షార్ కు బాంబు బెదరింపు కలకలం

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)బాంబు బెదరింపు  కలకలం రేపింది. ఆదివారం (జూన్ 15) రాత్రి  తమిళనాడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గుర్తుతె లియని వ్యక్తుల నుంచి  శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో  ఉగ్రవాదులు బాంబు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.  దీంతో వెంటనే షార్‌లోని భద్రతా అధికారులు, స్థానిక పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. షార్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించాయి.  షార్‌లోకి దారితీసే అన్ని మార్గాల్లోనూ, అనుమానిత ప్రదేశాల్లోనూ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.  తీరప్రాంత రక్షణ దళాలు కూడా అప్రమత్తమై సముద్ర తీరంలో గస్తీ నిర్వహించాయి. షార్‌లోని అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. షార్ లోని ప్రతి మూలా గాలించిన అనంతరం బాంబు కాల్ ఆకతాయిల పనిగా భద్రతా దళాలు నిర్ధారించారు. షార్ ప్రాంగణం మొత్తంలో పేలుడు పదార్ధాలు లేవని నిర్ధారించారు.  దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  బెదిరింపు కాల్స్ చేసిన వారిని గుర్తించే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. 

కేటీఆర్ అరెస్టు ఖాయమా?

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును అరెస్టు చేయనుందా?  సోమవారం (జూన్ 16) ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరుతూ కేటీఆర్ మీడియాతో  మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ ఫార్ములా కేసులో తనను అరెస్టు చేస్తారని మీడియాతో చెప్పడం దానినే సూచిస్తోంది. తనను అరెస్టు చేసి జైలుకు పంపిస్తారని తెలుసన్న కేటీఆర్.. జైలుకు పోవడం తనకు కొత్తేమీ కాదన్నారు.   గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తాను పలు సార్లు జైలుకు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఫార్ములా ఈ రేస్ కేసులో ఇన్ హౌస్ విచారణ కాదు.. దమ్ముంటే ప్రజల ముందు, బహిరంగంగా చర్చిద్దామని తాను సవాల్ చేశాననీ, అయితే ఆ సవాల్ ను స్వీకరించే ధైర్యం లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయారనీ కేటీఆర్ వ్యాఖ్యానించారు.  చట్టం అంటే తనకు గౌరవం ఉందనీ, రెండు సార్లు, మూడు సార్లూ కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు హాజరౌతామని అన్నారు.  తనను విచారణకు, కేసుల పేరుతో వేధించడం వారి రేవంత్ పైశాచిక ఆనందం పొందడానికేనని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్ములా ఈరేస్ కేసులో తనను అరెస్టు చేస్తారని తనకు మందే తెలుసని చెప్పిన కేటీఆర్, రేవంత్ సర్కార్ హామీల అమలు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈరేస్ కేసు అంటున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటానన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక ఎన్నికలకు వెడుతున్నారనీ, బీసీలు అన్నీ గమనిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని మరోసారి సవాల్ విసిరారు.  మీడియా సమావేశం అనంతరం ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు. 

లక్నో విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

విమానాలలో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరువక ముందే..  సాంకేతిక లోపాల కారణంగా విమానాల ఎమర్జెన్సీ ల్యాండిగ్, వెనక్కు మళ్లింపు, ల్యాండిగ్ సమయంలో రన్ వే పై నుంచి జారి పక్కకు దూసుకుపోవడం, బాంబు బెదరింపు కారణంగా విమానం నిలిపివేత వంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటం ఆందోళనకు కారణమౌతోంది. తాజాగా సోమవారం (జూన్ 16) సౌదీ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తతెల్తడంతో ఆ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానం ల్యాండింగ్ గేర్లో సాంకేతిక లోపం తలెత్తడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. విమానం చక్రం నుంచి పొగ, నిప్పురవ్వలు రావడంతో పైలట్ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 250 మంది ప్రయాణీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు హజ్ యాత్రికులేనని చెబుతున్నారు. పైలట్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

