ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి

  ప్రతి ఒక్కరి దైనందిత జీవితoలో యోగ ఒక భాగం కావాలి అని, జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్  తెలిపారు. చంద్రగిరి కోట నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 కార్యక్రమము లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్,  తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గోన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు పాటు అంత రాష్ట్రవ్యాప్తంగ, జిల్లా మండల, గ్రామ స్థాయి వరకు  యోగా ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరికి శిక్షణ, అవగాహన కల్పించాలని తెలిపారు.  ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా యోగ ఉండాలని ఉద్దేశంతో  ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. సచివాలయం పరిధి,వార్డు పరిధి లో అందరికీ  యోగా గురించి శిక్షణ, అవగాహన  కల్పిపిస్తున్నామని అందులో భాగంగానే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ జరిగింది అని తెలిపారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మిగతా అధికారుల తో కలిసి ఈ యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం చాలా అవసరమని వివిధ రకాల మందులు వాడుతూ ఆరోగ్యం పాడవుతుందని యోగ చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.  

కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం : హరీశ్ రావు

  వేములవాడ దేవాలయంలో కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్‌కి  కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి.మేం కాపాడుకుంటాం.. అంటూ హారీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.  రోజూ కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదంటూ ఫఐర్ అయ్యారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 18 వేల రూపాయలు రైతులకు బకాయి పడిందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తాని సీఎం రేవంత్ హామీ అయిందని హరీష్ రావు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి తెచ్చిన 3000 కోట్లను బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని తెలిపారు.ఆర్‌ఆర్‌ఆర్  భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్  ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

బెంగుళూరులో అడుగుపెట్టిన ఛాంపియన్స్..ఆర్సీబీ ఆటగాళ్లకు ఘన స్వాగతం

  ఐపీఎల్-2025 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తమ హోం సిటీ బెంగళూరులో అడుగుపెట్టింది. వేలాది మంది అభిమానులు నడుమ ఆర్సీబీ ఆటగాళ్లు బస్సులో ర్యాలీగా వచ్చి చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముండటంతో పరేడ్‌ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఓపెన్‌ బస్‌ పరేడ్ రద్దయింది. అయితే, సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంట్రీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ విజేతగా  నిలిచిన విషయం తెలిసిందే.నిన్న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ మైదానంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే.. ఈ విజయాన్ని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. బెంగళూరులో విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జట్టు బెంగళూరు నగరానికి చేరుకుంది.

జగన్ కు బదులు సజ్జల జైలు యాత్రలు.. సంకేతమేంటి?!

వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, ఆయన జైలు ములాఖత్ లు జగన్ అరెస్టైతే పార్టీ పగ్గాలు చేపట్టేది తానేనని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉందని వైసీపీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ సాగుతోంది.  తొలి నుంచీ కూడా ఒక వేళ జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి భారతి చేపడతారన్న భావన పార్టీ వర్గాల్లో కనిపించేది. అయితే భారతి పెద్దగా జనంలోకి రాకపోవడం, వైసీపీ నేతల అరెస్టులపై ఆమె ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారని అవగతమౌతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల పేరు తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే సజ్జల ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో ఒకింత చురుకుగా, చొరవగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలకు సంబంధించిన బాధ్యతలు సజ్జలే చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో తరచుగా ఆయన జైలు ములాఖత్ లు జరుపుతున్నారు. గతంలో ఈ పని జగన్ చేసేవారు. అయితే కారణాలేమైతేనేం.. జగన్ జైలు పరామర్శలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆయన స్థానంలో ఆ పని సజ్జల చేస్తున్నారు. ఇటీవలే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గుంటూరు జైల్లో సజ్జల కలిసి పరామర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా నందిగం సురేష్ అరాచకాలు, దౌర్జన్యాలూ ఓ రేంజ్ లో ఉండేవి.  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడిలో పాల్గొన్న వారిలో అత్యధికులు నందిగం అనుచరవర్గమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు.. నందిగం సురేష్ పై పలు కేసులు కూడా ఉన్నాయి.  ఈ క్రమంలోనే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నందిగం సురేష్ పై ఉన్న కేసుల బూజు దులిపింది. దీంతో ఆయన అరెస్టయ్యారు. ఆ తరువాత బెయిలు వచ్చింది. కానీ మరో  కేసులో ఆయన ఇటీవల మళ్లీ అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో   గుంటూరు జైల్లో ఉన్న  నందిగం సురేష్ తో సజ్జల సోమవారం (జూన్ 2)న. సజ్జల ములాఖత్ అయ్యారు.  నందిగం సురేష్ బాగోగులు, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన సజ్జల ఆయనకు ధైర్యం చెప్పారు,  దీంతో ఇప్పుడు సజ్జల జైల్లో ములాఖత్ లకు సంకేతమేంటన్న చర్చ పార్టీలో ప్రారంభమైంది. గతంలో చలా మంది వైసీపీయులు అరెస్టైనా జైలుకెళ్లి వారితో ములాఖత్ కాని సజ్జల ఇటీవలి కాలంలో వరుసగా జైలు పర్యటనలు చేయడం వెనుక గట్టి వ్యూహమే ఉందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు,   నందిగం కంటే ముందు సజ్జల విజయవాడ సబ్ జైలులో  మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న   సీఎంఓ మాజీ   కార్యదర్శి   ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ  కృష్ణమోహన్ రెడ్డిలను సజ్జల నేరుగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ కలిశారు.  ఆ తరువాత   నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డినీ కలిశారు. ఇప్పుడు తాజాగా నందిగం సురేష్ తో గుంటూరు జైలులో ములాఖత్ అయ్యారు. దీంతో ఒక వేళ జగన్ జైలుకు వెడితే ఆయన ఆబ్సెన్స్ లో సజ్జలే పార్టీని నడిపిస్తారన్న సంకేతాలను ఆయన తన ములాఖత్ భేటీల ద్వారా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో  పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణలో అమెరికా జోక్యం తదితర అంశలపై కేంద్రాన్ని విపక్షాలు ప్రశ్నించనున్నాయి.'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా లోక్ సభ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.    

వైసీపీ నిరసనలు వెలవెల.. కూటమి సంబరాలు కళకళ

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ముగింపు.. తెలుగుదేశం పాలనకు ఆరంభం జరిగి బుధవారం (జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింద. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీలు ఏడాది పాలన సంబరాలకు సమాయత్తమయ్యాయి. ఈ రెండు కార్యక్రమాలలో ఒక కార్యక్రమం వెలవెల బోతే.. రెండోది కళకళలాడింది. అవును జగన్ పార్టీ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలవెలబోయాయి. అదే సమయంలో కూటమి పార్టీల ఏడాది పాలన సంబరాలు కళకళలాడాయి. కూటమి సంబరాలలో వైసీపీ నిరసనలు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమిలోని మూడు పార్టీల కీలక నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.    జూన్ 4 ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు స్ఫూర్తిదాయకంగా ఉంది.  ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజుగా ఆయన ఆ పోస్టులో జూన్ 4ను అభివర్ణించారు.  అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన చారిత్రాత్మకమైన రోజన్నారు.  సైకో పాలనకు ప్రజా చైతన్యం అంతం పలికిన రోజనా, రాష్ట్రంలో  ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజంటూ చంద్రబాబు పేర్కోన్నారు. సమస్యల పరిష్కారం కోసం జనం ఉద్యమించడం చూశాం.. అయితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, రాక్షస పాలనను అంతం చేయడం కోసం ఓటు వేయడానికి ఉద్యమంగా కదిలిన జనాలను చూడటం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.   ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కు సరిగ్గా ఏడాది కిందట ఈ రోజు జనం నాంది పలికారన్నారు.   ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అయితే ప్రజా తీర్పునకు ఏడాది అంటూ ఆరంభించి ప్రజా చైతన్యానికి కూడా ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకూ ఏడాది అని, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది అని ఉద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో సాధించిన  విజయానికి  డాది అని పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచకపాలనను తరిమికొట్టి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన ప్రజల పరిణితి చరిత్రలో నిలిచిపోయిన రోజని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.   అటు కేంద్రం లోని నరేంంద్ర మోదీ సర్కారు విజయాలను గుర్తు చేస్తూనే…మోదీ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లే : కవిత

  రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్  కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కేసీఆర్‌ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు నోటీసులు ఇస్తే, యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే" అని ఆమె అన్నారు.. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్‌ చేసిన తప్పా అని నిలదీశారు. "ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది జవాబుదారీతనం కోసం కాదు. కేవలం రాజకీయంగా పరువు తీయడం కోసమే అని ఆమె అన్నారు.ఈ ప్రాజెక్టులో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌కు ఇటీవల నోటీసులు జారీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదని పేర్కొన్నారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును అడ్డుకోవాలని ఆమె అన్నారు.

స్వాట్ తో తెలంగాణ సర్కార్ కు ప్రశంసలు

స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్‌గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది.  హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు. సాధారణంగా పురుష పోలీసులు మహిళా నిరనసకారులను నియంత్రించే విషయంలో కొన్నిసార్లు వివాదాలు తలెత్తుతున్నాయ్. అందువల్ల.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త టీమ్‌ని రెడీ చేస్తున్నారు. ఈ కొత్త ఫోర్స్‌లోని మహిళా పోలీసులకు.. సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. నిరనసలు, ఆందోళనల సమయంలో.. వారికేదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వీరికి ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్ ద్వారా.. క్లిష్ట పరిస్థితుల్లో గుంపులను నియంత్రించడంలో సహాయపడతారు. నిరసనలు, ఆందోళనల సమయంలో.. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంలో.. వారిని తరలించడంలో చట్టబద్ధమైన, సున్నితమైన విధానాలను అనుసరించడమే ఈ టీమ్ లక్ష్యం.  ధర్నా సమయాల్లో మహిళలకు, మహిళా వీఐపీలకు రక్షణ ఇచ్చే విషయంలో.. ఈ మహిళా పోలీసులు ప్రత్యేక శిక్షణ పొందారు.  ట్రైనింగ్‌లో వాళ్లు నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్‌ని కూడా ప్రదర్శించారు.  మొదటి దశలో 35 మంది మహిళా పోలీసులతో.. ఈ యాక్షన్ టీమ్‌ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు సీపీ సీవీ ఆనంద్. దీనిని  భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఆందోళనల సమయంలో మహిళలను ప్రొటెక్ట్ చేయడం, వారిని సేఫ్‌గా తరలించడం కోసం ఈ టీమ్ పనిచేస్తుంది. మొత్తంగా రెండు ప్లాటూన్ టీమ్‌లను సిద్ధం చేస్తామని.. సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ పోలీసులు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ఇప్పటికే ఉన్న షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్ లాంటి మహిళా భద్రత కార్యక్రమాలకు మరింత మద్దతుగా నిలవనుంది. ఇది.. మహిళల భద్రత పట్ల హైదరాబాద్ పోలీసులకు ఉన్న కమిట్‌మెంట్‌ని తెలియజేస్తోంది. ఈ కొత్త విమెన్ ఫోర్స్.. మహిళల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు.. ఇచ్చే ప్రాధాన్యత అందర్నీ ఆకట్టుకుంటుంది.

పోలీసులపై రెచ్చిపోయిన అంబటి.. లోపలికి వెళ్తే ఏం చేస్తావ్

  గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం ర్యాలీలో ఈ గొడవ చోటుచేసుకుంది. పట్టాభిపురం సీఐ మధ్య తీవ్ర  వాగ్వాదన్నికి దిగారు. వైసీపీ నేతలు మూకుమ్మడిగా కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామని సీఐ చెప్పడంతో అంబటి పోలీసులపై ఉగ్రరూపం చూపించారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావో చేసుకో అని పోలీసులపై మండిపడ్డారు. అపుకోండి అని సీఐకి వేలు చూపిస్తూ హెచ్చారించారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే, ఓ పోలీస్ అధికారి అంబటి రాంబాబు తీరుపై నిప్పులు చెరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లింది. ఒకరికొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

నెంబర్ 18‌తో క్రికెట్ కింగ్ కోహ్లీ అనుబంధం

క్రి‌కెట్లో రికార్డుల కింగ్‌ విరాట్ కోహ్లీకి నెంబర్ 18 చాలా.. చాలా స్పెషల్. 18వ నెంబరుతో విరాట్‌కి ఉన్న అనుబంధం అపురూపమైంది. తాజాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ఆర్సీబీ ఐపీఎల్  కప్‌ను ముద్దాడింది. కోహ్లీ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు జెర్సీ నెంబరు 18 కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్  అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా కోహ్లీ ఆ జెర్సీ నెంబరుతోనే కనిపిస్తాడు. వాస్తవానికి అండర్ 19 క్రికెట్ ఆడేటప్పుడే కోహ్లీకి ఆ నెంబరుతో జెర్సీ ఇచ్చారు. ఆ తర్వత  అది తన జీవితంతో ప్రత్యేకంగా మారిందని, రెండు ముఖ్యమైన క్షణాలు ఆ రోజునే జరిగాయని గతంలో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది 18వ తేదీనే. 18 ఆగస్టు 2008లో తొలి వన్డే ఆడాడు. అతడి తండ్రి ప్రేమ్‌ కోహ్లీ 2006 డిసెంబరు 18న గుండెపోటుతో మరణించారు. కోహ్లీ తండ్రి కూడా క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నెంబరు 18నే వేసుకున్నారంట. ఆయన గుర్తుగా కింగ్ కూడా అదే నెంబరుతో కనిపిస్తున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కోహ్లీ సెంచరీ నమోదు చేసింది 18వ తేదీనే. 2012 మార్చి 18న ఢాకాలో పాకిస్థాన్ పై జరిగిన వన్డేలో కోహ్లీ 183 పరుగులు చేశాడు.  ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్పు కల నెరవేరింది. 18వ సీజన్లో కప్పు దక్కించుకోవడంతో ఆ నెంబరు కోహ్లీకి మరింత ప్రత్యేకంగా మారింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలిచిన రోజు కూడా  ఆ నెంబర్ మ్యాజిక్ కొనసాగడం విశేషం. 3-6-2025 కప్ గెలిచిన రోజు. అది టోటల్ చేస్తే వచ్చేది కూడా 18 కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

పీఎస్సార్ అంజనేయులుకి మళ్లీ అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి

ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో  విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి‌ పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం (జూన్ 4) జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పీఎస్సార్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలిస్తారు. ఇదే సమస్యతో ఆంజనేయులును గత నెల 31న ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించిన అధికారులు చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు.   పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో  ఏపీపీఎస్సీ కేసులో ఆంజనేయులుతో పాటు ధాత్రి మధును కూడా పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఏపీపీఎస్సీ కేసులో ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగున్న సంగతి తెలిసిందే.  

లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు సిట్ నోటీసులు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో  ఏర్పాటైన ప్రత్యేక  దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి పిఏ గా  పని చేసిన అప్పన్నకు అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం (జూన్ 4( నుంచి మూడు రోజులు పాటు తిరుపతి లోని సిట్ కార్యాలయంలోఅప్పన్నను సీట్ అధికారులు విచారిస్తారు. త్వరలో మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి, మాజీ ఈవో  ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీటీడీ మాజీ జేఈవో   సహ ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..  ఈ కేసుకు సంబంధించి  మరికొందరిని  అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సిట్ దర్యాప్తులో భాగంగా నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ దక్కించుకున్న తమిళనాడు  దిండుగల్ కు చెందిన ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయలేదని తేలింది.  ఉత్తరాఖండ్   రూర్కీలోని బోలేబాబ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి తిరుపతి జిల్లా లోని వైష్ణవి డైరీకి తరలించారు.  అక్కడ ఏఆర్ డైరీ సీల్   వేసి టీటీడీకి సరఫరా చేశారని సిట్ దర్యాప్తులో తేలింది.   అసలు తొలుత శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  ప్రకటించారు. ఒక సభలో ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ఆరోపించారు.    చంద్రబాబు ఆరోపణ అప్పట్లో  పెను సంచలనం   సృష్టించింది.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే  ఈ కేసులో సిట్ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమౌతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించి..   సీబీఐ ఆధ్వర్యంలో  సుప్రీం కోర్టు కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది.    

జగన్ రాక్షస పాలనపై సమర శంఖం యువగళం!

జగన్ పాలనపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమరశంఖం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ రాక్షస పాలనపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రముఖ పాత్ర వహించిందని పేర్కొన్నారు. నారా లోకేష్ తన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని బుధవారం (జూన్ 4) రాష్ట్ర సచివాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. పాదయాత్ర నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు.  జగన్ అరాచకపాలనకు జనం చరమగీతం పాడి ఏడాది పూర్తయ్యిందనీ, అయినా జగన్ పాలన పీడకలను జనం ఇప్పటికీ మరచిపోలేదని పవన్ కల్యాణ్ అన్నారు.  ఈ సందర్భంగా తన యువగళం పాదయాత్ర అనుభవాలను లోకేష్ పవన్ కల్యాణ్ తో పంచుకున్నారు. 

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వెనుపోటు దినంలో భాగంగా  చీపురుపల్లిలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఒక్క సారిగా స్ఫృహతప్పి కుప్పకూలిపోయారు. వెన్నుపోటు దినంలో భాగంగా వేదికపై మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు బొత్సను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.   బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వడదెబ్బకు గురి కావడం వల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తోంది. 

నమ్మితే నమ్మండి.. మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరార్!

నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా  లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు. నిజానికి మాములు జనమే కాదు.. రాజకీయ వర్గాల్లో చివరకు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ జరిగితే చూద్దాంలే అన్న మాటే వినిపిస్తోంది. అవును మరి, ఒకటి  రెండు సార్లు వాయిదా అంటే ఓకే..  కానీ ఒకటికి పది సార్లు అదే  రిపీట్ అయితే..  సహజంగానే నాన్న పులి కథ గుర్తుకొస్తుంది. అయినప్పుడు చూద్దాంలే అనే అనుకుంటారు.  అయితే..  ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణ  పక్కా అనే మాట  ఢిల్లీ వర్గాల నుంచి కొంచెం గట్టిగా వినిపిస్తోందని అంటున్నారు. నిజానికి.. ఇప్పటికే  అంతా అయిపోయిందనీ..  కేవలం లాంఛనంగా ప్రకటన  విడుదల చేయడం మాత్రమే మిగిలుందని అంటున్నారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మరి కొందరు ముఖ్యనాయకులు జూన్ 4 న ఢిల్లీ వెళుతున్నారు. అదే రోజు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత రాహుల్  గాంధీతో, ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర నేతలు సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ కీలక భేటీలో  ఖాయంగా  మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులతో పాటుగా..  విస్తరణ  ముహూర్తం కూడా ఫైనల్ అవుతుందని, అలాగే  టీపీసీసీ  కూర్పు కూడా  ఖరారు కావడం ఖాయమనీ  విశ్వసనీయ వర్గాల  సమాచారంగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  అయితే..  ఉహాగానాలు నిజ్జంగా నిజం అవుతాయా లేక, ఎప్పటిలానేనా?  అనే అనుమానాన్ని  పక్కన పెడితే..  తాజా సమాచరం ప్రకారం ఆశావహుల జాబితాలో ఈ సారి, నిన్న మొన్న ఎమ్మెల్సీ అయిన  రాములమ్మ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేవలం పేరు వినిపించడం మాత్రమే కాదు..  ఆల్మోస్ట్ ఖరారైనట్లే అంటున్నారు.    నిజానికి..  కొద్ది రోజుల క్రితం హైదరాబాద్’లో  జయశాంతి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసినప్పుడే ఆశావహుల జాబితాలో ఆమె పేరు చేరింది. మీనాక్షి నటరాజన్ ను కలిసిన సందర్భంలో విజయశాంతి తన మనసులోని కోరికను బయట పెట్టినట్లు తెలిసింది. ఆ సందర్భంగా మీనాక్షి నటరాజన్ అది అధిష్టానం పరిధిలోని అంశం అంటూనే.. విషయాన్ని అధిష్టానం చెవిన వేస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ..  ఇప్పుడు  ఫైనల్ లిస్టులో ఫస్ట్ పేరు ఆమెదే అనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది.  అదలా ఉంటే..  మంత్రి వర్గంలోకి కొత్తగా ఐదుగురిని తీసుకోవడంతో పాటుగా, మంత్రుల శాఖల్లో కీలక మార్పులు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతల శాఖల్లోనే మర్పులుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఇద్దరు మంత్రుకు ఉద్వాసన తధ్యమనే  చర్చ కూడా జరుగుతోంది. అలాగే..  కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ..  అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమా చారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అయితే చివరాఖరుకు ఏమి జరుగుతుందనేది ఇప్పటికీ సస్పెన్సే.. అంటున్నారు.

‘టీ ’ కప్పులో కొత్త ట్విస్ట్.. తెరపైకి ట్రబుల్ షూటర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత.. సర్వం తానై నడిపిస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇంతవరకు సైలెంట్ స్పేక్టేటర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, తొలి సారిగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం  స్పందించారు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా చిన్నా పెద్దా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించిన హరీష్ రావు..  కవిత ఎపిసోడ్ లో మాత్రం మొదటి నుంచి మౌనంగానే ఉన్నారు. నిజానికి.. ఒక్క హరీష్ రావు మాత్రమే కాదు, కేసీఆర్ మొదలు సంతోష్ వరకు, బీఆర్ఎస్ డ్రామాలోని ముఖ్య పాత్ర దారులు అంతా సైలెంట్ గానే ఉన్నారు.  ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న కవిత ఎపిసోడ్ లో కీలక పాత్ర దారులు ఎవరూ కూడా పెదవి విప్పలేదు.  కేసీఆర్ దేవుడు .. ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి అంటూ పరోక్షంగానే అయినా  ఆమె కుటుంబ సభ్యులపై వేలెత్తి చూపినా.. అంతకు మించిన వ్యాఖ్యలు, విమర్శలు, హెచ్చరికలు చేసినా..  అంతా గప్ చిప్. ఎవరూ పెదవి విప్పలేదు. అంతే కాదు.. కుటుంబ పెద్దలు మాట్లాడక  పోవడమే కాదు.. ఎవరూ మాట్లాడరాదని పెద్దాయన హుకుం జారీ చేశారనీ అందుకే  ఎవరూ పెదవి విప్పడం లేదని అంటున్నారు.  అయితే.. ఇంతకాలంగా మౌనంగా ఉన్న హరీష్ రావు.. తెలంగాణ జెండా సాక్షిగా  పెదవి విప్పారు. తెలంగాణ భవన్‌లో  జూన్2న జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న హరీష్‌రావు.. కవిత చేసిన కీలక వ్యాఖ్య పై స్పందించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు, కొందరు  కుట్ర చేస్తున్నారంటూ  కవిత  ఎవరి పేరూ ప్రస్తావించకుండా చేసిన విమర్శకు హరీష్ రావు  సమాధానం ఇచ్చారు.  అయితే ఇక్కడ హరీష్ రావు కూడా  కవిత పేరు ప్రస్తావించలేదు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందనీ..  బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని   కొందరు   అంటు న్నారు కానీ అందులో నిజం లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు.. విలీనం మాట దేవుడెరుగు, బీజేపీతోనే కాదు, ఇంకెవరితోనూ పొత్తు వరకు కూడా ఉందనీ..   కారు  ఒంటరిగానే రేసులో దిగుతుందని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే స్వయంగా కేసీఆర్  చెప్పారని గుర్తుచేశారు. అలాగే..  కేసీఆర్’ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే..  మరోవంక కవిత.. అంతకంటే ఎక్కుగా  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొదలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వరకూ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో బీఆర్ఎస్  విలీనం ఎపిసోడ్ ను సజీవంగా ఉంచేందుకు  శత విధాల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ చేసిన ప్రచారం  హస్తం పార్టీకి బాగా కలిసోచ్చింది. హస్త రేఖలను మార్చివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మరలేందుకు కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సాగించిన ప్రచారం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది.  అఫ్కోర్స్..  అదే సమయంలో బీజేపీ  బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి  తప్పులో కాలేసింది. కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్  ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఆ విధంగా బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకీ సోకింది. అంతవరకు జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో  దూకుడు చూపిన బీజేపీ ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది.  సో .. ఇప్పడు, మళ్ళీ రేపటి స్థానిక సంస్థల  ఎన్నికల్లో  అదే కార్డు ప్లే చేసేందుకు  ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ..  కవిత చేసిన  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని గట్టిగా పట్టుకుంది. స్థానిక ఎన్నికల వరకు సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోందని, పరిశీలకులు అంటున్నారు. నిజానికి..  కవిత విలీనం అంశాన్ని తెరపైకి తీసుకు రావడం వెనక  కాంగ్రెస్ హస్తం ఉండ అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని, కేటీఆర్ అన్నది ఇందుకేనా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నిజానిజాలు ఎలా ఉన్నా.. కవిత ఎపిసోడ్ లో వెలుగులోకి వచ్చిన రాజకీయ చీకటి కోణాలు ప్రధాన పార్టీల పాతివ్ర త్యానికి పరీక్షగా నిలిచాయని అంటున్నారు. ఇందులో ఉన్న నిజానిజాలు ఏమిటన్నది పక్కన పెడితే..  రాష్ట్ర రాజకీయాలు ముందు ముందు ఇదే మాదిరిగా అయితే ఉండవనీ,  కవిత ఎపిసోడ్ కు అటూ ఇటు అన్నట్లుగా మారిపోతాయని రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.

తుని కేసు విచారణపై జీవో.. కుట్ర కోణంపై అనుమానాలు

తుని కేసు.. అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు. ఈ సభ కాస్తా ఆందోళనలకు తెరలేపింది. ఆ ఆందోళనలు   అదుపు తప్పి..  ప్రయాణీకులతో వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులపెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఓ సంచలనంగా మారింది. అలాంటి కేసు ఇప్పుడు మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ వెంటనే అలాంటిది ఏం లేదని.. జారీ అయిన జీవోను వెంటనే రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు జరపాలని ఎందుకు అనుకుంది? మళ్లీ వెంటనే వెనకడుగు ఎందుకు వేసింది? అనేదే ఇప్పుడు చర్చ. తుని ఘటన తర్వాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం సహా.. అనేక మందిపై కేసులు నమోదు చేసింది. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడంతో.. రైల్వే అధికారులు కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ కేసులను ఎత్తివేసింది. 2021లో విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ కూడా ఈ కేసులను కొట్టివేసింది.  ఇలా అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం నుంచి ఈ కేసులను తిరిగి పునర్‌విచారించాలంటూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలంటూ జీవో జారీ అయ్యింది. ఇందులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ముఖ్యులైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కామన ప్రభాకర్‌రావులాంటి వారికి మళ్లీ చిక్కులు తప్పవని తేలిపోయింది. కానీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది . తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.  అసలు జీవో ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరి పర్మిషన్‌తో జీవో బయటికి వచ్చింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే తుని కేసును తట్టి లేపడమంటే.. ఏపీలో మరో తేనే తుట్టెను కదిపినట్టే. మొత్తం కాపు  సామాజికవర్గాన్ని కదిలించినట్టే. అంతటి సున్నితమైన అంశం గురించి ఆదేశాలు వెలువడే ముందు కనీసం ఎందుకు క్రాస్ చెక్ చేసుకోలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్. అసలు ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే ఈ జీవో వెలువడిందనేది మాత్రం తెలుస్తోంది. అందుకే జీవో విడుదలై వారి దృష్టికి రాగానే వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. క్లారిటీ ఇస్తూ.. జీవోను వెనక్కి తీసుకున్నారు.  ఏ స్థాయి అధికారి ఆమోదంతో ఈ ఫైల్ మూవ్ అయ్యింది.. ఎందుకు జీవోగా మారింది అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అసలు సీఎంవో పెద్దల జోక్యం లేకుండా.. సీఎస్ పరిశీలించకుండా.. సీఎం చంద్రబాబు ఓకే అనకుండా ఇలాంటి అత్యంత ముఖ్యమైన జీవో ఎలా బయటికి వచ్చిందనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అది కూడా కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలనను పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ జీవో రావడం మరిన్ని అనుమానాలకు తెరలేపుతోంది. దీని వెనక మరేదైనా కుట్ర ఉందా? లేక అధికారుల తప్పిదమేనా? అనే దానిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం

ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు జరిగిన రిజస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. పూర్తి స్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న చంద్రబాబు,  జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జూన్ 21న ప్రధాని నరేంద్రమోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనీ, వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు.  యోగాడైపై మంగళవారం (జూన్ 3) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగా డే కంటే ముందు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.   7వ తేదీ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహనా ర్యాలీలు, 14 వతేదీ రాష్ట్రంలో లక్ష  ప్రాంతాల్లో యోగా సాధన ఉంటుందన్నారు.  చేస్తారు. ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో 14వ తేదీ యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్దం  చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  ఈ సమీక్ష సమావేశంలో  మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. యోగా మాసంలో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరో వేదిక సిద్ద చేసినట్లు అధికారులు తెలిపారు.