దేశంలోనే నెం.2.. పొల్యూషన్ లో పోటీ పడుతున్న హైదరాబాద్
posted on Nov 2, 2019 @ 2:38PM
మొదటి స్థానంలో ఉన్న దేశ రాజధానికి పోటీ పడుతుంది హైదరాబాద్ నగరం. కార్పొరేట్ కంపెనీల విషయంలోనే కాదు కాలుష్యం విషయంలో కూడా ఎక్కడా తగ్గటం లేదు. నగరం లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలతో భాగ్యనగర వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దీపావళి పండుగ అనంతరం నగరంలో ఉన్న గాలి నాణ్యత పై ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది దీపావళి రోజు నమోదయిన వాయు కాలుష్యం కంటే ఈ ఏడాది కాలుష్యం పెరిగిందని అందులో స్పష్టంగా తెలిపింది. గత ఏడాది హైదరాబాద్ లో కాలుష్యం 622మైక్రో గ్రాములు ఉండగా..ఈ ఏడాది 830 మైక్రో గ్రాములకు చేరిందని వెల్లడించింది.
ఇప్పటికే కాలుష్యం కారణంగా దేశ రాజధాని డేంజర్ జోన్ లో పడింది. ఢిల్లీలో మాస్క్ లేకుండా బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అవే పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రాబోతున్నాయి. గాలిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటితే ప్రమాదకరమని పీసీబీ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే ఇప్పటికే నగరంలో చాలా చోట్ల ఈ పరిమితి దాటి పోవడంతో భాగ్యనగర వాసులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మ రేణువుల స్థాయిని బట్టి కాలుష్యాన్ని నిర్థారిస్తారు. గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5, 10 అని రెండు రకాల కాలుష్య కారక సూక్ష్మజీవులుంటాయి. పీఎం 2.5 అంటే 2.5 మిల్లీ మైక్రాన్ల మందం కలిగిన ప్రమాదకరమైన రేణువులు ఉంటాయి.. వీటినే దహన రేణువులు అని కూడా అంటారు. వస్తువులను కాల్చినప్పుడు గాలిలోకి చేరే మసి..లోహ కణాలు.. వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. పీఎం 10 అంటే 10 మిల్లీ మైక్రాన్ల మందం ఉన్న రేణువులు దుమ్మూ, ధూళీ, పూల పుప్పొడి, బూజు రేణువులు వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. 2.5 పీఎం అంటే పది కంటే అత్యధిక ప్రమాదకరం భాగ్యనగరం లో 720 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వద్ద 2.5 పీఎం వాయు కాలుష్య తీవ్రత నమోదైంది. దీని వలన ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో బయటకు రావడానికి కూడా కష్టం అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.