అమరావతి.. ఇక ఆగేదేలే?

నవ్యాంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అభివృద్ధిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోతోంది. జగన్ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమరావతి పురోగతిని ఆపేశారు. శ్మశానమంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులకూ గురి చేశారు. అటువంటి  అమరావతిలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది.  పెద్ద ఎత్తున నిర్మాణాలు జోరందుకున్నాయి.  అటు కేంద్రం ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.  రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను స్వయంగా చేపట్టడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.  సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్లను,  కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మించేందుకు ముందుకు వచ్చింది కేంద్రంలో మోడీ నేతృత్వంలోని   ఎన్డీఏ సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి. దీంతో అమరావతి పురోగతికి అడ్డు అన్నదే లేకుండా పోయింది. ఇందుకు అదనంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్  నిర్మాణాలను కేంద్రమే స్వయంగా తన నిధులుతో నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్వర్లులు జారీ  చేశారు. ఆ వెంటనే ఆ నిర్మాణాలకు అవసరమయ్యే నిధులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుద చేసేసింది. ఈ నిధుల విడుదల విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి  1,329 కోట్ల రూపాయలు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి  .1,459 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.  కేంద్రం ఈ నిర్ణయంతో  అమరావతి నిర్మాణం నిర్దుష్టకాలంలో పూర్తి కావడమే కాకుండా, ఇక ఏ శక్తీ దీనిని నిలువరించలేదని కూడా స్పష్టమైంది. 

కోల్ కతా విమానాశ్రయంలో కొడాలి నాని అరెస్ట్!?

వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొంది.. బూతుల నానిగా ప్రసిద్ధి పొందిన కొడాలి నానిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయం నుంచి శ్రీలంక వెళ్లేందుకుర ప్రయత్నించిన నానిని అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విమానాశ్రయంలో అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు.   వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల పంచాంగం విప్పేవారు.  అటువంటి కొడాలి నాని వైసీపీ పరాజయం తరువాత నుంచీ నోరు విప్పడానికే భయంతో వణుకుతున్న పరిస్థతి. గుడివాడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన కొడాలి నాని ఒక్క పరాజయంతో నియోజకవర్గం ముఖం చూడడానికి కూడా భయపడే పరిస్థితికి దిగజారారు.  అసలు గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత కొడాలి నాని బహిరంగంగా బయటకు వచ్చి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే  అప్పడప్పుడు మీడియా ముందు కనిపించినా.. తాను భయపడటం లేదు అన్న బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని ఆ మాత్రంగా కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై  ముంబై  ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.  అంతే ఆ తరువాత నానికి సంబంధించిన వార్త ఏదీ బయటకు రాలేదు. ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కు ఎప్పుడు తిరిగివచ్చారు? అన్న సంగతే తెలియనంతగా అజ్ణాత వాసం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఓ వివాహ కార్యక్రమంలో ఆయన కనిపించారు. ఇక కొడాలి నానిని ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని కోల్ కతా నుంచి కొలంబో చెక్కేయడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో అక్కడ కొడాలి నానిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను విజయవాడ తరలించే అవకాశాలున్నాయంటున్నారు. 

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల హతం

ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం (జూన్ 18) ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జరగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా ముగ్గురు మరణించారు.    దేవిపట్నం   పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో  ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఒక ఏసీఎం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్,  అరుణ, ఏసీఎం సభ్యురాలు అంజుగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచిమూడు ఏకే 47లు స్వాధీనం చేసుకున్నారు.  మరి కొందరు నక్సలైట్లు తప్పించుకున్నారని భావిస్తున్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.  

మేమెంతో మాకంత అయ్యే పనేనా?

తెలంగాణలో కులం కుంపట్లు రాజుకుంటున్నాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణలుగా మారి పోతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మేమెంతో మాకంత (జనాభా ప్రాతిపదికన పదవుల పంపకం) నినాదం  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో ఏమో కానీ, రాష్ట్రంలో రెంటికి చెడిన రేవడి చేస్తుందా అనే మీమాంస కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.  ముఖ్యంగా.. ఇటీవల చేపట్టిన మంత్రివర  విస్తరణలో  రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడం.. అలాగే, పీసీసీ కార్యవర్గంలో ముందెన్నడూ లేని విధంగా సింహా భాగం (68) శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీకి హక్కుదారులం అనుకునే రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి  మొదలైందని అంటున్నారు.  కేవలం పదవులు ఆశించి భంగ పడిన నాయకుల్లోనే కాదు..  ఇప్పటికే పదవుల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం  నాయకుల్లోనూ రేపటి గురించిన గుబులు, తమ రాజకీయ భవిష్యత్ గురించిన ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.   సామాజిక న్యాయం మంచిదే  కానీ, సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన తమ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపేక్షించడం, మరీ పూచిక పుల్లలా తీసి పారేశారన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళడం పార్టీకి మంచిద కాదని అంటున్నారు. నిజానికి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే కాదు.. కాంగ్రెస్ అభిమానులు, విశ్లేషకులలోనూ అదే మాట విన వస్తోంది.    అయితే..  ఇప్పటికిప్పుడు తొందర పడితే ప్రయోజనం ఉండదని, స్థానిక  ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో  మిగిలిన మూడు ఖాళీల భర్తీతో పాటుగా, మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అంటున్న నేపధ్యంలో ఆ క్రతువు కూడ పూర్తయ్యే వరకు ఆగుదామని, రెడ్డి  నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  మరో వంక, పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న కులగణన, బీసీ, ఎస్సీలకు మంత్రి పదవులు, పీసీసీలో బడుగులకు పెద్ద పీట..వంటి నిర్ణయాలను అమలు చేసిన రాష్ట్ర నాయకత్వం, చేసిన మంచిని చెప్పుకోవడంలో వెనక పడిందని అంటున్నారు. నిజానికి.. ఒక విధంగా బలవంతపు బ్రాహ్మనార్ధం అన్నట్లుగా..  అధిష్టానం ఆదేశాలను పాటించిన  రాష్ట్ర నాయకత్వం బడుగులకు జరిగిన మేలును జనంలోకి తీసుకెళ్ళే విషయంలో అంతగా శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. ఫలితంగా, ఆశించిన రాజకీయ ప్రయోజనం ఏ మేరకు దక్కుతుందనే విషయంలో అనుమానాలు  ఆందోళనలు  వ్యక్తమవుతునాయి.  మరో వంక.. కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రకుల పేదలకు అన్యాయం చేస్తున్నదనే ఆందోళన పురుడు పోసుకుంది. ఈ నేపధ్యంలోనే..  ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్‌ వల్లపురెడ్డి రవీందర్‌ రెడ్డి తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌ ఏర్పాటుతో పాటు ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే..  బడుగుల్లోనూ మున్నూరు కాపు, లంబాడ సహా ఇంకా మంత్రివర్గంలో స్థానం, పార్టీ పదవులు దక్కని  కులాలు చాలానే ఉన్నాయి. దీంతో.. ఆ వర్గాల వారు  మామాటేంటని అడుగుతున్నారు.  అలాగే..  ముస్లిం మైనారిటీలు.. ఇతర మైనార్టీ వర్గాలు కూడా.  దీంతో.. మేమెంతో మాకంత  నినాదం  ఆచరణ  సాధ్యమేనా? అనే అనుమనాలు వ్యక్తంవుతున్నాయి. అనుమానాలు కాదు, సాధ్యం కాదని కూడా అంటున్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే, దీర్ఘ కాలంలో పార్టీ నష్టపోతుందని అంటున్నారు. ఒక విధంగా..  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది  అన్నట్లు అవుతుందా అనే అనుమానాలు, అపశ్రుతులు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కుప్పం బాధితురాలికి చంద్రబాబు పరామర్శ..రూ.5 లక్షల సాయం

  చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు. ఇలాంటి ఘటనలను సహించబోమని ఆమెతో ముఖ్యమంత్రి తెలిపారు.గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.ఈ సందర్భంగా బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు.చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో శిరీషా అనే మహిళను చెట్టుకు కట్టేసి సంగతి తెలిసిందే  

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి లీగల్ నోటీసులు పంపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి  దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని  కేటీఆర్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు.స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు తప్ప, ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం రాజకీయంగా పబ్బం కడుక్కునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యల పైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి, అటెన్షన్ డ్రైవరేషన్ డ్రామాలను పక్కన ప్రతిపక్ష నాయకుల పైన  ప్రాపగాండా చేయడం మానాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసే అంశాల పైన దృష్టి సారించాలని హితవు పలికారు.

ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి

  ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు  అనుచరులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. లేఅవుట్లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేశారు. వీడియో తీస్తున్న నటి రమ్యశ్రీ సోదరుడు పై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంతపై  కత్తి, క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డారు.  శ్రీధర్ రావు అనుచరులు గాయాల పాలైన  సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై  హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని  సినీ నటి రమ్యశ్రీ వాపోయారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు..రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమణం నెలకొంది. రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు వారి వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది నేతల ఫోన్ల ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ ఆపరేషన్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆయన బీజేపీ నేతల రాజకీయ ప్రణాళికలు, ఆర్థిక సహాయం అందించే వ్యక్తుల గురించి సమాచారం సేకరించి, ఈ వివరాలను అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు చేరవేశారని, భుజంగరావు ఈ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి, రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఉపయోగించారని సిట్ విచారణలో తేలింది.ఈ కేసులో ప్రభాకర్ రావు, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ కుమార్‌లతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు

బనకచర్ల వివాదంలో..ఏపీ, తెలంగాణ వాదనలేంటి?

  బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా.. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది. మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ప్రత్యేక ఆహ్వానం పలకడం మాత్రమే కాదు వారి వారికి ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు తెలంగాణ నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ దిశగా ఆయన ఇప్పటికే కేంద్రానికి ఎన్నో లేఖలు కూడా రాశారు. ఏపీ ప్రభుత్వ బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వరాదంటూ కోరుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఏపీ సైతం ఒక ప్రెజంటేషన్ ఇచ్చింది. అసలు బనకచర్లకూ తెలంగాణకు సంబంధమేంటి? మేమేమైనా మీ ప్రాజెక్టులు ఆపామా? అయినా ఎగువ రాష్ట్రం కట్టే ప్రాజెక్టులకే అభ్యంతరాలు తెలపాలి. దిగువన ఉన్న రాష్ట్రం విషయంలో నష్టపోయేవారెవరని? ఏటా  3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయ్. మరి ఆ నీటినే మేం వాడుకోదలుచుకున్నాం. రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరందించే యత్నం చేస్తున్నామంటోంది ఏపీ. దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైన అనంతపురానికి.. నీరందించడం తప్పెలా అవుతుందన్నది- ఏపీ నీటి మంత్రి నిమ్మల సంధిస్తోన్న ప్రశ్నాస్త్రం. ఇదిలా ఉంటే బనకచర్ల ప్రాజెక్టును 80 వేల కోట్ల రూపాయలతో నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది ఏపీ. పోలవరం లింక్ ప్రాజెక్ట్ అయిన దీనికోసం ఇప్పటికే కేంద్రానికి అనుమతుల కోసం అప్లై చేసుకుంది. గతంలో ఇదే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సైతం సమ్మతించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానంటూ ఆయన అన్న మాటలను తన ప్రెజంటేషన్లో పొందు పరిచారు నిమ్మల. అంతే కాదు కేసీఆర్ ఉదారత గురించి జగన్ చేసిన కామెంట్లను కూడా తన ప్రెజంటేషన్ ద్వారా ప్రస్తావించారు మంత్రి. రాయలసీమ బిడ్డగా చెప్పుకు తిరిగే జగన్.. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ను ఎందుకు వ్యతిరేకించడం లేదన్నది మంత్రి సూటిగా వేస్తోన్న ప్రశ్న. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు విషయంలో అంటున్న మాటేంటో చూస్తే.. కృష్ణాజలాల విషయంలో పోతిరెడ్డిపాడు ఎలాంటిదో.. గోదావరి జలాల విషయంలో బనకచర్ల అలాంటిదని అంటారు మాజీ నీటి పారుదల మంత్రి హరీష్ రావు. ఇక కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రులను ఆడిపోసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. అభ్యంతరాలుంటే కేంద్రానికి చెప్పుకోవాలి. మధ్యలో మా ప్రమేయం ఏముంటుందని అంటారాయన. ఈ విషయంలో నిపుణులు అంటోన్న మాటలేంటని చూస్తే.. ఇప్పటికే గోదావరి పై తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులకు చెందిన డీపీఆర్లు పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇలాంటి ప్రాజెక్టులకు అసలు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇది నాడు కేఎల్ రావు చెప్పిన నదుల అనుసంధానానికి చెందిన ప్రాజెక్ట్. ప్రధాని మోడీ సైతం నదుల అనుసంధానం చేయాలంటారు. ఇక 1980 నాటి ట్రిబ్యునల్ తీర్పులుగానీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 గానీ ఉల్లంఘించడం లేదు. ఎందుకంటే ఆ తీర్పులన్నీ నికర జలాలపైన వచ్చినవి. తామేమీ వాటి జోలికి పోవడం లేదే.. వరద నీరు వృధాగా పోకుండా సద్వినియోగం చేస్తున్నాం. 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీటి కారణంగా కోటి మందికి పైగా ముంపునకు గురయ్యారు. దీన్ని నివారించడానికే ఇదంతా అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇపుడీ బనకచర్ల గొడవ ఎటు పోయేట్టు? రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఎప్పుడు ముగిసేను? తేలాల్సి ఉంది.

అంతరిక్షంలో.. మరో అద్భుతం !

    అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో మరో మహోత్తర ఘట్టం ఆవిష్కరణ సమయం ఆసన్నమైంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జూన్ 18న తమ మొదటి ఉమ్మడి ఉపగ్రహ మిషన్, నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్) ను చెన్నై శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నాయి. ఇది, భూఉపరితలంపై జరిగే చిన్న పెద్ద మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడానికి అత్యాధునిక, సింథటిక్ ఎపర్చర్ రాడార్ వ్యవస్థతో అనుసంధానం చేయబడిన అసాధరణ ఉపగ్రహ ప్రయోగం, నిసార్  ఉపగ్రహ ప్రయోగం.  నిసార్’ ఉపగ్రహం వాతావరణ మార్పుల అవగాహన, పరిష్కారానికి అత్యవసరమైన, భూ ఉపరితల పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టం ఎదుగుదల, భూగర్భజలాలు, హిమానీనదాలకు (గ్లోసరీస్)కు సంబందించిన,సంక్లిష్ట సమాచారాన్ని, అత్యంత ఖచ్చితత్వంతో సేకరించడమే, ఈ  మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ రాడార్ నాసా అత్యాధునిక ఎల్ – బ్యాండ్ సింథటిక్ అపెట్రూర్ ఎపర్చర్’ రాడార్’( ఎస్ఎఆర్), ఇస్రో ఎస్- బ్యాండ్ రాడార్’ల సంయుక్త కృషి ఫలితం. అందుకే, దీన్ని, ‘నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్’ గా వ్యవాహరిస్తున్నారు.  ఈ రాడార్ వ్యవస్థలోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం, శాస్త్ర వేత్తలు భూమి ఉపరితలం పై ప్రతి సెంటీ మీటర్ పరిమాణం వరకు జరిగే  మార్పులను గుర్తించేందుకు తద్వారా, భూకంపాలు, అగ్ని కీలల విస్పొటనాలు, మంచు చరియలు విరిగే పడే ప్రమాదాలను ముందుగానే పసిగట్టేందుకు ఉపకరిస్తుంది. కాగ,ఇస్రో సీనియర్ అధికారి ఒకరు, ‘ఇది రెండు ప్రపంచ ప్రసిద్ద అంతరిక్ష సంస్థల మధ్య కుదిరిన ఒక చారిత్రిక భాగస్వామ్యం’గా పేర్కొన్నారు.అలాగే, ‘భూమండలం ఎదుర్కుంటున్న, అత్యంత ప్రధాన సవాళ్ళను అర్థం చేసుకోవడంతో పాటుగా, పరిష్కార స్పందనలో మార్పులకు నిసార్ ఉపగ్రహం సహాయ పడుతుందని, అన్నారు. ఈ ఉపగ్రహాన్ని, ఇస్రో – జీఎస్ఎల్వీ ఎంకే 2 రాకెట్  ద్వారా ప్రయోగిస్తారు.  ఉపగ్రహం కక్షలో ప్రవేశించిన తర్వాత, ప్రతి 12 రోజులకు ఒక సారి భూమిని చుట్టి వస్తుంది. శాస్త్ర వేత్తలు మొదలు విధాన నిర్ణేతలు, విపత్తు నిర్వహణ సంస్థలు, వరకు అనేక మందికి,  అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.,  నిసార్’ కేవలం ఒక శాస్త్రీయ అద్భుతం, సాకేతిక మైలు రాయి మాత్రమే కాదు, భారత్, అమెరికా దేశాల మధ్య పెరుగుతున్న అంతరిక్ష , సాంకేతిక సహకారానికి ఓ చిహ్నం. ఈ మిషన్, భూ పర్యవేక్షణ, విపత్తు నివారణలో ప్రపంచ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.  ఈ దశాబ్దపు అత్యంత ప్రధానమైన, ఎర్త్ సైన్సు మిషన్’ గా భావిస్తున్న నిసార్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపధ్యంలో, ఉభయ దేశాల్లో అంచానాలు ఎగసి పడుతున్నాయి.  

యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  స్వర్ణాంధ్ర విజన్–2047 పక్కగా అమలు చేసేందుకు కుటమి ప్రభుత్వం చర్యలు చేపటడుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రెండేళ్ల కాలనికి సంబంధించి  నియోజకర్గానికి ఒకరు చొప్పున 175 నియోజకర్గాల్లో యంగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలు ఏడాది కాలానికి ఒప్పంద పద్ధతిలో జరుగుతాయి. అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు 60,000 వరకు జీతం చెల్లిస్తారు. వయోపరిమితి విషయానికొస్తే, 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను ప్రామాణికంగా తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం, వేతనం తదితర పూర్తి వివరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://apsdpscareers.com/YP.aspx వెబ్ పోర్టల్‌ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు  

తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌.!!

  ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జనగణన చేపట్టడానికి అనుమతిస్తూ జూన్16న కేంద్రం గెజిట్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్టాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్‌ క్లియర్‌ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్‌ 2న తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగం లోని 170వ అధికరణలోని సెక్షన్‌-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్‌-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది.  విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి. జన గణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్‌-26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్‌ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది. ప్రజల సౌకర్యం.. పాలన సౌలభ్యమే ప్రాతిపదికగా: జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం.వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది.  

