భారత్ లో కరోనా లేని ప్రాంతం ఉంది.. ఎక్కడో తెలుసా..?
posted on Jul 18, 2020 @ 10:01AM
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దాడికి కకావికలమౌతోంది. మన భారత దేశం లో కూడా పాజిటివ్ కేసులు 10 లక్షల మార్క్ దాటేశాయి. ఐతే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క కరోనా కేసు నమోదు కాని ప్రాంతం ఒకటి మన ఇండియాలోనే ఉంది. నమ్మబుద్ది కావడం లేదు కదా. కానీ నిజంగానే మన దేశంలోని లక్ష దీవులలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మనకు నమ్మశక్యం కావడం లేదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం. సుమారుగా 65 వేల జనాభా కలిగిన లక్షద్వీప్ లో కేవలం మూడు ఆసుపత్రులు ఉన్నాయి. ఐతే ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. దీనికి అక్కడి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలే కారణం. అక్కడ ఉన్న జనాభా కు మూడు ఆసుపత్రులు ఉండడం తో కరోనా ఎంటర్ ఐతే హ్యాండిల్ చేయడం అసాధ్యమని భావించిన స్థానిక ప్రభుత్వం అక్కడికి వచ్చే వారు తప్పని సరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించింది.
లక్షద్వీప్ చేరాలంటే అటు షిప్ లో కానీ ఇటు ఫ్లయిట్ లో కానీ కేరళ లోని కొచ్చి నుండి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. దీంతో కొచ్చి లోనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ రెండు వారాల సమయం గడచిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి అప్పుడే లక్షదీవులలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ లోకల్ గా ఉన్న 61 మందికి టెస్ట్ లు చేయగా నెగటివ్ అని తేలింది. అంతే కాకుండా మిగిలిన దేశంలో ఎక్కడా కూడా విద్యా సంస్థలు తెరిచే ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో ఇటు లక్షద్వీప్ ప్రభుత్వం మాత్రం పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఫిబ్రవరిలో కరోనా అలజడి మొదలైనప్పుడే విదేశాల నుండి వచ్చే వారిని ముందుగా రెండు వరాల పాటు క్వారంటైన్ అనే రూల్ అమలు చేసి ఉంటే బహుశా మన దేశంలోనూ కరోనా ఇంత తీవ్రంగా ఉండేది కాదేమో అని సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు. ఓ రకంగా మనది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది పరిస్థితి.