కడపలో టీడీపీ జెండా ఎగరేద్దాం : శ్రీనివాసులురెడ్డి

  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కడప నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి మునిసిపల్ కార్పొరేషన్ లో  జెండా ఎగురవేసేందుకు  తెలుగుదేశంపార్టీ శ్రేణులన్ని కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి పిలుపు నిచ్చారు.   బుధవారం ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ కడప నగర సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికి 8 నెలలు కష్టపడి బలంగా, కసిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఆర్ మాధవిరెడ్డిని గెలిపించుకున్నామన్నారు.  అదే స్పూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పనిచేసి కడప నగర కార్పొరేషన్ లో తెలుగుదేశం జెండా ఎగరేయాలని పిలుపు నిచ్చారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు  విడతల వారీగా పదవులు ఇస్తామన్నారు.   వచ్చే నెలలో నగరంలోని 50 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను అనధికారికంగా ఖరారు చేస్తామన్నారు. ఇప్పటి నుంచే అన్ని డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మెన్ కేశవరెడ్డి పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, పార్టీ నాయకులు బి హరిప్రసాద్, ఎస్ గోవర్థన్ రెడ్డి, జిలాని బాష తదితరులు పాల్గొన్నారు.  

బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకోవడమే తమ లక్ష్యం : సీఎం రేవంత్‌

  బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్ర ప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారని తెలిపారు. ఆ సమావేశంలో హరీష్ రావుగా కూడా పాల్గొన్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.  రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ లో ఎవరేం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలోనే ఉందన్నారు. ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టవద్దని తీర్మానం చేద్దామని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై టెక్నికల్, లీగల్, పొలిటికల్ గా అడ్డుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి మా వాదన వివరిస్తామన్నారు. పొలిటికల్ గా మా ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ మాట్లాడారని వివరణ ఇచ్చారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు.  అయితే ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవి చంద్ర వాకౌట్ చేశారు. సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.

వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది : నారా లోకేశ్

  మాజీ సీఎం జగన్ పల్నాడు రెంటపాళ్ల గ్రామ పర్యటన సందర్బంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీ పద్ధతి మారలేదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం అని ఎక్స్‌లో లోకేశ్ స్పష్టం చేశారు.  కాగా జగన్ పర్యటనలో కొందరు వివాదాస్పద ఫ్లకార్డులను ప్రదర్శించారు. పుష్ప సినిమా డైలాగులను ఫ్లకార్డులపై ప్రదర్శించారు. జగన్ వస్తాడు..అంతుచూస్తాడు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా గంగ‌మ్మ‌త‌ల్లి జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు న‌రుకుతం ఒక్కొక్కడిని అంటూ జ‌గ‌న్ ఫోటోల‌తో ఉన్న ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం : మంత్రి ఉత్తమ్

  ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించ తలపెట్టిన పోలవరం-బసకచర్ల ప్రాజెక్టును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును తిరస్కరించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు. బసకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని ఈ ప్రాజెక్టు విషయంలో విభజన చట్టాన్ని కూడా ఏపీ ఉల్లంఘిస్తోందని తెలిపారు. నేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రాన్నికి సమర్పిస్తాం అని పేర్కొన్నారు.  బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గోదావరి-బనకచర్ల  లింక్ ప్రాజెక్టు పై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా బీఆర్ఎస్ నుంచి ఎంపీ రవిచంద్ర, బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీలు సురేష్ షట్కర్, రఘరాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, చాలమ కిరణ్ కుమార్ రెడ్డి, బలరామ్ నాయక్, మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

పంద్రాగస్టు నుంచి జాతీయ రహదారుల్లో యాన్యువల్ ఫాస్టాగ్ పాస్

    జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో ఫాస్టాగ్ యాన్యూవల్ పాస్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ యాన్యువల్ పాస్ రూ. 3 వేలు ఉంటుందని  గడ్కరీ పేర్కొన్నారు. ఏడాది పాటు 200 ట్రిప్పులు పరిమితి ఉంటుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, నాన్ కమర్షియల్ వెహికల్స్ కు ఇది వర్తిస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల్లో ఈ యాన్యువల్ పాస్ పనిచేస్తుందని తెలిపారు. ఈ యాన్యువల్ పాస్ యాక్టివేషన్ కోసం రాజ్ మార్గ్ యాప్ తో పాటు NHAI, MoRTH వెబ్‌సైట్లలో త్వరలోనే ఓ లింక్ ను అందుబాటులోకి తేనున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.  200 టోల్స్‌కు కేవలం రూ.15 ఖర్చవుతుందని తెలిపారు. నూతన విధానంలో వాహనదారులకు రూ. 700 వరకు ఆదా అవుతుంది. ఇది కేవలం జాతీయ రహదారులపై మాత్రమే అని రాష్ట్ర రహదారులపై ఉండే టోల్స్‌కి వర్తించదని స్పష్టం చేశారు.

ఇరాన్ నుంచి విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి

ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతున్నది. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన వందలాది మంది భారత విద్యార్ధులను మన విదేశాంగ శాఖ  ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది. ఇప్పడుమళ్ళీ మరో మారు  అలంటి పరిస్థితే ఎదురైంది.ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఇరు దేశాల్లో చిక్కుకుపోయిన  భారతీయులు, ముఖ్యంగా ఇరాన్ లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు  విదేశాంగ శాఖ  నడుం బిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న  విదేశాంగ మంత్రి  ఎస్. జయశంకర్  భారతీయ విద్యార్ధులు సురక్షితంగా  సరిహద్దులు దాటేలా అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని   ఇరాన్   ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అయితే.. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని ఇప్పటికే మూసేసిన నేపథ్యంలో, భూసరిహద్దుల్ని తెరిచి భారతీయ విద్యార్ధులను, సరిహద్దులు దాటించేందుకు ఇరాన్ అంగీకరించింది.  ఇరాన్లో  భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు.  వారిని తరలించడానికి సహకరించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా వారు సురక్షితంగా సరిహద్దులు దాటి వెళ్లడానికి అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. దీంతో ఇరాన్ లో చిక్కుకుపోయిన భారత  విద్యార్ధులు  సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారనీ, ఆందోళన చెంద వలసిన అవసరం లేదని  విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల

  ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ రిలీజ్ చేసింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు, శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం పోటీపడతాయి. గ‌తేడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విష‌యం తెలిసిందే.  నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్‌లు ఇంగ్లండ్, వేల్స్‌లోని ఏడు వేర్వేరు వేదికలపై జరగనున్నాయి. టిమీండియా క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2024 అక్టోబర్ 6న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి దాయాదుల పోరు కోసం భారత క్రికెట్ ఫ్యాన్స్  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  

జగన్ పర్యటనలో మరో అపశృతి…తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి

  వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద ర్యాలీలో  తొక్కిసలాట జరిగింది. దీంతో జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయిడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో  కార్యకర్త మృతి చెందారు. ఉదయం జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు మరణించాడు. దీంతో వారు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించారు. అయితే కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నాయకులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ అధినేత వ్యవహార శైలిపై టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. అన్నను టార్గెట్ చేసిన షర్మిల

