ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ ప్రభావతి కోసం పోలీసుల గాలింపు

మాజీ ఎంపీ, తెలుగుదేశం ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘు రామరాజు కస్టోడియల్ టార్ఛర్ కేసులో గుంటూరు జీజేహెచ్ మాజీ సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ పద్మావతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేయాల్సిందిగా విచారణ అధికారి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  కోర్టు తన ముందస్తు బెయిలు పిటిషన్ డిస్మిస్ చేసిన నాటి నంచీ ఆమె అజ్ఝాతంలోకి వెళ్లిపోయారు.  ఆమె పరారైనట్లుగా ధృవీకరించిన పోలీసులు డాక్టర్ పద్మావతిని అరెస్టు చేయడానికి విస్తృతంగా గాలిస్తున్నారు. మొత్తం నాలుగు పోలీసుల బృందాలు డాక్టర్ పద్మావతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. రఘురామకృష్ణం రాు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటి వరకూ నాలుగు సార్లు డాక్టర్ పద్మావతికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా ఆమె విచారణకు హాజరు కాలేదు. ఆమె అజ్ణాతంలోకి వెళ్లడంతో పోలీసులు ఆమె నివాసానికి  నోటీసులు అంటించారు. ఆమె ముందస్తు బెయిల్  పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. అమె విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు పోలీసులు ఆమెపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు.   రఘు రామరాజుపై  థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే అభియోగంలో శరీరంపై ఎటువంటి గాయాలు లేవని డాక్టర్ పద్మావతి తప్పడు నివేదిక ఇచ్చారని ఆభియోగాలున్నాయి.రఘు రామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే సీఐడీ విభాగపు మాజీ ఏఎస్పీ విజయ్ పాల్, కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుచరుడిగా కొనసాగిన తులసి బాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 

పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన ఎన్టీఆర్!

నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ ఈ పేరు ఒక ఉత్సాహం. ఈ పేరు ఒక ఉద్వేగం. ఈ పేరు ఒక చరిత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ జనం హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహామనిషి. శనివారం (జనవరి 19) ఆయన వర్ధంతి.     కృష్ణా నదీతీరాన  జన్మించిన నందమూరి తారక రామా  బాల్యం నుండీ శ్రమజీవి. కుటుంబానికి అండగా, పొరుగువారికి సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉండేవారు. నటుడిగా అశేష ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు.  అగ్ర హీరోగా యమా బిజీగా ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్  సామాజిక బాద్యతను విడవ లేదు. దివిసీమ ఉప్పెన సృష్టించిన పెను విషాదం లో  జోలె పట్టి సర్వసం కోల్పోయిన కుటుంబాల  కోసం విరాళాలు సేకరించి ఆదుకున్నారు.  1982లో  తెలుగు దేశం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి ప్రవేశించారు.   9 నెలల్లో దశాబ్దాలు గా అధికారం లో ఉన్న పార్టీ నీ కూకటి వేళ్ళతో పెకిలించి చరిత్ర తిరగ రాశారు.  పేదలకు రూ.2 రూపాయలకే బియ్యం అందించి  ఎన్టీఆర్ పేదవాడి అన్నం ముద్దగా మారిపోయారు.  ఇప్పుడు దేశ వ్యాప్తంగా   దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల సంక్షేమ పథకాలకూ ఎన్టీఆర్ పథకాలే ఆదర్శం.   జనం గుండెల్లో దైవ సమానుడిగా కొలువయ్యారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజల సంక్షేమం, ప్రయోజనాలే లక్ష్యంగా ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పని చేస్తూనే ఉంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పార్టీని జనం గుండెల్లో దాచుకున్నారు. దేశ రాజకీయాలలో సంక్షేమం కోణాన్ని ఆవిష్కరించింది ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు. వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాలలో పెద్ద పీట వేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఘనంగా నివాళులర్పించారు. సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు'అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని... తెలుగు జాతిని నెంబర్ వన్ చేసేందుకు కంకణబద్ధులై ఉన్నామని తెలుపుతూ... ఆ యుగపురుషుని వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.  ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన మంత్రి నందమూరి బాలకృష్ణ తెలుగువారిలో రాజకీయ చైతన్యం ఎన్టీఆర్ తోనే వచ్చిందని, నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ కు ఎన్టీఆరే సాటి అని అన్నారు.  ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. 

ఒకే ఒక్క‌డు.. శకపురుషుడు

తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వంటి నేత ఆయన ఒక్కరే.  తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల స్వ‌ల్ప కాలానికే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసి, ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయ‌కుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒకే ఒక్క‌డు.. శకపురుషుడు.. నంద‌మూరి తార‌క‌రామారావు. 1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ మ‌హానాయ‌కుడిగా రాణించిన అరుదైన వ్య‌క్తి ఎన్టీఆర్‌. శనివారం (జనవరి 19) ఆయన  వర్ధంతి. ఈ సందర్భంగా ఒక్క సారి ఎన్టీఆర్ ఒ  జీవిత క‌థ‌ను క్లుప్తంగా గుర్తు చేసుకుందాం... 1923 మే 28న కృష్ణా జిల్లా పామ‌ర్రు తాలూకా నిమ్మ‌కూరులో ఎన్టీ రామారావు జ‌న్మించారు. త‌ల్లితండ్రులు వెంక‌ట్రామ‌మ్మ‌, లక్ష్మ‌య్య చౌద‌రి. 1933లో విజ‌య‌వాడ మునిసిప‌ల్ హైస్కూల్‌లో చేరి, 1940లో స్కూల్ ఫైన‌ల్ పాస‌య్యారు. విజ‌య‌వాడ‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో ఇంట‌ర్మీడియేట్ పాస‌యి, గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. 19వ ఏట బ‌స‌వ‌రామ తార‌కంను ఆయ‌న వివాహం చేసుకున్నారు. ఆయ‌న‌కు మొత్తం 11 మంది సంతానం. వారిలో ఏడుగురు కొడుకులు, న‌లుగురు కుమార్తెలు. ఇంట‌ర్మీడియేట్ చ‌దువుతున్న రోజుల నుంచే ఎన్టీఆర్ నాట‌కాల్లో వేషాలు వేస్తూ వ‌చ్చారు. ఆశ్చ‌ర్య‌మేమంటే నాట‌కాల్లో ఆయ‌న మొద‌ట‌గా ధ‌రించింది ఒక స్త్రీ పాత్ర‌. అది 'ప‌ల‌నాటి యుద్ధం' నాట‌కంలో నాయ‌కురాలు నాగ‌మ్మ పాత్ర‌. బీఏ చివరి సంవ‌త్స‌రం చ‌దువుతున్న రోజుల్లోనే అప్ప‌టి అగ్ర సినీ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన చిత్తజల్లు పుల్ల‌య్య నుంచి 'కీలుగుర్రం', 'వింధ్య‌రాణి' సినిమాల్లో న‌టించేందుకు క‌బురు వ‌చ్చింది. చ‌దువు మ‌ధ్య‌లో ఆగిపోతుంద‌నే ఉద్దేశంతో ఆ ఆఫ‌ర్ల‌ను ఎన్టీఆర్ వ‌ద్దనేశారు. 1948లో స‌బ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరి, కొద్ది రోజులే ప‌నిచేశారు. ఆ ఉద్యోగం మానేసి సినిమా రంగంలో అడుగుపెట్టారు. దిగ్ద‌ర్శ‌కుడు ఎల్వీ ప్ర‌సాద్ రూపొందించిన 'మ‌న‌దేశం' మూవీలో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా సినిమాల్లో త‌న తొలి పాత్ర‌ను సునాయాసంగా పోషించారు. త‌ర్వాత టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌గా ఏక‌ఛ‌త్రాధిప‌త్యం వ‌హించి ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం, పంచ‌పాత్రాభిన‌యం చేసి అనిత‌ర‌సాధ్యుడు అనిపించుకున్నారు. 1953లో సొంత నిర్మాణ సంస్థ నేష‌న‌ల్ ఆర్ట్ థియేట‌ర్స్ (ఎన్‌.ఎ.టి.) స్థాపించి, తొలిగా 'పిచ్చి పుల్ల‌య్య' మూవీని నిర్మించారు. 1961లో రూపొందించిన పౌరాణిక చిత్రం 'సీతారామ క‌ల్యాణం'తో ద‌ర్శ‌కుడిగా మారారు ఎన్టీఆర్‌. అందులో ప్ర‌తినాయ‌కుడైన రావ‌ణుడి పాత్ర‌ను ధ‌రించారు. 1976లో హైద‌రాబాద్‌లో రామ‌కృష్ణా స్టూడియోస్ నిర్మించారు. కేవ‌లం సినీ జీవితానికే ప‌రిమితం కాకుండా ప్ర‌జా జీవితంతోనూ అనుబంధం ఏర్ప‌ర‌చుకున్నారు ఎన్టీఆర్‌. 1952లో రాయ‌ల‌సీమ క్షామ‌నిధి, 1964లో ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి, 1965లో జ‌వానుల సంక్షేమ‌నిధి, దేశ‌ర‌క్ష‌ణ నిధి, 1969లో కోస్తా ప్రాంత తుఫాను నిధికి భారీ విరాళాలు ఇచ్చిన ఆయ‌న‌, 1977లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి భిక్షాట‌న చేసి దివిసీమ ఉప్పెన బాధితుల స‌హాయ‌నిధికి విరాళాలు సేకరించారు. 1964లోనే ఎన్టీఆర్ ధ‌ర్మ‌నిధిని ఆయ‌న ఏర్పాటు చేశారు. నిజానికి తెలుగు భాష‌కూ, తెలుగువాడికీ దేశీయంగా గుర్తింపు తీసుకురావ‌డ‌మే కాకుండా కాంగ్రెసేత‌ర పార్టీల‌తో క‌లిసి కేంద్రంలో ఎన్టీఏ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంలో కీల‌క పాత్ర వహించారు. 1982 మార్చి 29న సినీ రంగం నుంచి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అఖండ విజయం సాధించి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసిన తొలి నాయ‌కుడిగా స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన చ‌రిత్ర  తెలిసిందే. నాదెండ్ల భాస్క‌ర‌రావు వెన్నుపోటు పొడిచి, త‌న‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేస్తే, ప్ర‌జాబ‌లంతో తిరిగి ఎలా ముఖ్య‌మంత్రి అయ్యిందీ తెలిసిందే . 1996 జ‌న‌వ‌రి18న  తన 72 ఏళ్ల వ‌య‌సులో త‌న నివాసంలోనే తుది శ్వాస విడిచి మ‌హాభినిష్క్ర‌మ‌ణం చేశారు. అటు సినిమా స్టార్‌గా, ఇటు పొలిటిక‌ల్ స్టార్‌గా ప్ర‌జ‌ల‌ను స‌మ్మోహితుల‌ను చేసి, ఆయ‌న‌లా వారిని ప్ర‌భావితం చేసిన మ‌రో నాయ‌కుడిని తెలుగువాళ్లు ఆయ‌న‌కు ముందు చూడ‌లేదు, ఆయ‌న త‌ర్వాతా చూడ‌లేదు. ఇక చూసే అవ‌కాశం కూడా లేదు. 