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరు

  చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం ముగిసింది. తిరుమలకి 100 ఎలక్ట్రికల్ బస్సులు కేటాయిస్తామని కేంద్రం ఇచ్చిన హామీ అమల్లోకి రాబోతోందని, త్వరలోనే టీటీడీకి ఆ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నట్టు తెలిపారు. తిరుమలలో CSIR పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేయనుందని.. ఈ ల్యాబ్ లో నెయ్యి, నీరు, పప్పు ధాన్యాల నాణ్యతను పరిశీలించవచ్చని వెల్లడించారు.  టీటీడీకి చెందిన 7 స్కూళ్లలో 1600 మంది విద్యార్థులకు హ్యూమానిటీ, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తామన్నారు. అదే విధంగా బెంగుళూరులో మరో పెద్ద శ్రీవారి ఆలయం నిర్మించాలని ఆ రాష్ట్రం కోరిందని, వారి వినతి మేరకు మరో విశాలమైన ఆలయం నిర్మిస్తామని తెలిపారు.  సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.  

డీకే శివకుమార్ సోదరుడుకి ఈడీ నోటీసులు

  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఐశ్వర్య గౌడ్ అనే మహిళతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో భాగంగా జూన్ 19వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నాది. పీఎంఎల్‌ఏ కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం.ఏప్రిల్ నెలలో, ఐశ్వర్య గౌడ అనే మహిళను ఈడీ అరెస్టు చేసింది. ఈమెకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.  తాను పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులకు సన్నిహితురాలినని ఐశ్వర్య గౌడ చెప్పుకుందని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక లాభాలు ఇప్పిస్తానని చెప్పి ఆమె పలువురిని చీటింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో డీకే సురేశ్ పేరును ఐశ్వర్య గౌడ దుర్వినియోగం చేసిందని, తాను ఆయన సోదరినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. తన పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డీకే సురేశ్ గతంలోనే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కులకర్ణి అనే వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.

బెంబేలెత్తిస్తున్న ఎయిర్‌ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ఫ్లైట్లు

బోయింగ్ డ్రీమ్‌లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్‌వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణీకులు భయపడే పరిస్థితులు నొలెకొన్నాయి. ఎయిరిండియాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు దానికి కారణమవుతున్నాయి. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలలోనే   కుప్పకూలిన ఘటన  మరవకముందే.. మరిన్ని విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడటం కలవరపెడుతోంది. తాజాగా అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఎదురైంది. టేకాఫ్‌కు ముందే సమస్యను గుర్తించడంతో ఈ సర్వీసును రద్దు చేశారు. ఎయిరిండియా ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానంలో తనిఖీలు చేస్తుండగా.. సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో టేకాఫ్‌ నిలిపివేసి సర్వీసును రద్దు చేశారు. గత వారం నాటి విమాన ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్‌ విమానం ఇదే కావడం గమనార్హం.  జూన్‌ 12న అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఏఐ 171 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకేఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇక విమానం నివాస సముదాయంపై పడటంతో మరో 33 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత  ఏఐ 171 ఫ్లైట్‌ నంబర్‌ను ఎయిరిండియా పక్కనబెట్టింది. దాని స్థానంలో ఏఐ 159 నంబరును వినియోగించింది. ఇప్పుడదే సిరీస్‌ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది.  మరోవైపు, ఈ ఘటన తర్వాత పలు ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి వెళ్తున్న ఏఐ 180 విమానంలో సమస్య రావడంతో దాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు.

జవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి పరిహారం అందజేత

  ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూటమి సర్కార్ అండగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత, మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్లిన మంత్రి.. వీర జవాన్ మురళీ నాయక్ సమాధి వద్ద  అంజలి ఘటించి నివాళులర్పించారు.  అనంతరం రూ.50 లక్షలచెక్కు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆయన  తల్లిదండ్రులకు అందజేశారు. గ్రామంలో రూ.14 లక్షలతో మురళీ నాయక్ సమాధి, అక్కడికి వెళ్లేందుకు రూ.16లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కల్పించారు.  కల్లితండా పేరు కుడా మార్చే ప్రతిపాదను రెవెన్యూ అధికారులు ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  

ఇన్నాళ్లూ లేనిది.. కవిత ఇంటిపేరు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?

కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెగా మాత్రమే కాదు.. ఎంపీగా,  పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన నేత. తండ్రి కేసీఆర్ వాగ్ధాటిని పుణికి పుచ్చుకున్న నేత. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరినప్పటి నుంచీ కవిత పార్టీలో మమేకమై పార్టీలో మమేకమై ఉద్యమంలో ముందుండి నడిచారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యమాన్ని వేరే లెవెల్ కు తీసుకు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ విజయంలో కవిత పాత్ర కూడా గణనీయంగా ఉంది. వరుసగా రెండో సారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అంత వరకూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగానే సాగింది. ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైందో.. అప్పటి నుంచీ కేసీఆర్ కుటుంబంలో విభేదాలు పొడసూపాయి. కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు కేటీఆర్, కవిత. పార్టీ పరాజయం తరువాత కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాలలోనే గుసగుసలు వినిపించడం మొదలైంది.  ఎప్పుడైతే  కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకైందో.. అప్పటి నుంచే ఇరువురి మధ్యా విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కవిత తన సొంత దారి చూసుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే కవిత అడుగులూ పడ్డాయి.  తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తన ఇంటికి సమీపంలోకి మార్చుకున్న కవిత.. బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ద్వారానే రాజకీయం చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే యువతనుజాగృతిలోకి ఆహ్వానించారు. ఆమె పిలుపు మేరకు ఇటీవల పెద్ద  ఎత్తున యువత జాగృతి సంస్థలో చేరారు. వారికి కవిత సంస్థ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక మీడియా సంస్థ మాత్రం కవిత ఇంటిపేరును కల్వకుంట్ల అని కాకుండా దేవనపల్లి అని పేర్కొంది. దేవనపల్లి కవిత భర్త అనీల్ ఇంటి పేరు. ఇంత కాలంగా కవితను కల్వకుంట్ల కవితగానే అంతా పేర్కొంటూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా అదీ ఓ మీడియా సంస్థకు కవిత ఇంటిపేరు కల్వకుంట్ల కాదు అంటూ ప్రచురించాలనీ. ప్రచారం చేయాలనీ అనిపించింది. అంటే కేసీఆర్ కుటుంబం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచీ ఆమెను వేరు చేసే ప్రయత్నమే ఇదని పరిశీలకులు విశ్లేషించారు.  సరిగ్గా సోదరుడితో విభేదించిన తరువాత వైఎస్ షర్మిల పేరుకు ముందు ఆమె భర్త ఇంటిపేరు ఎలా అయితే చేర్చి అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ సొంత మీడియా ప్రచురించాయో, ప్రచారం చేశాయో.. సరిగ్గా అలాగే ఇప్పుడు కవిత విషయంలో జరగడం యాధృచ్చికం ఎంత మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. షర్మిల ఫోన్ ట్యాప్!

  ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్‌లోనే తన ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్‌కు చేరవేశారని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే షర్మిల కోసం ప్ర‌భాక‌ర్ రావు టీమ్ కోడ్ లాంగ్వేజ్ ఉప‌యోగించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  ప్ర‌స్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నింధితుడుగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు విచార‌ణ ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత కాలంగా విదేశాల్లో ఉన్న ఆయ‌న ఇప్పుడు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు నివేధిక సిద్ధం చేశారు. నివేధిక ఆధారంగా ప్రభాకర్ రావుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.రేపు విశాక యిర్‌పోర్టులో ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల స్పందిచనున్నట్లు సమాచారం.

బాధితురాలితో మాట్లాడిన హోంమంత్రి..బాధ్యులపై కఠిన చర్యలు

  చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం లో అప్పు తీర్చలేదు అని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై బాధితులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ లో మాట్లాడారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి ద్వారా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. జరిగిన అన్యాయానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, బాధితురాలికి హామీ ఇచ్చారు.  బాధితురాలితో తాను మాట్లాడిన వీడియోను కూడా హోం మంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు . ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హోంమంత్రి  అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే తనకు సమర్పించాలని ఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు.