రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ

  రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో  మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.  నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.  

జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్

  వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు.. ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు.  పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి  జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు... తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.  అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

తెలంగాణకు మళ్లీ ఆమ్రపాలి

  ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట లభించింది. ఆమెను ఏపీ కేడర్ నుంచి తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆమె త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి దాదాపు నాలుగు నెలల క్రితం ఏపీ కేడర్‌కు వెళ్లారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ, తనను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్, ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం, ఆమ్రపాలి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్..శాసన సభలో చర్చించే దమ్ముందా?

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. బనకచర్లపై శాసన సభలో చర్చపెడతాం అన్ని ఆధారాలతో నేను వస్తా. మీరు సిద్దమా అని మాజీ సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి  ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది.  రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, తమ 18 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.  వ్యవసాయాన్ని దండగ అనే స్థాయి నుంచి పండగలా మార్చేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత  కరెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. గతంలో వరి వేసుకుంటే ఉరేననే పరిస్థితి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి, 48 గంటల్లోనే డబ్బులు జమ చేశామని వివరించారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని, వ్యవసాయం అంటే రైతును రాజును చేయడమేనని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత  కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ రాష్ట్రం నెత్తిన రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టి వెళ్లారని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం కూడా జరిగిపోయిందని విమర్శించారు.  "కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్ రావులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రం దివాలా తీస్తే వారంతా ఎలా సంపన్నులయ్యారు?" అని ఆయన ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ హయాంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. గ్రామాల్లో 'అమ్మ ఆదర్శ పాఠశాలలు' తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని, వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌పై విద్యుత్‌శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

ఆర్జేడీ అధ్యక్షుడిగా 13వ సారి లాలూ ప్రసాద్

    రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ 13వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ పట్నాలోని ఆర్జేడీ కార్యాలయంలో తేజస్వీ యాదవ్, రబ్రీ దేవి, మీసా భారతి, సీనియర్ నాయకుల సమక్షంలో లాలూ నామినేషన్ దాఖలు చేశారు. వేరే అభ్యర్థులు పోటీ చేయకపోవడంతో లాలూ ఎన్నిక ఖాయమైంది. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. లాలూ నాయకత్వం పార్టీకి బలమని, రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోతప్పకుండా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా జూలై 5న "లాలూ సమ్మాన్ దివస్" జరుపుకోనున్నారు. 1997లో ఆర్జేడీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి లాలూ నాయకత్వం వహిస్తుండగా.. బీహార్‌లో OBCలు, దళితులు, ముస్లింల మద్దతుతో ఆర్జేడీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. 78 ఏళ్ల లాలూ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన నాయకత్వం కొనసాగిస్తూ.. కుమారుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ పునఃనియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బుధవారం తన 78వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. పాట్నాలోని నివాసంలో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో కట్‌ చేశారు. ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మళ్లీ మొదటికి ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధం

    ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ మధ్య యుద్దం మళ్లీ మొదటికి వచ్చింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన గంటలలోపే సీన్ రివర్స్ అయింది. ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన కాసేటికే మళ్లీ.. కాల్పులకు సై అంటూ దిగడం.. ఆ రకంగా ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది.. కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్‌ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ లోని పలు నగరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు పాల్పడిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఇరాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో ఇరాన్‌పై మరిన్ని భీకరదాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ రక్షణశాఖ ప్రకటించింది.  బీర్‌షెవాలోని ఓ బిల్డింగ్‌ మిస్సైల్‌ దాడిలో కుప్పకూలింది. 9 మంది ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌ దాడిలో బీర్‌షెవాలో మూడు భవనాలు ధ్వంసమయ్యాయయని ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించారు. ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగే వరకు దాడులు చేస్తామని ప్రకటించారు. ఇరాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘించిందన్న ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకరదాడులు చేయాలని IDFకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది. అయితే ఇజ్రాయెల్‌ ఆరోపణలను ఇరాన్‌ తీవ్రంగా ఖండిచింది. తాము కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేసింది.  కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత ఎలాంటి దాడులు చేయలేదని వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్‌పై తమకు నమ్మకం లేదని ఇరాన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రకటించింది. అయితే.. కాల్పుల విరమణను ఆమోదిస్తున్నామని.. శత్రువుపై తమకు అస్సలు నమ్మకం లేదని ఇరాన్ చెప్పింది. తమ వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని.. చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ‘కాల్పుల విరమణ ఉల్లంఘనలకు’ ప్రతిస్పందనగా.. ఇరాన్ పై దాడులు చేయాలని ఆదేశించిన తర్వాత ఇరాన్ ఈ ప్రకటన చేసింది.  

2033 వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి

    మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలను ఇన్‌ఛార్జ్ మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రచించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తకన్ని సీఎం రేవంత్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు కాంగ్రెస్ నడిపిస్తోందని.. సబ్బండ వర్గాలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేరుస్తూ ఇంటింటా సౌభాగ్యం నిలిచేలా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తోందని తెలుపుతూ పుస్తకన్ని మహేశ్ కుమార్ గౌడ్  రచించారు. ఈ సందర్భంగా పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు.  ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు తెలుగు దేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని సీఎం చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందని 2023 నుంచి 2033 వరకు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉండబోతున్నదన్నారు. ఈ పదేళ్లు పార్టీ కోసం పని చేసే వారిని కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. పదేళ్లు అధికారం నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నడిపించాల్సిన బాధ్యత పార్టీలోని యువతరం తీసుకోవాలని చెప్పారు.  ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ తీసుకువస్తున్నాం. త్వరలో డీలిమిటేషన్ జరగబోతున్నదని సీట్లు పెరగబోతున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రయాణికులకు షాక్..రైల్వే టికెట్‌ ఛార్జీల పెంపు

    ప్రయాణికులపై ఇండియన్ రైల్వే ఛార్జీల భారం మోపడానికి సిద్ధమైంది. గత  కొన్నేళ్లుగా స్థిరంగా ట్రైన్ టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ఛార్జీలు జూలై1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి కానుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ ఛార్జీ కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెరగనుంది.  ఏసీ తరగతుల్లో ప్రయాణానికి కిలోమీటర్‌కు రెండు పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. అయితే, సబర్బన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే, 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సెకండ్ క్లాస్ టికెట్ల ధరల్లో కూడా ఎటువంటి పెంపు ఉండదు. 500 కిలోమీటర్లకు మించిన దూరాలకు మాత్రం సెకండ్ క్లాస్ ప్రయాణంలో కిలోమీటర్‌కు అర పైసా చొప్పున ఛార్జీ పెరగనుంది.  

గజం మిథ్య.. పలాయనం మిథ్య!

ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న... ఫోన్   ట్యాపింగ్ కేసు విచారణ ఏ రోజుకారోజు కొత్త మలుపులు తిరుగుతోంది. కొత్త చిత్రాలను చూపిస్తోంది. ఈ వ్యవహారంలో  విచారణ జరుపుతున్న  సిట్   ఈ కేసులో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న స్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును దఫదఫాలుగా విచారిస్తోంది. అదే సమయంలో గుర్తించిన ఫోన్ ట్యాపింగ్ బాధితులు, రాజకీయ నాయకులను విచారించి వారి నుంచి వాంగ్మూలానను సేకరిస్తోంది. ఇదంతా ఏదో టీవీ డైలీ సీరియల్ వ్యవహారంలా నడుస్తోంది. కానీ..  అవుట్కమ్  ఏమిటన్నది  మాత్రం  భేతాళ ప్రశ్నగానే మిగిలిపోతోంది. అదలా  ఉంచితే..  ఎవరో పెద్దాయన అన్నట్లుగా..  ఈ కేసుకు సంబంధించి అందుతున్న సమాచారం మొత్తం నిజమే అయితే..  ఇది స్వాతంత్ర భారత చరిత్రలో ఏనాడు జరగని మెగా కాదు, మహా మెగా, మహామహా మెగా  ఫోన్ ట్యాపింగ్ కుంబకోణంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ కుంభకోణంలో కేవలం   రాజకీయ కోణం మాత్రమే కాదు.. ఇంకా అనేక కోణాలు ఉన్నాయి అంటున్నారు. అవును.. సమస్త సామాజిక, ఆర్థిక నేరాలకు  ఫోన్ ట్యాపింగ్ సాధనమైందని అంటునారు. ఎవరు ఎందుకు మొదలు పెట్టినా..  ఆ తర్వాత  అయినవారు, కాని వారు, ఎవరికి వారు  నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లు..  ఫోన్ ట్యాపింగ్ ను  సాధనంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాలకు మించిన ప్రయోజనాలు పొందారని అంటున్నారు. అనుమానిస్తున్నారు.     అందుకే..  ఇంతటి మెగా కుంభకోణంలో ఎస్‌ఐబీ  మాజీ చీఫ్ ప్రభాకర రావు పాత్రే కీలకమా?  ఆ ఒక్కడే అన్నీ చేశారా?  పోనీ చేశారే అనుకున్నా.. మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్  వ్యవస్థ ఏమి చేస్తునట్లు? ముఖ్యంగా..  ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉండేందుకే ఉన్నతాధికారులతో  ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ  ఏమి చేసినట్లు, ఏమి చేస్తున్నట్లు?  నిజానికి..  సిట్‌ విచారణకు హాజరైన ప్రతి సందర్భంలోనూ ప్రభాకర్‌రావు ట్యాపింగ్ జరగలేదని ఒక్కసారి కూడా చెప్పలేదు. ట్యాపింగ్  జరిగింది. కానీ, రివ్యూ కమిటీ అనుమతి, ఆమోదంతోనే ట్యాపింగ్‌లు చేసినట్లు స్పష్టంగా చెప్పిట్లు చెపుతున్నారు. అంటే, రివ్యూ కమిటీ ఆమోదతోనే..  ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందని ఎవరైనా అనుకుంటే  కాదనే పరిస్థతి లేదని అంటున్నారు. నిజానికి ప్రభాకరరావు చెప్పక పోయినా.. రివ్యూ కమిటీ  బాధ్యత నుంచి తప్పించుకోలేదు  అంటున్నారు.  మరోవంక రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఉన్న అప్పటి సీఎస్‌ శాంతికుమారి, సభ్యులుగా ఉన్న జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి రఘునందన్‌రావు,  అప్పటి హోం శాఖ కార్యదర్శి జితేందర్‌, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌లు సిట్ కు ఇచ్చినట్లు చెపుతున్న వాంగ్మూలంలో ఎస్‌ఐబీ నుంచి ట్యాపింగ్‌ జాబితా రావడంతో నమ్మకం తో రివ్యూ కమిటీ పూర్తిగా పరిశీలించకుండానే కేంద్ర టెలికం శాఖకు ఫైల్‌ పంపినట్లు తేలిందని అంటున్నారు. అదే నిజం అయితే..  జరిగిన  భారీ  అనర్ధాలకు రివ్యూ కంమిటీనే బాధ్యత వహించవలసి ఉంటుంది కదా  అని నిపుణులు  ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు..   ఇంత పెద్ద ఎత్తున, వారు వీరని లేకుండా..  వందల వేల మంది  ఫోన్లు ట్యాప్  చేసిన మెగా  కేసును,విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన  ప్రత్యేక విచారణ బృందం(సిట్) సరి పోతుందా?  సిట్ విచారణతో  ఒకరిపై ఒకరు రాజకీయ బురద చల్లుకోవడం, తుడుచుకోవడం కాకుండా.. ఇంకా ఏమైనా జరుగుతుందా? అంటే..  ఆ అవకాశమే  లేదంటున్నారు. కేసు పరిధి, పరిమాణంతో పాటు గా.. కేంద్ర ప్రభుత్వ చట్టాలతోనూ ముడిపడిన ఈ  కేసు విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడం ఒక్కటే మార్గమని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.అయితే..  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించేలా లేదు. చివరకు..  ఇప్పటికే చాల చాలా కేసుల్లో జరిగిన  విధంబుగానే .. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా,‘గజం మిథ్య పలాయనం మిథ్య’ అన్నట్లు తేలిపోతుందని  అంటున్నారు.

ముగిసిన ఏపీ మంత్రి వర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలివే

  పోలవరం -బసకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో  తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజకీయాల కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన అవసరం మంత్రులపై ఉందని చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 42 అజెండా అంశాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. అమరావతిలో మలివిడత భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తొలివిడత నిబంధనలే మలివిడతకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాలను ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాస్థాయిలో నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్న క్యాంటీన్లు మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకవడానికి ఒక కమిటీని వేయాలని సీఎం సూచించారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్- 1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎంచంద్రబాబు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్‌లోనే ప్రవేశించి కొంటున్నామని స్పష్ట చేశారు. పొగాకుకు మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో రూ. 250 కోట్లు మనం మార్కెట్‌లో ప్రవేశించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వాణిజ్య పంటలకు డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలు వేసే విధంగా రైతులను మోటివేట్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ రైతుల్లో అవగాహన తీసుకురావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

నేను నా భార్య మాట్లాడుకునేది విన్నారు.. ఈటల సంచలన వాఖ్యలు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ  ఈటల రాజేందర్ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతు ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇంకా ఎంతకాలం చేస్తారని ఎంపీ   ప్రశ్నించారు. హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ అనేక సార్లు ట్యాప్ చేశారని అన్నారు. నేను, నా భార్య మాట్లాడుకునే సంభాషణలు కూడా విన్నారని నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్ మెన్‌ల ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తనకు అనుకులంగా పనిచేసే వారిని ఉన్నత స్థాయిలో నియమించుకున్నారని తెలిపారు.  ట్యాపింగ్ కేసులో ఎవరు ఉన్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల  డిమాండ్ చేశారు. 2023లో గజ్వెల్‌లో, హుజురాబాద్‌లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం అక్రమం అని చెప్పారు. గత బీఆర్‌ఎస్ హయాంలో  జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల రాజేందర్  ప్రశ్నించారు. ఎందుకు నివేధికలను బయటపెట్టడంలేదని అడిగారు.  రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.  సంఘవిద్రోహ శక్తులు కాకుండా నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో విచారణ కమిటీ వేశారు కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని ఎంపీ ఈటల పేర్కొన్నారు.

