రాజమండ్రి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక జర్నలిస్ట్ మృతి
posted on Jul 23, 2020 @ 7:31PM
ఆక్సిజన్ కొరతతో గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు
కరోనా బారిన పడిన ప్రజలకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. సరైన వైద్యం అందడం లేదంటూ ఆసుపత్రి నుంచి మరీ రిపోర్టింగ్ చేసి చెప్పిన జర్నలిస్ట్ మనోజ్ సంఘటన మరవకముందే మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మరో సీనియర్ జర్నలిస్ట్ రాము ఆక్సిజన్ అందక మరణించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో టీవీ5 విలేకరిగా పదేళ్ల నుంచి పనిచేస్తున్న రాము(52) వారం రోజులుగా కరోనా బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో ఆక్సిజన్ పెట్టాలని పదే పదే స్థానిక జర్నలిస్టులు డాక్టర్లను కోరినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చేరిన రోగులకు సరిపోయే ఆక్సిజిన్ అందించే పరిస్థితులు లేవని చెప్పారు. ఆసుపత్రిలో అవసరమైన దానిలో 10శాతం కూడా సరఫరా చేయలేకపోయారు. దాంతో ఊపిరి అందక విలవిల్లాడుతూ రాము తుదిశ్వాస విడిచాడు.
ఈ ఆసుపత్రిలో ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పదేపదే అధికారుల దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టు కూడా ఆక్సిజన్ అందక మరణించడంతో స్థానిక జర్నలిస్టుల్లో విషాదం అలుముకుంది. ఇప్పటికైనా ఆక్సిజన్ అందుబాటులో ఉంచకపోతే కరోనా రోగులు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తక్షణం స్పందించాలని కోరుతున్నారు.