ఏపీకి అమిత్ షా.. జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైందా?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సార‌థ్యంలోని కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అధికారంలోకి వ‌చ్చిన ఏడు నెల‌ల్లో ప్ర‌భుత్వం ప‌ని తీరు ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా గ‌డిచిన ఐదేళ్ల కాలంలో సంక్రాంతి పండుగ‌ను సైతం స‌రిగా జ‌రుపుకోలేక‌పోయిన ఏపీ ప్ర‌జ‌లు ఈ ఏడు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కిందటేడాది వరకూ వెలవెలబోయిన జగ్గన్నతోట ప్రభల తీర్ధం ఈ ఏడాది ఇసుక వేస్తే రాలనంత జనసందోహంతో కలకలలాడింది.   కూట‌మి పాల‌న‌లో గ్రామ‌ గ్రామాన‌ పండుగ‌ శోభ ఉట్టిప‌డింది. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కేంద్రం స‌హ‌కారంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు అన్నీ తీపి క‌బుర్లే చెబుతూ వ‌స్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని, పోల‌వ‌రం ప్రాజెక్టుతో పాటు వైసీపీ హ‌యాంలో ప్ర‌జ‌లు ఎందుర్కొన్న ఒక్కో ఇబ్బందిని తొలిగించేలా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ వ‌స్తున్నారు. దీంతో అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌లూ కూట‌మి పాల‌న ప‌ట్ల హ్యాపీగా ఉన్నారు. మ‌రో వైపు వ‌చ్చేనెల అంటే ఫిబ్ర‌వ‌రి నుంచి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌తి హామీనీ నెర‌వేర్చేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ సమాయత్తమైంది.  ఇప్ప‌టికే ప‌లు హామీల‌ను అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వం, రాబోయే రోజులలో అన్ని హామీల‌ను అమ‌లు చేసేలా కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసింది. ఇదే స‌మ‌యంలో తాజాగా కేంద్రం ఏపీకి మ‌రో తీపిక‌బురు చెప్పింది.   ప్రైవేటీకరణ ముప్పు ఎదుర్కొంటున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం కాపాడుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,400 కోట్ల రూపాయ‌ల బెయిలౌట్ ప్యాకేజీని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. తాజా నిర్ణ‌యంతో స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక పరమైన కష్టాలు   తీరినట్లే. వైసీపీ హయంలో స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రైవేటీకరణ చేయాల‌ని కేంద్రం అడుగులు వేసింది.. అయితే, జ‌గ‌న్ స‌ర్కార్ కేంద్రం ఆలోచ‌న‌ల‌కు ఏమాత్రం ఎదురు మాట్లాడ‌లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప‌రం కాబోతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణకు ఎట్టి ప‌రిస్థితుల్లో అంగీక‌రించేది లేద‌ని కేంద్రానికి తెగేసి చెప్పారు. దీంతో కేంద్రం వెన‌క్కు త‌గ్గింది. అంతేకాక‌ ఇప్పుడు భారీ ఆర్థిక ప్యాకేజీనిసైతం ప్ర‌క‌టించింది. అదలా ఉంటే.. చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న స‌మ‌యంలో ఏపీ ప‌ర్య‌ట‌న‌కు హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు.  కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను అమిత్ షా ఆదివారం (జనవరి 19)ప్రారంభించనున్నారు. ఈ పర్యటన కోసం శనివారం (జనవరి 18) రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షాకు.. ఉండవల్లిలోని  త‌న నివాసంలో సీఎం చంద్రబాబు విందు  ఇవ్వ‌నున్నారు. ఈ విందు భేటీపైనే అంద‌రిచూపు కేంద్రీకృత‌మైంది. చంద్ర‌బాబు, అమిత్ షా భేటీలో రాజ‌కీయప‌ర‌మైన అంశాలు, ముఖ్యంగా జ‌గ‌న్ కేసుల గురించి ప్ర‌స్తావ‌న జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  కూట‌మి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిపోయింది. జగన్ అరాచక, అస్తవ్యస్త పాలన కారణంగా రాష్ట్రం  ఆర్థికంగా చితికిపోయింది. వ్వస్థతలన్నీ నిర్వీర్యమయ్యాయి. పాలన గాడి తప్పింది.  చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఈ ఏడు నెలల కాలంలో  అన్ని విధాలుగా గాడితప్పిన రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి రాష్ట్రం ప్రగతి బాటలో అడుగులు వేసేలా చేసేందుకే అత్యథిక సమయం కేటాయించారు. చాలా వరకూ సఫలీకృతమయ్యారు. ఆ క్రమంలో ఆయన రాజకీయాలను దూరం పెట్టారు. ఇప్పుడు రాష్ట్రం పురోగమన బాట పట్టిన తరువాత  ఇక రాజకీయంగానూ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంలో ముఖ్యంమంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నారు. ఇప్ప‌టికే గ‌త ఐదేళ్ల కాలంలో ప్ర‌భుత్వాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్ప‌డిన‌ ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. దీనికి తోడు సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన ప‌లువురు వైసీపీ నేత‌ల‌పైనా పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే జైలుకెళ్లారు. రాబోయే కాలంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా చ‌ర్య‌లు తీసుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి హోదాను అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు కూట‌మి ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలే కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలని అమిత్ షా వ‌ద్ద‌ చంద్ర‌బాబు ప్ర‌స్తావించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్‌, ఇసుక వ్య‌వ‌హారాల్లో భారీ స్కాములు ఉన్నాయి. ఇసుక వ్యవహారంపై సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక‌  లిక్కర్ స్కాములోనూ అంతే. వీటిలో పెద్ద ఎత్తున‌ మనీ లాండరింగ్ జరిగిందని.. ఆ డబ్బులు ఎక్కడెక్కడకి ఎలా చేరాయో కూట‌మి ప్ర‌భుత్వం ఆధారాలు సేక‌రించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నది. వీటన్నింటిపై చంద్ర‌బాబు నివాసంలో అమిత్‌షాకు ఇచ్చే విందు భేటీలో చర్చించి.. త‌దుప‌రి తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం గ‌త వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతిని క‌క్కిస్తామ‌ని ప‌లు సంద‌ర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవ‌ల అమిత్‌షా, ప్ర‌ధాని మోడీని క‌లిసిన సంద‌ర్భంలోనూ వైసీపీ హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై వారి దృష్టికి తీసుకెళ్లార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్దరూ ఒకేమాట‌పై ఉండ‌టంతో అమిత్ షా  వారి ప్ర‌తిపాద‌న‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు. మొత్తానికి చంద్ర‌బాబు నివాసంలో అమిత్ షా విందు భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవ‌డం ఖాయ‌మ‌న్న అభిప్రాయాన్ని కూట‌మి నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో.. ఉచితాలకే పెద్దపీట

చెప్పేటందుకే నీతులు అన్న విషయాన్ని బీజేపీ మరోమారు రుజువు చేసింది. పలు సందర్భాలలో ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత హామీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల వేళ విజయం కోసం ఉచితాలపైనే ఆధారపడ్డారు. ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి ఇచ్చే ఉచిత హామీలు దేశ భవిష్యత్ కు, ప్రగతికీ అత్యంత ప్రమాదకరమని పలు సందర్భాలలో మోడీ అన్నారు. తన ప్రభుత్వం ఉచిత హామీలకు దూరంగా ఉంటుందనీ, దేశ భవిష్యత్ , మౌలిక సదుపాయాల కల్పనపైనే దృష్టి కేంద్రీకరిస్తుందనీ గతంలో పలు సందర్భాలలో చెప్పిన మోడీ ఎన్నికలలో బీజేపీ విజయానికి మాత్రం ఆ ఉచిత హామీలపైనే ఆధారపడుతున్నారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ తన ఎన్నికల మేనిఫొస్టోను ఉచిత హామీలతో నింపేసింది. సంకల్ప పత్రం పేరిట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా శుక్రవారం (జనవరి 17)న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.  తాము అధికారంలోకి వస్తే ఇప్పటికే అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అవికాకుండా  పేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు హోళీ, దీపావళి పండుగలకు ఒక్కో సిలిండర్ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 60-70 ఏళ్ల మధ్య వృద్ధులకు నెలకు రూ. 2,500, 70 సంవత్సరాల పైబడి వారికి రూ.3 వేలు అందజేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.  అలాగే మహిళలకు 2500 రూపాయలు పింఛను, ఢిల్లీలోని అనధికార మురికివాడలలో అటల్ క్యాంటిన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది.  

నీలోనే అల్లా ఉన్నాడు...మద్యంలో సైతాను ఉన్నాడు

ఫిరోజ్ వ్యసనాలను అలవాటు పడ్డాడు. తాను మనసులో ఏది తల్చుకుంటే  అది నిమిషాల్లో కావాలంటాడు. తల్లి దండ్రులకు ఇది నచ్చలేదు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఒక  రోజు ఫిరోజ్ ను తీసుకుని తల్లిదండ్రులు మౌలానా దగ్గరకు వచ్చారు.   ఫిరోజ్ తల్లిదండ్రులు: సలాం వాలేకూం మౌలానా మౌలానా: వాలేకుం సలాం, కైరియత్  ఫిరోజ్ తల్లిదండ్రులు: అల్  హమ్ దు లిల్లా మౌలానా సాబ్ ఫిరోజ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు . ఉద్యోగం సద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు.  మౌలానా: ఇస్లాంలో మద్యం సేవించడం మహా పాపం. మద్యం వ్యసనం వల్ల మనిషి అనేక పాపాలు చేస్తాడు. తాను చేసే పాపాలు కూడా పశ్చాత్తాపం చెందే అవకాశం  కూడా లేదు. నమాజును క్రమ బద్దంగా నిర్వహించాలి.  శుక్రవారం మసీదులకు వచ్చిన యువకులు  చాలామంది తిరిగివెళ్లేటప్పుడు టోపీలను పెట్టుకోవడం లేదు. ఫ్యాషన్ కు అలవాటు పడ్డ యువత అల్లాకు దూరమౌతున్నారు.  మసీదుకు దగ్గరగా ఉన్నవారు సమయానికి మసీదుకు రావడం లేదు. వచ్చినా సమయానికి రావడం లేదు. మొదటి రఖాత్(నమాజు ప్రక్రియలో భాగం) అయి పోయిన తర్వాత వస్తున్నారు. ఆలస్యంగా నమాజు వేళలు పెట్టినప్పటికీ మొదటి రఖాత్ కు రావడం లేదు. రఖాత్ వదిలేయడం మహా పాపం. టైంపాస్ కోసం నమాజుకు వస్తే ఫలితం శూన్యం. అల్లాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడే చెడు వ్యసనాలు వాటంతట అవే దూరమౌతాయి. నీలోనే అన్నీ ఉన్నాయి. వాటిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మంచి ఏమిటో చెడు ఏమిటో నీకు తెలుసు. ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో నీకు తెలుసు. నీకు ఎవరో చెప్పాలి అనే నియమం లేదు. నీకు అన్నీ తెలిసినప్పుడు నిర్ణయం తీసుకోవల్సింది నువ్వే. అల్లా   ఎక్కడో లేడు. నీలోనే ఉన్నాడు.  నీలోనే అల్లా ఉన్నప్పుడు పాప పుణ్యాలు కూడా నీవే తెలుసుకుంటావు. నువ్వు అల్లాతో మాట్లాడాలి  అని మనస్పూర్తిగా అనుకుంటే చాలు. నీ సమస్యలను నివేదించాలి అన్నీ మాయమవుతాయి. అల్లా వచ్చి నీతో మాట్లాడతాడు అని మౌలానా తన తక్రీర్ ముగించాడు.  ఫిరోజ్ తల్లిదండ్రులు: ఖుదాఫీస్ మౌలానా సాబ్                                                                               బదనపల్లి శ్రీనివాసాచారి

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కేనని కేంద్రం విస్పష్టంగా చాటింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గింది. విశాఖ ఉక్కును నష్టాల నుంచి బయటపడేయడానికి 11 వేల 440 కోట్ల రూపాయల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతిొ తెలిసిందే. జగన్ హయాంలో కేంద్రం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోకపోవడమే కాకుండా, ఆ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి అయ్యేలా తన పూర్తి సహకారం అందిస్తామన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం అత్యంత కీలక భాగస్వామిగా ఉండటంతో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ యోచనను కేంద్రం విరమించుకుంది.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశక్తే లేదని విస్ఫంష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిజం చేస్తూ కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11 వేల 440 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇహనో ఇప్పుడో ఈ విషయంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  

తులసిబాబు బెయిల్ పిటిషన్.. RRR ఇంప్లీడ్

తనపై కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులకు శిక్ష పడే  విషయంలో  మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్వయంగా న్యాయపోరాటం చేస్తున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టే విషయంలో పోలీసులు గట్టిగా ప్రయత్నించడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రఘురామ కృష్ణం రాజు.. ఈ కేసులో స్వయంగా తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత అరెస్టైన తులసిబాబు హైకోర్టులో అత్యవసర బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే తులసిబాబు విషయంలో పోలీసులు   గట్టిగా నిలబడతారన్న నమ్మకం లేకపోవడమో, లేదా తనకు జరిగిన అన్యాయాన్ని తనకంటే గట్టిగా ఎలుగెత్తే వారెవరుంటారన్న భావనో కానీ ఆయన స్వయంగా రంగంలోకి దిగారు.  ఈ కేసులో అరెస్టైన తులసీబాబు హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్  విచారణ సందర్భంగా తన వాదనా వినాలంటూ రఘురామకృష్ణం రాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తులసి బాబు తాను కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేశారనీ, అందుకే ఆయన బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా తన వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.   కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో రఘురామకృష్ణం రాజు అలుపెరుగని న్యాయపోరాట ఫలితంగానే ఈ కేసులో విజయ్ పాల్, తులసిబాబు అరెస్టయ్యారని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు తులసి బాబు బెయిల్ పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన రఘురామకృష్ణం రాజు పీస్ సునీల్ జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అరెైస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభావతి ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.    

సింగపూర్ ఐటీఈతో తెలంగాణ స్కిల్ వర్సిటీ ఓప్పందం

రైజింగ్ తెలంగాణ అజెండాగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలుత ఆయన సింగపూర్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల సింగపూర్ పర్యటన తరువాత ఆయన దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరౌతారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆక్ష్న సింగపూర్ ఐటీఈతో  యువతను ఉద్యోగాలకు సమాయత్తం చేసే లక్ష్యంలో  చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించే ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు  ఐటీఈ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్‌తో  అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న విభాగాలు, నెట్ వర్క్ ల పనితీరును రేవంత్ బృందం  పరిశీలించింది.  ఆయా రంగాలలో , విభాగాలలో పనిచేస్తున్న నిపుణులతో మాట్టాడారు.  తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ ఐటీఈతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది.  ఈ ఒప్పందం మేరకు సింగపూర్ ఐటీఈ   టెన్త్ విద్యార్థుల  నుంచి ఆసక్తి ఉన్న ఏ వయసు వారికయినా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణ అందిస్తుంది.  ఈ ఒప్పందం స్కిల్ యూనివర్సిటీ లక్ష్యాలను అందుకోవడంలో ఎంతో  దోహదపడుతుందని రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది. 

దావోస్ పర్యటనలో లోకేష్ కీలక భేటీలు.. మూడు సెషన్లలో ప్రధాన వక్తగా ప్రసంగాలు!

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మంత్రులు లోకేష్,   టీజీ భరత్ , ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సిఎం  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనాథ్ బండారు, ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో సాయికాంత్ వర్మ సిఆర్‌డిఏ  ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మాట్  దావోస్ లో పర్యటించనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఐదు సెషన్ లలో ప్రధాన వక్తగా పాల్గొనే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు దక్కగా వీటిలో మూడు సెషన్ లలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మిగిలిన రెండింటిలో మంత్రి నారాలోకేష్ ప్రధాన వక్తగా ప్రసంగిస్తారు. అలాగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మంది దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా కీలక భూమిక పోషిస్తున్నారు.  ప్రధానంగా ఏపీ పెవిలియన్ లో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి భేటీలు, చర్చలలో లోకేష్ లీడ్ తీసుకోనున్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వారికి వివరించనున్నారు. అలాగే సీఎన్‌బీసీ, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ లో నారా లోకేష్ పాల్గొననున్నారు.  అదే విధంగా  ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులపై  విద్యారంగ గవర్నర్ల సమావేశంలో కూడా లోకేష్ పాల్గొంటారు.   మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం,  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం వంటి అంశాలపై   ప్రముఖులతో నిర్వహించే సమావేశాలలో పాలుపంచుకుంటారు.  నెక్ట్స్ జెన్ ఏఐ, డాటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.   

ఎమ్మెల్యే  కౌశిక్ రెడ్డిపై మాసాబ్ ట్యాంక్ పిఎస్ లో విచారణ

తన విధులకు ఆటంకం కలిగించినట్టు గత నెలలో  బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై  అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో విచారణ కోసం   ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  శుక్రవారం మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.  తన ఫోన్ ట్యాప్ అవుతుందని గత నెల నాలుగో తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి   కౌశిక్ రెడ్డి వచ్చారు. ఇదే సమయంలో బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్  రాఘవేందర్  స్టేషన్ నుంచి బయటకు వెళుతున్నారు. తాను వస్తున్న విషయాన్ని ముందే ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ పసిగట్టి స్టేషన్ నుంచి వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి వాదన. తన వాహనాన్ని అడ్డుకున్నట్లు రాఘవేందర్   బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉంది.  విచారణ కోసం కౌశిక్ రెడ్డి  విచారణాధికారిగా ఉన్న మాసాబ్ ట్యాంక్  ఇన్స్ పెక్టర్  ఎదుట హాజరయ్యారు. విచారణాధికారి ప్రశ్నలకు కౌశిక్ రెడ్డి సమాధానాలిచ్చి ఇంటికి వెళ్లిపోయారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి నిన్ననే మాసాబ్ ట్యాంక్  పోలీస్ స్టేషన్ కు హాజరుకావాల్సి ఉంది.  ఒక కేసు విషయంలో కరీంనగర్  కోర్టుకు హాజరు కావల్సి ఉన్నందున శుక్రవారం హాజరౌతానని కౌశిక్ రెడ్డి పోలీసులకు ముందుగానే  తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడు బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ కావడంతో విచారణాధికారిగా  మాసాబ్ ట్యాంక్ ఇన్స్ పెక్టర్ పరశురాంను నియమించారు. పరశురాం ఇచ్చే నివేదికను బట్టి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.   

దావోస్ వేదికగా చంద్రబాబు వర్సెస్ రేవంత్.. పెట్టుబడుల ఆకర్షణ పోటీలో గెలుపెవరిదో?

గురు శిష్యులుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడనున్నారు.  స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వీరిద్దరు తమ తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు, అధికారుల బృందంతో బయలుదేరుతున్నారు. ఈ పెట్టుబడుల ఆకర్షణ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇరువురికీ సమానంగా సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి.   చంద్రబాబు నాయుడు ఈ విషయంలోఅపారమైన అనుభవం ఉంది. గతంలో పలు మార్లు చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరయ్యారు. అభివృద్ధి, దార్శనికతలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అమోఘంగా ఉంది. ఈ కారణంానే ఆయన ప్రధాన పెట్టుబడిదారులకు సుపరిచితుడు. ఆయన పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో ఆయన పెట్టుబడిదారులను ఆకర్షించి ఏపీకి పెట్టుబడులను సాధించడం నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే అదే సమయంలో ఒకింత ప్రతికేలతను కూడా ఆయన ఎదుర్కోనే అవకాశం ఉంది. అదేంటంటే గత ఐదేళ్ల జగన్ పాలన కారణంగా బ్రాండ్ ఏపీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. మరో సారి జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడి దారుల నుంచి ఆయనకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు తమను అలా ప్రశ్నిస్తున్నారంటూ మంత్రి లోకేష్ చెప్పారు.  ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. హైదరాబాద్ ఆయనకు ఓ పెద్ద సానుకూలాంశం. ఇక్కడ పెట్టుబడుల కోసం పెద్ద ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు తరలి వస్తారు. అందుకు అవసరమైన పూర్తి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఉంది. ఇక ప్రతి కూలాంశం విషయానికి వస్తే రేవంత్ తొలి సారి ముఖ్యమంత్రి. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఏడాది మాత్రమే అయ్యింది. అలాగే రేవంత్ రెడ్డికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆసక్తిగానీ, నేర్పు ఉన్న దాఖలాలు ఇంత వరకూ అయితే పెద్దగా కనిపించలేదు.  మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.  

 సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ అయిన రేవంత్ రెడ్డి 

పెట్టుబడులే లక్ష్యంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ లో  పర్యటిస్తున్నారు.  ఆ దేశ విదేశాంగమంత్రి బాలకృష్ణన్ తో శుక్రవారం భేటీ అయ్యారు.  ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు. గురువారం పొద్దుపోయే వరకు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపిన రేవంత్ రెడ్డి  రాత్రి సింగపూర్ కు బయలు దేరారు. సింగపూర్ లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్ది కార్యక్రమాలను  అధికారులు పోల్చి చూసుకున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో సింగపూర్ లో రాష్ట్ర బృందం పర్యటించనుంది. సోమవారం ఇదే బృందం దావోస్ పర్యటించనుంది. 

కర్నాటక కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు

కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కడం ప్రభుత్వ ప్రతిష్ఠను సైతం మసకబారుస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించింది. సీఎం పదవి కోసం పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను సముదాయించి.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా కలిసి పని చేసుకోవాలని సూచించింది. అప్పట్లో చెరో రెండేళ్లూ సీఎం అన్న ఒక ప్రతిపాదనకు ఇద్దరూ అంగీకరించారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.  ముడా అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ముడా స్థల కేటాయింపుల విషయంలో  సీఎం సిద్దరామయ్యపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ గౌహ్లోత్ అనుమతి ఇచ్చారు. దీంతో సీఎంగా సిద్దరామయ్య సీఎం పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతు దారులు రెండున్నరేళ్ల సీఎం ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ వ్యవహారం అలా సాగుతుం డగానే... తాజాగా మంత్రి సతీష్ జార్కిహోలీ ఓ టెలివిజన్ డిబేట్ లో డీకే శివకుమార్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో మంటలు రేపాయి. ఆయన  కాంగ్రెస్ కర్నాటక అధ్యక్షుడిని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో విభేదాలను ఒక్కసారిగా రోడ్డున పడేశాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఎక్కువ సమయం కేటాయించే నాయకుడు ఉండాలన్నది సతీష్ జార్కి హోలీ వ్యాఖ్యల సారాంశం. దీనిపై సీరియస్ గా స్పందించిన డీకే శివకుమార్.. పదవి అనేది దుకాణంలో దొరికే వస్తువు కాదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెండ్ మంజునాథ్ భండారీ  సతీష్ జార్కిహోలీ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా అటువంటి వ్యాఖ్యలు మానుకవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.   

రైతు కంటమిర్చి మంట!

ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోతే రైతుపడే  ఆవేదన మాటల్లో వర్ణించలేం.వాణిజ్య పంటలయితే  లక్షల్లో నష్టం వస్తుంది.గత రెండేళ్లుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసి చూసి విసిగి వేశారిపోయారు. పంటలకు  కనీసం మద్దతు ధరల కోసం ఉత్తరాది రైతులు సంవత్సరాల తరబడి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాల నుంచి కనీసం స్పందన లేకపోవడమే కాకుండా ఆందోళన చేస్తున్న రైతులపై అణచివేత చర్యలకు పాల్పడటం నిజంగా అమానుషం. మాటల్లో చెప్పలేనంత దారుణం. 2002,2023 సంవత్సరాలలో మిర్చిధర క్వింటాలుకు రూ.28 వేలు గరిష్టంగా పలికింది. గత ఏడాది జనవరి నుంచి ధరలు పతనమవడం ప్రారంభించాయి. దాంతో కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్ తమ పంటను నిల్వ చేశారు.  అయితే దీర్ఘకాలం ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజి అద్దెలు వారి నష్టాలను మరింత పెంచాయి తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. మేలు రకాల మిర్చి  ధరలు సైతం రూ.10నుంచి 15 వేల వరకూ పడిపోయాయి. మిర్చి రైతుకు 2023లో గిట్టుబాటుగా మార్కెట్ ధర లభించడంతో రైతులు పంట విస్తీర్ణం పెంచారు. కాని ధరల పతనంతో ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లి రైతులు కుదేలయ్యారు.   సగటున ఎకరాకు 10క్వింటాళ్ల మిర్చి పంట దిగుబడి వస్తుంది.  ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ లలో 19 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉంది.రాయల సీమలో కొత్త పంట వచ్చింది. కర్ణాటక, తెలంగాణలలో కూడా  రోజూ వేలల్లో టిక్కీల మిర్చి వస్తున్నది.  దీంతో గ  2014, 2015 నాటి పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. .దళారీలు అంతర్జాతీయ మార్కెట్ లేదని బుకాయిస్తున్నారు. ఈ ఏడాది మిర్చి ధర దారుణంగా పడిపోయింది. మేలు రకాలకు క్వింటాలుకు కేవలం  13వేల నుంచి 15 వేల రూపాయల ధర లభిస్తోంది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వాలు మిర్చి రైతును ఆదుకునే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.  

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్టు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్ లో విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం పది బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్ అలీఖాన్ నివాసంలోనే అతడిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.   గురువారం (జనవరి 16) తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని నిందితుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి ఎలా చోరబడ్డాడన్న అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి.  

కేటీఆర్ కోసం హస్తినకు హరీష్.. న్యాయనిపుణులతో చర్చలు!?

లొట్టపీసు కేసు, లైడిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, ఏసీబీ, ఈడీలు ఈ కేసులో నన్నేం పీకలేవు అంటూ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ ఫార్ములా రేస్ కేసులో బాగానే ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆయన ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయన్నది కేవలం పరిశీలకుల విశ్లేషణ మాత్రమే కాదు.. స్వయంగా కేటీఆర్ కూడా అదే భావిస్తున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఈ ఫార్ములా కేసును క్వాష్ చేయాలని ఆయన సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఫలితం లేకపోయింది.  ఆయనకు ఇసుమంతైనా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఆయనే కాదు.. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే పనిలో ఉన్నారు. ఆయన ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీలు వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేసి అంతిమంగా అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అయితే పైకి మాత్రం బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి, కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టులో పార్టీ తరఫున పిటిషన్ దాఖలుకు వెళ్లానని చెబుతున్నారు. ఆ పిటిషన్ల కోసమైతే షరీష్ రావు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. పార్టీ తరఫున న్యాయవాదులు వెడితే సరిపోతుంది. కానీ ఆయన గురువారం (జనవరి 16) హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు. అదే సమయంలో ఇక్కడ హైదరాబాద్ లో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఈడీ విచారిస్తోంది. దాదాపు ఏడు గంటలకు పైగా కేటీఆర్ ను విచారించిన ఈడీ, అవసరమైతే మరోసారి పిలుస్తామంటూ విచారణ ముగించి పంపించింది.  ఒక వైపు కేటీఆర్ ను విచారిస్తూనే ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించి ఆ తరువాత వైదొలగింది.ఆ కంపెనీ వైదొలగడం వల్లనే  అందుకే ప్రభుత్వం  స్పాన్సర్ షిప్  సొమ్ము చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ2, ఏ3 అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఈడీ వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తుండటమే కాకుండా, గ్రీన్ కో అనుబంధ ఏస్ నెక్స్ట జెన్ లావాదేవీలపై కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే ఏ2, ఏ3లు తమ వాంగ్మూలాలలో  మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పినట్లుగా తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు అనివార్యం అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ లో కూడా అదే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో అరెస్టు నుంచి కేటీఆర్ బయట పడేందుకు ఉన్న మార్గాలపై న్యాయనిపుణులతో చర్చించేందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంలో పిటిషన్ సాకుతో హరీష్ రావు హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

బీజేపీ మెగా ఫ్యామిలీ జ‌పం.. పెద్ద స్కెచ్చే!

కేంద్రంలో వ‌రుగా మూడు సార్లు అధికారంలోకి వ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ద‌క్షిణాది రాష్ట్రాలు మాత్రం ఝ‌ల‌క్ ఇస్తున్నాయి. త‌మిళ‌నాడు,  కర్నాటక, కేర‌ళల‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతోంది.  గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి పోటీచేసిన బీజేపీ త‌న ఉనికిని కాపాడుకోగలిగింది. ఇక తెలంగాణ‌లో ఒంటిరిగానే పోరాటం సాగిస్తున్న ఆ పార్టీకి అధికారం మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. తెలంగగాణలో గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  జ‌నసేన పార్టీతో క‌లిసి పోటీ చేసిన బీజేపీ ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో  విజయం సాధించగలిగింది. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  బీజేపీ  17 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో విజయం సాధించింది. అయితే అధికారం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలింది. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అదిష్టానం ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. ఎలాగైనా తెలంగాణ‌లో అధికార పగ్గాలు అందుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ బీజేపీ రోజురోజు బ‌లోపేతం అవుతోంది. అయితే, బీజేపీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకుంటూ వెళ్లినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలంటే బ‌ల‌మైన ప్ర‌జా మ‌ద్ద‌తు క‌లిగిన కుటుంబం తోడు పార్టీకి ఉండాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది. ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలో  ఉంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే ఫార్ములాను తెలంగాణ‌లోనూ అప్ల‌య్ చేయాల‌ని బీజేపీ అధిష్టానం తొలుత భావించింది. కానీ, తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఆ పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోయినా గ్రామ‌గ్రామాన టీడీపీకి భారీగానే ఓటు బ్యాంక్ ఉంది. ఈ కార‌ణంగా ఆ పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండదనీ, ఏపీలో మాదిరిగా ఉనికి చాటుకోవడానికే తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో ఉపయోగపడుతుందని బీజేపీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు ఏపీలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో  తెలుగుదేశం పార్టీ  బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. దీంతో వివిధ కారణాలతో తెలుగుదేవం పార్టీని వీడిన తెలంగాణ నేతలలో  చాలా మంది సొంత‌ గూటికి అంటే తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.   ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీచేయాల‌ని అధినేత చంద్ర‌బాబుపై పార్టీ క్యాడ‌ర్ ఒత్తిడి పెరుగుతోంది.  ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్నన పంచయతీ ఎన్ని కలలో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమౌతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అధిష్టానం క‌నుస‌న్న‌ల్లో న‌డుచుకునే, ప్ర‌జాబ‌లం క‌లిగిన కుటుంబం మ‌ద్ద‌తు పార్టీకి అవ‌స‌ర‌మ‌ని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మెగా ఫ్యామిలీ అండ‌కోసం బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్ప‌టికే ఏపీలో ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి అన్నివిధాలుగా అండ‌గా ఉంటున్నారు. బీజేపీ కేంద్ర పార్టీ సైతం ప‌వ‌న్ ను సొంత పార్టీ నేత‌గానే ప‌రిగ‌ణిస్తున్నది. ఇదే క్ర‌మంలో మెగా ఫ్యామిలీకి పెద్ద‌గా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ మ‌నిషిగా ప్ర‌జ‌ల్లో ముద్ర‌ వేసేందుకు ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే స‌ఫ‌లం అయ్యార‌ని చెప్పొచ్చు. చిరంజీవికి ఏపీతోపాటు తెలంగాణ‌లోనూ భారీగానే అభిమానులున్నారు. వృద్ధుల నుంచి ప్ర‌స్తుతం యువ‌కుల వ‌ర‌కు మెగా ఫ్యామిలీకి మూడు త‌రాల‌కు చెందిన అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రాంచ‌ర‌ణ్‌తోపాటు దాదాపు అర‌డ‌జ‌న్ మంది హీరోలుగా కొన‌సాగుతున్నారు. వీరంద‌రికీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ క్ర‌మంలో మెగా ఫ్యామిలీ అండ‌తో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే, ఈ ప్లాన్ ఇప్ప‌టికిప్పుడు అమ‌లు చేస్తున్న‌ది కాద‌ని పరిశీలకులు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు నుంచే మెగా ఫ్యామిలీకి బీజేపీ పెద్ద‌లు ప్రాధాన్య‌త‌నిస్తూనే వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ వ్యూహాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు చేయ‌లేక‌పోయిన బీజేపీ అధిష్టానం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ప‌క్కాగా అమ‌లు చేసి అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న పట్టుదలతో ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో బీజేపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రాధాన్య‌త‌నిస్తూ వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్రమోదీతో ప‌లు ద‌ఫాలుగా చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌మాణస్వీకారోత్స‌వ స‌మ‌యంలో  ప్రధాని మోడీ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హ‌త్తుకొని అభినందించినతీరు మెగా కుటుంబం బీజేపీకి మ‌ద్ద‌తు దారు అన్న ముద్రను ప్రజల్లో వేసింది.   దానిని కాపాడుకుని తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలంగా మెగా ఫ్యామిలీ అండ పొందాలని ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.