ఏపీలో ఒక్కరోజే 2,412 కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 2,412 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీలో ఒక్కరోజే ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 468 నమోదు కావడం గమనార్హం. గుంటూరు తర్వాత ఆ స్థాయిలో కర్నూలు జిల్లాలో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటికవరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,451 కి చేరింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 44 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 452 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 16,621 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ.. 26 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని సీఎం కమిటీని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.  పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చింది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

సంబంధంలేని విషయాల్లో కాలు, వేలు ఎందుకు పెడతావు బాబు: విజయ్ సాయి రెడ్డి

విజయనగరం సంస్థానానికి సంబంధించిన మాన్సస్ ట్రస్ట్ విషయమై వైసిపి, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. కొద్దీ రోజుల క్రితం వరకు ట్రస్ట్ చైర్మన్ గా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఉండగా వైసిపి ప్రభుత్వం అయనను తప్పించి ఆనంద్ గజపతి రాజు కుమార్తె సంచయిత ను చైర్మన్ గా చేసింది. దీంతో అటు టీడీపీ ఇటు వైసిపి నాయకులు మీరు ఆస్తులు దోచేశారంటే కాదు మీరే దోచేశారంటూ విమర్శించుకుంటున్నారు. తాజాగా వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఇదే విషయమై నిన్న వైసిపి ప్రభుత్వం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. "విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాలు, ట్రస్టులో జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది నువ్వే " అని చంద్రబాబు పై ఆరోపణలు చేశారు. అంతే కాకుండా "సంబంధం లేని విషయాల్లో కాలు, వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్ చంద్రబాబూ" అని ప్రశ్నించారు. "సంచైత గజపతుల కుటుంబ సభ్యురాలు కాదా? లేదా మహిళలంటే నీకు చిన్న చూపా?" అని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనవాసరావుపై కూడా ఆరోపణలు చేశారు. "తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!' అని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం లో అవినీతి చోటుచేసుకుందని విరుచుకు పడ్డారు.

తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స

తెలంగాణలో కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో క‌రోనా టెస్ట్‌లు, క‌రోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించాల‌ని నిర్ణ‌యిం తీసుకుంది. ఇందులో భాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మొద‌ట మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, క‌రోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఈ సేవ‌ల‌ను మ‌రిన్ని ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.

కరోనా కు చైనా వ్యాక్సిన్ రెడీ.. ముందుగా వారికేనట

ప్రపంచం మొత్తం కరోనా తో విలవిలలాడుతోంది. ఐతే ఈ కరోనా ను ప్రపంచం పైకి వదిలిన చైనా మీద ప్రపంచ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కరోనా కు పుట్టినిల్లైన చైనా లో కరోనా కు వ్యాక్సిన్ సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. చైనా డ్రగ్ మేకర్ కాన్సీనో బయోలాజిక్స్ యొక్క Ad5-nCoV వ్యాక్సిన్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. ఐతే ఈ వ్యాక్సిన్ ను ఒక సంవత్సరం పాటు పూర్తిగా తన దేశ సైనికులకు మాత్రమే ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో పక్క ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న మరో వ్యాక్సిన్.. అయిన అమెరికన్ వ్యాక్సిన్ మోడెర్నా మూడో పేజ్ ట్రయల్స్ వాయిదా పడ్డాయి. మొన్న జులై 9న ప్రారంభం కావాల్సిన మూడో దశ ట్రయల్స్ ట్రయల్ ప్రొటొకాల్స్ లో మార్పుల వల్ల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

బీజేపీలో చేరికపై సచిన్ సంచలన వ్యాఖ్యలు

సచిన్‌ పైలట్‌ ను డిప్యూటీ సీఎం, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు కొందరు బీజేపీ నేతలు కూడా సచిన్‌ పైలట్‌ కు తమ పార్టీ తలపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, దీనిపై తాజాగా స్పందించిన సచిన్‌ పైలట్.. తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. తాను అటువంటి ప్రణాళికలు ఏమీ వేసుకోలేదని తెలిపారు. గత ఆరు నెలలుగా తాను జ్యోతిరాదిత్య సింధియాను కానీ బీజేపీ నేతలను కానీ కలవలేదన్నారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు తనను అవమానించడానికేనని సచిన్‌ పైలట్ చెప్పారు. తాను బీజేపీని ఓడించడానికి పని చేశానని, అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్పారు. సచిన్‌ పైలట్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు, సచిన్‌ పైలట్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.

