ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా 202 మృతదేహాల గుర్తింపు

  అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర  విమాన ప్రమాదంలో మరణించిన వారిలో డీఎన్ఏ పరీక్షల ద్వారా 202 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకూ 157 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.  జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే లండన్ వెళుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో బీజే మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా మరణించారు.  మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ పరీక్షలు ఎప్పటికి పూర్తవుతాయా అన్న సందేహం మొదట్లో వ్యక్తమైంది. అయితే యుద్ధ ప్రతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా వరకూ పూర్తి చేశారు.  మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వంటి ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో ఆయన కుమారుడు రుషభ్ రూపానీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ, వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

సీనియర్ జర్నలిస్టు కంచర్ల రామయ్య కన్నుమూత

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కన్నుమూశారు. సీనియర్ జర్నలిస్టు, ఎపియుడబ్యుజె   రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు  కంచర్ల రామయ్య  గురువారం (జూన్ 19) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న ఆయన హైదరాబాద్ లో కిమ్స్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం (జూన్ 20) ఉధయానికి ఆయన భౌతిక కాయాన్ని కందుకూరుకు తీసుకువెడతారు. కందుకూరులో శనివారం (జూన్ 21) ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.   ఎందరినో జర్నలిస్టులు గా తీర్చిదిద్ది, జర్నలిస్టు యూనియన్ లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన రామయ్య మృతి తీరని లోటు అంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  కంచర్ల రామయ్యకు ప్రజాసమస్యల పరిష్కారంకోసం కృషి చేయడంలో ఆయన ఎన్నడూ వెనుకడుగు వేసేవారు కాదు. జర్నలిస్టుగా ఆ పని చేసిన కంచర్ల రామయ్య మరింతగా ప్రజలతో మమేకం కావడానికి, వారి సమస్యల పరిష్కారంలో మరింత చొరవచూపడానికి చట్టసభలో అడుగుపెట్టాలని భావించే వారు. ఆయన కోరుకున్నట్లు ఆయనకు  కందుకూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన నాడు పోటీ చేయలేదు. అయితే ఆయన కోరికను కుమారుడు కంచర్ల శ్రీకాంత్ తీర్చారు.  2023లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.   చంద్రబాబు సంతాపం జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన కంచర్ల రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

దోపిడీ కేసులో తిరుమలలో పని చేసే కానిస్టుబుల్ ను అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు

తిరుమలలో విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌ అరుణ్ కుమార్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.  ఓ వ్యాపార వేత్త నివాసంలో ఆయన భార్యపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.  తమిళనాడులోని వాణియంబాడిలో   తోళ్లపరిశ్రమ యజమాని ఇంతియాస్‌ అహ్మద్‌ ఇంట్లో మూడు రోజుల కిందట దోపిడీ జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా వాణియంబాడి పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చెన్నైకు చెందిన దోపిడీ ముఠా సభ్యులకు, ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో పని చేసే శక్తివేల్‌కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌తో పాటు తిరుపతికి చెందిన శాంతకుమారి, కొల్లకట్టై ప్రాంతానికి చెందిన ఇళవరసన్‌( ) సహా నలుగురికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌కు.. ఇళవరసన్‌కు పరిచయం ఉండగా.. ఇళవరసన్‌క తిరుపతికి చెందిన శాంతకుమారి  తెలుసు. ఈ ముగ్గురు కలిసి తిరుమలలో పనిచేసే ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌ కుమార్‌ సాయంతో అరుణ్ కుమార్ అపథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. ఆ కేసులోనే కానిస్టేబుల్‌ అరుణ్‌ కుమార్‌ను తిరుపతి పోలీసుల సహకారంతో తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి  వాణియంబాడికి తరలించారు.  

వారి మృతికి జగన్ దే బాధ్యత.. కన్నా

వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని  తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మరణించారనీ, వారిలో ఒకరు జగన్ కాన్వాయ్ లో వాహనం ఢీ కొని మరణిస్తే.. మరొకరు ఎండలో ర్యాలీ కారణంగా మరణించారనీ ఆయన తెలిపారు. ఆ ఇద్దరి మృతికీ జగనే బాధ్యత వహించాలనన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కన్నా..  జగన్ హయాంలో తాము ర్యాలీలకు పిలుపునిస్తే  తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటలను కూడా అడ్డుకున్నారన్నారు. మూడు వాహనాలు, వంద మందితో వెళ్లాలని పోలీసులు చెప్పినా.. భారీగా వెళ్లి అరాచకం సృష్టించారని ఆరోపించారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని కన్నా ఆరోపించారు.  ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శిస్తారు కానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పలకరించే  కూడా జగన్ కు లేదా అని నిలదీశారు. జగన్ అబద్ధపు మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్న కన్నా ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా జనం పట్టించుకోరన్నారు.  

