్పుడు రెండు బస్సులకు నిప్పంటిస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. వీళ్ల కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా మేలని, జగన్ తన ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే ఆపారని.. బీజేపీ  మాత్రం తన బస్సులను తగులబెట్టించారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జేసీ వ్యాఖ్య‌లపై బీజేపీ నేత‌లు సైతం ఫైర‌య్యారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చొనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరన్నారు. జేసీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ వ్యాఖ్యలు సరికాదని... ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కూటమిలో భాగమైన బీజేపీపై జేసీ అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని జేసీకి హితవు పలికారు. జేసీ కుటుంబం న్యూఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హిస్తే బీజేపీ నేత‌ల‌కు ఇబ్బంది ఏమిట‌న్న ప్ర‌శ్న జేసీ వ‌ర్గీయుల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. కేవ‌లం కూట‌మి నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించేందుకే బీజేపీ మ‌హిళా నేత‌లు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడార‌ని, అస‌లు బీజేపీ పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌కుండా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న నేత‌ల‌పై ఎలా విమ‌ర్శ‌లు చేస్తారంటూ జేసీ వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది. ఈ విష‌యాన్ని తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తామ‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్గీయులు అంటున్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లుసైతం  త‌గ్గేదేలే అంటున్నారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి బీజేపీ మ‌హిళా నేత‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తామ‌ని చెబుతున్నారు. అటు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఇటు బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న నేప‌థ్యంలో కూట‌మి పెద్ద‌గాఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తార‌నే అంశం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

బుద్ధవనం శిల్పాలు ఆకట్టుకున్నాయి

విదేశీ బౌద్ధ పరిశోధకులు బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు తమనేంతో ఆకట్టుకున్నాయి అని విదేశీ బౌద్ధ పరిశోధకులు ప్రొఫెసర్  సారా కెన్డర్ లైన్, ప్రొఫెసర్ జాఫ్రిషా అన్నారు. బౌద్ధ  ప్రదర్శనశాలల నిపుణులైన న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్  సారా ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా  ఇంకా హాంకాంగ్ నుంచి వచ్చిన మరో ఇద్దరు బౌద్ధ పరిశోధకులు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించినట్టు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు.  ఆయన, బుద్ధ వనంలోని వివిధ విభాగాలు, మహాస్తూపం  చుట్టూ ఉన్న శిలా శిల్పాలను వారికి చూపించి, వాటి విశిష్ఠతను వివరించారు.  ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు దమ్మచారి శాసన, డా. రవి చంద్ర, డి. ఆర్. శ్యాంసుందర్ రావు, సిబ్బంది విష్ణు పాల్గొన్నారు.

అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు 

సంధ్య థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ  నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.   పుష్ప 2 బెనిఫిట్  షో చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో చిక్కడపల్లి పోలీసులు అతనిపై బిఎన్ఎస్ 105 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు  14 రోజులు రిమాండ్ విధించింది.  ఒక రోజు జైలులో ఉన్న అతను మరుసటి రోజు ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అడ్వకేట్లు వాదనలు వినిపించడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే  అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ మంజూరైంది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కౌంటర్ దాఖలు చేసారు.  ఈ కేసులో వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ  శుక్రవారం తీర్పు ఇచ్చింది. 

గడగడలాడిస్తున్న హ్యుమన్ మెటానియా వైరస్.. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ

కరోనాకు పుట్టిల్లైన చైనాలో ఇప్పుడు అంత కంటే ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనాలాగే ఇది మనుషుల నుంచి మనుషులకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దీని వ్యాప్తి కరోనా వ్యాప్తి వేగంకంటే రెండింతలు ఎక్కువ. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉసురు తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కల్లోలం నుంచి కోలుకుని ప్రపంచం గాడిన పడుతోంది. అంతలోనే అంతకంటే భయంకరమైన వైరస్ చైనాలో వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచం గడగడలాడిపోతోంది.  ఈ కొత్త వైరస్ పేరు హ్యుమన్ మెటానియా వైరస్(హెచ్ఎమ్ వీవీ). దీని లక్షణాలు కూడా అచ్చం కరోనా లక్షణాల్లాగానే ఉంటాయి. అయితే కరోనా కంటే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, జలుబు, లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో  ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. కరోనా కంటే ఎక్కువ ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు.   ఈ వైరస్ కు ప్రస్తుతం ఎలాంటి చికిత్సా లేదు. లక్షణాలను బట్టే చికిత్స అందిస్తున్నారు. చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఆస్పత్రి పాలయ్యారు.  దీంతో చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కరోనా నాటి పరిస్థితుల్లో విధించినట్లే లాక్ డౌన్ విధించే యోచన కూడా చైనా ప్రభుత్వం చేస్తున్నది.  

ఇంటర్ విద్యార్థులకు డోక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకం.. అమలుకు సర్వం సిద్ధం

జగన్ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ విద్య పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే  మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలి తాల మెరుగునకు పలు చర్యలు చేపట్టారు.  రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం నుంచి అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 398 సమీపంలోని పాఠశాలలు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు.  మిగిలిన 77 కళాశాలలను   వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు.  ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ కంకణం కట్టుకున్నారు.   ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎపి మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూలు ప్లస్ స్కూళ్లలో విద్యనభసిస్తున్న 2లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులను  ఉచితంగా పంపిణీ చేసింది. బోధనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్  లను ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లాలోని 25, గుంటూరు జిల్లాలోని 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి మద్రాసు సహకారంతో విద్యాశక్తి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నది. దీనిద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు సబ్జెక్టులలో విద్యార్థుల సామర్థ్యం పెంచాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఐఐటి మద్రాసులో శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకులు ప్రతిరోజూ సాయంత్రం 4నుంచి 5గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మెళుకువలు నేర్పుతున్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ – టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు.  మొత్తం మీద మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంటర్ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.