పక్షులు ఢీ కొనడం వల్లే విమానం కుప్పకూలిందా?

అహ్మ‌దాబాద్  విమాన ప్రమాదంలో 8200 గంటల విమాన ప్రయాణం అనుభవం ఉన్న పైలట్ సుమిత్ సభర్వాల్, అలాగే  కోపైలట్  కో పైలట్ క్లైవ్  కుంద‌ర్  మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదంలో 298 మంది చనిపోయారు. మరణించిన వారిలో 241 మంది విమాన ప్రయాణీకులు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన మిగిలిన వారంతా బీజే మెడికల్ కాలేజీ విద్యార్థలు. విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ ను ఢీ కొనడంతో వారు మరణించారు. లంచ్ టైమ్ లో ఈ దారుణం సంభవించింది. భోజనాలు చేస్తున్న విద్యార్థులు అలాగే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా కూడా వైద్య విద్యార్థులే. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.   విమాన ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. ప్రాధ‌మికంగా అయితే ప‌క్షులు ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.  

జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

  జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్ ఇన్‌చార్జిగా సీతక్క, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జిగా తుమ్మల నాగేశ్వర రావు, మహబూబ్ నగర్ ఇన్‌చార్జిగా దామోదర్ రాజనర్సింహా, రంగారెడ్డి ఇన్‌చార్జిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్‌చార్జిగా పొన్నం ప్రభాకర్‌, వరంగల్ జిల్లా ఇన్‌చార్జిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.  సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సీపీఆర్‌ఓ గా గుర్రం మల్సూర్‌ను ప్రభుత్వం  నియమించింది. 

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు

  తెలంగాణలో భారీగా  ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు  ఉత్తర్వులు జారీ చేశారు.మొత్తం 33 మంది ఐఏఎస్ అధికారులను, ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్‌గా దాసరి హరిచందన, . పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించింది.  గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది.  సిద్దిపేట కలెక్టర్‌గా కే హైమావతి, సింగరేణి డైరెక్టర్‌గా పీ గౌతమ్‌ను నియమించింది. 

