రాజకీయ పిపీలకం సజ్జల.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అంటూ జగన్ మీడియాలో జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలు, వాటికి మద్దతుగా కొమ్మినేని తీరుతో అంటుకున్న మంట ఇప్పటిలో చల్లారేలా లేదు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో స్పందించింది. తాజాగా ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్, ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీకి ఓ లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేసింది. కృష్ణంరాజుపై తీసుకున్న చర్యల నివేదికను మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఇక ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాలలో సాక్షి కార్యాలయాల ముందు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల ఆ ఆందోళనలు చేస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.  అంతే కాకుండా ఆందోళనలు చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు, సంకరజాతి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సజ్జల వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరరెడ్డి సజ్జలను రాజకీయ పిపీలకంగా అభివర్ణించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల నీచాతినీచమైన వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలను రాష్ట్రబహిష్కరణ చేయాలని డిమాండ్ చే శారు. సజ్జల జగన్ గుమాస్తా అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని బంట్రోతు అంటూ, రాజకీయ విమర్శలు చేసే అర్హత సజ్జలకు లేదని పేర్కొన్నారు.   తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా సజ్జలపై విమర్శల వర్షం కురిపించారు. సజ్జలను ఓ మూర్ఖుడిగా అభివర్ణించిన షర్మిల ఇదే సజ్జల కుమారుడు వైసీపీ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనపై కూడా అనుచిత విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. జగన్ కు సొంత చెల్లి అంటేనే మర్యాద లేదు.. ఇక రాష్ట్రంలో మహిళలపట్ల గౌరవం ఉంటుందని ఎలా భావిస్తామని ప్రశ్నించారు.   

కల్వకుంట్ల కవిత అరెస్టు!

బీఆర్ఎస్ రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండా మౌనంగా ఉంటున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి జెండాతో దూకుడుగా సాగుతున్నారు. తాజాగా బస్ పాస్ చార్జీలను పెంచు తూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఆందోళనకు దిగారు. బస్ చార్జీల పెంపునకు నిరసనగా ఆమె మంగళవారం (జూన్ 10) బస్ భవన్ బంద్ నకు పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జెండాలు లేకుండా ఆమె జనజాగృతి కార్యకర్తలతో  బస్ భవన్ ముట్టడికి బయలు దేరారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో  పోలీసులు కవితను అదుపులోనికి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆందోళనలో పాల్గొన్న జనజాగృతి కార్యకర్తలను కూడా అదుపులోనికి తీసుకున్నారు.   పెంచిన బస్ చార్జీలను తగ్గించే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని కవిత ఈ సందర్భంగా చెప్పారు. అంతకు ముందు కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బస్ చార్జీల పెంపును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సంస్కృతి, భాష, యాస కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి పోన్ లో మాట్లాడేటప్పుడు హలో అనడానికి బదులుగా జై తెలంగాణ అనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై తెలంగాణ అనడానికి మనసురావడం లేద న్నారు.బోనాల సందర్భంగా ప్రతి బోనం పైనా జై తెలంగాణ నినాదం రాయాలని పిలుపునిచ్చారు. 

తిరుమలలో అగ్నిప్రమాదం

తిరుమలలో అగ్రిప్రమాదం సంభవించింది. అయితే అటవీ ప్రాంతంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.   శిలాతోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. భక్తుల సమాచారంతో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.   అగ్నిప్రమాాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. అటవీ ప్రాంతంలో స్వల్పంగా మంటలు చెలరేగాయనీ, వెంటనే అదుపు చేశామని అగ్నిమాపక సిబ్బంది తెలిసారు. టీటీడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదని తెలిపారు. 

రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు..  ఒక్క మంత్రి వర్గ విస్తరణ విషయంలోనే కాదు..  ఆయన అసంతృప్తికి ఇంకా చాలా  కారణాలున్నాయి.  అయితే.. రోజు రోజుకు అధిష్టానంతో పెరుగతున్న దూరం విషయంలో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పెరుగతున్న దూరం విషయంలో ఆయన కొంత మధన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఇటీవల చేసిన కొన్ని  వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.   ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో .. ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతేదూరం అవుతుంది. అందులో సందేహం లేదు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మధ్య పెరుగుతున్న దూరం గురించిన చర్చ సందర్భంగా ఒక పెద్దాయన నోటి నుంచి వచ్చిన మాట ఇది. నిజమే.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంత కంఫర్టబుల్ గా లేరు. ఇంకా స్పష్టంగా చెప్పలంటే.. కష్ట నష్టాలను తట్టుకుని తెచ్చుకున్న ముఖ్యమంత్రి కుర్చీలో కంఫర్టబుల్ గా కూర్చో లేకపోతున్నారు. అవును.. రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు గమినిస్తే.. ఇటు  పార్టీలో,  అటు ప్రభుత్వ వ్యవహారాల్లో  ఆయన సంతృప్తిగా లేరని.. ఒక విధమైన ఉక్క పోతను అనుభవిస్తున్నారని అపిస్తోందని అంటున్నారు.   అవును..  ముఖ్యమంత్రి కంఫర్టబుల్ గా లేరన్న విషయం ఎవరో చెప్పడం కాదు..  ఆయన మాటల్లోనే ఆ ధ్వని స్పష్టంగానే వినిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో  జరుగుతోంది.  ముఖ్యంగా కొద్ది రోజుల కిందట హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆత్మకథ,  ప్రజల కథే ..నా ఆత్మ కథ   పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి అసౌకర్యానికి అద్దం పడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మోదీ బడిలో, చంద్రబాబు కాలేజీలో చదువుకుని,రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నాను అంటూ చేసిన వ్యాఖ్య ఆయనలోని అసంతృప్తిని ప్రతిబింబించేలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అంటూ.. ముఖ్యమంత్రి పదవిని  కొలువుగా పేర్కొనడంలో ఏదో నిగూఢ అర్థం,  కనిపించని బాధ దాగుందని అంటున్నారు.   అయితే.. రేవంత్ రెడ్డిలో ఉన్న అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్కుంటున్నట్లు చెపుతున్న అవమానాల విషయాన్ని పక్కన పెడితే.. దత్తాత్రేయ ఆత్మ కథ ఆవిష్కరణ సభలో ఆయన తమ పూర్వాశ్రమ సంబంధాలను నెమరవేసుకోవడం వెనక ఏదో కథ ఉందనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. నిజానికి,రేవంత్ రెడ్డి బీజేపీ వేదిక మీద ప్రసంగించడం, ఆ వేదిక మీద నుంచే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో తనుకున్న పూర్వ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం అలాగే.. దత్తాత్రేయ మొదలు కిషన్ రెడ్డి వరకు అనేక మంది బీజేపీ నాయకులతో తనకున్న సన్నిహిత పరిచయం గురించి బహిరంగ వేదిక నుంచి ప్రస్తావించడం ఇదే మొదటి సారి కాదు.  గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు , ఆత్మ కథ, ‘ఉనిక’ ఆవిష్కరణ సభలోనూ రేవంత్ రెడ్డి బీజేపీ, బీజేపీ నాయకులతోనే కాదు, సంఘ్ (ఆర్ఎస్ఎస్) పెద్దలతో సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీని, అయన సమక్షంలోనే బడేభాయ్‌ అని సంబోదించారు. అయితే.. అప్పటికీ, ఇప్పటికీ  ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కొంత తేడా ఉందనీ.. అప్పట్లో  రాహుల్ ప్రస్తావన చేయని రేవంత్ రెడ్డి ఈసారి,  తాను రాహుల్ గాంధీ వద్ద కొలువు చేస్తున్నాని అన్నారు. అంటే..  తనకు స్వయం నిర్ణయాధికారం లేదనీ చెప్పకనే చెప్పారు. అలాగే..  కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డీ తానూ కలిస్తే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పడు ఈ వ్యాఖ్యలే   రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా.. బీజేపీ నేతలు, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్యపక్షాల నాయకులు పాల్గొన్న సభలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి పాల్గొనడమే విశేషం అనుకునుటే, రేవంత్‌రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి,చేసిన వ్యాఖ్యలు,  అనుమానస్పదంగా ఉన్నాయని అంటున్నారు.  బీజేపీ నేతలను ఇంతలా ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి పాకులాడటం వెనుక ఆంతర్యమేంటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్‌గాంధీ దగ్గర  ఉద్యోగం  చేస్తున్నా అని బీజేపీ వేదికపై చెప్పడం ద్వారా..  రేవంత్ రెడ్డి  ఎవరికీ ఎలాంటి సంకేతం ఇచ్చారనే చర్చ నడుస్తోంది. అన్నీ కలిసొస్తే మీతో కలిసి నడుస్తానని కమలదళానికి సంకేతం ఇచ్చారా?  ఉద్యోగ భద్రత, ఉద్యోగ సంతృప్తి లేక పోతే..  రాహుల్ దగ్గర చేస్తున్న ఉద్యోగం వదిలేస్తాననే  సంకేతం కాంగ్రెస్‌ పెద్దలకు ఇచ్చారా..  అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే..  ఈ చర్చకు ముగింపు మాత్రం ఇప్పట్లో ఉండదని అంటున్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ( జూన్ 9) హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను తొలుత  విజయవాడకు, ఆ తర్వాత గుంటూరు రూరల్ నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంగళవారం (జూన్ 10)  గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు  ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కొమ్మినేనిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.   రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీనియర్ జర్నలిస్టు  కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్టు కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. జగన్ సొంత మీడియాలో కొమ్మినేని నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు సమర్ధించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కొమ్మినేనిని అరెస్టు చేసిన పోలీసులు కృష్ణంరాజు కోసం గాలిస్తున్నారు. 

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్

అమరావతిపై, అమరావతి మహిళలపై జగన్   మీడియా అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ మీడియాలో ఓ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఖండించకుండా వత్తాసు పలికిన ఆ మీడియా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీని ఆదేశించింది. జగన్ మీడియాలో డిబేట్ సందర్భంగా  కృష్ణం రాజు అనే సీనియర్ జర్నలిస్టు అమరావతిలోని మహిళ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్.. అమరావతిని వేశ్యల రాజధాని గా పేర్కొనడం.. రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా  రైతులను అవమానించడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.   ఈ జుగుప్సాకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను మహిళాకమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని ఎన్సీడబ్ల్యు చైర్ పర్సన్  విజయా రహట్కర్  పేర్కొన్నారు. మీడియా వేదికగా అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్య లు చేసిన కృష్ణంరాజు, ఆ వ్యాఖ్యలను అడ్డుకోకుండా ప్రోత్సహించిన ఆ మీడియా జర్నలిస్టుపై నిర్దుష్ట కాలపరిమితిలో విచారణ జరిపి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఏపీ డీజీపీకి రాసిన లేఖలో ఆదేశించింది. అలాగే  అమరావతిపై, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను తమకు మూడు రోజులలోగా సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ డీజీపీని ఆదేశించింది.  

గుంటూరు మాజీ మేయర్ మనోహర్‌నాయుడు కేరీర్ క్లోజేనా?

ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పడిపోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. అందులోనూ గుంటూరులో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది.   2024 ఎన్నికలకు ముందు వరకూ గుంటూరు జిల్లాలో వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉండేది.  ఆ సమయంలో మనోహర్ నాయుడు కూటమి పార్టీలను, అందులోని నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు. అప్పుడు గుంటూరు జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతల జాబితాలో  ఆయన పేరు కూడా ఉండేది. ముఖ్యంగా జనసేనపై అయితే ఆయన విమర్శల ధాటి చాలా తీవ్రంగా ఉండేది.  మనోహర్ నాయుడు అప్పటి విపక్ష నేతలకు అల్టిమేటమ్‌లు ఇస్తూ తొడలు కూడా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో మనోహర్ నాయుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు.. జనసేన నేతలతో వ్యవహరించిన తీరు రాష్ట్రంలోనే ఓ సంచలనంగా మారింది. ముఖ్యంగా జనసేనాని పవన్‌పై అయితే మనోహర్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అదే ఆయనకు ప్లస్ అయింది. గుంటూరు మేయర్‌గా ఉన్న ఆయన్ని జగన్  చిలకలూరిపేట నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారు. ఎన్నికల సమయంలో మనోహర్ నాయుడుకి వైసీపీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మనోహర్ నాయుడు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి సీన్ మారిపోయింది.  కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో గుంటూరు రాజకీయాల్లో అత్యంత కీలకమైన మార్పులు జరిగాయి. చాలామంది వైసీపీని వీడి కూటమి పార్టీల వైపు అడుగులు వేశారు. గుంటూరు కార్పొరేటర్లు పలువురు తెలుగుదేశం, జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ దెబ్బతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌గా ఉన్న కావటి మనోహర్ నాయుడు.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎలాగైనా తనను ఇబ్బంది పెడతారనీ, వాళ్లు తనని తొలగించే ముందే.. తానే తప్పుకుంటే బెటర్ అని మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు. అదే ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది.  మనోహర్ నాయుడు రాజీనామాకు ముందు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్ నేతలందరినీ తాడేపల్లి పిలిపించుకొని మాట్లాడారు.  అయినా మనోహర్ నాయుడు కనీసం అధిష్టానానికి చెప్పకుండా తన రాజీనామాన్ని ప్రకటించారు. రాజీనామా నిర్ణయంతో వైసీపీ నేతలు అంతా ఒక్కసారిగా షాక్‌ అవ్వాల్సి వచ్చింది. మనోహర్ నాయుడు తన నిర్ణయాలన్ని ముందుగా పార్టీ పెద్దలకు వివరించి, వారి ఆదేశాల మేరకు రాజీనామా చేసి ఉంటే బాగుండేదని కొందరు నేతలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఇక గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుతో సైతం మనోహర్ నాయుడు అంటీ ముంటన్నట్లు వ్యవహరిస్తున్నారంట. మేయర్ పదవికి రాజీనామా తర్వాత గుంటూరు వెస్ట్ నియోజవర్గ వైసీపీ ఇన్చార్జిగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారంట. అయితే వెస్ట్ నియోజవర్గానికి ఇన్చార్జిగా అంబటి రాంబాబు తనకు తానే ప్రకటించుకోవటంతో మనోహర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. అందుకే పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి సైతం మనోహర్ నాయుడు దూరంగా ఉండిపోయారు. ఆ క్రమంలో పార్టీ పెద్దలు ఆయన్ని సస్పెండ్ చేశారంట. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మనోహర్ నాయుడి రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో పడ్డట్టే కనిపిస్తోంది. మనోహర్ నాయుడుని ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు పంపారు. ఆయన  కూటమిలోని ఏ పార్టీలో చేరే పరిస్థితి లేదు. తెలుగుదేశం, జనసేన నేతలు ఎవరూ కూడా మనోహర్ నాయుడు ఎంట్రీని అంగీకరించే పరిస్థితి లేదు.  దీంతో మనోహర్‌‌నాయుడు పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే అన్న టాక్ వినిపిస్తోంది.

సజ్జల సంకరజాతి వ్యాఖ్యలపై డీజీపీకి ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు

  సజ్జల చిక్కుల్లో పడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన వారిపై దారుణ వ్యాఖ్యలు చేశారు. పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.  దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పటికే ఆ పార్టీ  సొంత ఛానెల్లో ఇటీవలే కృష్ణంరాజు అనే రాజకీయ విశ్లేషకుడు అమరావతి మహిళలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిని దేవతల రాజధాని అనడాన్ని ఖండిస్తూ,  అది వేశ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు దారుణ వ్యాఖ్యలు చేశారు. టీవీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజుకు వంత పాడుతూ ఔను అమరావతిలో సెక్స్ వర్కర్లు అన్న వార్తను తాను కూడా చూశానంటూ పేర్కొన్నారు.  కాగా ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళాలోకం భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇక రాజకీయ విశ్లేషకుడు కృష్ణం రాజు పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన చానల్ యాజమాన్యం.. ఆ అభిప్రాయాలు కృష్ణం రాజు వ్యక్తిగతం.. తమకు ఎటువంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది.   అయితే కొమ్మినేని అరెస్టు పై వైసీపీ  తీవ్ర అభ్యంతరం  వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షి టీవీకి సంబంధం లేదని పేర్కొంటూనే.. కొమ్మినేని అరెస్ట్ అక్రమమని గుండెలు బాదేసుకుంటోంది. కృష్ణం రాజు చేసినవి అనుచిత వ్యాఖ్యలే అని అంగీకరిస్తూనే..వాటికి వంతపాడిన కొమ్మినేని అరెస్టు అన్యాయమనడంలోని లాజిక్కేమిటో వైసీపీయులే చెప్పాలి. అదలా ఉంచితే... కొమ్మినేని అరెస్టుపై  వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించారు. ఆ సందర్భంగా  సజ్జల చేసిన సంకరజాతి వ్యాఖ్య కాంట్రవర్సినీ కాస్తా కాంప్లికేట్ స్థాయికి తీసుకు వెళ్లింది.  కొమ్మినేని అరెస్టు అక్రమంటూ పెట్టిన ప్రెస్ మీట్లో ఆ ఆరెస్టు అక్రమం ఎలా అయ్యిందో చెప్పడం మాని,  అమరావతి మహిళలపై ఆయన మరో సారి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  జగన్ కు మహిళల పట్ల అపార గౌరవం.. అటువంటి జగన్ అమరావతి మహిళలను అవమానిస్తారా, ఆయన  చానెల్ ఆ పని చేయదుగాక చేయదు అంటూ గట్టిగా చెప్పకోవడానికి శతధా ప్రయత్నించిన సజ్జల.. జగన్‌కు, ఆయన చానెల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన, చేస్తున్న వారిపై దూషణల పర్వానికి దిగారు.  పిశాచాలు, రాక్షసులు,  సంకర జాతి అంటూ  అనుచిత వ్యాఖ్యలు చేశారు.  సజ్జల వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ గట్టిగా ఖండించారు. ఇక డిప్యూటీ స్పీకర్ అయితే.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. దీంతో సజ్జల చిక్కుల్లో పడ్డారు.  

సర్వీస్ సెక్టార్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంపు.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలను మరింత చేరువ అవుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే  డిజిటల్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 300 సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రభుత్వం.. గ్రామీణ పేదలకు మరింత చేరువ అయ్యే లక్ష్యంతోనే స్వర్ణాంధ్ర కార్యాలయాలను తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.   స‌ర్వీస్ సెక్టార్ నుంచి ఆదాయం పెంచడం ద్వారా ఆ పెంచిన ఆదాయాన్ని పేదలకు మరిన్ని పథకాలను అమలు చేయడం ద్వారా అందిస్తామన్న చంద్రబాబు.. ప్రస్తుతం సేవా రంగం ద్వారా నూటికి ఆరు రూపాయల ఆదాయం వస్తున్నదని, దీనిని మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు.  ఈ స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.  అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకు వెడతామన్న చంద్రబాబు.. జగన్ ప్రభఉత్వ  విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామ‌న్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తా మ‌న్న చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిని కూడా మ‌రో మూడేళ్ల‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

పీడీఎస్ ప్రక్షాళనే లక్ష్యం.. నాదెండ్ల మనోహర్

జగన్ హయాంలో అస్తవ్యవస్థంగా తయారైన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసి దారిలో పెట్టేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీని సమూలంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టి శ్రమిస్తున్నారు.  రేషన్ సరుకుల పంపిణీ ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందు కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో బాగంగా సోమవారం (జూన్ 9) ఏలూరులో  పర్యటించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతా రేషన్ సరుకుల పంపిణీ ఆగడానికి వీల్లేదని ఆయనీ సందర్భంగా డీలర్లకు చెప్పారు. సర్వర్లు పని చేయడం లేదనో, మరో కారణం చేతనో రేషన్  షాపులకు వస్తున్న వారిని డీలర్లు వెనక్కు పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న ఆయన.. సర్వర్ పని చేయని సందర్భంలో లబ్ధిదారుని ఫొటో తీసుకుని సంతకం చేయించుకుని రేషన్ ఇవ్వాలనీ, అంతే తప్ప పంపిణీని వాయిదా వేయడానికి వీల్లేదని కచ్చతమైన ఆదేశాలు జారీ చేశారు.   జగన్ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ అంటూ దొడ్డిదారిన రేషన్ సరుకులను అక్రమ మార్గాల ద్వారా అమ్ముకున్నారని, దానిని నిర్మూలించేందుకే పాత పద్దతికే తాము మద్దతుగా నిలిచామని నాదెండ్ల చెప్పుకొచ్చారు.  లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ వారికి అంది తీరాలపీ, ఇందులో ఎలాంటి మినహాయింపులకు తావులేదని కూడా నాదెండ్ల స్పష్టం చేశారు.

జగన్, భారతి క్షమాపణలకు షర్మిల డిమాండ్

అమ‌రావ‌తిపై చ‌ర్చ పెట్టి.. అక్క‌డి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై   ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ విషయంలో వైసీపీ అధినేత, తన సోదరుడు జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాపణ‌లు చెప్పాలని డిమాండ్ చేశారు. అస‌లు రాజ‌ధానిపై మాట్లాడే అర్హ‌త జగన్ కు కానీ, భారతికి కానీ, వారి సొంత మీడియాకు కానీ లేదని షర్మిల అన్నారు.   గ‌తంలో అనేక సార్లు అమరావతిపైనా, అక్కడి ప్రజలపైనా, రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వారిని అవమానించేలా మాట్లాడారన్న షర్మిల.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ లో మార్పురాలేదని దుయ్యబట్టారు.  అ తాజాగా  జగన్ మీడియాలో చేప‌ట్టిన చ‌ర్చ‌లో మ‌హిళ‌ల‌ను తీసుకురావ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న షర్మిల సోమవారం (జూన్ 9) మీడియాతో మాట్లాడారు.  మ‌హిళ‌ల‌ను అవ‌మానించే సంస్కృతి వైసీపీతోనే ప్రారంభ‌మైంద‌ని విమర్శించారు ఈ విషయంలో జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతోపాటు భారతితోనూ చెప్పించి ఉంటే బాగుండేద‌ని వ్యాఖ్యానించారు.   జగన్ హయాంలో రాష్ట్రానికి కేరాఫ్ లేని ప‌రిస్థితి ఉండేదని,  ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని నిర్మించుకుంటున్నామనీ పేర్కొన్నన షర్మిల.. ఇలాంటి సమయంలో రాజధాని అమరావతికి, అక్కడి మహిళలకు వ్యతిరేకంగా దారుణమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని విషయమన్నారు.   

హైకోర్టులో పీఎస్సార్ ఆంజనేయులుకు షాక్

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులె ఆయన దాఖలు చేసుకున్ని పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన బెయిలు పిటిషన్ సోమవారం హైకోర్టు విచారించింది. వాదోపవాదాలు విన్న అనంతరం ఆయనకు బెయిలు నిరాకరిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీపీఎస్సీ ఆక్రమాల కేసులో పీఎస్సార్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో  ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. 

ముగిసిన ప్రభాకర్‌ రావు విచారణ.. మళ్లీ ఎప్పుడంటే?

  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు. అయితే   మళ్లీ ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని అధికారులు ప్రభాకర్ రావుకు తెలియజేశారు. దీంతో మరోమారు ఆయన సిట్ ముందుకు రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-2023 మధ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. డీసీపీ విజయ్‌, ఏసీపీ వెంకటగిరి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుపతన్న, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు పలు విధాలుగా ప్రశ్నలు అడిగారు. అలాగే, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది

కడప కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు .ఐ ఎం ఎం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ కార్యకర్తల తో ఏఐసీసీ సభ్యులు సుంకర పద్మశ్రీ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. షర్మిల జిందాబాద్ పద్మశ్రీ డౌన్ డౌన్ టు నినాదాలు చేశారు. కడప జిల్లా పర్యటనలో షర్మిలపై సుంకర పద్మశ్రీ ఆరోపణలు చేశారు . సుంకర పద్మశ్రీ ఏర్పాటు చేసిన సమావేశంలో షర్మిల వర్గం ఆమెను ప్రశ్నించడం జరిగింది. దీంతో రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పడ్డారు. సుంకర పద్మశ్రీ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీరాములు, నజీర్ అహ్మద్ పాల్గొనగా షర్మిలకు మద్దతుగా జిల్లా డిసిసి అధ్యక్షురాలు విజయ జ్యోతి, పులివెందుల, పొద్దుటూరు, నియోజకవర్గాల అధ్యక్షులు ధ్రువ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ భాషాలు పాల్గొన్నారు

తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు

  జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపుబోర్డు లోగో ఆవిష్కరణలో కూడా అమిత్‌షా పాల్గొంటారని సమాచారం. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తెలంగా ణ ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి వాస్తు దోషం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ కార్యాలయం వృథాగానే పడి ఉంది. పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా.. అంగీకరించారు. 

మహిళలు నిరసన తెలుపుతుంటే సంకరజాతి అంటారా?.. లోకేశ్ ఫైర్

  రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని  మండిపడ్డారు. "ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?" అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన, జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని తరిమేసిన అమానవీయ తీరును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని నారా లోకేశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అలాంటి వారిని కించపరిచేలా మాట్లాడటం సహించరానిదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సజ్జల వ్యాఖ్యల వీడియోను లోకేశ్ పంచుకున్నారు. ఇటీవల సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.

అఖిల ప్రియకు అస్వస్థత.. వడదెబ్బ అన్న వైద్యులు

తెలుగుదేశం నాయకురాలు,  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో  జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెకు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించిన అనంతరం కోలుకున్నారు.  రెండు రోజులుగా అఖిలప్రియ జాతరకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక సోమవారం (జూన్ 10)  పూజల సందర్భంగా ఉపవాస దీక్ష పాటించారు. అసలే ఎండలు, ఉక్కపోత ఉండటం, ఉపవాసదీక్షలో ఉండటంతో నీరసించి సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. 

కావాలనే చర్చలో అమరావతి ప్రస్తావన : ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌

  ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఇలా మాట్లాడినట్లు తెలుస్తోందన్నారు. చర్చలో ఆ సందర్బానికి జోడించారో వివరణ ఇవ్వాలని కోరారు. రాజకీయ నేతలు నడిపించే మీడియా వద్దు అనే చర్చ ప్రారంభం కావాలన్నారు.  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరినీ క్షమాపణ కోరలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో కొందరికి బాధ కలిగి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఛానల్‌ను నడుపుతున్న యాజమాన్యం ఎవరో అందరికీ తెలుసు. ఇంత చౌకబారు జర్నలిజం ఎందుకు వచ్చిందో అలోచించాలని ఆయన ప్రశ్నించారు.  వారి పార్టీ అజెండా కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. ఆంగ్లపత్రిక కథనంలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. చర్చలో ఆ సందర్భాన్ని ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. రాజకీయాలు జోడించాల్సిన అవసరం ఎవరికీ లేదు.’’ అని ఆలపాటి పేర్కొన్నారు.