ఎమ్మెల్సీ పోరుకు బీఆర్ఎస్ దూరం?.. ఓటమి భయమే కారణమా?
posted on Feb 4, 2025 @ 10:45AM
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మాటలు కోటలు దాటుతున్నాయి. అయితే చేతలు మాత్రం ఫామ్ హౌస్ గడప కూడా దాటని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలలో పోటీకి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇప్పటికింకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ఆ పార్టీ తీరు చూస్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టమౌతోంది. పార్టీ క్యాడర్ కు అదే సంకేతాలను పంపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీకీ మద్దతు ఇచ్చేది లేదని చెబుతుండటమే స్వయంగా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపడం లేదని చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉండనుంది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇరువురూ కూడా రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు అధికారం అప్పగించామా అని వగస్తున్నారనీ, అవకాశం ఉంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే కనుక ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగితే తాము చెప్పే మాటలలో వాస్తవం ఎంత ఉందో ఫలితాలలో తేలిపోతుంది. అయితే ఆలా తేల్చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు.
ఇప్పటికిప్పుడు కేసీఆర్ ను సీఎంను చేయడానికి ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ఢంకా బజా యించి చెబుతున్న కేటీఆర్ కానీ, కాంగ్రెస్ కు అధికారపగ్గాలు ఇచ్చినందుకు జనం బాధపడుతు న్నారని చెప్పుకుంటున్న కేసీఆర్ కానీ తాము చెబుతున్న మాటలను తామే విశ్వసించడం లేదనడానికి నిదర్శనం ఎమ్మెల్సీ బరిలోకి దిగకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. వారు చెబుతున్న విధంగా రేవంత్ సర్కార్ పై నిజంగానే ప్రజలలో వ్యతిరేకత ఉంటే.. దానిని బీఆర్ఎస్ కు అనుకూలంగా మలచుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అందివచ్చిన అవకాశంగా భావించాల్సిన బీఆర్ఎస్ ఆ ఎన్నికలకు దూరం అవ్వడం అంటే.. ప్రజలలో తమ పార్టీ పట్ల సానుకూలత లేదని అంగీకరించడమేనని చెప్పాలి.
వాస్తవంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ప్రజల మూడ్ ను చాటి చెబుతుంది. ఎందుకంటే ఆ రెండు వర్గాలూ కూడా ప్రజలపై ప్రభావం చూపగలిగే వర్గాలే. అటువంటి టీచర్, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ వెనుకాడటం చూస్తుంటే.. ప్రజలలో తమ పార్టీకి ఏమంత పలుకుబడి లేదని బీఆర్ఎస్ అంగీకరిం చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.