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. మళ్లీ, మళ్లీ విచారణకు పిలుస్తున్నారు. గంటలకొద్దీ ఎంక్వైరీ చేస్తూ.. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావుని కూడా సిట్ విచారిస్తోంది. ఆధారాల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కోసం ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు సహా వందలాది మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15న ఒక్కరోజే 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ట్యాపింగ్‌కు ప్రభాకర్ రావు ఆదేశాలిచ్చారని.. ఆయన డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని.. ఇప్పటికే అరెస్ట్ అయిన మిగతా నిందితులు తెలిపారు. మావోయిస్టు సానుభూతిపరుల పేర్ల మీద ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి కూడా మావోయిస్టుల పేర్లతోనే నెంబర్లు సమర్పించినట్లు తేలింది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి.. పోలీసులతో దాడులు చేయించినట్లు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఆరోపించడం.. రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. ఎస్ఐబీ ఆఫీసు నుంచి కీలకమైన హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు.. ప్రణీత్ రావు వాటిని ధ్వంసం చేసి.. మూసీ నదిలో పారేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. సిట్ అధికారులు కొంత డేటాని సంపాదించారు.  దాంతో.. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన వారితో పాటు సాక్ష్యులను, బాధితులను పిలిచి.. వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.  ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది.. ముమ్మాటికి నిజమన్నారు. ఇది.. తెలంగాణ, ఏపీ సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు. కేసీఆర్, జగన్.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవారని.. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని షర్మిల విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందని.. వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని, తన ఫోన్ ట్యాప్ చేసిన ఆడియోని తనకు వినిపించారన్నారు. ఈ కేసులో.. ఎలాంటి విచారణకైనా వస్తానన్నారు వైఎస్ షర్మిల. మరోవైపు.. సిట్ అధికారులు ప్రభాకర్ రావును వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా.. 300 అజ్ఞాత ప్రొఫైల్స్, ఇతర కీలక వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్‌పైనే ప్రశ్నిస్తున్నారు. కేసుని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు.. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును.. సిట్ పదే పదే ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

పాక్ తో కాల్పుల విరమణలో మీ పాత్ర నిల్.. ట్రంప్ కు స్పష్టం చేసిన ప్రధాని మోడీ

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్ర కానీ, ఆ దేశ అధ్యక్షుడి పాత్ర కానీ ఇసుమంతైనా లేదని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే చెప్పారు. ఎలాంటి శషబిషలూ లేకుండా ట్రంప్ కు భారత్ పాకిస్థాన్ ల మధ్య ఏ విషయమైనా ద్వైపాక్షికంగానే తేల్చుకుంటామని ఇందులో మూడో దేశం ప్రమేయానికి తావేలేదని తెగేసి చెప్పేశారు.  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పోన్ లో సంభాషించిన ప్రధాని భారత్, పాక్ మధ్య   జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర నిల్ అని స్పష్టం చేశారు. ట్రంప్ మోడీ ల మధ్య దాదాపు అరగంటకు పైగా సాగిన ఫోన్ సంభాషణలో మోడీ ఈ మేరకు ట్రంప్ కు స్పష్టత ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్  ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కావడానికి ముందు  జరిగిన ఈ ఫోన్ సంభాషణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్ధావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడటం, అందుకు ప్రతిగా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం తెలిసిందే. ఆ దశలో హఠాత్తుగా ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం, అందుకు తానే కారణమంటూ ట్రంప్ చెప్పుకోవడం విదితమే. అయితే అప్పట్లోనే ట్రంప్ వ్యాఖ్యలను మోడీ నిర్ద్వంద్వంగా ఖండించారు. పాక్ బతిమలాడుకోవడం వల్లే కేవలం మానవతా దృక్పథంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మోడీ అప్పుడే చెప్పారు. అయినా ట్రంప్ పదే పదే తన మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాక్ లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఏమీ లేదని మోడీ ఆయనే స్పష్టంగా చెప్పారు.   ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం ఉందంటూ వస్తున్న విమర్శలకు తెరపడినట్టయింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భేటీ  అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఉదయం ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్ ఖడ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ దాదాపు పాతిక నిముషాలు సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలను లోకేష్ ఆయనకు వివరించారు. అలాగే కేంద్రం సహాయసహకారాలతో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించి చెప్పారు. ఇక ఈ నెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్న సందర్భంగా చేసిన ఏర్పాట్లను వివరించారు. అలాగే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారాన్ని కోరారు.  ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర కు సంబంధించి రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను లోకేష్ అమిత్ షాకు అందజేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘఠ పాదయాత్రతో ప్రజలలో చైతన్యాన్ని నింపారంటూ అమిత్ షా లోకేష్ ను అభినందించారు. అలాగే చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందనీ, ఎపిసర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా పేర్కొన్నారు.

పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం

  వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ సీఎం జగన్, సత్తెనపల్లి  పర్యటన సందర్బంగా నేపథ్యంలో ముందుగా జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు బారికేట్లు పెట్టారు. వైసీపీ వాహనాలను, కార్యకర్తలను అడ్డుకుంటున్నరు. దీంతో అంబటి రాంబాబు బారికేడ్లను తొలిగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలతో కలిసి బారికేడ్లను పక్కకు నెట్టేశారు. వాహనాలతో ర్యాలీగా వెళ్లి తీరుతామని అంబటి హడావుడి చేయడంతో ఆయనకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి చొచ్చుకెళ్లేందుకు అంబటి రాంబాబు యత్నించారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆర్థికసాయం

    కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ ఆపదవేళ వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ రౌడీ మూకల దాడిలో దారుణహత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటాననే హామీని లోకేష్ నిలబెట్టుకున్నారు. దివంగత వెన్నా బాలకోటిరెడ్డి ఇంటిపై తీసుకున్న రుణాన్ని మంత్రి  తీర్చారు. ఆయన సతీమణి వెన్నా నాగేంద్రమ్మకు నెలనెలా ఆర్థికసాయం అందజేస్తూ ఇంటికి పెద్దకొడుకులా అండగా నిలిచారు.  పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనిని ఓర్చుకోలేని వైసీపీ గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న బలాకోటిరెడ్డిని తుపాకీతో కాల్చిచంపారు. హత్యకు ఆరు నెలల ముందు కూడా కత్తులతో దాడికి తెగబడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల 21వ తేదీన బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలుపించుకున్న మంత్రి లోకేష్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఆర్థికంగా చాలా నష్టపోయామని, తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఉండవల్లి నివాసంలోనూ కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారు.  

జగన్ కాన్వాయ్ వాహనం ఢీ కొని వృద్ధుడు మృతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో  ఆయన కాన్వాయ్ లోని వాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మరణించాడు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు జగన్ బుధవారం (జూన్ 18)  భారీ కాన్వాయ్ తో తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఆయన కాన్వాయ్  ఏటుకూరు బైపాస్ వద్దకు చేరిన సమయంలో ఆ బైపాస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది.  దీంతో ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వృద్ధుడిని స్థానికుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో  గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించారు.  వృద్ధుడిని ఢీ కొట్టినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో  స్థానికులు జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    జగన్ స్వార్థ రాజకీయానికి ఓ నిండు ప్రాణం బలైందంటూ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్ కాన్వాయ్ లోని వాహనం వృద్ధుడిని ఢీ కొట్టిందనీ, అయినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. కాన్వాయ్ ని ఆపి గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే ఆయన బతికి ఉండేవాడనీ గొట్టిపాటి అన్నారు. జగన్ వన్నీ మోసపూరిత వాగ్దానాలు, మాటలూ అని గొట్టిపాటి విమర్శించారు.  

ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం : షర్మిల

  బీఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.  గత తెలంగాణ సీఎం, అప్పటి ఏపీ సీఎం కలిసి చేసిన జాయింట్ ఆపరేషనో కాదో తెలియదు. కానీ నా ఫోన్, నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని స్పష్టంగా అర్ధమైందని షర్మిల తెలిపారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి చెప్పారని ఆమె తెలిపారు. ఓ ఫోన్ కాల్ సంభాషణను కూడా వినిపించారు. ఫోన్ల ట్యాపింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరగాలి అని షర్మిల డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని ఆమె తెలిపారు.  ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ అని పేర్కొన్నారు.అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చాల చిన్న విషయం అన్నారు. నేను జగన్‌కు రక్తం పంచుకోని పుట్టిన చెల్లెల్ని. ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారని ఏపీ పీసీసీ ఆవేదన వ్యక్తం చేశారు . నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారుని ఆమె అన్నారు.  

