జైలు నుంచి కొమ్మినేని విడుదల

  అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన ఆయనకు వైసీపీ నేత అంబటి రాంబాబు స్వాగతం పలికారు. కాగా శుక్రవారమే సుప్రీం కోర్టు కొమ్మినేనికు బెయిల్ మంజూరైనా న్యాయస్ధానానికి వరస సెలవులు కారణంగా సంబంధిత ఉత్తర్వులను లాయర్లు పొందలేకపోయారు. ఇవాళ ఉత్తర్వులు అందడంతో ఆయన జైలుకు నుంచి విడుదలయ్యారు. కాగా బెయిల్ మంజూరు సమయంలో కొమ్మినేనికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. మహిళలను కించపర్చేలా మరోసారి చేయొద్దని తెలిపింది. అలాగే ఆయనపై పోలీసులు పెట్టిన పలు సెక్షన్లపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ఆ సెక్షన్లు తొలగించాలని, ఇక బెయిల్ కు సంబంధించి అన్ని విషయాలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది.  

జైల్లో పెడితే హాయిగా రెస్ట్‌ తీసుకుంటా : కేటీఆర్

  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం నేరుగా తెలంగాణ భవనం చేరుకోని మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఒక లొట్టపీసు కేసు అని, ముఖ్యమంత్రి ఓ లొట్టపీసు అని తీవ్ర స్ధాయిలో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఒకటే షోకు. నేను నెల రోజులు జైలులో ఉన్న .. వీళ్లను కూడా కొన్నిరోజులు జైలుపెట్టాలి అన్నదే ఆయనకున్న షోకు, పైశాచిక ఆనందం ఒక్కటే అని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఇవాళ అధికారులకు నేను చెప్పిన.. మీకు పై నుంచి ఆదేశాలు రావొచ్చు ఇప్పటికే.. వస్తే పెడితే జైలులో పెట్టుకొమ్మని చెప్పాను. పదిహేను రోజులు విశ్రాంతి తీసుకొని వస్తానని చెప్పాను.  ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. తప్పు చేయలేదు.. తలదించుకునే పని ఎంతమాత్రం చేయలేదని ఆయన తెలిపారు. ఈ ఫార్ములా కార్‌ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే రేవంత్‌రెడ్డి పారిపోయిండని ఆయన అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్‌ పరీక్ష చేయించుకుంటా.. నువ్వు రా రేవంత్‌కు సవాల్ విసిరారు. నాపై ఇప్పటి వరకు 14 కేసులు పెట్టారు. ఇంకో 1400 కేసులు పెట్టుకో.. అవసరమైతే జైలులో పెట్టుకో. ఏమన్న చేసుకో. భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినం. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తే భయపడేటోడు ఎవడూ లేడు. నీ ఉడుత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడమని కేటీఆర్ మండిపడ్డారు.

ఇరాన్‌లో నుంచి విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి

  ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్న, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విధ్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతుంది. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో, ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన వందలాది మంది మన విధ్యార్ధులను మన విదేశాంగ శాఖ ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి, మన విధ్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది. ఇప్పడుమళ్ళీ మరో మారు, అలంటి పరిస్థితే ఎదురైంది. ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం వేడెక్కుతున్న నేపధ్యంలో ఇరు దేశాల్లో చిక్కుకుపోయిన, భారతీయులు, ముఖ్యంగా ఇరాన్’లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు,మన విదేశాంగ శాఖ, నడుం బిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాటు మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న, విదేశాంగ మంత్రి, ఎస్. జయశంకర్’  భారతీయ విద్యార్ధులు సురక్షితంగా భూసరిహద్దులు దాటేలా అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని   ఇరాన్’  ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అయితే, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని ఇప్పటికే మూసేసిన నేపధ్యంలో, భూసరిహద్దుల్ని తెరిచి భారతీయ విద్యార్ధులను, సరిహద్దులు దాటించేందుకు,ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ కు భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు.  ప్రస్తుత పరిస్థితి, దేశంలోని విమానాశ్రయాల మూసివేత, అలాగే అనేక రాజకీయ మిషన్లు తమ దౌత్యవేత్తలను, జాతీయులను విదేశాలకు బదిలీ చేయమని భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా, అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు.దీంతో ఇరాన్’లో చిక్కుకుపోయిన మన విద్యార్ధులు, సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారని, ఆందోళన చెంద వలసిన అవసరం లేదని, విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ

  వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి పేర్నినానికి బిగ్ షాక్ తగిలింది. నూజీవీడు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్ష లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు. వరుసగా వాయిదాలకు కోర్టుకు పేర్ని నాని హాజరుకాలేదు. కోర్టుకు రాకపోవటంతో తదుపరి విచారణకు  నానిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులని మచిలీపట్నం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో తమ ఎదుట హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పేర్నినాని కోర్టుకు హాజరుకాలేదు. మూడు సార్లు వాయిదా వేసినా కానీ హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి వారెంట్ జారీ చేసింది.   

ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ..సెల్‌ఫోన్‌ సీజ్‌కు అధికారుల యత్నం

  ఫార్ములా-ఈ కార్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. 60 ప్రశ్నలను ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని కేటీఆర్‌ను కోరినట్లు  తెలుస్తోంది. కేటీఆర్‌ సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇవాళ విచారణకు సెల్‌ఫోన్‌ తీసుకురాలేదని మాజీ మంత్రి తెలిపారు. ఈ-రేసు సమయంలో వాడిన సెల్‌ఫోన్లను అప్పగించాలని కేటీఆర్‌ను అధికారులు ఆదేశించారు.  ఈ నెల 18లోపు సెల్‌ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ అనంతరం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌ను వెళ్లారు.పార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించడం ఇది రెండో సారి. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, మంత్రి వర్గ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారన్న అంశాలపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏసీబీ ప్రశ్నలకు బదులిస్తూ హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవోకు పంపామని ఇందులో తాను ఎక్కడా లబ్ది పొందలేదని కేటీఆర్ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.   

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

  అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షాకాల పంటలకు పెట్టుబడి కోసం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ డబ్బులు వేయనున్నాట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏటా రెండు సార్లు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది  

సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక లోపం

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కోసం ఉపయోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదే హెలికాప్టర్ ను రాష్ట్రపర్యటనలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్  కోసం కేటాయించారు. ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు సోమవారం (జూన్ 16) హెలికాప్టర్ వినియోగించాల్సి ఉంది. అయితే తీరా ఆయన హెలికాప్టర్ ఎక్కిన తరువాత సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ తిరిగి వెళ్లిపోయారు. అదలా ఉంటే  సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు  వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.  అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ హెలికాప్టర్ వినియోగంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఆదేశించారు.  

బండి సంజయ్ పై కేసు కొట్టివేత

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు సోమవారం  (జూన్ 16) కొట్టివేసింది.  2021 నవంబర్ 15న ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా భారీ కాన్వాయ్ తో ర్యాలీ నిర్వహించారని అప్పట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు   పెన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచీ ఈ కేసు 2021 నవంబర్ 15వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో భారీ వాహనాలతో, ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్‌తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్‌పహాడ్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.ఈ కేసు హైదరాబాద్ లోని ప్రజాప్రతినిథుల కోర్టులో పెండింగ్ లో ఉంది.  ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ బండి సంజయ్  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ కేసు కొట్టేయాల్సిందిగా ఆదేశిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.

20న తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టుల పిలుపు

ఆపరేషన్ కగార్ కు నిరసనగా ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం  అటవీ ప్రాంతాలలో మిలటరీ ఆపరేషన్ ద్వారా హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టింది. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిథి జగన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు చలం, అడేల్ లను ప్రభుత్వం హతమార్చిందని పేర్కొన్నారు.  ఆపరేషన్ కగార్‌లో తమ నాయకుల మరణం ద్వారా తీవ్ర నష్టం జరిగిందని, దీనికి నిరసనగా జూన్ 20న బంద్‌ను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి ప్రజలు, సంస్థలు సహకరించాలని కోరారు.

కేటీఆర్‌కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉంది : మంత్రి సీతక్క

  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌‌కు జైలు వెళ్లాలని  కుతూహలంగా ఉన్నట్లు ఉందని సీతక్క తెలిపారు. అందుకే వీలైనంత త్వరంగా జైలుకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెచ్చగొడుతున్నారని ఆయన తెలిపారు. కేటీఆర్‌, కవిత మధ్య పోటీ నెలకొంది. కవిత జైలుకు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకుంది. ఇప్పుడు నేను వెనుకబడ్డా అనుకుంటున్న కేటీఆర్‌.. జైలుకు పోయి పథకం రచించాలనుకుంటున్నారు.  ఏదో ఆశించి కేటీఆర్‌ జైలుకు పోవాలనుకుంటున్నాడు’ అని మంత్రి సీతక్క విమర్శించారు. కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీతక్క మాట్లాడుతూ.. నేటి సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే తాను అన్నానని, నోటిఫికేషన్ గురించి ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదని మీడియాలో ప్రచారం జరిగిందని, అది అవాస్తవమని సీతక్క క్లారిటీ ఇచ్చారు.  

ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

  భారత ప్రధాని మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3'ను ప్రధాని మోదీ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును మోదీకి అందజేశారు. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు, సోదరభావానికి, వసుధైక కుటుంబం అనే భావనకు నిదర్శనమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధాని  మాట్లాడుతూ, సైప్రస్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును భారత్-సైప్రస్ దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ గుర్తింపు ఇరు దేశాల శాంతి, భద్రతలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సు వంటి అంశాలపై పరస్పర నిబద్ధతను మరింతగా పటిష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా జూన్ 16న  సైప్రస్ చేరుకున్న ప్రధానికి నికోస్ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. సైప్రస్ పర్యటన అనంతరం కెనడాకు మోదీ పయనమవుతారు. అక్కడ జరుగనున్న జీ-7 సదస్సులో పాల్గొంటారు. చివరిగా క్రొయేషియాలో అధికారిక పర్యటన జరుపుతారు.  

మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం.. ఎందుకంటే?

  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. మంత్రి వర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్‌ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడం సరికాదని మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు.   సున్నిత, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి నిన్న ఖమ్మంలో చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్ కు పోలీసులు తాళం

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు పోలీసులు తాళం వేశారు. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో ఈ ఘటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు సోమవారం (జూన్ 16) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హాజరు కావడానికి ముందు తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడి అక్కడ నుంచే నేరుగా ఏసీబీ విచారణకు వెళ్లారు. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన ఆ సందర్భంగా ఈ  ఫార్ములా రేస్ కేసులో తనను అరెస్టు చేసి జైలుకు పంపుతారని అన్నారు.  ఆ తరువాత ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు. కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లగానే పోలీసులు తెలంగాణ భవన్ కు తాళం వేశారు.  దీనిపై బీఆర్ఎస్ శ్రేణుులు మండి పడుతున్నాయి. ప్రజాస్వామ్యమా పోలీసు రాజ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  పోలీసులు తెలంగాణ భవన్‌కు తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అటు తెలంగాణ భవన్ సమీపంలోని నీలోఫర్ కేఫ్‌ను సైతం పోలీసులు మూయించి వేశారు. ఆ సమయానికి కేఫ్ లో ఉన్న వారిని బయటకు పంపించేసి ఆ తరువాత కేఫ్ ను మూయించివేశారు. తెలంగాణ భవన్  కు తాళం వేయడాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

జనగణనపై కేంద్రం గెజిట్‌ విడుదల

  దేశంలో 16వ జనగణనకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ  గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సారి కులగణన చేపట్టనుండటంతో ప్రధాన్యత సంతరించుకుంది. జనాభ లెక్కల సేకరణ తొలిసారిగా పూర్తిగా ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ రూపంలోనే సాగనుంది. ఇందు కోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు.  ప్రభుత్వ పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలే సొంతంగానూ వివరాలు నమోదు చేసుకోవచ్చు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్ గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి జనగణన ముగియనున్నది.  

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు రెండు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో  వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆవర్తనాలకు తోడు రుతుపవనాల కదలిక కూడా చురుకుగా ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.   సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయనీ, ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వరకూ వేగంగా ఈదురుగాలులు వీస్తాయనీ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే  వచ్చే 24 గంటల్లో  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని వాతావరణ శాఖ పేర్కొంది.    

ఆర్‌కే బీచ్‌లో యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధాని  రానున్న సందర్బంగా ఆర్కే బీచ్‌ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్‌ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు.  వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు. ఇవాళ సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అనారోగ్యంతో భాధపడుతు కన్నుమూశారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారం విశాఖపట్నం చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.  

గుండెల్ని మెలి పెడుతున్న మృతుల బంధువుల ఆవేదన

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవ దహనమైన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తిమీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి డీఎన్‌ఏ  టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. మరోవైపు మాంసపు ముద్దలు ఇచ్చి.. ‘ఇవి మీ వారివే’ అని వైద్యులు చెబుతుంటే.. బంధువులు అంగీకరించలేకపోతున్నారు. ఒకట్రెండు ముక్కలు కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామంటూ వారు పడుతున్న ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలోని మార్చురీ వద్ద.. మృతదేహాన్ని తీసుకొచ్చే సంచీలో రెండు తలలు ఉండటం వివాదానికి తావిచ్చింది. అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే మరోసారి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తన కుటుంబ సభ్యుల అవశే షాలన్నీ అప్పగించమని ఓ వ్యక్తి అధికారులను వేడుకున్నారు. అయితే..  అది సాధ్యం కాదని అతి కష్టం మీద ఆయనను అధికారులు ఒప్పించారు. కష్టమని తెలిసినా.. ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధిత కుటుంబీకులు వైద్యులను ప్రాధేయపడుతున్న తీరు కన్నీరు తెప్పిస్తోంది. ఓ వైపు కుటుంబీకులను కోల్పోయామన్న బాధ.  మరోవైపు కనీసం వారి మృతదేహాలను కూడా ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నామన్న ఆవేదనతో ఆస్పత్రి ఆవరణలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను అహ్మదాబాద్‌లోని 1200 పడకల సివిల్‌ ఆస్పత్రిలో భద్రపరిచారు. రక్తసంబంధీకుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, మృతదేహాల నమూనాలతో సరిపోల్చి.. బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతుల డీఎన్‌ఏను వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు అధికారులు వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్షతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డీఎన్‌ఏను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