తిరుమలలో ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆర్టీసీ అధికారులతో కలిసి ఈ సేవలను గురువారం (జూన్ 19) ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల దోపిడీని, కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయి.  శ్రీవారి మెట్టు, పాపవినాశనం వంటి ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.  తిరుమలలో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు వాహనాల దోపిడీని అరికట్టడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.  తొలి దశలో 20 బస్సులను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇవి ఇప్పటికే తిరుమలలో తిరుగుతున్న 12 శ్రీవారి ధర్మరథాలకు అదనంగా ఆర్టీసీ బస్సులు 80 ట్రిప్పులు తిరుగుతాయి. దీని వల్ల ప్రతి ఐదు నిముషాలకు ఉచిత బస్సు భక్తులకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి మూడు నిముషాలకు  ఈ ఉచిత బస్సు అందుబాటులోనికి తీసుకువస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు.  

చంద్రబాబు సంతోషం కోసమే తనపై అక్రమ కేసులు.. చెవిరెడ్డి బహిరంగ లేఖ

సీఎం చంద్రబాబును సంతోషం కోసమే పోలీసులు తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. లిస్కర్‌ స్కాం కేసులో ఆయన్ని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆయన  సిట్ కు ఓ బహిరంగ లేఖ  విడుదల చేశారు. ఆ లేఖను చెవిరెడ్డి భాస్కరరెడ్డి   కుమారుడు  హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్‌ కార్యాలయం వద్ద మీడియాకు విడుదల చేశారు.  ఈ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.  నేను చాలా స్పష్టంగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు   సిట్‌ కార్యాలయానికి వస్తాను అని చెప్పాను.   మీరు కేవలం నా సెల్‌ ఫోన్‌కు ఒక చిన్న మెసేజ్‌ పెట్టినా  సిట్‌ కార్యాలయం ముందు నిలబడి ఉంటా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పి ఉంటా. నేను పగలే కాదు, రాత్రి వేళల్లో కూడా ఏ రోజు నా సెల్‌ ఫోన్‌ ఆఫ్‌ చేయలేదు. నేను నిన్న కూడా విజయవాడలోనే ఉన్నా, మీరు పిలిచి ఉంటే వచ్చేవాడిని. నేను నా జీవితంలో ఎన్నడూ పారిపోలేదు. ముందస్తు బెయిల్‌ కూడా నా జీవితంలో ఏనాడూ అడగలేదు. అలాంటి నాపై లుకౌట్‌ నోటీసులు ఇవ్వడం అన్నది మీ సభ్యతను తెలియజేస్తుంది.  బతుకు తెరువు కోసం అవకాశం ఉన్న ప్రదేశాలకు, దేశాలకు వెళుతుంటాం, తప్పేంటి?  మీరు పిలిస్తే రానప్పుడు తప్పు అవుతుంది. కానీ నేను అలా చేయలేదు కదా!  సిట్‌ విచారణ ప్రారంభించి 365 రోజులు అవుతుంది, ఏ రోజు అయినా,  ఏ ఒక్కరు అయినా, చివరకు ఏ పేపర్‌లోనైనా,  ఏ ఛానల్‌లో అయినా నిన్నటి వరకు నా పేరు ప్రస్తావనకు వచ్చిందా? లేదుకదా.  కనీసం నిన్నటి వరకు మీ సిట్‌ అధికారులు ఒక్కరైనా నన్ను ఏదైనా అడిగారా?  ఒక చిన్న నోటీస్‌ అయినా ఇచ్చారా?  ఎప్పుడైనా పిలిచారా? లేదు కదా! అంటే దాని అర్థ ఏంటీ!. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా   నన్ను ఏలా ఇబ్బందులు పెట్టాడో, ఎన్ని కేసులు పెట్టారో, ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనేకసార్లు ఎంతగా కొట్టించారో మీకు తెలుసు.  ప్రజలందరికీ తెలుసు! మరలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. దుర్మార్గంగా అన్యాయమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇక మిగిలింది మా పాత గన్‌మేన్‌లను తప్పుడు కేసులకు సంతకాలు పెట్టమని మీ సిట్‌ అధికారులు కొట్టినట్టు, మీ చేత మరల నన్ను కూడా కొట్టిస్తారేమో! అది కూడా కానిచ్చేయండి. చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది. ఈసారి నా ఒక్కడినే కాదు, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడని కేవలం 26 సంవత్సరాలు వయసు గల  చిన్నవాడైన నా కొడుకు మోహిత్‌రెడ్డిని కూడా కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకుంటున్నట్టు ఉన్నారు!  ఒక్క మోహిత్‌నే ఎందుకు ఇంట్లో ఇంకా నా భార్య నా మరో కొడుకు కూడా మిగిలి ఉన్నారు. వాళ్లను కూడా దయచేసి ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపి, చంద్రబాబును చంద్రబాబు కుటుంబాన్ని సంపూర్ణంగా శాంతింప చేయండి. మాకేం పర్లేదు మా కుటుంబం అంతా నిత్యం కొలిచే మా వెంకటేశ్వర స్వామి మాలో ఉన్నాడు.  జీవితం అంతా పోరాటాల ఊపిరిగా జీవిస్తున్న మా జగనన్నే మాకు స్ఫూర్తిగా ఉన్నాడు. ధైర్యం ఉంది ఎదుర్కొంటాం, సగౌరవంగా తిరిగి వస్తాం, ఆలస్యమైన సత్యమే జయిస్తుంది.

జూబ్లీహిల్స్ రేసులో ఉన్నా.. మహ్మద్ అజారుద్దీన్

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో  అందరూ ఇదే అంశంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే,  పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు  మహమ్మద్ అజారుద్దీన్  తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తానూ రేసులో ఉన్నానని స్పష్టం చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు చివరి క్షణంలో పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడాననీ, స్వల్ప ఓట్ల తేడాతో పారజయంపాలయ్యాననీ చెప్పారు.  ఓట్లతో ఓడిపోవడం జరిగిందని అన్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో   సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యేలా తాను పనిచేశానని చెప్పారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారనీ, తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గడిచిన ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి  రాహుల్ గాంధీ కి బహుమతిగా అందిస్తామని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్.. ఈటల మాటల సారాంశం అదేనా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా?  కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసి ఆ తరువాత ఆయనతో విభేదించి బయటకు వచ్చ బీజేపీ గూటికి చేరిన ఈటల రాజేందర్ మాటల సంకేతమదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్  కేసు దర్యాప్తు చేసిన సిట్ ఇప్పుడు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ వాంగ్మూలం కూడా తీసుకోనున్నది. ఈ మేరకు ఇప్పటికే ఈటలకు సిట్ సమాచారం ఇచ్చింది. దీనిపై మీడియాతో మాట్లాడిన ఈటల సంచలన విషయాలు చెప్పారు. దానిని బట్టే ఆయన టార్గెట్ కేసీఆర్ అని అర్ధమౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను సిట్ కు వాంగ్మూలం ఇస్తానని మీడియా ముఖంగా చెప్పిన ఈటల.. ఫోన్ ట్యాపింగ్ లో తొలి బాధితుడిని తానేనని అన్నారు. తన ఫోనే కాదు, తన కుటుంబ సభ్యులు, డ్రైవర్, గన్ మెన్, బంధువులు, స్నేహితుల ఫోన్లూ కూడా అప్పట్లో ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను సిట్ ఎదుట చెబుతానని వెల్లడించారు. అన్ని ఆధారాలు, రుజువులతో సహా సిట్ ఎదుటకు వెళ్లి వాంగ్మూలం ఇస్తానన్నారు.   ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమనీ, ఇందులో ప్రమేయం ఉన్న వారందరికీ శిక్షపడాలని చెప్పారు.  కేసు దర్యాప్తు సాగుతున్నకొద్దీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని వేళ్లూ మాజీ సీఎం కేసీఆర్ వైపే చూపుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్థారణ అయ్యిందని అంటున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు తాను ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇప్పటి వరకూ అంగీకరించకపోయినప్పటికీ   ఇప్పటి దాకా ఈ కేసులో అరెస్టైన వారు, విచారణకు హాజరైన వారు కూడా ఆయన ఆదేశాల మేరకే పని చేశామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈటల వాంగ్మూలం కీలకంగా మారిందంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల.. కాళేశ్వరం అవినీతితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడమే కాకుండా, ఏమైనా అవకతవకలు జరిగితే కేసీఆర్, హరీష్ లే అందుకు బాధ్యులని సంకేతం ఇచ్చే విధంగా మాట్లాడారు.   

అన్నీ ఉన్నా.. తెలంగాణ కమలం క్యాడర్ లో నిర్వేదం !