ఎమ‌ర్జెన్సీ @ 50 ఏళ్లు

జూన్ 25..  ఇది కొంద‌రి పాలిట ఒక పీడ‌క‌ల‌. మ‌రి కొంద‌రి జైలు జీవితానికి  కార‌ణం. 1975 నుంచి 1977 వ‌ర‌ూ మొత్తం 21 నెల‌ల కాలం.. నాటి ప్ర‌ధాని ఇందిర విధించిన ఈ అత్య‌యిక స్థితి దేశ చ‌రిత్ర‌లోనే ఒక‌ చీక‌టి అధ్యాయం. అంత‌ర్గ‌త స్థితిగ‌తుల్లోని అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా రాజ్యాంగంలోని  ఆర్టిక‌ల్ 352 కింద అధ్య‌క్షుడు ఫ‌క్రుద్దీన్ అలీ అహ్మ‌ద్ కార‌ణంగా  జారీ  చేసిన అత్య‌యిక స్థితి 1975 జూన్ 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. అది 1977 మార్చి 21న ముగిసింది. ఈ ఉత్త‌ర్వుతో  ప్ర‌ధానికి డిక్రీ ద్వారా పాలించే అధికారం వ‌చ్చింది. ఎన్నిక‌లు  ర‌ద్దు చేయ‌డానికి, పౌర స్వేచ్ఛ నిలిపేయ‌డానికి.. వీలు క‌ల్పించింది. ఈ ప‌రిస్థితుల్లో ఎక్కువ భాగం ఇందిరా గాంధీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌లో ఎక్కువ మందిని  జైల్లో పెట్టారు. అంతే  కాదు ఏకంగా ప‌త్రికా స్వేచ్ఛ‌కే భంగం క‌లిగింది. ప‌త్రిక‌ల్లో వ‌చ్చే ప్ర‌తి వార్తా ఆనాడు సెన్సార్ అయ్యిందంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఒకటీ  రెండు కాదు సుమారు ల‌క్ష మందికి పైగా  రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు, జ‌ర్న‌లిస్టులు, అస‌మ్మ‌తి వాదుల‌ను జైల్లో పెట్టారంటే  ప‌రిస్థితి  ఎంత దారుణంగా, దుర్మార్గంగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ స‌మ‌యంలో ఇందిర కుమారుడు సంజ‌య్ గాంధీ వాసెక్ట‌మీ  కుటుంబ నియంత్రణ అంటూ వాసెక్టమీ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించ‌డానికి ప్ర‌చారం నిర్వ‌హించారు.  దేశానికి అంత‌ర్గ‌తంగానూ బ‌య‌ట  నుంచి గానీ  ముప్పు ఉంద‌న్న ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌ధాని ఇందిర ప్ర‌తిపాదించ‌గా నాటి బార‌త రాష్ట్ర‌ప‌తి  అంగీక‌రించారు. 1975 జూలై నుంచి ఆగ‌స్టు వ‌ర‌కూ కేబినెట్ పార్ల‌మెంట్ రెండూ  ఆమోదించాయి. భార‌త  దేశానికి త‌క్ష‌ణ అవ‌స‌రం దృష్ట్యా ఈ ఎమ‌ర్జెన్సీ విధింపు స‌రైన‌దిగా స‌మ‌ర్ధించుకుంది  నాటి ఇందిర ప్ర‌భుత్వం. 1967- 1971 మ‌ధ్య కాలంలో ఇందిరా గాంధీ  ప్ర‌భుత్వం, కాంగ్రెస్ పార్టీలను పూర్తి  నియంత్ర‌ణ లోకి తీసుకున్నారు. పార్ల‌మెంటులో భారీ మెజార్టీ పొందారు. కేంద్ర ప్ర‌భుత్వ అధికారాన్ని ప్ర‌ధాని కార్యాల‌యంలో కేంద్రీ  క‌రించ‌డం ద్వారా మ‌రింత‌  ప‌ట్టు సాధించారు. ఆమె ఎన్నికైన కేబినెట్ స‌భ్యుల‌ను ముప్పుగా భావించి అవిశ్వాసం పెట్టించారు.  బ్యూరోక్ర‌సీ ఆలోచ‌నలు విస్తృతంగా ప్రోత్స‌హించారు. కాంగ్రెస్ లో ఇందిర త‌న ప్ర‌త్య‌ర్ధుల‌ను అధిగ‌మించి 1969లో పార్టీని జీరో సిండికేట్ నుంచి కాంగ్రెస్ ఆర్ గా విభ‌జించారు. ఎక్కువ మంది ఎంపీలు త‌న   వైపు ఉండేలా చేసుకున్నారు ఇందిర. పాత కాంగ్రెస్ కు కొత్త కాంగ్రెస్ కూ తేడా ఇందిర‌. పాత కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యానికి పెద్ద పీట వేసేవారు.  అదే ఇందిర మార్క్ పార్టీ అంటే కేవ‌లం ఆమె, ఆమె కుటుంబం ప‌ట్ల విధేయ‌త క‌లిగి ఉండ‌ట‌మే ఆయా నాయ‌కుల‌ ప్ర‌ధాన అర్హ‌త‌గా ఉండేది. ఒక స‌మ‌యంలో ఇందిర మోనార్కిజం ఎంత‌గా మారిపోయిందంటే..  ఆయా అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు కాకుండా.. ఆమె ఎంపిక చేసిన వారు మాత్ర‌మే ముఖ్య‌మంత్రి అయ్యేవారు. అయితే ఇందిరాగాంధీ  ఆ రోజుల్లో ఇంత‌గా వెలుగులోకి రావ‌డానికి గ‌ల కార‌ణ‌మేంట‌ని  చూస్తే.. ఆమెకు ఒక మ‌హిళానేత‌గా ప‌బ్లిక్ లో ఉన్న ఆక‌ర్ష‌ణ   మెయిన్ రీజ‌న్ గా  కనిపిస్తుంది. దానికి తోడు.. 1969 జూలైలో అనేక బ్యాంకుల జాతీయ‌క‌ర‌ణ‌,  1970లో ప్రైవేట్ ప‌ర్స్ ర‌ద్దు వంటివి ముఖ్య‌పాత్ర పోషించారు. త‌ర‌చూ ఆర్డినెన్సులు జారీ చేస్తూ ప్ర‌త్య‌ర్ధుల‌ను షాక్ ల‌కు గురి చేసేవారు ఇందిర‌.  పేద‌లు, దళుతులు, మ‌హిళ‌లు, మైనార్టీలే టార్గెట్ గా ఆమె రాజ‌కీయాలు న‌డిపేవారు. దీంతో ఆమెకు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఏర్ప‌డింది. త‌న ప‌రిపాల‌న మొత్తం ఓటు బ్యాంకు రాజ‌కీయాల  కోస‌మే న‌డిచేవి. వీటి చుట్టూ తాను పాలించ‌డం మొద‌లు పెట్టారామె. 1971 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇందిర  గ‌రీబీ హ‌టావో నినాదం..  ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.  దీంతో జ‌నం విప‌రీతంగా ఆక‌ర్షితుల‌య్యారు. భారీ మెజార్టీతో గెలిచారు. 518 సీట్ల‌కుగానూ 352 స్థానాలలో విజయం సాధించింది కాంగ్రెస్ ఆర్ పార్టీ .  దీంతో కాంగ్రెస్ ఆర్ నిజ‌మైన కాంగ్రెస్ గా ప్ర‌సిద్ధి చెందింది. అంతే కాకుండా 1971 యుద్ధంలో భార‌త్ బ‌ద్ధ శ‌తృవు పాకిస్థాన్ని  ఓడించారు. ఇది గ‌తంలో తూర్పు పాకిస్థాన్ గా ఉండిన బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారి తీసింది. ఆ మ‌రుసటి  నెల‌లో ఇందిర‌కు భార‌త ర‌త్న అవార్డు ప్ర‌దానం చేశారు. త‌ర్వాతి కాలంలో ఆమెను భార‌త  సామ్రాజ్ఞిగా ఇంద‌ర్ మ‌ల్హోత్రా వంటి ర‌చ‌యిత‌లు అభివ‌ర్ణించారు. ఆనాడు ఆమె ఏ స్థాయికి ఎదిగారంటే నిత్యం ఆరోపించే ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా ఆమెనొక అభిన‌వ దుర్గ‌తో స‌మానంగా ఆరాధించ‌డం మొద‌లు పెట్టేంత‌. అలా అలా ఇందిరాగాంధీ ప్ర‌భ నానాటికీ పెరిగిపోతూ వ‌చ్చి.. చివ‌రికి.. అది అతి పెద్ద నియంతృత్వం కింద‌కు వ‌చ్చేసింది. చివ‌రికి న్యాయ వ్య‌వ‌స్థ‌ను సైతం త‌న కంట్రోల్లోకి తీసుకొచ్చే వ‌ర‌కూ ఆమె పాల‌న  కొన‌సాగింది.  దీంతో ఆమెను ఇటు ప‌త్రికా వ్య‌వ‌స్థ‌తో పాటు అటు జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ వంటి వారు తీవ్రంగా  వ్య‌తిరేకిస్తూ రావ‌డం మొద‌లైంది.   దీంతో కొంద‌రు కాంగ్రెస్ లీడ‌ర్లు.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కోసం డిమాండ్ చేశారు. డిసెంబ‌ర్ 1973- మార్చి 1974 మ‌ధ్య న‌వ నిర్మాణ్ ఉద్య‌మం మొద‌లైంది. గుజ‌రాత్ విద్యా మంత్రికి వ్య‌తిరేకంగా జ‌రిగిన విద్యార్ధి ఉద్య‌మం ఇందులో అత్యంత ముఖ్య‌మైన‌ది. ఇది ఆనాటి ముఖ్యమంత్రి రాజీనామాకు దారి తీయ‌డం మాత్ర‌మే కాకుండా.. గుజ‌రాత్ లో రాష్ట్ర‌పతి పాల‌న విధించ‌డానికి దారి తీసింది. ఇంత‌లో కొంద‌రు నాయ‌కుల‌పై హ‌త్యా య‌త్నాలు జ‌రిగాయి. రైల్వే మంత్రి ల‌లిత్ నారాయ‌ణ్ మిశ్రా బాంబు దాడితో హ‌త్య‌కు గుర‌య్యారు. ఇవ‌న్నీ దేశంలో పెరుగుతున్న శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను ఎత్తి చూపాయి. వీటిపై ఇందిర స‌న్నిహితుల‌తు ఆమెను హెచ్చ‌రించ‌డం మొద‌లు పెట్టారు. 1974 మార్చి- ఏప్రిల్ మ‌ధ్య కాలంలో బీహార్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీహార్ ఛాత్ర సంఘ‌ర్ష్ స‌మితి  నిర్వ‌హించిన ఆందోళ‌న‌కు విప‌రీత‌మైన మ‌ద్ధ‌తు ల‌భించింది. ఇందుకు జేపీగా పిలిచే జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ నేతృత్వం వ‌హించారు. 1974 ఏప్రిల్ లో పాట్నాలో జేపీ  సంపూర్ణ విప్ల‌వానికై పిలుపునిచ్చారు. విద్యార్ధులు, రైతులు, ప్ర‌జా క‌ళాసంఘాలు ఈ ఉద్య‌మంలో పాల్గొన్నాయి. భార‌తీయ స‌మాజాన్ని అహింస దిశ‌గా ప‌య‌నించాల‌న్న పిలుపునిచ్చారాయ‌న‌. అంతే కాదు రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ర‌ద్దుకు పిలుపు నిచ్చారు జేపీ. ఇందుకు కేంద్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌లేదు. నెల త‌ర్వాత దేశంలో అతి పెద్ద యూనియ‌న్ అయిన రైల్వే ఉద్యోగుల సంఘం.. దేశ వ్యాప్త స‌మ్మెకు పిలుపునిచ్చింది. ఇందుకు జార్జ్ ఫెర్నాండెజ్ నాయ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌న సోష‌లిస్ట్ పార్టీ అధ్య‌క్షుడు కూడా. ఈ స‌మ్మెను ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం క్రూరంగా అణిచివేసింది. ఇది వేలాది మంది ఉద్యోగుల అరెస్టు చేసి.. వారి కుటుంబాల‌ను వారి నివాసాల నుంచి వెళ్ల‌గొట్టేలా చేసింది. మొరార్జి దేశాయ్ అధిప‌తిగా నానాజీ దేశ్ ముఖ్ కార్య‌ద‌ర్శిగా లోక్ సంఘ‌ర్ష్ స‌మితి క‌మిటీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేశారు జేపీ. ప్ర‌ధాని ఇంటిని చుట్టుముట్ట‌డం.. రైళ్లు క‌ద‌ల‌కుండా చేయ‌డం, కోర్టులు, ఇత‌ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ప‌ని చేయ‌కుండా ఈ క‌మిటీ సూచించింది. 1971 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇందిర చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయ‌ణ్ ఈ  ఎన్నిక‌ల్లో మోసం ద్వారా  ఇందిర  గెలిచార‌ని అల‌హాబాద్ కోర్టులో ఆమెపై కేసు వేశారు. ఇందిర త‌ర‌ఫున నానీ పాల్కీ వాలా కేసు వాదించ‌గా..  శాంతి భూష‌ణ్- రాజ్ నారాయ‌ణ్ త‌ర‌ఫున వాదించారు. ఈ సంద‌ర్భంగా ఇందిర హైకోర్టులో క్రాస్ ఎగ్జామిన్ కాగా.. సుమారు 5 గంట‌ల పాటు ఆమె న్యాయ‌మూర్తి ముందు హాజ‌రు కావ‌ల్సి వ‌చ్చింది. ఒక ప్ర‌ధాని ఇలా హాజ‌రు కావ‌డం అదే మొదటి సారి. అప్ప‌ట్లో అదొక సంచ‌ల‌నం. 