దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి...
posted on Oct 14, 2019 @ 11:56AM
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఢిల్లీ లో మళ్లీ కాలుష్యం పెరిగిపోయింది, ప్రస్తుతం ఢిల్లీలో ఎలాంటి వర్షాలూ లేవు. తూర్పు భారతదేశంలో చూసుకుంటే సిక్కిం, అసోం, త్రిపురలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. చత్తీస్ ఘడ్, ఒడిశా లో సాధారణ వర్షాలు పడుతున్నాయి, మధ్యప్రదేశ్ లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
మధ్య మహారాష్ట్ర లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో ముంబై, పూణెలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కర్ణాటకలో సాధారణ నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి, గడిచిన 24 గంటల కాలంలో రాజన్న సిరిసిల్లలో ఆరు సెంటీమీటర్ లు, రంగారెడ్డిలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ లో మధ్యాహ్నం ఐతే చాలు వాతావరణం చల్లగా మారిపోతోంది. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా గడిచిన 24 గంటల కాలంలో శ్రీకాకుళం లో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి, అత్యధికంగా గడిచిన ఇరవై నాలుగ్గంటల్లో కర్నూలు లో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.