క్రికెట్.. సమ్ టైమ్స్ క్రై కెట్!

ఇప్ప‌టి  వ‌ర‌కూ అత్య‌ధిక గెలుపులంటే అవి ఆస్ట్రేలియావే. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర‌ల్డ్ క్రికెట్ ని ఈ దేశం శాసించినంత‌గా మ‌రే దేశం శాసించ‌లేదు. తొలి రోజుల్లో వెస్టిండీస్ ఇలాగే ఉన్నా.. త‌ర్వాతి కాలంలో ఆస్ట్రేలియా ఈ విజ‌య ప‌రంప‌ర అందిపుచ్చుకుంది. అంత‌గా వారు క్రికెట్ లో గెలుపు రుచి చూశారు.  అత్య‌ధిక వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్పులు కొల్ల‌గొట్టిన వీరు ఎప్పుడూ ఏడ‌వ‌లేదు. పై పెచ్చు.. క‌మిన్స్ నాయ‌క‌త్వంలో గెలిచిన‌ గ‌త వ‌ర‌ల్డ్ క‌ప్పును త‌మ కాలి కింద వేసుకుని.. వ‌ర‌ల్డ్ క్రికెట్ మా పాదాక్రాంతం అన్న సంకేతాల‌నిచ్చారుగానీ ఎప్పుడూ ఎడ‌వ‌లేదు. అపురూప‌మైన విజ‌యాలు ఎదురైన‌పుడు ఏడ్చిన వారు చాలా చాలా త‌క్కువ‌. గ‌తంలో శ్రీలంక మీద వేగ‌వంత‌మైన శ‌త‌కంతో సెహ్వాగ్ సంతోషం వ్య‌క్తం చేశాడుగానీ ఏడ‌వ‌లేదు.   ఈడెన్ టెస్టులో హ్యాట్రిక్ వికెట్ తీసిన‌పుడు.. హ‌ర్బ‌జ‌న్ ఏడ‌వ‌లేదు ఎంజాయ్ చేశాడు. ఇదే మ్యాచ్ లో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ అపూర్వ‌మైన 287 ప‌రుగులు చేసిన‌పుడు కూడా ఏడ‌వ‌లేదు. ఆనందంతో సెలబ్రేష‌న్  చేసుకున్నాడు. వెస్ట్ ఇండీస్ మీద 329 ప‌రుగుల టార్గెట్ చేసిన రాహుల్ ద్రావిడ్ చివ‌రి బంతికి బౌండ‌రీ కొడ‌తార‌ని ఊహించారు కానీ సింగిల్ తీసి కేవ‌లం బ్యాట్ పైకెత్తి గెలుపు ఆనందాన్ని వ్య‌క్తం చేశాడంతే. లార్డ్స్ లో గంగూలీ ష‌ర్ట్ విప్పి గాల్లో తిప్ప‌డం ద్వారా ఇండియా విజయాన్ని కాస్త ఎమోష‌న‌ల్ చేశాడు. అంతే త‌ప్ప ఏడ‌వ‌లేదు. అయితే ఇది భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఒక మ‌ర‌పురాని మైలురాయిలాంటి విజ‌యం. ఇక్క‌డి నుంచి భార‌త్ మ‌రింత ప‌టిష్ట‌ప‌డుతూ వ‌చ్చింద‌ని అంటారు.  ధోనీ సార‌ధ్యంలో రెండు ప్ర‌పంచ క‌ప్పులు గెలిచిన‌పుడు కూడా ఏడ‌వ‌లేదు. ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేశాడు. అస‌లు ధోని గెలిచిన‌పుడే కాదు ఓడిన‌పుడు కూడా ఏమంత భావోద్వేగానికి గురి కాడు. ఐపీఎల్లో ఎన్నో సార్లు అవ‌లీల‌గా ట్రోఫీలు ఎత్తాడు. అంతే స్థాయిలో ఈ సారి త‌న జ‌ట్టు ప‌రాజ‌యం పాలైనా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. గేమ్స్ లో గెలుపోట‌ములు కామ‌న్ అన్న‌ది ధోని మార్క్ సార‌ధ్యం. స‌చిన్ కి అదే చివ‌రి టోర్న‌మెంట్ అయిన‌పుడు ఎవ‌రూ ఏడు మొహం పెట్ట‌లేదు. ఆ ఛాయ‌లు త‌న మొహంలోనూ క‌నిపించ‌లేదు. బ్యాటుకీ బాలుకీ పిచ్ కీ స‌చిన్ కి అంత‌టి అనుబంధం. కానీ వాటిని వ‌దులుతున్నపుడు ఎలాంటి ఏడుపులు పెడ‌బొబ్బ‌లు పెట్ట‌లేద‌త‌ను. మొన్న‌టి ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన‌పుడు ఫైన‌ల్స్ లో సిరాజ్ ఏడ‌వలేదు. కానీ, భార‌త్ గెలిచిన‌పుడు అత‌డు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడ‌న్న‌ది తెలీదు.  ఇదే ఐపీఎల్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ సైతం త‌న ఫ‌స్ట్ మ్యాచ్ లో త‌క్కువ స్కోర్ మాత్ర‌మే చేసిన‌పుడు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఎందుక‌లా అయ్యాడంటే అత‌డు చిన్న‌పిల్లాడు కాబ‌ట్టి అది స‌హ‌జం క‌దా అనుకున్నారంతా. ఆ మాట‌కొస్తే గ‌తంలో వినోద్ కాంబ్లీ శ్రీలంక‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లో ఔట్ అయిన‌పుడు కూడా ఇలాగే భావోద్వేగానికి గుర‌య్యాడు. లేటెస్టుగా ఐపీఎల్ ఫైన‌ల్ చివ‌రి ఓవర్  నుంచే విరాట్ ఏడుపు మొహం పెట్టుకుని క‌నిపించాడు. ఏడుపు వ‌స్తోంద‌ని సైగ చేశాడు. గెలుపు ముందు క్ష‌ణాలు అంటే చివ‌రి ఓవ‌ర్ రెండో బంతి నుంచి ఏడ‌వ‌డం మొద‌లు పెట్టాడు. ఆట‌ల్లో గెలిచిన‌పుడు ఆనందించాలిగానీ ఈ ఏడుపులేంటి? ఇవే ఒక్కోసారి విషాదాంతాల‌కు దారి తీస్తాయ‌న‌డానికిదో నిద‌ర్శ‌నంగా విశ్లేసిస్తున్నారు కొంద‌రు క్రికెట్ ఎన‌లిస్టులు

హైదరాబాద్‌లో హైడ్రా నాలుగు నెలలు స్పెషల్‌ డ్రైవ్‌

  హైదరాబాద్ నగరంలో రాబోయే 4 నెలలు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామని  హైడ్రా కమీషనర్  రంగనాథ్ తెలిపారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన కమర్షియల్ భవనలను తొలిగిస్తామని కమీషన్ తెలిపారు. పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ తెలిపారు. ముఖ్యంగా నగరంలో వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.. ఈ అధ్యయనం ద్వారా సమస్య మూలాలను కనుగొని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.రసూల్‌పురా నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పరిధిలో బేగంపేట, ప్యాట్నీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.  

ట్రంప్, మస్క్ మధ్య ఎక్కడ చెడింది?

విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి? ఇన్నాళ్లూ కలసి మెలసి అలాయ్ బలాయ్ అన్న ఈ బాబాయ్- అబ్బాయ్ ఇప్పుడు సడెన్ గా ఎందుకు విడిపోయినట్టు? ట్రంప్ కీ మస్క్ కి ఎక్కడ చెడినట్టు? విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన ఎలాన్ మస్క్  ఇప్పుడు  బిగ్ బిల్ విషయంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు?  ఇదీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్న. దీనిపైనే ప్రపంచదేశాలలో సామాన్యుల నుంచి అధికారుల వరకూ, దేశాధినేతల నుంచి మేథావుల వరకూ జోరుగా సాగుతున్న చర్చ. ట్రంప్ మీద మస్క్ వరుస విమర్శనాస్త్రాలను గురి పెడుతున్నారు. మొన్న బిగ్ బిల్ ని పంది మాంసంతో పోల్చిన మస్క్.. ఇప్పుడు మరో బాంబు పేల్చారు.. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్‌రీ ఎప్ స్టైన్ తో ట్రంప్ నకు సంబంధాలున్నాయని.. కొత్త అప్ డేట్ ని ట్రంప్ వ్యతిరేకుల చేతికి ఇచ్చారు.  ఏంటీ ఎప్ స్టైన్ స్కామ్ అన్నది అలా ఉంచితే.. మస్క్ ఏంటి ట్రంప్ కి ఇలా రివర్స్ తిరిగాడన్నది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. నిజానికి ఎలాన్ మస్క్ 2024 ఎన్నికల్లో ట్రంప్ కోసం ఏకంగా 288 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఇది భారత కరెన్సీ ప్రకారం చెబితే ఏకంగా పాతిక వందల కోట్ల రూపాయలు. ఇందుకు మస్క్ కి మిగిలింది.. టెస్లా కార్ల షోరూములు ధ్వంసం కావడం, తన కంపెనీ షేర్ ధరలు అమాంతం 50 శాతం పడిపోవడం. ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు తగ్గడం. ఇవన్నీ ఒకెత్తైతే.. ఆయనకు వచ్చిన చెప్పపేరు మరో ఎత్తు.    తన స్నేహితుడు ఐజాక్ మాన్ ను నాసా చీఫ్‌ గా ప్రకటిస్తానని మాటిచ్చిన ట్రంప్ మాట మార్చడంతో.. ఇటు గోడ దెబ్బ అటు చెంపదెబ్బగా మారింది మస్క్ పరిస్థితి. ఒక వేళ బిగ్ బిల్ గానీ అమల్లోకి వస్తే టెస్లా ఈవీల కొనుగోలు దారులకు ఇచ్చే మినహాయింపులు కట్ చేల్సి వస్తుంది. దీని ద్వారా.. మరో 1. 2 బిలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క తాను డోజ్ సలహాదారుగా ఉండి తీసుకున్న నిర్ణయాలు కూడా బెడిసికొట్టాయి. ట్రంప్ పాలనా పరమైన లోపాలన్నిటికీ మస్కే  కారణం అన్న చెడ్డ పేరు అమెరికన్లలోకి భారీగా వెళ్లిపోయింది. దీంతో స్పేస్ ఎక్స్, టెస్లా వంటి తన కంపెనీల ప్రభ మసకబారడం మొదలైంది.   దీన్నిబట్టీ చూస్తే అంతరిక్షంలోకి మనిషిని పంపి యాజ్ ఇటీజ్ నేలకు దించినంత ఈజీ కాదు రాజకీయాలంటే! అని మస్క్ కి తెలిసి వచ్చింది .  కార్లు తయారు చేసి జనం మెప్పు పొందినంత ఈజీ కాదు రాజకీయాల్లో రాణించడం అంటే!అన్న తత్వం మస్క్ కి బెధపడింది.   బేసిగ్గా ఇలాంటి వ్యాపారులు రాజకీయాల్లోకి వచ్చేదే తమ వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని. ఇందుకు రివర్స్ అయితే ఈ రాజకీయాలెందుకు? వాటికి ఇంత భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడమెందుకు? ట్రంప్ కోసం తన గుడ్ విల్ ని, వ్యాపార సామ్రాజ్యన్నీ ఫణంగా పెట్టినందుకు మస్క్ కు మిగిలిందేమిటంటే పూడ్చుకోలేనంత నష్టం.   దీంతో తండ్రి ఎరోన్ మస్క్.. తన కొడుకు ఎలాన్ మస్క్ సలహా ఇచ్చారు. అర్జెంటు గా ఆ ట్రంప్ సహవాసం వీడి.. భారత్ కి రా.. ఇక్కడి ఆలయాలను సందర్శించు. మనశ్శాంతిని పొందు! అని ససలహా ఇచ్చారట. ఇదిలా ఉంటే మస్క్ కూడా భారత్ కి రావల్సి ఉంది. కానీ ఎందుకో వాయిదా పడింది. కారణం.. టెస్లా కార్ల తయారీకి ఇక్కడ అవకాశం లేక పోవడం. కేవలం అమ్మకాలతో సరిపెట్టుకోవల్సి రావడం ఒక కారణం కాగా.. మరొకటి ఇక్కడ అధికార గణంతో ఎక్స్ కంటెంట్ మోడరనేషన్ విషయంలో చిన్న పాటి సమస్యలు తలెత్తాయి. దీంతో మస్క్ భారత్ ట్రిప్ ఆగింది. ప్రస్తుతం మస్క్ న్యూరాలింక్ అనే కొత్త ప్రాజక్ట్ లో ఉన్నారు.. దీన్నిబట్టీ చూస్తే వెన్నుముక విరిగిపోయిన వారికి కొత్త జీవితం ప్రసాదించడం, కంటి చూపు పోయిన వారిని చూడగలిగేలా చేయడం అనే మిషన్లో బిజి బిజిగా ఉన్నారు మస్క్.  ఇలాంటి తన బిజినెస్ ఐడియాలు పొలిటిక్స్ లో వాడ్డం కుదరదని భావించి.. మొదట డోజ్ నుంచి బయటకొచ్చారు మస్క్. తర్వాత ట్రంప్ తీసుకుంటున్న బిగ్ బిల్ వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఎప్ స్టైన్ కి ట్రంప్ కి ఉన్న లింకులు బయట పెట్టి.. నేను ట్రంప్ కి డెడ్ యాంటీ అనే సిగ్నళ్లు పాస్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వెనక తాను లేను. తద్వారా నన్ను ఆడిపోసుకోకండి. నేను కూడా మీలాగా ట్రంప్ బాధితుడ్నే.. అని ఆయన జనాలకు క్లియర్ కట్  మెసేజ్ ఇస్తున్నట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మస్క్ ఇంత భారీ ఎత్తున విరాళాలిచ్చి మరీ.. రాజకీయాల్లోకి రావడం వెనక ఒక ఉద్దేశముందని అంటారు. తాను కూడా ఒకనాటికి ట్రంప్ లా అధ్యక్షా! అనిపించుకోవాలని ఆశ. కానీ, విచిత్రమైన విషయమేంటంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. మస్క్ కి వరుస దెబ్బలు తగలడంతో.. ఇదిగో ఇలా రివర్స్ గేర్ వేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు అమెరికన్ ఎనలిస్టులు.

ఆర్సీబీ బిజినెస్ హెడ్ అరెస్టు.. బెంగళూరు సీపీ సస్పెన్షన్

ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై సిద్దరామయ్య సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి  బెంగళూరు పోలీస్ కమిషనర్‌పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. సీపీ దయానంద్‌తో పాటు ఏసీపీ, డీసీపీలను కూడా సస్పెండ్ చేసింది. అలాగే కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఇన్‌ఛార్జ్లపై సైతం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే  ఆర్సీబీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు  రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్యానెల్‌ను నియమించారు. ఈ ప్యానెల్ విచారణ జరిపి నెల రోజులలోగా నివేదిక అందించాలని ఆదేశించారు. అాలాగే తొక్కిసలాట  ఘటనపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.ఈ ఘటనకు సంబంధించి  ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోలే సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్  నిఖిల్ సొసలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి.   

కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 489 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కు చేరుకుంది. ఇలా ఉండగా కరోనా కారణంగా గత 24 గంటల్లో నలుగురు మరణించారు. కేరళలో ఇద్దరు, పంజాబ్ ,కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 55కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే నిన్న ఒక్క రోజే కొత్తగా 11 మందికి కరోనా సోకింది. ఏపీ, తెలంగాణ లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో ఒకే రోజు మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.  నెల్లూరులో గురువారం (జూన్ 5) ఒక్కరోజే నలుగురికి,  విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది. నెల్లూరు జీజీహెచ్‌లో బుధవారం ఆరుగురికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో గురువారం నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 62కు చేరింది. ఇక  తెలంగాణలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో   యాక్టివ్ కేసుల సంఖ్య 5కు పెరిగింది. 

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ

  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఆర్డీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడో సారి ఈ రోజు ముగిసిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గతంలో పాతిక బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ ఈ సారి 50 బేసిస్ పాయిట్లను తగ్గించింది. ఈ తాజా తగ్గింపుతో రెపో రేటు 6 నుంచి 5.50 శాతానికి దిగివచ్చింది. ఈ తగ్గింపు వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 3.7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.  మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది.  

మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్

ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఉత్కంఘగా  ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు "AP DSC 2025 ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శుభాకాంక్షలు!" అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  ఇక‌, ఈ రోజు (జూన్ 6, 2025) ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 30 తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా డీఎస్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 137, ఇతర రాష్ట్రాల్లో 17  మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం షిఫ్టు 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ  ఫైలు మీదే తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. 

అంగరంగ వైభవంగా అఖిల్ జనాబ్ వివాహం

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేనిఅఖిల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  శుక్రవారం (జూన్ 6) తెల్లవారు జామున మూడు గంటలకు అఖిల్ జనాబ్ మెడలో తాళి కట్టారు. ఈ వివాహ వేడుకకు  మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్  సహా  టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు.   గురువారం (జూన్ 5) రాత్రి నుంచే వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి.  వెకేషన్ లో ఉన్న అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత దంపతులు కూడా వెకేషన్ ను ముగించుకుని వివాహానికి హాజరయ్యారు. ఇక ఆదివారం (జూన్ 8)న అఖిల్ జనాబ్ ల పెళ్లి రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ హాజరౌతారని తెలుస్తోంది. అలాగే పలువురు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలూ కూడా ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.  ఆదివారం (జూన్ 8) వివాహ రిసెప్షన్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ తెలిపింది.  

కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల

కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం (జూన్ 6) హాజరు కానున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు  ఆర్థిక, విధాన నిర్ణయాలు, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైనా కమిషన్ ఈటలను ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్​ కేబినెట్​లో ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై ఆయనను కమిషన్​ ప్రశ్నించనుంది.   ఇక మాజీ మంత్రి హరీష్ రావు  సోమవారం (జూన్ 9) కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కమిషన్ ఎదుట ఈ నెల 11న హాజరు కానున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఈ  నెల5నే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన విజ్ణప్తి మేరకు కమిషన్ విచారణకు 11కు వాయిదా వేసింది.   అసలు కేసీఆర్, ఈటల, హరీష్ రావులను విచారించకుండానే కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని ముందుగా భావించినప్పటికీ  ఆ తరువాత వీరిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకుంది.  విచారణలో భాగంగా ఇప్పటికే 109 మంది రిటైర్డ్​ ఈఎన్​సీలు, ఇంజనీర్లు, అధికారులు, పలువురు ప్రైవేట్​ వ్యక్తుల నుంచి స్టేట్​మెంట్లను తీసుకున్న కమిషన్, వారి స్టేట్ మెంట్ల ఆధారంగా  తుది నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది.  ఇప్పుడు కేసీఆర్​, హరీశ్​ రావు, ఈటల రాజేందర్​ వాంగ్మూలాలనూ నమోదు చేయాలని కమిషన్ వారికి నోటీసులు పంపింది. 

వైసీపీ నిరసనలు తుస్సు.. పార్టీ భవిష్యత్ పై క్యాడర్ లో ఆందోళన!?

వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కూటమి సర్కార్ వ్యూహా త్మకంగా ప్రజలలో ప్రచారం చేస్తున్నది. జగన్ దుష్టపాలనను జనం మరచిపోయే అవకాశం లేకుండా వాటి ప్రభావంతో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతింది. ప్రజా ప్రయోజనాలకు ఎలా భంగం వాటిల్లింది వంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జగన్ నవరత్నాలు అంటూ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో మరీ ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలలో ఇప్పటికీ ఒకింత సానుకూలత ఉందన్న అంచనాల నేపథ్యంలో  ఆ సానుకూలతను రూపుమాపి, అంటే జగన్ సంక్షేమ పథకాలను జనం మరిచిపోయేలా మరింత సంక్షేమం, దానితో పాటే అభివృద్ధి, ఆ అభివృద్ధి ఫలాలు జనానికి అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ కూటమి సర్కార్ అడుగులు వేస్తున్నది. అదే సమయంలో సంక్షేమ పథకాల పేరిట జగన్ జనానికి చేసిన దగాను సమర్థవంతంగా, ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నది.    ముఖ్యంగా రేషన్ పంపిణీ విషయంలో జగన్ ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా అనే కార్యక్రమాన్ని జగన్ అప్పట్లో చేపట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ అంటూ వాహనాలను రద్దు చేసింది.  ఈ విషయంలో తొలుత ఒకింత వ్యతిరేకత వ్యక్తమైనట్లు కనిపించినా.. ఒకటి రెండు రోజులలోనూ ఆ వ్యతిరేకత మటుమాయమైంది. అంత పకడ్బందీగా దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు జగన్ హయాంలో ఇంటింటికీ రేషన్ అన్నది ఒక మాయావస్త్రంగా మారిందనీ, వాహనం ఇంటి ముందుకు వచ్చి రేషన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవనీ, ఎక్కడో    కూడలిలో రేషన్ పంపిణీ వాహనం అందితే అక్కడకు పరుగులు పెట్టాల్సి వచ్చేదని లబ్ధిదారులు బాహాటంగా చెబుతున్నారు. దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ వల్ల తాము తాపీగా వెళ్లి తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడిందని అంటున్నారు.  ఇక పరామర్శల పేర జగన్ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ లకు మద్దతుగా నిలుస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించడంలో కూడా కూటమి సర్కార్ విజయం సాధించిందనే చెప్పాలి. ముఖ్యంగా తెనాలి ఐతానగర్ సంఘటనలో జగన్ పరామర్శ బూమరాంగ్ అయ్యింది. దళిత సంఘాలలో జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. పోలీసులు బహిరంగంగా ఐతానగర్ లో రౌడీషీటర్లకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను జనం హర్షించారు. అటువంటి రౌడీ షీటర్లకు జగన్ అండగా నిలవడమేంటన్న ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలాగే జనవరి 4 వెన్నుపోటు దినం అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. జగన్ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోడాన్ని వైసీపీ క్యాడరే జీర్ణించుకోలేకపోతోంది. అధినాయకుడు నిరసనలలో పాల్గొననప్పుడు తాము మాత్రం ఎందుకు అన్నట్లుగా చాలా ప్రాంతాలలో వెన్నపోటు దినం నిరసనలకు వైసీపీ క్యాడర్ దూరంగా ఉంది. దీంతో వైసీపీ నేతలు ఆ నిరసన కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ఆ కారణంగా అవి జనానికి పట్టని నిరసనలుగా మిగిలిపోయాయి. అదే సమయంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు నిర్వహించిన సంబరాలు ఆర్భాటంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. జనం కూడా ఆ వేడుకలలో స్వచ్ఛందంగా పాలుపంచుకున్న పరిస్థితి కనిపించింది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ పై ఆ పార్టీ వర్గాలలోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏ1 ప్రభాకరరావు విచారణకు డుమ్మా.. ఇప్పుడేం జరుగుతుంది?

ట్యాపింగ్ కేసులో ఏ1 ముద్దాయి.. విచారణకు డుమ్మా కొట్టారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాలి. అలా హాజరౌతానని స్పష్టమైన హామీ ఇచ్చే సుప్రీం కోర్టు ద్వారా పాస్ పోర్టు సంపాదించుకున్నారు. అయితే ఆయన విచారణకు డుమ్మా కొట్టారు.  సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒక సారి ఉపయోగించుకునే వన్ టైమ్ పాస్ పోర్టు ఆయనకు అందింది కూడా. దీంతో ఆయన స్వయంగా సుప్రీం కోర్టుకు చెప్పిన విధంగా మూడు రోజుల్లో అంటే  జూన్ 5న విచారణకు హాజరౌతారనే అంతా భావించారు. కానీ ఆయన విచారణకు రాలేదు.  దీంతో న్యాయనిపుణులు ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని అంటున్నారు.  అయితే ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారనీ రెండు రోజుల్లో వచ్చి విచారణకు హాజరౌతారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.   అయితే ఆయన ఉద్దేశపూర్వకంగానే విచారణకు అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటున్నారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. తొలుత ఆరు నెలల్లో వస్తానన్నారు. అంతా నిజమేనని నమ్మారు. ఆ తరువాత అమెరికా నుంచి ఇక తిరిగి వచ్చేది లేదని చాటుతున్న విధంగా గ్రీన్ కార్డు తీసుకున్నారు.  దీంతో ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ కావడంతో గత్యంతరం లేక సుప్రీంను ఆశ్రయించి పాస్ పోర్టు ఇప్పిస్తే విచారణకు హాజరౌతానని అన్నారు.  ఆయన విజ్ణప్తిపై సుప్రీం సానుకూలంగా స్పందించింది. ఆయనకు పాస్ పోర్టు అందింది. అయితే చెప్పినట్లుగా.. విచారణకు రాకుండా ప్రభాకరరావు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన తీరు పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన గైర్హాజరీ కోర్టు ధిక్కరణేనని అంటున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం ప్రభాకరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడే సాహసం చేయరనీ, రెండు లేదా మూడు రోజులలో విచారణకు హాజరౌతారనీ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 

భటింగే తో కటింగే.. నినాదం కాదు, నిజం!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి వరసగా మూడవసారి ప్రజా పట్టాభిషేకం జరిగి సంవత్సరం పూర్తయింది. అవును.. గత సంవత్సరం జూన్ 4,5 తేదీలలో  2004 లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఎ విజయ కేతనం ఎగరేసింది. మోదీ సర్కార్ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టింది. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడవ సారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోదీ చరిత్రలో స్థానం  సంపాదించుకున్నారు. అంతవరకు బాగుంది..  అయితే  ఈ ఎన్నికల్లో ప్రజలు అంతకు మించిన సందేశమే ఇచ్చారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ  ప్రజలు వరసగా మూడవ సారి  ప్రధాని మోదీ పాలన పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అయితే అది సంపూర్ణమా అంటే కాదు. ఎన్డీయేకి అధికారాన్నిఅయితే అప్పగించారు కానీ.. ఎన్డీఎకు ఆశించిన మెజారిటీ రాలేదు. అలాగే..  ఎన్డీఎ కూటమికి సారధ్యం వహిస్తున్న బీజేపీకి కూడా ఆశించిన ఫలితాలు రాలేదు.  కమల దళం కలలు కన్న 400 ప్లస్  (చార్ సౌ పార్) నెంబర్ కు ఆమడల దూరంలోనే బీజేపీ స్కోర్ ఆగిపోయింది. ఆశించిన నెంబర్ రాక పోవడమే కాదు.. సిట్టింగ్ స్థానాలకే పెద్ద ఎత్తున గండి పడింది.  బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది.  అంతే కాదు వరసగా రెండు ఎన్నికల్లో (2014,2019), సోంతంగానే మెజారిటీ సొంతం చేసుకున్న బీజేపీ మూడవ సారి మాత్రం ఆ మెజారిటీ సాధించలేకపోయింది.  బీజేపీ ఎంపీల సంఖ్య సింపుల్ మెజారిటీకి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయినా..  ఎన్డీఎ కూటమి 293 సీట్లు గెలవడంతో అధికారం నిలబడింది. ముఖ్యంగా తెలుగుదేశం (16), జనతదళ్(యు)(11) మద్దతుతో మోదీ ముచ్చటగా మూడవ సారి ప్రధాని అయ్యారు.  మోదీ ప్రధాని అయ్యారు కానీ..  మోదీ 3.0 ప్రభుత్వం ముందులా కీలక నిర్ణయాలు తీసుకోగల్గుతుందా?  మోదీ  సుస్థిర పాలన కొనసాగించ గలరా? అనే అనుమానాలు  రాజకీయ వర్గాల్లో సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరో వంక.. సంకీర్ణ కట్టుబాట్లు  జాతీయవాద ఎజెండాకు బ్రేకులు వేస్తాయా?  అనే సందేహాలు సంఘ్ పరివార్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి.  అయితే.. ఇటు చంద్రబాబు, అటు నితీష్ కుమార్ మోదీకి అండగా నిలవడంతో ఆనాటి అనుమానాలు అన్నీ తొలగి పోయాయి. మోదీ సర్కార్   ప్రయాణం సజావుగా సాగుతోంది.  ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు  ముఖ్యంగా.. టీడీపీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజనీతిజ్ఞతతో   పార్టీలు వేరైనా  అంతరంగం ఒకటే అన్నట్లుగా సుస్థిర అభివృద్దే లక్ష్యంగా ఒకటిగా సాగుతున్నారు. అందుకే.. మోదీ ప్రభుత్వం పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా  సుస్థిరంగా సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. చివరకు,  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా  మోదీ 3.0 ప్రభుత్వం  ముందు కంటే మరింత స్థిరంగా ముందుకు సాగుతోందనీ, శషబిషలు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. మరోవంక.. 2024 ఎన్నికల ఫలితాలు  ప్రతిపక్ష ఇండియా కూటమి, ముఖ్యమంగా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలకు అవకాశం కల్పించాయి.  వరసగా రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని  కాంగ్రస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష  నాయకుడయ్యారు.  అదొకటి అయితే..  2024 ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును, విశ్లేషించుకుంటే, అటు బీజేపీకి అయినా ఇటు కాంగ్రెస్ కు అయినా  మిత్ర పక్షాల చేదోడు అవసరమని స్పష్టం చేశాయి. మిత్రపక్షాల సహకారం లేకుండా  అధికారమే కాదు.. ప్రతిపక్ష హోదా కూడా అసాధ్యమనే వాస్తవాన్ని 2024 ఎన్నికల ఫలితాలు విశదీకరించాయి.   నిజానికి.. 2024 ఎన్నికల ఫలితాలే కాదు, ఈసంవత్సర కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అందుకే, బీజేపీ  ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ (కలిసి ఉంటే కలదు సుఖం,విడిపోతే పడిపోతాం) అనే  నినాదాన్ని ఉభయ తారకంగా ఉపయోగించుకుని  లోక్ సభ ఎన్నికల నష్టాన్ని  మహరాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పూడ్చుకుంది. ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడంమే కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్మూ కశ్మీర్, ఝారఖండ్  తదితర రాష్ట్రల్లోనూ  ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందగలిగింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ  పరిస్థతి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. దేశ రాజధానిలో వరసగా అరవ సారి జీరో’ గా మిగిలింది.  సో...   ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ నినాదం కాదు నిజం అంటున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కోనసాగుతున్నది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీజీహెచ్ వెలుపలి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా  సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 67 వేల 284 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 253 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 34 లక్షల రూపాయలు వచ్చింది.   

48 గంటల అబ్జర్వేషన్‌లో మాగంటి.. దేవుడి దయతో కోలుకోవాలి : హరీశ్ రావు

  జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దేవుడి దయతో  కోలుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన గోపీనాథ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. నిపుణులైన వైద్యలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటారని హారీశ్‌రావు తెలిపారు. మాగంటి త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతు గోపీనాథ్‌ కోలుకుంటున్నారని గోపీనాథ్‌ వైద్యానికి స్పందిస్తున్నారని తెలిపారు. ఇటీవల బోరబండకు చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌ సర్దార్‌ ఆత్మహత్య ఘటనతో మాగంటి ఒత్తిడికి గురయ్యారన్నారు.  48గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని వివరించారు. మాగంటి గోపీనాథ్‌కు సీనియర్‌ వైద్యులు చికిత్స అందిస్తున్నారని, క్షేమంగా బయటికొస్తారనే విశ్వాసం ఉందన్నారు. 48 గంటల తర్వాత వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తారని తెలిపారు. అయితే ఆయన వెంటీలేటర్ పై చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన బంధువులు పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంపై వస్తున్న వందతులను కొట్టిపారేశారు. గోపీనాథ్ కు ఐసీయూలో 48 గంటల అబ్జర్వేషన్ కొనసాగుతోందని, ఆయన చనిపోయారంటూ వస్తున్న వార్తలు అసత్యం అన్నారు.దయచేసి అలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరారు. మరోవైపు గోపీనాథ్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరుకొని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.     

టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాగంటి గోపీనాథ్

  జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్టు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు భారాస నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని గోపీనాథ్‌ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని హరీశ్‌రావు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయ ఓనమాలు నేర్చుకుంది టీడీపీలోనే. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తన 26 ఏళ్ల వయస్సులో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 1985 నుంచి 1992 వరకు  పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్‌గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, హైదరాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాల్లో పార్టీకి సేవలందించారు.గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ  నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత రాష్ట్రంలో మారిన పరిణామాలతో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గులాబీ టికెట్‌పై పోటీ చేసి రెండు సారి విజయం సాధించారు. ఆయన 2018లో శాసనసభలో పీఈసీ సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లో మూడో బీఆర్ఎస్ టికెట్‌తో పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ అయిన గోపీనాథ్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

విశాఖ రైల్వే జోన్‌కు ముందడుగు..తొలి జీఎంగా సందీప్ మాథుర్

  విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ మేనేజర్ నియామకం ఆనందంగా ఉంది. ఇది కేవలం పరిపాలనాపరమైన చర్య కాదు. ఈ జోన్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో ఒక మైలురాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో మన ప్రాంత వాగ్దానాలు నెరవేరుతున్నాయి' అని కేంద్రమంత్రి రామ్మోహన్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది.విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. అయితే గత పదేళ్లుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా జోన్‌ వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటీవల కూటమి సర్కార్ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వేజోన్‌పై కదలిక వచ్చింది.    

సొంత పార్టీ ఎంపీపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

  నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షీ నటరాజన్‌కి ఫిర్యాదు చేశారు..పెండింగ్ బిల్లులను ఇప్పించి వారి నుంచి 10 శాతం కమిషన్ వసూలు చేసుకుని తన సొంత లాభానికి పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ చేయకుండా బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలంపూర్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే  విజయుడుని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.ఇలాంటి చర్యలతో పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందని.. వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం

  జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు.. మాగంటి గోపీనాథ్‌ను గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గ‌చ్చిబౌలి ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.గతంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురియ్యారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు, ప‌లువురు నాయ‌కులు ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్లారు. మరోవైపు మాగంటి  ఆరోగ్య పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులను  మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం గోపీనాథ్ వెంటీలేటర్ మీద చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్టు మాజీమంత్రి తెలిపారు

కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు వాయిదా.. కవిత ధర్నా వృధా !?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద బుధవారం (జూన్ 4) చేపట్టిన ధర్నా వృధా అయ్యింది. అత్యంత వ్యూహాత్మకంగా కవిత చేపట్టిన ఈ ధర్నాకు  ఎలాంటి మైలేజీ రాకుండా, ఆమె తండ్రి, అన్న కుట్రపన్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  కేసీఆర్ గురువారం (జూన్ 5) కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతారని కవిత అంతకు ఒక రోజు ముందే ధర్నాకు పిలుపునిచ్చారు. అందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్న తరువాత చివరి నిముషంలో కేసీఆర్ విచారణకు మరో రోజు హాజరౌతానంటూ కమిషన్ కు లేఖ రాయడం, అందుకు కమిషన్ అంగీకరించి 11వ తేదీన విచారణకు రావాల్సిందిగా చెప్పడం జరిగిపోయాయి. దీంతో కవిత ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నా ప్రాధాన్యత కోల్పోయింది. ధర్నాలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుపై  కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డం వెనుక‌.. ఆయ‌న‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌న్న ఉద్దేశం ఉంద‌ని ఆరోపించారు. కొన్ని పంచ్ డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించారు. కానీ కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కావడం వాయిదా పడటంతో కవిత ధర్నా వృధాగా మారిపోయింది. కవిత ధర్నాకు ఎటువంటి మైలేజీ, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉండొద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్ విచారణకు మరో రోజు వస్తానంటూ కాళేశ్వరం కమిషన్ కు లేఖ రాసి వాయిదా తీసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.    దీంతో కేసీఆర్ ఫొటో పెట్టుకుని కూడా బీఆర్ఎస్ ను పూర్తిగా విస్మరించి కవిత బిగ్ పొటికల్ స్టెప్ వేయడానికి నాందిగా ఇందిరా పార్క్ వద్ద చేసిన ధర్నా అనుకున్నప్రయోజనాన్ని సాధించలేకపోయారు.  ఇక కవిత ధర్నాలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. సరే జాగృతి బ్యానర్ పై ఆమె ధర్నా చేశారు కనుక బీఆర్ఎస్ జెండాలు లేవని అనుకుందాం.. కానీ ఈ ధర్నాలో ఎక్కడా మచ్చుకి కూడా బీఆర్ఎస్ నాయకులు కనిపించలేదు. కేసీఆర్ ఫొటోతో, కేసీఆర్ కు మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు లేకపోవడాన్ని బట్టి చూస్తుంటే.. కవితను బీఆర్ఎస్ పూర్తిగా బాయ్ కాట్ చేసిందని భావించక తప్పదు.  వాస్తవానికి కవిత బీఆర్ఎస్ ను ధిక్కరించినా.. ఆమె ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపడడానికి పోరాడుతున్న యోధురాలిగానే కవితను బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. ఎందుకంటే ఆమె తన ప్రసంగాలలో కాంగ్రెస్, బీజేపీలపై సమానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ తన దేవుడని చెబుతున్నారు. అటువంటప్పుడు ఇటువంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ డిస్ ఓన్ చేసుకోవడం ఎందుకన్న బాధ బీఆర్ఎస్ క్యాడర్ లో కనిపిస్తోంది.