రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి

  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్, మరొక  కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీసి, చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు.ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు  

లోయలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు

  ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్ వద్ద అలకనంద నదిలో ఓ బస్సు పడిపోయింది.ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. ఇంకా, 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు కొందరిని రక్షించారు

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్

  రేపటి నుంచి తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గోల్కొండ జగదాంబకి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.  అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించేలా తల్లి దీవెనలు ఉండాలన్నారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సదుపాయం కోసం రూ.20 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఆషాడం వస్తే చాలు..పూరీలో రథ యాత్ర ప్రారంభం

  పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి. కాగా.. ఆలయ పై భాగంలో ఉన్న ఇరవై అడుగుల సుదర్శన చక్రం పూరీలోని ఏ ప్రాంతం నుంచి చూసినా కనిపించే దిక్సూచి. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడమొక దైవలీలగా ప్రసిద్ధి. ఆలయంలోపలికి ప్రవేశించిన తర్వాత సముద్రపు ఘోష వినిపించకపోవడం మరో విశేషం. ఇక ఆలయంలో వండే ప్రసాదం ఎంత మందికి వండినా ఎప్పుడూ వృధా కాక పోవడం మరో అంతుచిక్కని రహస్యం. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర జగత్ ప్రసిద్ధం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళా ఖాతం తీరాన వెలసిన అత్యంత పురాతన ఆలయం పూరీ జగన్నాథ ఆలయం. హిందువులు తప్పక సందర్శించాల్సిన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చార్ ధామ్ ఆలయాల్లోనే సుప్రసిద్ధం.  ఈ ఆలయం ఇటు ఇతిహాస అటు చారిత్రక విశేషాల సమాహారం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కళింగ పాలకుడైన చోడగంగాదేవ నిర్మించినదిగా చెబుతుంది ఆలయ చరిత్ర. అంతే కాదు ఈ ఆలయ నిర్మాణంలో అనంగభీమదేవ పాత్ర కూడా ఉంది. తర్వాతి కాలంలో రామచంద్ర దేవ విగ్రహ పునఃప్రతిష్ట చేసినట్టుగానూ చెబుతోంది స్థల చరిత్ర. అయితే జగన్నాథుడి విగ్రహాలు ఒక పూర్ణ రూపంలో గాక.. విచిత్రాకారంలో ఉంటాయి కారణమేంటన్నది అంతుచిక్కని ప్రశ్న. అయితే ఇందుకంటూ కొన్నికథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్వతహాగా.. ఇక్కడి జగన్నాథుడిని స్థానిక గిరిజనుల దేవుడనీ, నీల మాధవుడనీ నమ్ముతారు. అడవిలో ఒక రహస్య ప్రాంతంలో గిరిజన రాజు విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక యువకుడ్ని పంపుతాడట. అయితే అతడు విశ్వావసు కుమార్తెను ప్రేమించి పెళ్లాడుతాడట. తన వివాహానంతరం.. జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే విద్యాపతి అడగ్గా.. అతడి మామగారైన విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి.. ఆ ప్రాంతానికి తీస్కెళ్తాడట. ఆ దారి గుండా ఆవాలు ఆనవాళ్లుగా చల్లిన విద్యాపతి.. ఎట్టకేలకు రాజుకు కబురు పెడతాడట. అయితే రాజు ఆ ఆనవాళ్ల ద్వారా అక్కడకు చేరుకోగానే విగ్రహాలు కనిపించవట.  తిరిగి రాజ్యానికి చేరిన రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. సముద్ర తీరానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయని.. వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడట. కొయ్యలు కొట్టుకొస్తాయి కానీ విగ్రహం చేయడమెలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే విశ్వకర్మ.. ఒక వికలాంగుడి రూపంలో వచ్చి తానీ కార్యం నెరవేర్చుతానని అంటాడట. అయితే.. 21 రోజుల పాటు తాను నిద్రాహారాలు లేకుండా ఈ విగ్రహాలు చెక్కుతాననీ.. ఎవరూ ఈ పరిసరాలకు రాకూడదని షరతు విధిస్తాడట. ఎన్నాళ్లయినా విగ్రహ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాణి గుడించా దేవి.. తొందర పెట్టడంతో.. గడువు తీరకుండానే తలుపులు తెరుస్తారట. అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కీ చెక్కని శిల్పాలుంటాయి. దీంతో బ్రహ్మదేవుడ్ని ప్రార్ధిస్తాడా రాజు. అయితే అదే రూపంలో ఇక్కడ విగ్రహాలు పూజలందుకునేలా ఆనతిస్తాడా చతుర్ముఖుడు. తానే వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు. అందుకే ఇక్కడి విగ్రహాలకు అభయ హస్తం, వరద హస్తం కనిపించదని అంటారు. అయితే 14 లోకాలను వీక్షించడానికి చారడేసి కళ్లతో ఇక్కడి విగ్రహాలుంటాయని అంటారు. ఇక దేవాలయానికి సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం.. పూరీ సముద్ర తీరంలోని ఒక మర్రి చెట్టు దగ్గర.. ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట ఆ జగన్నాథుడు. అయితే ఈ నీలి ఆభరణం చూడగానే తక్షణ మోక్షం లభిస్తుందట. దీంతో యమధర్మరాజు ఈ ఆభరణాన్ని భూమిలో పాతి పెడతాడట. ద్వాపరయుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతు చిక్కని ఆ రూపం గురించి తెలుసుకోవాలని చెప్పి.. ఘోర తపస్సు చేశాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై పూరీ సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడే తేలియాడే చెట్టు దుంగను కనుక్కని దాని కాండలోంచి తనకు రూపు తయారు చేసుకురమ్మని అతడ్ని ఆజ్ఞాపించాడట. ఈ కార్యం నిర్విఘ్నంగా నిర్వహించిన రాజు విగ్రహాలను ఎలా చేయాలో అర్ధం కాక యజ్ఞం  చేశాడట. యజ్ఞ నారసింహరాజు ప్రత్యక్షమై నారాయణుడ్ని నాలుగు అక్షరాల్లో విశదీకరించమనడంతో.. అవి జగన్నాథ- బలరామ- సుభద్ర- సుదర్శన చక్రాలైతే బావుంటాయని భావించారట. విశ్వకర్మ చిత్రకారుడి రూపంలో వచ్చి ఈ విగ్రహాలను చెక్కి వెళ్లాడట. ఈ ఆలయం కొన్ని తరాలుగా హిందూ- ఆదివాసీ సంస్కృతుల మేలు కలయికగా వస్తోంది. ఈ మూడు విగ్రహాలు జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. ఇవి మోక్ష మార్గాలుగా అంతులేని ఆనంద ప్రదాతలుగా పిలవబడుతున్నాయని నమ్ముతారు. ఇక్కడి జగన్నాథుడు నారాయణుడిగా, బలభద్రుడు ఆదిశేషువుగా అదే సమయంలో ఆలయంలోని విగ్రహాలు భైరవ, విమలగానూ పూజలందుకుంటున్నాయి. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రాల్లోనే సుప్రసిద్ధమైనదిగా భావిస్తుంటారు. అంతే కాదు ఇటు శైవ అటు వైష్ణవతో పాటు శక్తిత్వానికీ ఈ ఆలయం ఒక ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో చుట్టూ ప్రహరీ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. ఇందులో 120 గుడులు ఇతర పూజనీయ స్థలాలున్నాయి. ఒడిశా నిర్మాశైలికి చెందిన ఈ ఆలయం భారతీయ అద్భుత నిర్మాణాలలో ఒకటి.  ఇక ఎనిమిది ఆకులతో నిర్మితమైన నీలచక్ర- శ్రీ చక్రం అష్టధాతువులతో తయారైనదిగా నమ్ముతారు. ఎత్తైన రాతి దిమ్మపైగల ధ్వజస్థంభం గర్భగుడికన్నా 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టపక్కల పరిసరాల్లో అతి పెద్దదిగా దర్శనమిస్తుంది. చుట్టూ ఒక పర్వత శ్రేణి ఉన్నట్టు కనిపిస్తుంది. సింహద్వారం సంగతి సరేసరి. రెండు వైపులా గాండ్రించే సింహాలతో అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలుండగా.. ఉత్తర, పడమట, దక్షిణ దిక్కులలో హథిద్వారా అంటే ఏనుగు, వ్యాగ్ర ద్వారా అంటే పులి, అశ్వద్వారా అంటే గుర్రాల ద్వారాలుగా ఇవి కనిపిస్తాయి. గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూల విరాట్టులు రత్నవేది ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మారుస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచీ ఉంది. అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచీ ఉందని చెబుతారు. ఇక్కడ మండపాలు ఇతరత్రా ఎన్నో ఆలయాలతో ఎంతో పవిత్రత తొణికిసలాడుతుంది. ఇక ఆలయ వంట శాల ఇక్కడి మహాప్రసాదం ఏ ఫైవ్ స్టార్ ఫుడ్ కి తీసి పోనంత నాణ్యంగా ఉండటమే కాదు. ఆ రుచికి ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ గుర్తింపు ఉంది. ఇక్కడి వంటకాలు ఎంతో రుచిగా శుచిగా ఎందుకు ఉంటాయని చూస్తే.. ఈ వంటశాల మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలో సాగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడి వంటకు కేవలం మట్టి పాత్రలను మాత్రమే వినియోగించడం మరో ప్రత్యేకత. వంటశాలకు దగ్గరగా ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నీటిని మాత్రమే వాడుతారు. మొత్తం 56 నైవేద్యాలను వండుతారు. ఈ నైవేద్యం జగన్నాథునికి సమర్పించిన తర్వాత మహా ప్రసాదంగా ఈశాన్యంలోని ఆనంద బజార్ లో పంచుతారు. ఇక్కడి భక్తులు ఈ మహాప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ప్రధానమైన పండుగలేంటని చూస్తే.. జూన్ లో జరిగే రథయాత్ర. ఈ బ్రహ్మాండమైన పండగలో జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలున్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు. ఏడాదిలో రెండు ఆషాడ మాసాలు వచ్చినపుడు నబకలేవర ఉత్సవం పేరిట.. కొత్త విగ్రహాలను మార్చుతారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున చందన యాత్ర రథ నిర్మాణ ప్రారంభాన్ని సూచిస్తుంది. జేష్ట పౌర్ణమిరోజున అన్ని ప్రతిమలకు స్నానం చేసి అలంకరిస్తారు. వసంతకాలంలో డోలాయాత్ర, వర్షాకాంలో ఝులన్ యాత్ర వంటి పండగలు నిర్వహిస్తారు. కార్తీక, పుష్యమాసాలలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఇక విమలాదేవి కోసం  ఆశ్వయుజ మాసంలో షోడశ దినాత్మక పూజ ఘనంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మపరివర్తన వేడుక సైతం గొప్పగా జరుగుతుంది.  జేష్ట పౌర్ణమినాడు స్నాన యాత్ర తర్వాత జగన్నాథ- బలభద్ర- సుభద్ర- సుదర్శన విగ్రహాలను రహస్య మందిరాలకు తీస్కెళ్తారు. అక్కడ కృష్ణపక్షం వరకూ ఉంచుతారు. ఆ సమయంలో భక్తులకు జగన్నాథ దర్శనానికి వీలు పడదు. అప్పుడు బ్రహ్మగిరిలోని విష్ణువు స్వరూపమైన అల్వర్నాత్ ని కొలుస్తారు. అధిక స్నానం చేయడంతో దేవుళ్లకు జ్వరం చేసిందని.. పదిహేను రోజుల పాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథ మహిమాన్విత చరితం. నిరంతర పారాయణం. ఒడిశాలోని పూరీకి ఎలా చేరుకోవాలో చూస్తే.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్ బీజూపట్నాయక్ ఎయిర్ పోర్ట్ పూరీకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు విస్తృతంగా ఉన్నాయి. కోల్ కతా- చైన్నై ప్రధాన రైలు మార్గం కావంతో .. ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లో దిగి.. అక్కడి నుంచి పూరీకి టాక్సీల్లో చేరుకోవచ్చు. ఈ స్టేషన్ పూరీకి కేవలం 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్, కోల్ కతా, విశాఖ నుంచి బస్సు సౌకర్యం ఉంది.