ఇప్పుడు ఎటు చూసినా యుద్ధమే కనిపిస్తోంది .. దేశాల మధ్యనే  కాదు, రాజకీయ పార్టీల మధ్యన కూడా యుద్ద వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ..  ప్రత్యర్ధి  పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, పార్టీల లోపల సాగుతున్న అంతర్గత కుమ్ములాటలలో  కూడా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో..  ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో ఏమి జరుగుతోందో వేరే చెప్పనక్కరలేదు. అధికార కాంగ్రెస్ పార్టీలో పదవులు, పంపకాల పంచాయతీ నడుస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కుటుంబ కలహాల గొడవల కథ  నడుస్తోంది.   ఆదలా ఉంటే..  రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు  ఎమ్మెల్సీలు, అన్నిటిని మించి కమిటెడ్  క్యాడర్, అంతకు మించి కేంద్రంలో అవిచ్ఛన్నంగా సాగుతున్న 11 ఏళ్ల మోదీ పాలన, ఎదురు లేని ఆర్థిక స్థోమత, ఇలా ఎన్ని ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మాత్రం  అలాగే, అంతే అధ్వానంగానే వుందని పార్టీ వర్గాలు ఒక విధమైన నిర్వేదాన్ని వ్యక్త పరుస్తున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా  రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి  చుక్కాని లేని నావలా..  స్తబ్దుగా, నిస్తేజంగా ఉండి పోయిందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. నిజానికి బీజేపీ సీనియర్ నాయకుడొకరు అన్నట్లుగా బీజేపీకి అన్నీ ఉన్నాయి కానీ..  అల్లుడి నోట్లో శని కారణంగా బీజేపీకి ముందడుగు పడడం లేదు. అయినా..  పార్టీ స్తబ్దుగా ఉన్నా, అంతర్గత కలాహాలు, కుమ్ములాటల విషయంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఏమాత్రం తీసి పోవడం లేదని అంటున్నారు.  నిజానికి అంతర్గత కుమ్ములాటల కారణంగానే..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళానికి  గెలుపు బస్సు మిస్సయిందని అప్పట్లోనే అంతర్గత విశ్లేషణలలో పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. ఈ నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతల నెత్తిన అక్షింతలు వేశారనే ప్రచారం జరిగింది. కనీసం 30 సీట్లలో గెలిచే అవకాశం, అనుకూల వాతావరణం ఉన్నా.. ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యంగా అధ్యక్ష పదవినుంచి బండి సంజయ్ కుమార్ ను తొలిగించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ చేయి జార్చుకుందనేది పార్టీ లోపల, వెలుపల వినిపించిన మాట.   అదెలా ఉన్నా.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకోవడంతో పాటుగా ,ఈ మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈ పరిణామాలను గమనిస్తే..  తెలంగాణలో కమల దళానికి అనుకూల వాతావరణం ఇప్పటికీ ఉందనీ అయితే,  బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో విబేధాల కారణంగా, పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.  అదలా ఉంటే.. ఇంచుమించుగా సంవత్సరం పైగా నానుతూ, ఎటూ తేలకుండా సాగుతూ వస్తున్న పార్టీ  రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక, నియామకం వ్యవహరం అటో ఇటో తేలేవరకు పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. అంతవరకు  గోషామహల ఎమ్మెల్యే.. రాజా సింగ్ రెండు మూడు నెలకు ఒకసారి ఇలా పార్టీని బజారుకు ఈడ్చే సంఘటనలు జరుగుతూనే ఉంటాయని  పాత తరం  సీనియర్ నాయకులు  అంటున్నారు. అలాగే రాజా సింగ్  పార్టీలోకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అనే విషయాన్ని పక్కన పెడితే..  ఆయనకు పార్టీ   పునాది హిందుత్వం పట్ల  సంపూర్ణ విశ్వాసం వుంది.  ప్రజల్లో బలముంది. వరసగా మూడుసార్లు ఒకే నియోజక వర్గం నుంచి గెలిచిన చరిత్ర వుంది. అంతే కాదు..  2018 ఎన్నికల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఓడి పోయినా..  రాజా సింగ్ ఒక్కరు మాత్రమే గెలిచారు. గోషామహల్ సీటును నిలబెట్టుకున్నారు. కాబట్టి..  పార్టీ నాయకత్వం వ్యక్తిగత వ్యాఖ్యలు విమర్శలను పక్కన పెట్టి  ఆయన కోరుతున్న విధంగా ఆయన సేవలను ఏమేరకు ఉపయోగించుకోగలిగితే  ఆమేరకు ఉపయోగించుకోవడం మంచిందని పార్టీ పెద్దలు హితవు చెపుతున్నారు. అలాగే.. ఇంకా జాప్యం చేయకుండా  పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్రతువును కానిస్తే..  పార్టీ మళ్ళీ పట్టాల మీదకు వస్తుందని క్యాడర్ ఆశాభావంతో ఉన్నారు.

ట్రంప్ యు టర్న్.. హస్తానికి బిగ్ షాక్!

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే..  ఉభయ దేశాలను అదిరించి, బెదిరించి దారికి తెచ్చింది నేనే..  కాల్పుల విరమణ చేయించింది నేనే... అంటూ పదే పదే ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ ఒక్క సారిగా యు  టర్న్ తీసుకున్నారు.  నేనే ..నేనే అంటూ ఒకటికి 14 సార్లు, ప్రపంచం ఇల్లెక్కి చెప్పిన ట్రంప్ , చివరాఖరుకు భారత్ – పాక్ కాల్పుల విరమణ విషయంలో తన పాత్ర,  ప్రమేయం ఇసుమంతైనా లేదని బహిరంగంగా ఒప్పుకున్నారు.  అదికూడా..  ట్రంప్’ ప్రగాల్బాలపై ప్రధాని మోదీ నేరుగా స్పందించి 24 గంటలు గడవక ముందే  ఆయన  ‘యు’ టర్న్ తీసుకున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ ప్రకనటపై తొలి సారి స్పందించిన ప్రధాని మోదీ కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని    బుధవారం (మార్చి 18) తేల్చి చెప్పారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజానికి , ట్రంప్ చేసిన  నేనే..నేనే..  ప్రగల్బ ప్రకటనలకు  భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ, భారత సైన్యం ఎప్పుడోనే  సమా ధానం ఇచ్చింది. అయినా..   ట్రంప్  అదే పాట పాడుతూ..  కాల్పుల విరమణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన సంగతి అలా ఉంటే మరో వంక మన దేశంలో విపక్షాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ,  కాంగ్రెస్ నాయకులు మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ అయితే.. మరో అడుగు ముందుకేసి,  ట్రంప్ ఆదేశాలకు ప్రధాని మోదీ లొంగి పోయారని, అందుకే వైట్ హౌస్ నుంచి ఫోన్  రాగానే  కాల్పుల విరమణకు అంగీకరించారనే అర్థంవచ్చేలా.. ‘నరేందర్ .. సరెండర్’  అంటూ ప్రధాని మోదీని ఎగతాళి చేశారు.  కాగా..  తాజగా పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్‌కు, వైట్ హౌస్ లో ఇచ్చిన విందు సందర్భంగా.. భారత్ – పాక్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో తమ పాత్ర లేదని  ట్రంప్ తేల్చి చెప్పారు.  విందు అనంతరం ఓవల్ ఆఫీస్‌లో మునీర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ అసలు నిజం వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ అధినేతలు యుద్ధాన్ని కొనసాగించకూడదని తెలివైన నిర్ణయం తీసుకున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం మంచిది కాదు అని ట్రంప్ పేర్కొన్నారు.ఇలా..  ట్రంప్ కాల్పుల విరమణలో తమ ప్రమేయం లేదని చెప్పడం ఇదే తొలిసారి కావడం విశేషం అంటున్నారు.  దీంతో.. ఇంచుమించుగా నెల రోజులకు పైగా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ  ప్రశ్నిస్తూ వచ్చిన రాహుల్, కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడవలసి వుందని పరిశీలకులు  అంటున్నారు. నిజానికి పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు.. మరీ ముఖ్యంగా, ఆపరేషన్ సింధూర్ పర్యవసానంగా తలెత్తిన ఉద్రిక్తల విషయంగా, అలాగే పాకిస్థాన్ సాగిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడా గట్టేందుకు, ఎంపీ బృందాల వివిధ దేశాలతో జరిపిన దౌత్య పర్యటనల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఒకటొకటిగా తేలిపోతున్ననేపధ్యంలో ట్రంప్  ‘యు’ టర్న్.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అవుతుందని అంటున్నారు.

రాహుల్ జీ బర్త్ డే.. ఇంతకీ ఆయన ఎక్కడ?

కాంగ్రెస్ అధినేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  తన 55వ పుట్టిన రోజు    గురువారం( జూన్ 19) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, ఇండియా కూటమి నాయకులు, వందల వేల మంది రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీని తమ ఆదర్శ సోదరునిగా పేర్కొంటే,  ఖర్గే  రాజ్యంగ పరిరక్షణ కోసం లక్షలాది  గొంతుకలను ఒక్కటై వినిపిస్తున్న నాయకుడిగా రాహుల్ గాంధీని అభివర్ణించారు. అలాగే.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  కె.సి. వేణుగోపాల్  కష్ట కాలంలో భారతదేశానికి అవసరమైన నాయకుడిగా రాహుల్ గాంధీని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీని   నా నాయకుడు  అని సంభోదిస్తూ..  రాహుల్  గాంధీ దేశానికి ఆశాకిరణం  అని ప్రశంసించారు. మరో వంక..  పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పుఅర్కరించుకుని  కాంగ్రెస్ పార్టీ,  ఢిల్లీలోని  తల్కతోరా  స్టేడియం లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 20 వేల మంది నిరుద్యోగ యువత తమపేర్లను నమోదు చేసుకున్నారని  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  జాతీయ యువజన కాంగ్రెస్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో  100 పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయనీ.. ఈ మేళా ద్వారా కనీసం 5000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కుతాయని  జాతీయ యువజన కాంగ్రెస్  అధ్యక్షుడు దేవేందర్ యాదవ్  ప్రకటించారు.  అయితే..  బీజేపీ ఢిల్లీ నాయకులు మాత్రం ఇదొక పొలిటికల జిమ్మిక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ  దేశ రాజదాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశం నుంచి పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందనీ, అందుకే ఏదో విధంగా..  ఉన్నామని చెప్పుకునేందుకు, పార్టీ ఉనికిని కాపాడు కునేందుకు  హస్తం పార్టీ  జిమ్మిక్కులు చేస్తోందని ఆరోపించింది. ఇలాంటి జిమ్మిక్కులతో పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని అనుకుంటే పొరపాటే, అవుతుందని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సామాన్య ఢిల్లీ ఓటర్లే విశ్వసించ లేదు. వరసగా ఆరు (మూడు లోక్ సభ, మూడు అసెంబ్లీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సున్నా సీట్లతో సత్కరించిన విషయాన్ని మరిచిపోరాదని బీజేపీ నాయకులు  గుర్తుచేస్తున్నారు.   మరోవంక సోషల్ మీడియాలో ఓ వంక రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటే,  మరో వంక  రాహుల్ ఎక్కడ? ఏ దేశంలో ఉన్నారు? జార్జి సోరోస్ కుమారుడి వివాహానికి వెళ్ళింది నిజమేనా? అంటూ అంటూ నెటిజనులు  ప్రశ్నిస్తున్నారు. మరి మీ పెళ్లి ఎప్పుడని  సైటర్లు వేస్తున్నారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనల  విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవం రోజున, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో..  ఇలా అనేక  కీలక  సందర్భాల్లో  రాహుల్ గాంధీ తరచూ జరిపే రహస్య  విదేశీ పర్యటనలపైన నెటిజన్లు.. ఎవరికీ తోచిన విధంగా వారు రియాక్ట్ అవుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు. 