గుంతకల్లుని వారసులకి రాసిచ్చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం  వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఆశించిన సీటు  దక్కలేదని పార్టీతో పాటు జిల్లా కూడా మార్చిన ఈ మాజీ మంత్రి గత ఎన్నికల్లో చివరి నిముషంలో టీడీపీ టికెట్ దక్కించుకుని గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలానికి ఆయన చుట్టుపు చూపుగా కూడా గుంతకల్లు వైపు చూడటం లేదంట. నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ తన వందిమాగధులకు అప్పజెప్పి వెళ్లిపోయారంట.  జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలోని వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే అక్కడ రాజకీయం ఎప్పుడూ సైలెంట్‌గా నడిచిపోతుంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం రెండు మున్సిపాలిటీలు, ఒక్క మండలం  మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ హడావుడి కనిపించదు. ముందు నుంచి అక్కడ ఎమ్మెల్యేలు వివాదాలకు దూరమే.  2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడ్డ గుంతకల్లు రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, వైసీపీ నుంచి వెంకట్రామిరెడ్డి గెలిచారు. ఇద్దరూ కూడా ఎప్పుడూ పొలిటికల్‌గా పెద్దగా ఫోకస్ అవ్వలేదు. ఎవరిపైనా రాజకీయ  ఆరోపణలు లేవు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న  వెంకట్రామిరెడ్డి పోటీలో నిలవగా టీడీపీ నుంచి అనేక తర్జనభర్జనల తర్వాత కర్నూలు జిల్లా వైసీపీ నుంచి దిగుమతి నేతను తెచ్చుకున్నారు.  వైసీపీ ప్రభుత్వంలో కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను గుంతకల్లు నుంచి పోటీలోకి దింపింది టీడీపీ. అప్పట్లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గుమ్మనూరుకు బెంజి కారు మంత్రి అన్న ట్యాగ్‌లైన్ కూడా ఉండేది. జిల్లా మారి వచ్చినా కూటమి హావా, అలాగే బీసీ కావడంతో గుమ్మానూరు జయరాం గుంతకల్లులో గెలవగలిగారు.  గుంతకల్లు నియోజకవర్గం, గుమ్మనూరు జయరాం అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నారు.  జయరాం ఎమ్మెల్యే అయిన మొదట్లో అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తూ.. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా నియోజకవర్గాన్ని పూర్తిగా పదిలేసి అక్కడ పెత్తనంం అంతా తన కొడుకు, తమ్ముళ్లకు రాసిచ్చేశారంట. అది టీడీపీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లడంతో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆరా తీసే పనిలో పడిందంట. జిల్లా పార్టీ పరిశీలకులుగా ఉన్న కోవెలముడి రవీంద్ర  దృష్టికి కూడా ఈ విషయాన్ని గుంతకల్లు టీడీపీ సీనియర్ నేతలు తీసుకెళ్లారంట.  పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమాలు అయినా కేవలం ఎమ్మెల్యే కుమారుడు గాని లేదా తమ్ముడు కానీ మాత్రమే హాజరవుతూ షాడో ఎమ్మెల్యేల్లా వ్యవహరిస్తున్నారంట. గుంతకల్లు మున్సిపాల్టీని తన తమ్ముడు నారాయణస్వామికి , గుత్తి మున్సిపాల్టీ, పామిడి మండలాలను తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్‌కు అప్పజెప్పిన గుమ్మనూరు జయరాం తన వ్యాపారాలు చూసుకుంటున్నారంట. ఆ క్రమంలో గుత్తితో పాటు పామిడి మండలంలో గుమ్మనూరు ఈశ్వర్ ఎలా చెబితే అలా నడుస్తోందంట. ఒక సందర్భంలో అతను  పామిడి ఎంపీడీవో ఆఫీస్‌లోకి వెళ్లి ఎంపీడీఓ చైర్‌లో కూర్చోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. అంతే కాదు పామిడి మండలంలో ప్రవహించే పెన్నా నదిలో బహిరంగంగా పట్టపగలే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయి. అందులో మేజర్ షేర్ ఎమ్మెల్యే కుమారుడిదే అన్న ప్రచారం ఉంది. పెన్నా నదిలో  ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి  స్వయంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణాపై కేసు కూడా నమోదైంది. అదేకాక భూకబ్జాలు, పేకాట, మట్కా మాఫియాను ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానిపై మీడియా ఫోకస్ చేస్తే సదరు జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతారని ఎమ్మెల్యే వర్గీయులు  బహిరంగంగా హెచ్చరించడం సంచలనం రేపింది.  ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎమ్మెల్యే మాత్రం గుంతకల్లులో కాలు పెట్టకుండా తన పని తాను చూసుకుంటున్నారంట. గెలిపించిన కార్యకర్తలకు  మొహం చూపియకుండా ఉండటంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సాంబశివుడు యాదవ్ లాంటి పార్టీ సీనియర్ నేతలే  పార్టీ కార్యక్రమలు నిర్వహించాల్సి వస్తోంది. ఏదైనా సమస్య చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పార్టీకి అతిపెద్ద మైనస్‌గా మారుతోందంటున్నారు. లోకల్‌గా ఉన్న నాయకుల్ని కాదని ఎక్కడ నుంచో దిగుమతి చేసుకుంటే  పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానిక టీడీపీ సీనియర్లు వాపోతున్నారు.