మాజీ సీఎం జగన్ చేసే ర్యాలీలను నిషేధించాలి : షర్మిల

  కారు కిందపడ్డ సింగయ్యను  వదిలేసి ఎలా ముందుకు వెళ్లారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ సీఎం జగన్ జగన్‌ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల తెలిపారు.  సింగయ్య మృతికి జగన్ నిరక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం కూడా అని  పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. 3 కార్లకే పోలీసులు అనుమతి ఇస్తే వేల మందితో ఎందుకు పర్యటన చేశారని షర్మిల నిలదీశారు.  కారు కింద పడిన వ్యక్తిని జగన్ పట్టించుకోకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. ఇప్పటికే జగన్ చాలా తప్పులు చేశారని, అందుకే ఆయనపై కేసులు నమోదు అయ్యాయని షర్మిల వ్యాఖ్యానించారు. ఇటీవల పల్నాడులో జగన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చి ఓ వృద్ధుడు కారు కింద పడ్డాడని.. అయినా డ్రైవర్‌ పట్టించుకోకుండా వెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా పక్కకు లాగి ర్యాలీగా వెళ్లారన్నారు. సొంత పార్టీ కార్యకర్తపైనా మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ షర్మిల ఆక్షేపించారు.  

గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతి

    గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సన్నాహకంగా విజయవాడలో కర్టైన్ రైజర్ కార్యక్రమాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించింది. జూన్ 30 తేదీ విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీలపై భాగస్వాములను ఒక్క చోటకు చేర్చేలా ఈ నేషనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఒక్క రోజు నిర్వహించే వర్క్ షాప్ లో క్వాంటం హార్డ్ వేర్ సహా కీలకమైన అంశాలపై నిపుణులతో రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఈ వర్క్ షాప్ లో ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ సహా వివిధ ఐఐటీల నుంచి ప్రోఫెసర్లు, నిపుణులు, గ్లోబల్ లీడర్లు ప్లీనరీ సెషన్లకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించనున్నారు. దీనిపై అమరావతి డిక్లరేషన్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. అలాగే క్వాంటం స్టార్టప్, క్వాంటం డిక్లరేషన్ బుక్ ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ అంశంపై విజయవాడలో నిర్వహించిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, టీసీఎస్ సలహాదారు, జాతీయ క్వాంటం మిషన్ సభ్యులు ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్, ఐబీఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ, ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు హాజరయ్యారు. క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందడుగు వేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాజధాని అమరావతిలో ప్రఖ్యాత ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటరును అమరావతిలో ఏర్పాటు చేయనుంది. రెండు 156 క్యూబిట్  క్వాంటం సిస్టంలను ఐబీఎం ఇన్ స్టాల్ చేయనుంది. ఇక దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక మరో సంస్థ టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రీడ్ కంప్యూటింగ్ సొల్యూషన్సును అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి రంగం సహా వేర్వేరు రంగాల్లో సేవలు అందించేలా ఈ క్వాంటం వ్యాలీ  సిద్ధం కానుంది. 2026 జనవరి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి సేవలందిస్తుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.

రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా  రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.   శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో, పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీచేశారు.   

ఫోన్ పే రచ్చ రాజకీయులు సరే... స్టార్ల సంగతేంటి?

  ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ సరిహద్దులు దాటి పోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ, అప్పట్లో అధికారం నిలుపుకునేందుకు ఫోన్ ట్యాపింగ్’నూ ఒక అస్త్రంగా వాడుకున్నారు. అలాగే,స్నేహపూర్వకంగా ‘సమాచారం’ ఇచ్చి పుచ్చుకున్నారని అంటున్నారని, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తాను తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సమయంలో,తన ఫోన్’తో పాటుగా తమ కుటుంబ సభ్యులు, తమ పార్టీ (టీవైసీపీ) నాయకుల ఫోన్లు కూడా, ట్యాప్  చేసి సమాచారాన్ని, బ్రదర్ జగన్ రెడ్డి’కి అందించారని ఆరోపించారు. నిజానికి, ఒక షర్మిల అనేముంది,అప్పట్లో తెలంగాణలో క్రియాశీలంగా ఉన్న రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఎవరినీ వదిలి పెట్ట కుండా, దొరికిన’ ప్రతి ఒక్కరి ఫోను ట్యాప్ చేశారు. అదేదో ఎవరో చెప్పిన మాటో,ఇంకెవరో చేసిన ఆరోపణ కాదు, అధికారులేతారీకులతో సహా, ట్యాపింగ్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అయితే, ఇది పూర్తిసమాచారం కాదు,చేయగలిగినంత డిస్ట్రాయ్ చేసి, తగల బెట్టగలిగినంత తగల బెట్టగా, మిగిలిన సమాచరం మాత్రమే ఇచ్చారు. ఆ సమాచరం  ప్రకారం చూసిన ఒకే ఒక్క పక్ష రోజుల్లో, ( 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు) 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు ,ఇతర అధికారులు అంగీకరించారు.అందులో 618 మంది రాజకీయ నాయకుల ఫోన్లు ఉన్నట్లుసమాచరం.ఆ 618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్,పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు గుర్తించారు.అలాగే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలకు సిట్ నోటీసు ఇవ్వనుంది. ఐఏఎస్‌లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. మొత్తం 618 మంది స్టేట్‌మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్ రికార్డింగ్‌లు పూర్తి అయ్యాయి. 618 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలను బట్టి ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేయగా.. మరికొంత మంది స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేయనుంది సిట్. ఇంతటి సంచలనమైన కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారుల వరకు మాత్రమే విచారణ, అరెస్ట్‌లు జరుగగా.. అధికారుల వెనక ఉన్న అప్పటి బీఆర్‌ఎస్ నేతలు ఎవరనేది మాత్రం దర్యాప్తులో వెల్లడి కావాలసి వుంది..అదొకటి అయితే, మొత్తం ట్యాపింగ్ చేసిన  4013 చేసియన్ ఫోన్ నెంబర్లలో కేవలం 618 మాత్రమే రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు, మిగిలిన మిగిలిన మూడు వేల పైచిలుకు నెంబర్లు ఎవరివీ ?  ఎన్నికలు జరుగుతున్న సమయం కాబట్టి, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఓకే, తప్పయినా ఒప్పయినా అర్థం చేసుకో వచ్చును.  అదే సమయంలో వేల సంఖ్యలోఇతరుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినట్లు? అసలు ఇంతకీ ఆ ఇతరులు ఎవరు? ఇది కూడా తేల  వలసిందే అంటున్నారు.అలాగే తాజాగా, పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్‌తో సినీతారల కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు  తెరపైకి తెచ్చిన కొత్త కోణాన్ని విచారించవలసిందే అంటున్నారు.  అదలా ఉంటే 618 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలను బట్టి ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్లను సిట్’ రికార్డు చేసింది. మరికొంత మందికి కూడా సిట్’ ఇపైకే నోటీసులు ఇచ్చింది,నోటీసులు ఇవ్వవలసిన వారు ఇంకా కూడా ఉంటారు. దీనికి మహేష్ కుమార్ గౌడి యాడ్ చేసిన, సినిమా స్టార్స్, ఇతర సెలబ్రిటీలు ఇతరులను కలిపితే, వాగ్మూలం రికార్డ్ద్ చేయవలసిన వారి చిట్టా, కొండవీటి చాంతాడంత’ ఉన్నాఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా తవ్విన కొద్దీ తన్నుకొస్తున్న సంచలనాలను దృష్టిలో ఉంచుకుని, కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. నిజానికి కేసు పూర్వాపరాలు తెలిసిన, న్యాయనిపుణులు కూడా అదే అంటున్నారు. ఇంతవరకు అయితే ప్రభుత్వం స్పందించలేదు.

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు

  ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. జూలై 1 విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నాది. అరవింద్ కుమార్‌ను మరోసారి విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.   

