తెలంగాణలో జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
posted on Jul 1, 2020 @ 12:07PM
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. వైద్యం, అత్యవసర విధుల్లో పాల్గొనేవారికి మాత్రమే కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరూ బయటకు రాకూడదు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు, అత్యవసరాల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.