ఒక విమాన ప్రమాదం...ఎన్నో ముఖ్యాంశాలు

  పాపం ఆ మెడికోలు.. వారి హాస్టల్ పక్కనే.. అహ్మదాబాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటే అదో ల్యాడ్ మార్క్ అనుకున్నారు. మా హాస్టల్ ఎయిర్ పోర్టు పక్కనే ఉందని చెప్పుకుంటే అదో గర్వకారణంగా భావించారు. కానీ, జూన్ 12న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో.. బోయింగ్ 787 విమానం.. గాల్లోకి ఎగిరిన 30 సెకన్లకే.. తాము భోంచేస్తున్న సమయంలో వచ్చి మీద పడి.. తమ వారి ప్రాణాలను పట్టుకుపోతుందని వారు అస్సలు ఊహించలేదు. వచ్చే రోజుల్లో ఇదే హాస్టల్లో కూర్చుని ఈ మెడికోలు భోం చేస్తుంటే.. ఏదైనా ఫ్లైట్ ఎగురుతున్న శబ్ధం రాగానే వారి గుండె గతుక్కుమనడం ఖాయం. అయినా ఇది ఎంత అన్యాయమైన అనుభవం? ఇక ఇదే ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్. ఇదే ఫ్లైట్ లో తాను సీపీ- 11 ఏ సీటు రిజర్వ్ చేసుకుంటున్నపుడు బహుశా అనుకుని ఉండడేమో. తానీ సీటు ద్వారా బతికి బట్టకట్టబోతున్నానని. వచ్చే రోజుల్లో ఈ సీటు నెంబర్ కి డిమాండ్ ఏర్పడినా ఏర్పడుతుంది కాబోలని అంటారు కొందరు. ఇంతటి విషాదంలోనూ కాస్తంత ఊరటనిచ్చే అంశం ఇదే. అన్నింటికన్నా అత్యంత విచారకరం.. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దుర్మరణం. ఇది గుజరాత్ ప్రజలను చాలా చాలా దారుణంగా బాధిస్తోంది. లండన్ లో ఉన్న తన భార్యను చూడ్డానికి వెళ్తున్న ఆయన ఈ విధంగా విమాన ప్రమాదంలో పడి కాలి బూడిదవుతారని మాత్రం ఎవరు ఊహించగలరు? ఇక ఈ ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులుండగా, బ్రిటీషర్లు- 53, పోర్చుగీసు- ఏడుగురు ఒక కెనడియన్ ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, పది మంది ఫ్లైట్ క్రూ  సైతం ఉండటం.. ఈ ప్రమాద తీవ్రత ఎలాంటిదో చెప్పే గణాంకం. ఒక్కొక్కరికీ కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూపు. అయితే ఈ ప్రమాదానికి కారణం పక్షులు వచ్చి గుద్దుకోవడంగా భావిస్తున్నారు. ప్రమాద స్థలిలో చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, వాటిపై పక్షులు వాలే అవకాశాలెక్కువ కావడం వల్ల.. ఇదే జరిగి ఉంటుందని ఇప్పటికైతే ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇదే ప్రమాదం ద్వారా కొందరికి తెలియని విషయం ఏంటంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో మేడే కాల్ అంటూ ఒకటి చేస్తారని.  ఈ కాల్ వచ్చిందంటే ఆ ఫ్లైట్ డెత్- డేంజర్లో పడి ఉంటుందని ఏటీసీ భావించాల్సి ఉంటుంది. అంతే కాదు బోయింగ్ 787 - 8 మోడల్లోని ఈ డ్రీమ్ లైనర్ 2011 లో ప్రపంచ విమానరంగానికి పరిచయం కాగా.. ఇప్పటి వరకూ 100 కోట్లకు పైగా ప్రయాణీకులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చిందట. సరిగ్గా అదే సమయంలో ప్రమాదం జరిగిన ఈ ఏ1 171 అనే ఈ డ్రీమ్ లైనర్ బోయింగ్ 787-8 విమానం ఆరు నెలల క్రితం అంటే, గత డిసెంబర్లో ఒకసారి సాంకేతిక సమస్యతో ఇలాగే ఆగిపోయిందట. అప్పట్లో ఇదే విమానంలో 300 మంది ఉండగా.. వారందరి లండన్ ప్రయాణం నిలిచిపోయిందట.   ఇక ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన ప్రమాదం ఎప్పుడని చూస్తే 2020 సంవత్సరం- కేరళలో. అప్పట్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ద్వారా ఇద్దరు సిబ్బందితో పాటు 21 మంది మరణించారు.అయితే డ్రీమ్ లైనర్ సీరీస్ అయిన ఈ భారీ విమానాన్ని బోయింగ్ తెచ్చిన ఉద్దేశమేంటంటే.. లైట్ వెయిట్ తో తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణ సదుపాయం కల్పించాలని. ఒక్క ఎయిర్ ఇండియా మాత్రమే కాక.. అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, జపాన్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్‌లు సైతం ఈ మోడల్ విమానాలను కలిగి ఉన్నాయి.  ఎందుకంటే ఇది ఏక్ దమ్ 13 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. దీంతో దూరభారాలకు సంబంధించి దీన్నే ఎక్కువగా కొనుగోలు చేస్తాయి విమానయాన సంస్థలు.అయితే ఇప్పటి వరకూ ఈ డ్రీమ్ లైనర్ ని వాడిన పైలెట్లు ఇంజిన్ మీద, బ్యాటరీ మీద, ఇతరత్రా సాంకేతిక సమస్యలపై ఎన్నో సార్లు కంప్లయింట్ చేశారు. 2013లో రెండు వేర్వేరు ఘటనల ద్వారా.. జపాన్ విమాన యాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని ద్వారా ప్రయాణాలను నిలిపివేశారు. డ్రీమ్ లైనర్ సీరీస్ పై 2024లో యూఎస్ సెనెట్ కి కూడా కంప్లయింట్లు వెళ్లాయి.  దీంతో FAA దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ఇలా కొనసాగుతుండగానే ఈ భారీ ప్రమాదం జరగటం.. ఇటు టాటా వారి ఎయిర్ ఇండియాకి మాత్రమే కాదు బోయింగ్ డ్రీమ్ లైనర్ సీరీస్ మనుగడకే ప్రమాదం వచ్చిపడేలా తెలుస్తోంది.

