ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అండ్ కోకి.. రప్పా రప్పా మొద‌లైన‌ట్టేనా?

  ట్యాపింగ్ వ్య‌వ‌హారం  కేసీఆర్ అండ్ కోని మ‌రింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్ర‌ణీత్ రావును విచారించింది సిట్. ఆరు వంద‌ల మంది ప్రొఫైల్స్ ఎలా త‌యారు చేశారు. వారి  ఫోన్లు విని ఏం చేశారు? ఆ స‌మాచారం ఎక్క‌డికి చేర‌వేసేవారు?లాంటి ప్ర‌శ్న‌ల‌తో ప‌లు వివ‌రాల‌ను సేక‌రించారు. అయితే వీటితో సోమ‌వారం ప్ర‌భాక‌ర్ రావును మ‌రింత‌గా విచారించ‌నున్నారు. ప్ర‌భాక‌ర్ రావు నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం  రాబ‌ట్టాల్సి ఉందో వాటికి అవ‌స‌ర‌మైన ప్ర‌శ్న‌లు వేసి ప్ర‌ణీత్ నుంచి స‌మాధానాలు రాబ‌ట్టారు అధికారులు. మావోయిస్టుల‌తో సంబంధం లేక పోయిన వారిని  కూడా ఈ కోవ‌లోకి ఎలా తెచ్చారు? అందుకు మీరు పాటించిన ప్ర‌మాణికాలేంట‌ని  కూడా  ప్ర‌శ్నించారు. మొత్తానికి ఐద‌వ సారి సిట్ అధికారుల ముందు హాజ‌రైన ప్ర‌ణీత్ రావును ఐదు గంట‌ల మేర  ప్ర‌శ్నించారు.  ప్ర‌ణీత్ ఇచ్చిన స‌మాధానాల‌ను అనుస‌రించి ప్ర‌భాక‌ర్ రావును సోమ‌వంరం ప్ర‌శ్నించ‌నున్నారు. రివ్యూ క‌మిటీ ఆమోదం, త‌న‌పై ఉన్న ఇత‌ర ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కే తాను ప‌ని చేశాన‌ని అన్నారు ప్ర‌భాక‌ర‌రావు, దీంతో నాటి రివ్యూ క‌మిటీ అధికారుల వివ‌రాలు కూడా బ‌య‌ట‌కు లాగి త‌ద్వారా వారిని కూడా విచారించ‌నుంది సిట్. ఇప్ప‌టికే 15 మంది బాధితుల‌ను విచారించిన సిట్.. ఆపై వారి నుంచి తీసుకున్న వివ‌రాల‌తోనూ ప్ర‌భాక‌ర్ రావును విచారించ‌నుంది. గ‌త పాల‌కుల ఆదేశాల మేరకే ప్ర‌భాక‌ర్ రావు ఇదంతా చేసిన‌ట్టు చెబుతున్నా.. కేసీఆర్ కి ఇంకా నోటీసులు ఎందుకివ్వ‌లేదో చెప్పాల‌ని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మ‌క్క‌య్యింద‌ని ఇక్క‌డే మీకు అర్ధం కావ‌డం లేదా? అని  ప్ర‌శ్నించారాయ‌న‌.  మొద‌ట ప్ర‌భాక‌ర్ రావుకు ఇచ్చే ఆ రాచ‌మ‌ర్యాద‌ల‌ను త‌గ్గించాల‌ని  కూడా  డిమాండ్ చేశారాయ‌న‌.  

వివేకా హత్యకేసు నిందితుడు పోలీసులకు ఫిర్యాదు...చంపాలని చూస్తున్నారు

  కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ  ఫిర్యాదు మేరకు  సునీల్ యాదవ్ పెళ్లి రోజు కావడంతో క్రిష్ణుడి గుడికి వెళ్లి  అక్కడి నుంచి తన వాహనంలో ఇంటికి వస్తున్న సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులైన లోకేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్ (వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ )లతోపాటు మరో ఇరువురు వాహనంలో వెంబడించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తన వాహనం ముందు వెళ్తుంటే దాన్ని అనుసరిస్తూ మరో వాహనం వస్తూ ఉండడం గమనించానని తెలిపారు .ఈ వాహనంలో లోకేశ్వర్ రెడ్డి పవన్ కుమార్ ల ను గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు.  తనకు ప్రాణం ఉందని పులివెందుల అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే హత్య సినిమాకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది .ఆ సమయంలో పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారించారు. గతంలో కూడా తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా  జరిగిన సంఘటన నేపథ్యంలో మరో సారి తనకు ప్రాణహాని  ఉందని సునీల్ యాదవ్  ఫిర్యాదు చేశారు .ఈ ఫిర్యాదు పై పోలీసులు విచారణలో చేయనున్నట్లు సమాచారం.

ఆ స్థలం అహోబిలం మఠందే

  నెల్లూరు రూరల్ పరిధి పరిధిలోని కనుపర్తిపాడు గ్రామం 295 సర్వే నెంబర్ 1.80 ఎకరాల స్థలానికి సంబంధించి తమకు 1869 నుంచి హక్కులు ఉన్నాయని అహోబిలం మఠం కార్యదర్శి కేసి వరదరాజన్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి తాము ప్రతి ఏడాది  కిస్తీలు కూడా చెల్లించామన్నారు.  2007 సంవత్సరంలో ఈ పొలం అన్యాక్రాంతమైందని తర్వాత ఆదాల కుటుంబ సభ్యుల చేతికి వెళ్లిందన్నారు. ఈ భూమి అహోబిలం పీఠం సంబంధించి నరసింహ స్వామికి చెందినది. దీనిపై మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి చుట్టూ అనేకసార్లు తిరిగినా న్యాయం చేయలేదన్నారు. రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారించి పీఠానికి అన్ని హక్కులు ఉన్నాయని తేల్చారన్నారు. నరసింహ స్వామి భూమి ఆయనకే దక్కాలన్నారు.  

తెలంగాణలో స్థానిక ఎన్నికలు.. ఇప్పట్లో లేనట్లే ?

    ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇక ఇప్పట్లో లేనట్లేనా ? అంటే, అంతే అంటున్నారు, విశ్లేషకులు. ఏదో జరగరానిది జరిగితే ఏమో కానీ, లేదంటే, స్థానిక ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి స్థానిక సంస్థల గడవు ముగిసి ఇంచుమించుగా సంవత్సరం పైనే అయింది. రాష్ట్రంలో2019లో చివరిసారిగా, విడతల వారీగా, మూడు నాలుగు నెలలు పాటు స్థానిక సంస్థల ఎన్నికలు  జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌ల పదవీకాలం గత సంవత్సరం (2024) ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. అలాగే,ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం జూలై 3న, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్ల పదవీకాలం అదే సంవత్సరం జూలై 4న ముగిసింది.  మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం గత ఆగష్టులో ముగిసింది ఇక అప్పటి నుంచి పంచాయతీ మొదలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల వరకు స్థానిక సంస్థలో, ప్రజా పాలన స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఈనేపధ్యంలో,గత ఫిబ్రవరి నుంచి, ప్రభుత్వం, త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెపుతూ వస్తోంది.అయితే, తాజా పరిణామాలు, మంత్రులు, పార్టీ పెద్దలు చేస్తున్న పరస్పర విరుద్ద  ప్రకటనలను గమనిస్తే,స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంలో ప్రభుత్వానికి, పార్టీకి కూడా క్లారిటీ లేనట్లుందని అంటున్నారు. అంతేకాదు, కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మెడ మీద కత్తి పెడితే తప్పించి, ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి మాత్రం లేదని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలోను అర్బన్ లోకల్ బాడీ    ఎన్నికలు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్నాయి, చివరకు,మే 2025 చివరకి కల్లా ఎన్నికలు నిర్వహిస్తామని కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన గడవు ముగిసినా,ఇంతవరకు ఎన్నికల ఉలుకూ పలుకూ లేదని,అంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలోనూ,అదే పరిస్థితి కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి ఒకవారం పది రోజుల క్రితం వరకు కూడా, కాంగ్రెస్ వర్గాలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో స్థానిక ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది.ముఖ్యంగా, ఈ నెలాఖరులోగా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన ప్రకటన స్థానిక నేతల్లో జోష్’ పెంచింది.   అయితే కోర్టులో ఉన్న అంశాన్ని తనకు సంబంధం లేని శాఖపై ప్రకటన ఎలా చేస్తారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మంత్రి పొంగులేటిని మందలించినట్లు వార్తలు వచ్చినందున క్రింది స్థాయి నేతల ఉత్సాహం ఒక్కసారిగా చల్లబడి పోయింది.ఎన్నికల నిర్వహణ సందిగ్దంలో పడింది. అంతే కాకుండా, పీసీసీ చీఫ్, తాజాగా, న్యాయస్థానం తీర్పు  తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, స్పష్టం చేశారు. అంటే, ఇప్పట్లో స్థానికం లేదని చెప్పకనే చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం ప్రకటిస్తూ చట్టబద్దత కోసం కేంద్రానికి పంపింది.దీంతో బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ అన్నిటినీ మించి, సర్వేలు, ఇంటెల్జెన్సీ నివేదికలు, ప్రభుతాన్ని,అధికార పార్టీని భయపెడుతున్నాయని అంటున్నారు.ఈ నేపధ్యంలో, స్థానిక సంస్థలఎన్నికలు,ఇప్పట్లో లేనట్లే, అంటున్నారు.

ఫోన్ ట్యాపింగ్ మెగా సీరియల్లో మరో ట్విస్ట్!

తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త కథలు, కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు తొంగి చూస్తున్నాయి. ఈ వ్యవహారం పై విచారణ జరుపుతున్న ప్రత్యేక  దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  తమ ఫోన్లు ట్యాప్  అయ్యాయని అప్పట్లో ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి మనీ వాగ్మూలాలు నమోదు  చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే  పీసీసీ అధ్యక్షడు మహేష్ కుమార్ గౌడ్ సహా అనేక మంది నాయకులను, నాయకుల అనుచరులను, ఇతరులను విచారించింది. వాంగ్మూలాలు నమోదు చేసింది.  ఇప్పుడు తాజాగా, గతంలో తన ఫోన్ ట్యాప్  అయినట్లు ఫిర్యాదు చేసిన  బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను వాగ్మూలం ఇవ్వాలని సిట్  కోరింది. రెండు మూడు రోజుల్లో  సిట్ ఎదుట హాజరై  వాగ్మూలం ఇచ్చేందుకు బండి సంజయ్ కుమార్ అంగీకరించారు. బండి సంజయ్ తో పాటుగా  ఆయన సన్నిహిత సహచరుడు, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ కన్వీనర్  ప్రవీణ్ రావుకు  కూడా సిట్ స్వాగతం పలికింది.  నిజానికి..  ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ క్రైమ్. అందులో సందేహం లేదు. అలాంటిది  ఒకే రోజున అది కూడా, 2023 ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ రోజున  మావోయిస్టులుగా  ముద్ర వేసి మరీ 600 మంది ఫోన్లను ట్యాపింగ్ జరిగిందే నిజం అయితే, గత బీఆర్ఎస్  ప్రభుత్వం  చాలా పెద్ద నేరానికి పాల్పడిందని, అందుకు గట్టి మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అంటున్నారు.  అయితే.. ఈ కేసులో ముడి పడిన చిక్కు ముళ్ళు అన్నీ తొలిగి, కేసు విచారణ పూర్తయ్యేందుకు ఎంత సమయం  పడుతుందో.. అసలు కేసు ఏనాటికి అయినా ఒక కొలిక్కి వస్తుందో రాదో చెప్పలేమనీ..  చెప్పాలను కోవడం సాహసమే అవుతుందనీ పదవీ విరమణ చేసిన సీనియర్  అధికారులు, న్యాయనిపుణులు  అభిప్రాయ పడుతున్నారు.  మరోవంక కేసు విచారణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజానికి  ఫోన్ ట్యాపింగ్ చాలా  పెద్ద నేరం. అధికార, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సినిమా స్టార్లు, సెలబ్రిటీలు చివరకు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే.. (చేసిందే నిజమైతే) నిజంగా అది  మహా పెద్ద నేరం.  అయితే..  కేసు విచారణ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు తోచడం లేదని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు,స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు  ఫోన్ ట్యాపింగ్  మెగా సీరియల్  రన్  చేస్తున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు.  అదలా ఉంటే.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ప్రధాన సూత్రం దారులు, పాత్ర దారులు, నేరాన్ని అవతలి వారిపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇంతవరకు మూడు నాలుగు పర్యాయాలు సిట్ ఎదుట విచారణకు హాజరైన  ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర రావు తాజా విచారణలో కొత్త పల్లవి ఎత్తుకున్నట్లు సమాచారం.ఇంతవరకు ఆకుకు అందకుండా పోకకు చిక్కకుండా..  పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ప్రభాకర రావు, ఇప్పడు తాజాగా అంతా ఆయనే చేశారు, ఆయన చెప్పిందే నేను చేశాను, ఆయన చెప్పిన ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశాను అంటూ మొత్తం నేరాన్ని అప్పటి డీజీపీ పైకి నెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అప్పటి రాజకీయ ముఖ్యులు ఎవరూ తనకు ప్రత్యక్షంగా ఆదేశాలు, సూచనలు ఇవ్వలేదని కూడా  ప్రభాకర రావు సిట్ కు చెప్పినట్లు సమాచారం.   కాగా ఈకేసులో ఇప్పటికే  సిట్ కు వాగ్మూలం ఇచ్చిన  ఇతర నిందితులు ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకృష్ణ రావు, తిరుపతన్న ప్రభాకరరావు చెప్పినట్లే తాము పని చేశామని తమ తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇప్పడు అదే ప్రభాకర రావు డీజీపీ వైపు వేలు చూపిస్తున్నారు,. రేపు డీజీపీ  ఎవరి  వైపు వేలు చూపుతారు ..ఏమి జరుగుతుంది .. చూడాల్సింది చాలానే వుంది . చూస్తూనే ఉందాం.

తొలి టెస్టులో భారత్ ఆలౌట్..ఇంగ్లండ్‌ ఎదుట భారీ స్కోర్

  ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. జైస్వాల్‌ (101), కేఎల్‌ రాహుల్‌ (42), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) పరుగులు చేయగా..ఏడేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (11), శార్దూల్ ఠాకూర్ (1) నిరాశపర్చారు.  ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్‌ స్టోక్స్ 4, జోష్ టంగ్ 4, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్‌ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  

రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి : సీపీఐ నారాయణ

  బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు. బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందు హంద్రీనీవా, వంశీధర లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాని ఆయన తెలిపారు. వెనకబడిన ప్రాంతాలకు నీరు అందేలా కృషి చేయాలని అన్నారు. ఎవరికీ నష్టం లేకుండా ప్రభుత్వాలు చూడాలని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రం సహాయం తీసుకోవాలని ఆయన తెలిపారు.  కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నారాయణ ఆరొపించారు.రాష్ట్రాలు రెండుగా విడిపోయాయిన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు శత్రువులు కాదని ఆయన హితవు పలికారు. ఎవరికి నష్టం లేని పద్ధతిలో పరిష్కారం చేసుకుంటే మంచిదని పేర్కొన్నారు.ఈనెల 23న తెలంగాణ క్యాబినేట్ సమావేశం ఉంది. అందులో చర్చించి, ఆ తర్వాత నేనే ఒకడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్‌ (పీఎ్‌ఫఆర్‌) ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పీఎ్‌ఫఆర్‌ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదని నారాయణ తెలిపారు.  

ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం

  తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం  ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఖరీఫ్ సీజన్ అవసరాల నిమిత్తం నీటి విడుదలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో ఇరు రాష్ట్రాల వాటాలు, ప్రాజెక్టులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలు పోను సాగునీటికి ఎంత కేటాయించాలనే అంశాలపై అధికారులు కూలంకషంగా చర్చించనున్నారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. రెండు రాష్ట్రాల అధికారులు తమ తమ రాష్ట్రాల అవసరాలు, డిమాండ్లను ఈ సమావేశంలో బోర్డు ముందు ఉంచనున్నారు. ఇన్సెంటివ్‌ క్యాన్సిల్ చేయడంతోపాటు రికవరీ చేయాలని కృష్ణా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బోర్డు ఉద్యోగులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని 2023లో హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌పై చర్చించేందుకు 20వ స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు.   

ప్యూర్ ముర్రా బ్రీడ్ సేవలో ABC సెమన్ బ్యాంక్... పశుసంపద పెంపులో అవిరళ కృషి..!

  పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి. కనీస రవాణాకు ఇబ్బంది ఉండదు. 1970 వరకు రైతు భారతానిది ఇదే పరిస్థితి. ఆహ్లాదభరిత వాతావరణంలో మంచి పశువులు, దృఢంగా, ఆరోగ్యంగా చక్కటి పాడినిచ్చేవి. హరిత విప్లవం దుష్ప్రభావాల ఫలితంగా... దేశీ గేదెలు, ఆవుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది, ఈ నేపథ్యంలో సగటున 20 నుంచి 25 లీటర్ల దిగుబడితో భారత పాల అవసరాలను తీరుస్తోంది... ముర్రా బ్రీడ్  మాత్రమే! ఈ విషయాన్ని గ్రహించిన ఆదర్శపోషకుల్లో ఒకరు... రాజీవ్ చిలకపాటి. లండన్ లో మాస్టర్స్ చేసిన ఈ రైతు బిడ్డ... స్వదేశానికొచ్చాక తన ఆశయంపై దృష్టిపెట్టారు. వ్యవసాయంపై మక్కువ... ఆవులు, గేదెలు, కోళ్లపై అలవిమాలిన ఆసక్తితో దేశమంతా తిరిగారు.  ఏటికేటికీ అంతరించిపోతున్న మేలుజాతి పశుసంపదను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. లక్ష్య సాధనలో భాగంగా ABC మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో వ్యయప్రయాసలకోర్చి అధిక పాలచార కలిగిన ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేశారు. ABC సెమెన్ స్టేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ గా...నాణ్యతలో రాజీ పడకుండా అత్యుతన్నత ప్రమాణాలతో ల్యాబ్ ను నెలకొల్పారు. నాలుగు ఎకరాల్లో అధిక పాల చారనిచ్చే ఉత్తమమైన ముర్రా దున్నపోతులతో... పశుసంపద వృద్ధి, జన్యు మెరుగుదలపై దృష్టిపెట్టారు. నియంత్రిత పర్యావరణంలో ఉన్న ABC సెమన్ స్టేషన్ చూడాలంటే మాత్రం ... ముందస్తు అనుమతి తీసుకోవాలి.  సందర్శకులు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతీ విభాగంలో వెటర్నరీ టెక్నిషియన్స్ సూచించిన విధంగా బయోసెక్యూరిటి ప్రోటోకాల్స్ పాటించాలి. ప్రవేశం ద్వారం నుంచి ప్రవేశించేటప్పుడే సంపూర్ణంగా శానిటైజ్ చేసుకోవాలి. ఒక విభాగం నుంచి ఇంకో విభాగానికి మారేటప్పుడు శానిటైజ్డ్ చేసిన యాప్రాన్స్, మాస్క్, హెడ్ క్యాప్ ధరించాలి. ఎక్కడి చెప్పులు అక్కడే విడిచిపెట్టాలి. నాలుగు ఎకరాల ఈ సువిశాల ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యంలో సందర్శకులు అడుగడుగునా మానిటరింగ్ చేయబడతారు. అధిక వంశపారంపర్యం గల వీర్యం ఉత్పత్తి చేసే వ్యవస్థ కావడం వల్ల... సమర్థవంతమైన నిర్వహణ విషయంలో  రాజీవ్... ఎక్కడా రాజీపడకపోవడం వారి నిబద్ధతకు తార్కాణం  అధికపాడి, లైంగిక, జన్యుపరమైన వ్యాధుల్లేని ప్రీమియర్ ముర్రా బ్రీడ్ ను అభివృద్ధి చేయడం ABC సెమన్ స్టేషన్ ముఖ్య ఉద్దేశం. ABC ఫ్రోజెన్ సెమన్ స్ట్రాస్ తయారయ్యే క్రమంలో... ప్యూర్ ముర్రా దున్నల నుంచి సేకరించిన వీర్యాన్ని..?అనేక కఠిన పరీక్షలు చేస్తారు. నాణ్యత నియంత్రణ చర్యల ద్వారా బాక్టీరియా రహిత వాతావరణంలో వీర్యాన్ని ప్రాసెస్ చేస్తారు. ఫ్రెంచ్ మినీ స్ట్రాలో 0.25 ఎమ్.ఎల్. నిక్కచ్చిగా ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత అల్ట్రాసోనిక్‌ సీలు చేసి, ఇంక్‌జెట్ ముద్రిస్తారు. ఒక్కో స్ట్రాలో దాదాపు 2 కోట్ల వీర్యకణాలుంటాయి. ఈ స్ట్రాస్ ని డ్రీప్ ఫ్రీజ్ లో నిల్వ చేస్తారు. నిర్ణీత కాలం తర్వాత లిక్విడ్ నైట్రోజన్ క్యానుల్లో భద్రపరిచి... దేశవ్యాప్తంగా పాడి రైతులకు పంపిణీ చేస్తారు  గేదెల నుంచి వచ్చే పేడను ఎప్పటికప్పడు మిని ట్రాక్టర్ పడ్లర్ తో నెట్టేస్తారు. ఆ వ్యర్థాన్ని కూలీలు దూరంగా పోగేస్తారు. పశువుల కడిగిన నీళ్లు, మూత్రాన్ని... ఓ పెద్ద బావిలో సేకరిస్తారు. ఆ నీటిని తమ పశుగ్రాస క్షేత్రాలకు పారిస్తుంటారు. అలా సహజంగా పండించిన గ్రాసాలు, దాణాల మిశ్రమాన్నే మేపడం వల్ల కాబోలు దూడల నుంచి గేదెల వరకు అన్ని చలాకీగా కనిపిస్తుంటాయి. ఈ డెయిరీ చూసిన పాడిరైతులు ఎవరైనా సరే... నాలుగు బ్రీడ్ దూడలో, పడ్డలో మన పాకలో కూడా ఉంటే బాగుండనేలా ప్రభావితం చేస్తుంది రాజీవ్ డెయిరీ. ఇంతలా తోటి పోషకులను ప్రభావితం చేస్తున్న ఈ వ్యవస్థ నిర్మాణంలో రాజీవ్...సుదీర్ఘ ప్రణాళిక, క్రమశిక్షణ, కృషి... శ్లాఘనీయం! ఉత్తరాది ఆదర్శ రైతులను సైతం దక్షిణాదికి రప్పించిన ఆయన నైపుణ్యశైలి... హర్షణీయం మొత్తంగా పాడి రైతు ఆర్థికాభివృద్ధికి అవిరళ కృషిచేస్తున్న రాజీవ్ సంకల్పం... అభినందనీయం...! VEERAVALLI -521 110, KRISHNA DISTRICT, A.P. STATE WWW.abcsemenstation.com +91 96667 61111 + 91 98666 71111 info@abcsemenstation.com  abc_ap_in@gmail.com

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక ఆదేశాలు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్,  రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన.  ఐవోసీసీ అడిటింగ్‌లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్‌ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది.   అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్‌ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్టు  నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. ఈ దుర్ఘటలో మొత్తం 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను అధికారులు గుర్తిస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.

ప్రజల సహకారంతో యోగాంధ్ర విజయవంతం : సీఎం చంద్రబాబు

  ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాల సహకారంతోనే కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్‌కు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ప్రజల సహాకారంతోనే యోగాంధ్రను విజయవంతం చేశామని అందుకు ప్రకృతి కూడా సహరించిందని తెలిపారు.  సూర్య నమస్కారాతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని.. యోగాంధ్ర సూపర్ హిట్ అయిందని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు. యోగా అందరికీ అవసరం అనే భావన తీసుకొచ్చింది మోడీనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్‌ తీసుకొస్తామని.. యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యానికి యోగానే గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు.యోగాంధ్ర' కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజల డబ్బు వృథా చేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. "ఇలాంటి భూతాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తాం" అని చంద్రబాబు తెలిపారు. విశాఖకు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. మంచి పని చేస్తే ఇక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యనించారు. యోగా డే వేడులకు ఒక్క పిలపునిస్తే.. లక్షల్లో జనం తరలివచ్చారని అన్నారు. విశాఖ ప్రజలది పాజిటివ్ థింకింగ్ అని.. సమైక్యతా భావం ఎక్కువని కితాబిచ్చారు. 

కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని తీన్మార్ మల్లన్న నిరసన

  హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ  కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు. కేబీఆర్ పార్కు పేరును తొలగించి వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే.. ఆ పని మేమే చేస్తామని డిమాండ్ చేశారు.  వెంటనే కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని  కూడా పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తెలంగాణలోని బీసీ సంఘాలు సైతం పేరు మార్పు చేయాలని కోరుతున్నారని తీన్మార్ మల్లన్న అన్నారు.  బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లెయిన్‌తో పెకిలించి అవతల పడేసి జయశంకర్ సార్ విగ్రహం పెడతామని మల్లన్న తెలిపారు.  

హరీష్ రావు సభలో రప్పా రప్పా ప్లకార్డులు

  సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు. కాగా మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యాటనలోనూ ఓ యువకుడు ఇదే డైలాగ్‌తో ప్లకార్డులు ప్రదర్శించిగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల రాజకీయల్లో పుష్ప డైలాగ్ కాక రేపుతోంది.  పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్  పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించాయి. 2029లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే గంగ‌మ్మ జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు  ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం ఒక్కొక్క‌డినీ! పొట్టేళ్ల‌ను న‌రికిన‌ట్టు న‌రుకుతాం’ అని రాసిన ఫ్లెక్సీల‌ను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగును వైఎస్ జగన్  సమర్ధించడంతో ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు

  ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా జులై1 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సిట్ కు సమాచారం అందించారు. దీంతో సిట్ అధికారులు విజయవాడ నుంచి హుటాహుటిన బెంగళూరు చేరుకుని చెవిరెడ్డిని అదుపులోనికి తీసుకుని జూన్ 18 కోర్టులో హాజరు పరిచారు.  

వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై స్పెషల్ స్టోరీ

   వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి. గురువారం రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానంలో నిర్వహించిన రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు విశ్వ ప్రచారం చేస్తున్నారని అవేవీ నమ్మకూడదని పదవి ఎక్కడికి పోదు అని మా వెనకాల రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పరకాల నియోజకవర్గంలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని ఎన్నికలప్పుడు వచ్చి ఒకసారి గెలిపించాలని  కాలు పట్టుకున్నాడని మళ్లీ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని వదిలేస్తానని మాట ఇచ్చాడని గుర్తు చేశారు.. పరకాల నియోజకవర్గం నుంచి త్వరలోనే తన కూతురు కొండ సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశం చేస్తారని అన్నారు. మరో సొంత పార్టీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఆయన కనుబొమ్మలు గీసుకుంటాడని ఎన్కౌంటర్లో స్పెషలిస్ట్ అని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ కేటీఆర్‌ను  వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని,అతనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు.  కొండమురళి లెక్క మీకు ఇజ్జతి మానవత్వం  ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాలు విసిరారు.. మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. వరంగల్ జిల్లాలో మొదటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొండ మురళి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేది.. ఒకరికొకరు మీడియా సమావేశంలో కూడా తిట్టుకునేవారు.. కొండ మురళి కుటుంబ సభ్యులంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఆ విధంగా ఆది నుంచి ఇప్పటివరకు వీధి మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి లపై మాజీ ఎమ్మెల్సీ కొండమురళి ఈ విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో కొండ మురళి టార్గెట్ మారిందా అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  గత కొద్ది రోజుల నుండి మంత్రి కొండా సురేఖ పదవి పోతుందని మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది.. అప్పటినుండి మంత్రి కొండ సురేఖ పైన సోషల్ మీడియాలో పలు సంఘటనలు సంబంధించి ప్రచారం చేయడంతో పాటు అది కొద్ది రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది..మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గన్మెన్లను తొలగించడంతోపాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కి ఎస్కార్ట్ గా వచ్చిన ఏసిపి సీఐలకు మెమోలు జారీ చేసిన ఘటనలు చూస్తుంటే ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంనికి గురిచేస్తుంది.. వీటన్నిటిని గమనించిన కొండ మురళి ఈ విధంగా మాట్లాడారని కొండ మురళి అనుచరులు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండ సురేఖ పదవి తప్పించేందుకు టిడిపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర లాబింగ్ చేస్తున్నారని వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం అందుకుంది  వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ పై కూడా కొండ మురళి హాట్ కామెంట్ చేశారు... తనకు ఎస్కార్ట్ గా వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోవర్టుల పైన పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. వరంగల్ తూర్పులో తను ఉన్నంతకాలం రెండో లీడరు రాలేడు అని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను కూడా ఉద్దేశించి మాట్లాడారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే కక్షగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కగార్ ఆపరేషన్ ను ఆపేయాలని అంటే పోలీసులు అడ్డుకున్నా రన్నారు. ఇప్పుడు జిల్లాకు చెందిన బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయ్యారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల్లో ఉంటానని ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబం లక్ష్యమని ధైర్యంలో తాను పెద్దపులిని అంటూ మాట్లాడారు..మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అస్త‌మిస్తోన్న సూర్యుడు..మార‌న్ సోద‌రుల మ‌ధ్య గొడ‌వేంటి?

  డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా. అప్ప‌ట్లో త‌న తండ్రి మ‌ర‌ణించిన వెంట‌నే క‌ళానిధి మారన్.. అక్ర‌మంగా 12 ల‌క్ష‌ల షేర్ల‌ను నామ మాత్రం విలువ‌, అంటే రూ. 10 చొప్పున షేర్లు త‌న పేరిట కేటాయింపులు చేసుకున్నార‌నీ.. ఆ టైంలో ఈ షేరు విలువ రెండున్న‌ర వేల నుంచి సుమారు రూ.3 వేల వ‌ర‌కూ ఉండేద‌ని.. దీంతో ఆయ‌న 60 శాతం వ‌ర‌కూ వాటాల‌ను కైవ‌సం చేసుకుని అక్ర‌మంగా స‌న్ నెట్ వ‌ర్క్ య‌జ‌మాని అయ్యార‌ని ఆరోపిస్తున్నారు ద‌యానిధి మార‌న్. అందుకే తాము 2003 నాటి పాత యాజ‌మాన్య స్థితికి కంపెనీని తీసుకురావ‌ల్సిందిగా  కోరుతున్నారు ద‌యానిధి మార‌న్.  తాను కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుడ్నేన‌నీ.. త‌న తండ్రి మ‌ర‌ణ దృవీక‌ర‌ణ‌, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన  వార‌స‌త్వ ప‌త్రాల్లేకుండానే క‌ళానిధి త‌న‌కు ద‌క్కాల్సిన  షేర్లు, డివిడెండ్లు, ఆస్తులు, ఆదాయాల‌ను ద‌క్క‌కుండా చేశార‌ని.. అవ‌న్నీ తిరిగి చెల్లించ‌కుంటే తాను సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఆర్వోసీ వంటి సంస్థ‌ల‌కు కంప్ల‌యింట్ తీస్కెళ్లాల్సి ఉంటుంద‌ని త‌న నోటీసుల ద్వారా హెచ్చ‌రించారు మార‌న్ బ్ర‌ద‌ర్. ఈ దిశ‌గా  జూన్ 10న మార‌న్ త‌న సోద‌రుడికి లా ధ‌ర్మ అనే సంస్థ ద్వారా నోటీసులు పంపించారు. క‌ళానిధి మార‌న్ 2003 నుంచి 2023 వ‌ర‌కూ ఏకంగా 8500 కోట్ల మేర అక్ర‌మ నిధుల‌ను ఎన్నో విభాగాల్లో పెట్టుబ‌డులు పెట్టార‌నీ.. ఇదంతా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌నీ అంటారు ద‌యానిధి మార‌న్. 2024లో క‌ళానిధి ఏకంగా 455 కోట్ల విలువైన డివెండ్లు పొందార‌ని.. త‌న భార్య కావేరి, తాను క‌ల‌పి సీఈవోగా ఒక్కొక్క‌రూ అర‌వై కోట్ల‌కు పైగా.. ప్యాకేజ్ తీస్కుంటున్నార‌నీ.. ఆయ‌న 2023లో భార‌త కుబేరుల జాబితాలో 77వ బిలియ‌నీర్ గా ఎదిగారంటే దాని వెన‌క‌- ఈ అక్ర‌మ షేర్ల బ‌దలాయింపు ఉంద‌ని అంటున్నారు ద‌యానిధి మార‌న్. మ‌రీ ముఖ్యంగా కంపెనీల చ‌ట్టం 212 ప్ర‌కారం.. చూస్తే క‌ళానిధి పెట్టుబ‌డులు పెట్టిన  టీవీ, రేడియో, క్రీడా, విమాన యాన ఇలా ఎన్నో రంగాల లైసెన్సులు ర‌ద్దు అయ్యే ప్ర‌మాద‌మున్న‌ట్టు తెలుస్తోంది. స‌న్ నెట్ వ‌ర్క్ కింద 37 చానెళ్లు, 69 రేడియో స్టేస‌న్లుండ‌గా.. వీటితో పాటు స‌న్ పిక్చ‌ర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ ఉండ‌గా.. 2023లో ఈ సంస్థ నుంచి జైల‌ర్ సినిమా విడుద‌లై వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.ఇక క‌ళానిధి కుమార్తె కావ్య మార‌న్ ఇక్క‌డ ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ ఫ్రాంచైజీ  తో పాటు సౌతాఫ్రికాలోనూ ఒక క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ టీములు 2016లో ఐపీఎల్, 2023-24లో ద‌క్షిణాఫ్రికా చాంపియ‌న్ గా నిలిచాయి. ఇక ఇంగ్లండ్ లోనూ ఒక క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేసింది కావ్య‌నాయ‌క‌త్వంలోని స‌న్ నెట్ వ‌ర్క్. అంతే కాదు విమాన‌యానంలోనూ పెట్టుబ‌డులు పెట్టిందీ సంస్థ‌.  వీట‌న్నిటి లైసెన్సులూ ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డ్డంతో పాటు.. వెయ్యి మందికి పైగా ఉద్యోగుల కుటుంబాల‌పైనా ఈ ప్ర‌భావం ప‌డేలా తెలుస్తోంది.దానికి తోడు ద‌యానిధి మార‌న్ డీఎంకే ఎంపీ  కూడా కావ‌డంతో రాజ‌కీయంగానూ ఈ ఆస్తి వివాదం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం  ప‌డేలా ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి దీనంత‌టికీ ఈ కుటుంబం ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా తేలాల్సి ఉంది. 2018 వ‌ర‌కూ క‌రుణానిధి జీవించి ఉండ‌గా.. ఆయ‌న ద్వారా ఇలాంటి కుటుంబ స‌మ‌స్య‌లు ఎన్నో క్లియ‌ర్ అవుతూ వ‌చ్చేవి. ఎందుకంటే క‌రుణానిధికి మేన‌ల్లుడే మురుసోలి మార‌న్. దానికి తోడు త‌న మేన‌మామ మీదున్న ప్రేమ కొద్దీ ముర‌సోలి ఆయ‌న పేరును పోలిన  పేర్లు త‌న‌పిల్ల‌ల‌కు పెట్టారు.  ఈ క్ర‌మంలో ఆయ‌న లేక పోవ‌డం ఒక‌ర‌కంగా ఈ కుటుంబం మ‌ధ్య వివాదం నానాటికీ పెరిగి పెద్ద‌ద‌వుతూ వ‌చ్చింది. ఇప్పుడు క‌రుణ  త‌న‌యుడు స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి. ఆయ‌న‌కున్న ప్ర‌భుత్వ, రాజ‌కీయ ప‌ని ఒత్తిడి కార‌ణంగా ఈ కుటుంబ త‌గాదాలు తీర్చే ప‌రిస్థితి  క‌నిపించ‌డం లేదు. క‌ళానిధి తెలివిగా త‌న ఒకే ఒక్క సోద‌రికి 500 కోట్ల రూపాయ‌లు బ‌దిలీ  చేసి త‌ద్వారా కుటుంబంలో త‌న‌పై ఒత్తిడి రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏంటంటే.. ద‌యానిధి ఇన్నాళ్ల‌కు త‌న‌కు జ‌రిగిన  అన్యాయాన్ని గుర్తించి.. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత ఈ ర‌చ్చ‌ను చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కోడానికి సిద్ధ‌ప‌డ్డం వెన‌క ఉద్దేశ‌మేంట‌న్న‌ది అర్ధం కావ‌డం లేదెవ‌రికీ.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

  బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  

గచ్చిబౌలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు‌. 5 వేల మంది విద్యార్థులు, యువకులు, పాల్గొని యోగాసలు వేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ  అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు. యోగా కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని.. శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే అద్భుత సాధమన్నారు. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు.  కోట్లు సంపాదించేవారికి కూడా ప్రశాంతత ఉండడం లేదని తెలిపారు. ఇలాంటి సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా చేయడానికి కావాల్సిందల్లా సంకల్పం, మంచి గురువని చెప్పారు. రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాతంత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాను ప్రోత్సహించేందుకు 630 మంది యోగా గురువులను నియమించామని తెలిపారు. మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హెల్త్ సబ్‌సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తుమని వెల్లడించారు

విశాఖలో అట్టహాసంగా యోగా దినోత్సవం

  విశాఖ ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని ప్రజలతో కలిసి యోగా చేశారు. దాదాపు 15 వేల మందితో కలిసి ఆయన కాళీ మాత ఆలయం వద్ద యోగాసలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులు యోగాసలు వేశారు.ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.‘‘అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ.  గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు’’ అని మోదీ అన్నారు.అంతర్జాతీయ యోగా డే కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఒకే స్ట్రెచ్ లో మూడు లక్షల 20వేల మందికి పైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు దీంతోపాటు 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకేచోట నిన్న చేసిన యోగాకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలను గిన్నిస్ రికార్డు ప్రతినిధులు అందజేశారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో మంత్రి లోకేశ్‌ పాత్ర కీలకమైందని..నూతన కార్యక్రమాల రూపకల్పనలో ఆయన చొరవ ప్రశంసనీయమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ‘యోగా కేవలం వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం. ఈ ఏడాది విశాఖలో యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అద్భుతం’’ అని ప్రధాని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు