పెద్దిరెడ్డి స్వాతి ముత్యమట!
posted on Aug 8, 2024 @ 12:21PM
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తానో స్వాతి ముత్యమని చెప్పుకుంటున్నారు. పుంగనూరు ప్రజలు తనను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనీ, తానోక శుద్ధమైన ప్రజానాయకుడిననీ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి నుంచీ తనను వ్యతిరేకిస్తున్నారనీ, అందుకే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారనీ వగస్తున్నారు. మదనపల్లి సబ్ కలక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనతో తనకు సంబంధం లేదని నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలలో చంద్రబాబును ఎదుర్కొని రాజకీయాలలో రాణిస్తున్నందునే తనపై కక్షగట్టి వేధిస్తున్నారనీ ఆవేదన చెందుతున్నారు. అయితే ఆయన ఈ మాటలన్నీ పుంగనూరులో మాట్లాడటం లేదు. ఎందుకంటే ఏడు సార్లు ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పుంగనూరు జనం ఆయనను నియోజకవర్గంలో అడుగు పెట్టనీయడం లేదు. వైసీపీ పరాజయం తరువాత పుంగనూరు నియోజకవర్గంలో పెద్ద రెడ్డి బాధితులు ఒక జాతరలా తరలి వచ్చి మరీ ఆయన భూదందాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయన పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తనకు తాను కితాబులిచ్చేసుకుని వీరతాళ్లు తగిలించేసుకున్నారు. నాలుగు దశాబ్దాల నిష్కళంక రాజకీయ జీవితం తనదని తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు. మరి ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణల సంగతేంటన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వడం లేదు.
పెద్ది రెడ్డి స్వోత్కర్షకూ పరనిందకూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దీటుగా బదులిచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం దోపిడీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనచరుల పాపాలు తప్పక పండుతాయని, చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఫైళ్లను తగుల బెట్టి ఇప్పుడు అమాయకపు ముఖం పెడితే తాను సుద్దపూసను, స్వాతిముత్యాన్ని అని చెప్పుకుంటే జనం నమ్మరని కుండబద్దలు కొట్టారు. పెద్దిరెడ్డి, ఆయన అనచరులు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనే దానికి... వారికి వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి తమకు అందిన వేలాది ఫిర్యాదులే తార్కాణమన్నారు. వారి కుటుంబాన్ని తమ ప్రభుత్వం వేధిస్తోందని పెద్ది రెడ్డి అనడం దొంగే దొంగదొంగ అన్నట్లుగా ఉందనీ, పెద్ది రెడ్డి కుటుంబం తమను వేధించిందంటూ వేల మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇచ్చారని చెప్పారు. మదనపల్లె ఫైళ్ల దగ్ఢం ఘటన కుట్ర కోణంలోనే జరిగిందని, సీ ఐ డీ విచారణలో దోషులను కచ్చితంగా తేలుస్తామని చెప్పారు. ప్రాధమిక సమాచారం మేరకు ఈ ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉందన్నారు.