భారత్ లో ఒక రోజు అత్యధిక కేసుల రికార్డు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రమవుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం నిన్న ఒక్క రోజులో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. మరో పక్క 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి చేరింది. ప్రస్తుతం 3,19,840 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు దేశంలో కరోనా నుండి 5,92,032 మంది కోలుకున్నారు. ఇక మనదేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 63శాతం ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

ప్రతి హిందువు భగవద్గీతను చదవాలి

ప్రతి హిందువు భగవద్గీతను చదవాలి.. అహింస, నైతికత తోనే హిందుత్వం.. హిందుత్వం పైనే అన్ని మతాల దాడులు.. ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలి :మాజీ డీజీపీ అరవిందరావు "అర్చక పురోహితులు లేని గ్రామాలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మత మార్పిడి మాఫియా చెలరేగి పోతుంది. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి చేస్తున్నారు" అని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపి అరవింద్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి హిందువు భగవద్గీతను చదవాలని, ఒకసారి భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో మతం మారే అవకాశం లేదన్నారు.   హైందవ జీవన విధానాన్ని అణువణువునా వ్యతిరేకిస్తూ కొన్ని శక్తులు భావితరాల మెదళ్ళలో విషం నింపుతున్నాయి అని చెప్పారు. హిందుత్వంలో ఎక్కడ కూడా కులాల మధ్య తారతమ్యాలు కనిపించవని, కానీ ఒక్కటిగా ఉన్న హిందువులను విభజించేందుకు కులాల ప్రస్తావన తీసుకు వచ్చి చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అవకాశం ఉన్న ప్రతి దగ్గర హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి, వలలో వేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. అహింస, నైతికత తోనే హిందుత్వం హింస, అనైతికం ఆధారంగా ఇతర మతాలు పనిచేస్తున్నాయని.. అహింస, నైతికత పేరుతోనే హిందుత్వం పనిచేస్తుందని అరవింద రావు చెప్పారు. ఒక మతాన్ని నాశనం చేసి, తమ మతమే గొప్పది అని చెప్పుకునే వాళ్లే దాడులకు తెగబడుతున్నారు అని వివరించారు. శాంతి, అహింస, నీతి, విశ్వాసం అనేవి హిందుత్వానికి మూలాధారాలు అన్నారు. హిందువులలో ఎందరో దేవుళ్ళు ఉన్నా కూడా, అందరినీ సమన్వయపరుస్తూ వారి వారి పద్ధతులతో, ఆరాధిస్తూ పూజించడం గొప్ప విషయమన్నారు. ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలి ప్రతి హిందువు  భగవద్గీత, రామాయణం తో పాటు చరిత్రను ఇతర విషయాలను తప్పకుండా అవగాహన పరుచుకోవాలి, అందుకు అధ్యయనం తప్పనిసరి అని మాజీ డిజిపి సూచించారు. వ్యక్తికి శారీరక దృఢత్వం ఎంత అవసరమో, అంతకుమించి మానసిక శక్తి.. బుద్ధిబలం కూడా అవసరమేనన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలపై శ్రద్ధగా అధ్యయనం చేయాలని, తద్వారా ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలని సూచించారు. యథేచ్ఛగా చరిత్ర వక్రీకరణ నేడు పాఠ్యాంశాల్లో ఔరంగజేబు గొప్పతనం గురించి రాస్తున్నారని, టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ పాఠ్యాంశాలు ముద్రిస్తున్నారని అరవింద రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా 1590 లోనే గోవాలో హిందువులపై ఊచకోత ప్రారంభమైందని, కేరళలో బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయర్ల ను కనుమరుగు చేశారని చెప్పారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ  హిందుత్వాన్ని నాశనం చేసేందుకు రక్తపాతం సృష్టించిన చరిత్ర కొన్ని మతాలదని పేర్కొన్నారు. కానీ నేడు వాస్తవాన్ని వక్రీకరించి అదే టిప్పుసుల్తాన్ ను, ఔరంగజేబును కీర్తిస్తూ పాఠ్యాంశాలు రావడం వల్ల భావితరాలు వాస్తవాన్ని తెలుసుకొని లేక పోతున్నాయని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ఎజెండా "ఎడిట్- ప్రాప్ " ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ సాధించలేకపోతే "ఎడిట్ - ప్రప్" సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరవింద్ రావు చెప్పారు. ఎడిట్ ప్రాపు అంటే కమ్యూనిస్టులు అవలంబించే సిద్ధాంతమని.. ఒక విషయాన్ని శ్రద్ధగా చదివి  దానిపై అవగాహన పెంచుకోవడం. అదేవిధంగా వాస్తవాన్ని అవాస్తవంగా ప్రాపగాండా చేయడం కమ్యూనిస్టుల ముఖ్యలక్షణం అని చెప్పారు.(Education & Propaganda). భవిష్యత్తులో హిందుత్వంపై విపరీతమైన దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని, అందుకు దాడులను ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలు హిందూ సమాజం సంపాదించాలని ఆయన కోరారు.