జగన్‌కు అరెస్ట్ భయం..హైకోర్టులో పిటిషన్

  వైసీపీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో జగన్ , బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది. విచారణ అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది జగన్ తోపాటు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠగా రేపుతోంది. కేసును కోర్టు క్వాష్ చేయకపోతే ఏ క్షణమైనా జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వైసీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం జగన్ డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకోగా…మంగళవారం జగన్ కారును సీజ్ చేసి నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు.ఈ క్రమంలోనే ఆయనను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకున్నారో ఏమో, కేసును క్వాష్ చేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జగన్ కు నిరాశ ఎదురైతే ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచే అవకాశం ఉంది.  

ఆషాఢ మాసం బోనాలను జంట నగరాలు ముస్తాబు

  హైదరాబాద్ జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసింది. నగరంలోని 2,783 దేవాలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిధులను చెక్కుల రూపంలో జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఆషాఢ మాసంలో ముందుగా నగరంలోని గోల్కొండ బోనాలు జూన్‌ 29న జులై 1, 2 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జులై 13, 14 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం బోనాలు, జులై 20న లాల్‌ దర్వాజా బోనాలు.. జులై 23న చార్మినార్‌ భాగ్యలక్ష్మి బోనాలు, మిగిలిన దేవాలయాల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు.  జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో రూ.10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. హైదరాబాద్-గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు అమ్మవారికి మెట్ల బోనాలు, ఒడి బియ్యం సమర్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు   

రూ.3,626 కోట్లతో పూణే మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం

  ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినేట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  1975లో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మరోవైపు ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.   పూణేలోని మెట్రో లైన్ ఫేజ్-2 కోసం రూ.3,626 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేసింది. ఆగ్రాలోని పొటాటో రీజ‌న‌ల్ సెంట‌ర్ ఏర్పాటుకు రూ.111.5 కోట్లు మంజూరు చేసింది. అదే విధంగా కోల్డ్ ఫీల్డ్ రీహాబిటేష‌న్ కోసం రివైజ్డ్ మాస్ట‌ర్ ప్లాన్‌కు రూ.5,940 కోట్ల రూపాయలు కేటాయించింది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రను స్వాగతిస్తూ మరో తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.  

కేసీఆర్‌ వల్లే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు : కవిత

  గోదావరి జలాల అంశంపై నిన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసెంబ్లీలో కచ్చితంగా చర్చిద్దాం అయితే ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలని కవిత డిమాండ్ చేశారు.  కేసీఆర్ దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు. ఇదే సమయంలో, పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్న హామీని విస్మరించారు. వికలాంగుల పెన్షన్ ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది?" అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు

ఇక పార్టీ కార్యకర్తల నుంచి ప్రతి రోజు ఫీడ్ బ్యాక్ : లోకేష్

  రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వైసీపీ నేతలకు గుండెపోటు వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ఇకపై ప్రతిరోజూ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని  లోకేష్ తెలిపారు. కూటమి సర్కార్ ఏడాది పాలను జులై 2 నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కూటమిలో మనది పెద్దన్న పాత్ర అని.. సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు.  ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తాను ప్రతీ రోజు ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని..తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు విషయంలో టీడీపీ ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాలని వైసీపీ నేతలు చూశారని ఆయన అన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుతోనే ఉంటామని చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబు అభివృధి చేసిన జైలులోనే ఆయనను పెట్టినప్పుడు నాకు చాలా బాధ వేసిందని లోకేశ్ తెలిపారు. వైసీపీ నేతల దురాగతాల వల్ల టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయారని ఆయన అన్నారు.  టీడీపీ సిద్ధాంతాలు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను అహంకారంతో కాకుండా బాధ్యతతో చేయాలని ఆయన కోరారు. అలా అహంకారంతో ఉంటేనే 151 నుంచి 11కి వచ్చారని వైసీపీ వ్యాఖ్యనించారు. మచిలీపట్నం అంటే తెలగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. ఇక్కడ ఎప్పుడైతే గెలిచామో అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాం. మంత్రి కొల్లు రవీంద్రపై గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించినా టీడీపీ కోసం, చంద్రబాబునాయుడు గారికోసం నిలబడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కేసులతో ఎంత వేధించినా పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయాన్ని సాధించి పెట్టిన కార్యకర్తలకు నమస్కారాలని లోకేశ్ తెలిపారు.  ప్రజలకు మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని. పెద్దఎత్తున కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది నిరుద్యోగ భృతి మొదలుపెడుతున్నామని లోకేశ్ పేర్కొన్నారు. భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. వారిని గౌరవించాలనేది టీడీపీ నినాదం. మహిళలను గౌరవించాలనేది ముందు మన ఇంట్లో మొదలవ్వాలి. 50శాతం పనులు మగవారు, 50శాతం పనులు ఆడవారు చేయాలని పాఠ్యాంశాల్లో పెట్టాం. జులై 5న మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ లో తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 2 కోట్ల సిలిండర్లు అందించాం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సబ్సీడీ మొత్తాన్ని మహిళల అకౌంట్లలో జమచేస్తాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, దివ్యాంగ పెన్షన్ రూ.6వేలు, పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందిస్తున్నామని ఆయన తెలిపారు  

దళిత సోదరుడు సింగయ్యది జగన్ చేసిన హత్యే : సోమిరెడ్డి

  దళిత సోదరుడు సింగయ్యను హత్య చేసింది మాజీ సీఎం జగనేని టీడీపీ నేత మాజీ మంత్రి,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా 9 గంటలు వేల మందితో ర్యాలీ చేశారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హచయాంలో దళితులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని తెలిపారు. సింగయ్య మృతిని జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ పేరు తీసేసి రప్ప...రప్ప పార్టీ అని పెట్టుకో పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు.  ర్యాలీలో కాన్వాయ్ కింద పడితే తొక్కేసి వెళ్లిపోయారని విమర్శించారు.  కనీసం దిగి బాధితుడిని ఆస్పత్రికి కూడా తరలించలేదని, సింగయ్యది ముమ్మాటికీ హత్యని సోమిరెడ్డి ఆరోపించారు.తీవ్రంగా గాయపడిన సింగయ్యను ముళ్లకంపల్లో పడేసి వెళ్ళిపోతారా.. అంటూ జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లాంటి వారి వల్ల దళితులు, గిరిజనుల ప్రాణాలకు హానీ కలుగుతోందన్నారు. ఈ దేశ చరిత్రలో రూ. 43 వేల‌ కోట్ల కుంభకోణంలో జగన్ నిందితుడని సోమిరెడ్డి అన్నారు. జగన్ పర్యటనలో 679 మంది పోలీసులను పెడితే ఇంకా బందోబస్తు సరిపోలేదని విమర్శలు చేస్తున్నారని, 90 కిలోమీటర్ల రోప్ పార్టీని పెట్టాలా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.  జగన్‌కు సిగ్గూ శరం ఉండాలన్నారు. జగన్ కోసం వచ్చిన అభిమానిని నిలువునా ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. ఆయన కారులో ఉన్న పెద్దరెడ్డి కారు కింద పడితే అలాగే వదిలేసి వెళుతారా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో ముగ్గురు చనిపోయారని, జగన్ తీసుకున్న అనుమతి ఒకటి.. చేసింది మరొకటని విమర్శించారు. గత వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఒక ముఖ్యమంత్రి అనుకుంటే ఎంత అవినీతి చేయోచ్చో.. ఏపీ లిక్కర్ స్కామ్ చూస్తే అర్థమవుతోందని సోమిరెడ్డి తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్‌తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారు : టీపీసీసీ

  మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్‌తో సినీతారల కుటుంబంలో చిచ్చు పెట్టారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రైతుభరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పినట్లుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని అన్నారు. చివరకు సొంత బీఆర్‌ఎస్ పార్టీ నేతలనూ వదలేదని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్ కు ఎవరిచ్చారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మా ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు..?  దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అని ఆయన తెలిపారు.  ఈ కేసులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా శిక్ష పడాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలన గోల్డెన్ పిరియడ్ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలు, జుబ్లీహీల్స్‌ ఉపఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలుతో వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహలపై వరుస సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు గెలిచేది కూడా తామేనని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు  

దేవుడి పేరిట రాజకీయాలు చేస్తే..చూస్తూ ఊరుకోం

  పవన్ కళ్యాణ్‌కి తమిళ రాజకీయాల్లో తొలి ఎదురు దెబ్బ తగిలిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇలాంటి రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన రజనీకాంత్  అక్కడ తన పొలిటికల్ ఖాతా తెరవకుండానే ప్యాకప్ చెప్పేశారు. ఆయన నాన్ లోకల్ కూడా కావడంతో.. అప్పట్లో శీమాన్ తదితరులు ఇక్కడ రాజకీయ పార్టీ పెడితే ఒప్పుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఇప్పుడు పవన్ చూస్తే తమిళనాడు సంప్రదాయానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక రాజకీయాల బాట పట్టారు.నిజానికి ఇక్కడ ఎంత ద్రవిడ వాదం ఉన్నా.. భక్తి ఏం తక్కువ ఉండదు. కరుణానిధితో సహా అందరూ ఇక్కడ సెంటిమెంట్లు ఫాలో అయ్యేవాళ్లే. కానీ విచిత్రమైన విషయమేంటంటే.. పైకి అందరూ ద్రవిడ వాదం వల్లె వేసేవారే.  ఆ మాటకొస్తే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ సైతం ద్రవిడవాదే. అలా అయితేనే ఇక్కడ నెగ్గుకు రాగలం.ఈ విషయం తెలీకుండా పవన్ ఇక్కడ తనదైన సనాతన్ మార్క్ పాలిటిక్స్ ప్లే చేస్తానంటూ కుదరదని అంటున్నారు తమిళులు. అందుకే సత్యరాజ్ నుంచి ఫస్ట్ వార్నింగ్ వచ్చింది. ఇది తర్వాతి రోజుల్లో చాలా చాలా ముదరబోతుంది. దానికి తోడు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఇక్కడ బీజేపీ నుంచి ప్రచారం చేసేలా కనిపిస్తోంది. వీటిని ముందే గుర్తించిన తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన హవాకు ముందు నుంచే బ్రేకులు వేస్తున్నారు.ఈ రోజున దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తామంటే కుదరదని సత్యరాజ్ నుంచి ఒక హెచ్చరిక అయితే వచ్చింది. వచ్చే రోజుల్లో ఈ హెచ్చరికల తీవ్రత ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.