గాజర్ల రవి మృతదేహం కోసం సోదరుడి పడిగాపులు.. పోలీసుల తీరుపై ఆగ్రహం

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం (జూన్ 18) జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత గాజర్ల రవి మృతదేహం కోసం ఆయన సోదరుడు, మాజీ నక్సల్ గాజర్ల అశోక్ రంపచోడవరం ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఆయన గాజర్ల రవి మృతదేహాన్ని అప్పగించడం మాట అటుంచి కనీసం చూడడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడంపై అశోక్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే  అదే ఎన్ కౌంటర్ లో మరణించిన అరుణ మృతదేహం కోసం వచ్చిన వారి బంధువులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది.   గాజర్ల రవన్న అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అరుణక్క కుటుంబ సభ్యులు రంపచోడవరంహాస్పిటల్‌ వద్దకు బుధవారం (జూన్ 18) అర్ధరాత్రి చేరుకున్నారు. అప్పటి నుంచీ పడిగాపులు కాస్తున్నా మృతదేహాలను కనీసం చూడనివ్వలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్ కౌంటర్ పైనే అనుమానాలు ఉన్నాయన్నారు. ముందుగానే అదుపులోనికి తీసుకుని చిత్రహింసలకు గురి చేసి ఉంటారనీ.. ఇప్పుడు మృతదేహాలను చూపిస్తే జరిగిందేమిటో తమకు తెలిసిపోతుందన్న భయంతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  

యోగాంధ్రలో పాల్గొని ఫస్ట్రేషన్ తగ్గించుకో .. జగన్ కు మంత్రి అనగాని సలహా

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగాలేక గంజాయి బ్యాచ్ ను,  ఉన్మాదులను, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లను కలుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్  అన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిందన్న ఆయన దానిని తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్రలో పాల్గొనాలని సలహా ఇచ్చారు.  అల్లర్లు సృష్టించడం మాని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి కాస్తయినా మెరుగుపడుతుందన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో  ఫస్ట్రేషన్ లో జగన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారనీ,  చంపేస్తాం, నరికేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీ సైకో బ్యాచ్ చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి చిరునవ్వుతో స్వాగతిస్తున్నారనీ పేర్కొన్నారు. నెలకు ఒక రోజు జనాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తెనాలి వెళ్లి గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారు.. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శిస్తారు.. ఏదేదో మాట్లాడతారు.. ఆయన వల్ల పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతారు అని పేర్కొన్న అనగాలి ఇవన్నీ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లలో కనిపించే లక్షణాలు అన్నారు. ఇలాంటి లక్షణాలు  ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఉండే రోగులకు ఉండే లక్షణాలు అని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో ప్రజా తీర్పుతో  జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే యోగాంధ్రలో పాల్గొంటే ఆయన ఫస్ట్రేషన్ కాస్త అయినా తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

గాజర్ల రవి ఎన్‌కౌంటర్.. ముగిసిన నాలుగు దశాబ్దాల నక్సల్ ప్రస్థానం!

ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టుల కీలక నేత నంబాల కేశవరావు సహా సీనియర్‌ నాయకులను వరుసగా కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు. మరో అగ్ర నాయకురాలు, ఏవోబీ కమిటీ సీనియర్‌ సభ్యురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్‌ అరుణ, మరో నక్సల్‌ అంజూ కూడా ఈ ఘటనలో చనిపోయారు. వీరిలో అరుణ ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు రాంచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి భార్య. ఉమ్మడి ఏపీలో 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టుల బృందంలో గాజర్ల రవి ఒకరు. 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్‌ కగార్‌ను తీవ్రతరం చేసింది. ఒడిశా అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేసింది. దీంతో అక్కడ ఉండటం తమకు క్షేమం కాదని గాజర్ల రవి టీమ్‌ భావించింది. ఆయనతోపాటు యాభైమంది మావోయిస్టులు నెల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించారు. ఏపీ గ్రేహౌండ్స్‌ బలగాలు అల్లూరి జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పుల నుంచి మూడుసార్లు ఉదయ్‌, అరుణ తృటితో తప్పించుకున్నారు. కాకురి పండన్న అలియాస్‌ జగన్‌ కోరాపుట్‌ డీసీఎం రమేశ్‌ ఈ ఘటనల్లో చనిపోయారు. మరోవైపు, కీలక నేతల ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ఈనెల 20న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో గ్రేహౌండ్స్‌ బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. డ్రోన్‌లను ఉపయోగించి ఉదయ్‌ బృందం ఉన్న ప్రాంతాన్ని ఎట్టకేలకు కనిపెట్టాయి. పక్కా వ్యూహంతో మంగళవారం(జూన్ 18) రంగంలోకి దిగాయి. దేవీపట్నం మండల పరిధిలోని ఆకూరు, కొయ్యలగూడెం గ్రామాల సరిహద్దుల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ మొదలుపెట్టాయి. ఈ బలగాలకు బుధవారం ఉదయం మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి సహా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి మూడు ఏకే 47లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాలుగు దశాబ్దాలపాటు గాజర్ల రవి మావోయిస్టు ఉద్యమంలో గణేశ్‌, ఉదయ్‌ పేర్లతో కొనసాగారు. రెండు దశాబ్దాల కాలం పూర్తిగా ఆంధ్రా ఒడిశా బోర్డర్‌... ఏవోబీకి పరిమితమై పనిచేశారు. సైనిక వ్యూహాలు రచించడం, గెరిల్లా యుద్ధ తంత్రంలో రాటుతేలిన ఆయన ఉద్యమ ప్రస్థానం 1980 దశకంలో రాడికల్‌ విద్యార్థి సంఘంతో మొదలైంది. 1990లో పీపుల్స్‌వార్‌ పార్టీలో పూర్తికాల కార్యకర్తగా చేరారు. ఉద్యమంలోనే జిలానీ బేగం అనే మహిళను వివాహం చేసుకోగా, ఆమె ఎన్‌కౌంటరులో మరణించారు. 2004లో అప్పటి ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కార్యదర్శి బాకూరు వెంకటరమణ అలియాస్‌ గణేశ్‌ 2016 అక్టోబరు 24న రామ్‌గూడ ఎన్‌కౌంటరులో మరణించాక, ఆ బాధ్యతలను ఉదయ్‌ తీసుకున్నారు. ఆయనది తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఆయన కుటుంబం నుంచి ముగ్గురు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. వీరిలో పెద్ద అన్నయ్య గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటరులో చనిపోయారు. మరో అన్నయ్య గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు దండకారణ్యంలో పనిచేస్తూ, తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులకు లొంగిపోయారు. గాజర్ల రవిపై తెలంగాణలో రూ.40 లక్షలు, ఏవోబీలో రూ. 25 లక్షల రివార్డు ఉంది. అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిపిన మందుపాతర దాడి ఘటనలో, 76మంది జవాన్లను హత్యచేసిన తాడిమెట్ల ఘటనలో, నదిని దాటుతున్న జవాన్లపై బలిమెలలో దాడిచేసి హత్యచేసిన ఘటనలో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంతో మావోయిస్టులు చర్చ జరిపారు. ఈ చర్చల్లో అప్పట్లో మావోయిస్టు పార్టీ నాయకులు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ, చలం అలియాస్‌ సుధాకర్‌, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, జనశక్తి పార్టీ నాయకులు రియాజ్‌, దేవేందర్‌ అలియాస్‌ అమర్‌ పాల్గొన్నారు. ఆ బృందంలో ఇప్పుడు అమర్‌ ఒక్కరే మిగిలారు. గాజర్ల రవి ఎన్‌కౌంటర్‌తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ ఉద్యమానికి ఊతమిచ్చిన వెలిశాల.. నేడు శోకసంద్రంలో మునిగింది. గాజర్ల రవి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగారు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి అంచెలంచెలుగా ఎదిగారు. దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు.  గాజర్ల రవి కుటుంబంలోని నలుగురు సోదరుల్లో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దవాడైన సమ్మయ్య సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. ఆయనపై కూడా మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ముద్రవేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మిగతా ముగ్గురు అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్.. 35 ఏళ్లకు పైగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా అజ్ఞాతంలోనే ఉండి అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. పోరుబాట వీడి కొంతకాలం పాటు మీడియాలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

అంబటిపై కేసు నమోదు

మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.  బుధవారం (జూన్ 18) జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సత్తెన పల్లి పోలీసులు అంబటిపై  కేసు నమోదైంది.  వివరాల్లోకి వెడితే  జగన్  పర్యటన సందర్భంగా  పల్నాడు  సరిహద్దులో పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. అలాగే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో  వైసీపీ వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కంటేపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్న సందర్భంలో.. అదే మార్గంలో వచ్చిన  మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన వాహనంలో నుంచి దిగి బారీకేడ్లను తొలగించాలని పోలీసులతో  ఘర్షణకు దిగారు.  పోలీసులు బారికేడ్లను తొలగించేది లేదని స్పష్టం చేయడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టివేశారు. ఆ సందర్భంగా ఆయన చాలా దురుసుగా వ్యవహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీసులతో తోపులాటకు దిగిన అంబటి..  ఆ క్రమంలో ఓ పోలీసును గాయపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.  ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు 188,332, 353, 427 సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.  

వైసీపీ నాయకులు ఏరీ?.. ఎక్కడ?

ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే వైసీపీ కంచుకోట అనేలా గత ఐదు సంవత్సరాలు  పాలన సాగించారు. ఓవైపు పెద్దిరెడ్డి, ద్వారకానాథ రెడ్డి, మిథున్ రెడ్డి,  మరో వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, ఇంకో వైపు కరుణాకర్ రెడ్డి ఇలా ఒక్కరేమిటి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే లు, వైసీపీ కీలక నాయకులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అలాంటి నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అరాచశక్తుల అరెస్టుల పై నోరు మెదపడం లేదు.  ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గా ఎన్నికై ఆ తరువాత వెనక్కి ఇచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నోరేసుకుని ముందు వరసలో నిలబడే మాజీ మంత్రి రోజా, దొంగ ఓట్లు నమోదు చేయించడంలో  సిద్దహస్తుడైన ప్రస్తుత ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. గడిచిన రోజుల్లో భూకబ్జాలు,  మఠం భూముల స్వాహాపై పెద్దిరెడ్డి పై వచ్చిన ఆరోపణలు,  మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర పై ఆరోపణలు, ఇక తాజాగా అరెస్టు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా జిల్లా నేతలే అయినా నోరెత్తి మాట్లాడేందుకు వైసీపీ నేతలకు ధైర్యం చాలడం లేదు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎన్నికైన వారు సైతం అప్పుడో.. ఇప్పుడో ప్రెస్ మీట్లు పెట్టి నాలుగేళ్ల తరువాత తాము అధికారంలోకి వస్తాం, అంతుచూస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారు తప్ప, తమ వారు చేసింది కరెక్టేనన్న మాట చెప్పడానికి వారికి నోరు రావడం లేదు దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు గత ప్రభుత్వ హయాంలో  అక్రమాలకు పాల్పడ్డారు కనునకే ఇప్పుడు వారికి తగిన శాస్తి జరుగుతోంది. వారికి   శిక్ష పడాలి అంటూ  బాహాటంగానే చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు, క్యాడర్  మాత్రం కలుగులో దాక్కున్నట్లుగా మనదాకా రాకుంటే బాగుండును అనుకుంటూ మౌనంగా ఉంటున్నారు.  

కోర్టులో వీగిపోయిన చెవిరెడ్డి వాదనలు.. రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలుకు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి జూన్ 1 వరకూ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం (జూన్ 18) ఉత్తర్వులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు.  ఈ కేసులో చెవిరెడ్డితో పాటుగా  సన్నిహిత సహచరుడువెంకటేశ్ నాయుడికి కూడా కోర్టు రిమాండ్ విధించింది.  మద్యం కుంభకోణం కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ముందుగానే ఆరోపణలు గుప్పించి తప్పించుకోవాలనుకున్న చెవిరెడ్డి అది కుదరకపోయేసరికి చేసిన సవాళ్లన్నిటినీ మరిచిపోయి ఎవరికీ తెలియకుండా బెంగళనూరు నుంచి శ్రీలంక చెక్కేయడానికి పక్కా ప్లాన్ తో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రణాళిక ఫలించలేదు. చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సిట్ కు సమాచారం అందించారు. దీంతో సిట్ అధికారులు విజయవాడ నుంచి హుటాహుటిన బెంగళూరు చేరుకుని చెవిరెడ్డిని అదుపులోనికి తీసుకుని బుధవారం (జూన్ 18) కోర్టులో హాజరు పరిచారు. సిట్ అధికారులు బెజవాడ చేరుకునే వరకూ చెవిరెడ్డి బెంగళూరులో ఇమ్మిగ్రేషన్ అధికారులు తన అధీనంలోనే ఉంచుకున్నారు.   బుధవారం (జూన్ 18) ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెవిరెడ్డిని విచారించి సిట్ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకు ముందు బెంగళూరులో చెవిరెడ్డి తనదైన వాదనా పటిమతో ఇమ్మిగ్రేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో తనపై ఎఫ్ఐఆర్ లేకుండానే ఎలా లుక్ ఔట్ నోటీసులు జారీ చేస్తారంటూ ఆయన ఇమ్మిగ్రేషన్ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం స్వయంగా న్యాయవాది అయిన చెవిరెడ్డి తన తరఫున తానే వాదించుకున్నారు.  తన పై ఎఫ్ఐఆర్ లేకుండానే లుక్ ఔట్ నోటీసు ఎలా జారీ చేస్తారనీ, రిమాండ్ రిపోర్టులో తాను చెప్పని విషయాలను సిట్ నమోదు చేసిందంటూ ఆయన కోర్టు ముందు వాదించినట్లు తెలుస్తోంది.  ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తాననీ, తనను అన్యాయంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికిస్తున్నారంటూ ఆయన కోర్టులో పేర్కొన్నారు. అయితే సిట్ అధికారులు ఆయన దేశం విడిచి పరారయ్యేందుకు ప్రయత్నించారంటూ కోర్టుకు తెలపడంతో పాటు.. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి పాత్ర కీలకమనీ, రెండు నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకూ ఆయన మద్యం కుంభకోణం ముడుపులను ఎన్నికలలో వినియోగించారి కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న మీదట కోర్టు చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జులై 1 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చెవిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇదే జైలులో ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్టైన నిందితులు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు పూర్తియినా కూడా తిరుమలేశుని దర్శనానికి జనం  రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు. వారాంతం సమీపిస్తుండటంతో ఈ రద్దీ రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉంది. గురువారం (జూన్ 19) ఉదయం శ్రీవారి దర్వనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శ్రీకృష్ణ తేజ గెస్ట్ హౌస్  వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (జూన్ 18) శ్రీవారిని మొత్తం 80 వేల 44 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల687 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది. 

దుమారం రేపుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు..!

  అనంతపురం జిల్లా  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. మొదటినుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్ వంటి వారు తరచూ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమను అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తోందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.  తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణుల అంతు చూస్తామని, ఇప్పటినుంచే జైళ్లు రిపేరు చేయించకోవాలని వైసీపీ నేతలు పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది చేతగానితనం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వైసీపీ నేతల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నా రన్నారు. మీకు నాలుగేళ్ల సమయం కావాలేమో.. మేము ఇప్పుడే ఉతికితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడితే చితక్కొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  టీడీపీ కార్యకర్తల వైపు కాకుండా.. వైసీపీ వైపే చంద్రబాబు ఉన్నారన్నారు. కాబట్టే వారు చెలరేగిపోతున్నారన్నారు.   వారు ఇలాగే మాట్లాడితే  చితగ్గొట్టాలన్నారు. లైన్ దాటి బహిరంగంగా ఆయన అలా పిలుపునివ్వడం, బూతు పదజాలంతో విరుచుకుపడడం, తమ అధినేతకు సైతం పరోక్షంగా చురకలంటించడం వివాదాస్పదంగా మారాయి.