సోనియాగాంధీకి తీవ్రఅస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆదివారం (జూన్ 15 రాత్రి ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సోనియా ఆరోగ్యం ప్రస్తతుం  నిలకడగా ఉందని    ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.   సోనియా  గాంధీ చాలా కాలంగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గతంలొ కూడా పలుమార్లు ఇదే సమస్యతో  గతంలొ కూడా పలుమార్లు ఇదే సమస్యతో సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవలే ఆమె సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్  కాలేజీ ఆస్పత్రిలో సాధారణ పరీక్షలు చేయించుకున్నారు. కాగా ఇప్పుడు సోనియాగాంధీ కొన్ని రోపజుల పాటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు.  సోనియా ఆస్పత్రిలో చేరారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.  

విమాన ప్రయాణం గాలిలో దీపమేనా.. వరుస సంఘటనలతో జనం బెంబేలు

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదచ్ఛాయలు ఇంకా మరువక ముందే.. విమానాలలో వరుసగా తలెత్తుతున్న లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు విమాన ప్రయాణమంటేనే బెంబేలెత్తేలా చేస్తున్నాయి. తాజాగా చెన్నైకు బయలు దేరిర బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 787  విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో  వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి లండన్ లోని హీత్రూ మిమానాశ్రయంలో దించారు.దీంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా అహ్మదాబాద్ విమానానికి జరిగినట్లే ఈ బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం కూడా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ ఫ్లాప్ అడ్జస్ట్ మెంట్ లోపం అని పేర్కొన్నారు. విమానం 9000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఈ లోపాన్ని కనుగొన్న పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి హిత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.   అలాగే  ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్ కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ సకాలంలో ఆ లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘజియాబాద్ లోని హిండన్ విమానాశ్నయం నుంచి టేకాఫ్ చేసే సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్ వే పేనే నలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.   దీనిపై స్పందించిన ఎయిర్​ ఇండియా సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు  పేర్కొంటూ,  ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్​ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్​ ఇస్తామని ప్రకటించింది.  ఇక ఆదివారం (జూన్ 15) అమెరికాలో ని బోస్టన్ లోగాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న జెటెబ్లూ విమానం రన్ వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. పైలట్ అప్రమత్తత కారణంగా ఘోర విప్తత్తు తప్పింది.  ఇక జర్మనీ నుంచి హైదరాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా ఎల్హెచ్ 752 విమానం బయలుదేరిన కొద్ది సేపటికి యూటర్న్ తీసుకుని వెనక్కు మళ్లించి ఫ్రాక్ ఫర్డ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. హైదరాబాద్ లో ల్యాండింగ్ కు అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని లుఫ్తాన్సా సంస్థ ప్రకటించింది. అయితే.. బాంబు బెదరింపు కారణంగానే విమానాన్ని వెనక్కు మళ్లించినట్లు తెలుస్తోంది. వరుస సంఘటనలతో విమానప్రయాణమంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. 

కోరుట్లలో విషాదం కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు

  జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న జీఎస్ గార్డెన్స్ సమీపంలో వినాయక చవితికి సంబంధించి విగ్రహాల తయారీ చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తగలడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారని సమాచారం. వినాయక విగ్రహం తయారీ కార్మికులు పనులు చేస్తుండగా, ఒక్కసారిగా పక్కన ఉన్న ఎలక్ట్రిక్ తీగలు స్పర్శకు వచ్చాయి. భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

తమిళ పొత్తులకు.. పురిటి నొప్పులు!

  తమిళ నాడు, శాసన సభ ఎన్నికలకు ఇంకా సమయం వుంది. వచ్చే సంవత్సరం  (2026) ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం,ఇప్పటికే భగ్గుమంటోంది. అధికార విపక్షాలు రెండూ, గెలుపే లక్ష్యంగా, ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.ఎత్తులు, పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో గట్టిగా కాలు మోపేందుకు, శత విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం,ఏపీలో సక్సెస్ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్’ ఫార్ములాను రీప్లే’ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు, ప్రధాన ప్రతిపక్షం డిఎంకేతో సహా, అధికార అన్నా డిఎంకే  వ్యతిరేక  పార్టీలను, ఏకం చేసేందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, స్వయంగా రంగంలోకి దిగారు.  ముందుగా, రెండు నెలల క్రితమే, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య పొత్తు ముళ్ళు వేశారు. అలాగే, సినీ నటుడు విజయ్‌’ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) తోపాటుగా, పీఎంకే తదితర పార్టీలతో జట్టు కట్టేందుకు, పాత, కొత్త మిత్రులను ఎన్డీఎ కూటమిలోకి తెచ్చుకునేందుకు అమిత్ షా, ఢిల్లీ నుంచే పావులు కదుపుతున్నారు.  అయితే, ఇతర పొత్తుల విషయం ఎలా ఉన్నా, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు విషయంలోనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, అమిత్ షా పోరోహిత్యంలో ఉభయ పార్టీల నాయకులూ లాంచనంగా, తాంబూలాలు ఇచ్చి పుచ్చున్నా  పొత్తు పీటలెక్కడం అనుమానమే అంటున్నారు.  ముఖ్యంగా ముందు నుంచి,డిఎంకేతో పొత్తు వద్దని వాదిస్తున్న,రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, అన్నామలై, ఆయన్ని ఓ బూచిల చూస్తున్న డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడ పళని స్వామిల, మధ్య సంబంధాలు ఉప్పూ నిప్పుల భగ్గుమంటూనే ఉన్నాయి. తాజాగా, ఎన్నికల అనంతరం ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని, అన్నా డిఎంకే సర్కారే  కొలువు తీరుతుందని పళనిస్వామి చేసిన ప్రకటన, అందుకు బదులుగా అన్నామలై’ఇచ్చిన కౌంటర్’ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజానికి,  పళనిస్వామి, పొత్తు కుదిరిన కొద్ది రోజులకే, కూటమి గెలిచినా సంకీర్ణ కుదరదనే సంచలన ప్రకటన చేశారు. కాగా,ఇప్పడు అన్నామలై’  ‘అవునవును..సంకీర్ణ ప్రభుత్వం కాదు,వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ, ఎదురు చురక వేశారు.అంతే కాకుండా, ఆయన మరో అడుగు ముందుకేసి, ఈ సారి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు.అలాగే, రాష్ట్రంలో 2026లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పలేనని, రానున్నది బీజేపీ పాలన మాత్రమేనని చెప్పగలనని అన్నామలై పేర్కొన్నారు. అదలా ఉంటే,ఇరు పార్టీలలో పొత్తు వద్దనే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అంటున్నారు.ఈ నేపధ్యంలో, బీజేపీ, అన్నాడిఎంకే పొత్తుకు పురిటి నొప్పులు తప్పవని అంటున్నారు.

తల్లికి వందనం సక్సెస్‌తో.. జగన్‌కు కడుపుమంట పెరిగింది : లోకేశ్

  తల్లికి వందనంలో ఒకే ఆధార్‌పై వందల మంది లబ్ధిదారులంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయిందని తల్లుల కళ్లలో ఆనందం చూసి వైఎస్ జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మరోసారి మాజీ సీఎం జగన్ విష ప్రచారానికి తెరలేపారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని నారా లోకేష్ వెల్లడించారు.   గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయని ఆయన తెలిపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ అని పేర్కొన్నారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం..చెయ్యనివ్వం. జగన్  కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్దని లోకేశ్ అని లోకేష్ సెటైర్లు వేశారు  

టొబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్లు కేటాయించాండి : సీఎం చంద్రబాబు

  ఏపీ పర్యాటనలో భాగంగా అమరాతికి వచ్చిన కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వివిధ అంశాలపై వారిద్దరూ చర్చించారు.హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు  వినతి పత్రం అందించారు.  టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్స్ పై జీఎస్టీ తగ్గింపుపై  ప్రధానం చర్చించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు.