కొత్త వేషం కట్టిన ఎమ్మెల్సీ కవిత!?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత,కొత్త వేషం కట్టారు. పాఠాలు చెప్పే పంతులమ్మగా మారి పోయారు. అయితే  కవితా టీచర్, అందరు టీచర్లు చెప్పే పాఠాలు చెప్పరు. పొలిటికల్ పాఠాలు మాత్రమే చెపుతారు.అది కూడా అందరికీ కాదు.. ఓన్లీ మహిళలు మరియు యువతకు మాత్రమే కవిత మేడం రాజకీయ పాఠాలు  బోధిస్తారు. అందు కోసం  ఆమె  తెలంగాణ జాగృతి తరపున 'లీడర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాగుంది.. ఒకప్పుడు కమ్యూనిస్ట్  పార్టీలు  రాజకీయ పాఠశాలలు నిర్వహించేవి.  అలాగే ఇతర పార్టీలు కూడా శిక్షణ తరగతులు నిర్వహించేవి. ఇప్పుడు అలాంటి పాఠశాలలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వాటి  అవసరం అయితే వుంది.  యువతను రాజకీయాల్లోకి రప్పించి, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా కవిత పేర్కొన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని తెలిపారు.రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పలుకుతుందని   కవిత సెలవిచ్చారు.  సో .. సంకల్పం మంచిదే. అదీ కాకుండా ఆమే అన్నట్లు  మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ముందు ముందు రాజకీయ నాయకుల అవసరం, మరీ ముఖ్యంగా..  ఎన్నికల్లో పోటీ చేసే మహిళా నాయకుల అవసరం పెరుగుతుంది. అలాగే..  బీసీ రిజర్వేషన్స్ అమలులోకి వచ్చిన తర్వాత  బీసీ నాయకులకు డిమాండ్ పెరుగుతుంది. సో .. కవిత సంకల్పం వరకు అయితే బాగుంది. కానీ.. ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఆమెకు ఆ ఆర్హత, యోగ్యతా ఉన్నాయా  అనేదే ప్రశ్న.    సరే.. ఆమెకు ఆ అర్హత,యోగ్యతా ఉన్నాయా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టినా.. నిజంగా ఆమె సంకల్పం అదేనా లేక అటు పార్టీకి, ఇటు ఫ్యామిలీకి దూరమై కొని తెచ్చుకున్న మనుగడ సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆమె కొత్త వేషం కట్టరా అనేది పెద్ద పజ్లింగ్  ప్రశ్న. గత వారం పది రోజులుగా ఆమె పడుతున్న అగచాట్లు, ఫేస్ చేస్తున్న అవమానాలను గమనిస్తే..  కవిత  లీడర్  కార్యక్రమం పరమార్ధం  మనుగడ కాపాడు కోవడం కోసమే అని వేరే చెప్ప నక్కర లేదు.  అవును.. ఉదర పోషణార్ధం బహుకృత వేషం  అంటారు పెద్దలు. అది కాకా పోయినా, కోటి విద్యలు కూటి కొరకే  అనే సామెతను అయితే అందరూ వినే ఉంటారు. అంటే..  బతుకు తెరువు కోసం అనేక వేషాలు వేయక తప్పదని అర్థం. ఆఫ్టరాల్  పొట్ట కూటి కోసమే ఎన్నో వేషాలు వేయక తప్పనప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే ఇంకెన్ని వేషాలు వేయవలసి ఉంటుందో వేరే చెప్ప నక్కర లేదు. అందులోనూ.. కాలం కలసి రానప్పుడు, కష్టాలు చుట్టిముట్టినప్పుడు రాజకీయ నాయకులు అవసరార్ధం వేషాలు మార్చక తప్పదు.. ఇప్పడు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినాయకురాలు కవిత పరిస్థితి కూడా అదే. అందుకే, ఆమె పంతులమ్మ వేషం కట్టారని అంటున్నారు.