పవనిజం.. వ్యూహాత్మక ‘సనాతన’ ప్రయాణం?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ జ‌ర్నీ ఈ ప‌న్నెండేళ్ల‌లో ప‌న్నెండు మ‌లుపులు తిరిగిన మాట నిజం. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌త క‌ట్ట‌ని వారు లేరు. వారిలో క‌మ్యూనిస్టులున్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మాయావ‌తి వంటి  ద‌ళిత నేత‌లున్నారు. ఇక చెగువేరా సంగ‌తి స‌రే స‌రి. ఫైన‌ల్ గా ఆయ‌న సేన‌- బీజేపీ, టీడీపీతో చేస్తోన్న‌ ప్ర‌యాణం గురించి తెలియంది కాదు. కానీ ప‌వ‌న్ పై ఇప్పుడు చ‌ర్చంతా ఏంటంటే ముస్లిం టోపీ  ధ‌రించి, గొడ్డు మాంసం తిన‌డం  లో త‌ప్పు లేద‌ని.. త‌న తండ్రి దీపం మంట‌లో సిగ‌రెట్ వెలిగించుకునేంత నాస్తికుడ‌ని చెప్పుకుని, ఆపై బైబిల్ ప‌ట్టుకుని త‌న పెళ్లాం పిల్ల‌లు పూర్తి క్రిష్టియ‌న్ల‌ని చెబుతూ.. చివ‌రికి ఆయ‌నిలాంటి నిగూఢ‌మైన వారాహీ దీక్ష‌లు, వాహ‌నాల‌కు ఆ పేరుబెట్ట‌డంతో పాటు య‌జ్ఞ‌యాగాల నిర్వ‌హ‌ణ‌, కుంభ‌మేళాలో    స్నానాలు.. ఇవ‌న్నీ ఏం చెబుతున్నాయ్? ఆయ‌న హిందువా ముస్లిమా క్రిష్టియ‌నా?  లేక కొత్త పేరు ఏదైనా పెట్టాలా?  జ‌నాన్నిలా సందిగ్దంలో ప‌డేయ‌టం ప‌వ‌న్ మార్క్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ.  ప‌వ‌న్ ప‌య‌న‌మెటు? ఈయ‌న్ని మ‌న‌మెలా అర్దం చేసుకోవాలి? అంటే  ప‌వ‌న్ పెద్ద  స్కెచ్చే వేశారని అంటారు కొంద‌రు ఆధ్యాత్మిక రాజ‌కీయ పండితోత్త‌ములు. వ‌చ్చ‌  రోజుల్లో ఆయ‌న స్టార్ క్యాంపెయిన‌ర్ గా దేశమంతా ఒక ర‌క‌మైన ఫాలోయింగ్ తీసుకురావాలంటే అందుకు త‌గిన మార్గం కోసం వెతుకుతుండ‌గా వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన చందంగా మారిందట ఈ స‌నాత‌నం. దీని ప‌వ‌ర్ కేవ‌లం ఒక‌టీ రెండు రాష్ట్రాల‌కు సంబంధించింది కాదు. ఇది దేశ వ్యాప్తంగా క‌నిపించే కామ‌న్ పాయింట్. గ‌తంలో ర‌జ‌నీకాంత్ ని వాడాల‌నుకున్నారు మోడీ. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు అదే ప‌నిగా పంచ‌క‌ట్టుకుని వెళ్ల‌డం చూసే ఉంటాం. ఆయ‌న కూడా అందుకు త‌గిన విధంగానే రియాక్ట్ అయ్యారు కూడా. తాను చేస్తే గీస్తే ఆధ్యాత్మిక రాజ‌కీయాల‌నే చేస్తాన‌న్నారు. కాకుంటే ఈ సూప‌ర్ స్టారుడికి కాలం ధ‌ర్మం పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. దీంతో ర‌జ‌నీ ఛాన్స్ మిస్ చేసుకుంది క‌మ‌లం దండు. స‌రిగ్గా ఈ టైంలో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి ఇక ఆశాకిరణంగా కనిపించారు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని మోడీ  ఎప్పుడైనా  ఎక్క‌డైనా మొద‌టి ప్ర‌యారిటీ కింద గుర్తిస్తారు.   అంతెందుకు ప్ర‌మాణ  స్వీకార స‌మ‌యంలో   మోడీ ప‌వ‌న్, చిరంజీవిల చేతులు పైకి లేపి.. ఇచ్చిన సంకేతం ఏమిటి? అందుకే ప‌వ‌న్ ఈ  దిశ‌గా త‌న అడుగులు వేస్తూ బీజేపీ  పాలిట ఒక స్టార్ క్యాంపెయిన‌ర్ గా త‌న ప‌రిధిని పెంచుకుంటూ పోతున్నారు. అందుకే త‌మిళ‌నాడు బీజేపీ  సైతం మురుగ‌న్ పేరిట ఒక ఆధ్యాత్మిక స‌భ‌ను ఏర్పాటు చేసింది. కార‌ణం ఇక్క‌డ మురుగ‌న్ అన్న‌దొక ప్ర‌త్యేక మ‌తం. ఈ దేవుడి పేరు చెబితేనే మొత్తం ఊగిపోతారు. త‌ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి పెద్ద పీట వేసి.. ఇక్క‌డి తెలుగు ఓట‌ర్ల‌ను విశేషంగా ఆక‌ర్షించి.. ఆపై.. త‌మిళ‌నాట త‌న ఓటు బ్యాంకును మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని క‌మ‌ల‌ద‌ళం చూస్తున్న‌దని పరిశీలకుల విశ్లేషణ. అది మోడీ ఆదేశాను సార‌మో మ‌రొక‌టో తెలీదు కానీ..  ఈ దిశ‌గా ప‌వ‌న్ కి కూట‌మి ప్ర‌భుత్వంలోనూ భారీ ఎత్తున ప్ర‌యారిటీ ద‌క్కుతోంది. మొన్న క‌ర్ణాట‌క‌ ఏనుగుల వ్య‌వ‌హారంలోనూ ఆయ‌న ద‌గ్గ‌రుండి వాటిని తీసుకోవ‌డం.. ఇలా ప‌వ‌న్ ని రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచేందుకు   బీజేపీ ఒక ప‌థ‌కం ప్ర‌కారం వెళ్తున్న‌ట్టుగా స‌మాచారం.  మ‌న‌మంతా ఏమ‌నుకుంటున్నాం,, ఇదేంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా చేస్తున్నారు? ఆయ‌న‌కు ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీ ఓట్లు వ‌ద్దా? అని తీసిక‌ట్టిన‌ట్టు మాట్లాడుకుంటాంగానీ.. ఈ మొత్తం జ‌ర్నీలో ఆయ‌న్ని స‌నాత‌న ధ‌ర్మ వార‌ధిగా భారీ  క‌మ‌ల వ్యూహ‌మే ర‌చిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇదంతా అంటున్నారు.  ఆయ‌న కూడా వెళ్లిన ప్ర‌తి ప్రాంతాన్నీ.. ఇక్క‌డే  నేను పుట్టా. ఇక్క‌డే  నేను పెరిగా ఇక్క‌డే నా సినిమాలు ఎక్కువ ఆడేవి అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ అక్క‌డి వారిని ఆక‌ట్టుకునే య‌త్నం చేస్తుంటారు. ఇదంతా ఒక విస్తృత రాజ‌కీయాల్లో భాగంగానే చూడాలంటారు కొంద‌రు ఎన‌లిస్టులు.  ఎందుకంటే తాను కేవ‌లం ఒక కాపు నేత‌గా మాత్ర‌మే కాకుండా.. స‌ర్వ‌జ‌న..  స‌ర్వ‌కుల నేత‌గా ఎద‌గ‌డం ఒక అనివార్యంగా కావ‌డంతో.. ఇదిగో ఇదీ పరిస్థితి. ప‌వ‌న్ అలవోకగా చెప్పే  డైలాగ్ లోనూ ఒక వ్యూహం ఉంటుంద‌ని అంటారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులో భాగంగానే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టుగా ఒక టాక్ న‌డుస్తోంది దక్షిణాది రాజకీయవర్గాల్లో. అందుకే ఇత‌ర రాష్ట్రాల వేదిక‌ల‌పై ప‌వ‌న్ కి ఇంత ఎలివేష‌న్ అంటున్నారు విశ్లేష‌కులు.