మరో ఘోర ప్రమాదం..కూలిన వంతెన ఆరుగురు మృతి.. 20 మంది గల్లంతు

  మహారాష్ట్రలోని పుణెలో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుండమల ప్రాంతంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. దీంతో ఆరుగురు పర్యాటకులు మరణించారు. మరో 25 మంది పర్యాటకులు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ వంతెన కూలిపోవడంతో టూరిస్టులు నదిలో పడి కొట్టుకుపోయారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురిని సహాయ సిబ్బంది రక్షించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వంతెన కూలడంతో ఎంత మంది కొట్టుకుపోయారన్న విషయంలో స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, 20-25 మంది వరకు గల్లంతై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సునీల్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆరుగురు మరణించారన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.  

రెండేళ్లలో రాజధాని పూర్తిచేస్తాం : మంత్రి నారాయణ

  మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన వైసీపీ అధినేత జగన్.. అధికారంలోకి రాగానే  మూడు రాజధానులు అంటూ కొత్త డ్రామాకు తెరలైపోయారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతూ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ.. దానిపై దుష్ప్రచారానికి దిగుతుందన్నారు.  అల్లిపురం డంపింగ్ యార్డ్ లో లెగిసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించిన నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందని.. 50% చెత్తను రీసైక్లింగ్ చేశామని మంత్రి వెల్లడించారు. అక్టోబర్ రెండు నాటికి ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని   వివరించారు. మహిళలంటే వైసీపీకి గౌరవం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళను వేశలంటూ కించపరిచారని  మండిపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని 50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు  

బ‌వుమా ది గ్రేట్.. పొట్టోడే కానీ గట్టోడు

  ODI వరల్డ్ కప్ - 1999 సెమిఫైనల్, ఐసీసీ నా్కౌట్ ట్రోఫీ -2000 సెమీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ - 2002 సెమీ ఫైనల్, ODI వరల్డ్ కప్ -2007 సెమీ ఫైనల్, T20 వరల్డ్ కప్ - 2009 సెమీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ - 2013 సెమీ ఫైనల్, T20 వరల్డ్ కప్ - 2014 సెమీ ఫైనల్, ODI వరల్డ్ కప్ - 2015 సెమీ ఫైనల్, ODI వరల్డ్ కప్ - 2023 సెమీ ఫైనల్, T20 వరల్డ్ కప్ - 2024  ఫైనల్, ఎన్నో ఓటములు ఎన్నో అవమానాలు... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ - 2025 ఫైనల్ విన్న‌ర్.మొత్తం గా 27 సుధీర్ఘ నిరీక్షణ తరువాత సౌతాఫ్రికా ఒక్క‌ ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది.   వ‌న్ విన్ ఎన‌ఫ్- టు క్రియేట్ బెట‌ర్ బ‌జ్ ఇన్ ఫ్యూచ‌ర్ అంటారు. ఈ ఒక్క విజ‌యం కోసం ఎన్నో ఏళ్ల నిరీక్ష‌ణ అవ‌స‌ర‌మైంది ద‌క్షిణాఫ్రికాకు. ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్షిణాఫ్రికాకు ఎంద‌రో కెప్టెన్లుగా  ప‌ని చేశారు. హేమా హేమీలు.. హాన్సీ క్రోనే, గారీ  కిరిస్ట‌న్, షాన్ పొలాక్, మార్క్ బౌచ‌ర్, గ్రీమీ స్మిత్, జాక్ క‌ల్లీస్, యాష్వెల్ ప్రిన్స్, హ‌షీం ఆమ్లా, ఏబీ డీవిలియ‌ర్స్, ఫాఫ్ డుప్లిస్, డీన్ ఎల్గ‌ర్, క్వింట‌న్ డికాక్ ఇంద‌రు సార‌ధ్యం వ‌హించినా సాధ్యం కానిది బ‌వుమా.. ఒక్క‌డు ఇన్నేసి ప‌రాజయాల ప‌రంప‌ర‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ద‌క్షిణాఫ్రికా క్రికెట్ ఒక స‌మ‌యంలో క్రికెట్ నుంచి త‌ప్పుకుంది. త‌ర్వాత 1993లో హాన్సీ క్రానే కెప్టెన్సీలో తిరిగి క్రికెట్ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టింది. ఎప్పుడైతే 1999 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైన‌ల్లో ఓడ్డం మొద‌లైందో.. ఆ ప‌రంప‌ర నిన్న మొన్న టీ ట్వంటీ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ వ‌ర‌కూ ఒక‌టే ఓట‌ములు.  అన్నీ ఉన్నాయి- అల్లుడి నోట్లో శ‌ని.. అన్న‌ట్టుగా తయారైంది ప‌రిస్థితి. ఒక ఇంగ్లండ్, మ‌రో ఆస్ట్రేలియాకు ధీటుగా స్క్వాడ్ ఉండేది. వారిలో మెరిక‌ల్లాంటి క్రికెట్ వీరులుండేవారు. కానీ ఎందుక‌నో ఎక్క‌డో దుర‌దృష్టం వెన‌క్కు లాగేసేది. ఎట్ట‌కేల‌కు బ‌వుమా సుడి బాగున్న‌ట్టుంది. అందుకే ఒక్క‌టంటే ఒక్క ఛాంపియ‌న్ షిప్ లో జ‌ట్టును ముందుండి న‌డిపించి విజ‌యం సాధించాడు.. ఇప్పుడిదిగో.. ఒక టెస్టు గ‌ద‌ను త‌న దేశానికి తీస్కెళ్తున్నాడు. మా పొలంలోనూ మొల‌క‌లొచ్చాయ్ అంటూ ఎంతో సంబ‌రంగా కాల‌రెగేస్తున్నాడు.  విజ‌యం అన్న‌ది ఒక్కోసారి వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసేలా చేస్తుంది అదంతా. ఒక్కొక్క‌రికి ఒక్కో డ్రీమ్ అలాగే మిగిలిపోతుంది. అలాగ‌ని ఇదేం అంత తేలికైన‌ది కాదు. టెస్ట్ ఛాంపియ‌న్ షిప్. క్రికెట్ పుట్టిందే టెస్టుల్లో. అది కూడా లార్డ్స్ లో. అలాంటి గ‌డ్డ మీద ఇలాంటి ఆట‌లో చాంపియ‌న్ గా అవ‌త‌రించ‌డం అంటే.. ఈ జ‌ట్టులో అంత‌టి సంప్ర‌దాయ‌పు క్రికెట్ ఆడే ఆట‌గాళ్లు అంత పుష్క‌లంగా ఉన్నార‌న్న సంకేతాల‌ను ఇస్తుంది.  ఇక్క‌డ గొప్ప విష‌యం ఏంటంటే ఆస్ట్రేలియా కెప్టెన్ క‌మిన్స్ మామూలు ల‌క్కీఫెలో కాడు. ఈ మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ అవ‌లీల‌గా ఎగ‌రేసుకుపోయినంత ల‌క్కీ. అలాంటి ల‌క్కీ టీమ్ క‌మ్ కెప్టెన్ ముందు ద‌క్షిణాఫ్రికా ఆట‌లు సాగుతాయా? అన్న‌ది అంద‌రికీ అనుమాన‌మే. కానీ ఏ అదృష్ట దేవ‌త వీరిపై చ‌ల్ల‌ని చూపు చూసిందో తెలీదు కానీ ఏకంగా 27 ఏళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఇదిగో తొలి ఐసీసీ విజ‌యాన్ని వారి ఖాతాలో వేసింది. ఎనీ హౌ కంగ్రాట్స్ ద‌క్షిణాఫ్రికా. వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ.. అన్న‌ది స‌గ‌టు క్రికెట్ ల‌వ‌ర్ కామెంట్ గా తెలుస్తోంది.  

మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్‌బాడీ గుర్తింపు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తించినట్లు  ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఆయన డీఎన్‌ఏతో మృతదేహం డీఎన్ఏ సరిపోలిందని తెలిపారు. రూపానీ స్వస్థలం రాజ్‌కోటలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ఒక్కో డీఎన్‌ఎ పరీక్షకు 26 నుంచి 40 గంటల సమయం పడుతుందని డాక్టార్లు తెలిపారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 31 మందిని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్టు సివిల్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.  వీరిలో 12 మంది మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరి అయ్యాయి. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్‌యూ) కు చెందిన ఫోరెన్సిక్ బృందాలు ఈ బృహత్తర గుర్తింపు ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు త్వరితగతిన ఊరట కలిగించేందుకు ఈ బృందాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయి.  

పెద్దారెడ్డికి తాడిపత్రిలో నో ఎంట్రీ బోర్డు.. జేసీ మార్క్ పాలిటిక్స్

  సొంత ఇంట్లో అడుగుపెట్టలేని విధంగా తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు. హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చినా పోలీసుల నిస్సహాయత వ్యక్తం చేస్తుండటంతో ఇక పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడం ఇప్పట్లో అసాధ్యమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి వేసిన వీరంగంతో వైసీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలవడం లేదంట. తాజాగా పెద్దారెడ్డి వస్తున్నారన్న ప్రచారంతో టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. తాడిపత్రి నియోజకవర్గం అక్కడ రాజకీయ ఉద్రిక్తతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.   అక్కడ రాజకీయాలు ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. 2024 ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణలే అందుకు ఉదాహరణ. ఆ ఘర్షణలలో  ఎస్పీ, డివైఎస్పీలతో పాటు పోలీసు శాఖలో పలువురు అధికారులు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఘర్షణల్లో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి కండీషనల్‌ బెయిల్ ఇచ్చిన కోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. చాలా కాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తూ ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోయారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు ఏదో రకంగా పోరాటం చేస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రం కనీసం వెళ్లేందుకు కూడా అనుమతి తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇటీవల  పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులు పట్టుకొని పెద్దారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను కలసి తాడిపత్రికి మీరు చెప్పినప్పుడు వెళ్తానని అనుమతి కోరారు. కానీ  పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఊరుకునేది లేదని,  అడుగుపెట్టనివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని  వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. అక్కడి వాతావరణం చూసిన పోలీసులు  పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే 2024 ఎన్నికల పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆయన పర్యటనకు బ్రేకులు వేశారు. హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న తరువాత మొదటిసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా వరుసగా ఎంపీపీ ఎన్నికలు, రాప్తాడులో జంట హత్యలు కారణంగా చూపిస్తూ బందోబస్తు కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు.  ఇక మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు జిల్లా పోలీసు అధికారులు అనుమతి కోరగా ఆ సమయంలో మహానాడు జరుగుతుందని అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ పర్యటన అంటూ మరోసారి అనుమతించలేదు. ఆ క్రమంలో తాజాగా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మందికి  పైగా  జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు.  ఈ పరిస్థితిపై పెద్దారెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జేసీ ప్రభాకరరెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హైకోర్టు  అనుమతిచ్చినా తనను సొంత సెగ్మెంట్లో అడుగుపెట్టనీయక పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తాడిపత్రికి వెళ్లడం అసాధ్యమేనని  నిర్వేదంగా మాట్లాడుతున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అధికారం అండతో ఓవర్ చేస్తున్నారంటూ జేసీ వయస్సు గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్స సమయంలో పెద్దారెడ్డి స్థానికంగా జేసీ ప్యామిలీపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. జేసీ ప్రభాకరరెడ్డి ఆందోళనలకు సిద్దమైతే పోలీసులతో అడ్డుకున్నారు.  జేసీ ఇంట్లోకి  వెళ్లి సోఫాలో కూర్చుని సినీ స్టైల్లో ప్రగల్భాలు పలికారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించారు. అసలే జేసీ ప్రభాకరరెడ్డి ఎంత ఫైర్ బ్రాండో వేరేగా చెప్పనవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారు. ఆయన కొడుకు  అస్మిత్ రెడ్డి తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో ఇప్పుడాయన పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారంట. ఇలాంటి సిట్యుయేషన్‌లో పెద్దారెడ్డికి బాసటగా స్థానిక వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు  రావడం  లేదంట. తాడిపత్రి పట్టణానికి వెళ్లడానికి న్యాయస్థానం నుండి అనుమతులు వచ్చి సుమారు మూడు నెలలు  కావొస్తున్నా పెద్దారెడ్డి అక్కడ అడుగు పెట్టలేకపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ఫ్యాక్షన్ మొదలు పెడతానని జేసీ వర్గీయులకు పదేపదే వార్నింగులు ఇచ్చారు. ఇప్పుడు బేల చూపులు చూస్తూ నిర్వేదంతో మాట్లాడాల్సి వస్తోంది. ఇదంతా చూస్తూ ఖచ్చితంగా ఇది స్వయం కృతాపరాధమే అంటున్నారు.  చూడాలి మరి  పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారో? ఆయన ఎప్పుడు సొంత ఇంటికి వెళ్తారో?  

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

  తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి  అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు  నటులు సుమన్, రాజేంద్రప్రసాద్‌లు వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నాని అచ్చెన్నాయుడు తెలిపారు  

స్థానిక సంస్థ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

  ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తామని వివరించారు.క్యాబినెట్ సమావేశం ముగిశాక ఎన్నికల తేదీలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తిస్థాయిలో సిద్ధం ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. మరోవైపు.. ప్రభుత్వం గ్రామాల్లో, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటరు జాబితాను ఇప్పటికే తయారు చేసింది. ఎంపీటీసీల విభజన, ఓటరు జాబితాను సిద్ధం చేసి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. రిజర్వేషన్లు సైతం ఖరారు చేసినట్లు సమాచారం. పంచాయతీ, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ షురూ..।

  ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా నియమితులైన సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన వాల్తేర్ డివిజనల్ మేనేజర్ తో పాటు రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసే అంశాలను చర్చించారు. మరోవైపు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించారు.  అయితే కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్లో పూర్తిగా ఒడిస్సా ప్రాంతం కలుపుతూ డివిజన్ పరిధిలో నిర్ణయించారు. కానీ వాల్తేర్ డివిజన్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాలు మాత్రం ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వెళ్లాయి. ఆరోగ్యంగా పలాస ఇచ్చాపురం... ఇటు కొత్తవలస నుంచి అరకు ప్రాంతం ఇతర డివిజనల్ లో ఉన్నాయి ఈ దశలో అరకు తో పాటు ఇచ్చాపురం వరకు ఉన్న రైల్వే ప్రాంతాన్ని విశాఖపట్టణం డివిజన్లో ఉంచుతూ సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు.  ఈ ప్రాంతానికి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అరకు ఎంపీ డాక్టర్ తనుజా రాణి ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు రైల్వే అధికారులకు కూడా లేఖలు రాయడం జరిగింది. ఈ దశలో కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన జనరల్ మేనేజర్ త్వరలోనే రైల్వే బోర్డు అధికారుల నిర్ణయం మేరకు పరిధులు మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు డి పి ఆర్ ను సవరించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇలా ఉండగా ఏపీ విభజన సమయంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయి ప్రక్రియ మాత్రం ఇప్పుడే మొదలైంది. ఈ దశలో ఆంధ్ర ప్రాంతంతో కూడిన రైల్వే స్టేషన్లు విశాఖ డివిజన్లో ఉండే రీతిన పరిధులు మార్చాలని అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది.