క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికే క్లాసులు!

నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టీ పీసీసీ  క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన తరువాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరయ్యారు . అదే కార్యక్రమానికి  అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు అటెండ్ అయ్యారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మల్లు రవితో విజయుడు  గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో భేటి కావడంతో పాటు ఆయనతో కలిసి గద్వాల కాంగ్రెస్ ఇంచార్జీ సరిత నివాసంలో తేనీటి విందులో పాల్గొన్నారు .  అయితే  ఎంపి మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు భేటీ కావడం, ఆయనతో పాటు సరిత నివాసానికి వెళ్లిన విజయుడుని శాలువా, బొకేలతో సత్కరించడం  కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి . ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్‌లో చేరేందుకే  మల్లు రవి తో భేటీ అయ్యారని , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆదేశాలతోనే విజయుడు కాంగ్రెస్ ఎంపీతో మంతనాలు సాగించారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. మరో పక్క  ఎంపీ మల్లు రవి  గద్వాల ఎమ్మెల్యే ఇంటికి, జడ్పీ మాజీ చైర్మన్ సరిత ఇంటికి విజయుడిని వెంటబెట్టుకుని తన వాహనంలో తీసుకుపోవడంపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పరాజయం పాలైన సంపత్ వర్గం గుర్రుగా ఉన్నారు . కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లురవిపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడంటూ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్  మీనాక్షి నటరాజన్ కు అలంపూర్ కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వెంట తిప్పుకోవడాన్ని అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు పడుతున్నారు .  ఆ క్రమంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై ఆ పార్టీ నేత అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అలంపూర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించానన్నారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు. ఎంపీగా మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో అఫీషియల్‌గా మీటింగ్ పెడితే బాగుండేదని, కానీ అన్ అఫిషియల్‌గా బీఆర్ఎస్ నాయకులతో మీటింగ్ పెట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పూల బొకేలు, శాలువలతో సత్కరించడం, ఎమ్మెల్యే విజేయుడు ఎప్పటికైనా కాంగ్రెస్‌లోకి వచ్చే వ్యక్తి అని కామెంట్స్ చేయడం బాధ అనిపించిందన్నారు సంపత్ కుమార్.  ఆయన్ను ఎంపీగా గెలిపించడం కోసం రక్తం దార పోశానని, ఇప్పుడు ఆయనకు అవేమీ గుర్తులేకుండా పోయాయని సంపత్ కుమార్ అవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఇష్యూకు తొందరగా పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలని, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమని, అయితే వాటిని అధిగమించి, పరిష్కరిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. మరి ఈ వ్యవహారం ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి.

అఖండ గోదావరి ప్రాజెక్టుకు 19న శంకుస్థాపన.. పర్యాటకానికి కొత్త సొబగు

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 19న  ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేయనున్నారు.  ఈ ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి. రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.  చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో   ప్రతిష్ఠాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం ద్వారా మంజూరైన రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయి. పుష్కరాల లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 

బెంగళూరు తొక్కిసలాట.. కింగ్ కోహ్లీపై ఫిర్యాదు

ఆర్సీబీ విజయంతో బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. తొక్కిసలాటకు సంబంధించి ఆర్సీబీ కీలక ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై   హెచ్‌ఎం వెంకటేష్‌ అనే సామాజిక కార్యకర్త  ఫిర్యాదు చేశారు. కాగా కోహ్లీపై ఫిర్యాదు అందిందని ధృవీకరించిన పోలీసులు ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగానే పరిగణించి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా బెంగళూరు తొక్కిసలాటకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంకర్, కో:ాధికారి జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. తొక్కిసలాట ఘటనలో తన పాత్ర, ప్రమేయం లేకపోయినా నైతిక బాధ్యత వహించిన రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  ఇక పోతే  తొక్కిసలాటకు సంబంధించి కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  

తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో ఉత్పత్తులు.. టీటీడీ లీగల్ నోటీసులు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక హక్కులను ఉల్లంఘిస్తున్న పుష్ మై కార్ట్ సంస్థ కు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఒక్క పుష్ మై కర్డ్ సంస్థకే కాకుండా ఇలా లడ్డూ ప్రసాదం పేరును, పవిత్రతను అనధికారికంగా ఉపయోగించుకుంటున్న పలు ఇతర సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమై లీగల్ నోటీసులు జారీ చేసింది.   కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాదం పేరుతో వ్యాపారం చేస్తున్నపుష్ మై కార్ట్ సహా పలు సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.  తిరుమల శ్రీవారి లడ్డూకు 2009 సెప్టెంబరులోనే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ ద్వారా పేటెంట్ హక్కులు లభించాయి.  అంతకుముందే 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద టీటీడీ ఈ హక్కులను పొందింది.  అయితే పలు మిఠాయి దుకాణాలు, ఆన్‌లైన్ సంస్థలు 'శ్రీవారి లడ్డూ పేరుతో  ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు టీటీడీ కన్నెర్ర చేసింది.  ఇలా శ్రీవారి లడ్డూ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తున్న పుష్‌ మై కార్ట్, ట్రాన్సాక్ట్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఇండియా స్వీట్‌ హౌస్‌ వంటి సంస్థలకు టీటీడీ గత నెల 31న లీగల్ నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులకు పుష్‌ మై కార్ట్‌ సంస్థ  స్పందించి తమ ఉత్పత్తుల జాబితా నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును తొలగించింది. ఈ మేరకు టీటీడీకి సమాచారం అందించింది.  దీనిపై టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోట్లాది మంది భక్తుల విశ్వాసం అని పేర్కొన్నారు. అలాంటి విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చుకునేందుకు ఎంత మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.  భక్తుల మనోభావాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  లడ్డూ పవిత్రతను, ప్రాశస్థ్యాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుబడి ఉందని శ్యామలరావు అన్నారు.  

ట్రంప్ పై మస్క్ పేల్చిన ఎప్ స్టీన్ బాంబు.. అధ్యక్ష పీఠానికి ఎసరేనా?

ఎప్ స్టీన్ మామూలోడు కాడు. ఇటు బిల్ క్లింట‌న్ లాంటి ప్రెసిడెన్షియ‌ల్ ప‌ర్స‌నాల్టీస్.. అటు హాలీవుడ్ హీరోస్ తో క‌స్ట‌మైజ్డ్ ప్రైవేట్ జెట్స్ లో ఆఫ్రికా ప‌ర్య‌ట‌న చేసికొచ్చిన ర‌కం. దీన్నిబ‌ట్టే అర్ధం చేసుకోవ‌చ్చు.. ఎప్ స్టీన్ ఎలాంటివాడో. అంతే కాదు.. ఎప్ స్టీన్ కి ఏకంగా ఒక మైన‌ర్ బాలిక తో ఎఫైర్ ఉన్న‌ట్టు ఆరోపణలు ఉన్నాయి. అత‌డి పామ్ బీచ్ హౌస్ నిండా ఆమె ఫోటోలున్న‌ట్టు గుర్తించారు పోలీసులు.  మైన‌ర్ అమ్మాయిల‌ను స‌ర‌ఫ‌రా చేసే బ్రోక‌ర్.  ఇత‌డు ఇంగ్లాండ్ రాజ‌కుమారుడితో దిగిన ఫోటో ఒక సంచ‌ల‌నం. అంతేనా ఇత‌డిపై న్యూయార్క్ లో ఒక కేసుంది. ఆ కేసు ప్ర‌కారం ఇత‌డు మైన‌ర్ బాలిక‌ల‌తో సెక్స్ రాకెట్ న‌డిపిన‌ట్టుగా చెబుతున్నాయి రికార్డులు. ఇత‌డికీ ట్రంప్ కి 1994 నుంచి సంబంధాలున్నాయి. ఇద్ద‌రూ క‌ల‌సి  పార్టీల‌కు వెళ్లిన దాఖ‌లాలున్నాయి. అంతే కాదు..  ఎప్ స్టీన్ తన‌కు అత్యంత స‌న్నిహిత‌మైన మిత్రుడ‌ని న్యూయార్క్ మేగ‌జైన్ కి 2002లో  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్వయంగా చెప్పారు.  ఆ టైంలో ట్రంప్ చేసిన మ‌రో కామెంట్ ఏంటంటే.. అత‌డికి నాకులాగా అంద‌మైన అమ్మాయిలంటే ఇష్టం. అది కూడా   చిన్న వ‌య‌సు వారు కావ‌డం విశేష‌మంటూ అప్ప‌ట్లోనే ఓపెన్ అయ్యారు మిస్ట‌ర్ ట్రంప్. ఇక ట్రంప్ గురించి  .. క్రాసింగ్ ద లైన్.. ట్రంప్ విత్ విమ‌న్ ఇన్ ప్రైవేట్ టైం.. అంటూ న్యూయార్క్ టైమ్స్ మేగజైన్    ప్రచురించిన .. కథనంలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు బ‌య‌ట ప‌డ్డాయి. ఏ రొమాంటిక్ హాలీవుడ్ మూవీకి తీసిపోన‌నంత రొమాంటిక్ లైఫ్ ను ట్రంప్ అనుభవించిన‌ట్టు చెబుతుందీ క‌థ‌నం. ట్రంప్ కి 1970 నుంచి పాతిక మంది వ‌ర‌కూ మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాలున్న‌ట్టు పేర్కొంది. మోడ‌లింగ్ చేసే టైంలో, అందాల పోటీల స‌మ‌యంలో, ఇత‌ర ప‌ని ప్ర‌దేశాల్లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించేవాడ‌ని. ఆ కథనం పేర్కొంది. అయితే ట్రంప్ మీద ఇప్పటి వరకూ ఏ ఒక్క  మ‌హిళ ఫిర్యాదు చేయలేదు.   అయితే 2016లో ఓ మహిళ ట్రంప్ పై మూడు సార్లు దావా వేసి ఉపసంహరించుకుంది.  ఇందుకు బెదరింపులే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటికి ఆధారాలు లేవు. అందుకే ట్రంప్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను వై విమెన్ నాట్ రిపోర్ట్?  అంటూ క్యాంపెయిన్ చేసి గ‌ట్టెక్కారు. వారంతా త‌న‌పై డ‌బ్బుకోస‌మో, పేరు కోస‌మో ఇలా చేస్తారంటూ తిప్పి కొడ‌తారు.  ఇక పోతే ట్రంప్ కుటుంబం   ఆయన్ని గట్టిగా వెనకేసుకు వస్తున్నది.  ఆయ‌న ఆడియో టేపులు బ‌య‌ట ప‌డడాన్ని ఒక కుట్ర‌గా అభివర్ణించారు ఆయన కుమార్తె  ఇవాంక ట్రంప్. ఇక ఆయ‌న స‌తీమ‌ణి మెలానియా అయితే మా ఆయ‌న జెంటిల్ మెన్ అన్నారు. ఆయ‌న ఎదుగుద‌ల ఓర్చుకోలేక‌ గిట్ఇటని వారే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు.   ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే ప్ర‌స్తుతం మ‌స్క్ వెలికి తీసిన ఎప్ స్టీన్ 2019లో అరెస్టు కాగా అత‌డ్ని న్యూయార్క్ జైల్లో ఉంచారు. అయితే అత‌డు అనుమానాస్ప‌దస్థితిలో మ‌ర‌ణించారు. ఈ విష‌యంలోనూ ఎన్నో అనుమానాలున్నాయి.. వీట‌న్నిటి దృష్ట్యా మ‌స్క్ ట్రంప్ పై ఈ బాంబు వేశారు.  ఇదిప్పుడు ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే.. ట్రంప్ ని అధ్య‌క్ష పీఠం నుంచి తొల‌గించి.. ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ తో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌న్న డిమాండ్ జోరందుకుం టోంది. ఇప్పుడు సిట్యువేష‌న్ ఎలా త‌యారైందంటే.. ఎవ‌రైనా ఎనిమీతో పెట్ట‌ుకున్నా బ‌తికి బాగు ప‌డతారామోగానీ.. ఒక ఫ్రెండ్ ఎనిమీ అయితే మాత్రం ఇదిగో ట్రంప్ వ‌ర్సెస్ మ‌స్క్ లా త‌యార‌వుతుంద‌న్న మాట వినిపిస్తోంది.

9న సిట్ విచారణకు ప్రభాకరరరావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్‌రావుకు సోమవారం (జూన్ 9) సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఆయన  గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయనకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ  జారీ కావడంలో జరిగిన జాప్యంతో ఇండియాకు రాలేకపోయారని చెబుతున్నారు. శుక్రవారం నాడు ఆయనకు  ట్రాన్సిట్ వారీ జారీ చేసింది. దీంతో శనివారం (జూన్ 7) ఆయన అమెరికా నుంచి బయలుదేరి ఆదివారం (జూన్ 8)కి హైదరాబాద్ చేరుకుంటారు. ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం (జూన్ 9) సిట్ విచారణకు హాజరౌతారు.   వాస్తవానికి ముందుగా అనుకున్న ప్రకారం ప్రభాకరరావు గురువారం (జూన్ 5)న సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆయన సమాచారం ఇచ్చారు కూడా. అయితే ఆ రోజు ఆయన విచారణకు డుమ్మా కొట్టడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన విచారణకు జూన్ 5న హాజరు కాలేకపోవడానికి కారణం ట్రాన్సిట్ వారంట్ జారీలో జాప్యమేనని తేలింది.  అయితే ఇంత కాలంగా ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అవ్వడానికి ముందే చికిత్స అంటూ అమెరికాకు వెళ్లిపోయారు. తొలుత ఆరు నెలల్లో వస్తానన్నారు.   ఆ తరువాత అమెరికా నుంచి ఇక తిరిగి వచ్చేది లేదని చాటుతున్న విధంగా గ్రీన్ కార్డు తీసుకున్నారు.  దీంతో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ కావడంతో గత్యంతరం లేక సుప్రీంను ఆశ్రయించి పాస్ పోర్టు ఇప్పిస్తే విచారణకు హాజరౌతానని అన్నారు.  ఆయన విజ్ణప్తిపై సుప్రీం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇప్పుడు ఆయన సిట్ విచారణకు హాజరు కానున్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి లేదు.. ఉన్నదంతా నకిలీయే!

చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. కర్మఫలం అనుభవించకతప్పదు. ఇప్పుడు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిజాల నిగ్గు తేలుస్తోంది.  వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే అంత భయం ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ ఉందనీ తలపోశారు.  అయితే.. ఇప్పుడు సిట్ దర్యాప్తులో వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం లో అసలు కల్తీ నెయ్యి వాడలేదనీ.. వాడింది మొత్తం నకిలీ నెయ్యేననీ సిట్ కోర్టులు తెలిపింది. నిజానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే నకిలీ అని సిట్ తేల్చింది.   తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ  ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది.  ఆ సిట్ దర్యాప్తులో  ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదని తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్‌తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని  సిట్ స్పష్టం చేసింది.  నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టి వేయాలని కోరుతూ దాఖలు చేసిన అఫిఢివిట్ లో  సిట్ ఈ సంచలన విషయాలను పేర్కొంది.   నిజానికి భోలేబాబా డెయిరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని సిట్ స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీ తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారని సీట్ వివరించింది. భోలేబాబా డెయిరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారుచేసి ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి  సరఫరా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. పక్కా ప్రణాళిక ప్రకారమే ఏఆర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీలను ముందుపెట్టి భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని నడిపిందన్నది సిట్ అభియోగం.  అంతే కాకుండా ఇప్పుడీ  నెయ్యి మాఫియా ..సాక్షుల్ని బెదిరిస్తోంది. సాక్షులపేరుపై  తప్పుడు పిటిషన్లు వేస్తోంది. ఎవరూ సీబీఐ సిట్ ముందు హాజరు కాకుండా.. మాఫియా కాపలా కాస్తున్నది. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్‌ జైన్‌ అనే వ్యక్తి తిరుపతి ఎయిర్ పోర్టులో దిగగానే ఆయనను  కిడ్నాప్ చేసి.. చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించేశారు.  మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యక్తే స్వయంగా  తాను పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను సిట్ కోర్టు ముందుంచింది. అసలు ఆ  నకిలీ నెయ్యిని టీటీడీ ఎందుకు కొనుగోలు చేసింది? దీని వెనుక ఎవరు న్నారు.. అన్న విషయాలను రాబట్టాలంటే.. నిందితులకు బెయిలు ఇవ్వవద్దని సిట్ కోర్టును కోరింది.  సిట్ ఇప్పటికే  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఎను విచారిస్తున్నది,   ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది త్వరలో బయటకు రానుంది.   

నాకేంటి ... మాకేంటి ..

కాంగ్రెస్’లో కొత్త పంచాయతి! నిజమే..  హస్తం పార్టీలో కుస్తీ పట్లు కొత్తకాదు. అందులోనూ.. అధికారంలో ఉన్న సమయంలో నాయ కులు, కార్యకర్తలు నాకేంటి.. మాకేంటని పార్టీని నిలదీయడం మరీ కామన్. ఇతర పార్టీలలో అలాంటి,  గోల ఉండదా  అంటే..  అదేమీ లేదు, అన్ని పార్టీలలో ఉన్నదే. ఉండేదే. అందులో అనుమానం లేదు.  ప్రస్తుతం  తెలంగాణలో మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ లో, కల్వకుంట్ల కుటుంబంలో జరుగతున్న రచ్చంతా.. నాకేంటి?  అన్న దగ్గరే మొదలైంది, దాని  చుట్టూనే తిరుగుతోంది. అలాగే..  పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనూ.. అక్కడి మాజీ అధికార పార్టీ వైసీపీలో, పెద్దాయన  (వైఎస్సార్) ఫామిలీలో ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో  చూస్తూనే ఉన్నాం.  దోచుకున్న సొమ్ముల పంపకాల్లో వచ్చిన పేచీలు  పార్టీని, ఫ్యామిలీని నిట్ట నిలువునా చీల్చివేసాయి.  అయితే..  ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ సందడి కొంచెం ఎక్కువగా వినిపిస్తోంది. హస్తం పార్టీలో  అసంతృప్తికి సంబందించిన వార్తలు ప్రతిరోజూ ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో  జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానిక నాయకులను, క్యాడర్ ను సిద్దం చేసేందుకు  కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ జిల్లాల వారీగా నిరహిస్తున్న సమావేశాల్లో అసంతృప్తి అగ్ని పర్వతాలు బద్దలవుతున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల మొదలు జిల్లా నాయకుల వరకూ పార్టీ అధికారంలో ఉన్నా పనులు  కావడం లేదనీ..  ఎంతో  కాలంగా అణచి పెట్టుకున్న అసంతృప్తిని మీనాక్షి మేడంకు విన్నవించు కుంటున్నారని అంటున్నారు.   ఓ వంక స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకున్న  మీనాక్షి నటరాజన్  పార్టీని క్రింది స్థాయి నుంచి ఆక్టివేట్ చేసే ఉద్దేశంతో  స్వయంగా రంగంలోకి దిగి,  జిల్లాల వారీగా   సమావేశాలు నిర్వహి స్తుంటే.. మరో వంక ఇదే అవకాశంగా తీసుకుని స్థానిక నాయకులు, కార్యకర్తలు  ప్రభుత్వంలో తమకు  రావలసిన వాటా  రావడం లేదని అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే  అసంతృప్తి నేతలు, క్యాడర్ లో వ్యక్తమవు తోందని అంటున్నారు.  ప్రతిపక్షంలో ఉన్నపదేళ్ళ కాలంలో  నాయకులు పట్టించుకున్నాపట్టించుకోక పోయినా.. పార్టీకోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలు  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తమకు  మొండి ‘చేయి’ చూపిస్తోందని అంటున్నారు.  నిజానికి, ఇంతలా గుప్పుమనక పోయినా.. జిల్లాల్లో  జిల్లా స్థాయి నాయకుల మొదలు సామాన్య కార్యకర్తల వరకు ఎప్పటినుంచో అసంతృప్తితో రగులు తున్నారని అంటున్నారు.   నిజానికి..  స్థానిక నాయకులు, కార్యకర్తల్లో  అసంతృప్తి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు, జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఎప్పటి నుంచో  ఎమ్మెల్యేల వద్ద  తమ బాధను చెప్పుకుంటున్నారని అంటున్నారు.  అయితే,ఇంతవరకు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే కావడంతో..  డోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు ఉందని, కార్యకర్తలను సముదాయిస్తూ వచ్చారని అంటున్నారు.  అయితే..  ఇప్పుడు స్థానిక ఎన్నికలను సవాలుగా తీసుకుని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా  సంప్రదింపులు జరపడంతో  కార్యకర్తలు, నాయకులతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఆమెకు పార్టీ పరిస్థితితో పాటుగా తమ పరిస్థితిని  విపులంగా, వివరంగా చెపుతున్నారని అంటున్నారు. అలాగే..  ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలన్న సామెతను గుర్తుకు తెచ్చుకుని ఆమె ముందు తమ కోర్కెల చిట్టాను ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. నిన్నమొన్నట్లో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి నేతలతో జరిగిన భేటీలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలోలలో భగ్గుమంటున్న అసంతృప్తిని మీనాక్షి నటరాజన్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు అయితే  మీరు చెప్పినట్లుగా  స్థానిక సంస్థలో  ఎన్నికలో కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలంటే, మమ్మల్ని గెలించిన వారికి న్యాయం చేయండి. వారికి  కాంట్రాక్టులు ఇవ్వండి.  పార్టీ ప్రభుత్వ పదవులు ఇవ్వండి.. అంటూ మీనాక్షి మేడంకు విన్నవించుకున్నట్లు చెపుతున్నారు. అలాగే.. అదే చేత్తో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని డిమాండ్ టోన్ లో రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. అంతే  కాకుండా మంత్రులు  నిధులు మొత్తం తమ సొంత నియోజకవరగాలకు తరలించుకుకు పోతున్నారనీ, అధికారులు తమ మాట వినడం లేదనీ,  కనీసం ఫోన్  లిఫ్ట్ చేయడం లేదని ఎమ్మెల్యేలు ఆరోపించినట్లు సమాచారం.  ఇలా ఓ వంక అసెంబ్లీ ,లోక సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు పనులు కాక, పదవులు రాక నిరాశగా ఉన్నారు, మరో వంక కులగణన జరిపించిన నేపధ్యంలో.. పదవులు ఆశిస్తున్న బీసీ నేతలలోనూ నిరాశ వ్యక్తమవుతోందని మీనాక్షి నటరాజన్ కు పరిస్థితిని  వివరించినట్లు తెలుస్తోంది.  నిజానికి ఈ సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పదవుల పంపకాల్లో ఆలస్యం కారణంగా నాయకులలో అసంతృప్తి ఉన్న మాట  నిజమే అని  అంగీకరిస్తూనే..  త్వరలోనే అర్హతలను బట్టి పార్టీ పదవులు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు చెపుతున్నారు.  మరో వంక, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌  పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో పార్టీ పట్ల అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు, గౌరవం దక్కుతుందనే భరోసాఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, జిల్లా అధికారులు తమ మాట వినకపోవడం వలన పార్టీ కార్యకర్తలకు సాయం అందించ లేకపోతున్నామని ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు విషయం ముఖ్యమంత్రితో చర్చించి చక్కదిద్దడానికి యత్నిస్తానని ఆమె హామీనిచ్చినట్టు తెలిసింది.  అదలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకున్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌  కు కాంగ్రెస్ పార్టీలో నాటుకు పోయిన నాకేంటి ..మాకేంటి కల్చర్  అసలు సవాలుగా నిలుస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో, స్థానిక ఎన్నికల టాస్క్ లో  ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడవలసిందే అంటున్నారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరమల భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది. శనివారం (జూన్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్ల లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక శుక్రవారం (జూన్ 6) శ్రీవారిని మొత్తం72 వేల 174 మంది దర్శించుకున్నారు. వారిలో 35 వేల 192 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల88 లక్షల రూపాయలు వచ్చింది. 

ఢిల్లీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులు

  ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని  దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీలోని ఘజియాబాద్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్‌ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్‌ చేశాడని ఘజియాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. సంబంధిత సిమ్‌ కార్డు ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  నకిలీ ధ్రువపత్రాలతో ఆ సిమ్‌ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భద్రతా వలయాన్ని పటిష్టం చేయడంతో, ఆమె బహిరంగ కార్యక్రమాలు, ప్రజలతో సమావేశాలపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ సీఎం తరుచుగా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. 2019లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ ఆటోరిక్షా డ్రైవర్ చెంపదెబ్బ కొట్టారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేదనే కోపంతో ఆ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు, 2016లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేజ్రీవాల్‌పై కొందరు నల్ల సిరా చల్లారు.

చెవిరెడ్డి కూటమి ప్రభుత్వం ఉందని గుర్తెరిగి మసలుకో..పులివర్తి హెచ్చరిక

  తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత  ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిని చెవిరెడ్డి ఆపలేరు అని సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని  గుర్తెరిగి మసలుకోవాలని చెవిరెడ్డిని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం పరువు తీస్తున్నారని ఇకనైనా తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కాక ముందు మీ ఆస్తి ఏంత శాసన సభ్యుడు అయిన తర్వాత మీ ఆస్తి అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు చేర్చిన అక్రమ కేసు త్వరలో మీకు చుట్టుకుంటుంది అని జోష్యం చెప్పారు.  మీ దగ్గర ఉన్న గన్ మెన్ కు కోట్ల రూపాయల సంపాదన ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. తుడాను అడ్డుపెట్టుకుని కేవీస్ అనే పేరుతో.. మీ కుటుంబ సభ్యుల బినామీ కంపెనీలతో డబ్బులను దోచుకో లేదా అని ప్రశ్నించారు. హెల్త్ క్యాంపు, మొక్కల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకోలేదా అని నిలదీశారు. వాట్సాప్ కాల్స్ తో ప్రభుత్వ అధికారులను చెవిరెడ్డి బెదిరిస్తున్నారు అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో ఏ ఐఏఎస్, ఐపిఎస్ లు అధికారులు మీ వైసీపీ నాయకులకు భయపడరు అని చెప్పారు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదని నువ్వు చెప్పగలవా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మూడు కంటైనర్ లలో మీ డబ్బు ఎనిమిది కోట్లు దొరికింది నిజం కాదా అని నిలదీశారు. తుమ్మలగుంట అభివృద్ధికి మేము ఎంత చేసామో ప్రజలకు తెలుసు అని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నీ వాటా కూడా త్వరలో సీట్ తెలుస్తుంది అని నాని హెచ్చరించారు.   

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కీలక మావోయిస్టు మృతి

  ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  మరో కీలక నేత మైలార‌పు ఆడెల్లు అలియాస్ భాస్కర్‌ మృతి చెందారు. అతని తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని తెలిపాయి. ఘటనాస్థలి నుంచి ఏకే-47, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  బీజాపూర్‌ జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మీనర్సింహాచలం అలియాస్‌ గౌతమ్‌ అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ బండి ప్రకాశ్‌ మరణించిన విషయం తెలిసిందే.  బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఆడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామం. భాస్కర్ కేంద్ర కమిటీతోపాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీ స్థాయికి భాస్కర్ ఎదిగారు.ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఏకే 47తోపాటు పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.   

అది బీఆర్‌ఎస్ పార్టీ కాదు.. దెయ్యాల పార్టీ : సీఎం రేవంత్‌

  బీఆర్‌ఎస్ పార్టీలో దెయ్యాలు  ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్  నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి  ఎద్దేవా చేశారు. అది బీఆర్‌ఎస్ కాదని దెయ్యాల రాజ్య సమితి అని రేవంత్ సైటెర్ల వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గంధమల్ల రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి శంకు స్థాపన చేశారు.  అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తామని చెప్పి ఇళ్లు కులగొట్టి. సొంత ఫామ్‌హూస్‌కు వెళ్లేందుకు ఎర్రవళ్లికి రోడ్డు వేసుకున్నారని సీఎం ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 

8 జిల్లాలతో విశాఖ ఎకనమిక్ రీజియన్..లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు : చంద్రబాబు

  వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.  ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం జిల్లాల్ని రీజియన్‌ను అభివద్ది చేయాలన్నారు. వివిధ ప్రాజేక్టుల కోసం లక్ష ఎకరాలను గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు.  వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు. సముద్ర తీరం సంపద నిలయమని, దానిని మరింత వినియోగించుకునేలా చూడాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు.2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి లక్ష్యంతో విశాఖ ఎకనమిక్ రీజియన్'ను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్రను కూడా అదే స్ధాయిలో అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది.    

మాగంటిని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు..ఆరోగ్యం ఎలా ఉందంటే?

  గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే బెటర్‌గా ఉందని పేర్కొన్నారు. ఆయన తనకు సన్నిహితుడని, త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిన్న సాయంత్రం ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే  కుటుంబ సభ్యులు  ఏఐజీకి తరలించారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కోట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో... ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 48 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై బులెటిన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.   కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్‌ చేయించుకున్నరు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌... మాగంటి హెల్త్‌పై ఆరా తీశారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులతో, ఏఐజీ ఆస్పత్రి వైద్య బృందంతో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం ఉందని డాక్టర్లు కేటీఆర్‌కు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా పర్యటన కుదించుకొని   కేటీఆర్‌ హైదరాబాద్‌ బయలుదేరుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ఏఐజీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిశారు. వైద్యులతో మాట్లాడి గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఎందుకంటే?

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పరువు నష్టం కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.  కాగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాల్సిందిగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్‌కు నేడు దేశంలోని అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి.. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా?

క్వార్జ్ట్ అక్రమ తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది. క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ   విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు పోలీసు కస్టీడీకీ మాజీ మంత్రి .. కాకాణికి ఇప్పట్లో బెయిల్ కష్టమేనా? క్వార్జ్ట్ అక్రమాల తవ్వకాల కేసులో నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ లభించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో కాకాణిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది. క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ పోలీసుల విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారు. ఈ క్రమంలో క్వార్జ్‌ను తీసుకుని వెళ్లడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు. చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో క్వార్జ్‌ను తరలించడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్? కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్

కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో  మంచి ప్రాధాన్యత ఉండేది.  కాపులకు రిజర్వేషన్ అంటూ ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే ఆ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాపు సామాజిక వర్గం ఆయనను తమ నాయకుడిగా అంగీకరించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం  2019 ఎన్నికలకు ముందు    కాపు  రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. ఇక  2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్  కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.   2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు.  కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ముద్రగడ నిర్ణయాన్ని ఆమె కుమార్తె క్రాంతి కూడా సమర్ధించలేకపోయారు. బహిరంగంగా ఆమె  పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు.  2024 ఎన్నిలకల తరువాత జనసేన గూటికి చేరారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ముద్రగడ ఆరోగ్యం బాలేదు. ఈ విషయాన్ని ఆయనే రెండు రోజుల కిందట ఓ లేఖ ద్వారా వెల్లడించారు. రెండు రోజుల కిందట వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట నిరసనలు చేపట్టింది. అయితే ఆ కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన లేదు. కానీ ఓ లేఖ విడుదల చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాను బయటకు రాలేకపోతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న చర్చ మొదలైంది. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ బయటకు రాలేదు. దీంతో ఆయన అభిమానుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. ఈ తరుణంలో ఆయన కుమార్తె క్రాంతి తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారని వెల్లడించారు. అంతే కాదు.. తన సొంత సోదరుడు ముద్రగడ గిరి ఆయనకు   వైద్యం అందకుండా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.  తన తండ్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో  బాధపడుతున్నారనీ, అయితే తన సోదరుడు  ముద్రగిరి ఆయనకు కనీసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారనీ,  ఆయన ఎవరినీ కలవకుండా, ఆయనను ఎవరూ చూడకుండా అడ్డు పడుతున్నారనీ ముద్రగడ కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్ చేశారు. తన తండ్రిని చూసేందుకు కూడా తనను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ముద్రగడను నిర్బంధించి, చికిత్స కూడా అందకుండా చేస్తున్నారని, కనీసం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని క్రాంతి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇటీవల ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కలిసి తన తండ్రిని చూడడానికి వెడితే.. తన సోదరుడు గిరి, అతడి మావ తనను అనుమతించలేదని ఆరోపించారు. 

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని

  ప్రపంచంలోనే ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు. కశ్మీర్‌ను దేశంలో ఇతర ప్రాంతాలకు కలుపుతూ రైల్వే లింక్ పూర్తిచేయడం చరిత్రాత్మకమని ప్రధాని తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తివడం సంతోషకరమని ప్రధాని తెలిపారు. లక్షల మంది కల నెరవేరిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. ఈరోజు చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఇక కశ్మీర్ కూడా భారత్ రైల్వే నెట్‌వర్క్‌లో చేరిందని తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యం అయిందని అన్నారు.  చీనాబ్ వంతెన అత్యద్భుతంగా నిర్మించామని తెలిపారు. రూ.46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని.. కశ్మీర్  నుంచి కన్యాకుమారికి కనెక్టివిటీ ఎట్టకేలకు లభించిందని అన్నారు. చీనాబ్ బ్రిడ్జి పర్యటలకు ఫెవరెట్ స్పాట్ౠగా మారబోతోందని ప్రధాని పేర్కొన్నారు. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున చీనాబ్‌ నదిపై 1,315 మీడర్ల పొడవైన వంతెనను నిర్మించారు. చైనాలోని బెయిసాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ఇక పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలుపగా.. పూర్తి కావడానికి 22 ఏండ్లు పట్టింది.