కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. త్వరలో జన, కులగణన

  కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ సహ పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జనాభా లెక్కలు 2021 లోనే చేపట్టాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం వలన వాయిదా వేశారు. అలాగే సిల్చార్‌-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అలాగే చెరుకు పంటకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.355 ఎఫ్‌ఆర్‌పీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుంది. కులాల వారీగా ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తే, ప్రభుత్వాలు ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా పథకాలు రూపొందించడానికి వీలవుతుంది. అయితే, ఈ కులగణన ప్రక్రియ ఎలా సాగుతుంది, ఎంత సమయం పడుతుంది, దీనికి సంబంధించిన విధివిధానాలు ఏమిటి అనే విషయాలపై  మోదీ సర్కార్ నుంచి ఎలాంటీ క్లారిటీ రాలేదు.  

సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ శ్రీనివాస రాజు

  ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస రాజును ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. టీటీడీ జాయింట్ ఈవోగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత రిటైర్డ్ అయ్యారు. ఈవోగా పనిచేయాలని భావించినా అవకాశం రాలేదు. 2024 జులై నుంచి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న ఆయనను తాజాగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు.  ఏపీ ఐఏఎస్‌ క్యాడర్‌లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు పనిచేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించి, టీటీడీలో తనదైన ముద్ర వేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రనికి వ‌చ్చారు. తెలంగాణ నాలుగేండ్ల పాటు ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు.

అందాల పోటీలు నిర్వహించటానికి.. సీఎం రేవంత్‌కు బుద్ధి లేదు : సీపీఐ నారాయణ

  హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల  నిర్వహించనుండటంపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలికి చెందిన ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ విషయంపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారని నారాయణ ఆరోపించారు. "అందాల పోటీ అంటే స్త్రీలను నడిరోడ్డు మీద వేలం వేయడం కాదా? ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రికి బుద్ధి లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు.  ప్రభుత్వాలు మహిళలను స్వయం శక్తితో జీవించేలా ప్రోత్సహించాలని, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నారాయణ సూచించారు. అందాల పోటీల పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచడం సరికాదని, ఈ పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. తన మేనకోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, పది మందికి ఉపాధి కల్పించేందుకు సొంత వ్యాపారం ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు. మహిళలు ఇలా స్వయం ఉపాధి వైపు రావడాన్ని ప్రోత్సహించాలే తప్ప, అందాల పోటీలతో వారిని అపవిత్రం చేయకూడదని నారాయణ హితవు పలికారు. తన మేనకోడలు అందాల పోటీలో పాల్గొంటే ఫస్ట్ వస్తుందని... కానీ, అది తప్పు అని అన్నారు.

విశాఖ కలెక్టర్ పై బదలీ వేటు!

సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారు. గోడకూలి ఏడుగురు మరణించిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించారంటూ అధికారులపై నిప్పులు చెరిగారు.  అస‌లు ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింది? ఎవ‌రి నిర్ల‌క్ష్యం ఉంది?  చేసిన ఏర్పాట్లు ఏంటి?  అన్న విషయాలపై ఆరా తీశారు. గ‌త ఏడాది కంటే.. ఈ సారి ఎక్కువ మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసినా  నిర్ల‌క్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ నిలదీశారు.   ఈ క్ర‌మంలో క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్  ఏర్పాట్ల‌కు సంబంధించి ఎన్ని సార్లు సమీక్షించార‌ని ప్రశ్నిం చారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంలో తీరిక లేకుండా ఉన్న తాను సింహాచలంపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆయన సమాధానంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ ను వెంటనే బదిలీ చేయాలని సీఎస్ ను ఆదేశించారు. అలాగే హోంమంత్రి అనితపైనా ఆగ్రహం వ్యక్తం చే శారు. ఏర్పాట్లపై సమీక్షించారా అని నిలదీశారు.  కూలిన ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విషయాలపై తనకు మూడు రోజులలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

పహల్గాం ఉగ్రదాడి.. పార్టీల మధ్య పోస్టర్ వార్!

పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాని కదిల్చి వేసింది. కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు  అతీతంగా ప్రజలందరూ ఉగ్రదాడిని ఖండిస్తున్నారు.  పాకిస్థాన్ దుశ్చర్యను ప్రపంచ దేశాలు సైతం ఖండిస్తున్నాయి. మన దేశానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. దేశంలోనూ ఎక్కడిక్కడ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్వచ్చందంగా ప్రజలు ర్యాలీలు నిర్విహిస్తున్నారు.ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు.పాకిస్థాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని,కఠిన చర్యలు తీసుకోవాలని కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ప్రతి భారతీయ హృదయం ప్రతీకారంతో రగిలి పోతోంది. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా 140 కోటల మంది భారతీయులు ఒక్కటిగా నిలుస్తారని, భరోసా ఇస్తున్నారు.    అయితే.. ఇంతలోనే  పహల్గాం ఉగ్రదాడిపై రాజకీయ రాక్షస క్రీడ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. పోస్టర్ వార్ కు తెర తీసింది. కాంగ్రెస్‌ పార్టీ  తలలేని ప్రధాని’ పోస్టర్‌ ను  ఎక్స్ లో పెట్టడంతో రాజకీయం వేడెక్కింది. దీనిపై  దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టర్‌ను తొలగించింది. అయితే, కాంగ్రెస్ పోస్ట్ చేసిన పోస్టర్ దానికింద పెట్టిన ‘గయాబ్’ కాప్షన్’ పై బీజేపీ తీవ్రంగా  మండి పడింది. రాహుల్‌గాంధీ పాకిస్థాన్‌ మిత్రుడంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌ ట్వీట్‌ చేయడమేగాక..వీపు వెనుక కత్తి దాచుకుని ఉన్న రాహుల్‌ చిత్రాన్ని పోస్టు చేశారు. మరో వంక కాంగ్రెస్ పెట్టిన పోస్టును పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఫవాద్‌ చౌదరి రీట్వీట్‌ చేశారు. అగ్నికి ఆజ్యం తోడైంది. బీజేపీ కాంగ్రెస్ పై  విరుచుకుపడింది.  పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని పాల్గొనక పోవడంపై కాంగ్రెస్‌ తరచూ విమర్శలు చేస్తోంది. ఆ క్రమంలోనే తాజా పోస్టర్‌ను పోస్టు చేసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. కాంగ్రెస్‌ సంపూర్ణంగా పాకిస్థాన్‌కు మద్దతిస్తోందని.. ఆ పార్టీని ‘లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్ గా అభివర్ణించింది. అఖిల పక్ష సమావేశంలో ఐక్యత గురించి నొక్కిచెప్పిన  కాంగ్రస్  పార్టీ నేతలు పాక్‌తో చర్చలు జరపాలంటున్నారని ఆక్షేపించింది. తలలేని మొండెం.. ఆ పార్టీ ఉగ్ర సిద్ధాంతంగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. “రాహుల్‌గాంధీ ఆదేశాలతోనే ఆ పోస్టు పెట్టారు. దీనిని చూసి దేశం సిగ్గుపడుతోంది. క్లిష్ట సమయంలో భారత్‌ను బలహీనపరిచేందుకు లష్కరే పాకిస్థాన్‌ కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నమిది అని భాటియా విమర్శించారు. తలలేని మొండెం ఉగ్రవాద నినాదమని.. ఆ పార్టీ పోస్టర్‌ దానినే ప్రతిబింబిస్తోందన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తిపరచడానికే కాంగ్రెస్‌ తలలేని మొండెం చిత్రాన్ని పోస్టుచేసిందని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో ఆరోపించారు. ఈ వివాదంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు.‘‘పార్లమెంటు చర్చల్లో ప్రధాని పాల్గొని పహల్గాం ఘటన తదనంతర పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరాం.ఇందులో రాజకీయ ఎజెండా ఏమీ లేదు. ఐక్యతే కాంగ్రెస్‌ ఫార్ములా అని స్పష్టం చేశారు. నిజానికి పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపధ్యంగా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మొదలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య,ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరరులు చేసిన వ్యాఖ్యల ఆధారంగా, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పాక్ అనుకుల పార్టీ అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో  కాంగ్రెస్ పెట్టిన పోస్టును పాక్ నాయకులు రీట్వీట్ చేయడం కాంగ్రెస్ పార్టీని గట్టిగానే డ్యామేజి చేసింది. అందుకే  కాంగ్రెస్ పార్టీ ఎక్స్’ నుంచి పోస్టును ఉపసంహరించుకోవడమే  కాకుండా,  పార్టీ జనరల్ సెక్రటరీ, పహల్గాం ఉగ్రదాడి కి సంబందించి పార్టీ లైన్. దాటి వ్యాఖ్యలు, విమర్శలు చేయవద్దని నాయకులను ఆదేశించారు.  ఈ పోస్టర్‌పై కాంగ్రెస్‌ నాయకుల్లోనే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పార్టీ వైఖరికి భిన్నమైన పోస్టరుకు అనుమతించినందుకు పార్టీ సోషల్‌ మీడియా విభాగం సారథి సుప్రియ శ్రీనతేను కాంగ్రెస్‌ అధిష్ఠానం మందలించిందని, తక్షణం పోస్టరు తొలగించాలని ఆదేశించిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. నిజానికి, పహల్గాం ఉగ్రదాడి కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే హిందూ వ్యతిరేక, ముస్లిం అనుకూల పార్టీగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడుకుడితిలో పడ్డ ఎలుకల మారిందని, విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు విడుదల

  తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  ఇవాళ మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో  98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్‌ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈసారి అనూహ్యంగా ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు కావడం విశేషం.  బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 99.29 శాతంతో మహబూబ్‌నగర్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడవు ఇచ్చారు. ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు గాను ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు.కాగా, పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  

జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి

  కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ఛైర్మన్‌గా మాజీ రా అండ్ రా చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా తమ రంగాల్లో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు.  సైనిక సేవల నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు. వీరి సైనిక నైపుణ్యం, వ్యూహాత్మక దృష్టి బోర్డు నిర్ణయాలకు బలాన్ని చేకూర్చనుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి రిటైరైన రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ కూడా బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు దేశీయ భద్రత, లా అండ్ ఆర్డర్ విషయాల్లో తమ అనుభవాన్ని అందించనున్నారు.  

