పూర్తిగా అంతం చేయలేం.. వ్యాక్సిన్ వేసుకున్నా మూడు నెలలే...

2020 ని స్తంభింపచేసిన కరోనా వైరస్ ను అరికట్టడానికి మరికొద్దిరోజుల్లో వ్యాక్సిన్ వస్తుంది అంటూ మాస్క్ కట్టుకుని మరీ ఎదురుచూస్తున్నాం. ఎప్పుడెపుటడు వ్యాక్సిన్ వస్తుందా.. స్వేచ్ఛగా బయట తిరుగుతామా అమి ఎదురుచూస్తన్న వారికి ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా చేసిన వ్యాఖ్య మింగుడు పడటం లేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ వైరస్ ను పూర్తిగా అంతం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ ర్యాన్ ప్రకటించారు. వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తూ వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలం అవుతున్న ప్రభుత్వాలు, దేశాలు ఈ ప్రకటనను గమనించాల్సిందే. ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో వ్యాప్తిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని చాలావారకు నియంత్రించవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్నా మూడునెలలే... కోవిద్ 19 వైరస్ వ్యాక్సిన్ అతిత్వరలో అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం చాలామందిలో కనిపిస్తుంది. వ్యాక్సిన్ తీసుకుంటే చాలు కరోనా తమను ఎం చేయలేదు అన్న భద్రత ఉంటుంది అనుకుంటే అది పొరబాటే అంటున్నారు లండన్ పరిశోధకులు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మూడునెలలు మాత్రమే వైరస్ ను ఎదుర్కోనే శక్తి ఉంటది అంటున్నారు ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌, కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు.అంతేకాదు ఒక డోస్‌‌‌‌ వేసుకుంటే సరిపోదని, ప్రతి ఏడాది వేసుకోవాల్సిందే అంటున్నారు. అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కారణం ఈ వైరస్ ను పూర్తిగా అంతం చేయలేం. జబులు, దగ్గు మాదిరిగానే ప్రతి ఏడాది రావచ్చు. అయితే వ్యాక్సిన్ ల కోసం ఎదురుచూడటం కన్నా వ్యాప్తిని నియంత్రించడమే చాలా మంచిది.

వెలుగులోకి టీఆర్ఎస్ నేతల ఆగడాలు.. కబ్జాలు, దాడులు!!

తెలంగాణలో అధికార పార్టీ నేతలు కొందరు కబ్జాలకు తెగబడుతున్నారా? ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారా?.. తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు ఘటనలు అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి. అధికార పార్టీ మాది అంటూ కొందరు స్థానిక నేతలు సామాన్యులపై ఎలా దౌర్జన్యం చేస్తున్నారో తెలియజేస్తున్నాయి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మంత్రి కేటీఆర్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన మంత్రి కేటీఆర్ .. వీర‌న్న పేట్ లో 660 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను ప్రారంభించి, అక్క‌డి నుండి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో ఆయన కాన్వాయ్ ను ఓ కుటుంబం అడ్డుకుంది. త‌మ భూమిని కొందరు టీఆర్ఎస్ నేత‌లు క‌బ్జా చేసి బెదిరిస్తున్నార‌ని, ఏ అధికారి వద్దకు వెళ్లినా న్యాయం జరగడం లేదని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబం మంత్రిని క‌ల‌వ‌కుండానే స్థానిక పోలీసులు ఆ కుటుంబాన్ని ప‌క్క‌కు ఈడ్చి ప‌డేశారు. పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌పై స్థానిక ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. రోజు రోజుకు పెరిగిపోతున్న స్థానిక టీఆర్ఎస్ నేత‌ల ఆగ‌డాల‌కు చెక్ పెట్ట‌క‌పోతే ఇంకెంత మంది భూములు క‌బ్జా చేస్తారోనంటూ మండిప‌డుతున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా.. ప్రశ్నించినందుకు తన భర్తపై ఆయన అనుచరులతో కలిసి దాడి చేసారని బానోదయా అనే మహిళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. మేడ్చల్ జిల్లా, బోడుప్పల్, ద్వారకా నగర్ లో ఆరు సంవత్సరాల క్రితం బ్యాంక్ లో లోను తీసుకొని కొన్న ఇల్లులో తమకు వాటా ఉందని స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ దౌర్జనానికి పాల్పడ్డాడని కమిషన్ కు వివరించింది. ఇంటిమీదికి వచ్చి తన భర్త పూరేందర్ పై కార్పొరేటర్ తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేయయంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని బాధిత మహిళ కమిషన్ కు వివరించింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ.. కార్పొరేటర్ తో కుమ్మకైన పోలీసులు తిరిగి తమపైనే అక్రమంగా కేసు పెట్టి వేదిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి కార్పొరేటర్, ఆయన అనుచరులపై కేస్ నమోదు చేయలేదని, అరెస్ట్ చేయలేదని ఆమె పేర్కొన్నారు. కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించడంతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన మేడిపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బానోదయా హెచ్చార్సీని వేడుకుంది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య సాక్షాత్తు మేయర్ పైన కూడా కబ్జా ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికార పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇకనైనా పార్టీ అధినాయకత్వం స్థానిక నేతలపై ఓ కన్నేసి సామాన్యులకు అండగా నిలబడితే మంచిది.

విశాఖలోని రసాయన పరిశ్రమలో అర్థరాత్రి పేలుళ్లు.. భారీ అగ్ని ప్రమాదం..  

వ‌రుస ప్ర‌మాదాలతో విశాఖ వ‌ణికిపోతోంది. తాజాగా పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ పేలుడు సంభవించింది. సాల్వెంట్‌ ‌ఫార్మా కంపెనీలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలతో ట్యాంకులు పేలి 30 నుండి 50 అడుగుల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్నకెమికల్ డ్రమ్ములకు మంటలు వ్యాపించడం తో పరిసర ప్రాంతాల‌ను ద‌ట్ట‌మైన‌ పొగ చుట్టేసింది. భారీ పేలుడు శబ్దాలు దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించాయి. ఫార్మా సిటీ కి దగ్గరలోని హై టెన్షన్ విద్యుత్ వైర్లు కూడా తెగి పడ్డాయి. దీంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌క స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘ‌ట‌న‌ మరువకముందే మ‌రో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం తో వైజాగ్ ‌వాసుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అదే సమయంలో ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్న కంపెనీల నుండి ఉద్యోగులు పరుగులు తీశారు. ఇంకా పరిసర గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వ‌రుస‌గా అనేక పేలుళ్లు సంభవించ‌డంతో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అంతే కాకుండా ఘటన జరిగిన ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు వేడి తీవ్రంగా ఉండడంతో ఫైర్ సిబ్బంది సైతం లోప‌లికి వెళ్లే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. చుట్టూ పక్కల జిల్లాల లో ఉన్న ఫార్మా పరిశ్రమల నుండి హెచ్ సి ఎల్, ఇథనాల్ వంటి రసాయనాలు సేకరించి వాటిని శుద్ధి చేసి హైదరాబాద్ చెన్నై లోని పరిశ్రమలకు సప్లై చేస్తుంది. నిన్న రాత్రి సాల్వెంట్‌ ‌ ఫార్మా కంపెనీలో నైట్‌ షిప్ట్‌ మొదలైన కొద్దిసేప‌టికే ఈ పేలుడు జ‌రిగింది. ఐతే ప్రమాదం జరిగిన సమయంలో న‌లుగురు సిబ్బంది విధుల్లో ఉన్న‌ట్టుగా అధికారులు చెప్పారు. ఐతే ఈ ప్ర‌మాదంలో నలుగురు సిబ్బంది గాయపడగా వెంట‌నే వారిని గాజువాకలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోకపొతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం.. డబ్ల్యూహెచ్ఓ 

ఇప్పటికే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తీవ్రతతో వణికిపోతోంది. దీనికి తోడు అమెరికా, బ్రెజిల్ లో కేసులు తగ్గకపోగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాలు కనుక కఠినమైన ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు దారుణంగా మారతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఇప్పటికీ చాలా దేశాలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెండ్రోస్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి ఈ వైరస్సే ప్రధాన శత్రువు అవుతుందని అయన అన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు కనీస చర్యలైనా పాటించకపోతే కరోనా సమస్య ఎలా తొలగి పోతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.3 కోట్ల పాజిటివ్ కేసులున్నాయి. 5 లక్షల మందికి పైగా ఇప్పటికే చనిపోయారని తెలిపారు. మళ్ళీ కొంత కాలం ఇదివరకటి రోజులు రాకపోవచ్చన్న టెండ్రోస్... వైరస్‌ని కంట్రోల్ చేయడమే మానవాళి ముందున్న కర్తవ్యం అని అన్నారు. ఐతే టెండ్రోస్ పై ఒంటికాలి పై లేస్తున్న ట్రంప్ పాలనలో ఉన్న అమెరికాలో నిన్న ఒక్క రోజే 60 వేలకు పైగా పాజిటివ్ కేసులొచ్చాయి. ఆదివారం ప్రపంచం మొత్తం కలిపి 2.3 లక్షల కొత్త కేసులు నమోదు కాగా వాటిలో దాదాపు 80 శాతం కేవలం 10 దేశాల్లోనే వచ్చాయనీ, అంతే కాకుండా 50 శాతం కేసులు అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే వచ్చాయని ఆయన అన్నారు. కరోనా తీవ్రతకు తీవ్రంగా దెబ్బతిన్నది కూడా ఈ రెండు దేశాలు కావడం గమనార్హం. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా విపరీతంగా పెరుగుతోందని, కనీసం అటువంటి ప్రాంతాల్లో లాక్‌‌డౌన్ అమలు చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీస్ హెడ్ మైక్ ర్యాన్ విజ్ఞప్తి చేసారు. అంతే కాకుండా వైరస్ ముప్పు తొలగిపోయిన తర్వాతే విద్యాసంస్థలు తెరవడం పై ఆలోచన చేయడం మంచిదని అయన సూచించారు. ఈ విపత్కర సమయంలో రాజకీయ విమర్శలు, ఎత్తుగడలు ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ఐతే అమెరికాలో కరోనా వచ్చిన 6 నెలల తర్వాత తొలిసారి అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారు. ఇక కరోనా వైరస్ ఎలా పుట్టిందో తేల్చేందుకు తమ పరిశోధకులు చైనాకు వెళ్లి తేలుస్తారని టెడ్రోస్ తెలిపారు.

మంత్రి కొడుకును అడ్డుకున్నందుకు లేడీ కానిస్టేబుల్ కు పనిష్మెంట్

గుజరాత్ లోని సూరత్ లో ఒక మంత్రి కుమారుడిని అడ్డుకుని ప్రశ్నించినందుకు ఒక లేడీ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పై అధికారులు. ఇంతకూ ఆమె చేసిన తప్పేంటంటే.. రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కుమారుడు, మరో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి కరోనా కారణంగా రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న టైం లో జామ్ జాం అని తిరిగేస్తుంటే అదేంటని ప్రశ్నించింది కానిస్టేబుల్ సునీతా యాదవ్. ఈ ఘటన జులై 8 వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగింది. ఐతే మొన్న జులై 12 న ఆ మంత్రి కుమారుడిని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ పై వదిలి పెట్టారు. ఇది ఇలా ఉండగా మంత్రి కుమారుడిని కానిస్టేబుల్ ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం  వైరల్ గా మారింది. ఐతే ఈ ఘటన పై తన వాదనను వినిపించేందుకు ఆమె పని చేసే స్టేషన్ లోని ఎస్ ఐ ని కలవగా వెంటనే లీవ్ లో వెళ్లాలని అయన ఆదేశించారు. అంతే కాకుండా ఈ ఘటనకు సమబంధించి ఆమె పై ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోబోతున్నారని తెలియడంతో ఏకంగా ఆమె తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించింది.

పితాని తనయుడికి హైకోర్టులో చుక్కెదురు

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.  ఈఎ‌స్‌ఐ కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వెంకట సురేష్‌, మాజీ కార్యదర్శి మురళీమోహన్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిటిషనర్ల తరపున న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదిస్తూ.. రాజకీయ కక్షతోనే వీరిని ఈ కేసులో ఇరికించారని వాదించారు. వెంకట సురేష్ ఏనాడూ తన తండ్రి పదవిని దుర్వినియోగం చేయలేదని అన్నారు. అలాగే, పితాని వద్ద కార్యదర్శిగా ఉన్న మురళీమోహన్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. కావున ఈ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. అజయ్ కుమార్ వాదనతో ఏసీబీ తరఫు న్యాయవాది విభేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను తిరస్కరించారు.

భారత్ లో గూగుల్ భారీ పెట్టుబడులు

సెర్చ్ ఇంజన్ 'గూగుల్‌' భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. 'డిజిటైజేషన్‌ ఫండ్‌' కింద రూ.75 వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో భారత్‌లో ఈ పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం ప్రకటించిన 'డిజిటల్ ఇండియా'ను సాకారం చేసేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు. భారత్ లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడానికి తమ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.

పరిమళించిన మానవత్వం.. కరోనా మృతునికి డాక్టర్ అంత్యక్రియలు 

తెలంగాణలోని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఒక వ్యక్తి కరోనా తో మరణించారు. ఐతే నిబంధనలు ప్రకారం మున్సిపల్ సిబ్బంది అతని అంత్యక్రియలు చేయాల్సి ఉంది. ఐతే ఆ సిబ్బంది అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. ఐతే వారు ఉపయోగించే గార్బేజ్ తరలించే ట్రాక్టర్ ను మాత్రం హాస్పిటల్ వద్ద వదిలి వెళ్లారు. దీంతో ఆ హాస్పిటల్ లో డాక్టరు గా పని చేస్తున్న డాక్టర్ శ్రీరామ్ ముందుకు వచ్చి రోగి బంధువుల సాయంతో మృతదేహాన్ని ట్రాక్టర్ ట్రాలీ లో ఉంచి తానే దానిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో డాక్టర శ్రీరామ్ ను అందరు అభినందిస్తున్నారు.

సచివాలయం కూల్చివేత పై హైకోర్టు స్టే పొడిగింపు

ఈ నెల 15 వరకు కూల్చివేతలు ఆపాలి తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత పై శుక్రవారం విధించిన స్టేను హైకోర్టు ఈ నెల 15 వరకు పొడిగించింది. సచివాలయం కూల్చివేయాలని క్యాబినెట్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? కూల్చివేతకు సంబంధించి ఇతర శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? ఈ వివరాలన్నీ కూడా సీల్డ్ కవర్ లో కోర్టు కు తెలియజేయాలన్నారు. సచివాలయం కూల్చివేత కారణంగా కాలుష్యం పెరుగుతుంది అంటూ ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు తీసుకున్న న్యాయస్థానం సోమవారం వరకు కూల్చివేతలు ఆపాలంటూ స్టే విధించింది. సోమవారం ఉదయం విచారణ కొనసాగిస్తూ  సచివాలయ భవనం కూల్చివేత పనులపై ప్రభుత్వం వివరాలు ఇవ్వాలని కోరింది.

అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్ కోర్ వంశస్తులదే

తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్కోర్ రాజ వంశస్థులవే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ లలిత్ జస్టిస్ మల్హోత్ర  ధర్మాసనం తుది తీర్పును ఈరోజు వెలువరించింది.  అనంత పద్మనాభ స్వామి ఆలయ పాలన బాధ్యత పైన 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ట్రావెన్కోర్ వంశస్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొమ్మిది సంవత్సరాల పాటు వాదోపవాదాలు విన్న తర్వాత ఈరోజు సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అయితే గత ఏడాది ఏప్రిల్లోనే  విచారణ పూర్తి అయినప్పటికీ తీర్పును మాత్రం రిజర్వ్ చేశారు. సోమవారం తుది తీర్పు తరువాత ఈ ఆలయానికి సంబంధించిన సంపద నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ వంశస్థుల కే దక్కుతుంది.  2011 లో జరిగిన తవ్వకాలలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాదాపు 10 లక్షల కోట్ల విలువైన సంపద బయటపడటం తో ఈ ఆలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తరతరాలుగా ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ రాజవంశానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు దక్కాయి.

వైఎస్సార్సీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేసుకుంటూ తమ పార్టీ పేరును దెబ్బతీస్తున్నారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ వైఎస్సార్సీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. ఏపీలో అధికార పార్టీ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, వైఎస్సార్ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందని మహబూబ్ బాషా అన్నారు. వైఎస్సార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్' ఒక్కటేనని స్పష్టం చేశారు. తమదే నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన  కోర్టుకు తెలిపారు. జగన్ పార్టీ పేరును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ మహబూబ్ బాషా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

మరిన్ని కరోనా కష్టాలు తప్పవు.. మీకు అండగానే ఉంటా: రంగంలో అమ్మవారు

భారత్ మొత్తం కరోనా తో గజగజలాడుతోంది. ఇక తెలంగాణాలో ఐతే హైదరాబాద్ లో కరోనా ఉధృతంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో భాగంగా అమ్మవారి రంగంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? ప్రజల బాగోగుల గురించి ప్రతి సంవత్సరం పూజారులు అడిగేవారు. ఐతే ఈసారి మాత్రం కరోనా వైరస్ గురించి అమ్మవారిని అడిగారు. ఈ వైరస్ ఎన్నాళ్లు ఉంటుంది? ఎప్పుడు పోతుంది? దానికి ప్రజలు ఏం చెయ్యాలి? అని అడగగా ఆమె తన భవిష్యవాణిలో ప్రజలకు కొన్ని హెచ్చరికలు చేశారు. రానున్న కాలంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అంతే కాకుండా "ఎవరు చేసుకున్న కర్మ వాళ్లు అనుభవించక తప్పదని" అమ్మవారు హెచ్చరించారు. ఓ అమ్మగా తాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానని, ఐతే అంతకు మించి కొంత మంది ప్రజలు ఇలా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనాను అదుపు చేయడానికి తాను సిద్ధమేనని, అయితే తనను ఐదు వారాలు కొలవాలని, అలాగే యజ్ఞ యాగాదులు చేయాలనీ చెప్పారు. ప్లేగువ్యాధి అంతరించిన తర్వాత 19వ శతాబ్దం మొదట్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది బోనాలకు లక్షల్లో జనం హాజరయ్యేవారు. ఐతే ఈ సంవత్సరం కరోనా వల్ల కొద్దిమంది మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు.

కాపు ఉద్యమ నేత ముద్రగడ సంచలన నిర్ణయం

కాపులను బీసీలలో చేర్చాలని తీవ్రంగా ఉద్యమం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా తనను కుల ద్రోహి, గజదొంగ వంటి దారుణమైన వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో మేధావులతో కలిసి తాను ఉద్యమం నడిపానని ఆయన చెప్పారు. కాపు ఉద్యమం ద్వారా నిజానికి తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని అయన తెలిపారు. కొంత మంది తనను రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారని అయన తెలిపారు . ఇప్పుడు కాపు రిజర్వేషన్ బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం తనను తీవ్రంగా బాధిస్తోందని అయన వాపోయారు. ఐతే ఉద్యమ సందర్భానుసారంగా రూపురేఖలు మార్చుకుంటోందని, దీనితో తన జాతికి ఏదో ఒక విధంగా మేలు జరగాలని తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని అయన ఈ సందర్భంగా తెలిపారు.

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒకే రోజు రికార్డ్ సంఖ్యలో కేసులు

ఏపీలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్న ఒక్క రోజే 1933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొత్తం 17,624 శాంపిల్స్ పరీక్షించగా రికార్డ్ స్థాయిలో 1933 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతే కాకుండా నిన్న 19 మంది మృత్యువాత పడ్డారు. దీనితో మృతుల సంఖ్య 328 కి చేరుకుంది. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168 కి చేరింది. ఐతే వీరిలో 15,412 మంది కోలుకోగా ప్రస్తుతం 13,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొంత మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ ఉండగా ఎక్కువ మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్ 

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. దీంతో పాటు ఇప్పటికే ఏపీలోని అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ కడప పర్యటనలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఎక్కడా కనిపించకపోవడం తో ఆయనకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. ఐతే ఆయన గన్మెన్ కు కరోనా సోకిందని అందుకే అయన సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఐతే తాజాగా డిప్యూటీ సీఎం కుటుంబానికి కరోనా టెస్ట్ లు చేయగా అంజాద్ బాషా తో పాటు అయన భార్య, కుమార్తెకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని తిరుపతిలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించారు. ఆ తరువాత చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తాజాగా అంజాద్ బాషా కు కరోనా నిర్ధారణ కావడంతో కొద్ది రోజులుగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

చడీ చప్పుడు లేకుండా కరోనా కు వ్యాక్సిన్ సిద్ధం చేసిన రష్యా

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్ ఎదుర్కునే సమర్ధవంతమైన వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని మానవాళి ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ఇండియా లో భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాక్సిన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే జంతువుల పై ప్రయోగాలు ముగించుకుని క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఐతే తాజాగా రష్యా శాస్త్రవేత్తలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ప్రయోగాలు చేపట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. రష్యా రాజధాని మాస్కోలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో జంతువుల పై ప్రయోగాలతో పాటు క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే వలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చినట్టు ఆ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్ ను గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ రూపొందించింది. ఏ వ్యాక్సిన్ తో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ జూన్ 18 నుండి స్టార్ట్ చేయగా, వ్యాక్సిన్ వేయించుకున్న వలంటీర్లు మొదటి బ్యాచ్ ఈ బుధవారం డిశ్చార్జి అవుతారని తెలుస్తోంది. మరికొందరు వలంటీర్లు ఈ నెల 20న డిశ్చార్జి అవుతారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదా కాదా అనే విషయాన్ని ఈ క్లినికల్ ట్రయల్స్ లో పరీక్షించామని సెచెనోవ్ యూనివర్సిటీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసైటాలజీ, ట్రాపికల్ అండ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ తెలియచేసారు. ఈ ట్రయల్స్ లో తాము విజయవంతం అయ్యామని అయన అన్నారు. దీని తరువాతి దశలో ఎలాంటి పరీక్షలు చేపట్టాలన్నది వ్యాక్సిన్ రూపకర్తలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని. అలాగే ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ పై అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని లుకాషెవ్ తెలిపారు.

ఈనెల 21 నుంచి అమర్ నాథ్ దర్శనం 

రోజుకు ఐదువందల మందికే అవకాశం.. గత ఏడాది దర్శించుకున్న భక్తుల సంఖ్య 3,42,883.. అమరనాథ్ యాత్ర పై దాఖలైన పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం.. సరిహద్దుల్లో యుద్ధం వాతావరణం.... మరోవైపు విజృంభిస్తున్న కరోనా. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రకృతి సిద్ధంగా వెలిసే అమరనాథ్ శివలింగం దర్శనం కోసం యాత్రికులు పెద్దసంఖ్యలోనే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కరోనా కారణంగా వైష్టోదేవి, చార్ దామ్ యాత్రలను ఇప్పటికే రద్దు చేశారు. అయితే ఏడాదిలో 15రోజులు మాత్రమే ఉండే అమరనాథుని దివ్య, అద్భుత, మహిమాన్విత రూపాన్ని చూడడానికి అనుమతి ఇవ్వాలన్న భక్తుల కోరిక మేరకు ఈనెల 21 నుంచి ఆగస్టు 3 వరకు భక్తులను అనుమతిస్తారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ నేడు విచారణ రానుంది.  గత ఏడాది 3,42,883 మంది భక్తులు  గత ఏడాది జమ్ము సరిహద్దుల్లో నెలకొన్న భద్రతా సమస్యలు,  ఉగ్రవాద ముప్పు ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం తగ్గలేదు. 3,42,883మంది భక్తులు కట్టుదిట్టమైన భద్రతావలయంలో అమరనాథుడిని దర్శించుకున్నారు.  ఈ ఏడాది లక్షకు పైగానే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది 1.5లక్షల మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక, నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ సారి 30 వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. అమర్ నాథ్ యాత్ర పై  తీసుకోవల్సిన జాగ్రత్తలపై కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జి కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ పరిపాలనాధికారులు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, స్థానిక సైనికాధికారులతో సమావేశం నిర్వహించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రస్తుత పరిస్థితిలో రైలు లేకపోవడంతో యాత్ర కోసం నమోదు చేసుకున్న రిజర్వేషన్లు చేసుకున్న చాలామంది తమ యాత్రను రద్దు చేసుకున్నారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా పరిమితమైన సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించాలని  కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. శ్రీ అమర్‌నాథ్ బర్ఫానీ లంగర్ ఆర్గనైజేషన్ దాఖలు చేసిన పిటిషన్ లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ప్రత్యేక దర్శనాన్ని ప్రసారం చేయాలని కోరారు.