తిరుపతి బుగ్గమఠం భూముల్లో సర్వే..ఉద్రిక్తత
posted on May 3, 2025 @ 2:46PM
తిరుపతిలోని దేవదాయ శాఖకు చెందిన బుగ్గమఠం భూముల్లో సర్వే చేపట్టారు. 261/1, 261/2 సర్వే నంబర్లలో 3.88 ఎకరాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మరో నలుగురు ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆక్రమణల గుట్టు విప్పేందుకు అధికారులు రంగంలోకి దిగారు. రోవర్‌తో బుగ్గమఠం భూముల వద్దకు అధికారులు వచ్చారు. డిస్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ చిట్టిబాబు, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి ఈ సర్వేలో పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం పర్యటన దృష్ట్యా గత నెలలో సర్వే వాయిదా పడింది. ఆక్రమిత బుగ్గమఠం భూముల సర్వే కోసం గత నెల 11న దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది.. అయితే.. ఆ భూములతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని చెప్పారు. సర్వే ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ పోలీసుల మధ్య సర్వే కొనసాగుతోంది. అయితే ఆ భూముల అనుభవదారులు వెంకట్రాయులు, మునిరత్నం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. వెంకట్రాయులు, మునిరత్నంతో మాట్లాడారు. అనంతరం భూముల సర్వే కొనసాగుతోంది.