మృతుల కుటుంబాలకు పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా
posted on Apr 30, 2025 @ 10:09AM
సింహాచలం అప్పన్నచందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఘ సానుభూతి తెలియజేశారు. భారీ వర్షం కారణంగానే గోడకూలిందన్న ఆయన.. సింహాచలంలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదలా ఉండగా..సింహాచలం ప్రమాద ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాలవీరాంజనేయులు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ , ఎంపీ భరత్, సింహాచలందేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, అధికారులు పాల్గొన్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పాతిక లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మూడు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. భాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు.
ఇలా ఉండగా సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.