కుమార్తెను ముందుపెట్టి అవంతి శ్రీనివాస్ పొలిటికల్ స్కెచ్!

  వైసీపీకి షాక్ ఇచ్చిన తండ్రీకూతుళ్లు ఎన్నికల తర్వాత విశాఖలో ఇద్దరు నాయకులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు... ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే క్షణం ఆలోచించకుండా పార్టీ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు మాజీమంత్రి అవంతి శ్రీనివాస్.  వైసిపి నుంచి కార్పొరేటర్ గా గెలిచిన కీలకమైన సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసr కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియాంక. తండ్రి చేసిన పనికి ఓ పక్క భీమిలీ నియోజకవర్గంలో వైసీపీకి మనుగడే కరువైనట్లు కనిపిస్తుంటే మరోపక్క  కూతురు చేసిన పనికి వైసీపీ విశాఖ మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అవంతి శ్రీనివాస్‌తో పాటు ఆయన కూతురు లక్ష్మీ ప్రియాంక గురించి కూడా విశాఖలో జోరుగా చర్చ సాగుతుంది . 2009ల రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ నుంచి పోటీ చేసి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన అవంతి శ్రీనివాస్,  2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కి వెళ్లారు. 2019 ఎన్నికల్లో మళ్లీ భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.  ప్రస్తుత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్ వరుస విజయాలతో గురువులాగే లక్కీ పొలిటీషియన్ అనిపించుకున్నారు. చివరికి గత ఎన్నికల్లో తన గురువు గంటా చేతిలోనే అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఓటమి పాలయ్యారు. ఈ పదహారేళ్లలో పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను చుట్టేసిన అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పదవులకు రాజీనామా చేసి సైలెంట్ గా కాలం గడిపేస్తున్నారు... భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఓడిపోయిన  తర్వాత మూడు నెలలు తిరగకుండానే పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ పార్టీపై ఆరోపణలు చేసి మరీ బయటకు వచ్చేశారు.  ఊహించని విధంగా అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడం, పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతూ తీవ్రమైన విమర్శలు చేయడంతో భీమిలి నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా  వైసీపీ మీద నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఇది అవంతి ఫ్యామిలీ నుంచి వైసీపీకి తగిలిన మొదటి దెబ్బ అని చెప్పవచ్చు.  అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన ఆరు నెలల తర్వాత అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న భీమిలి నియోజకవర్గం లోని ఆరో డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి ప్రియాంక వైసీపీని ఊహించని దెబ్బ కొట్టారు. విశాఖ మేయర్ ఫై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్న కూటమి పార్టీలు వైసీపీ నుండి  జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లు  అందరికీ గేట్లు  తెరిచాయి.  మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికి కోరం సరిపోకపోయినా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో అటు వైసీపీ, కూటమి పార్టీలు నెలరోజులు క్యాంపు రాజకీయాలు నడిపాయి. ఈనెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు టిడిపి, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావలసిన కోరం 74 మ్యాజిక్ ఫిగర్ సరిపోయిందని అంతా అనుకున్నారు. అయితే పార్టీ మారి వచ్చిన ఒక వైసీపీ కార్పొరేటర్ ఊగిసలాట ధోరణి ప్రదర్శించడంతో కూటమి పార్టీల్లో టెన్షన్ కనిపించింది. అయితే అవిశ్వాస తీర్మానానికి అరగంట ముందు విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో అవంతి శ్రీనివాస్ కుమార్తె వైసీపీ కార్పొరేటర్ లక్ష్మి ప్రియాంక మెయిన్ రూల్ పోషించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా కూటమికి అనుకూలంగా ఓటు వేయడం వైసీపీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది. అప్పటివరకు వైసీపీ కార్పొరేటర్‌గా ఉన్న లక్ష్మీ ప్రియాంక ఎవరు ఊహించిన విధంగా కూటమి పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో వైసీపీ విశాఖ మేయర్ పదవిని కోల్పోయింది. అవంతి శ్రీనివాస్ ఫ్యామిలీ నుండి వైసీపీకి తగిలిన రెండో షాక్ అది. ఒకే కుటుంబం నుండి రెండు షాక్‌లు తగిలి విశాఖలో వైసీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారడంతో పార్టీ పెద్దలు ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్థంకాక సతమవుతమవుతున్నారంట.  ఆ క్రమంలో అవంతి శ్రీనివాస్  రాజకీయ ప్రయాణం ఎటువైపు అనే చర్చ మొదలైంది.వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ గత ఆరు నెలలుగా ఖాళీగానే ఉన్నారు. ఏ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. వైసీపీ  అధికారంలో ఉన్న సమయంలో పవన్, చంద్రబాబు, నారా లోకేష్ లపై అవంతి నిత్యం విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ ఎఫెక్ట్‌తో ఆయనకు టీడీపీ, జనసేనల్లో చేరడానికి దారులు మూసుకుపోయాయంటున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు అవంతి తన రాజకీయ గురువు  గంట శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గంట తో పాటు చంద్రబాబు లోకేష్‌లపై తరచూ విమర్శలు చేసిన అవంతి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వకుండా గంట పావులు కదుపుతున్నారంట. గంట మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో జనసేనలో అవంతి చేరడానికి కూడా అవకాశం లేదంటున్నారు. అదీకాక గతంలో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుప్పించడంపై జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  అవంతికి ఏ పార్టీలోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో తన కూతురు లక్ష్మీ ప్రియాంక ద్వారా కొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూటమిలోని టిడిపి, జనసేన పార్టీలు అడగకపోయినా  స్వచ్ఛందంగా కౌన్సిల్‌కి వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన లక్ష్మీ ప్రియాంక ఈ రెండు పార్టీలకు దగ్గరవ్వడానికే ఆ పని చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జనసేనకి దగ్గరై రానున్న రోజుల్లో ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారంట. అందుకే లక్ష్మీ ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా సైలెంట్ గా వచ్చి కూటమికి అనుకూలంగా ఓటు వేసి కూటమి పార్టీల గుడ్‌లుక్స్‌లో పడే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచిన లక్ష్మీ ప్రియాంకకు ఇంత ఆలోచన లేకపోయినా .. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన  తండ్రి అవంతి శ్రీనివాస్ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కుమార్తెను కూటమికి దగ్గర చేసే ఆలోచనతో ఓటు వేయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఆ తండ్రి కూతుళ్లు ఏ పార్టీలో చేరే అవకాశం లేకపోయినా, భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన సమయానికి కచ్చితంగా తమకు అవకాశం వస్తుందని వారు భావిస్తున్నారంట. మరి అవంతి శ్రీనివాస్,  లక్ష్మీ ప్రియాంకల ఆలోచనలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

టీడీపీ నేత దేవినేని కుమారుడి పెళ్లి వేడుకులకు హాజరైన సీఎం రేవంత్

  తెలుగుదేశం పార్టీ  సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి పెళ్లి వేడుకులు ఘనంగా నిర్వహించారు. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.  నూతన వధూవరులు నిహార్‌, సాయి నర్మదలను వారు ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్‌ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. రేవంత్‌, మంత్రి నారా లోకేశ్‌ కలిసి వివాహ వేడుక వద్దకు వచ్చారు. మరోవైపు  పెళ్లి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండడంతో తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల సమయం మార్పు జరిగింది.షెడ్యూల్ ప్రకారం ఒంటి గంటకు విడుదల కావాల్సి ఉండగా ఫలితాలు మధ్యాహ్నం 2.15కి  సీఎం రేవంత్‌ రెడ్డిఫలితాలు విడుదల చేయనున్నరు  

విజయవాడలో షర్మిల హౌస్ అరెస్టు

ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్  అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో  పోలీసులు పెద్ద సంఖ్యలో విజయవాడలోని   షర్మిల నివాసానికి  చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచారు.  ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు హుటాహుటిన షర్మిల నివాసానికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆమెను ఎందుకు హౌస్ అరెస్ట్‌లో ఉంచారంటూ నిలదీశారు. తనను అకారణంగా హౌస్ అరెస్ట్ చేశారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో కనీసం కారణం కూడా చెప్పలేదన్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  తన వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నారని, ఎలా ఉత్పన్నమౌతుందో చెప్పలేకపోతున్నారని షర్మిల పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను సైతం ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందంటూ షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతోందని నిలదీశారు.  ఇలా ఉండగా వచ్చే నెల 2న ప్రధాని నరేంద్రమోడీ ఉద్దండరాయుని పాలెంలో పర్యటించనున్నారు. అమరావతి పనుల పున: ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం (ఏప్రిల్ 30) ఉద్దండరాయుని పాలెంలో పర్యటించాలని నిర్ణయించారు. అయితే మోడీ పర్యటన, సభ ఏర్పాట్ల నేపథ్యంలో షర్మిలను ఉద్దండరాయున పాలెంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు పోలీసులు ఆమెను విజయవాడలోని ఆమె నివాసంలోనే అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. మోడీ పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించినట్లు తెలపిన పోలీసులు ఆమెను ఉద్దండరాయని పాలెంలో పర్యటించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో తీవ్ర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్దండరాయని పాలెం వెడతానంటూ షర్మల భాష్మించారు. తనను అనుమతించకుంటే ధర్నాకు దిగుతాననీ, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిరశన దీక్ష చేపడతానని షర్మిల హెచ్చరించారు. 

సింహాచలం దుర్ఘటన మృతుల గుర్తింపు

సింహాచలం చందనోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న అపశ్రుతిలో మృతులను గుర్తించారు. వారి వివరాలను అధికారికంగా ప్రకటించారు. మృతుల వివరాలిలా ఉన్నాయి. కోనసీమ జిల్లాకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషరావు, పత్తి దుర్గాప్రసాద్ నాయుడు, విశాఖలోని అడవివరం ప్రాంతానికి చెందిన ఎడ్ల వెంకట్రావు  మధురవాడ చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన పిల్లా శైలజ, పిల్లా మహేష్ , హెచ్.పీ కాలనీకి చెందిన గుజ్జారి మహాలక్ష్మి 65, పైలా వెంకటరత్నం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది అలాగే కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత పరామర్శించారు మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రులను బుధవారం (ఏప్రిల్ 30) పరామర్శించనున్నారు.  కాగా మృతులలొ  హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, ఆయన భార్య శైలజ ఉన్నారు. వీరిరువురికీ మూడేళ్ల కిందట వివాహమైంది. హైదరాబాద్ లోని వేర్వేరు సంస్థలలో పని చేస్తున్న వీరు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారు జామునే రూ.300ల ప్రత్యేక దర్శనం క్యూలైన్ లో వేచి ఉన్నారు. భారీ వర్షానికి గోడ కూలిన ఘటనలో వీరివురూ అక్కడికక్కడే మరణించారు.  ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో భార్యాభర్తలిరువురూ ఇలా మరణించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులూ శోకసంద్రంలో మునిగిపోయారు.  

గంటా, విష్ణుకుమార్ రాజు వివాదం.. టీ కప్పులో తుపాన్!

సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చిన్న చిన్న పొరపొచ్చారు, విభేదాలు తలెత్తడం సాధారణమే. అటువంటి చిన్న ఇబ్బందే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ నార్త్  ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్య తలెత్తింది. వారిరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ఫిల్మ్ నగర్ లీజు అంశానికి సంబంధించి ఇరువురి  మధ్యా వాగ్వాదం జరిగింది. విషయమేంటంటే ఈ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.  ఆ సందర్భంగా ఆయన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రస్తావించారు. దీనిపై గంటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లీజు విషయంలో అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి ముందు స్థానిక ఎమ్మెల్యేనైన తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్నది గంటా అభ్యంతరం. ఈ విషయంలో ఇరువురి మధ్యా జరిగిన వాగ్వాదం ముదిరి పాకాన పడుతుందని అంతా భావించారు. అయితే సకాలంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురికీ  సర్ది చెప్పడంతో  ఈ వివాదం టీకప్పులో తుపానుగా తేలిపోయింది.    విశాఖలో జరిగిన ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీ సమావేశం సందర్భంగా  రఘురామకృష్ణం రాజు ఇరువురు ఎమ్మెల్యేలనూ ఒక దగ్గర కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం నెరిపారని తెలుస్తోంది.  రఘురామకృష్ణం రాజు జోక్యంతో ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా విభేదాలను మరచి ఇరువురూ కలిసిపోయారని తెలుస్తోంది. సకాలంలో  జోక్యం చేసుకుని వివాదం ముదరకుండా నిలువరించడంలో రఘురామకృష్ణం రాజు చోరవ పట్ల కూటమి పార్టీల్లో హర్షం వ్యక్తమౌతోంది.  

గోరంట్ల మాధవ్ మళ్లీ మెదలెట్టేశారు!

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ  ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు. ఎంపీగా ఉండగా ఆయన తన పనితీరు కంటే న్యూడ్ వీడియోద్వారానే ఎక్కువ మందికి తెలిశారు. అంతకు ముందు పోలీసు అధికారిగా ఉండగా తెలుగుదేశం నాయకులపై తొడకొట్టి సవాల్ చేసి జగన్ దృష్టిలో పడి ఎంపీ టికెట్ కొట్టేసి గెలిచేసిన గోరంట్ల మాధవ్.. ఆ తరువాత కూడా తరచూ వివాదాలతోనే జనం నోళ్లలోనానారు.  ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును  ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్శించారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ నెల 10 నుంచీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ బెయిలుపై విడుదలయ్యారు. విడుదలైన గంటల వ్యవధిలోనే తన నోటికి పని చెప్పారు. గతంలో పోలీసు అధికారిగా పని చేసిన గోరంట్ల మాధవ్ పోలీసుల విధులను అడ్డుకోవడం, వారిపై దాడికి పాల్పడడం నేరాలని తెలియంది కాదు. కానీ ఆ పనే చేసి అరెస్టయ్యారు. కానీ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు ప్రతీకార రాజకీయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.   కటకటాలు లెక్కపెట్టినా ఆయన తీరులో మార్పు రాలేదు. వాస్తవానికి వైసీపీ నేతలలో అత్యధికులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతులతోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. అలా ఒక నెగటివ్ ఇమేజ్ తో పాపులర్ అయిన వైసీపీ నేతలలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. తాజాగా ఆయన జైలు నుంచి షరతులతో కూడిన బెయిలుపై విడుదలయ్యారు.   మాజీ పోలీసు అధికారి అయిన మాధవ్.. ఇప్పుడు గుంటూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలి. కోర్టు విధించిన షరతులలో ఇది ఒకటి. అయినా గోరంట్ల మాధవ్ తీరు మారలేదు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చారో లేదో అలా చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు.  చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించిన గోరంట్ల మాధవ్ అన్నిటినీ గుర్తుపెట్టుకుంటాం. మా పిక్క మీద వెంట్రక కూడా పీకలేరంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు చంద్రబాబుకు, ఆయన మనుషులకు గట్టి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరిక జారీ చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సంగతి చూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ లో చ ర్చనీయాంశంగా మారింది. చింత చచ్చినా పులుపు చావలేదంటూ నెటిజన్లు గోరంట్ల మాధవ్ పై సెటైర్లు పేలుస్తున్నారు. 

ప్రగల్బాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్?

ప్రగల్బాలు పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్  దేనికైనా రెడీ అంటూ బీరాలు..భారత్‌లో రక్తంపారిస్తామంటూ కారుకూతలు... కన్నుకి కన్ను..పన్నుకు పన్ను అంటూ డైలాగులు...తీరా కట్ చేస్తే పాక్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్‌ ... అవును మీరు వింటున్నది నిజమే. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్ కన్పించడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత...రెచ్చిపోయి మాట్లాడిన మునీర్‌... అదృశ్యమయ్యాడు. రెండ్రోజులుగా ఎవరికీ కన్పించడం లేదు. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ దేశం విడిచి వెళ్లిపోగా...తాజాగా పాక్ ఆర్మీ చీఫ్‌ మిస్స్‌ అవ్వడం సంచలనంగా మారింది. అతడు రావల్పండిలోని బంకర్‌లో దాక్కున్నట్లు వార్తలు వస్తున్నాయ్‌. రెండ్రోజుల క్రితం పాక్‌ ప్రధాన మంత్రి  ఓ ఫొటో షేర్ చేసింది. అందులో ప్రధాని పక్కన ఆర్మీ చీఫ్‌ ఉన్నట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ పోస్టు అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది. పహల్గామ్‌ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పాక్ ఆర్మీకి పట్టుకుంది. దేనికైనా సిద్ధం, యుద్ధానికి రెడీ అంటూ పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా.. లోలోపల గజగజ వణికిపోతుంది. ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో పాక్‌కు బాగా తెలుసు. గతంలో జరిగిన అనుభవాలు కళ్లముందే ఉన్నాయ్‌. సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఎయిర్‌ స్ట్రైక్స్‌ను ఇంకా మరిచిపోలేదు. ఈసారి  భారత్ నుంచి అంతకు మించి రియాక్షన్ ఉంటుందని భావిస్తోంది పాక్‌.  ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు నుంచే...సరిహద్దు సమీపంలోకి ఆయుధాలను తరలిస్తోంది దయాది దేశం. LOC వెంబడి భారత వైమానిక దాడులను పసిగట్టడానికి చర్యలు చేపట్టింది. సియాల్‌కోట్‌ ప్రాంతానికి పాకిస్థాన్‌ సైన్యం తన రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుకు 58 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖోర్‌ కంటోన్‌మెంట్ వద్ద టీపీఎస్‌-77 రాడార్ సైట్‌ను ఏర్పాటు చేసింది. టీపీఎస్‌-77 మల్టీ-రోల్ రాడార్ అనేది అత్యంత సామర్థ్యం గల రాడార్ వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు, ఎయిర్‌ ట్రాఫిక్‌ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు.  ఇటు పీవోకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. పీఓకే ప్రాంతం అంతటా చాలా లాంచ్ ప్యాడ్‌లు ఉన్నట్లు భారత భద్రతా సంస్థలు గుర్తించిన కొంతసేపటికే.. పాకిస్తాన్ ఈ చర్య తీసుకుంది. కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్‌కోట్, జంకోట్ నుండి ఉగ్రవాదులను తరలించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాక్ చర్యలను ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు పసిగడుతోంది. ఇప్పటికే LOC వెంబడి నిఘా పెంచింది. ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ జెట్స్‌తో విన్యాసాలు  చేపట్టింది. గతవారం రఫేల్ సహా ఫైటర్ జెట్లు పెద్దఎత్తున సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. ఇటు నేవీ కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. దాంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

మృతుల కుటుంబాలకు పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా

సింహాచలం అప్పన్నచందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఘ సానుభూతి తెలియజేశారు. భారీ వర్షం కారణంగానే గోడకూలిందన్న ఆయన.. సింహాచలంలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అదలా ఉండగా..సింహాచలం ప్రమాద ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాలవీరాంజనేయులు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ , ఎంపీ భరత్, సింహాచలందేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, అధికారులు పాల్గొన్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పాతిక లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మూడు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.  భాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు.  ఇలా ఉండగా సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

సింహాచలం విషాదం..ఈ పాపం ఎవరిది ?

సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ జరిగిన అపశ్రుతి అత్యంత విషాదకరం. గోడ కూలడమే ప్రమాదానికి కారణం అయినప్పటికీ.. ఈ దుర్ఘటన అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నది.  భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం ఒక కారణమైతే కావచ్చు కానీ, సింహాచలం అప్పన చందనోత్సవ సమయంలో ప్రతి ఏటా ఏదో ఒక గలాటా జరుగుతూనే ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడటానికి బాధ్యులెవరన్నది తేల్చాల్సి ఉంది. ఏడాది మొత్తంలో ఒక రోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. ఆ కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  సరిగ్గా అక్షయ తృతీయ రోజు జరిగే ఈ చందన యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడం రివాజు. అయితే గతంలో కేవలం పరిమిత భక్తులతో  మాత్రమే ఈ యాత్ర సాగేది. అయితే తరువాత తరువాత పరిస్థితి మారింది. ఇదో వీఐపీ యాత్రగా మారిపోయింది. సాధారణ భక్తుల తాకిడికి తోడు వీఐపీల హడావుడీ అధికమైంది.  ముఖ్యంగా  పోలీస్, పొలిటికల్, జ్యుడిషరీ, దేవాదాయ, రెవెన్యూ  విభాగాల నుంచి వీఐపీల ఎక్కువైపోయింది. దీంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో చ ందనోత్సవ సమయంలో ప్రతిఏటా సమస్యలు ఉత్పన్నమౌతూనే ఉన్నాయి. తాజా సంఘటనే తీసుకుంటే.. మంగళవారం (ఏప్రిల్ 29)అర్ధరాత్రి దాటిన తరువాత, బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.  దీంతో సాధారణ దర్శనం కోసం క్యూ లైన్ లో ముందు రోజు రాత్రి నుంచీ  వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సరిగ్గా అదే సమయంలో 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తుల క్యూ లైన్ కు  ఆనుకుని ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ గోడను ఇటీవలే తాత్కాలికంగా నిర్మించారు దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందా అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.  ఏటా చందనోత్సవం సమయంలో దేవాదాయ శాఖలో ఏదో ఒక సమస్య, ఇబ్బంది సాధారణం అయిపోయింది. ఒకసారి ఈవో కు వ్యతిరేకంగా, మరోసారి ఉద్యోగులకు వ్యతిరేకంగా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రధానంగా టికెట్ల  కేటాయింపు విషయంలో  గందరగోళం నెలకొంటుంది.  సాధారణ భక్తులు డబ్బులు ఇచ్చి కొనే టికెట్ల కంటే..  ప్రోటోకాల్ టికెట్లకి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతున్నది.  ఇక విషయానికి వస్తే..  గోడ కూలిన ఘటనలో ఏడుగురు  మృతి చెందారు ఘటనా స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాధ్యులెవరైనా, ఎంతటి వారైనా వదిలేది లేదని హోంమంత్రి ఇప్పటికే హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించినట్లైతే.. ఈ దుర్ఘటనకు ఇంజినీరింగ్ అధికారుల వైపల్యం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలం ఆలయంలో ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం చాలా వరకు ఉంటుంది మెట్ల మార్గం నిర్మాణం రోడ్ల విషయంపై కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి తాజా ఘటనలతో పూర్తి విచారణ జరిపించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  ఇక సింహాచలంలో కూడా తిరుమల తరహాలో దర్శనాలు కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన గత ఏడాదే అప్పటి జిల్లా కలెక్టర్ చేశారు.  టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే లోపలికి వెళ్లే రీతిన ఆటోమేటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలావరకు తొక్కిసలాటలు నిరోధించే అవకాశం ఉంటుంది.  ప్రధానంగా వీఐపీల పేరిట సింహాచలంలో దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది దీనివలన ఆదాయం కోల్పోవడం మాత్రమే గాక ఇతర భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.

కృష్ణారెడ్డి ఐపీఎస్.. కృషి ఉంటే యువకులు ఐపీఎస్ లు అవుతారు!

ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి.. ఐపీఎస్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు  ఉదయ కృష్ణారెడ్డి. అందుకే, స్వయం కృషికి సజీవ రూపంగా నిలిచే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయ కృష్ణారెడ్డిని అభినందించారు. కన్న కలలను సాకారం చేసుకున్న కృష్ణా రెడ్డి.. కలలు కనండి , కన్న కలలను సాకారం చేసుకోండి, అన్న మరో మహనీయుడు, ప్రాతః స్మరనీయుడు, మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాంను కూడా  గుర్తుకు తెచ్చారు. ఆ విధంగానూ కృష్ణా రెడ్డి  అభినందనీయుడు.  అవును. చంద్రబాబు నాయుడు తమ అభినందన సందేంలో అన్నట్లుగా  ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితాని ప్రారంభించి  ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన కృష్ణా రెడ్డి జీవితం యువతకు ఒక ఆదర్శం. నిరంతర పరిశ్రమతో, కృషి, పట్టుదలను తోడు చేసుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కలైనా  సాకారం అవుతుందని.. ఎంతటి అవరోధాలనైనా అతిక్రమించ వచ్చునన్న సత్యాన్ని కృష్ణా రెడ్డి మరోమారు నిరూపించారు. అవును..  ముఖ్యమంత్రి అనంట్లుగా ఓటమిని అంగీకరించని వారిదే భవిష్యత్ అని మరో నిరూపించిన, కృష్ణా రెడ్డి  ఐపీఎస్ నిజంగా అభినందనీయుడు. ఎవరీ కృష్ణా రెడ్డి, ఏమా కథ? అంటే..  ప్రకాశం జిల్లాలోని ఉల్లపాలెం గ్రామానికి చెందిన ఎం. ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 350 ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో స్థానం సంపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అభినందనలు అందుకున్నారు. కలలు కనండి ...కన్న కలలను సాకారం చేసుకోండి  అన్న మాజీ రాష్ట్రపతి ఎపీజే అబ్దుల్ కలాం  సందేశానికి  సజీవ రూపంగా నిలిచిన  ఉదయ కృష్ణారెడ్డి 2013లో,ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. గుడ్లూరు, రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అదే సమయంలో, ఉన్నతాధికారి నుంచి ఎదురైన అవమానాలు అతనిలో ఐపీఎస్  కావాలనే ఆకాంక్షను రగిల్చాయి. ఆ అధికారి చేసిన అవమానమే అతనిలో అశయాన్ని రగిల్చింది.  పేదరికంలో పుట్టి..  చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయకృష్ణారెడ్డిని అతని అమ్మమ్మ రమణమ్మ పెంచింది. కూరగాయలు అమ్ముకుని పొట్ట పోసుకునే  రమణమ్మ, మనవడిని పెంచి పెద్ద చేసింది. అలాగే, అతని మామ కోటి రెడ్డి చేయూత నిచ్చారు. చేయి పట్టి నడిపించారు. అటు అమ్మమ్మ రమణమ్మ,ఇటు మేన మామ కోటి రెడ్డి ఇచ్చిన చేయూతతో, కృష్ణారెడ్డి  2013లో ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో  కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఉన్నతాధికారి చేసిన అవమానాలకు సమాధానంగా ఐఏఎస్ కావాలని సంకల్పం చెప్పుకున్న, కృష్ణారెడ్డి, 2018 లో సివిల్ సర్వీసెస్ పూర్తి సమయం కోసం కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పట్టు వదలని విక్రమార్కునిలా  మరో ప్రయత్నం చేశారు. ఈసారి 780 వ ర్యాంక్ వచ్చింది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ లో ఉద్యోగం వచ్చింది. అయినా, ఐపీస్  కావాలనే, ఆశయాన్ని చంపుకోలేదు. కల అంటే నిద్రలో వచ్చేది కాదు... నిద్ర పోనివ్వకుండా చేసేది కల   అన్న   కలాం స్పూర్తితో  రైల్వే సర్వీస్  శిక్షణ సమయంలో మరోమారు సివిల్స్ రాశారు. 350వ ర్యాంక్ సాధించారు. ఐపీఎస్ కల సాకారం చేసుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.  ఇప్పుడు ఉదయ కృష్ణా రెడ్డి. ఐపీఎస్.. భారతీయ యువత లో అపారమైన సామర్ధ్యం ఉందని, ఆత్మ స్థైర్యంతో ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగితే విజయం తధ్యమని విశ్వాసం వ్యక్త పరిస్తున్నారు. అమ్మమమ రమణమ్మ, మామయ్య కోటి రెడ్డి తన జీవితాన్ని తీర్చి దిద్దారని అన్నారు.అలాగే, తన ప్రయాణంలో సహకరించిన  మెంటర్స్,కు కృతజ్ఞతలు తెలిపారు.  అన్నివిధాల తండ్రిలా ఆడుకున్నఅదనపు డీజీ మహేష్ భగవత్‌కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.