రైతు బంధు డబ్బుల కోసం తండ్రి నాలుక కోసేసిన కొడుకు

రైతు బంధు డబ్బుల విషయంలో  ఘర్షణ పడి తండ్రి నాలుక కోసేసిన సుపుత్రుడి ఉదంతమిది. ఈ దారుణం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కోపంతో దాడి చేసి నాలుకు కోసేశాడో సుపుత్రుడు. తాండాకు చెందిన బానోత్ కిర్యా కు ఇద్దరు కుమారుడున. రైతు బంధు పథకం కింద బానోత్ కిర్యా ఖాతాలో ఇటీవల తొమ్మిది వేల రూపాయలు జమ అయ్యాయి.  ఎకరాకు రూ.6 వేల చొప్పున  ఎకరంన్నర పొలం ఉండటంతో తొమ్మిదివేలు కిర్యా ఖాతాలో జమ అయ్యాయి.  ఆ సొమ్ములు తనకు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్ కోరాడు. అయితే తండ్రి కిర్యా మాత్రం తాను నాలుగువేల రూపాయలు మాత్రమే ఇస్తాననీ, తన అనారోగ్యం కారణంగా ఐదు వేలు ఖర్చయ్యయనీ చెప్పాడు. దీంతో  ఆగ్రహానికి గురైన సంతోష్ తండ్రిపై దాడి దాడి చేసి కొడవలితో తండ్రి నాలుకను అతడు కోసేశాడు. ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా నాలుగు కుట్టుపడ్డాయి,   కీర్యా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.