మృతులకు రూ.కోటి పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్

  అహ్మదాబాద్‌ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం ఘటనపై టాటా గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం టాటా గ్రూప్ ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను తామే భరిస్తామని పేర్కొన్నాది. అలాగే, ఈ విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బిజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి సహకారం అందిస్తామని ప్రకటించింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా మృతిచెందారు.  ఈ ఘటన మొత్తం దేశాన్ని కలిచివేసింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల క్షేమ సమాచారం కోసం బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విమాన ప్ర‌మాదంలో మాజీ సీఎం రూపానీ మృతి..నిర్దారించిన అధికారులు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు  ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171, అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో రూపానీ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటు 2డిలో కూర్చున్నట్లు తెలుస్తోంది. రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారు. తన ప్రశాంత స్వభావం, దృఢమైన పరిపాలనా శైలితో పేరుపొందిన ఆయన, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి, కోవిడ్ అనంతర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న కీలక సమయంలో గుజరాత్‌ను సమర్థవంతంగా నడిపించారు.  ఆయన పాలనలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విజయ్ రూపానీ సతీమణి అంజలి రూపానీ సామాజిక కార్యకర్త. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. మృదుస్వభావిగా, క్రమశిక్షణ కలిగిన జీవనశైలితో, బలమైన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా రూపానీకి పేరుంది. ఆయన తరచూ గుజరాత్‌లోని వివిధ దేవాలయాలను సందర్శిస్తూ, మత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన ఆకస్మిక మరణం గుజరాత్ రాజకీయాల్లో, బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.  

విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది..ఎవరినీ వదలం : రామ్మోహన్ నాయుడు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం సంఘటనా స్థలాన్ని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానం కూప్పకూలిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు  ప్రమాద ఘటన వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. ప్రమాదం విషయం తెలియగానే విజయవాడ నుంచి బయలుదేరానన్నారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ప్రయాణికుల్లో చిన్నారులు కూడా ఉన్నారని.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని.. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని.. విమాన ప్రమాద బాధ్యులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికుల్లో విజయ్‌ రూపానీ ఉన్నారన్నారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో  డైరెక్టర్ జనరల్ దర్యాప్తు కోసం బృందంతో అహ్మదాబాద్‌కు చేరుకుంది. ప్రమాదానికి సంబంధించి అన్ని కారణాలపై ఆరా తీస్తున్నది. దర్యాప్తు తర్వాత ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశాలున్నాయి  

మృత్యుంజయుడు.. ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు

  ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ సీపీ మాలిక్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే  సీటు ఏ11 ప్రయాణికుడు నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రయాణికుడు 38ఏళ్ల రమేష్‌ పటేల్‌ అని తెలుస్తోంది. విమానం కూలిన తర్వాత ఎమర్జెన్సీ గేటు నుంచి భయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే,మృతుల సంఖ్య గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ నివాస ప్రాంతంలో విమానం  కూలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’అని కమిషనర్ అన్నారు. కాగా అతనికి ఛాతీ, కన్ను, కాలికి గాయాలయ్యాయి. మృత్యుంజయుడగా ప్రమాదం నుంచి  ప్రాణాలతో బయటపడ్డాడు.  

పది ప్రమాదాలు.. వందల ప్రాణాలు !

  విమానం ఎక్కాలంటేనే కాదు, దిగాలన్నా అదృష్టం ఉండాలి... ఇది ఏదో సినిమాలో డైలాగు. ఈ రోజు అది నిజమని మరో మారు రుజువైంది. అహ్మదాబాద్‌ విమానశ్రయం నుంచి ఇంగ్లాండ్ వెళ్లేందుకు బయలుదీరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం నిముషాల వ్యవధిలో ఒక్క సారిగా కూలిపోయింది. సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం పై కూలి పోయింది. కూలిన విమానంలో, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్  రూపాలీ సహా 242 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.అందులో ఎందరు ఉన్నారో .. అసలు ఎవరైనా ఉన్నారో లేరో కూడా తెలియదు.ఇది, మన దేశం దేశంలో జరిగిన అత్యంత దయనీయ విమాన ప్రమాదంగా పేర్కొంటున్నారు.అయితే, ఇదే మొదటి విమాన ప్రమాదం కాదు, ఇంతకు ముందు కూడా అనేక విమాన  ప్రమాదాలు జరిగాయి.. వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. అలాంటి పది ప్రమాదాల వివరాలు..ఇలా ఉన్నాయి.     1.    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 7 ఆగస్టు, 2020: కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేను దాటి వెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 172 మంది సజీవంగా బయటపడ్డారు.ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. ఇది ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ముఖ్యమైన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. 2.    దుబాయ్-మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 22 మే, 2010: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వేను దాటి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 158 మంది మరణించారు. కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 3.    అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 17 జూలై, 2000: పాట్నాలోని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 అనుకోకుండా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 55 మందితో పాటు భూమిపై ఉన్న ఐదుగురు మరణించారు. ఈ ఘటన బీహార్‌లో జరిగిన తీవ్రమైన విమాన ప్రమాదాలలో ఒకటి. 4.    చర్ఖీ దాద్రీ మిడ్-ఎయిర్ ఘర్షణ 12 నవంబర్, 1996: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు చర్ఖీ దాద్రీ వద్ద గాలిలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలలోని 349 మంది ప్రయాణికులు మరణించారు. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా గుర్తించబడింది.   5.    ఔరంగాబాద్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ 26 ఏప్రిల్, 1993: ఔరంగాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించగా, 66 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ప్రభావం చూపింది. 6.    ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఇంఫాల్ 16 ఆగస్టు, 1991: ఇంఫాల్‌కు దిగుతున్న సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 69 మంది మరణించారు. మణిపూర్‌లో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలోని విమాన భద్రతపై చర్చలను రేకెత్తించింది.   7.    ఇండియన్ ఎయిర్‌లైన్స్ బెంగళూరు 14 ఫిబ్రవరి, 1990: బెంగళూరు విమానాశ్రయంలో కూడా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇది వరకు కుప్పకూలింది. ఈ ఘటనలో 92 మంది మరణించారు. కర్ణాటకలో జరిగిన ఈ ప్రమాదం ఆ రోజుల్లో విమాన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలను లేవనెత్తింది. 8.    ఇండియన్ ఎయిర్‌లైన్స్ అహ్మదాబాద్ 19 అక్టోబర్, 1988: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 133 మంది మరణించారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. 9.    ఎయిర్ ఇండియా బొంబాయి 21 జూన్, 1982: వాతావరణంలో మార్పు కారణంగా బొంబాయిలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా, 94 మంది సజీవంగా బయటపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాదం వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే విమాన భద్రతా వ్యవస్థలపై దృష్టిని సారించింది. 10.    ఎయిర్ ఇండియా బాంద్రా 1 జనవరి, 1978: బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 213 మంది మరణించారు. ఈ ప్రమాదం భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదాలు భారత విమాన రంగంలో భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపై దృష్టి సారించాయని చెప్పవచ్చు.

విమాన ప్రమాదంలో ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు : సీపీ జ్ఞానేందర్

  గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి అవకాశం లేదని ఆయన అసోసియేట్ ప్రెస్‌తో అన్నారు. ఆ విమానంలో మొత్తం 242 మంది ఉండగా.. వారంతా దాదాపు చనిపోయి ఉంటారని పరోక్షంగా వెల్లడించారు. మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ ఏఐ 171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరింది. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోనట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.భారతీయుల తర్వాత అత్యధికంగా 52 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. అహ్మదాబాద్‌లో జరిగినది ఒక విషాదకరమైన ప్రమాదం. మేం చాలా మందిని కోల్పోయాం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని అన్నారు. బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నారని తెలిపారు. సంబంధిత విభాగాలు తాజా సమాచారాన్ని అందిస్తాయని చెప్పారు. ‘సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం మనం వేచి ఉండాలి’ అని అన్నారు.

కూటమి సర్కార్ విజయోత్సవ సభ రేపటికి వాయిదా

  కూటమి సర్కార్ ఏడాది పాలన సభ కార్యక్రమం వాయిదా పడింది.  ఏడాది పాలన పూర్తి సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అతిరథ మహారధులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కూటమి నేతలు సైతం పాల్గొననున్నారు. అకస్మాత్తుగా అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందజేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

విమాన ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

  అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో తన అకౌంట్ డీపీ & కవర్ పీక్‌ను నలుపు రంగులోకి  మార్చింది. కాగా ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై నెట్టింట విమర్శస్తున్నాయి. లండన్ వెళ్లే  విమాన పరిస్థితిని చెక్ చేయకుండా టేకాఫ్ చేస్తారా అంటు నెటిజన్లు మండిపడుతున్నారు. విమాన ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై  ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నడిపినట్లు DGCA వెల్లడించింది. ఆయనకు 8200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. అలాగే కోపైలట్‌గా 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ATC ప్రకారం మ.1.39 గం.కు విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ATCకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేతలు  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణీకులు మరియు సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి తమ వంతు కృషి చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ విమాన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడాలని ఆయన కోరారు. సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు సంఘీభావంగా ఈరోజు తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.  

మెడికల్ కాలేజీపై కూలిన విమానం..20 మంది మెడికోలు మృతి

  అహ్మదాబాద్- లండన్ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలింది. దీంతో  20 మందికి పైగా మెడికోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన 5 నిమిషాలకే విమానం కూలింది. దీంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం  భోజన సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు చెబుతున్నారు. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది.  18005691444 నెంబర్ను క్షతగాత్రుల కుటుంబాల కోసం ఏర్పాటు చేసింది. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు సహా మొత్తం 242 మంది ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానం నుండి 'మేడే కాల్' జారీ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే 'మేడే కాల్' అంటారు. అయితే, ఈ 'మేడే కాల్'కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుండి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ పేర్కొనడం గమనార్హం.  

విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

  అహ్మదాబాద్‌‌ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను వెంటనే రంగంలోకి దింపినట్లు ట్వీట్ చేశారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రులను ప్రధాని ఆదేశించారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.  ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ బయల్థేరారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేపట్టనున్నారు.  ఘ‌ట‌న‌పై ఎయిర్ ఇండియా స్పందించింది. త‌న ఎక్స్ అకౌంట్‌లో ప్ర‌మాదం గురించి పోస్టు చేసింది. ఫ్ల‌యిట్ AI171 కూలిన‌ట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్న‌ట్లు త‌న ట్వీట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ వెల్ల‌డించింది.  విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల్లోనే పైల‌ట్‌లు ఇద్ద‌రు ఏటీసీకి ఎమ‌ర్జెన్సీ కాల్ చేశారు. ఆ త‌ర్వాత ఎలాంటి మాట‌లు వినిపించ‌లేద‌ని, నిశ్శ‌బ్ద వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన‌ట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ దేశస్థులు, 1 కెనడియన్ మరియు 7 మంది పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది. 

జగన్ లాగే కేటీఆర్ అహంకారపూరిత డైలాగులు

 కేసీఆర్.. వెంట్రుక కూడా పీక‌లేరు గ‌తంలో జ‌గ‌న్ కూడా సేమ్ డైలాగ్ త‌ర్వాత ఏమైందీ??? వెంట్రుక ఈ డైలాగ్ లీడ‌ర్ జనానికి  ఎందుకంత‌గా క‌ల‌సి రాదు!? మొక్కే క‌దాని పీకేస్తే పీక కోస్తా ఇది ఇంద్రాలో చిరంజీవి డైలాగ్.. స‌రిగ్గా అలాగే వెంట్రుకే క‌దా పీక‌లేర‌న్న డైలాగ్ కొడితే.. ఏకంగా మిమ్మ‌ల్నే అధికారంలోంచి పీకేస్తా.. ఇది ప్రెజంట్ పొలిటిక‌ల్ సిట్యువేష‌న్. మాములుగా పాములు ప‌గ‌బ‌డ‌తాయ‌ని అంటారు. స‌రిగ్గా అలాగే వెంట్రుక‌లు కూడా ఈ లీడ‌ర్ జ‌నాల మీద ప‌గ‌బ‌ట్టాయా? అంటే నిజమేమో అనుకోవలసి వస్తోంది.  మొన్న‌టి ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ పాపుల‌ర్ డైలాగ్స్ ఏవ‌ని చూస్తే వైనాట్ వ‌న్ సెవెంటీ ఫైవ్, నా వెంట్రుక కూడా పీక‌లేరు.. ఇవ‌న్నీ అప్ప‌ట్లో బాగా వైర‌ల్.  తీరా ఎన్నిక‌ల‌య్యాక జ‌రిగిందేంట‌య్యా అంటే జ‌నం ఆయ‌న్ను వై నాట్ 11 అంటూ తీసి అవ‌త‌ల ప‌డేశారు. న‌న్నెవ‌రూ ఏమీ పీకలేరు, పీక‌లేరు అని ప‌దే ప‌దే అన్న పాపానికి.. ఏకంగా అధికారంలోంచి పీకేయడ‌మే కాకుండా.. ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈ రోజున ఆయన ఎక్క‌డికైనా వ‌స్తుంటే జ‌నం చెప్పులు కూడా వేస్తున్నారు. తాజాగా పొదిలి పొగాకు రైతుల‌కు వెన్నుద‌న్నుగా వ‌చ్చినట్టు చెప్పిన జ‌గ‌న్ ర్యాలీలో ఈ ఘ‌ట‌న న‌మోదైంది. పొదిలి ప్రాంత పొగాకు రైతు మీద మాత్ర‌మే వ‌ల్ల‌మాలిన అభిమానం కుమ్మురించ‌డానికి వ‌చ్చిన జ‌గ‌న్ ఇలా అభాసు పాల‌య్యారు... అది వేరే విష‌యం. ఇక్క‌డ చెప్పొచ్చే నీతి ఏమిటంటే.. ఓవ‌ర్ యాక్ష‌న్ తో కూడిన డైలాగులు , అతిశ‌యంతో కూడిన సంభాష‌ణా చాతుర్యాలు జ‌నం పెద్ద‌గా న‌చ్చ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ఓటు వేసే స‌మ‌యంలో ఓట‌రు జ‌నానికి ఇవ‌న్నీ వారి వారి ఆలోచ‌న‌ల్లో చ‌క్క‌ర్లు కొడుతూ.. ఆ పార్టీకి కాకుండా ప్ర‌త్య‌ర్ధి పార్టీకి ఓటు వేసేలా చేస్తున్నాయ్. ఈ విష‌యం జ‌గ‌న్ విష‌యంలో ఒక సారి ప్రూవ్ అయినా స‌రే కేటీఆర్ ఇదేమీ గుర్తించ‌కుండా త‌న తండ్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీక‌లేర‌ని అన‌డం... జ‌నం క‌ళ్లారా కంటున్నా చెవులారా వింటున్నారు.. ఇది వ‌చ్చే రోజుల్లో మ‌రింత స‌మ‌స్య‌ల‌కు దారి తెచ్చేలా క‌నిపిస్తోంది.  రీసెంట్ గా వైనాట్ వన్ సెవెంటీఫైవ్ అనే ఈ స్లోగ‌న్ రాసిచ్చినోడ్ని త‌న్నాలంటూ ఒక వైసీపీ నేత అన‌డం తెలిసిందే. జ‌గ‌న్ కి స్క్రిప్ట్ ఎవ‌రు రాస్తున్నారో ఏమో తెలీదు గానీ ఈ దిక్కుమాలిన ఓవ‌రాక్ష‌నే బెడిసికొట్టిందంటారు.  ఇప్పుడీ వింత వితండ వాదాన్ని కేటీఆర్ అందిపుచ్చుకోడాన్ని గులాబీశ్రేణులు క‌మాన్ గుస గుస అంటున్నాయ్. ఈయ‌న‌కేమైనా పిచ్చిలేచిందా? ఇలాంటి డైలాగులు ఎందుకు కొడుతున్నారు. గ‌తంలో జ‌గ‌న్ కి జ‌రిగిన శాస్తి క‌నీసం గుర్తు కూడా లేదా అని మాట్లాడుకుంటున్నార‌ట‌. ఈ ట్విట్ట‌ర్ రాజాకి ట్వీట్ కి ఏది బాగుంటే అది పెట్ట‌డం.. నోటికి ఏది బాగుంటే అది మాట్లాడ్డం అల‌వాటైపోయింది. ఈ రోగానికి మందేద‌ని అర్ధంగాక‌ సొంత పార్టీ వారే బుర్ర గోక్కుంటున్నార‌ట‌.

అహ్మదాబాద్‌ కూలిన విమానంలో మాజీ సీఎం

  అహ్మదాబాద్‌‌లో కూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రూపానీకి తీవ్ర గాయపడినట్లు తెలుస్తోంది. మేఘానిలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్సులలో హుటాహుటినా ఆసుపత్రికి తరలిస్తున్నారు. కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్ గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నట్టు సమాచారం. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు.  

అహ్మదాబాద్ లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమానం

అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. ఈ విమానం జనావాసాలపై కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. విమానంలో ప్రయాణీకుల పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. అయితే కొందరికి ఆస్పత్రికి తరలిం చినట్లు చెబుతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కొద్ది సేపటికే కూలిపోయిందని చెబుతున్నారు. విమానం కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇలా ఉండగా విమానంలో గుజరాత్  మాజీ సీఎం  విజయ్ రూపాణి ఈ విమానంలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.  ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.  

ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు

  ఈ నెల 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్‌తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత సౌకర్యం అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో సూపర్-6 పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామని సీఎం తెలిపారు. తల్లికి వందనం పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నాం. దీనికోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది. గతంలో ‘అమ్మఒడి’కి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం  ఎన్డీయే కూటమికి రెండు కళ్లు అని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే మేం 67 లక్షల మందికి అందిస్తున్నామని ఆయన తెలిపారు.