1975 జూన్ 12న అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి  సిన్హా ప్ర‌ధాని ఇందిర‌ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశార‌నే అభియోగంపై ఆమెను దోషిగా తీర్పునిచ్చారు. ఇందిర‌ ఎన్నిక చెల్ల‌ద‌ని   ప్ర‌క‌టించింది అల‌హాబాద్ హైకోర్టు. ఆమె లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలనీ,   ఆరు సంవ‌త్స‌రాల పాటు  ఏ ఎన్నిక‌లోనూ పాల్గొన‌కుండా చేయాల‌ని  తీర్పునిచ్చింది.  ఇందిర మ‌ద్ద‌తుదారులు ఈ తీర్పునకు వ్యతిరేకంగా సామూహిక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. హైకోర్టు నిర్ణ‌యాన్ని  ఇందిర  సుప్రీంలో స‌వాలు చేశారు. జ‌స్టిస్ అయ్య‌ర్ 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును స‌మ‌ర్ధిస్తూ.. ఎంపీగా ఇందిర హ‌క్కుల‌ను నిలిపివేయాల‌ని సూచించారు. అయితే అప్పీల్ ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కూ ఆమె ప్ర‌ధానిగా  కొన‌సాగాల‌ని ఆదేశించారు.  అయితే ఆ స‌మ‌యంలో ఇందిర తాను ఎంపిక చేసిన అధ్య‌క్షుడు ఫ‌క్రుద్దీన్ అలీని దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించాల్సిందిగా అభ్య‌ర్ధించారు. మూడు గంట‌ల్లోగా  అన్ని వార్తా సంస్థ‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. అంతే కాదు జేపీ వంటి ఎంద‌రో రాజ‌కీయ నాయ‌కుల‌ను అరెస్టు చేశారు. ఇదంతా కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం లేకుండానే జ‌రగటం విశేషం. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 352, 356 ప్ర‌యోగిస్తూ.. త‌న‌కు అసాధార‌ణ అధికారాల‌ను క‌ల్పించుకుని.. పౌర హ‌క్కులు, రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌పై భారీ అణిచివేత ప్రారంభించారు ఇందిర‌. ఆ స‌మ‌యంలో అరెస్టు అయిన వారిలో విజయరాజే సింధియా, జయప్రకాష్ నారాయణ్, ములాయం సింగ్ యాదవ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్,  కృపలానీ, జార్జ్ ఫెర్నాండెజ్, అనంత్ రామ్ జైస్వాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, అరుణ్ జైట్లీ,  జై కిషన్ గుప్తా, సత్యేంద్ర నారాయణ్ సిన్హా,  జైపూర్ రాణి- గాయత్రి దేవి. ఇలా..   ఎంద‌రో నాయకులు ఉన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  జమాత్-ఇ-ఇస్లామి వంటి సంస్థలు , కొన్ని రాజకీయ పార్టీలను నిషేధించారు. సీపీఎం నాయకులు.. అచ్యుతానందన్, జ్యోతి బసులను వారి పార్టీతో సంబంధం ఉన్న అనేక మంది ఇతరులతో పాటు అరెస్టు చేశారు. అత్యవసర పరిస్థితి ప్రకటన  రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా విభేదించిన కొంద‌రు కాంగ్రెస్ నాయకులు.. మోహన్ ధారియా, చంద్ర శేఖర్ వంటివారు తమ ప్రభుత్వ, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత అరెస్టై నిర్బంధంలో  ఉన్నారు. డీఎంకే వంటి ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా అరెస్టు అయ్యారు. అంతే కాదు తెలుగులో ఈ ఎమ‌ర్జెన్సీలో అరెస్ట‌యిన వారెవ‌రిని చూస్తే య‌ల‌మంచ‌లి శివాజీ మొద‌టి వ‌రుస‌లో నిలుస్తారు. ఇలా దేశ‌మంతా ఒకానొక ఎమ‌ర్జెన్సీకి లోనై ఎన్నో భ‌యాన‌క‌మైన ప‌రిస్థితులు ఎదుర్కున్నది. ఈ ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా ములాయం సింగ్ యాద‌వ్, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్, జార్జి ఫెర్నాండెజ్ వంటి ఎంద‌రో లీడ‌ర్లు దేశ రాజ‌కీయాల్లోకి దూసుకొచ్చారు. తెలుగువారిలో ఎలమంచలి శివాజీతో పాటు వెంకయ్యనాయుడు తదితరులు జైలు పాలయ్యారు. 1977 జనవరి 18న, ఇందిరా గాంధీ మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎందరో ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. ఈ ఎన్నికలు 1977 మార్చి 16 నుంచి 20 వరకూ జరగాయి. జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా 298 సీట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం 154 సీట్లు మాత్రమే సాధించింది. ఇందిర సైతం తన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ పై రాయ్ బరేలీలో ఓటమిపాలయ్యారు. ఇక జనతాపార్టీ మిత్ర పక్షాలు మరో 47 సాధించడంతో తొలిసారిగా కాంగ్రేసర ప్రధానిగా మొరార్జీ దేశాయి ప్రధానిగా ఎన్నికయ్యారు. అలా ఎమర్జెన్సీ అనే ఒక అంకానికి భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్పారు.

వైసీపీ అధినేత జగన్‌పై మరో కేసు

  వైసీపీ అధినేత జగన్‌పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. దీనిపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కోడ్ ఉన్నా వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి  నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై జగన్‌తో పాటు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  వీరందరికీ ఇప్పటికే సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో సూచించారు. కాగా, పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలోనూ జగన్‌పై కేసు నమోదైన విషయం విదితమే. తాజాగా గుంటూరు మిర్చి యార్డు ఘటనతో ఆయనపై మరో కేసు నమోదైనట్లయింది.   

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అమ్మ.. కేబినెట్ భేటీ నుంచి హైదరాబాద్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్

తన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలియడంతో కేబినెట్ భేటీలో ఉన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం (జూన్ 24) కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఆ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అయితే కేబినెట్ సమావేశం మొదలైన కొద్ది సేపటికే పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీఎంకు, సహచర మంత్రులకు విషయం చెప్పి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.  

12 పెళ్లిళ్ల నిత్య పెళ్లి కూతురు అంటూ ఫిర్యాదు.. నిరూపించమంటూ నీలిమ సవాల్!

ఎప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో  నిత్యపెళ్లి కొడుకు క్యారెక్టర్ ను చూశాం. డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకుంటూ పోయే అలాంటి నిత్యపెళ్లికొడుకులకు సంబంధించి వార్తలు మీడియాలో విన్నాం. కన్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నిత్య పెళ్లికూతురి గురించి.  కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈమె అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ విడాకులు పొంది, ఆర్థికంగా స్థితిమంతులైన మగవారిని టార్గెట్ చేసుకుని వల విసిరి పెళ్లి చేసుకుంటుంది.  రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ తన తల్లి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్ ల సహకారంతో విడాకులు తీసుకుని డిప్రషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుంటుంది. ఇక అలా డిప్రషన్ లో ఉన్న వారు ఆర్థికంగా స్థితిమంతులైతే వారిని వదలదు. వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటుంది. కొంత కాలం తరువాత.. వారి నుంచి అందినంత సొమ్ము లాగేస్తుంది. ఇదీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో   నిత్య పెళ్లి కూతురు నీలిమపై కొంతమంది బాధితులు సోమవారం (జూన్ 23)  గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదు. అయితే నీలిమ    తాను అటువంటిది దానిని కాదనీ, తాను  ఎక్కడ 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానో నిరూపించాలని   సవాల్ చేస్తోంది. ఇపుడు వాస్తవం ఏమిటో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.   ఆర్థిక స్థోమత ఉండి,   విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని పెళ్ళి పేరుతో మోసం చేస్తోందంటూ,  నీలిమపై కొంతమంది బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నీలిమ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయి ఉంది.   నీలిమ కు సహకరిస్తున్న ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, మద్దాల శ్రీను, కళ్యాణ్, దుర్గ అనే వ్యక్తులపై ఇప్పటికే పాలకొల్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.   నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి, శ్రీను, కళ్యాణ్, దుర్గలు ఒక ముఠా గా ఏర్పడి పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం ఎత్తి భార్యా బాధితులను వలలో వేసుకుని మోసానికి పాల్పడుతున్నట్లు నీలిమపై బాధితులు ఫిర్యాదు చేశారు.  ఈ వార్త మీడియాలో రావడంతో నీలిమ కూడా మీడియా ముందుకు వచ్చి తాను 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానడం తప్పు అని ఖండించింది. ఈ పెళ్ళిళ్ళను నిరూపించకపోతే దీనిపై తాను ఎంత దూరమైనా వెళతానని నీలిమ హెచ్చరించింది.   మరో ప్రక్క విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి నీలిమ వారిని వివాహం చేసుకుని డబ్బు దండుకుని మాయం అవుతోందని బాధితులు వాపోతున్నారు. ఎవరైనా తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు  కు చెందిన బాధితులు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ లో తమకు జరిగిన మోసాన్ని వివరించి, నీలిమ దోచుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. ఒకరు 50 లక్షలు ఇచ్చి మోసపోగా, మరొకరు 15లక్షలు ఇచ్చి మోసపోయామని  పేర్కొంటున్నారు. దీనిలో ఎవరి ఫిర్యాదు కరెక్ట్ అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన టెన్త్ బాలిక

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలసి టెన్త్ క్లాస్ చదువుతున్న భాలిక కన్నతల్లినే కడతేర్చింది.  తెలంగాణ ఉద్యమకారిణి , తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ మునిమనవరాలైన అంజలిని ఆమె 16ఏళ్ల కూతురు తేజశ్రీ దారుణంగా హతమార్చింది. టెన్త్ క్లాస్ చదువుతున్న తేజశ్రీ 19 ఏళ్ల శివ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఐదు రోజుల కిందట ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాగా ఈ విషయంపై అంజలి పోలీసు స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల కిందట తేజశ్రీ తిరిగి ఇంటికి వచ్చింది. అలా వచ్చిన కుమార్తెను అంజలి మందలించింది. ఈ వయస్సులో ప్రేమ వ్యవహారాలు కరెక్ట్ కాదు, బుద్ధిగా చదువుకోమని హితవు చెప్పింది. అయితే తన ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన తేజశ్రీ ప్రియుడు శివతో కలిసి తల్లిని హత్య చేయడానికి స్కెచ్ వేసింది. ఇందుకు శివ తమ్ముడు యశ్వంత్ కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం (జూన్ 22) శివ, యశ్వంత్ లు తేజశ్రీ ఇంటికి వచ్చారు.  ఆ తరువాత ముగ్గురూ కలిసి అంజలిపై దాడి చేసి చున్నీతో గొంతు బిగించి తలపై రాడ్ తో కొట్టి హతమార్చారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 

పాలకొల్లు అమ్మాయి.. అంతరిక్షయానం

మన పాలకొల్లు అమ్మాయి ఏకంగా అంతరిక్షయానం చేయనుంది. ఇప్పటి వరకూ భారత్ లో పుట్టి ఇక్కడే నివసిస్తున్న మహిళ అంతరిక్షయానానికి ఎంపికైన చరిత్ర లేదు. అయితే అంతరిక్షయానానికి ఎంపికై మన  పాలకొల్లు అమ్మాయి జాహ్నవి చరిత్ర సృష్టించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షల్లో  జాహ్నవి దంగేటి ఉత్తీర్ణురాలై ఈ స్పేస్ మిషన్ కి అర్హత సాధించింది. ఈ మేరకు జాహ్నవి కి  టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నుంచి వర్తమానం అందింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్  భారీ  అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్ లో  అంతరిక్ష ప్రయోగ ,వాణిజ్య ,పర్యాటక  కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ కేంద్రం నిర్మాణంలో మొదటిగా కొద్ది మంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులతో ప్రయోగాన్ని చేపట్టనున్నారు. 2029  మార్చి నెలలో నిర్వహించబోయే టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్   మొదటి అంతరిక్ష  ప్రారంభ  యాత్ర బృందంలో భారతదేశం నుంచి జాహ్నవి దంగేటి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ యాత్రలో భాగంగా జాహ్నవి ఐదు గంటలపాటు అంతరిక్షంలో గడపనుంది.        ఇప్పటికే మూడుసార్లు అంతరిక్ష యాత్రలు పూర్తిచేసిన అమెరికాకుచెందిన సీనియర్ వ్యోమగామి బిల్ మేక్ ఆర్థర్ నేతృత్వంలో టైటాన్స్ స్పేస్ మిషన్ తొలి అంతరిక్ష యానం చేయనుంది.ఇందుకు సంబందించిన వ్యోమగామి అభ్యర్థుల కు వచ్చేఏడాది అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల మూడేళ్లపాటు  శిక్షణ ఇస్తారు.  ఇంత వరకు భారత సంతతికి చెందిన అమెరికన్లు సునీతా విలియమ్స్ ,కల్పనా చావ్లా వ్యోమగాములుగా అంతరిక్షంలో అడుగిడారు. అయితే జాహ్నవి దంగేటి మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని  పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో   జన్మించింది. చిన్నతనంనుంచే చంద్రుడిపై అడుగుపెట్టాలని ధృఢనిశ్చయంతో ఆ దిశగా తన లక్ష్యాన్ని మలుచుకుంది.ఇంటర్మీడియట్ వరకు పాలకొల్లులోనే విద్యాభ్యాసం చేసిన జాహ్నవి ఇంజనీరింగ్ మాత్రం పంజాబ్ లో పూర్తిచేసింది. 2021  లో అమెరికా లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం కి భారతదేశం నుంచి ఎంపికై రికార్దు సృష్టించింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాల్లో జరుగుతున్న వ్యోమగామి   శిబిరాల్లో శిక్షణ పొందుతూ వస్తోంది. పోలెండ్ లో అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించిన జాహ్నవిఐస్ లాండ్ దేశంలో జియో స్పేస్ సెంటర్లో  శిక్షణ తీసుకున్న మొదటి భారతీయురాలిగా నిలిచింది. ఇక్కడే 1965 , 1967  సంవత్సరాల్లో అమెరికా  అపోలో  ఆస్ట్రోనాట్ లు శిక్షణ పొందారు. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బృందం కూడా జియో స్పేస్ సెంటర్  లోనే శిక్షణ పొందటం జాహ్నవికి మరింత స్ఫూర్తి కలిగించింది.

పాలు విరిగిపోయాయంటూ పీఎస్ లో కేసు

కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు కాదేదీ పోలీసు కంప్లైంట్ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా కుకట్ పల్లి పోలీసు స్టేషన్ లో అరుదైన కేసు నమోదైంది. అదేంటో తెలుసా.. కొన్న ప్యాకెట్ పాలు విరిగిపోయాయంటూ దుకాణదారుడిపై కేసు పెట్టాడో పెద్దమనిషి. పాపం పోలీసులు కూడా చేసేదేం లేక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..కుకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చి కాచగానే పాలు విరిగిపోయాయి. దీంతో సదరు పాలను కొనుగోలు చేసిన వ్యక్తి రత్నదీప్ కు వెళ్లి సంగతి చెప్పాడు. దానికి దుకాణదారు దానిని మేమేం చేస్తాం అంటూ బదులిచ్చాడు. దీంతో ఆ కొనుగోలుదారుడు తిన్నగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. దుకాణదారుపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   ఇటీవలి కాలంలో ప్యాకెట్ పాలు కాచగానే విరిగిపోతున్నాయనీ, వాసన వస్తున్నాయనీ పలువురు చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కస్టమర్లు అంటున్నారు. లేకుంటే పాలు విరిగిపోయాయి, వాసన వస్తున్నాయంటే పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

కడప ఎంపీ అవినాష్ అనుచరులపై కేసు

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహిత అనుచరులపై కేసు నమోదైంది. మాజీ మంత్రి వైఎస్  వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ ను కారులో వెంబడించారన్న ఆరోపణలపై వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ లపై పులివెందుల పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తనను కొందరు వ్యక్తులు కారులో వెంబడించారనీ, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందనీ పులివెందుల పోలీసు స్టేషన్ లో చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.   సునీల్ యాదవ్   ఫిర్యాదు మేరకు లోకేశ్ రెడ్డి, పవన్ కుమార్ లపై బీఎన్ఎస్  లోని 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పులివెందుల పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న లోకేశ్ రెడ్డి, పవన్ కుమార్  పోలీసుల ఎదుట లొంగిపోతారని వైసీపీ స్థానిక నాయకులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.