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్

  అవాంతరాలు లేని హైవే ప్రయాణం అందించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకువస్తున్నది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోనికి రానున్న ఈ సాస్ జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉ:టుంది.     ఈ కొత్త  ఫాస్టాగ్   పాస్ ను 3వేల రూపాయలు చెల్లించి తీసుకుంటే.. దానిని ఉపయోగించి  ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది.  ఈ పాస్టాగ్ పాస్ ను  కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.   ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చునని తెలిపారు. 

ఇరాన్- ఇజ్రాయేల్ వార్ లో అమెరికా ఎంట్రీ ఎందుకంటే?

అమెరికా అధ్య‌క్షుడు జీ7 నుంచి హ‌డావిడిగా అమెరికా బ‌య‌లు దేరారు. ఇంత‌లో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మెక్రాన్ ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కోస‌మేమో  ఈ తొంద‌ర అని అన్నారు. లేదు లేదు అంత‌క‌న్నా మించి అన్నది ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య.  ఇక్క‌డ యూఎస్ కి చేరుకోగానే సిట్యువేష‌న‌ల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ట్రంప్. ఇప్ప‌టికే  ఇజ్రాయెల్ టెహ్రాన్ గ‌గ‌న త‌లాన్ని త‌న  కంట్రోల్లోకి తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ట్రంప్ కూడా ట్రెహ్రాన్ లో నివ‌సించేవారంతా ఆ ప్రాంతం వ‌ద‌లి  వెళ్లాల్సిందిగా హెచ్చ‌రించారు. కార‌ణం.. ఇక్క‌డికి 225 కి. మీ ద‌గ్గ‌ర్లో ఇరాన్ కి చెందిన‌ న‌టాంజ్ అణు కేంద్రం ఉంటుంది. ఇక వంద కి. మీ. దూరంలో ఉండేది  ఫార్దో. ఇదీ ఒక‌ అణు కేంద్రమే. ఇక్క‌డ యురేనియం శుద్ధి సుమారు 83 శాతం చేసింది ఇరాన్. యురేనియం 90 శాతం శుద్ది అయితే చాలు ఒక అణుబాంబు త‌యారు చేయ‌డానికి. అంటే దాదాపు ద‌గ్గ‌ర‌కొచ్చేసింద‌న్న‌మాట‌.  ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పే మాట ఏంటంటే  అణ్వాయుధం ఇరాన్ కి ఎట్టి  ప‌రిస్థితుల్లోనూ  ద‌క్క కూడ‌ద‌ని. ఎందుక‌లా? కార‌ణాలు ఏమై ఉంటాయి? అంటే.. మొద‌ట కొన్నాళ్ల  నుంచి ఇరాన్- యూఎస్ మ‌ధ్య అణు ఒప్పందం పెండింగ్ లో ఉంది. ఇందుకు ఇరాన్ ఎట్టి  ప‌రిస్తితుల్లోనూ ఒప్పుకోవ‌డం లేదు. పాయింట్ నెంబ‌ర్ టూ  పాకిస్థాన్ లా మ‌రో ఇస్లామిక్ కంట్రీ  ద‌గ్గ‌ర అణ్వాయుధం ఉంటే  ప‌రిస్థితి  మ‌రోలా మారిపోతుంది. 1960ల నాటి ఆయుధ శ్రేణి ఫైట‌ర్ జెట్లు ఉండ‌గానే ఇరాన్ ఇటు పాల‌స్తీనా హ‌మాస్ కి, అటు లెబ‌నాన్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాల‌ు అందజేయడంతో పాటు  శిక్ష‌ణ  కూడా ఇస్తోంది. ఇది అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ కి ఎంత మాత్రం క్షేమ‌క‌రం కాదు. దీంతో ఇస్లామిక్ విప్ల‌వం మ‌రింత ముదిరే అవ‌కాశ‌ముంది. బేసిగ్గా ఇరాన్, ఇజ్రాయెల్ 1979 వ‌ర‌కూ మిత్ర‌దేశాలే. ఎప్పుడైతే 1980ల్లో ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ వ‌చ్చిందో  అప్ప‌టి నుంచీ ఇజ్రాయెల్ తో వ‌ర్గ  శ‌తృత్వం ఏర్ప‌రుచుకుంది ఇరాన్. దీంతో అమెరికా  ఇరాన్ అంటేనే భ‌య‌ప‌డుతోంది. ఆ దేశానికి అణ్వాయుధం అంటేనే హ‌డ‌లిపోతోంది. ఇది మ‌రింత ఇస్లామిక‌ర‌ణ‌కు ఆస్కారం ఏర్ప‌రుస్తుంద‌న్న ఆందోళ‌న  చెందుతోంది యూఎస్.  దీంతో ఆగ‌మేఘాల మీద ఈ  యుద్ధంలోకి త‌న వంతుగా ఏర్పాట్లు చేస్తున్నారు ట్రంప్. అయితే ఇరానీ అణు నిల్వ‌లున్న న‌టాంజ్, ఫోర్దోగానీ భూమిలోలోతుల్లో భ‌ద్ర ప‌ర‌చ‌బ‌డ్డాయి. వీటిని బ‌ద్ధ‌లు కొట్టాలంటే అమెరికా ద‌గ్గ‌రున్న బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్ర‌మే సాధ్యం. ఇవి ఇర‌వై అడుగుల పొడ‌వుండే జీబీయూ 57 అనే భారీ బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్రమేపేల్చాల్సి ఉంటుంది.  ఈ బంక‌ర్ బ్లాస్ట‌ర్లు ఒక్కొక్క‌టీ 13 వేల 600 కిలోల బ‌రువుంటాయి. వీటిని అమెరిక‌న్ బీ2 స్పిరిట్ బాంబ‌ర్ల ద్వారా మాత్ర‌మే ప్ర‌యోగించ‌గ‌లం. వీటిని కొన్ని నెల‌ల క్రిత‌మే ప‌శ్చిమాసియాకు చేర్చింది యూఎస్. విమాన వాహ‌క నౌక యూఎస్ఎస్ నిమిట్స్ ని ఈ స‌రికే  ప‌శ్చిమాసియా తీరానికి  త‌ర‌లించింది  అమెరికా. ఇత‌ర స‌హాయ‌క నౌక‌లు సైతం ఈ దిశగా క‌దిలాయి. అంతే  కాదు బ్రిట‌న్ జెట్ ఫైట‌ర్లు కూడా  మొహ‌రిస్తున్నారు. ఇలా అన్నిర‌కాలుగా  ఇరాన్   అణ్వాయుధ త‌యారీ చేయ‌కుండా క‌ట్ట‌డి చేస్తోంది యూఎస్. అందులో భాగంగా మొద‌ట త‌మ మిత్ర దేశం ఇజ్రాయెల్ ని రంగంలోకి దింపింది. ఇదొక ఎమోష‌న‌ల్ డ్రామా. ఇక్క‌డ గానీ చిక్కితే.. మొద‌ట అణు ఒప్పందం గురించి అడ‌గొచ్చు. లేదంటే త‌ను కూడా ఇదే యుద్ధంలోకి దిగి ఇరాన్ ప‌ని  ప‌ట్టొచ్చ‌ని భావిస్తోంది యూఎస్.. అందుకే ఈ  ఉరుకులు ప‌రుగుల నిర్ణయాలుగా అంచ‌నా వేస్తున్నారు.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల  నిపుణులు.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్!

చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్ అయ్యింది. ఆలూ లేదు చూలూ లేదు.. అన్న సామెత చందంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మద్యం కుంభకోణంలో తనను ఇరికించాలన్న కుట్ర జరుగుతోందంటూ నానా యాగీ చేశారు. చెవిరెడ్డి  ఈ యాగీ చేసే సమయానికి అసలు చెవిరెడ్డి పేరు మద్యం కుంభకోణం నిందితులలో లేనే లేదు. ఈ కేసులో అరెస్టైన నిందితులు విచారణలో తన పేరు వెల్లడించి ఉంటారన్న అనుమానంతో చెవిరెడ్డి హడావుడి చేశారు. తన వద్ద పని చేసిన వారినీ, తన స్నేహితులనూ బెదరించి, వేధించి తనకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారంటూ సిట్ పై ఆరోపణలు గుప్పించారు.  తనను అరెస్టు చేయడమే సిట్ లక్ష్యమైతే.. తానే స్వయంగా సిట్ కార్యాలయానికి వచ్చి స్వచ్ణందంగా అరెస్టౌతాను అంటూ గంభీరమైన ప్రకటనలు చేశారు. మీడియా ముందు సవాళ్లు చేశారు. దాదాపు తొడకొట్టి మీసం మెలేసినంత పని చేశారు. ఇంతా చేసి.. చల్లగా దేశం దాటేయడానికి ప్రయత్నించారు. అయితే బెంగళూరు విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయారు. లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయనను బెంగళఊరు విమానాశ్రంయలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సిట్ కు సమాచారం ఇచ్చారు. సిట్ హుటాహుటిన బెంగళురుకు బయలుదేరి వెళ్లింది. ఈ రోజు ఆయనను విజయవాడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక చెవిరెడ్డి కోసం ఆయన వద్ద పదేళ్ల పాటు గన్ మెన్ గా పని చేసిన మదన్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ కోర్టుకెక్కారు. సిట్ తనను చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధించిందనీ, మ్యాన్ హ్యాండిల్ చేసిందనీ పిటిషన్ దాఖలు చేశారు.  సరే సిట్ మదన్ రెడ్డి ఆరోపణలు నిర్ద్వంద్వంగా ఖండించింది. ఆ ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు మదన్ రెడ్డి తమ విచారణకు సహకరించలేదని పేర్కొంది. అది పక్కన పెడితే.. చెవిరెడ్డి విషయంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సహా ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసింది.   దీంతో మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఓవరేక్షన్  చేసి తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా ముందుగానే అరెస్టు సవాళ్లు విసిరి సిట్ అదుపులోకి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.