క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికే క్లాసులు!
posted on Jun 7, 2025 @ 1:14PM
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన తరువాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరయ్యారు . అదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు అటెండ్ అయ్యారు. కార్యక్రమం అనంతరం ఎంపీ మల్లు రవితో విజయుడు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో భేటి కావడంతో పాటు ఆయనతో కలిసి గద్వాల కాంగ్రెస్ ఇంచార్జీ సరిత నివాసంలో తేనీటి విందులో పాల్గొన్నారు .
అయితే ఎంపి మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు భేటీ కావడం, ఆయనతో పాటు సరిత నివాసానికి వెళ్లిన విజయుడుని శాలువా, బొకేలతో సత్కరించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి . ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్‌లో చేరేందుకే మల్లు రవి తో భేటీ అయ్యారని , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆదేశాలతోనే విజయుడు కాంగ్రెస్ ఎంపీతో మంతనాలు సాగించారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది.
మరో పక్క ఎంపీ మల్లు రవి గద్వాల ఎమ్మెల్యే ఇంటికి, జడ్పీ మాజీ చైర్మన్ సరిత ఇంటికి విజయుడిని వెంటబెట్టుకుని తన వాహనంలో తీసుకుపోవడంపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పరాజయం పాలైన సంపత్ వర్గం గుర్రుగా ఉన్నారు . కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లురవిపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నాడంటూ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కు అలంపూర్ కాంగ్రెస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వెంట తిప్పుకోవడాన్ని అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు పడుతున్నారు .
ఆ క్రమంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై ఆ పార్టీ నేత అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అలంపూర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు వివరించానన్నారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు. ఎంపీగా మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో అఫీషియల్‌గా మీటింగ్ పెడితే బాగుండేదని, కానీ అన్ అఫిషియల్‌గా బీఆర్ఎస్ నాయకులతో మీటింగ్ పెట్టడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పూల బొకేలు, శాలువలతో సత్కరించడం, ఎమ్మెల్యే విజేయుడు ఎప్పటికైనా కాంగ్రెస్‌లోకి వచ్చే వ్యక్తి అని కామెంట్స్ చేయడం బాధ అనిపించిందన్నారు సంపత్ కుమార్.
ఆయన్ను ఎంపీగా గెలిపించడం కోసం రక్తం దార పోశానని, ఇప్పుడు ఆయనకు అవేమీ గుర్తులేకుండా పోయాయని సంపత్ కుమార్ అవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఇష్యూకు తొందరగా పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలని, పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమని, అయితే వాటిని అధిగమించి, పరిష్కరిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. మరి ఈ వ్యవహారం ఎటు మలుపులు తిరుగుతుందో చూడాలి.