వెన‌క్కి త‌గ్గిన ట్రంప్ సర్కార్

ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు అమెరికాని విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ ఇటీవల ట్రంప్ సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, యూనివర్శిటీలు, టెక్నాలజీ దిగ్గజాలు తీసుకువచ్చిన ఒత్తిడి, పెట్టిన కేసులతో ట్రంప్ సర్కార్ దిగి వచ్చింది. అకాడమిక్ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్‌లో అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాలన్నింటినీ రద్దు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణ‌యం తీసుకుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, అలాగే 18 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు జోక్యంతో వీసాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. గ‌తంలో రద్దు చేస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంది అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.

కరోనా హాస్పిటల్ లో 101 వ బర్త్ డే జరుపుకున్న పెద్దాయన.. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఐతే వైద్య నిపుణుల సమాచారం ప్రకారం 60 ఏళ్ల పై బడిన వృద్ధుల కు కరోనా సోకితే కోలుకోవడం కొంతవరకు కష్టం. ఐతే తాజాగా మహారాష్ట్ర లోని ముంబై లో వంద సంవత్సరాల పెద్దాయన కరోనా పై విజయం సాధించడమే కాకుండా తన 101వ జన్మదినాన్ని తనకు చికిత్స చేస్తున్న అదే హాస్పిటల్ లో జరుపుకున్నారు. ముంబైకి చెందిన 100 సంవత్సరాల వయసున్న రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ అర్జున్ గోవింద్ నారింగ్రేకర్ కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా జులై 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా కేర్ హాస్పిటల్ లో చేరారు. 12 రోజుల చికిత్స తర్వాత అయన పూర్తిగా కోలుకున్నారు. అంతే కాకుండా బుధవారం ఆయన పుట్టిన రోజు అని అయన కుటుంబ సభ్యులు తెలపడంతో అక్కడి వైద్యులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంతో ఒక చాకొలేట్ కేక్ తెప్పించి నారింగ్రేకర్‌తో కట్ చేయించి ఆయనకు తినిపించారు. ఇలా అయన తన 101వ జన్మదినాన్ని తనను కాపాడిన హాస్పిటల్ లోనే జరుపుకుని తరువాత నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్ లో జరిగిన అయన బర్త్ డే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జీ బ్లాక్ కింద నిజాం ఖజానా.. కేసీఆర్ ఆ 11 రోజులు ఎక్కడికి పోయారు?

సీఎం కేసీఆర్ 11 రోజులు కనిపించకుండా పోవడంపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 29న సచివాలయాన్ని కూల్చొద్దని తాము కోర్టుకు వెళ్లామని, అయితే ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలపై తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఆ రోజు నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, మళ్లీ జులై 10న సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వగా.. ఆ మరుసటి రోజే కేసీఆర్ ప్రత్యక్షమయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ 11 రోజులు కేసీఆర్ ఎక్కడికి పోయారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.  ఇక సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్లు రాకపోకలు బంద్ చేసి కూల్చివేతలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా.. నిధి అన్వేషణ జరుగుతుందనే విషయాలు తెలిశాయన్నారు. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పత్రికలు ప్రచురించాయని, అక్కడ అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని గతంలో పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాసిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరపడంపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా పగలే చేస్తారని, గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని ఆరోపించారు. కూల్చివేతకు ముందు జి బ్లాక్ కింద పురావస్తు శాఖ చేత పరిశోధన జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కుయ్ కుయ్ అన్నారు.. అవి కుయ్యో మొర్రో అంటున్నాయి

ఇటీవల 108 వాహనాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి సరైన సమయానికి రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వాహనాలు మొరాయిస్తున్నాయి అంటూ రోడ్డుపై ఆగిపోయిన 108 వాహనాల ఫోటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ 108 వాహనాల వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "కుయ్,కుయ్,కుయ్ అన్నారు. కానీ అవి కుయ్యో,మొర్రో అంటున్నాయి.కాల్ చెయ్యగానే 108 ఎక్కడ వైఎస్ జగన్ గారు. స్కామ్ కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయి." అని లోకేష్ విమర్శించారు. "అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలో హెడ్ మాస్టర్ నారాయణ స్వామి అస్వస్థత కి గురై నడి రోడ్డుపై పడిపోయారు. స్థానికులు 108 కి కాల్ చేసినా అంబులెన్స్ రాక ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జగన్ రెడ్డి గారికి ప్రచార ఆర్బాటం పై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణం." అంటూ లోకేష్ మండిపడ్డారు.

ఆర్వో ప్యూరిఫైయర్లను బ్యాన్ చేయండి.. ఎన్ జి టి కీలక ఆదేశాలు

మనం బయటికి ఎక్కడికి వెళ్లినా ముందుగా వెదికేది ఆర్వో ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ కోసమే. ఐతే తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్ జి టి) ఆర్వో ప్యూరిఫైయర్లను ఈ సంవత్సరం చివరిలోగా పూర్తిగా బ్యాన్ చేసేలా నోటీసులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖను మంగళవారం ఆదేశించింది. దీనికి కారణం మనం తాగే లీటర్ నీటిలో టోటల్ డిజాల్వాడ్ సాలీడ్స్ (TDS) 500 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. ఐతే ఆర్వో ప్యూరిఫైయర్లు నీటిలో సహజంగా ఉన్న ఖనిజాల్ని పూర్తిగా తీసి వేసి మళ్లీ ఖనిజాల్ని కలుపుతున్నాయనీ ఐతే దీని వల్ల ప్రజలకు నీటి ద్వారా దక్కాల్సిన సహజమైన ఖనిజాలు దక్కట్లేదని ఎన్ జి టి  అభ్యంతరం తెలిపింది. ఆర్వో ప్యూరిఫైయర్ల పనితీరును ముందుగా ఒక నిపుణుల కమిటీ పరిశీలించింది. అవి నిబంధనల ప్రకారం లేవనీ, వాటి ద్వారా ప్యూరిఫై అయిన నీటిలో మినరల్స్ ఉండట్లేదని ఆ బృందం తేల్చింది. దీంతో మినరల్స్ లేని నీటిని తాగితే ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఒక లీటర్ నీటిలో TDS 500 మిల్లి గ్రాముల కంటే తక్కువ ఉండకూడదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ జి టి కేంద్రానికి డిసెంబర్ 31 వరకూ టైమ్ ఇవ్వడంతో అప్పటిలోగా ఆర్వో ప్యూరిఫైయర్ల పై బ్యాన్ అమల్లోకి తేవాల్సి ఉంటుంది.

కరోనా కు వ్యాక్సిన్ రెడీ.. కానీ డబ్ల్యూహెచ్ఓ నే అడ్డు..!

కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రష్యా నుండి ఒక చల్లని వార్త అందింది. రష్యాలోని సెచెనోవ్ యూనివర్శిటీ కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేసిందని దాని పై క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని ఆ వార్త సారాంశం. ఆ వ్యాక్సిన్ ప్రభుత్వ అజమాయిషీలోని గమలాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయాలజీలో తయారవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిదైన ఈ కరోనా వ్యాక్సిన్‌ను ఈ ఆగస్ట్ మధ్య నాటికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఐతే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒక కొత్త మందును విడుదల చేయాలంటే దానికి కావాల్సిన ముఖ్య పదార్ధాలు సమకూర్చుకుంటే సరిపోతుంది. కానీ అదే ఒక కొత్త వ్యాక్సిన్ ఐతే అందులో అటు సూక్ష్మ క్రిములు కానీ వాటి జన్యువులు కానీ ఉంటాయి. ఐతే అవి స్వయంగా ఉత్పత్తి కావడానికి ఒక ప్రత్యేక వాతావరణం తో పాటు కొంత సమయం కూడా అవసరమే. దీంతో ఒక పక్క వ్యాక్సిన్ తో క్లినికల్ ట్రయల్స్ చేస్తూనే మరో పక్క దీని ఉత్పత్తి పైన దృష్టి పెట్టారు. ఐతే ఇప్పటివరకూ తమ పరిశోధనలో తాము రెడీ చేసిన వ్యాక్సిన్ చాలా సేఫ్‌ అని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవనీ గమలాయి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను ఆగస్ట్ 12 నుంచి 14 మధ్య తొలి వ్యాక్సిన్ ప్రజల చేతిలోకి వెళ్తుందనే అయన కాన్ఫిడెంట్ గా తెలిపారు ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ రూల్స్ ప్రకారం ఏ వ్యాక్సిన్‌కైనా మూడు దశల్లో ట్రయల్స్ జరపవలసి ఉంటుంది. కానీ రష్యా శాస్త్రవేత్తలు ఒక దశ ట్రయల్స్ మాత్రమే చేశారని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ప్రపంచం మొత్తం వాడే వ్యాక్సిన్‌కి కనీసం మూడుసార్లైనా ట్రయల్స్ జరపకపోతే ఎలా అని ఈ వ్యాక్సిన్ కు అభ్యంతరం చెబుతోంది. సెచెనోవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం 18 నుండి 65 ఏళ్ల మధ్య వయసు వారిని 28 రోజులపాటూ ఐసోలేషన్‌లో ఉంచి ఇప్పటికే రెండు ట్రయల్స్ జరిపామంటున్నారు. ఈ వాలంటీర్లను జులై 15, జులై 20న డిశ్చార్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా వారిని ఆ తర్వాత కూడా మరో 6 నెలల పాటు పరిశీలిస్తామని తెలియ చేసింది. ఏది ఏమైనా ఒక వేళ డబ్ల్యూహెచ్ఓ కనుక ఆమోదించకపోతే మాత్రం ఆగస్టులో వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మళ్లీ లాక్‌డౌన్‌.. కరోనా కట్టడికి  సరైన మార్గం

పంజా విసురుతూ లక్షలాది మందికి సోకుతున్న కోవిద్ 19 వైరస్ ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ సరైన మార్గమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మూడురోజుల్లోనే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు లక్ష కు పైగా పెరగడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య తొమ్మది లక్షలు దాటింది. అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చందగా షాపులను మూసేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా సోకిన వారు ఉంటే సెలవు ఇస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో లాక్ డౌన్ పాటిస్తున్నారు. తెలంగాణలోనూ ముఖ్యంగా హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో లాక్ డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాల్లోనే లాక్ డౌన్ విధించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం వేల సంఖ్యలో పాజిటివ్  కేసులు నమోదు అవుతున్నా లాక్ డౌన్ ఎందుకు విధించడం లేదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వైద్యపరీక్షలు నిర్వహించి పాజిటివ్ వ్యక్తులను ట్రేస్ చేయడం, వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం ముఖ్యం. దాంతోపాటు వ్యాప్తిని నియంత్రించాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని చాలా దేశాల్లో నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల నగరంలో పర్యటించిన కేంద్రబృందం సూచనల మేరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో హైదరాబాద్‌లో తిరిగి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా కేసులు అధికంగా ఉన్నపాత బస్తీలోని కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని క్లస్టర్ జోన్‌గా గుర్తించి  రాకపోకలు నిలిపేస్తారు.

కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. సచిన్‌ పైలట్‌ పై వేటు

రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ పై కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, సచిన్‌ పైలట్‌ పక్షాన నిలిచిన ముగ్గురు మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తప్పించింది. సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటాతో రాజస్థాన్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు సీఎల్పీ రెండు పర్యాయాలు సమావేశమైంది. సీఎల్పీ భేటీకి రావాలంటూ రెండుసార్లు ఆహ్వానించినా సచిన్ పైలట్ రాకపోవడంతో ఆయనను సాగనంపడమే మంచిదని పార్టీ తీర్మానించింది. సచిన్ పైలట్ పై వేటు వేసే తీర్మానానికి సభ్యులందరూ సరేననడంతో అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర గవర్నర్ కు నివేదించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్లారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ను, మరో ముగ్గురు మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ కు తెలియజేశారు. మరోవైపు, సచిన్ పైలట్‌కు బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ నేత ఓం మథుర్ ప్రకటించారు. బీజేపీలోకి చేర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓం మథుర్ స్పష్టం చేశారు.

రోడ్ పై బైక్ రేసింగ్ ను ప్రశ్నించిన వ్యక్తికి 28 కత్తిపోట్లు.. చోద్యం చూసిన జనం

ఇండియా జనాభా లో యువతరం 34 శాతం. దీంతో ప్రపంచం లోని మల్టి నేషనల్ కంపెనీలన్నీ అటు మ్యాన్ పవర్ కోసం ఇటు తమ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం ఇండియాను టార్గెట్ చేస్తున్నాయి. ఐతే కొంత మంది యూత్ మాత్రం బిజీగా ఉండే రోడ్ల పైనే కార్ రేసులు, బైక్ రేసులు అంటూ రోడ్ల పైన పడి అలజడి సృష్టిస్తూ.. అదేమని ప్రశ్నించే వారి పై తీవ్రంగా దాడులు చేస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని నిత్యం రద్దీగా ఉండే రఘుబీర్ నగర్ లో 17 ఏళ్ల లోపు టీనేజర్లు ముగ్గురు బైక్ రేసింగ్ స్టంట్ లు చేస్తుండటంతో స్థానికులకు ఇబ్బంది కలుగుతోందని 25 ఏళ్ల మనీష్ అనే కార్ డ్రైవర్ వారిని వారించాడు. దీంతో ఆ ముగ్గురు టీనేజర్లు ఈ నెల 8 న మనీష్ పై పట్టపగలు నడి రోడ్ పై చాకుల వంటి మారణాయుధాలతో దాడి చేసి 28 సార్లు ఛాతీలోనూ గొంతు వద్ద పొడవడం తో అతను తీవ్రంగా గాయ పడ్డాడు. ఐతే చుట్టు పక్కలవారు కానీ అటుగా వెళుతున్న వారు కానీ ఎవరు వారిని వారించలేదు. దీంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేసే సమయానికే మనీష్ ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఈ సంఘటన సమీపంలోని సిసి కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన పై కంప్లైంట్ అందుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా ఆ టీనేజర్లను అరెస్ట్ చేసారు. ఐతే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇటువంటి ఘటనలు జరుగుతున్నపుడు ఆ చుట్టు పక్కల ఉన్నవారు కూడా స్పందించకపోవడం పై మరో సారి తీవ్ర చర్చ జరుగుతోంది.

ఖైదీలకు మేలు చేసిన కరోనా

ఇందు కాదు అందు కాదు ఎందెందు చూసినా అందందు కలదు.. అన్న విధంగా కరోనా ప్రపంచంలోని అన్ని మూలలకు వ్యాపిస్తోంది. జనసామర్ద్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కాదు జైళ్లలోనూ సోకింది. దాంతో ఖైదీలను విడుదల చేయాలన్న ఆలోచనలో చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇది మనదేశంలో కాదు.. కాలిఫోర్నియాలో. అక్కడ జైలులో శిక్ష అనుభవిస్తున్నవారిలో దాదాపు 8,000 మంది ఖైదీలను ఆగస్టు చివరి నాటికి విడుదల చేస్తున్నామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. కోవిద్ 19 వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జైలు అధికారులు చెప్తున్నారు.  కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ది కరెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ నివేదిక ప్రకారం రాష్ట్ర జైళ్లలో ఉన్న ఖైదీల్లో 2,286 మందిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నాయి. వారిలో కొంత మంది చనిపోయారు. దీంతో తక్కువ శిక్ష అనుభవిస్తున్నవారిని ఈ నెలాఖరులోగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా వేలాది మంది ఖైదీలు ఇంటిదారి పట్టనున్నారు. మనదేశంలోనూ అనేక జైళ్లలో ఇదే పరిస్థితి. ఇక్కడి ప్రభుత్వాలు కూడా ఖైదీల విషయం పరిశీలించాలని పౌరసంఘాలు కోరుతున్నాయి.